ట్యాగులు

, , ,

TH31_KAWASI_2358353f

ఆదివాసీగా, అందునా గుత్తాధిపత్య సంస్థలు కన్నువేసిన ప్రాంతాల్లో స్త్రీగా పుట్టటం అంత మంచిది కాదు. ఇది బస్తర్, చత్తీజ్ ఘర్ లాంటి ప్రదేశాల్లో నివస్తిస్తున్న హిడ్మే, ఇంకా హిడ్మే లాంటి అనేక మహిళల కధ. బస్తర్ ప్రాంతంలోని సుక్మ జిల్లాలో ఉన్న బోర్గుడా గ్రామంలో నివస్తిస్తున్నప్పుడు హిడ్మే చిన్న పిల్ల. వితంతువైన అత్తకున్న చిన్న నేలను సాగు చేసుకోవటానికి ఆమె సాయపడుతుండేది. అందులో పండే గింజలు వారికి బొటాబొటిన సరిపోయేవి. సీజన్ వచ్చినప్పుడు హిడ్మే యిప్పపూలు బజారులో అమ్ముతూ ఉండేది. ఆమె వయసులో ఉన్న అందరి అమ్మాయిల్లాగానే వాళ్ళ ప్రాంతంలో పెట్టే సంతలు అంటే హిడ్మే ఎంతో యిష్టపడేది. స్థానికంగా దొరకని రంగురంగుల గాజులు, యితర వస్తువులు అక్కడ కొనుక్కోవచ్చు.

అన్ని సంవత్సరాలలాగానే పంటల కాలం అయిపోయాక (జనవరి 2008) హిడ్మే నివశిస్తుండే గ్రామానికి పక్క గ్రామం రాంరాంలో సంత జరుగుతోంది. గాజులు, రిబ్బన్లు కొనుక్కోవటానికి హిడ్మే, ఆమె అత్తా, అత్త పిల్లలతో కలిసి వెళ్ళింది. అక్కడ నాట్యం చేస్తూ, పాటలు పాడుతున్న ఆదివాసి గుంపులో ఆమె చేరింది. నాట్యం చేసి అలిసిపోయి మంచినీళ్ళు తాగటానికి పక్కనే ఉన్న బోరింగ్ పంపు దగ్గరకు వెళ్ళింది. పంపు మీద చేయి వెయ్యగానే ఎవరో ఆమెను బలవంతంగా లాగారు. ఆమె కోపంగా చూసి అక్కడ ఒక పోలీసు మనిషి ఉండటంతో ఆశ్చర్యపోయింది. పోలీసులు ఆమెను చుట్టుముట్టి సంత బయట వున్న పోలీసు వాహనం వైపు ఆమెను జుట్టు పట్టుకొని లాక్కొని పోయారు. కాళ్ళు, చేతులు కట్టేసి ఆమెను ట్రక్కులో పడేసి పోలీసు స్టేషనుకు తీసుకొని పోయారు.

తరువాత ఏడు సంవత్సరాలు కవాసి హిడ్మే మీద జరిగిన అఘాయిత్యాలకు ఈ ఘటన ప్రారంభం మాత్రమే. ఒక పోలీసు స్టేషనులో ఉద్యోగులు సంతృప్తి పడ్డాక ఆమె ఇంకో స్టేషనుకు తరలించబడేది. వరుస హింసలు ఆమెకు మరణావస్థను కలగచేశాయి. అయితే ఆమె స్టేషనులోనే చనిపోతుందనే భయం పోలీసులకు కలిగింది. అలా జరిగితే వాళ్ళకు సమస్యే. ఆమె చెరను అధికారికంగా చేయాలంటే ఆమెను జైలుకు పంపాల్సిందే. ఆ ప్రాంతంలో నివశిస్తున్న ఆదివాసి స్త్రీలకు అది అసాధారణమైన విషయం ఏమీ కాదు. హిడ్మేలాంటి అమ్మాయిలను బంధించి, నెలల తరబడి హింసించి, చివరకు చత్తీజ్ ఘర్ పబ్లిక్ సెక్యూరిటీ చట్టం పరిధిలోని రాక్షస కేసులు తప్పుడుగా వారిపై బనాయిస్తారు.

