ట్యాగులు

, ,

295071530 ఈ విషయం దళిత మహిళల గురించి. అయితే ఇది నిత్యం గ్రామాల్లో కులాన్ని ముందు పెట్టి దానికి అసభ్య మాటను కలిపి పేర్కొనబడే దళిత మహిళల గురించి కాదు. పని చేసే కాడ కామందుల మోహానికి బలి అయిపోయే దళిత మహిళల గురించి కూడా కాదు. దళిత కులంలో పుట్టినందుకుగాను జోగిని లాంటి సాంఘిక దురాచారాలతో అగ్రకుల ఆసాముల కామానికి తరం తరువాత తరం బతుకుని బలి ఇవ్వవలిసి వచ్చిన దళిత ఆడవారి గురించి కూడా కాదు. ఇది కేవలం ఒక దళిత యువకుడి తల్లి అయినందుకు, ఆ యువకుడు ఒక అగ్రకుల యువతిని ఇష్టపడినందుకు ఆమె పడిన అవమానాలు గురించి మాత్రమే.

ఈ దేశంలో దళితుడు అగ్రకుల మహిళలను ప్రేమిస్తే దళిత కాలనీలు తగలబెడతారు. దళితులు నడిచే బాటలను నిషేధిస్తారు. దళితులకు పనులను నిరాకరిస్తారు. దళిత తల్లులను నగ్నంగా ఊరేగిస్తారు. సమస్త ప్రపంచం దళితకులానికి వ్యతిరేకంగా ఒకటవుతుంది. అధికారగణం మౌనముద్ర వహిస్తుంది. రక్షక వ్యవస్థ చూసి చూడనట్లు నటిస్తుంది. అదే మళ్ళీ జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూరులో ఒక దళిత యువకుడు, బీసీ అమ్మాయీ పెళ్లి చేసుకోవాలని అనుకొని ఇంటి నుండి పారిపోయారు. బీసీ కులానికి చెందిన ఆ పిల్ల బంధువులు 15 మంది దళిత యువకుడి తరఫు స్త్రీలను అసభ్యదూషణ చేస్తూ, చెప్పులతో కొడుతూ వీధిలోకి లాగారు. వారి దుస్తులు లాగివేసి వారిని నగ్నంగా చేసి వీధుల వెంట ఊరేగించారు. ఈ కార్యక్రమం నాలుగు గంటలు కొనసాగింది. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో 2012లో, అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లాలో జరిగింది. ఇక్కడ కూడా దళిత తల్లి అగ్రవర్ణ యువతి బంధువుల చేతిలో అవమానానికి గురి అయ్యింది. వారామెను జుట్టు పట్టి లాగి, వివస్త్రను చేసి కర్రలతో కొట్టుకొంటూ వీధుల్లో తిరిగారు. పంజాబులోని భగవాన్ పూర్లో ఇదే విధంగా ఒక దళిత స్త్రీని బట్టలు చింపి బజార్లోకి తోసి ఊరంతా తిరగాలని ఆదేశించారు. దానికి కారణం ఆమె మరిది ఒక అగ్రవర్ణ యువతితో ప్రేమ వ్యవహారం నడిపించడమే. ఈ సంఘటనలన్నింటిలోనూ మామూలుగానే పోలీసులు అంతా జరిగాక రంగప్రవేశం చేసి ఒకరిద్దరిని అరెష్టు చేశారు. రాజకీయనాయకులు అంతరాత్మలతో కాకుండా పై గొంతుకలతో ఆగ్రహాన్ని ప్రకటించారు. 6233_untitled-17 పెరియార్ సాంస్కృతోద్యమం నడిపిన తమిళనాడులోని ధర్మపురిలో ఒక అగ్రవర్ణ యువతిని ప్రేమించిన పాపానికి ఆ దళిత యువకుని తల్లికి కడుపుకోత మిగిలింది. అగ్రవర్ణ యువతిని పెళ్లాడిన ఇలవరసన్ రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. పిఎంకె పార్టీ నేతృత్వం వహించే వన్నియార్లు ఆ దళిత కాలనీలను తగల పెట్టారు. దళిత స్త్రీలను అవమానం పాలు చేశారు. ఇలాంటి ఘటనలు చెదురుమదురు సంఘటనలు అయితే ఇవి సమాజంలో అంతర్భాగం అయిన అనేకానేక హింసలలో ఒకటని అనుకోవచ్చు. కానీ సంఘటనలు సమూహాలుగా వెంటవెంటనే మూకుమ్ముడిగా జరుగుతున్నప్పుడు ఆ సంఘటనల రాజకీయ స్వభావాన్నిఅర్ధం చేసుకొంటేనే తగిన కార్యాచరణకు పూనుకోవచ్చు. కులాంతర వివాహాలు కుల నిర్మూలనకు తోడ్పడుతాయని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అన్నారు. కానీ కులాలకు ఉన్న వేళ్ళు మన అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థలో చొచ్చుకొని ఉన్నాయి. వాటి పెకలింపు అత్యంత హింసతో, నొప్పితో కూడుకొని ఉంటుంది.సమాజంలో విస్పోటమయ్యే ఘర్షణలు- అవి యుద్ధంలాంటి పెద్ద విషయాలు కావచ్చు, కులమత తగాదాలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు … కారణం ఎంత చిన్నదైనా కూడా ఆమె దళితత్వాన్ని, స్త్రీత్వాన్ని రెంటినీ జమిలీగా ముందు మెడ వంచుతారు. ఆ హింసలో మొదట ఆమె లైంగికత్వం గాయపడుతుంది.

