ట్యాగులు

, ,

కొండతీగపూల దండలు, మావో సూక్తులు – నిర్బంధ, అజ్ఞాత, వైవాహిక జీవిత ప్రారంభం

Picture 019

(రెండో భాగం)

మా పెళ్ళి కాలానికి ముఖ్యనాయకులు పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, అంకమ్మ, సరస్వతి, పంచాది నిర్మల, డా. భాస్కర్ అమరులయ్యారు. శ్రీకాకుళ ప్రాంతంలో అత్యంత నిర్బంధం కొనసాగుతోంది. ఉద్యమం నిస్తభ్ధతకు గురి అయ్యింది. మాష్టారు (పైలా వాసుదేవరావుగారు) నన్ను పెళ్ళి చేసుకోమని అడిగారు. మా యిద్దరికి దాదాపు ఇరవై ఏళ్ళు వయసు తేడా ఉంది. ఉద్యమంలో పని చేసే అమ్మాయినే చేసుకోవాలని మాష్టారు నలభై ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం ‘ఆహా ఊహూ’ అనుకొన్నాము. ఈ లోపల పార్టీ ఆల్ ఇండియా మహాసభలు కలకత్తాలో జరిగాయి. ఆ మహాసభలు అయ్యాక కొండలోగాం ప్రాంతంలో తెంతులగాం కొండల్లో మే 24న మా పెళ్ళి, ఒక సమావేశం అనంతరం జరిగింది. (పెళ్ళి ఏ కొండ మీద జరిగిందనే విషయం మీద కాసేపు జయమ్మ, చంద్రమ్మల మధ్య వాగ్వివాదం జరిగింది) మావిడి అప్పలసూరిగారే మా పెళ్ళి పెద్ద. కొండ తీగ పూల దండలు మార్చుకొని మావో సూక్తులు ప్రమాణాలుగా పలికాము.

మాతృత్వం- రహస్యోద్యమం

అప్పట్లో నేను చలాకీగానూ కొండలు ఎక్కటంలో చురుకుగా ఉండేదాన్ని. భూస్వాముల మీద జరిగిన అన్ని యాక్షన్ లలో నేను ఉండేదాన్ని. ఉద్దానంలోకానీ, కొండల్లోగాని ఉండే కుటుంబాలు అన్నీ నాకు సుపరిచితాలే.

పెళ్లి అయ్యాక కూడా ఇద్దరం వేరు వేరు దళాల్లో ఉన్నాము. అరుణ కడుపులో పడింది. అప్పటికే జయమ్మ, డా.మల్లిక్ ల పెళ్ళి జరిగి మల్లిక్ అమరుడయ్యాడు. జయమ్మకు పార్టీ సూచనలతోటే అబార్షన్ జరిగింది. నన్ను కూడా అబార్షన్ కోసం తెలిసిన డాక్టరు దగ్గరకు పంపారు. కానీ 7వ నెల వచ్చి ఉండటం వలన ఆయన ప్రమాదమని అబార్షన్ చేయలేదు. ఇక ప్రసూతి కోసం నేను బయటకు రావాల్సి వచ్చింది. తలదాచుకోవటానికి చాలా ఊర్లు తిరిగాను. ప్రకాశం జిల్లా చీరాల, పలుకూరు, సింగరాయకొండ … ఇంకా ఏటి వడ్డు గ్రామాలు చాలా తిరిగాను. గుంటూర్లో నాజరు ఇంట్లో కూడా ఉన్నాను. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్య గర్భవతి అవ్వటంతో నేను అక్కడ ఉండకూడదని మళ్ళీ పంపించివేశారు. నా డెలివరీ దగ్గర పడ్డాక చిన్నాపరేషన్ (పిల్లలు పుట్టకుండా) కూడా చేయించాలని అనుకొన్నాము. కొల్లా వెంకయ్య కొడుకు రాజమోహన్ అప్పుడు డాక్టరుగా హైదారాబాద్ లో ఉండేవారు. ఆయన నన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. మొగుడు తాగుబోతు, డ్రైవరు, ఈమె ఆయన రెండో భార్య అని చెప్పి చేర్పించారు. చేర్పించి వదిలేసి వెళ్ళిపోయారు. ఒక రకంగా మర్చిపోయినట్లే. డెలివరీ, ఆపరేషన్ అన్నీ అయిపోయాయి. బిడ్డను చేరదీసిన వాళ్ళు లేరు. చిన్న బట్ట ఇచ్చిన వాళ్ళు లేరు. నాకాడకొచ్చి అన్నం పెట్టినోళ్ళు లేరు. నా బాధలు గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. పార్టీ పట్టించుకొనే స్థితిలో లేదు. పక్క బెడ్డు వాళ్ళు నాకు గుడ్డలు ఇచ్చారు. నర్సమ్మలు పిల్లకు గౌన్లు తెచ్చి ఇచ్చారు. ఆకలి బాగా వేసేది. వాళ్లిచ్చే బ్రెడ్డు ఏమూలకు సరిపోయేది కాదు. కుట్ల దగ్గర చీము పోసింది. అలాగే ఉన్నాను.