అయితే ఆమెను జైలుకు పంపే ముందు కోర్టుకు హాజరు పరచాల్సిన తతంగం మిగిలి ఉంది. కానీ అప్పటికి కవాసి ఆసుపత్రిలో చేరాల్సిన స్థితిలో ఉంది. కొద్ది రోజుల తరువాత పోలీసులు ఆమెను స్థానిక కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచారు. ఇరవై ముగ్గురు సియార్పియస్ పోలీసులను చంపిన కేసును ఆమెపై పోలీసులు చాలా సౌలభ్యంగా బనాయించారు. మేజిస్ట్రేట్ ఆమెను జగ్దాల్పూర్ జైలుకు రిమాండుకు పంపాడు. జైలుకు చేరే సమయానికి ఆమె పై జరిగిన భౌతిక, లైంగిక హింస పతాక స్థాయికి చేరి, శరీరం ఉన్నట్లుండి ఆమె గర్భసంచిని బయటకు తోసేసింది. ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరిగింది. భయకంపితురాలైన ఆమె ప్రయత్నించి ఎలాగో ఒకలాగా ఆ మాంసాన్ని తన శరీరంలోకి తోసి వేసింది.

అప్పటివరకూ తన అనుభవాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. కానీ జైలులోని ఆమె ఇతర గొండి భాష మాట్లాడుతున్న మహిళా ఖైదీలతో ఆమెకు మాట్లాడే అవకాశం ఉంది. మరుసటి రోజు మళ్ళీ ఆమె శరీరం ఆమె గర్భసంచిని బయటకు తోసేసినపుడు కవాసి దాన్ని కత్తిరించి వేయాలని నిర్ణయించుకొన్నది. తన తోటి ఖైదీని ఒక బ్లేడు ఇవ్వమని అడిగింది. అందరు బారాక్ బయటకు వెళ్ళినపుడు ఆమె దానిని కత్తిరించి ఆ బాధనుండి విముక్తం కావాలని అనుకొన్నది. ఆ పని మొదలు పెట్టగానే ఒక అమ్మాయి అక్కడకు వచ్చి, రక్తస్రావం అవుతున్న హిడ్మీని చూసి కేకలు పెట్టింది. మిగతా మహిళలు గుమికూడారు. ఆమె నుండి బ్లేడు తీసివేసుకొని జైలరును పిలిచారు. జైలరు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించింది. ఒక ఆపరేషను అక్కడ జరిగాక ఆమెను మళ్ళీ జైలుకు తీసుకొని వచ్చారు.

కోర్టులో ఆమెపై బనాయించిన దొంగ కేసు ముందుకు జరగలేదు. పోలీసులు ఇద్దరు స్త్రీలను, ఇద్దరు పోలీసులను సాక్షులుగా పెట్టారు. ఆ యిద్దరు స్త్రీలు ఎప్పుడు కోర్టుకు రాలేదు. ఇద్దరు పోలీసులు కూడా ఆ కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు చెప్పటానికి నిరాకరించారు. పెట్టిన కేసే అనుమానాస్పదంగా ఉండింది. కవాసి నేరం చేసిందని ఆరోపించబడ్డ కేసు సెప్టెంబర్ 9, 2007న జరిగింది. అందులో యాభై మంది నక్సలైట్ల పేర్లు పెట్టారు. ఆ లిస్టులో కవాసి పేరు లేదు. అయితే అదే సంవత్సరం డిశంబరు 15న ఆ లిస్టులో అదనంగా చేర్చిన పేర్లలో అగస్మాత్తుగా ఆమె పేరు కొత్త రికార్డులలో కనిపించింది. చివరకు కోర్టు ఆ కేసులో ఆమె పాత్ర ఉందనటాన్ని నిరాకరించింది.

