ట్యాగులు

,

kanoori 12

ప్రత్యామ్నాయ రాజకీయాలు మనసుకు నచ్చుతున్న కాలం అది. విశాఖలో పద్మ ఇల్లు వాటికి అడ్డాగా ఉండేది. “శ్రీకాకుళం లోన – చిందిన రక్తము/ కాల్వలై ప్రవహించే – కొండ వాగులలోన/ బండలెరుపెక్కినాయి – పోరాడ కొండలే కదిలినాయి.” అరుణ గొంతు ఖంగుమని మోగుతుండేది ఆ ఇంట్లో. నేను వీర కళాభిమానినే కానీ కళాకారిణిని కాదు. పాటలు పాడే వాళ్ళమీద వెర్రి ఆరాధనతో ఉండేదాన్ని. పిల్లలకు పాటలు, డాన్సులు నేర్పటానికి కానూరి వెంకటేశ్వరరావు తాత వచ్చి ఉన్నాడు. పాటలు నేర్పిస్తున్న కానూరి తాతకి ఒక చేతి సంచి మాత్రమే ఉండేది. దాంతోనే ఆయన రాష్ట్రమంతా తిరుగుతాడని చెప్పారు. సాయకాలం నాలుగు నుండి ప్రాక్టీసు. పగలంతా ఖాళీ. మూడు వరుస గదులు ఉన్న ఇంట్లో వరండాలో వుండేవాడు. మిట్ట మధ్యాహ్నం ఎండకు ఒక దుప్పటి కప్పేవాడు. ఎండకు అనుగుణంగా దుప్పటి దశను కటకటాల మీద మార్చుకొంటూ వుండేవాడు కానీ ఎంత మంది పిలిచినా లోపలకి మాత్రం పోయే వాడు కాదు. సూర్యుడి కిరణాలు ఏటవాలుగా ముఖానికి గుచ్చుకొంటున్న ఆ మధ్యాహ్నాలు నా జీవితంలో అతి ముఖ్యమైనవి. మనసా వాచా ఒక విప్లవ కళాకారుడిగా వందేళ్ళు బ్రతికిన మనిషి అంతరంగంతో ములాఖాతు చేసిన మధ్యాన్నాలు అవి.

అది పద్మ వాళ్ళ ఇల్లు కావచ్చు, వరంగల్ జిల్లాలోని పల్లెలో ఒక చెట్టుకింద కావచ్చు, గుంటూరు చుట్టుగుంట సెంటర్ లోని మురికిపేటలో కావచ్చు, ప్రజాపంధా ఆఫీసు కావచ్చు, ప్రకాశం జిల్లా మద్దులూరు కావచ్చు, హైదరాబాదు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు … ఎక్కడ, ఎప్పుడు, ఎంత సేపు మాట్లాడానో గుర్తు లేదు కానీ ఆయన జీవితంలోని పార్శాలు నాకు సుపరిచితం అయ్యాయి. గత సంవత్సరం పీవోడబ్ల్యూ మహాసభల్లో ఆయన వందేళ్ళ పుట్టిన రోజును జరిపారు. వయసుతో బాటు ముడుచుకొని పోయిన ముఖంలో భావప్రకటన కష్టమైపోయి, వృద్దాప్యపు ఇక్కట్ల పూర్తి స్థాయిలో అనుభవిస్తున్న ముసలి ముంపున కూడా నన్ను గుర్తు పట్టి వెంటనే అడిగిన ప్రశ్న “ఎన్వీయస్ ఎలా ఉన్నాడు?” అని. ఎన్వీయస్ కళాకారుడు కాబట్టే ఆ శ్రద్ధ.

