ట్యాగులు

,

11196482_10153042554854193_1389479274_o కొత్త విషయమేమి కాదు. పెట్టుబడి నిత్యం వేల కళ్ళతో నేల నలుదిశలా కాపు కాస్తూ ఉంటుంది. దాని దినదిన ప్రవృద్ధికి ఏమి చేయాలో అనే నిరంతర అన్వేషణలో ఉంటుంది. పెట్టుబడికి ఉన్నత దశ అయిన సామ్రాజ్యవాదం ఇప్పుడు రాక్షస రూపం దాల్చి అనువుగా ఉన్న ప్రతిదాన్నీ తన కబంధ హస్తాలతో బంధించి భుజించి తేనుస్తుంది. దానికి తరతమ బేధాలు లేవు. ఏ ఏ అంశాలు తన వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయా అన్న అనే శోచన తప్ప దానికి అంటరానిది ఏమీ ఉండదు. “ఒక దళారి పశ్చాత్తాపం” అనే పుస్తకంలో జాన్ పెర్కిన్స్ ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా రాస్తాడు. పెట్టుబడి క్రూరత్వం ఒక్కో సారి ఉదారవాద రంగు పులుముకొంటుంది. ఇంకో సారి ప్రజాస్వామిక వేషం వేస్తుంది. భారతదేశం లాంటి దేశాల్లో ప్రజల్లో వస్తున్న అసంతృప్తులను, నిరసనలను, పోరాటాలను కూడా ఏ మేరకు తన ప్రయోజనాలకోసం వాడుకోవచ్చో తన నిఘా నేత్రంతో నిత్యం పరిశీలిస్తూ ఉంటుంది. కుల మౌఢ్యానికి, మత దురహకారానికి, పురుషహంకారానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతిఘటనలను కూడా సాదారంగా ఆహ్వానిస్తున్నట్లు నటిస్తుంది. అవసరం అయితే నాయకత్వం కూడా వహిస్తుంది.

వ్యాపార పెట్టుబడి మీడియాలోకి ఏనాడో ప్రవహించింది. ప్రజల నాడీ స్పందనలను రేటింగుల ద్వారా మీడియా పెట్టుబడి గ్రహిస్తుంది. విప్లవ భావజాలం కూడా మార్కెట్ సరుకుగా పనికి వస్తుంది అని గ్రహించి తన పత్రికల్లో, ఛానెళ్ళలో దానికి ప్రవేశం కల్పించిన ఘనత మీడియా పెట్టుబడికి ఉంది. ఆ మధ్య ఒక ఛానల్ విప్లవ గీతాల, నృత్యాల కార్యక్రమాన్ని ప్రసారం చేసి రేటింగులు పెంచుకొనగలిగింది. ప్రత్యామ్నాయ ఆలోచనలకు ప్రజాకర్షణ ఉంటే వాటిని కూడా కొనుగోలు చేస్తుంది. ఆ భావజాలం ఉన్న వాళ్ళను తమ తమ చానళ్ళలో కీలకమైన ఉద్యోగాలు ఇచ్చి వారి సేవలను కొనుక్కొంటుంది. అయితే ఇవన్నీ తమకు ప్రమాదకరం కానంత వరకే.

నిర్భయ ఘటన జరిగిన తరువాత దేశవ్యాప్తంగా పెల్లుబుకిన ఆగ్రహావేశాలు, తరువాత స్త్రీల వస్త్రధారణ మీద జరిగిన చర్చల కారణంగా మధ్య తరగతి యువతీ యువకులలో ఆలోచనలు రేకెత్తాయి. కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా రాత్రి షిఫ్టులలో పని చేయాల్సి రావటం, ఆ సమయంలో స్త్రీల సంచారానికి అవరోధంగా మారిన సాంప్రదాయ భావజాలం ఇవి రెండిటి మధ్య భారీ ఘర్షణ జరిగి స్త్రీ స్వేచ్ఛ, సాధికారత మీద ఉన్నత మధ్య తరగతి భారత యువత దృష్టి పడింది. ఈ చూపు పరిమిత కోణాన్నే కలిగి ఉన్నా ఆహ్వానించదగిందే. ఇక్కడ పెట్టుబడి మళ్ళీ రంగప్రవేశం చేసింది. ఉన్నత మధ్య తరగతి వర్గం వాళ్ళ మార్కెట్ లో భాగం. వారి కోపాన్ని సొమ్ము చేసుకొంటూ స్త్రీల స్వేచ్ఛ, సాధికారతకు సంబంధించిన కొన్ని తప్పుడు ప్రతిపాదనలతో ఛాంపియన్ లాగా ముందుకు వచ్చింది. అందులో భాగమే ఇటీవల దీపికా పడుకోని (బాలీవుడ్ సినీ నటి) విడుదల చేసిన వీడియో ‘మై ఛాయిస్.’

