ట్యాగులు

UN_Women_Against_M_558523544

‘ఏంటీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి?”

“నిన్న నేను రాసిన కవిత ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది.”

‘కవిత దినపత్రికలో వస్తే కళ్ళు ఎర్రగా అవుతాయా?’

“కాదు. అందులో నా ఫోన్ నంబర్ ఇచ్చారు. వంద ఫోన్ కాల్స్ దాకా వచ్చాయి. ముప్ఫై దాకా మెసేజీలు వచ్చాయి. నిన్న చాలా బిజీగా ఉంటూ కూడా వాటికి సమాధానం చెప్పాల్సి వచ్చింది.”

‘పోదూ బడాయ్! ఫోను కాల్లు మాట్లాడితేనే కళ్ళు ఎర్రగా అవుతాయా?’

“అది కాదు. ఆ ఫోన్లు చేసిన వాళ్ళలో చాలా మందికి నా కవిత గురించి ఏమీ తెలియదు. చాలా మందికి దాన్ని సరిగ్గా చదవటం కూడా రాదు. కొంత మంది దానికి అర్ధం చెప్పమని కూర్చొన్నారు. కొంతమంది ‘నువ్వు నాలాగే’ అనే కవితలో రొమాన్స్ వెదికి ‘నేనేనా ఆ నువ్వు’ అంటూ వెకిలి మెసేజీలు పెట్టారు. కొన్ని కాల్స్ ను నేను కట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు అర్ధరాత్రి దాకా వేరు వేరు నంబర్లతో ఫోన్ చేసి నన్ను వేధించారు. చాలా నంబర్లను రిజెక్ట్ లిస్టులో పెట్టాల్సి వచ్చింది.”

‘ఓస్ అంతేనా?’

“అంతేనా కాదు. నా నంబరు పట్టుకొని వాట్సప్ అప్లికేషన్లోకి వెళ్ళి మెసేజీలు పెట్టారు. టింగు, టింగుమంటూ ఆ ఫోను అర్ధరాత్రి దాకా చప్పుడు చేస్తుంటే విసుగ్గా మొహాలు పెట్టారు యింట్లో వాళ్ళు. వాళ్ళ ప్రశంసలకు థాంక్స్ అని మెసేజ్ పెడితే కొందరు పొద్దున్నే ఫోను చేసి ‘రాత్రి ఎవరో నాకు థాంక్స్ చెప్పారండి’ వెకిలి నవ్వులతో మొదలు పెట్టారు. వాళ్ళను తిట్టీ, తిట్టీ నాకు బీపీ వచ్చింది.”

‘అయ్యో తల్లీ! దీనికే హైరానా పడి పోతున్నావు. ఫేస్బుక్ లో నేను పడే పాట్లు నీకు ఎప్పుడు చెప్పలేదు. అమ్మాయి .. కాదు .. కాదు ఆడపేరు కనబడగానే రిక్వెస్టులు పంపుతారు. మొదట్లో నా పోస్టులు ఎక్కువ మంది చదువుతారని కక్కుర్తి పడి అంగీకరించేదాన్ని. ఇహ చూడు. పొద్దున్నే గుడ్ మార్నింగులు, సాయంకాలం గుడ్ ఈవినింగ్లు, రాత్రికి స్వీట్ నైట్లు. నేను సమాధానం ఇవ్వక పోతే వరుస మెసేజీల వేధింపులు. మాట్లాడరేమిటండీ, మీరు ఏమి చేస్తారు, ఎక్కడ ఉంటారు… మీ ఫోటో అందంగా ఉందండీ … (నా బొంద) లాంటి రక్తం ఉడికించే పలకరింపులు. ఫేస్బుక్ మెసెంజర్ ఒకటి సచ్చింది కదా. కాలేజీలో ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నప్పుడూ, ఇంట్లో వేడి వేడి ఆర్గుమెంట్లు జరుగుతున్నప్పుడు ఈ ఫోన్ కుయ్ కుయ్ మని చప్పుడు చేసి నేనున్న పరిస్థితిని ఇంకా అధ్వానం చేస్తుంది.’

“అవునా! మరి ఈ అప్లికేషన్ తీసేస్తే పోదా?”

‘నీ మొహం. ఈ అప్లికేషన్స్ తో విదేశాల్లో ఉన్న నా స్నేహితులతో మాట్లాడుతున్నాను. మా పిల్లలు డబ్బులు కావాలంటే టింగ్ మని ఒక ఎఫ్బీ మెసేజ్ కొడతారు. మా ఫేమిలీ డాక్టరు నేను వాడాల్సిన మందులను వాట్సప్ చేస్తారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని మనమూ ఉపయోగించుకోవద్దా? ఆడోళ్ళగా పుట్టినందుకు మనకు నిషిద్దమా అవి?’

“అసలు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారో?”

‘ఎందుకేమిటి? ఆడ సినిమా యాక్టర్ల గురించి మాట్లాడేటపుడు అది, ఇది అని ఎందుకు అంటారు? నర్సులను, రిసెప్షనిస్టులను ఎందుకు అంత చులకనగా చూస్తారు? వాళ్ల వృత్తి పబ్లిక్ కాబట్టి ప్రజలందరికీ వారిపై హక్కు ఉంటుందని అనుకొంటారు. సోషల్ మీడియాలో ఉంటాము కాబట్టి మన మీద కూడా వీరందరికి హక్కు ఉంటుంది. నువ్వు ఒక కవిత రాసి తెలుగు మాట్లాడే రాష్ట్రాల వాళ్ళందరికీ ఆడదానిగా హక్కుబుక్కం అయ్యావు. ‘

“ఎక్కువగా చదువుకోని వాళ్ళు, మిడి మిడి జ్ఞానం కలవాళ్ళే ఇలా ప్రవర్తిస్తారు. అందరూ అలా ఉంటారంటావా?”

‘అందరూ అలానే ఉంటారని నేను అనను కానీ, చదువుకూ ఆ ప్రవర్తనకు సంబంధం లేదని మాత్రం అనగలను. మా క్లాస్మేట్ ఢిల్లీలో పెద్ద కంపెనీలో పని చేస్తాడు. ఒక రోజు అర్ధ రాత్రి నేను ఎందుకో ఎఫ్బీలో ఉంటే ఇప్పటిదాకా ఎఫ్భీలో ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించాడు.’

“హత్ విధీ, ఈ రకం ఆలోచనలు పోవాలంటే ఏమి చేయాలి మనం?”

‘ప్రేమించలేదని యాసిడ్ దాడులు జరిగినపుడు మనం ఏమి చేయాలని అనుకొన్నాము? వాళ్ళతో ఫోన్లో మాట్లాడలేదనీ, సోషల్ మీడియాలో చాట్ చేయలేదనీ వేధింపులు చేస్తున్నప్పుడు కూడా అవే చేయాలి. ఈ భూప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో ఉన్నట్లే పురుషాధిక్యత ఇక్కడ కూడా కరడు కట్టి ఉంది. దాన్ని కరిగించటానికి సమ ఉష్ణోగ్రత సరఫరా జరగాలి. ముందు ఈ సమస్యలు మాకు కూడా ఉన్నాయని అందరి చేత చేతులు ఎత్తిద్దాం.’