ట్యాగులు

, , , ,

బూవి అక్క! బూవి!

బూమి దున్నక పోతే మేము బూదేవికి బారం

చెలక లేకపోతే మా బతుకులు బంగం

చెట్టిక్కి చేతులు వదిలేసి సచ్చే చందం

ఇక సస్తానికీ, సంపటానికైనా సిద్ధం

ఇది కవిత కాదు. వరంగల్ జిల్లా ఆదివాసీల మహిళల బతుకు గోస. ఈ మాటలు వారి నోటి నుండి వచ్చినవే.

విశాలమైన భూఖండాలు. విస్తారమైన జల వనరులు. కండలు కరిగించగలిగే మానవ శక్తులు. ఇవన్నీ ఎక్కడ ఉంటే అక్కడ గుత్త పెట్టుబడిదారుడి కన్ను పడుతుంది. కంటి సైగ చేస్తే కాగల కార్యం చేయగల బంటు దళాలు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు వాడి చూపు తెలంగాణాలోకి పచ్చని గోదావరీ పరీవాహక అడవుల మీద పడింది. అక్కడ జీవిస్తున్న ఆదివాసీల పోడు భూములు కావాలని కోరిక కలిగింది. ఇంకేం… కేసీయార్ కు అత్యవసరంగా పర్యావరణ ప్రేమ పుట్టుకొచ్చింది. ‘హరితహారం’ అనే అందమైన పేరు ముందుకు వచ్చింది. ఆదివాసీలు దున్నుకొంటున్న బూములకు కంచెలు పడ్డాయి. పట్టాలు, హక్కుల పత్రాలు, నక్షాలు లేవంటూ ఎక్కడికక్కడ వేధింపులు, బెదిరింపులు, దాడులు మొదలయ్యాయి. ఫారెస్టు రేంజర్లకు ఆయుధాలు వచ్చాయి. భూమికీ మహిళకూ ఉన్న గాఢ బంధాన్ని గుర్తించి అటవీ శాఖ ఆడ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. ఇదంతా గ్రహిస్తున్నఆదివాసీ స్త్రీలు తల్లడిల్లి పోతున్నారు. కొండ మా కైదండ. పోడు మా కడుపుకింత కూడు. ‘కొండపోడు’ మా దైనందిన జీవన భుక్తికి తొవ్వ. బూమి లేక పోతే మేము చచ్చినట్లే అంటున్నారు.

చినుకు పడ్డది. బూముల్లోకి పోనిత్తలేదు. (బంటు వెంకటమ్మ, అప్పరాజు పల్లి, బిసి మహిళ)

IMG_9955

కొత్త పోడు. కష్టపడి ముప్పై సంవత్సరాలు కొట్టుకొన్నాము. నా కొడుకులు, కోడండ్లు రక్తం నీల్లు చేసుకొని పనిచేశారు. ఈ ముప్పై ఏళ్లలో ఏడు బూమి కేసులు నా కొడుకు మీద పెట్టినారు. కోర్టుల చుట్టూ తిరుగుడే తిరుగుడు. నరసం పేట, వరంగల్లు జాల్లలో (జైల్లో) ఉన్నాడు నా కొడుకు. తిండికి టికానా లేదు. నా మొగుడు చచ్చినపుడు నా కొడుకు జాల్లలో వున్నాడు. ‘తండ్రి చచ్చిండు. పెద్ద కొడుకు నీల్లు పోయాల.’ అంటే పార్టీ వాళ్ళే మాట్లాడినారు. ఒకడ్ని చంపినట్టు, ఒకడ్ని పొడిచినట్టు బేడిలతో తీసుకొచ్చినారు నా కొడుకుని. నీల్లు సుద పోయనియ్యలేదు. మళ్ళా ఉరి తాడేసినట్టు గుంజుకొని జీబులల్ల తీసుకొని పోయిండ్రు. నా చిన్న కొడుకు తండ్రికి తలకొరివి పెట్టిండ్రు. అట్టానే బతికినం బూముల మీద ఇప్పటి దాకా.