ఎనిమిది దశాబ్ధాల రాజకీయ జీవితం. రాష్ట్రాన్నిచైతన్యవంతం చేసిన నాలుగు ఉద్యమాలలో ప్రవేశం. రాజకీయం, కళలు వేరు కాదనే దృక్పధం. “సాంఘీక ఆర్ధిక, రాజకీయాలు సమ్మిళితం చేసి ఆచరించే భౌతిక సమాజ రూపమే సంస్కృతీ”. సంస్కృతికి ఆయన ఇచ్చిన నిర్వచనం .. ఇవన్నీ ఆయన ఏ చెట్టుకు కాసిన కాయో విదితం చేస్తాయి. కళారంగానికి వర్గ దృక్పధాన్ని మేళవించిన మొదటి తరంలోని మనిషి ఆయన. ప్రజల చరిత్ర లేని ప్రజా కళలలను (జానపద కళలు) దేదీప్యమైన దారిలోకి మళ్లించిన వాడు. ‘విప్లవ కళాకారుల్లో తాతలుండరు. అన్నలు మాత్రమే ఉంటారు.” అనే విమర్శలో ‘వాళ్ళు ఎక్కువ కాలం విప్లవంలో కొనసాగలేరు. అనేక ప్రలోభాలు వాళ్ళను పక్కకు లాగుతాయి’ అనే వాస్తవం దాగి ఉంది. ప్రజానాట్యమండలి నుండి సినిమా రంగానికి సాగిన వలసలు ఈ విమర్శకు మొదటి అడుగు. ఆ కఠిన వాస్తవాన్ని బద్దలు కొట్టి చనిపోయేంత వరుకూ విప్లవ ప్రజాగాయకుడిగా, కవిగా, నృత్య శిక్షకుడిగా కొనసాగిన వ్యక్తి కానూరి. అలాగని కళాకారుడిగా తన పరిధులు ఆయన ఎప్పుడు దాటలేదు. కళారంగం రాజకీయ రంగానికి అనుబంధంగా వుండాలి కానీ అదే రాజకీయాలు నడపకూడదనే మాట చివరిదాకా పాటించాడు. చదివింది నాలుగో తరగతి అయినా తెలుగు పట్ల ఆయన మమకారం ఆయన మాటల్లోనే “తెలుగు భాషకు అన్ని ధ్వనులూ పలకగల అక్షర క్రమం వున్నది. తెలుగు సాహిత్యానికి శబ్ధ సౌందర్యం కలిగించే ఛందో రీతి ఉన్నది. తెలుగు సంగీతానికి సప్త ధ్వనులను కంట్రోల్ చేసే గుణమున్నది.”

ఆయన ఏమి రాసినా అందులో పదునైన రాజకీయ విమర్శ ఉంటుంది. పదాల వాడకం కొద్దిగా మోటుగా కొట్టినట్లు ఉంటుంది. ఆయనను కదిలించిన విషయాలే ఆయన వస్తువులుగా అర్హత సంపాదించుకొంటాయి. ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కాటూరు దురంతం గురించి రాసిన బుర్ర కధ కానీ, స్వతంత్ర భారతంలో బ్యూరోక్రసీని విమర్శిస్తూ రాసిన ‘ప్రగతి బాగోతం’ కానీ, శ్రీకాకుళ సాయుధ ప్రజా ప్రతిఘటన నేపధ్యంలో రాసిన ‘జనగానం’ కానీ ఆయన హృదయాంతరంగంలో బుసలు కొట్టి వెలువడ్డ తూరుపు ముక్కలే. అరుణోదయ రామారావు ఎక్కువగా పాడే కానూరి పాట

“వీరగాధలు పాడరా… విప్లవ ధీర చరితలు పాడరా!

తూర్పు కొండల నడుమా – అరుణ కాంతుల జ్వాల

నగ్జల్ బరీలోన – నవయుగ శివలీల

శ్రీకాకుళం గిరీ – సింహాల జయహేల

తీర గోదావరి గిరిజన శలభాల” వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకొంటాయి.

బాబ్రీ మసీదుని కూల్చాక “రాముడో దేవుడో – నీకేదేమీ ఖర్మరో/ రాజకీయ రొంపులోకి నిన్నే దించారురో” అని ఆయన పెట్టిన గగ్గోలు ఇంకా చెవుల్లో మార్మోగుతూ ఉంది.

