ట్యాగులు

,

women-abstract-black-sketch-alex-cherry-1920x1080-wallpaper_www-artwallpaperhi-com_79

(ఆంధ్రజ్యోతిలో జూన్ 21,2015న వచ్చిన నా కధ )

చంఢీఘర్ నిండా గులాబీలు, చామంతులు, గుల్ మెహర్లు, బంతిపూలు విరగబూసిన కాలమది. నిట్టర్ లో పై అంతస్తులో వున్న క్లాసు రూములో తలుపులు కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి. ఎయిర్ కన్డీషనర్ వేడిగాలులు వీస్తున్నా చలి లోపలినుండి వణికిస్తూ నా పళ్ళు కొట్టుకొంటున్నాయి. రెండు ఇన్నర్స్, పైన జాకెట్ వేసుకొన్నా ప్రయోజనం కనబడటం లేదు. స్వప్న మేడం గొంతు తియ్యగా వినిపిస్తుంది. ముందు వరుసలో కూర్చుని, తల వంచుకొని వింటూ నోట్సు రాసుకొంటున్నాను. ఆమె గొంతు ఆగిపోయినట్లు అనిపిస్తే తల ఎత్తి చూశాను. కిటికీకి ఆనుకొని ఎటో చూస్తుంది ఆమె. అప్పటికే క్లాస్ లో మిగిలిన వాళ్ళు ఆమె వైపు కుతూహలంగా చూస్తున్నారు. ఆలోచిస్తూ ఆమె మా వైపు తల తిప్పింది. మొహం పాలిపోయి ఉంది. పెదాలు వణకుతున్నాయి. చలికైతే కాదని ఖచ్చితంగా అర్ధం అవుతుంది.

హటాత్తుగా “నాకో ఇల్లు కావాలి” అన్నది.

అందరు చెవులు రిక్కించారు. “మీలో డే స్కాలర్స్ ఎవరు?” రెండో ప్రశ్న. ఎప్పుడూ చేతిలో హెల్మెట్టు, వీపు మీద లాప్ టాప్ తో కనిపించే నవీన్ చెయ్యి ఎత్తాడు. “నాకో ఇల్లు చూసి పెడతావా!” అడిగింది. నవీన్ మారు మాట్లాడకుండా లాప్ టాప్ తెరిచి టకటకా కొట్టాడు. “ఇరవై రెండో సెక్టారులో టూ బెడ్ రూం ఆక్యుపేషన్లు ఉన్నాయి మేడమ్.”

“వెళదాం పద” చక చక బయటకు నడిచింది.

నవీన్ బండి తాళాలు వెతుక్కొని మా వైపు తిరిగి తమాషాగా కళ్ళెగరేసి ఆమె వెనకాల పరిగెత్తాడు.

“ఇక క్లాసు లేదు“ రిచా కళ్ళు సగం మూసి నవ్వి మఫ్లర్ మెడకు బిగించి బయటికి గెంతింది.

అశాంతి మొహామంతా అలుముకొన్న స్వప్న మేడమ్ ముఖాన్ని తలుచుకొంటూ నేను గది నుండి చివరగా బయటకు నడిచాను.

నేను వచ్చిన కొత్తల్లో మొహం నేలపై దిగేసుకొని నాకు మొదటి సారి కనిపించిన స్వప్న మేడమ్ గుర్తుకు వచ్చింది. విశాలమైన ఆ రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఎండిన మానులు – తాము వదిలేసిన ఆకులు నడిచి పోయే వాళ్ళ కాళ్ళ క్రింద పొడి అవుతున్న చప్పుడు వినదలుచుకోనట్లు, కొత్త ఆకులు ముఖానికి తొడుక్కొని ఆకాశం కేసి తెరిపారా చూస్తున్నాయి. అప్పుడు ఆ ఒంటరి దారిలో మేమిద్దరమే ఉన్నాము. దగ్గరకు రాగానే ఆమె తల ఎత్తింది. ఆ మొహంలో ఈ లోకంతో సంబంధం లేని నిరాసక్తత, పరధ్యానం… ఇంకా ఏవో నాకు తెలియనితనాలు కనిపించాయి. ముఖం మీద ఒక పాయ వెంట్రుకలు తెల్లదనాన్ని కొత్తగా తెచ్చుకొని మెరుస్తున్నాయి. చండీఘర్ లో కనిపించే తెల్ల చర్మాలలాగా కాకుండా ఆమె చామనచాయరంగుతో తేటగా ఉంది. పైగా చీర కట్టుకొని ఉంది. అక్కడ చీరలు చాల అరుదుగా కట్టుకొంటారు. కుతూహలంగా ఆమెను చూశాను. ఆమె నన్ను గుర్తించినట్లు నాకు అనిపించలేదు.