ఒక రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు రాజమోహన్ ఊడిపడ్డట్లు వచ్చారు. “అయ్యో. నేను చెప్పినా పార్టీ వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. బయలుదేరు అమ్మా.” అన్నారు. ఆసుపత్రిలోనే ఎక్కువ రోజులు ఉంటే అనుమానం వచ్చి అరెస్టు చేస్తారు. ఆయనతో బయలుదేరాను. ఆటోలో కొద్ది దూరం వెళ్ళి తరువాత నడిచి వెళ్ళాలి. బాగ్ ను ఒక పక్కనా, పాపను ఒక పక్కనా వేసుకొని నడుస్తున్నాను. ఆయన సాయం చేస్తానని అనలేదు. డాక్టర్ అవటానో, ఎవరికైనా అనుమానం వస్తుందని అనుకొన్నారో తెలియదు. కాళ్ళకేదో అడ్డం పడి దుబ్బున పడిపోయాను. అరుణ కావ్, కావున ఏడ్చింది. ఆయన వచ్చి “లేవండమ్మా.” అని లేపారు. అక్కడకు దగ్గరే ఒక సానుభూతిపరుల ఇంటికి తీసుకొని వెళ్ళారు.

అక్కడే కొన్ని రోజులు ఉండాలని అన్నారు. పార్టీ ఎక్కడ చెబితే అక్కడ ఉండాలి కదా అన్నాను. మన పార్టీ వాళ్ళనయితే పోట్లాడగలను. బయట వాళ్ళను ఏమి అనగలను? ఆ యింటి ఆమె బువ్వ కాడ మాత్రం బాగానే పెట్టేది. కానీ పిల్ల పనిలో సాయం చేసేది కాదు. నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఒక రోజు అన్నం తినటానికి కూర్చోగానే అరుణ ఏడుపు మొదలు పెట్టింది. ఆకలవుతూ ఉండింది. ఎత్తుకొనే తింటున్నాను. పిల్ల పాస్ కు వెళ్లింది. ఆ పాస్ అన్నంలో పడ్డాయి. ఆ అన్నం వద్దంటే ఏమంటారో ఏమో, మళ్ళీ పెడతారో లేదో అని అలాగే తినేశాను.

మాష్టారు అప్పటికి చాలా బాధ్యతలలో కూరుకొని పోయారు. ఎప్పుడైనా ఒక ఉత్తరం రాసి పంపేవారు. ఆ యింట్లోనే నెల గడిపిన తరువాత ఒక డెన్ కి చేర్చారు. అక్కడ ఐదు నెలలు వరకు ఉన్నాను. అక్కడ కొండపల్లి సీతారామయ్య, కొల్లిపాటి నరసింగరావు, కె. సత్యమూర్తి, రవూఫ్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఆయుధాలు కూడా ఆ డెన్ లో ఉండేవి. కొండపల్లి సీతారామయ్యను నేను ‘నాన్న’ అని పిలిచేదాన్ని.

