ట్యాగులు

, , ,

201412481754745734_20తెలుగు రాష్ట్రాలు రెండూ పుష్కరాల సంరంభంలోనూ, బాహుబలి సినిమాలోనూ మునిగి తేలుతూ ఉండగా ఇక్కడి దళితవాడలు, ప్రజాస్వామిక విప్లవ శిభిరాలు కారంచేడును స్మరించుకొంటున్నాయి. ఆగస్టులో 24 సంవత్సరాలు నిండబోతున్న చుండూరుని స్మరించుకొంటున్నాయి. ఇంకా ఇదే నెలల్లో (జులై, ఆగస్టు) జరిగిన వేంపెంట, నీరుకొండల ఘటనలను తలుచుకొంటున్నాయి.

00011985లో జరిగిన కారంచేడు ఘటన ఈ జులై 17కి ముప్ఫై వార్షికాలు పూర్తి చేసుకొన్నది. కారంచేడులో మాదిగలు మంచినీళ్ళు తాగే చెరువులో కమ్మ వ్యక్తి బర్రెని కడుగుతుంటే వికలాంగుడైన కత్తి చంద్రయ్య పెట్టిన అభ్యంతరం కమ్మ కులాహంకారానికి క్రోధం కలిగించింది. దాడి చేయబోయిన యువకుల చర్నాకోలుకు బిందె అడ్డం పెట్టుకొన్న సువార్తమ్మ ఆత్మరక్షణ వారి అహాన్ని కవ్వించింది. ఫలితం మాదిగవాడపై కొన్ని వందల మంది కమ్మ కులస్తుల దాడి. ఆరుగురి హతం. దుడ్డు వందనం, దుడ్డు రమేశ్, తేళ్ళ యెహోషువ, తేళ్ళ మోషే, తేళ్ళ ముత్తయ్య, దుడ్డు అబ్రహాంలను కారంచేడు చుట్టుపక్కల వేటాడి మరీ చంపారు. ఎందరో స్త్రీలమీద లైంగిక, భౌతిక దాడులు చేశారు. అసభ్యమైన తిట్లతో వారిని అవమానించారు. ఆరేడు గంటలు సాగిన ఈ హింస ప్రపంచంలో జరిగిన అనేక మారణహోమాల కంటే తక్కువైనది కాదు. భయంతో కకావికలు అయిన దళితులకు చీరాల లూధరన్ చర్చిలో ఆశ్రయం కల్పించారు చుట్టుపక్కల గ్రామాల దళిత యువకులు. ఆ ప్రాంతంలోని పదిహేడు దళితవాడల నుండి పూటకొక పేట చొప్పున వారికి ఆహార వసతి కలిపించారు. మాదిగలను మధ్యలో పడుకోబెట్టి మాలలు వారికి కాపలా కాశారు. ఉద్యమానికి నేతృత్వం వహించిన కత్తి పద్మారావు మీద టెర్రరిస్టు కేసు పెట్టింది ప్రభుత్వం.

కారంచేడు దళిత మహిళా ఉద్యమం

కారంచేడు దళితులకు న్యాయం జరగాలని, నిందితులను అరెస్టు చేయాలని ఎన్నో ఉద్యమాలు నడిచాయి. అందులో స్త్రీలు చేసిన ఉద్యమం చాలా తక్కువ చోట్ల ప్రస్తావించబడింది. ఘటన జరిగిన తరువాత గుంటూరు హాస్పిటల్ లో వైద్యం పొందుతున్న బాధితులను పరామర్శించటానికి ఎన్టీ రామారావు వచ్చినపుడు అక్కడ ఉన్న తేళ్ళ చిన వీరమ్మ “నువ్వు ముఖ్యమంత్రివి అయినప్పటి నుండి కారంచేడులో ప్రతి కమ్మోడు ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు. వాళ్ళే ఈ రోజున మా వాళ్ళను చెరిచారు. దారుణంగా నరికారు. సిగ్గు లేకుండా ఏమి ఎరగనట్లు బత్తాయి పండ్లు తెస్తావా?” అని ఆ పండ్లు విసిరి కొట్టింది. హైదరాబాదులో ఎన్టీఆర్ ఇంటి ముందు కారంచేడు మహిళలు వేలాదిగా బైఠాయించారు. అప్పటికే అరెస్టు అయి ఉన్న తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రామారావు ఇంటి బయటకు వచ్చి వారికి హామీ ఇవ్వాల్సి వచ్చింది.