ఓగ్ అనే ఫేషన్ పత్రిక బాగా డబ్బున్న స్త్రీల అవసరాల కోసం నడుస్తుంది. గుత్త పెట్టుబడి సంస్థలకు సామాజిక సేవా విభాగాలు ఉన్నట్లే, లాభాల కోసమే నడిచే ఇలాంటి పత్రికలు తాము కూడా సమాజ సేవ చేస్తామని చెప్పటానికి అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటాయి. ఆ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ వీడియోలో దీపిక స్త్రీల లైంగిక స్వేచ్ఛకు సంబంధించిన ప్రకటనలు చేసింది. తన శరీరం తన ఇష్టమని, తన దుస్తుల గురించి ప్రశ్నించవద్దని, పిల్లల్ని కనాలో వద్దో తానే నిర్ణయించుకొంటానని చెప్పింది. కవితాత్మక పదజాలంతో ఆమె తన శారీరక సంబంధాల విషయం ప్రశ్నించవద్దనీ, వివాహం లోపల, వివాహం బయటా కూడా సంబంధం పెట్టుకొనే హక్కు తనకు ఉందని చెప్పింది. అలాగే తాత్కాలికంగా ప్రేమించాలా, శాశ్వతంగా కామించాలా, మగవాడిని ప్రేమించాలా, ఆడదాన్ని ప్రేమించాలా, ఇద్దరినీ ప్రేమించాలా .. ఇవన్నీ తన వ్యక్తిగత ఇష్టాలని పేర్కొనింది. ఈ వాక్యాలలో కొన్ని చాలా మందికి ఆకర్షణీయంగా, ఆమోదయోగ్యంగా అనిపిస్తాయి. ఈ అభిప్రాయాలన్నీ దీపిక గొంతు నుండి వచ్చినా ఈ వాక్యాల పుట్టుక ఓగ్ పత్రిక నుండి జరిగిందని వాటి వెనుక ఆ పత్రిక వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే విషయం సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే కానీ అర్ధం కాదు.

స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీలనే బాధ్యులు చేసే కోట్లాది వ్యక్తులు, ఆ తరహా భావజాలం ఉన్న దేశం మనది. ఈ వాదనలకు సమాధానం చెప్పీ చెప్పీ చివరకు మొండికేసి ‘నా శరీరం నా ఇష్టం’ అని ఇటీవల యువతులు చేస్తున్న స్వాభిమాన ప్రకటనను మార్కెట్ వెంటనే పట్టుకోగలిగింది. అత్యాచారాలకు కారణం భారతీయ సమాజంలో కరుడు కట్టుకు పోయిన పురుషాధిక్యత, ఫ్యూడల్ మనస్థత్వంగా చూడకుండా .. కేవలం స్త్రీల వస్త్రధారణే కారణం అనే రెడీమేడ్ వాదనకు ‘నా శరీరం నా ఇష్టం’ లాంటి ప్రకటనలే సమాధానంగా వస్తాయి. ఆ ప్రకటన చేస్తున్న స్త్రీలలోని అసహనాన్ని పట్టుకొని మహిళా సాధికారిత పేరుతో ఒక వ్యాపార సూత్రాన్ని మార్కెట్ అత్యవసరంగా అమలు చేసింది. స్త్రీల లైంగిక స్వేచ్ఛ గురించి ఒక వీడియో తయారు చేసి ఒక ప్రసిద్ద సినిమా తార చేత చెప్పించింది. స్త్రీ వాదాన్ని కూడా తన పనిముట్టుగా వాడుకోగలనని రుజువు చేసింది. నిజానికి ఆ పని ఎప్పుడో చేసింది. ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని’ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా’ మార్చేసి అందాల పోటీలు నిర్వహించి సౌందర్య సాధనాలు అమ్ముకొన్నప్పుడే చేసింది.