మా దగ్గర పైసలు ఉండేవి కావు. పావలా ఇస్తే బోలెడన్ని ఉల్లిపాయలు వచ్చేవి. ఆ ఉల్లిపాయలతోనే కూర. డెన్ లో ప్రతివాళ్ళూ కొండపల్లితో సహా పిల్ల పెంపకానికి సహకరించేవారు. బయటకు పోయినా కడిగేవాళ్ళు. ఒక రోజు డెన్ లో అందరూ బయటకు వెళ్ళటానికి సిద్దం అవుతున్నారు. “ఎందుకు?” అని అడిగాను. వాసు మాష్టారు వస్తున్నారని అన్నారు. “ఆయన వస్తే మీరు ఎందుకు బయటకు వెళ్ళాలి?” అని అన్నాను. కొరియరు ముందు వచ్చారు. తరువాత మాష్టారు వచ్చారు. తలుపు తీసి మౌనంగా ఉండిపోయాను. ఇద్దరి మధ్య మాటలు లేవు. మాష్టారు పిల్లను చూడటానికి లైట్ కూడా వెయ్యనివ్వలేదు. నేను ఏడ్చాను. మాష్టారు కూడా బాధపడ్డారు. తెల్లవారి ఝామున నాన్న (కొండపల్లి) వచ్చారు. అప్పటిదాకా మేము మాట్లాడుకోలేదు. తెల్లవారి పిల్లను ఇచ్చేయాలి. నా సమ్మతంతోనే ఆ నిర్ణయం జరిగినా ఆ బాధను తట్టుకోలేక పోయాను. అసలు ముందు పిల్లను వుంచేసి నన్ను వెళ్లిపోమని చెప్పారు. కానీ నేను మాష్టారు రావాలి, మేమిద్దరం మాట్లాడుకోవాలి అని గట్టిగా చెప్పటంతో ఆయన వచ్చారు. ఇద్దరం మాట్లాడుకొన్నది ఏమీ లేదు. నాన్న వచ్చి నన్ను సముదాయించారు. అరుణను పెంచుకొన్న వారి పెద్ద అబ్బాయి (అత్తలూరి మల్లికార్జునరావు) కూడా ఆ డెన్ లో ఉండేవాడు. ఆయన ద్వారానే అరుణ వాళ్ళ యింటికి చేరింది. బట్టలు సంచిలో సర్ది పిల్లను పంపాము. మా అమ్మాయి అని చెప్పకుండా సత్యమూర్తిగారి అమ్మాయి అని చెప్పాము. తరువాత పిల్ల పత్తా గురించి చాలా సంవత్సరాలు ఆలోచించే అవకాశం రాలేదు.

అప్పుడే కొండపల్లిగారితో మాకు రాజకీయ విభేధాలు వస్తున్నాయి. పులి రామకృష్ణయ్య అక్కడ నుండి నన్ను తీసుకొని వచ్చారు. సింహాచలం స్టేషన్ లో నన్ను వేరేవారు రిసీవ్ చేసుకోవాలి. అయితే వాళ్ళు రాలేదు. ఆ రాత్రికి సింహాచలం కొండ ఎక్కి రూమ్ తీసుకొని అక్కడే ఉన్నాము. మరుసటి రోజు రిట్టపాడు చేరాము. అక్కడికి చిట్టెమ్మ, రాంబాబు వచ్చి ఉన్నారు. తరువాత దళంకి చేరాను. మళ్ళీ పుల్లారెడ్డి పార్టీ నుండి విడిపోయే దాకా పాపకూ నాకూ సంబంధం లేదు. అప్పుడప్పుడు అడుగుతుండేదాన్ని చూడాలని. కుదిరేది కాదు.

