ట్యాగులు

,

DSC_8245 రాజమండ్రిలో జరిగిన మాతృక పరిచయ సభలో సతీష్ చందర్ గారి ప్రసంగ పాఠం 

నన్ను ఎంతమంది ఎన్ని రకాల సభలకు పిలుస్తున్నా పీవోడబ్ల్యూవారు పిలవడం ఒక గౌరవంగా, అర్హతగా భావిస్తాను. ఎందుకంటే పురుషాధిక్యత ఎంతో కొంత వదిలించుకొంటున్న వారిలో నన్ను ఒకరిగా వాళ్ళు చూడటమే నన్నీ సభకు పిలవటానికి గీటురాయిగా వారు తీసుకొంటారని నాకు తెలుసు.

వివేకవర్ధనీ లాంటి పత్రికలు పుట్టిన ఇదే రాజమండ్రిలో 25 సంవత్సరాల క్రితం ‘మాతృక’ పుట్టింది. 1830 నుండి ఇప్పటివరకు, గడిచిన రెండు శతాబ్ధాల కాలంలో ప్రధానస్రవంతి పత్రికల్లో మహిళలు ప్రధాన సంపాదకులు కాలేకపోయారు. గ్రామీణ పత్రికా వ్యవస్థలో స్త్రీలు అరుదుగా ఉంటారు. పట్టణాలలో కొద్దిగా కొద్దిగా కనిపిస్తున్నారు. రిజర్వేషన్స్ లేని రంగాల్లో స్త్రీల పరిస్థితికి ఇది తార్కాణం. స్త్రీలకు స్థానం లేని మాధ్యమం మరి ఎవరిది? ఇది అగ్రవర్ణాల, అగ్ర వర్గాల పురుషుల మాధ్యమం. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.

నేడు స్త్రీల పేజీ లేని దిన పత్రిక లేదు. అందులో కొంత మంది డబ్బున్న స్త్రీల వ్యక్తిగత విజయాలు ఉంటాయి. ఇంకా “ప్రశ్నలు – జవాబులు” లాంటి కొన్ని శీర్షికలు కూడా ఉంటాయి. ఆ శీర్షికలో ఒక సోదరి రాస్తుంది ‘నా కళ్ళ క్రింద నీడలు ఉన్నాయి. అద్దంలో వాటిని చూసుకొంటుంటే నాకు ఆత్మ హత్య చేసుకోవాలనిపిస్తుంది’ అని. దానికి జవాబు ఇలా మొదలవుతుంది “మీ బాధ సహజమే” అని. ఏది సహజం? పొద్దంతా పని చేసి వచ్చి రాత్రి భర్త తాగి వచ్చి అలసట వచ్చేదాకా గుడిసె చుట్టూ తిప్పి కొడితే నిద్ర లేక రాత్రంతా గడిపి పొద్దున్నే పనికి వెళ్ళే కూలి తల్లులు మన దేశంలో లక్షలాది మంది. వారి బాధ ముందు కళ్ళ కింద నీడలు రావటం పెద్ద బాధ! దానికి, ఫలానా ముల్తాన మిట్టి నూరి ముఖం మీద పెట్టుకొని ఎండలో కాసేపు, నీడలో కాసేపు, వెన్నెల్లో కాసేపు కూర్చోమని పరిష్కారం చెబుతారు. నిజానికి మధ్య తరగతి మహిళలకు కూడా వేరే సీరియస్ సమస్యలు ఉంటాయి. వాటి గురించి ఎవరూ రాయరు. సమాజంలో వేరే వర్గం కూడా ఉంది, ఆ వర్గం స్త్రీల బాధలను ప్రపంచానికి తెలియచేయటానికే మాతృక లాంటి పత్రికల అవసరం ఉంది.

‘స్త్రీలకు మనం ఏమీ చేయలేక పోయినా వారిని అగౌరవపరచకూడదూ’ అనే కనీస తెలివిడిని పార్లమెంటేరియన్లకు కూడా ఇవ్వలేని స్థితిలో మన ప్రచార మాధ్యమాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలే దానికి ఉదాహరణ. పార్టీలు ఏమయితేనేమి ఎవరి మీద కోపం వచ్చినా స్త్రీలనే అవమానిస్తారు. అయితే ఆ అవమానానికి ఆ స్త్రీ మూర్తికి కోపం రావటం సహజమే కానీ ఆ కోపాన్ని ఆ పురుషుడి మీదనో, పురుషాధిక్యత మీదనో చూపించాలి. కానీ ఆమె ఆ కోపాన్నిమళ్ళీ ఇంకో స్త్రీ మీద చూపించింది. స్త్రీలు కూడా పురుషాధిక్యత భావజాలాన్ని మోస్తారనటానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపిల్. ‘నిజమే నేను బానిసనే, భరించాలి’ అనే భావన అన్ని తరగతుల మహిళల్లో కనిపిస్తుంది.