సముద్రంలో ఉన్న ఇసుక రేణువులన్ని సమస్యలు స్త్రీలకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ స్త్రీ సమాన హోదా తీసుకోలేదు. సమాన వేతనాలు తీసుకోలేదు. రాజకీయ సమానత్వం సాధించలేదు. అత్యాచారాలు, భ్రూణ హత్యలు, వరకట్నహత్యలు, గృహహింస, పని స్థలాల్లో లైంగిక వేధింపులు సవాలక్ష సమస్యలతో ఆమె సతమతమౌతుంది. మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి స్త్రీలకు కూడా వేరే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. లైంగిక స్వేచ్ఛ, పై సమస్యలు ఏమి లేని స్త్రీలకు ఒక ప్రత్యేక సమస్య. ప్రమాదకరం కాని ఇలాంటి స్వేచ్ఛా డిమాండ్ పురుషులకు సౌలభ్యం కలిగిస్తుంది కూడా. అందుకే పురుష అనుకూల మార్కెట్ దొంగ ఎత్తుగడలతో ఇలాంటి భావజాలాన్ని స్త్రీల పై రుద్ది స్త్రీ జనోద్ధారణ చేస్తున్నట్లు ఫోజ్ యిస్తుంది.

పాశ్చాత్య దేశాల్లో ఈ ఉదారవాద స్త్రీ వాదం పరిపక్వత చెంది దాని బండారం బట్ట బయలు అదే చేసుకొంది. మార్షియస్ లో ఫావ్సెట్ట్ దుస్తుల తయారీ సంస్థ “ఫెమినిస్టులు ఇలా కనిపిస్తారు” అనే లోగో ఉన్న టీ చొక్కాలను తయారు చేయాటానికి మూడో ప్రపంచ దేశాలనుండి వలస వచ్చిన స్త్రీలను ఉపయోగించుకొంటుంది. గంటకు ఒక డాలర్ ఇస్తూ వారి శ్రమను కారుచౌకగా దోపిడి చేస్తుంది ఈ కంపెనీ. అదే టీ షర్టు వాళ్ళు కొనాలంటే ఆ స్త్రీలు రెండు వారాలు పని చేయాల్సి ఉంటుంది. కుటుంబాలకు దూరంగా ఒక గదిని 15 మంది పంచుకొంటూ ఈ స్త్రీలు దుర్భర దారిద్యం అనుభవిస్తున్నారు. ఇది ఏ రకమైన ఫెమినిజం? క్యూబా విప్లవ వీరుడు చెగువేరను చంపి ఆయన పేరుమీద టీ షర్ట్స్ అమ్ముకొన్న అమెరికన్ సామ్రాజ్యవాదం కంటే ప్రమాదకరంగా అనిపిస్తుంది ఈ తరహా ఫెమినిజం అమ్మకం. స్త్రీల వేళ్ళతో వారి కళ్లనే పొడిపిస్తుంది. డోవ్ సబ్బు తన అడ్వర్టైజ్ మెంట్ లో అందంగాలేని స్త్రీలను మొదట ఎందుకు పనికి రానివారిగా చూపించి తరువాత ఆ స్త్రీలు డోవ్ సబ్బు వాడాక ‘సాధికారత’ సాధించినట్లు చెబుతుంది. అంటే స్త్రీ పురుష సమానత్వం అనే విషయం, స్వేచ్చా మార్కెట్ సమాజం సృష్టించే నయా ఉదారవాద స్త్రీవాద విషపు కోరల్లో చిక్కుకొంటోంది. స్త్రీ పురుష సమానత్వానికి తప్పుడు నిర్వచనాలు ఇచ్చి వారి ఆలోచనలను పక్క దారి పట్టించటం ఒక దుర్మార్గమైన కుట్ర.

