ట్యాగులు

, , ,

1765798863vanajakshi-tsకృష్ణా జిల్లాలో ఒక మహిళా ఎమ్మార్వో తన ఉద్యోగపరిధిలో ఉన్న ముసునూరు మండలంలోని రంగంపేట తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలోని ఇసుకను అక్రమంగా తోలుకొని పోతున్నారని తెలిసి అడ్డు పడితే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆమెపై దగ్గర ఉండి దాడి చేయించాడు. ఆమె కుటుంబ విషయాలు ఎత్తి అవమానపరిచాడు. విన్నవించుకోవటానికి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వెళితే ‘ఇసుకను ఆపటానికి మీరు ఎందుకు వెళ్లారు? పోలీసులకు చెబితే సరిపోయేది కదా? మా ప్రభుత్వ పరువు ప్రతిపక్షాల ముందు, ప్రెస్ ముందు తీశారు’ అని ఆమెను మందలించాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కళ్ళెర్ర చేసి సుద్దులు చెబుతూ అసహనం ప్రదర్శిస్తే ఒక మహిళా ఎమ్మార్వో ఏమి మాట్లాడగలదు? అప్పటివరకు ఆవేశంతో, ఆక్రోశంతో ఎలుగెత్తిన ఆమె గొంతు ఇంక వినబడలేదు. ఆమెకు అండగా నిలబడ్డ రెవెన్యూ అసోసియేషన్ స్తబ్ధమయ్యింది.

మెసేజ్ బిగ్గరగా స్పష్టంగానే ఉంది. ‘ఒక మహిళా అధికారిణికి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటుకూ పోయిన పరువు కంటే అధికార పార్టీకి ప్రతిపక్షాలలో, ప్రెస్ లో పోయిన పరువు ఖరీదైనది’ అనే మెసేజ్. ఇంకా ఆ ఎర్రబడ్డ కళ్ళలో వనజాక్షి చూడగలిగి ఉంటే ఇంకో మెసేజ్ కూడా కనబడి ఉండేది. ‘ప్రభుత్వ పనులకు నువ్వు అడ్డం వస్తే గాయబడతావు. అలా కాకుండా ప్రభుత్వ కనుసన్నలలో నడుచుకొంటే ఎంత నేరం చేసినా రక్షించబడతావు.’ అందుకే దాడి చేయించిన ప్రభాకర్ మరునాడు టీవీలో దర్జాగా సూక్తిముక్తావళి చెప్పగలిగాడు.

అంతకు వారం ముందు ఇదే ప్రభుత్వం ప్రగతిశీల మహిళాసంఘానికి ఇలాంటి మెసేజే పంపింది. కొత్త రాజధాని ప్రాంతంలో భూమిలేని నిరుపేద మహిళా కూలీలను రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా కూడగట్టి సదరు ‘ప్రభుత్వానికి’ చికాకు కలిగించిన పీవోడబ్ల్యూకి మద్యం లాటరీల రోజున ముహూర్తం పెట్టారు. ఇక్కడ ప్రభుత్వం పోలీసు యూనిఫార్మ్ లో సిఐ వెంకన్న చౌదరి రూపంలో రంగప్రవేశం చేసింది. పీవోడబ్ల్యూ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి పద్మ పుక్కిట్లోనుంచి రక్తం పడింది. నేరం చేసి వెంకన్నచౌదరి హీరో అయ్యాడు. ఫిర్యాదు స్వీకరించి కూడా విచారణ పేరుతో రోజులు వెళ్ళమార్చుతూ వెంకన్న చౌదరిని భుజం తట్టి గౌరవిస్తుంది పోలీసు వ్యవస్థా, దాని పైన వున్న ప్రభుత్వ వ్యవస్థ కూడా.

ప్రగతిశీల మహిళా సంఘం తన కార్యాచరణ వలన ప్రభుత్వానికి కోపం తెప్పించింది సరే. తన డ్యూటీ తను చేసుకొంటున్న వనజాక్షి ప్రభుత్వానికి ఎందుకు కోపం తెప్పించింది? డ్యూటీలో భాగంగా మండల మేజిస్ట్రేట్ అక్కడకి పోవటం తప్పుగా ఎత్తి చూపిన సియం గారికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వంధి మాగధులతో అక్కడ ఉండటం ఏమాత్రం కోపం తెప్పించకపోవడం వింత కాదు. ఇప్పటికే 37 కేసులు మోస్తున్న ప్రభాకర్ ను వదిలేసి ‘అంతా నీ వల్లనే’ అని వనజాక్షిని చంద్రబాబు అనటం కూడా ఆశ్చర్యం కలిగించదు. రాష్ట్ర కేబినెట్ సమావేశమయ్యి వనజాక్షి మీద వేలు చూపించడం కూడా విభ్రాంతి కలిగించదు.