కొండపల్లివారి నుండి విడిపోయి వేరే పార్టీ పెట్టుకొన్నాము. ‘విమోచన’ పేరు మీదనే ఆ పార్టీ చాలా రోజులు నడిచింది.

అక్కడ వాళ్ళు అరుణను చాలా బాగా పెంచారు. మా పిల్లని అందరికీ తెలిసి పోయింది. మా పిల్లను పెంచుతున్నందుకు వాళ్ళను రెండు సార్లు అరెస్టు చేశారు. కొట్టి జైలులో కూడా ఉంచారు. వాళ్ళ అబ్బాయి తెచ్చిన పిల్లగా యిష్టపడి వాళ్ళు అరుణను వదలలేదు. మా గురించి కూడా ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. అప్పటికే వాళ్ళకు ఎనిమిది మంది పిల్లలు. అయినా అరుణను గారాబంగా పెంచారు. పది చదివిన తరువాత ఆమె బాధ్యత మళ్ళీ పార్టీ తీసుకొన్నది. ముసలివాళ్ళం అయ్యాక మనకు మళ్ళీ పిల్లలు పుడతారని మాష్టారు జోక్ వేసేవాళ్ళు.

అరెష్టు – చిత్రహింసలకు లొంగని స్థిర చిత్తం

అది 1975వ సంవత్సరం. ఎమర్జెన్సీ ఇంకా పెట్టలేదు. కొండలోగాం ఏరియాలో కొండకు కొద్ది దూరంలో ఒక జీడి తోటలో నేను, కుమారన్న మరికొంత మందిమి ఉన్నాము. ఏదో విషయం మీద నాకు కుమారన్నకూ ఘర్షణ జరిగింది. వాసు మాష్టారు కూడా అప్పుడే వచ్చారు. ఆయన అక్కడకి వస్తారని కూడా నాకు తెలియదు. రాష్ట్ర కమిటీ సమావేశానికి వెళ్ళి అక్కడికి వచ్చారు. అప్పటికి పుల్లారెడ్డి పార్టీతో శ్రీకాకుళం కమిటీ విలీనం అయి ఉంది. మేము మాట్లాడుకొంటూ గంజన్నం తిన్నాము. మాష్టారు పిన్ను చేతి బాంబు తీసుకొని వచ్చి ఎలా ఉపయోగించాలో మాకు చెబుతున్నారు. అందరి దగ్గరా ఆయుధాలు ఉన్నాయి. ఎండ మీద పడి నీడకు జరుగుతూ ఆయుధాలకు కొద్ది దూరంలో ఉన్నాము.

ఇంతలో మందస పోలీసులు నాలుగు వైపుల నుండి తోటను ముట్టడించారు. మాష్టారు ముందు గమనించి ‘ఉష్, ఉష్’ అన్నారు. పోలీసులు కాల్పులు మొదలు పెట్టగానే మేము తలొక దిక్కు పరిగెత్తాము. మాష్టారు పరిగెడుతూనే తన చేతిలోని తుపాకితో కాల్చారు. పోలీసులు వెనక్కి తగ్గిన సమయాన్ని ఆసరాగా తీసుకొని అక్కడి కంచెను దాటి (దాదాపు 12 అడుగులు జంప్ చేసి) ఒక చెట్టు ఎక్కి కూర్చోన్నారు. కుమారన్న చేతికి తూటా దెబ్బ తగిలింది. అయినా ఆయన పారిపోగలిగారు. నేను పరిగెత్తేటపుడు కంచెలో నా చీర చిక్కుకొని పోయింది. పోలీసులు నన్ను పట్టుకోగలిగారు. గ్రామాల నుండి జనం వచ్చారు. అయితే ఎవరినీ నా దగ్గరకు రానివ్వలేదు. అక్కడే నన్ను కొట్టారు. మిగతా వారి గురించి చెప్పమని తుపాకి కాల్పులు గాలిలోకి జరిపారు. మాష్టారు నన్ను కాల్చివేశారని నిర్ణయించుకొని చెట్టు దిగి అక్కడ నుండి వెళ్ళిపోయారు. నన్ను చంపి వేశారనే వార్త మొదట పేపర్లో వచ్చింది. రాత్రి 12 గంటల వరకు నన్ను కొట్టి మందస తీసుకొని వెళ్లారు. అక్కడ కూడా బూటు కాలితో కొట్టారు. తెల్లవారు జామున 4 గంటలకు పక్కన కొండల్లోకి తీసుకొని వెళ్లారు. బట్టలు విప్పారు. అన్ని రకాలుగా బాధించారు. వళ్ళంతా రక్తం కారుతూ ఉండింది. “చేతులూ కాళ్ళు నరికి, చెట్లకు కట్టేసి మా విప్లవకారులను 360 మందిని మీరు చంపారు. అంతకంటే నన్ను మీరు ఏమీ చేయగలరు.” అని ప్రశ్నించాను. “మీకు అక్కచెళ్లెళ్ళు లేరా? అమ్మలు లేరా?” అంటూ పిచ్చి పిచ్చిగా తిట్టాను. తరువాత నాకు స్పృహ పోయింది. మెలుకవ వచ్చేసరికి ఒక ఎస్సై ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాను. మెన్సస్ అయి ఉన్నాను. మీద ఒక గుడ్డ కప్పి ఉన్నారు.