బూమికి ఇప్పుడు కంచె కొట్టారు. కొద్దిగా కూడా పోనీకుండా మరీ అన్నాయంగా కంచె కొట్టిండ్రు. అండ్ల దున్ని విత్తనం ఏస్తరకనే సపోర్టులు పోయి ఇప్పుడు నాగాలి పోనిత్తలేదు. కొడవళ్ళు పోనిత్తలేదు. మా సేను సుద పీకి కుప్పలు పెట్టిండ్రు. మోటకొచ్చిన కాయ. ముద్రచేలు, పెసర చేలు, మొక్కజొన్న చేలు, కంది చేలు .. జంగలాతోళ్ళు మొత్తం పీక్కొని కుప్పలు పెట్టి పోలీసు తాన కేసులు పెట్టిండ్రు. అరెకరం బొబ్బర సేను ఏత్తే కొత్త పోడు కాబట్టి యిరగ కాసింది. రెడ్డోడు ఆడ నిలబడి లేబర్ని బెట్టి మొత్తం పీకించిండు. 30 గుంటల సేను పీకిండ్రు. ఎండు పండు కాయ. ఏడ్చుగుంటా కూసున్న. మా ఇబ్బంది పెడతాండ్రు. చినుకు పడ్డది. దున్నుకొందామమంటే పోనివ్వటం లేదు. మాకు తల్లి దార్గ పంచిన ఆస్తి లేదు. అన్నదమ్ముల దార్గా పంచిన ఆస్తి లేదు. అడవిలో చెలక లేక ఎట్టా బతకాలా? చెలక లేక పోతే మా బతుకులు బంగం. మేం చచ్చినంత విలువ. జగలాతోల్లు మమ్మల్ని ఇంత చెర పెడుతుండ్రు. ఇంత బోద పెడుతుండ్రు.

అందరికి ఇదే గోష ఉన్నది. బూములు లేవు. జాగల్లేవు. రెక్కల బతుకులు మావి. ఈ సంవత్సరం నుండి ఇదే పరిస్థితి. కేసీయారు మాటిచ్చాడు కానీ ఇక్కడ అది నడవటం లేదు. మమ్మల్ని బూములోకి పోనిత్తలేదు. కర్ర ముక్క కూడా పట్టుకోనియడం లేదు. కష్టపడ్డ జాతి కదా మాది. ఊరికోలేక మండైన కొట్టుకొందాము, ఇగురైన కొట్టుకొందాము అంటే ఆడనే పండతన్నారు. అస్సలు జేరనిత్తలేరు. రేంజరు లక్ష్మీకాంతరెడ్డి మా వూరోడే. ఆయనొచ్చిన కాడ నుండి మా బతుకు ముదనష్టమాయ. ఆడి తాత బూసామి ఈడ. ఆడు చచ్చినంక అందరికి పోడు బూమూలాయ. పోడు కాగితాలు అందరికి వచ్చాయి. ఇప్పుడు ఇక బూమి లేక పోతే మందు తాగి సచ్చేదే.

అసలే ఏమి లేని బతుకు. కొట్టటం కాదు సంపటానికి, సావటానికి కూడా సిద్దమే. (కళ, బొద్దుగుండ సురేశ్ నగర్, లంబాడీ మహిళ)

maccharla 1

మేము మంచి నీళ్ళు తాగి ఉపాసన ఉండి, ఒక్కొక్క రోజున కూడు లేక బార్యా బర్తలం సంపాదించుకొన్నాము. బాయిలు తీయించుకొన్నాము. ఒక పూట తిని ఒక పూట తినకుండా కొట్టుకొన్న పోడు బూమి. సిటీల పోతే మాకు పని రాదు. మాకా మాటలు రావు. రైలు ఎక్కాలన్నా మాకు బయమే. ఎక్కడన్నా మాట్లాడాలన్నా మాకు బయమే. తెలుగు మాకు అంత రాదు. మేము ఇక్కడ ఉంటే యాభై రూపాయల కూలి ఉన్నా బతకగలుగుతాము. బూమి లేక పోతే మేము బూదేవికి బరువు. అది లేక పోతే మాకు ధైర్యం లేదు, అండ లేదు దండ లేదు. దిక్కులేని పశువులమవుతాము. చెట్టు ఎక్కి చేతులు వదిలేస్తే ఒక్కసారి చస్తాము.