ఉద్యమాలకు కొత్త చూపు

000001దళితుణ్ణి చంపివేయటం వార్త కాని కాలంలో కారంచేడు పెట్టిన గావుకేక దేశమంతా ప్రతిధ్వనించింది. అనేక సామాజిక ఉద్యమాలకు ఆ కేక అంకురార్పణ చేసింది. 1989 నుండి ఎస్టీ ఎస్సీ ఎట్రాసిటీ యాక్టు అమలులోకి వచ్చింది. పచ్చి ఫ్యూడల్ వాదం నరాలకు, మెదళ్ళకు ఎక్కించుకొన్న అగ్రవర్ణ భూస్వాములు ఆనాడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అండతో జరిపిన దమనకాండ ఎల్లెడల ప్రశ్నలు లేపింది. దళితుల మీద దాడులను ఆర్ధికదోపిడీ రూపంలోనే చూసే చూపు కొత్త కోణాలను వెతికింది. ఎన్టీఆర్ అప్పటి వరకు జపం చేస్తున్న తెలుగుప్రజల ఆత్మగౌరవ పోరాటం అనే పదం వన్నె కోల్పోయి దళితుల ఆత్మగౌరవ యుద్ధం వార్తల్లో, అత్యధిక ప్రజల ఆలోచనలలోనూ పతాక స్థానం చేరింది. కారంచేడు దళితులు తమ నెత్తుటితో భారత దళితోద్యమానికి దారులు వేశారు. 2008లో, ఇరవై మూడు ఏళ్ల తరవాత కారంచేడు హంతకులలో కేవలం నలుగురికి మాత్రమే సుప్రీం కోర్టులో యావజ్జీవ శిక్ష పడింది. యాభై మంది తప్పించుకోగలిగారు.

కారంచేడు గాయం మానీ మానక ముందే 1986 జులై 16న నీరుకొండ ఘటన జరిగింది. ఇక్కడ మాలలు కమ్మ కులస్తుల చేతిలోనే దాడికి గురి అయ్యారు. మన్నెం శేషయ్య అనే డెబ్భై ఏళ్ళ వృద్ధుడు మరణించాడు. జులై 25న వారి ఇళ్ళు తగలబడిపోయాయి. మంగళగిరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న నీరుకొండలో దగ్ధమై బూడిదైన మాలల గుడిసెలు కులహంకారులు దళితుల మీద అమలు జరిపిన అణచివేతకు ఒక నమూనాగా చరిత్రలో నిలిచిపోయాయి. ఇక్కడ కారణం రాజకీయమైనది. ఇతర కారణాలు ఎన్ని ఉన్నా ఎప్పటి నుండో కాంగ్రెస్సుకు ఓటర్లగా ఉన్న మాలల ఉనికిని తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం అయిన కమ్మ కులం భరించలేకపోవటమే ఈ దాడికి అసలు కారణం.