సైమన్ లెబోవా అనే రచయిత్రి ‘సెకండ్ సెక్స్’ అనే పుస్తకం రాశారు. అందులో ఆమె ‘స్త్రీలు పురుషులుగా పుడతారు. స్త్రీలగా తయారు చేయబడతారు.’ అంటారు. ఈ విషయాన్నే నేను ఇంకో విధంగా చెబుతాను. వెనకటికి ఒకాయన వాళ్ళావిడను ఎర్ర బస్సులో తీసుకొస్తున్నాడు. కండక్టర్ తో ‘ఒకటి ఫుల్లు, ఒకటి అర’ అన్నాడు. ‘కండక్టర్ అర టికెట్ ఎవరరికి?’ అని అడిగాడు. ‘మా ఆవిడకు’ అని సమాధానం చెప్పాడు. ‘అదేంటి మీ ఆవిడకు ఫుల్లు కదా’ అని అడిగితే “మా ఆవిడకు కూలీ సగమే కదా ఇచ్చేదీ. మరి టిక్కెట్ కూడా సగమే ఉండాలి.” అని వాదించాడట. సమాజమే స్త్రీని అర టిక్కెట్ గా మార్చింది. అర టికెట్ ఫుల్ టిక్కెట్ గా చేయటానికే ఈ ఉద్యమాలు అన్నీ.

దేశంలో రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. నిర్భయకు ఏమి జరిగిందో మీకు తెలుసు. దీనికి భారత దేశమంతా స్పందించింది. నిజంగా స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాల పట్ల ఎంత చైతన్యం వచ్చింది అనుకొంటాము. కానీ ఈ దేశంలో ప్రతి రెండు రోజులకు ఒక దళిత మహిళ అత్యాచారానికి గురి అవుతుంది. గ్రామాల్లో భూస్వాములు ఆమెను సొంత ఆస్తిగా భావించి అత్యాచారాలు చేస్తుంటారు. కానీ ఎవరికీ కోపం రాదు. నిర్భయ విషయంలో మాత్రమే ఎందుకు కోపం వచ్చింది? దళిత మహిళల విషయంలో ఎందుకు కోపం రాదు? ఈ వివరణను ప్రధాన స్రవంతి మీడియా చెప్పదు. మాతృక లాంటి పత్రికలే చెప్పాలి. శ్రామిక వర్గ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ఎందుకు ఈ సమాజం స్పందించదు?

నిర్భయ విషయంలో ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఐటి విద్యార్ధి యిలా భయపడతాడు., “నేనూ, నా భార్య లేక గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళితే …?” అనే ప్రశ్న వేసుకొంటాడు. అందుకే స్పందించాడు. ఆ ప్రమాదం తన వరకు వస్తే తప్ప స్పందించని మధ్య తరగతి భావజాలం ఇది. తన వరకూ కాదు సమాజం అంతా అదే జరుగుతున్నప్పుడూ, సొంత యిళ్లలోనే వరసకాని వాళ్ళు, వరస అయిన వాళ్ళు స్త్రీల మీద, బాలికల మీద వెయ్యరాని చోట్ల చేతులు వేస్తుంటే వారు కుంగిపోతున్నప్పుడూ … ఈ అవమానాలను ఎవడైనా గ్రంధస్థం చేశాడా?ఎందుకు ఈ విషయాల్లో కోపం రావటం లేదూ? ఎందుకు ఉద్యమాలు రావటం లేదు?