మొన్న ఇక్కడ బూమిలోకి రానియ్యాక పోతే ఆడోళ్ళు బాయిలో పడ్డారు. అప్పటికి వదిలేసి తరువాత వాళ్ళ మగోల్ల మీద కేసులు పెట్టిండ్రు. ఇంకొక దగ్గర ఆడోళ్ళు తిరగబడి రేంజర్ను కొట్టిండ్రు. అసలే ఏమి లేని బతుకు. వాళ్ళు అంత దుర్మార్గంగా ఉంటే యింక ఏమి చేస్తరు? కొట్టటం కాదు చంపటానికి కూడా సిద్దమే. కొంత మంది ఆడోల్లు మంచం పట్టిండ్రు. ముప్పై ఐదేళ్ళు అయ్యింది మేము పోడు కొట్టి. పట్టాలు వచ్చినయ్యి. అయ్యి వాళ్ళ కాడనే ఆపుకొన్నారు. చౌకీదారు కాడ ఉన్నాయి. (అవి హక్కు పత్రాలు అయి ఉంటాయి) ఇంత దందా చేసి ఆగం చేస్తుంటే ఏ పార్టీ వాళ్ళూ వచ్చి ఆదుకోవటం లేదు మాకు. మన సంగపోళ్ళే ఆదుకొంటున్నారు.

ముద్ద నోట్లో పడే టైముకి గుంజుకొంటున్నారు. (కమలమ్మ. రెడ్డోల గ్రామం, లంబాడీ మహిళ)

IMG_9963

నేను వార్డు మెంబరుగా జేసిన. ఎంపీటీసీగా కూడా జేసిన. ఈ యిబ్బందిలో ఏ పార్టీ కూడా ఆదుకోలేదు. ఈ సంఘం తప్ప. ముప్పై ఏళ్ల క్రితం పోళ్ళు కొట్టిన కాడి నుండే బుక్కెడన్నం తిని జీతాలు (వెట్టి) మాని బతుకుతున్నాము. పోడ్ల మీద పిల్లలని చదివించుకొన్నాము. డిగ్రీలు, పీజీలు చదివిన ముఫై ఏళ్ళు వచ్చిన పోరగాళ్ళు మాకు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పటిదనక నౌకరీ లేక ఊరకనే ఉన్నారు. అందరం ఈ పోడు మీదనే బతుకుతున్నాం. ముద్ద నోట్లో పడే టైముకి గుంజుకొంటున్నారు.

దేనికైనా సిద్దమే. ఇక పారెస్టోళ్ళు వస్తే కారం పొడి పట్టుక పోతాం. (అజ్మీర మంగమ్మ, మన్మోతుల గడ్డ, లంబాడీ మహిళ)

maccharla2

కూలి చేసుక బతకాలంటే పొద్దుగాల ఏడుగంటలకు పోవాల. సాయంత్రం ఏడు గంటలకు రావాల. ఇక ఇళ్ళు లేవు. పిల్లగాళ్ళు లేరు. కూడు లేదు కొమ్ములేదు. ఇంటికాడ గోద, గొడ్లు, బర్రెలు ఏవీ చూసుకోవద్దు. టిపిన్లో అన్నం వేసుకొని ఉరుకుడే. మళ్ళీ కంట్రోల్ బియ్యం, నూకలు తినాలి. నెల రోజులు నాటుకి పోతే 2500 వస్తయి. దుత్త పట్టుకొని పన్నెండు గంటలు పనిచేయాల. కలుపులకు పోతే వందరూపాయలు. నేను రాను అంటే వేరే వాళ్ళను తీసక పోతారు పట్టపు బూములోల్లు. కూలి కోసం వాళ్ళింటి ముందు నిలబడాల. ‘కంట్రోలు బియ్యం తెచ్చుకొంటారట. వాళ్ళకు కూలి ఇయ్యాల’ అంటరు వాళ్ళు. ఎకరం అంటారు. ఎకరన్నర ఏయిస్తారు నాట్లు. నాటుకి పోతే అయిదుగురే ఎకరం ఏసుకోవాలి. మా పానాలు పోతాయి. అయిదుగురం ఉన్నాము మా యింట్లో. ఒక మంచం పట్టే గుడిసె మాది. వానొస్తే పరదలు ఏసుకోవాలి. గాలొస్తే లేసి పోవాలి. మా తండకు రాండ్రి, తెలుస్తది. ఇక మా వల్ల కాదు. దేనికైనా సిద్దమే. ఇక పారెస్టోళ్ళు వస్తే కారం పొడి పట్టుక పోతాం.