వనజాక్షి చేసిన తప్పులు ఒకటా రెండా! ఇసుక మాఫియాను అడ్డగించటం ఒక తప్పు. చూసీ చూడనట్లు పోకుండా ఇసుక రీచ్ ని కాపాడాలని త్రికరణ శుద్ధిగా అనుకోవడం రెండో తప్పు. రెండు జిల్లాల సర్వేయర్లు వచ్చి కొలతలు కొలిసిందాక ఆగమని అమాయకంగా ఆదేశించటమే కాక అడ్డం పడటం ఆమె చేసిన మూడో తప్పు. డ్వాక్రా మహిళలకు ఇసుక బట్వాడా ఇచ్చినపుడే దాని వెనుక పరమార్ధం గ్రహించకపోవడమే ఆమె చేసిన అసలు తప్పు. గతంలో ఇదే ఇసుక మాఫియా విషయంలో ప్రాణాలు కూడా కోల్పోయిన కర్ణాటక కేడర్ ఐ‌ఏ‌ఎస్ ఆఫీసర్ రవి కుమార్ గురించి ఆమె తెలిసుకోక పోవటం ఇంకో తప్పు. మైనింగ్ మాఫియా చేతిలో మధ్యప్రదేశ్ లో హతుడైన ఐపియస్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ సింగ్ గురించి ఆమె వినకపోవటం చెప్పలేనంత తప్పు. ఎమ్మార్వో వనజాక్షికి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ అవమానం కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో హత్యలకు కొనసాగింపుగా జరిగిన ప్రాధమిక హెచ్చరిక. వనజాక్షికి మాత్రమే కాదు కొత్త రాష్ట్రంలో బ్యూరోక్రాట్స్ అందరికీ ఇది మొదటి పాఠం. మనసెరిగి మసలమని మూసైగ్గా చేసిన హుంకరింపు.

భూగర్భంలో ఉన్న ఖనిజాలనూ, నదీ నదాలనూ, కొండాకోనలనూ, విశాల భూఖండాలనూ కార్పొరేట్ల పరం చేసి ఇసుకను మాత్రం తన ఎన్నికల గెలుపుకు చేయూతనిచ్చిన రాజకీయనాయకులకు అప్పచెప్పింది అధికార తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా మహిళలను కవచంగా వాడుకొమ్మని కూడా చెప్పింది. ఇసుక ఇక ఇల్లు కట్టుకోవటానికి వాడే ఉపయోగ వస్తువు కానే కాదు. ఇసుక ఇక్కడ బంగారం. ఇసుక రీచులు బంగారపు కోడిగుడ్లు పెట్టే గనులు. వాటి మీద జరిగే వ్యాపారంలో మానవ హృదయం ఉండదు. స్త్రీ పురుష విచక్షణ అసలే ఉండదు. అందుకే ‘ఈడ్చి పారేయ్యండి’ అనే కేక ఆ పరిసరాల్లో ఆ రోజు ప్రతిధ్వనించింది.

ఈ సంఘటన యావత్తులో డ్వాక్రా మహిళలు పావులుగా ఉపయోగపడటం ఇంకో విషాదం. రాజ్యం తాను జరపదల్చుకొన్న చర్యలకు తన అంగాలైన పోలీసు, బ్యూరోక్రాట్లు చాలటం లేదు. తన భావజాల వ్యాప్తికి కొన్ని పత్రికలనూ, చానళ్ళనూ గుప్పిట్లో పెట్టుకొని స్వప్రచారాన్ని సృజనాత్మకంగా చేయించుకోవటం సంతృప్తి కలిగించటం లేదు. వనజాక్షి మీద దాడి జరిగిన మరుసటి రోజు ఒక పత్రిక ఆ దాడిని డ్వాక్రా మహిళలకు, ఎమ్మార్వోకు మధ్య జరిగిన దాడిగా చిత్రించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ చాలక రౌడీలను, గూండాలను రంగంలోకి దించుతోంది. అయితే తన నేర స్వభావాన్ని కప్పి పుచ్చుకోవటానికి సమాజామోదయోగ్యమైన మార్గాలు కూడా వెదుకుతుంది. దానిలో భాగంగానే డ్వాక్రా మహిళలను వాడుకొంటోంది. గతంలో వీళ్ళు ప్రభుత్వ ప్రచార మీటింగులలో కుర్చీలు నింపడానికి భత్యం లేని సైన్యం వలె ఉపయోగపడేవాళ్లు. ఇప్పుడు అదనంగా వాళ్ళను రాజ్యం తన నేరవ్యవస్థకు పాలికాపులుగా ఉపయోగిస్తోంది. మద్యం టెండర్లు వేసిన వాళ్ళలో మహిళల శాతాన్ని పదే పదే చెబుతూ మద్యానికి మహిళల ఆమోదం ఉందని చెప్పినట్లుగానే ఉంటుంది ఇది. మద్యం టెండర్లు వేసే మహిళల వెనుకా, మహిళా ఎమ్మార్వోను అడ్డగించిన మహిళల వెనుకా ఉన్న పురుషాధిక్యలోకాన్ని కళ్లున్న ప్రతి ఒక్కరూ గ్రహించగలరు. మహిళలు ఇంకా అన్నిరకాల ఆధిక్యాలతో కునారిల్లుతున్నఈ నేరమయ వ్యవస్థలో భాగంగానే ఉన్నారని కనీస తెలివిడి ఉన్న వారికి కూడా అర్ధం అవుతుంది.

ప్రగతిశీల మహిళా సంఘానికి ప్రజాసంఘాలూ, మేధావులూ అండగా నిలిచారు. ప్రజా పోరాటం, న్యాయపోరాటం కొనసాగుతున్నాయి. ఎమ్మార్వో వనజాక్షికి కూడా అదే మద్దతు కూడగట్టి ఆమె మొదట ప్రదర్శించిన నిజాయితీకీ, సాహసానికీ నైతిక స్థైర్యాన్ని అందించాల్సిన అవసరం ఉద్యోగ సంఘాలకు ఉంది. ఎందుకంటే వనజాక్షిపై దాడి ఒక చెదురుమదురు ఘటన కాదు. కొత్త రాష్ట్ర నిర్మాణంలో జరగబోతున్న విధ్వంసంలో ఉద్యోగస్తులకు ప్రమాద ఘంటికకులు మోగుతున్నాయి. వారు ఎదుర్కొబోతున్న వత్తిడికి ఈ ఘటన మొదటి అంకం మాత్రమే.

ఈ వ్యాసం ఆగస్టు 2015 మాతృకలో సంపాదకీయంగా ప్రచురించబడింది.