మరుసటి రోజు నన్ను పోలీసు స్టేషనుకి తీసుకొని వెళ్ళారు. ఆ గ్రామాలకు చెందిన ఒక వ్యక్తి నన్ను దూరం నుండి చూసుకొంటూ వెళ్ళాడు. నేను చనిపోలేదని బయట ప్రపంచానికి తెలిసిపోయింది. పెద్ద నాయకురాలు పట్టుబడిందని అప్పుడు ప్రకటనలు యిచ్చారు పోలీసులు. నా దగ్గర కొన్ని ఉత్తరాలు దొరికాయి వాళ్ళకు. వాటినిండా రాజకీయాలే. “ఇంత రాజకీయం ఉంటే అదెక్కడ చెబుతుందిరా.” అని పోలీసులు అనుకోవడం విన్నాను. వాసు మాష్టారు, కుమారన్న తప్పించుకోవటంతో నా విషయం ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకో పక్క కుట్ర కేసులో అరెస్టు అయిన ముద్దాయిలు జైలులో ఆందోళన చేస్తున్నారు. ఈ కారణాలన్నింటి వలన నన్ను వాళ్ళు ఎన్ కౌంటర్ చేయలేకపోయారు.

నన్ను కోర్టుకు హాజరు పరిచారు. బూర్గాం రాజు అప్పుడు లీగలుగా తిరుగుతున్నాడు. నాకు సహాయంగా వచ్చాడు. అంత నిర్భంధంలోనూ ఆయన పాత్ర మెచ్చుకోదగ్గది. కోర్టులో నాకు తెలిసినంత వరకు నినాదాలు యిచ్చాను. జడ్జికి నా వంటి దెబ్బలు చూపించాను. “పోలీసులు కొట్టకుండా ఉంటారా?” అన్నాడా జడ్జి. హాస్పటల్ లో నాకు చికిత్స చేయించి శ్రీకాకుళం తీసుకొని వెళ్ళారు. మా కామ్రేడ్ల సమాచారం, ఆయుధాల సమాచారం యిస్తే నాకు ఆస్తి, డబ్బు యిచ్చి మళ్ళీ పెళ్ళి చేస్తామని అన్నారు. “మీరు పొట్ట కోసం ఉధ్యోగానికి వచ్చారు. మేము పోరాటం కోసం వచ్చాము. తుపాకి పడితేనే ప్రజలకు విముక్తి జరుగుతుందని మేము నమ్మి మేము అన్నిటికీ సిద్ధం అయి చేస్తున్నాము.” అని అన్నాను. ఆ రాత్రి నన్ను లాకప్పులో ఉంచారు. నా రెండు చేతులు గుంజకు కట్టేశారు. ఆ పక్కనే మల మూత్రల విసర్జన జరిగి ఉండింది. నరకం అనుభవించాను. రాత్రంతా మేలుకొనే ఉన్నాను. పోలీసులు మధ్య మధ్యలో వచ్చి నన్ను తిట్టేవాళ్ళు.