విరసంతో ఆయన అనుబంధం కూడా గొప్పదే. శ్రీశ్రీ , కొడవటిగంటి, రావి శాస్త్రి, కెవియార్ లాంటి ఉద్ధండులతో కలిసి పనిచేశాడు. కేంద్ర ప్రజా నాట్యమండలి బాధ్యుడిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, తెలంగాణా బాధ్యుడిగా వున్న రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్ మొదలైన వాళ్ళతో ఆయనకు ఉన్న ఉద్యమ అనుబంధం ఆత్మగతమైనది. జంపాల, రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య ఎన్ కౌంటర్లు ఆయనలో ఎంత సంక్షోభాన్ని రేపాయో, పార్టీ చీలిన ప్రతిసారి అవే తుఫాన్లు. ఒకటిన్నర సంవత్సరం ఆయన గడిపిన బళ్ళారి జైలు జీవితం ఆయన్ను అంత కంటే బాధ పెట్టి ఉండదు.

చేతి సంచితో బయలుదేరి, పార్టీ ఎక్కడకు చెబితే ఆ బస్సు ఎక్కి నెలల తరబడి గ్రామాల్లో అరుణోదయ శిబిరాన్ని నిర్వహిస్తూ యువతీ యువకులతో, పసి పిల్లలతో స్నేహం చేసే బక్క పలచని పెద్ద మనిషైన ఈ సంచార జీవి సొంత జీవితం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం నాకు ఆయన పరిచయం అయిన చాలా సంవత్సరాల తరువాత దొరికింది. ఆయనకీ ఒక ప్రేమ కధ ఉందనీ అది ఆయన సజీవ చలనానికి ఊతమిస్తూ ఉంటుందని ఆమె మరణించిన తరువాతే నాకు తెలిసింది. ఉత్తరాలు తప్ప ఫోన్లు లేని ఆ కాలంలో ఆమె మరణం గురించి పార్టీకి తెలియడానికి నెల రోజులు పట్టింది. ఆమె కోసం ఆయన రాసిన ‘ప్రణయ గీతం’ ప్రజాపంధా’లో అచ్చయింది. ప్రజాపంధాలాంటి పార్టీ అధికార పత్రికలో అచ్చయిన ఆ కవితలో కొంత భాగం.

కమ్యూనిజానికి టీకాటిప్పణి తెలియని

సాధారణ కమ్యూనిష్టు అభిమాని

ఎర్ర జెండాల కోలాహలం

విప్లవ గీతాల బృందగానం

విని వెర్రెత్తి పోయే దరహాస రేఖ

తను నమ్మిన పార్టీ ముక్కలు చెక్కలై

మహానాయకులు పార్లమెంటరీ భక్తులై

స్వార్ధం తల బరువై స్వాతంత్ర్యం నక్కల పాలై

అమరవీరుల త్యాగాలు అంగడి సరుకై

ఓల్డు కమ్యూనిష్టు లీడర్లు

నయా కాపిటలిష్టు దళారులై

సోషలిజం అందని మ్రాని పండై

కల చెదిరి కలత చెంది

ఉస్సురని నిట్టూర్చిన హ్యూమనిష్టు

నాటి తెలంగాణా సమర సింహాల చెల్లమ్మ

నేటి నగ్జల్ బరీ నరసింహాల అమ్మమ్మ

అర్ధ శతాభ్ధి సాంసారిక జీవితంలో లేదు విశ్రాంతి

అలసి సొలసి ప్రకృతి ఒడిలో శాశ్వత శాంతి

ఆశించి వెళ్ళావా! దమయంతి!

అని శోకించాడు. ఇది ప్రణయ గీతమా? కమ్యూనిష్టు ఆలాపనా? అయినా సంసార బంధనాలు లేని ఋషి అనుకొంటున్న ఈ మహానుభావుడికి ఈ బాధ ఏమిటి? ఆ దుఃఖం ఇంకో చోట…

ప్రేమించి మనం పెళ్ళి చేసుకోలేదు

ప్రేమోపాసన ఎట్లుంటుందో తెలీదు

అమర ప్రేమకు అర్ధాలే తెలియవు

ప్రపంచంలో ప్రేమ జంటలు, ఆదర్శ దంపతులు అసంఖ్యాకులు

అనగా వినడమే గాని ఆ గొడవలు అట్టే తెలియవు

అంతో ఇంతో అనురాగ సుధలు సేవించి సేద తీరిన సామాన్య ప్రేమికులం మనం.