నగరాల్లో మార్కెట్ ఎకానమీ వచ్చింది. స్త్రీలు రాత్రులు కూడా పని చేయాలి. ఈ మేరకు అంగీకరించినవాళ్ళు స్త్రీల రాత్రి సంచారానికి అంగీకరించడం లేదు. ఇలాంటి పాక్షిక స్వేచ్ఛ గురించి మాతృక లాంటి పత్రికలు ఆలోచించాలి. స్త్రీలకు సంబంధించి అనేక పేజీలు అనేక రకాలుగా నింపుతున్నారు. కానీ స్త్రీల గురించి ఎప్పుడు రాస్తున్నారు? స్త్రీ చనిపోయినపుడు వార్త అవుతుంది. అత్యాచారానికి గురి అయినపుడు వార్త అవుతుంది. ఆమె మీద మురికి చల్లినపుడు వార్త అవుతుంది. కానీ పురుషుడు అందలమెక్కితే వార్త. పురుషుడు బతికితే వార్త. ఈ వివక్ష పోవాలంటే ఎక్కడ నుండి చైతన్యం పుట్టాలో అక్కడ నుండి రావాలి. చైతన్యం ఉండాల్సిన వాళ్ళలో వివక్ష ఉండకూడదు. భుజం భుజం కలిపి పోరాడాల్సిన శ్రామిక జనాల్లో ఈ వివక్ష ఉండకూడదు.

ఉద్యమాలలో కూడా స్త్రీ పురుష వివక్ష ఉందా అనే ప్రశ్న వరకు ఇప్పుడు మనం వెళ్లాము. ఇక్కడ సరి చేయక పోతే ఇదే చైతన్యం పైకి వచ్చినపుడు పురుషాధిపత్యం కూడా పైకి పాకుతుంది. స్త్రీ పురుష సమానత్వం ఉద్యమంలో ఉండాలి. విమల వంటిల్లు అనే కవిత రాశారు. “ఈ వంటింటి సామ్రాజ్యానికి అమ్మే మహారాణి. కానీ వంట పాత్రల అన్నిటి మీదా నా పేరే.” నిత్యం స్త్రీలు సమానత్వం కోసం యుద్ధం చేయాలి. స్త్రీ పురుష సమానత్వం కోరే పురుషుడు తన మీద తానే యుద్ధం చేసుకోవాలి. “నా అభిప్రాయాలు ఆమె మీద రుద్దుతున్నానా” అని నిత్యం మథనపడాలి. చాలా మంది కూతురికి హక్కులు యిస్తారు. సహచరికి మాత్రం ఇవ్వరు.

‘ఉద్యమం లోపల ఉద్యమంగా’ మాతృక పని చేయాలి. ‘కార్యకర్త లోపల కార్యకర్త’ పాత్రను మాతృక పోషించాలి. నేను నా మీద నేను అనేక సార్లు యుద్ధం చేసుకొంటాను. అయినా నేను పూర్తి స్థాయి ఫెమినిష్టునని చెప్పుకోలేను. నా మీద కూడా పితృస్వామిక భావజాలం ఎక్కడో పని చేస్తూనే ఉంటుంది. స్త్రీల గురించి మాట్లాడేటపుడు ‘ది’ అని మాట్లాడటం అలవాటు. అది, యిది అని … పురుషుడి విషయంలో ఆయన, సారు అంటారు. కానీ స్త్రీ విషయంలో ఆమె ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా సరే, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నుండి స్కూల్ టీచర్ వరకూ “ది” అనే అంటారు. పరోక్షంగా కూడా స్త్రీని గౌరవించే స్థితి వస్తుందా అని ఆలోచించేవాడిని. అలాగే కొంత ప్రాక్టీస్ చేశాను. సినిమా యాక్టర్ వాణిశ్రీగారు అనే వాడిని. తెలుగు మర్చిపోతున్నావు అనే వాళ్ళు నన్ను. కానీ ఇప్పుడు టీవీ షోలలో రాజకీయ నాయకులు “నేను ఏమన్నా గాజులు తొడిగించుకొన్నానా?”అంటుంటారు. ఇలా అనటం స్త్రీలను అవమానించటం అనే తెలివిడిని ఈ శాసన సభ్యులకూ, పార్లమెంటేరియన్లకు ఎవరు కలుగచేస్తారు? స్త్రీల ఓట్లతో గెలిచి స్త్రీలను అవమానపరుస్తారు. వీళ్ళే మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉండేవాళ్లు, మనం ప్రేమించే వాళ్ళు, మనతో ఉద్యమాలు చేసేవాళ్ళ నుండి ఈ భావజాలాన్ని కట్ చేయాలి. కార్మికుల్లో అన్ని కులాల వాళ్ళు ఏకమౌతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కనీసం స్త్రీ పురుష కార్మికులన్నా ఏకం కావటానికి ఈ విషయం అడ్డు కాకూడదు. ఈ రకమైన డైనమిజాన్ని ‘మాతృక’ తీసుకొని రావాలి.