మరుసటి రోజు కలెక్టరు దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళారు. “మీరు బయట పెళ్ళి చేసుకొన్నారు. మేము పార్టీలో పెళ్లి చేసుకొన్నాము. నాకు మళ్ళీ పెళ్ళి చేస్తామని ఈ డిఎస్పీ, ఎస్పీ అనటం సమంజసమేనా?” అని అడిగాను ఆయన్ను. కలక్టరు బీహారువాడు. అనువాదకులు ఆయనకు నేనన్న మాటలు వివరించారు. ఆయన పోలీసులను మందలించాడు. అయినా మళ్ళీ నన్ను టెక్కలి తీసుకొని వెళ్ళి ఇదే సోది. స్టేషన్ ముందు జనం మూగారు. నాకు తెలిసిన పాటలు రెండు పాడాను. మరునాడు అడిషనల్ జడ్జి ముందు హాజరు పరిచారు.

జైలు జీవితం

తరువాత నన్ను సెంట్రల్ జైలుకు తీసుకొని వెళ్ళారు. నాకు హాండ్ కప్స్ వేసి తీసుకొని వెళుతుంటే, ఆ జైలులో అప్పటికే ఉన్న విప్లవ ఖైదీలు, పాండన్న, పులి రామకృష్ణ, మాలకొండయ్య .. వీళ్ళంతా జైలు ఎగిరిపోయేటట్లు నినాదాలు యిచ్చారు. నాపై దాదాపు యాభై కేసులు పెట్టారు. పధ్నాలుగేళ్ళు జీవిత ఖైదు పడింది నాకు. సంవత్సరం పాటు నాతో ఎవరికి ఇంటర్వ్యూ యివ్వలేదు. బట్టలు యివ్వలేదు. ఒకే దుప్పటి నలుగురం మహిళా ఖైదీలం కప్పుకొనే వాళ్ళం. ఉన్న ఒక్క జత బట్టలు రాత్రుళ్లు ఆ దుప్పటి కప్పుకొనే ఉతికి ఆరేసుకొనే వాళ్ళం. ఒకసారి మలేరియా వచ్చి వణికి పోతుంటే పోలీసులు దయ తలిచి ఒక శాలువా కప్పారు. నేను లోపల ఉన్నప్పుడు కూడా రెండు సార్లు ఎస్పీ వచ్చాడు. “అరుణను చదివిస్తాము. బాగా చూస్తాము.” అని ఆశ పెట్టబోయారు. “మా పార్టీ వాళ్ళు బాగానే చూసుకొంటారు. మీతో మాకు పని లేదు.” అని చెప్పాను.

జైలులో ఉంటూనే అనేక సార్లు కోర్టుల చుట్టూ తిరిగాను. మన రాజ్యం వచ్చేస్తుంది. జైలు గోడలు బద్దలు కొట్టి నన్ను బయటకు తీసుకొని వెళతారని అమాయకంగా అనుకొనేదాన్ని. జైల్లో ఉండగా అక్కడ కొన్ని సినిమా షూటింగులు జరిగాయి. నేను అక్కడ ఉన్నానని నన్ను చూడటానికి ఎన్టీ రామారావు, చిరంజీవి వేరు వేరు సందర్భాలలో వచ్చారు. నాకు ఏదో డబ్బు ఇవ్వటానికి ప్రయత్నించారు. బయట మా పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చందా యివ్వండి అని చెప్పాను. వాళ్ళేమి యిచ్చినట్లు లేదు.