నెత్తుటి గాయం చుండూరు

2004 స్థానిక కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న దళిత మహిళలు

2004 స్థానిక కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న దళిత మహిళలు

చుండూరు విషయానికి వచ్చేసరికి ఆనాటి రాజకీయ ఆధిపత్యశక్తులు రెడ్లు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్సు కనుసన్నలతోనే మాలలపై దాడి జరిగింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళూ దాడులు చేసిన వాళ్ళూ ఒకే రక్తం అంటే ఒకే భావజాలం కలిగిన వాళ్ళు. ఇక తిరుగు లేకపోయింది. ఈ ఘటన జరిగిన 1991 నాటికి దళితులు విద్యాపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారు. అప్పటి వరకు జరిగిన దళిత పోరాటాలు, అంబేడ్కర్ ఆలోచనా విధానం వారికి ఆత్మగౌరవ చైతన్యాన్ని యిచ్చాయి. దళితవాడలు సాపేక్షికంగా ఆరోగ్యంగా, ఆత్మగౌరవంగా బతుకుతుండేవి. తమ మోచేతి నీళ్ళు తాగి బతికి గులాములు కొట్టాల్సిన దళితులు తెల్లబట్టలు కట్టుకొని హుందాగా బతకటం భరించలేక పోయారు చుండూరు రెడ్లు. ఎమ్మే చదువుతున్న రవి సినిమా హాలులో కుర్చీ తరగతిలో కూర్చోవడం సహించలేకపోయారు. అగ్రవర్ణాల వాళ్ళే ఆ తగాదాను చిలికి చిలికి గాలివాన చేశారు. ఆగస్టు ఆరున ముహూర్తం నిర్ణయించారు. 14మంది రెడ్లతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన జనార్దనరెడ్డి ప్రభుత్వంలో హోంమంత్రిగా వున్న మైసూరారెడ్డి భరోసాతో రెడ్లు చుండూరు తిరిగి వచ్చారు. ఇళ్ళల్లో ఉన్న దళితులను పోలీసులు పొలాల్లోకి తరిమారు. మల్లె, అరటి తోటలు రక్తంతో తడిసిపోయాయి. తుంగభద్ర నది శవాలను మూడు రోజులు మోసింది. చనిపోయిన ఎనిమిది మంది అంగలకుదురు రాజమోహన్, మండ్రు రమేశ్, జాలాది ముత్తయ్య, జాలాది ఇమ్మానియేలూ, మల్లెల సుబ్బారావు, జాలాది ఇసాక్, సంకురు సంసోలు, వంగనూరి శాంసన్. మండ్రు రమేశ్ అన్న మండ్రు పరిశుద్ధరావు తమ్ముడి చావు చూసి హార్ట్ అటాక్ తో చనిపోయాడు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో శవాలను పోస్ట్ మార్టం చేసిన దళిత జూనియర్ డాక్టర్ జయరాజ్ ఆ చావుల విషాదాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఈ ఘటన వెనుక అసలు క్రౌర్యం ఇంకా నగ్నంగా తరువాత బయటపడింది. చుండూరు బాధిత పోరాటకమిటీ నాయకుడూ, ఈ హత్యలకు ప్రధాన సాక్షి అయిన అనిల్ కుమార్ ను దళితవాడలోని బాధితుల శిబిరంలోనే పోలీసులు కాల్చిచంపారు. చుండూరు పోరాటం దీర్ఘకాలికంగా జరిగింది. ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా దళితులు గొప్ప పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారు. వారి మరణాలను సమాజం ఎప్పటికీ మర్చిపోరాదు అని చెప్పటానికి చనిపోయిన శవాలను ఊరి సెంటర్లో పాతిపెట్టారు. దళితులు చాలా కాలం ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఘటనకు ముందు ఎస్సైని మార్చినట్లే దళితులకు అనుకూలంగా ఉన్న మేజిస్ట్రేటులను కూడా విచారణలో మార్చారు. స్థానిక కోర్టును చుండూరులో ఏర్పాటు చేయించుకొని గెలవగలిగారు. అయితే కేసు నడుస్తుండగానే వారి తరఫున వాదిస్తున్న హైకోర్టు లాయర్లు చంద్రశేఖర్, బాలగోపాల్ మరణించారు. గత సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసును సాక్ష్యాలు సరిగా లేవని కొట్టి పారేసింది.

1998 జులై పదహారున (సరిగ్గా కారంచేడు ఘటన జరిగిన పదమూడు సంవత్సరాలకు) కర్నూలు జిల్లా వేంపెంటలో మాదిగవాడపై దాడి జరిగింది. బుడ్డా వెంగళ రెడ్డి వెనక ఉండి మాలల చేత మాదిగలపై దాడి చేయించాడు. ఈ ఘటనను రెండు నక్సలైట్ల మధ్య తగాదాగా చిత్రీకరించి సంఘటన ప్రాముఖ్యతను తగ్గించటంలో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం విజయం సాధించింది.

దళితులు- న్యాయం

1985-2015 మధ్య గడిచిన 30 సంవత్సరాల కాలం సామాన్యమైనది కాదు. ఎన్నో మార్పులు చూపించిన సుదీర్ఘమైన కాలం. ఎంతో అభివృద్ధి పరచిన చావ కలిగిన కాలం. ఎంతో సంపద పోగు చేసిన సత్తా గలిగిన కాలం. ఎన్నో అస్తిత్వ ఉద్యమాలు పురుడు పోసుకొన్ననాణ్యమైన కాలం. వర్ధమాన భారతదేశం ఎండమావుల వెంట పరుగులు పెట్టి అలసిన కాలం కూడా ఇది. రాజకీయపార్టీలు తమ కపట నాటకాల కోసం వేసుకొన్న మేకప్పు కరిగి కారుతూ.. వికృతమైన వాటి నిజరూపాలు మరింత అసహ్యంగా ప్రస్ఫుటం అయిన కాలం ఇది. ప్రజల కోసం ఏర్పాటు అయిన వ్యవస్థలు పోలీసు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ పైలా పచ్చీసుగా వ్యవహరిస్తూ పేద ప్రజల ప్రతికూల పక్షంగా ఖరారు చేసుకొన్న కాలం ఇది.ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో ఇంకో గణనీయమైన పరావర్తనం భారత జుడీషియల్ వ్యవస్థలో కాన వచ్చింది. మెజారిటీ భారత ప్రజలు అత్యంత గౌరవించి, భయపడే వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ చెప్పే న్యాయాలను భారత ప్రజలు తమ జీవనవిధానంలో నైతికానైతిక నిర్ధారణలుగా మార్చుకొంటారు. ఈ కోర్టులు చేసే వ్యాఖ్యానాలను సూక్తి ముక్తావళిగా నిత్యం మననం చేసుకొని మనసుకు ఇంకింప చేసుకొంటారు. ‘అన్యాయపు’ దెబ్బలు దాని చేతిలో నిరంతరం తింటున్నా, దాని చేతి వేళ్ళ విదిలింపులలోనైనా ఒక కొంత ధర్మాన్నీ, న్యాయాన్నీ ఒడిసి పట్టుకోవాలని ఇక్కడ అన్ని హక్కులూ తిరస్కరింపబడిన బడుగు ప్రజలు ప్రయత్నిస్తారు. కానీ భారత న్యాయానికి ధనస్వామ్య పక్షపాతం ఉంది. మరి దానికి పితృస్వామిక దురహంకారం ఉంది. ఇంకా భయపెట్టే విషయం అది కులాన్ని నిలువెల్లా పులుముకొని ఉంది. ఇక్కడ అట్టడుగు సమూహాలుగా ఉన్న దళితులకు అది అందనంత దూరంలో మడి కట్టుకొని ఉంది. ఇప్పుడది డబ్బుకూ, పరపతికీ పాదసేవ చేసే పనిలో యమ బిజీగా ఉంది. అగ్రకులాలతో అంటకాగి నిర్లజ్జగా తన నికార్సైన కుల, వర్గ స్వభావాన్ని బహిర్గతం చేసుకొంటుంది. అదే చుండూరులోనూ, కారంచేడులోనూ స్పష్టంగా కానవచ్చింది. కారంచేడు, చుండూరు ఘటనలు రెండూ ఆరు సంవత్సరాల తేడాతో జరిగాయి. తీర్పులు కూడా రెండు కేసుల్లో 23 సంవత్సరాల తరువాత నిరాశాజనకంగా వచ్చాయి. చుండూరు కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నప్పటికి అక్కడా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు.