‘ఈ కుట్రకు బలి కావద్దు, ఇలాంటి నకిలీ స్త్రీ వాదాన్ని నమ్మొద్దు’ అని సామాజిక చలనసూత్రాలను అర్ధం చేసుకొన్న వారు చెబుతుంటే వారిని సాంప్రదాయవాదులుతో పోల్చి స్త్రీ ఉన్నతిని వ్యతిరేకించేవారిగా చాలా మంది పొరపడుతున్నారు. దీపిక ఉచ్చరించిన పదాలు అందంగా, ఆకర్షణీయంగా ఉండవచ్చు. కానీ అక్షరాలకు కూడా ఆత్మ ఉంటుంది. అవి ఏ గూటినుండి పలుకుతున్నాయో అనే విషయం చాలా ముఖ్యమైనది. అణగారి ఉన్న స్త్రీలు తాము భరిస్తున్న అనేక పీడనల నుండి విముక్తి కోసం చేయబోయే పోరాటాలకు దారులు ముళ్ళతో ఉన్నా కూడా సూటిగా ఉండాలి. సులభమైన పక్క దారులు చూపించి వారి సమస్యలు తీరే మార్గాలుగా వారిని భ్రమింప చేసే సామ్రాజ్యవాద కుటిల వాణిజ్య కుట్రలను స్త్రీలు గుర్తెరిగి తిరస్కరించి, తిప్పికొట్టాల్సిన సందర్భం మళ్ళీ వచ్చింది. స్త్రీలకు తమ హక్కుల పట్ల స్పృహ పెరిగి, పోరాటాలకు సన్నద్ధమౌతున్న ప్రతి దశలో ఈ నకిలీ వాదనలు, ప్రకటనలు ముందుకు వస్తాయి.

ఈ సందర్భంగా ప్రగతిశీలవాదులు అందరూ “మా కధ” రాసిన బొలీవియా గని కార్మికురాలు ‘దొమితిలా చుంగారా’ను గుర్తు చేసుకొంటున్నారు. మెక్సికో అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ “నాకూ నా పిల్లలకూ ఒంటి నిండా బట్టలు కూడా ఉండవు. మీరు తళ తళ మెరిసే బట్టలతో, నగలతో ఉన్నారు. మా కుటుంబమంతా ఒక చిన్న అద్దె గదిలో ఉంటాము. మీ ఇళ్ళలో పది గదులు ఉంటాయి. రోజుకి 16 గంటలు పని చేస్తాము. మాకు కడుపు నిండా తిండి లేదు. నీళ్ళు లేవు. స్నానాల గదులు లేవు. మా పిల్లలకు చదువులు లేవు. మీరు కార్ల లో తిరుగుతారు. ఏ పనికైనా నౌకర్లు, డ్రైవర్లు ఉంటారు. మనిద్దరం ఆడవాళ్లమే మరి మీకూ మాకూ సమానత్వం ఎక్కడుంది? మా సమస్యలు మీకు ఎక్కడున్నాయి? మా భర్తలు కూడా పెత్తనం చేస్తారు. మేమూ పోట్లాడతాము. అయినా దానికంటే కూడా మా పేదరికమే మా అసలైన సమస్య. మీరూ మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.”

అందరు మనుషుల సమస్యలు ఒకటి కానట్టే, అందరు స్త్రీల సమస్యలు ఒకటిగా ఉండవు. వర్గాలు ఉన్న సమాజంలో మెజారిటీగా ఉన్న శ్రామిక మహిళల విముక్తి వర్గ విముక్తితో ముడిపడి ఉంటుందీ, వర్గరహిత సమాజంలో మాత్రమే ఆమెకు నిజమైన స్వేచ్చా, సమానత్వం, సాధికారిత వస్తాయనే స్పృహ ఆ వర్గ స్త్రీలకు కలిగితే అది కార్పొరేట్ సంస్థలకు, వాటిని ప్రోత్సహిస్తున్నప్రభుత్వాలకు, వీరిద్దరి ప్రయోజనాలకు ప్రమాదకరం. అంతే కాని దీపిక ముందుకు తెచ్చిన ప్రమాదరహిత, ఆషామాషీ, తేలికపాటి డిమాండ్స్ వలన ఎలాంటి యిబ్బంది ఉండదు. అందుకే ఎలాంటి నిషేదం లేకుండా ఈ ప్రకటనలు, వీడియోలు వెలుగులోకి విస్తృతంగా రాగలుగుతున్నాయి. స్త్రీవాద, మహిళా ఉద్యమాలు వీటి పట్ల అప్రమత్తతతో ఉండాలి.