స్త్రీల త్యాగాలు, పురుషుల త్యాగాలు సమానంగా రికార్డ్ కావు. ‘స్త్రీలు త్యాగం చేయటం సహజమే’ అంటుంటారు. మాతృక మొదట ప్రారంభించినపుడు మార్క్సిష్టు లెనినిష్టు ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసినటువంటి స్త్రీల కధనాలు వీలునామా పేరుతో వచ్చేవి. అన్ని రకాలా ఉద్యమాలలో స్త్రీల పాత్రను మగ కామ్రేడ్స్ కు చెప్పటానికి మాతృక కావాలి. స్త్రీ పురుష సయోధ్య సాధించటానికి ఒక కరదీపికలాగా మాతృక ఉండాలి.

‘మాతృక’ పునరాగమనం సరైన సమయంలో జరుగుతుంది. మత రాజ్యం కావాలని కోరుకొనే వాళ్ళు గద్దెనెక్కారు. ఇప్పుడు తాళికి సంబంధించిన చర్చ నడుస్తోంది. అందరూ గుండెలు బాదేసుకొంటున్నారు. 15, 20 మంది ద్రావిడ స్త్రీలు బహిరంగంగా తాళిని తీసేశారు. తాళి మీద హక్కు ఎవరికి ఉంటుంది? “తాగుడికి డబ్బు లేకపోతే నేను తాళి పీక వచ్చు. నువ్వు పీకటం ఏమిటి?” అంటున్నారు మగవాళ్ళు.(నవ్వు) ఇవన్నీ కొత్త ఉద్యమాలు ఏమీ కావు. పూర్వం తాపీ ధర్మారావు చెప్పాడు.(పెళ్లి, పుట్టు పూర్వోత్తరాలు) గాజులు వేసింది పురుషుడే. అవి గాజులు కావు. బేడీలు. ఆమె తనతో కాకుండా యింకెవరితో ఉండకూడదని లాక్ చేసి వెళ్ళిన బేడీలు అవి. కాలక్రమేణా అవి ఆభరణాలు అయ్యాయి. అందులో మళ్ళీ మంగళసూత్రం సిసి కెమెరా అట. అది కట్టిన పురుషుడికి తప్ప ఎవరికీ కనపడదట. మరి చైన్ స్కాచర్ కు బాగానే కనబడుతుందే!

ఒక పక్క సాంప్రదాయంతోనూ, ఇంకో పక్క మార్కెట్టుతోనూ స్త్రీని హింసించటానికి ఎజెండా సిద్దమయ్యింది. దానికి సంబంధించిన పరిపాలన కూడా సాగుతోంది. కేంద్రమంత్రి స్మృతీ యిరానీ బట్టలు మార్చుకొంటూ సిసి కెమెరాలో బంధించబడింది. నీ కేబినెట్ సహచరికి కూడా రక్షణ లేని స్థితి ని మార్కెట్ సంస్కృతి తీసుకొని వచ్చింది. ఆ మార్కెట్ కు నువ్వు తొత్తు అవుతున్నావు. స్త్రీని మార్కెట్ నుండి, సాంప్రదాయం నుండి, కులం నుండి విముక్తం చేయాలి. ఇంకా చాలా చాలా కారణాలు వెతికి పట్టుకొని వాటి నుండి విముక్తం చేయాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు మళ్ళీ వస్తున్నాయి. తాళికి పేటెంట్ హక్కు మనకు ఉన్నట్లే సతీ సహగమనానికి కూడా పేటెంట్ హక్కు మనకే ఉంది. కులం క్రింది వర్గాల స్త్రీలను మాత్రమే హింసిస్తుందని అనుకోవద్దు. ఈ కులానికి హృదయం లేదు. వేదపండితుడ్ని కూడా తన భార్యను శిక్షించమని శాసిస్తుంది ఈ కులం. కుల వ్యవస్థ స్త్రీని నిరక్ష్యరాస్యురాలిని చేసింది. దీనికి వ్యతిరేకంగా రాజారామ్మోహన్, వీరేశలింగం యుద్ధం చేశారు. వీరేశలింగానికి దండలు వేసేవాళ్ళూ స్త్రీని ఏ మేరకు గౌరవిస్తున్నారో ఆలోచించుకోవాలి. ఇప్పుడు సతీసహగమనం వరకట్నంలాగా తిరిగి వచ్చింది. శ్మశానం వంటగది అయ్యింది. చితి గ్యాస్ స్టవ్ అయ్యింది. నీకు ఒక కొడుకు, ఒక కూతురు ఉంటే ఒక సారి నవ్వుతావు. ఒక సారి ఏడుస్తావు. ఇద్దరూ కూతుళ్ళయితే రెండు సార్లు ఏడుస్తావు. అంత దుర్మార్గ స్థితి యిప్పుడు ఉంది.