తరువాత తెలిసింది. స్వప్న మేడమ్, పట్నాయక్ సర్ భార్య భర్తలు. ఇద్దరూ మా డిపార్ట్మెంటులో ప్రొఫెసర్లు. నిట్టర్ ఆవరణలోనే క్వార్టర్స్ లో ఉంటారు. పట్నాయక్ గారిని ఒకసారి కాలేజీ పార్టీలో కలిశాను. స్వప్నగారి దగ్గర పిహెచ్డీ చేస్తున్న కృష్ణమోహన్ పరిచయం చేశాడు “మా ఆంధ్ర నుండి వచ్చింది ఎంఇకి” అంటూ. “ఓహ్, క్యుఐపీనా?” అడిగారు. తలూపాను. పొడవు చేతుల చొక్కా దాని మీద హాఫ్ స్వెట్టరు వేసుకొని చాలా సాదాగా ఉన్నాడు. అప్పుడే వాళ్ళ పిల్లల్ని కూడా చూశాను. పాప బుద్దిగా కూర్చొని ఉంది. బాబు సోఫాలు ఎక్కి తొక్కుతున్నాడు. మేడమ్ కోసం వెదికాను. “ఆమె రాలేదు. తలనొప్పట” కృష్ణ మోహన్ చెప్పాడు. “పట్నాయక్ గారు నాన్ కమర్షియల్ ఏంటేనా డిజైన్ చేశాడు తెలుసా?” అడిగాడు. “గొప్ప బుర్ర ఆయనది. ఆ ఏంటేనా ఫార్ములా ఆయన అమ్మబోవటం లేదు. మన కాంపసులో దాన్నే ఇంటర్నెట్ కోసం ప్రస్తుతం వాడుతున్నారు.”

పట్నాయక్ సార్ బట్టల్లో, నడతలో చాలా సింప్లిసిటీ కనబడుతుంది. “ఎంత మొద్దు స్టూడెంట్ చేతనయినా పీహెచ్డీ పూర్తి చేయించగలడు ఆయన” కొద్దిగా బాధ ధ్వనించింది కృష్ణమోహన్ గొంతులో, బహుశ ఆయన స్టూడెంట్ అయ్యే అవకాశం పోయిందనేమో.

రూముకి తిరిగి వస్తూ చూశాను. ప్రధాన భవనం మీద ఏంటేనా గర్వంగా నవ్వుతోంది. కాంపస్ లో ఎప్పుడూ ఇంటర్నెట్ కు అంతరాయం ఉండదు. ‘ఎంత మంది భావోద్వేగాలను ఇది కలపోసిందో! ఎన్ని వేవ్ లెంగ్త్ లను ఇది కలిపిందో!’ అనిపించింది.

….

మేట్ లాబ్ లో సహాయం కోసం నవీన్ పక్కన చేరాను. నవీన్ కి చాలా డిమాండ్ ఉంది. ఎప్పుడూ అందరికి సాయం చేస్తూ బిజీ బిజీగా ఉంటాడు. కానీ ఆ రోజెందుకో డల్లుగా ఉన్నాడు.

“ఈ మధ్య నిట్టర్ లో జరిగిన విషయాలు మీకు తెలుస్తున్నాయా?” అడిగాడు.

“లేదే?”

“ఆ రోజు స్వప్న మేడమ్కి ఇల్లు చూశాను కదా. ఆ మరుసటి రోజే ఆమె అందులోకి వెళ్ళిపోయారు” ఇంకా చెప్పబోతున్నాడు.

“ఒక్కరేనా?”
“అవును ఒక్కరే. పిల్లలు కూడా ఆమెతో వెళ్ళలేదు.”

“వాళ్ళిద్దరిదీ ప్రేమ వివాహం తెలుసా మీకు. మేడమ్ ఆయన శిష్యురాలు. బెంగాలి” చెప్పాడు.

“ఇంట్లో నుండి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమిటి?” ఆలోచిస్తూ అడిగాను.

“ఒక బాబా కారణం అట. ప్రొఫెసర్ పట్నాయక్ హేతువాది. మేడమ్ ఆ బాబా దగ్గరకు వెళ్ళటం, ఆయన ఇంటికి రావటం సర్ కు ఇష్టం లేదట.”

“ఈ బాబాలు కాపురాలు కూలుస్తున్నారు” అంతా వింటున్న గిన్నీ కామెంట్ చేసింది పక్క సిస్టమ్ నుండి.