అదే సమయంలో సోనీ సోరి అనే ఆదివాసి టీచరు ఆ జైలులో ఉండింది. ఆమె కవాసితో మాట్లాడింది. సోని సోరికి కూడా పోలీసు కష్టడీలో అలాంటి గతే పట్టింది. ఆమెకు కరెంటు షాకులు ఇచ్చి, ఆమె మర్మాంగాలలో రాళ్ళు తోశారు. సోనీ సోరి విడుదల అయిన తరువాత ఆమె మానవ హక్కుల సంఘాల కార్యకర్తలకు హిడ్మే విషయం చెప్పింది. కొంత మంది సానుభూతిపరులైన లాయర్ల సహాయంతో వాళ్ళు కవాసి గురించి గొంతు విప్పారు. అలాంటి ఒక లాయరు ఆమె కేసులో అందరి సాక్ష్యుల విచారణ పూర్తి అయింది కనుక ఆమెను విడుదల చేయాలని వాదించాడు. ఆమె అప్పుటికి ఏడు సంవత్సరాలు జైలులో ఉందనీ, ఇంకా కొద్ది నెలలు జైలులో ఉంటే మునిగిపోయేదేమీ లేదని జడ్జి సమాధానం ఇచ్చాడు! తరువాత ఎన్నో నెలలు హిడ్మే జైలులోనే ఉండిపోయింది. చివరకు మొన్న మార్చిలో (2015), ఆమెపై పెట్టిన కేసులు రుజువు చేయలేక కోర్టు ఆమె విడుదలకు ఆదేశించింది.

ఆమె విడుదల రోజు ఆమెను తీసుకొని రావటానికి సోనీ సోరి ఆమె మేనల్లుడు లింగా కొండోపితో జగ్దాల్పూర్ జైలుకు వెళ్ళింది. లింగా ఆమెను ఆమె గ్రామానికి తీసుకొని వెళ్ళినపుడు ఆమె స్నేహితురాళ్ళు ఎవరు ఆమెను గుర్తుపట్టలేదు. హిడ్మే ఒక్కొక్కళ్ళనీ పిలుస్తుంటే వాళ్ళు గుర్తుపట్టి ఏడవటం మొదలు పెట్టారు. ఆమె ఇప్పుడు బయట ఉన్నప్పటికీ ఆమె శరీరం శిధిలమై పోయి ఉంది. గాల్ బ్లేడర్ లో రాళ్ళు తీయటానికి ఆమెకు అనేక సార్లు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క ఆపరేషన్ ఆమె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చింది. ఆమెకు కలిగిన మానసిక గాయము చికిత్సకు లొంగనిది. తరచుగా డిప్రెషన్ కూ, అగస్మాత్తు మూడ్స్ మార్పుకూ ఆమె గురి అవుతోంది. ఇంకొక పక్క బస్తర్ ఐజీ కల్లూరి ఆమెపై కొత్త కేసు పెట్టటానికి ప్రణాళిక సిద్ధం చేసాడు. దానికి కారణం హిడ్మే ఆమెపై జరిగిన అఘాయిత్యాల గురించి తరచుగా మాట్లాడటం, వారిపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా సోనీ సోరీ వాళ్ళు చేస్తున్న పోరాటంలో ఆమె కూడా భాగస్వామి కావటం.

ఇది కేవలం కవాసి హిడ్మే కధ మాత్రమే కాదు. యవ్వనం, జీవనోత్సాహాల కాలంలో, ఏళ్ళ తరబడి కారాగారంలో మగ్గుతున్నవేలాది ఆదివాసీ యువతీ యువకుల కధ కూడా. వారు పోగొట్టుకొన్న జీవితానికి ఎవరు మూల్యం చెల్లించబోతున్నారు అనేది మనం అడగాల్సిన ఒక కఠినమైన ప్రశ్న. న్యాయ సహాయం లేకుండా ఈ యువతీ యువకులు అనుభవించిన హింస ఎప్పటికీ రుజువు కాదు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ప్రధాన స్రవంతి మీడియాలో ఈ సంగతులు మనం వినము. ప్రధాన స్రవంతి మీడియాలో ఒక్క సోనీ సోరీ గొంతుక మాత్రమే బయటికి వచ్చింది. ఆమె ధైర్యమూ, ఆమె అనుభవించిన భయంకర హింస దానికి కారణం. బస్తర్ లాంటి ప్రదేశాలలో పోలీసులు .. ఆదివాసీలు, బలహీనులైన ప్రజలను నక్సలైటులుగా చిత్రీకరిస్తూ వారి మీద పెడుతున్న తప్పుడు కేసుల గురించి ఆలోచనాపరులైన పౌరులకు తెలియకుండా పోలేదు. అయినా ఇప్పటీకీ ఒక నిజాయితీ కలిగిన చిత్రీకరణ, ముఖ్యంగా అక్కడి మహిళలకు సంబంధించి, బయటకు వచ్చింది పరిమితమే. ప్రధాన స్రవంతి మీడియా అంకితమై కవర్ చేస్తున్న ఐపియల్ ఆటలు, ప్రజలకు సంబంధం లేనీ డబ్బులకు అమ్ముడు పోయిన వార్తా సమాచారాల ముందు పై విషయాలన్నీ మసకబారి పోతాయి. మంచి బ్రతుకు అంటే సమాజం పట్ల ప్రేమ లేకుండా .. మంచి ఉద్యోగం, కావాల్సినంత డబ్బు మాత్రమే అనే మిధ్యాభావాన్ని యువకుల హృదయాల్లో ఇదంతా సృష్టిస్తుంది. శక్తివంతమైన గొప్ప రాజ్యాంగ యంత్రాంగాన్ని ఎదిరించాలనుకొనే ధైర్యసాహసాలు కలిగిన కొంతమంది యువతులు మాత్రం వారి ప్రతి అడుగులో వైరాన్ని ఎదుర్కొంటారు. ఈ మధ్య మడేనార్ గ్రామంలో జరిగిన పోలీసు కాల్పులలో గాయబడిన భీమా నాయక్ కంప్లైంట్ చేయటానికి సహాయపడిన సోనీ సోరిని పోలీసులు బాధించి, భయపెడుతున్నారు. రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతుందనే అభియోగం మోపి ఆమె బైలును రద్దు చేసి ఆమెను తిరిగి జైలుకు పంపుతామని అంటున్నారు.