విప్లవ పార్టీలు యిప్పించిన పోళ్ళే ఇవి. (లావుడ్య రాజు, పివైయెల్, వరంగల్)

భూపాలపల్లి మండలంలో దూదేకుల పల్లి అనే ఊరు ఉంది. అరవై డెబ్భై కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అంతా గిరిజనులే. ఒక్క పోడు బూమి కూడా లేదు. అంతా సాగు బూమే. హక్కు పత్రాల గురించి అప్లై చేసిండ్రు. పారేస్టోళ్ళు అంతా కంచె వేసి మొక్కలు నాటే కార్యక్రమం తీసుకొచ్చిండ్రు. పత్తులు వేస్తే అవి కూడా పీకిండ్రు. ఈ గొడవలో ఆడవాళ్ళనీ చూడకుండా అడవిల ఇష్టం వచ్చినట్లు కొట్టిండ్రు పోలీసులు. ఒక డెబ్బై ఏళ్ల మహిళను స్కూటర్ కు కట్టి వేసి తీసుకొని పోయి కొట్టారు. అరెకరం బూమి దున్నినందుకు భూపాలపురం రేంజ్ ఆఫీసుకు తీసుకొని పోయి పది వేలు ఫైన్ కట్టించారు. అతను ముప్ఫై ఏళ్ల నుండి అదే బూమి దున్నుతున్నడు. పండగలొస్తే బీరు, బ్రాందీ, డబ్బులు ఫారెస్టోళ్ళకు ఇవ్వాలి. ఒక్కో కుటుంబం నుండి ఇరవై వేలు దాకా తీసుకొన్నారు ఇప్పటికి. గతంలో విప్లవ పార్టీలు యిప్పించిన పోళ్ళే ఇవి. ఇప్పటి స్థితి ఇది.

ఊ అంటే కేసులు, ఆ అంటే కేసులు (బిక్ష్యం, ఒక వృద్ధుడు)

macharla2

పూర్వం ఇట్లా లేకుండే. 1992లో కొట్టాము ఈ పోడు. పసుపు, మిర్చి, పత్తి, వడ్లు అన్ని రకాల పంటలు పండించుకొన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. ఇక్కడంతా లంబాడీలు, కోయలు, బీసీలు. దొరల పెత్తనం పోయి సంగం నీడలో కాలో గంజో తాగి బతుకుతున్న వీళ్ళకు మళ్ళీ పోరాడే అవసరం వచ్చింది.

ఈ పోరాటం ఆగదు బూమి దక్కే దాక (అనసూర్య, వరంగల్ పీవోడబ్ల్యూ కార్యదర్శి)

పట్టా ఉన్నా కూడా నక్ష (ప్లాను) లేదు తెమ్మంటుండ్రు. ప్రస్తుతానికి గ్రామానికి ఒక వంద ఎకరాలు ఎంచుకొని మొక్కలు పెడతామంటుండ్రు. కోతులు ఊళ్ళలోకి వస్తున్నాయి అని కేసీయార్ మాట్లాడుతున్నాడు. ‘మేము పళ్ల తోటలు పెడతాము. పళ్ళు నువ్వే తిను’ అంటూ చొచ్చుకొని వస్తుంది హరిత హారం. కొద్దిగా సందు తీసుకొని మొదటికే ఎసరు పెట్టే ప్లాను చేస్తున్నారు కొన్ని దగ్గర్ల. గ్రామ పంచాయితుల్లో తెలియక ఆదివాసులు సంతకాలు చేస్తున్నారు. ఫారెస్టు, రెవెన్యూ, పోలీసు డెపార్ట్మెంటు వాళ్ళు కలిసి వస్తున్నారు ఎక్కడికి వచ్చినా కూడా. వరంగల్ జిల్లాలో ఎక్కువ పోడు బూములే. గత ప్రభుత్వాలు పట్టాలు యివ్వలేదు. ఈ ప్రభుత్వం ఏకంగా పోళ్ళే గుంజుకొంటున్నారు. ఈ పోరాటం ఆగదు బూమి దక్కే దాక. ప్రజా చైతన్యం తోనే దీన్ని తిప్పి కొట్టాల.