ఈ కవిత నన్ను నిలబడనీయలేదు. ప్రేమించి తప్ప పెళ్ళి చేసుకోగూడదని పంతం పట్టిన వయసు అప్పటిది. ఇలాంటి దాంపత్యంలో ఉన్న పరమార్ధం కోసం అన్వేషిస్తూ మళ్ళీ కవిత చదవటం కొనసాగించాను. ఈ సారి దమయంతి వైపు నుండి గొంతుక ఆయనే ఇచ్చాడు.

అయినా నాకు తెలియక అడుగుతాను

నేనూ బుర్రున్న మనిషినే

నాకు రవ్వంత లోకజ్ఞానం ఎక్కించాలని నీకుంటేనా?

నీ కవిత్వాలు కాకరగాయలు లోకులకేనా?

అక్కడికి నీవో దేశభక్తునివి నేనో దెబ్బమ్మనా?

పెళ్ళాన్కి హోమ్ మినిష్టర్ హోదా యిచ్చేసి

కాళ్ళు కదిలే వీలు లేకుండా వంటింట్లో కుదేసి

జయ పరమేశా అని సంచి భుజాన తగిలించి

చెక్కేస్తాడయ్యా చైతన్య కళాకారుడు!

సాల్సాలు సంబడం!

ఏక్ బజా అయ్యింది

నీ బస్సుకు టయిమ్ అయింది

లేలేమ్మని వంటింట్లోకి నడిపించి

లేత వంకాయ శాకం కొసరి కొసరి తినిపించి

సంచి సాగరం నింపి

టిక్కెట్లు బద్రం

దిగే కాడ పదిలం

నీకసలే మతిమరుపు

ఒక కార్డు ముక్కన్నా రాసి పంపు

మల్లెప్పుడు రాకడ..?

తడి అయిన కళ్ళతో ఆయన కోసం చూశాను. సర్వం పోగొట్టుకొన్నట్లు బేజారు పడ్డ ముఖంతో తల వేలాడేసుకొని కూర్చొని వున్నాడు ఒక మూల. ఈయన ఇక బ్రతుకగలడా అనిపించింది ఆ క్షణాన. కానీ నిజంగా బ్రతికి చూపించాడు తరువాత 30 సంవత్సరాలు., పార్టీ ఆఫీసుల్లో, ప్రజల మధ్యన. చివరకు పార్టీ ఆఫీసులోనే మరణించాడు. “మా కాలంలో ….” లాంటి అసంతృప్త, నిష్టూరపు వాక్యాలు ఎప్పుడూ ఆయన నోటి నుండి వచ్చేవి కావు. హృదయంలో కళాతపన కూసింత ఉంటే చాలు ఏ వయసు వారితోనైనా ఆయనకు సావాసమే. తరాలు అంటని స్నేహాలు చేసేవాడు. వంటి సుఖం గురించి ఎప్పుడూ కంప్లైంట్ ఉండదు. మజ్జిగన్నం ఉంటే చాలు. వ్యక్తిగత విషయాల ప్రస్తావన ఉండదు. స్థితప్రజ్ఞ విప్లవకారుడు ఆయన.

ఒంగోల్లో ఆయన బహిరంగ కార్యక్రమం ఉందంటే జనం ఎగబడతారు. ఆయన అభిమానులు అన్ని పార్టీలలో, రాష్ట్రమంతా ఉంటారు. తొంబ్బై ఏళ్ల వయసులోకూడా స్టేజ్ మీద “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! కొయ్యరా కోతలు మొనగాడా!” పాటకు నృత్యం చేసినవాడు. ఆయన అభిమానులు పట్టుపట్టి ఎనభై అయిదేళ్ళ వయసులో ఆయన కళారంగ అనుభవాలు రికార్డ్ చేసి ‘కధ కాని కధ’ పేరుతో పుస్తకం తీసుకొని వచ్చారు. జంపాల ప్రసాదు టైమ్ లో ఉస్మానియా విద్యార్ధునులు కె. లలిత, గీతల నుండి … అరుణోదయ విమల, వంగపల్లి పద్మ, సృజన, మాలక్ష్మి, సరళ, సుధ, అరుణ, విశాఖ పద్మ వరకూ ఆయన శిష్యగణంలో ఉన్నవారే. ఆడపిల్లల పట్ల ఆయన శ్రద్ధ వేరుగా ఉండేది. మహిళా ఉద్యమంలో పనిచేసున్న మా పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు.