నాకు ఆరోగ్యం బాగా ఉండేది కాదు. ఆరు నెలలకు ఒకసారి ఉస్మానియా తీసుకొని వెళ్ళే వాళ్ళు. జైలులోనాతో ఉండి వెళ్ళిన కళ్యాణకృష్ణ ఎన్నో ఏళ్ళగా నాకు పెరోల్ ఇవ్వలేదని విజయవాడలో వెళ్ళి కరపత్రం వేశారు. హైదారాబాద్ వెళుతుంటే నా గురించి తెలుసుకొని అన్ని స్టేషన్లలో నన్ను విద్యార్ధులు కలుసుకొనేవాళ్ళు.

1984లో పెరోల్ మీద బయటకు వచ్చి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాను. మాష్టారిని చాలా రోజుల తరువాత కానీ కలవలేక పోయాను. హైదారాబాదులో ఆయుధాలు బాగు చేయించటానికి వెళ్ళి నల్గొండ దగ్గర పట్టుబడి మళ్ళీ జైలుకు వెళ్ళాను. అప్పుడు నన్ను విక్రమన్ననూ విపరీతంగా కొట్టారు. తరువాత ఇంకో సారి టెక్కలిలో అరెస్టు అయి మూడు నెలలు ఉన్నాను. మొత్తం నా జీవితంలో పదమూడు సంవత్సరాల వరకు జైలులోనే ఉన్నాను.

ప్రశ్న : గిజనులలతో మీ సహవాసం గురించి చెప్పండి.

చంద్రక్క: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు మా కోసం చాలా చేశారు. దాడులు జరిగినా మమ్మల్ని ఆదుకొనేవాళ్ళు. వాళ్ళు తిండి మానుకొని మాకు పెట్టారు. ప్రజలకు గుడ్డలు ఉండేవి కావు. ఆడవాళ్ళు సరైన బట్టలు లేక దళాలు వెళితే బిడ్డలను అడ్డంగా కప్పుకొనే వాళ్ళు. ఆహారం కోసం నిరంతరం వెతుకులాటలో ఉండేవాళ్లు. గిరిజన స్త్రీలు ముఖ్యంగా చాలా శ్రమ చేసేవాళ్ళు. అక్కడ దొరికే జీడి మావిడి టెంకలతో అంబలి కాయటం చాలా కష్టమైన పని. దుంపలు ఏరుకొని వచ్చి బిడ్డలకు పెట్టే వాళ్ళు. వంటలు వండుకోవటం కూడా సరిగ్గా వచ్చేది కాదు. మేము వాళ్ళకు వంటలు కూడా నేర్పించే వాళ్ళం. విప్లవ ఉద్యమం వాళ్ళలో చాలా మార్పు తీసుకొని వచ్చింది. పోలీసులను చూసి ఆమడ దూరం పారిపోయేవాళ్ళు, ఆయుధాలు పట్టుకొని మాతో నడిచారు. చదువుకొన్నారు.

ప్రశ్న : యాభై ఏళ్ళ మీ రాజకీయ జీవితం గురించి మీరు ఏమి అనుకొంటున్నారు? ఎక్కడైనా నిరాశ చెందారా?

చంద్రక్క: ఏజెన్సీలో ఎన్ని కష్టాలు పడినా, పోలీసుల చేతిలో చిత్రహింసల పాలు అయినా కానీ, జైలు జీవితంలో కానీ నాకు విప్లవం తప్ప ఇంకొక ఆలోచన రాలేదు. పార్టీ గౌరవం కోసం ఎప్పుడూ నేను ఆలోచించాను. నాతో బాటు పని మొదలు పెట్టి అమరులైనవారిని తలుచుకొంటే దుఃఖం వస్తుంది. అలాంటి నాయకులు ఇప్పుడు లేరే అని బాధగా ఉంటుంది. అంబలిని పచ్చి మిరపకాయ, ఉల్లిపాయలతో తిన్నాము. గుడ్డలు లేక ఉండేటోళ్ళం. వరన్నం ఎరగం. గంటన్నం తిని పడుకొనేవాళ్లం. జీలుగుపిండి అంబలి తాగేవాళ్ళం. ఏ నిమిషంలో చచ్చిపోతామో తెలియదు. ఇంటికి చేరి చచ్చిపోవటం కాదు, నాకు ఎప్పటికైనా తూటాకే మరణించాలని అనిపిస్తుంది.