ఆమెకు ఏ రాజకీయ గొంతూ ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో అధికార రాజకీయాలలో ఆమె అస్థిత్వానికి ఓటు వేసే దగ్గరే కంచె కట్టారు. ఆమెకు ఆర్ధిక స్వాతంత్ర్యం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వేళ్ళూనికొని ఉన్న పురుషస్వామ్యం దాని పగ్గాలు పట్టుకొని ఉంది. అంతకంటే ముందు దళితుడికి చేరెడు నేల దక్కనివ్వని మనుస్వామ్యం మీసాలు దువ్వుతుంది. కులం, వర్గం, జండర్ దొంతరలలో అట్టడుగున ఉన్న దళిత మహిళ హింసకు, అవమానాలకు కేంద్ర బిందువు ఎప్పుడూ అవుతుంది. తూకం తప్పిన రాజకీయ ఆర్ధిక సామాజిక అధికార ఈక్వేషన్లు ఆమెను సమాజం అంతటికి వల్నరబుల్ గా చేస్తాయి. మధ్యయుగాల ఆటవికత్వం ఘనీభవించి దళితుల్లో దళిత అయిన దళిత స్త్రీని అతి ఘోరంగా అవమానిస్తారు.

రాజ్యాంగంలో బలహీనులకు సంబంధించిన అధికరణాలు, ఆదేశిక సూత్రాలు అన్నీ విఫలం అవుతున్న తరుణం ఇది. ఆ రాజ్యాంగ పరిధిలో దళిత మహిళా విమోచన అని చెప్పే ప్రవచనం ఒక పెద్ద అబద్ధం. ఎక్కడ అన్ని రకాల అణచివేతలు, దోపిడీలు కూడగట్టుకొని ఉంటాయో ఆ సమూహాల నుండి ముందు విస్ఫోటన జరుగుతుంది. వాటికి ఉత్ప్రేరకంగా పని చేసేవి ప్రగతిశీల ఆలోచనలు, ప్రత్యామ్నాయ పోరాటాలు మాత్రమే అని వేరే చెప్పనవసరం లేదు.

భూస్వామ్య, అగ్రకుల అహంకార, పితృస్వామ్య పీడనల నుండి దళిత మహిళ పోరాటాల ద్వారానే విముక్త అవుతుంది.

ఈ వ్యాసం జూన్ 2015 మాతృకలో సంపాదకీయంగా ప్రచురించబడింది.