ఈ ప్రాంతంలో ఉన్న పోలీసులు కేసులను విచారణ చేసి అరెస్టులు చేయటమే కాకుండా తీర్పులు ఇవ్వగలమని భావిస్తున్నారు. పెట్రేగి పోతున్న వారి నిరంకుశత్వం అలజడి రేపుతోంది. ఎలాంటి జవాబుదారీతనం లేని తుపాకీ నుండి వారు పొందుతున్న శక్తి భయపెడుతోంది. సమాజాన్ని రక్షించే మిషతో చిన్న చిన్న ఉపకారాలు (సెక్సువల్ గా కానీ, ఇంకో రకంగా కానీ ..) పొందేవారుగా, అభియోగం మోపిన వారికి పాఠం చెప్పి ఎవరూ చూడకుండా తప్పించుకోగలిగే వారిగా పోలీసులు ఒక పితృస్వామిక వ్యవస్థగా వారికి వారు భావించుకొంటున్నారు. ఈ విషయాల గురించి మనం వెల్లడి చేయకుండా, విశదీకరించకుండా, మాట్లాడకుండా ఉంటే ఏదైనా మంచి మార్పు వస్తుందనే ఆశ లేశ మాత్రంగానే మిగులుతుంది.

హిడ్మే వేసిన ప్రశ్న మమ్మల్ని ఇంకా వెంటాడుతోంది. “నేనెప్పుడూ మావోయిస్టు చర్యలో పాల్గోలేదు. నా తప్పు ఏమిటి?” ఇలాంటి ప్రశ్నలను మనం ఇంకా ఎదుర్కోవాలా లేక నిలబడి అన్యాయాలను ఎదిరించాలా అనే విషయం బాధ్యత కలిగిన పౌరులుగా మనం నిర్ణయించుకోవాలి.

(గమనిక: కవాసి హిడ్మేకి సంబంధించిన నిజాలకు ఊతంగా జగ్దాల్పూర్ న్యాయ సహాయ గ్రూపు లాయర్ నుండీ, ఇంకా హిందీ భాషలో ఉన్న యాక్టివిష్టు హిమంషు కుమార్ ఫేస్ బుక్ పేజీలో నుండి ఎక్కువ భాగం అనువదించి తీసుకొన్నాను. కవాసి కధకు ఇప్పుడు మన జీవితాలకు ఉన్న సంబంధం ఇంతకు ముందు కంటే ముఖ్యమైనదిగా మారుతోంది. అందుకే నేను ఆమె కధను గురించి మాట్లాడదలచుకొన్నాను. ఇక్కడ చెప్పిన అభిప్రాయాలు అన్నీ నావే. – సుష్మితా వర్మ)

(కలర్స్ ఆఫ్ డి బార్స్ వెబ్ సైట్ సౌజన్యంతో. ఆంగ్లం నుండి అనువాదం రమాసుందరి)