ఇన్ని యుద్ధాలు చేయాల్సిన చోట ఒక చిన్న ఆయుధం ఎత్తినా ఆమె వీరనారి అవుతుంది. అలాంటి ఒక ఆయుధమే ‘మాతృక’. మాతృక మీ చేతిలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆయుధంగా భావించుకోవచ్చు. అందరూ చేతులు ముడుచుకొని ఉన్నప్పుడు నేనీ అస్త్రాన్ని ఎత్తాను అనే గర్వంతో ఉండాలి. సతీ సహగమనం తరువాత కన్యాశుల్కం వచ్చింది. కన్యాశుల్కం తరువాత బాల్య వివాహాలు వచ్చాయి. బాల్య వివాహాలు పోయాక వరకట్నం వచ్చింది. వరకట్నం పోక ముందే ప్రేమోన్మాదం వచ్చింది. ఇది ఇంకో భయంకరమైన దురాచారం. స్త్రీలు బహుముఖీన యుద్ధం ఇప్పుడు చేయాలి. స్త్రీ పురుషుల మధ్య ఐక్యత లేకుండా చేయటానికి కులం, మతం, వర్గం అన్నీ ఉన్నాయి. ఒక్క ఉద్యమం మాత్రమే స్త్రీ పురుషులను ఒక దగ్గర కూర్చో పెట్టగలదు. ఆ ఉద్యమానికి స్త్రీ పురుషులు సమానమే అని చెప్పటానికే ఈ మాతృక మళ్ళీ వస్తుంది. అందుకే ఈ పత్రికను చాలా అపురూపంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

“పదేశీ, పదిహేనేసి లక్షల కాపీలు వేసినా చైతన్యం రావటం లేదు, వీళ్ళు వేసే వెయ్యేసి కాపీలకు చైతన్యం వచ్చేస్తదా” అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అగ్గిపుల్ల యింతే ఉంటుంది. పెద్ద అడివిని అంటిస్తుంది. అంత పెద్ద అడివి తడిచి ఉంటే .. పది, పదిహేను లక్షల సర్క్యులేషన్ అయినా తడిచి ఉన్న వనాలను ఏమి చేయలేవు. కిరోసిన్, పెట్రోల్ పోసినా మంటరాదు. స్వంతంత్ర అభిప్రాయాలు లేనీ, ప్రజల పట్ల బాధ్యత లేనీ, ప్రజా చైతన్యం లేనీ కేవలం వాపుతో వున్న సర్క్యులేషన్ ఎందుకూ పనికి రాదు. వివేకవర్ధనీ పత్రిక సర్క్యులేషన్ ఆనాడు చాలా తక్కువ. కొన్ని వందలు మాత్రమే. దానితోనే ఆయన వితంతు వివాహాలు చేశారు.

మాతృక మరోమారు వళ్ళు విరుచుకొని వస్తున్న సందర్భంలో శుభాకాంక్షలు చెబుతున్నాను. నన్ను కూడా మాతృకలో భాగస్వామిని చేయమని చెబుతున్నాను. నన్ను పిలవక పోతే నాకు భయం వేస్తుంటుంది. పురుషాధిపత్యాన్ని పెంచుకొన్నానేమో, అది పసి కట్టి నన్ను పిలవటం లేదేమో అని. మీరు నన్ను పిలిస్తే మళ్ళీ నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నామీద నేను యుద్ధం ఆపలేదని అని అనిపిస్తుంది. ప్రతి పురుషుడికి ఈ భావన కలిగిన రోజున మాతృక సక్సెస్ అయినట్లే.

స్త్రీ స్వేచ్ఛ పురుషుడికి కూడా అవసరమే. చాలా మంది ఆడవాళ్ళకు స్వేచ్ఛ యిస్తే మగాడికి పోతుందని అనుకొంటారు. సగటు పురుషుడు తన నీడను భార్యగా కోరుకొంటున్నాడు. తను ఎలా చెబితే అలా చేయాలని అనుకొంటాడు. సహచరి అంటే నీతో విభేధించాలి. సంఘర్షించాలి. నీతో కొన్ని యిష్టపడాలి. ఒక వ్యక్తిత్వం ఉన్న స్త్రీని పురుషుడు ఇష్టపడాలి. ఈ విషయాలన్నీ స్త్రీవాద, మహిళా ఉద్యమాలు చాటి చెప్పాలి. సెలవు.