సతీశ్ చందర్ అంటారు “ఉద్యమం అంటే ప్రతిసారి మూడు తుపాకులూ, ఆరు మందు పాతరలే కానక్కరలేదు. ఒక డప్పూ రెండు చిటికెన పుల్లలూ కలిసినా ఉద్యమం అవుతుంది” అని. అవును. రెండు చిరతలు, చిన్న డోలు, కాళ్ళకు గజ్జెలు కూడా ఉద్యమం అవుతాయి. బుర్రకధలు, హరికధలు, ఒగ్గు కధలు, జనగానాలు, గొంగళి ప్రదర్శనలు కూడా ఉద్యమాలు అవుతాయి. వీటన్నిటిని ఔపాసన పట్టి ప్రజల్లోకి దూకిన కానూరి ఉద్యమ రధసారధి అవుతాడు. 15 ఏళ్ల వయసులో యాంత్రికంగా కళారంగానికి వచ్చి గొప్ప సాంస్కృతిక ఉద్యమానికి నిట్టాడిగా నిలబడ్డ కానూరి గారిని కేవలం కళాకారుడు అంటే సరిపోతుందా? శాస్త్రీయ సంగీతంలో తామే రచించి, స్వరకల్పన చేసి పాటలు పడే వారిని వాగ్గేయకారుడని అంటారు. తనకు తెలిసిన అనేక కళా రూపాల్లో ఒకదాన్ని ఎంచుకొని, దానికి రచన చేసి, బాణీ కట్టి, దానికి నృత్య రీతిని సమకూర్చి, గజ్జె కట్టి ఆడి, పాడి, తన చుట్టూవున్న వాళ్ళకు నేర్పించిన వారిని ఏమని పిలవాలో కానూరి తాతను అలాగే పిలవాలి. ఆయన పనిచేసి, నాయకత్వ బాధ్యతలు ఇచ్చిన సాంస్కృతిక, సాహితీ సంస్థలు ప్రజానాట్యమండలి కానీ, అరుణోదయ సాహితీ సమాఖ్య కానీ, విరసం కానీ, ప్రజాస్వామిక రచయితల సంఘం కానీ ఆయన రచనలపై పూర్తి భరోసాతో ఉండేవి. ఎందుకంటే ఆయనది ప్రజల పంధా. అంగుళం కూడా దానిని అతిక్రమించడనే నమ్మకం. పేదప్రజలకు, వారి ప్రతినిధి అయిన విప్లవ పార్టీకి మాత్రమే నిబద్ధుడైనాడు కడ దాకా. ఆయన వందేళ్ళ పరిపూర్ణ విప్లవ జీవితం ప్రజలకే అంకితం.

ఈ మరణం అనివార్యం అని తెలుసు. ఆయన మరణించక ముందుకీ, ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటి? ఖమ్మం సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమాక్రసీ ఆఫీసులో కానూరి తాతను ఎప్పుడైనా చూడచ్చు అనే ఆశ ఇక ఇప్పుడు లేదు. నాలుగు తరాల కమ్యూనిష్టు మనస్తత్వాలను అవగతం చేసుకొని ఎప్పుడూ వర్ధమానంలో బ్రతికిన సాహిత్య, సాంస్కృతిక, సాయుధ వీరుడు భౌతికంగా అదృశ్యమై ఫోటోలోనూ, ఆయన పుస్తకాలలోనూ, ఆయన ఆదర్శాలలోనూ కనిపిస్తాడిక.

రెండు చొక్కాలు, కాళ్ళ గజ్జలు, ఒక చేతి సంచితో ఆయన నిరాడంబర విప్లవ జీవితం తప్పక ఎక్కడో, ఎప్పుడో ఒక గుప్పెడు మందికి దారి దీపం అవుతుంది. కళ్ల నీళ్ళు తుడుచుకొని, నిండు మనసుతో ఆయనకు ప్రణమిల్లడం తప్ప చేయగలిగినది ఏముంది? మహిళా ఉద్యమం ‘కల్చరల్ కలరా’ను పారదోలుతుందన్న ఆయన నమ్మకాన్ని మోసుకొని పోవడం తప్ప.

ఈ వ్యాసం సారంగ లో ఇక్కడ