ప్రశ్న: పైలా వాసుదేవరావు గారితో మీ సహజీవనం గురించి …

చంద్రక్క: మా వైవాహిక జీవితంలో మేమిద్దరం కలిసి ఉన్నది తక్కువ. అయినా ఒకే మాట మీద, ఒకే రాజకీయాల మీద బ్రతికాము. ఎంతో మంది శ్రీకాకుళ విప్లవకారులు అమరులు అయిన కాలంలో మా పెళ్ళి జరిగింది. ఆ సందర్భం మా యిద్దరి వివాహానికి తరువాత మా విప్లవ జీవితానికి వేసిన గట్టి పునాది. నేను జైల్లో ఉన్నప్పుడు మాష్టారిని మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెప్పాను. నేను ఎప్పటికీ బయటికి వస్తానో, అసలు వస్తానో లేదో కూడా తెలియని పరిస్థితి అది. మాష్టారు కోప్పడ్డారు నన్ను. నమ్మిన రాజకీయాల కోసం ఆయన, నేను చివరిదాకా నిలబడ్డాము. అది అన్యోన్యం అంటారో ఇంకేమి అంటారో నాకు తెలియదు. ఆయనతో నా సహజీవనం భౌతికంగా కంటే మానసికంగా బలమైనది.

ప్రశ్న : దళాల ప్రాముఖ్యత ఇప్పుడు ఉందా?

చంద్రక్క: దళాలు వద్దనే వాళ్ళు విప్లవానికే పనికి రారు. ఈ రోజు గూండాలకు కూడా తుపాకులు ఉన్నాయి. దళాలు లేకపోతే ఈ ఉద్యమం నిర్మాణం చేయలేము. పోలీసులు ఏరేస్తారు. పేదప్రజలకు పీడన తొలగాలంటే, వాళ్ళ రాజ్యం రావాలంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా జరగదు. దళాలు వద్దంటే పార్లమెంటరీ పద్దతికి జిందాబాద్ కొట్టటమే.

ప్రశ్న: మీ మొత్తం విప్లవ జీవితంలో మీరు పని చేసిన పార్టీలో స్త్రీల పట్ల చిన్న చూపు ఉందా?

చంద్రక్క: ఆడవారిపైన చిన్న చూపు విప్లవ పార్టీలలో కూడా ఉంది. ఉద్యమంలో పని చేసి వచ్చి కూడా వంటగదిలోకి వెళ్ళి పని చేస్తున్నారు ఆడవాళ్ళు. అలాగే చదువురాని వారిపైన కూడా చిన్న చూపు ఉంది. సమాజంలో ఉన్న అన్ని రకాల అసమానతాలు ఏదో ఒక మేర విప్లవ పార్టీలలోకి కూడా చొరబడుతున్నాయి.

( పడిన కష్టాల గురించి చెప్పేటపుడు గొంతు వణికింది. అవమానాల గురించి మాట్లాడేటపుడు ఆమె గొంతు ఉద్రిక్తం అయ్యింది. అమరుల గురించి తలుచుకొన్నప్పుడు ఉద్విగ్నతకు గురి అయ్యింది. చంద్రక్క జీవితంలో ఇంకా ఎన్నో కోణాలు చూడాలంటే ఎన్నో కిటికీలు తెరిచి చూడాలి. నిజానికి ఒక గొప్ప గ్రంధం రాయదగిన జీవితం ఆమెది. కొన్ని ముఖ్యమైన ముక్కలు మాత్రమే ఈ రచనలో ఉన్నాయి.)

సమాప్తం