భూవనరులపై ఆధిపత్యం అత్యవసరం

ఈ ముప్ఫై ఏళ్ల విరామంలో దళిత చైతన్యం పెరిగి ఉద్యమ సంస్కృతి దళితుల్లో విప్పారటం మంచి పరిణామం. అయితే సాధించుకోవాల్సినవి ఎన్నో మిగిలే ఉన్నాయి. అపజయాలు వెన్నాడుతున్నాయి. దళిత పక్షాలలో అనైక్యతతో బాటు జనరల్ ప్రజాస్వామిక పౌరహక్కుల ఉద్యమాల మందగింపు కూడా ఈ వెనకడుగుకు దోషిగా చూడాల్సి ఉంది. ఇది సామాజిక వైఫల్యమే తప్ప వ్యక్తుల వైఫల్యం కాదు. దళితులపై దాడులపై విచారణకు వేసిన జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారు. ఈ కమిటీ విచారణ జరిపి రిపోర్టు యిచ్చే నాటికి (1994) 5176 గ్రామాల్లో దళితులపై దాడులు జరిగినట్లు తేలింది. కంటితుడుపుగా ఈ కమిటీని వేసి ఎలాంటి నిధులు, అధికారాలు ఈ కమిటీకి ఇవ్వనప్పటికి తన సొంత ఖర్చుతో తిరిగి పున్నయ్యగారు విచారణలు జరిపారు. అత్యాచారాలకు అవకాశం ఉన్న గ్రామాలను కూడా ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం శ్రద్ధ పెట్టని కారణంగా తరువాత కాలంలో ప్యాపిలీ, లక్షింపేట ఘటనలు పునరావృత్తం అయ్యాయి. కారంచేడు ఉద్యమ ఫలితంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది.

రిజర్వేషన్లు కొంతమంది దళితుల ఆర్ధిక సామాజిక స్థాయిని పెంచగలిగినా అది అణుమాత్రమే. కోట్లాదిగా మిగిలి ఉన్నదళిత శ్రామికులకు భూమి మీద హక్కు లేనంతకాలం మార్పు పరిమాణాత్మకంగా కనిపించదు. ఆత్మగౌరవం ఆర్ధిక వనరుల మీద ఆధారపడి ఉందన్న వాస్తవం యాది నుండి తొలగకూడని సంగతి. దళితులకు భూవనరుల మీద ఆధిపత్యం కీలకమైన కర్తవ్యం. దళితుల ఆత్మగౌరవ పోరాటాలతో బాటు భూపోరాటాలు జమిలీగా సాగాలి. దళిత ఉద్యమాలు ప్రజా, విప్లవ ఉద్యమాల దన్నుతో కొనసాగించగలిగితే వైఫల్యాలను అధిగమించి దళిత శ్రామిక రాజ్యం వైపు పురోగమించవచ్చు. దళితుల క్షతగాత్ర గానాన్ని ఉద్యమ కవాతు గేయంగా మార్చుకొని పురోగామిద్దాం.

ఈ వ్యాసం ఆగస్టు 2015 మాతృకలో ప్రచురించబడింది.