“ఇప్పుడు ఈ విషయం నా చావుకి వచ్చింది. మేడమ్ వెళ్ళి ఆరు నెలలు అయ్యింది కదా. ఆమె వేరుగా ఉంటోందని పట్నాయక్ సర్ మన డైరెక్టర్ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లున్నారు. ఇల్లు చూసినందుకు నన్ను సాక్ష్యానికి పిలిచారు ఈ రోజు. ఆ ఇంటి అడ్రెస్ నన్ను అడిగి తీసుకొన్నారు. విడాకుల నోటీసు పంపుతారట. ఇదంతా నాకు చాలా బాధ కలిగిస్తోంది. మీరు చాలా జంటలను చూసి ఉంటారు. ఇలాంటి విషయాలకే విడిపోవటం గురించి ఏమి చెబుతారు?” అడిగాడు నవీన్.

“నేను జడ్జినా?” నవ్వాను.

“అదికాదు. మీరొక వివేకవంతమైన సమాజం గురించి చెబుతుంటారు (యు ఆల్వేస్ టెల్ అబౌట్ ఎ సెన్సిబుల్ సొసైటీ). ఈ ప్రశ్నకు మీ సమాజం ఏమి సమాధానం చెబుతుంది?” ఆ బ్రహ్మచారి నన్ను వదలలేదు. “ఇప్పుడా సమాజం ఉందా? సరే, ఉందని ఊహించి నీ ప్రశ్నకు నేను సమాధానం త్వరలో చెబుతాను.” అప్పటికి తప్పించుకొని నా బండ లాప్ టాప్ చేత్తో మోసుకొని బయటికి వచ్చాను.

కారిడార్లో నడుస్తుంటే డిపార్ట్మెంట్ క్లర్కు కరంజీత్ మేడమ్ పిలిచింది. హైదారాబాద్ ముత్యాలు అంటే చాలా ఇష్టం ఆమెకు. ఆంధ్రలో ముత్యాలు రోడ్లమీద రాసులు పోసి అమ్ముతారనుకొంటుంది. పిచ్చాపాటి మాట్లాడి “స్వప్న మేడమ్ విషయం విన్నారా?” గొంతు తగ్గించి అడిగింది. విన్నానన్నట్లు తల ఊపాను.

‘హు!’ అని చుట్టూ చూసి “ ఆడవాళ్ళకు పదహారేళ్ళ వయసు ఎంత ప్రమాదకరమో, నలభై ఏళ్ళ వయసు కూడా అంతే! హార్మోనులు తమాషా చేస్తాయి. బాబా అంటే గడ్డాలు మీసాలు ఉన్నవాడు కాదు. శుభ్రంగా జీన్స్ వేసుకొని తిరుగుతాడు ఇంతలావు బుగ్గలతో. ఈ పట్నాయక్కి అకడమిక్ గొడవలు తప్ప ఏమీ తెలియవు” పళ్ళు కనిపిస్తూ నవ్వింది. గొంతు తగ్గించి “స్వప్న మేడమ్ రిజైన్ చేసి వెళ్ళిపోతుందంట” ఇంకా ఏదో చెప్పబోతుంది. స్వప్న మేడమ్ హడావుడిగా లోపలికి వచ్చింది. రోజారంగు చీర మీద ముదురు ఎరుపు డిజైనుతో ప్రత్యేకంగా ఉంది ఆ రోజు ఆమె. ఈ మధ్య కాలంలో ఆమెను ఎవరూ అలా చూడలేదు. “వావ్! చీర భలే ఉంది” మెచ్చుకొంది కరంజీత్. “ఎటూ వెళ్లిపోతున్నాను కదా! ఉన్న చీరలు అన్నీ కట్టేసుకొంటున్నాను” సంజాయిషీ చెబుతున్నట్లు చెప్పింది స్వప్న మేడమ్. ఆమె వెళుతూ కనుకొనల నుండి నన్ను చూసినట్లు అనిపించింది.

….

ఫస్ట్ లెక్చర్ అయ్యాక రూముకు వెళ్ళి కాఫీ తాగి మళ్ళీ క్లాసుకు వస్తున్నాను. “స్వప్న మేడమ్ కలవమన్నారు” మెట్ల మీద ఎదురయ్యి సాండీ చెప్పాడు. ఆదరా బాదరా పరిగెత్తాను. అసలే నా యాభై మార్కులు ఆమె చేతిలో ఉన్నాయి. ఆమె తన గదిలో తల పట్టుకొని ఉంది. చేతిలో నా పేపర్ ఉంది.

“మీ పేపర్ కరెక్షన్ చేయాలంటే తలనొప్పి వస్తుంది. క్వశ్చన్ నంబర్ వేయక పోతే ఎలా? మీరూ లెక్చరరే కదా? మా ఇబ్బంది మీకు తెలియదా?” సమాధానం చెప్పటం మంచిది కాదని తల ఊపి ఒప్పుకొన్నట్లు చేశాను.

ఒక్క క్షణం ఆగి “కూర్చోండి. మీది ఆంధ్ర అట కదా. ఎంత మంది పిల్లలు?” అని అడుగుతూనే దిగాలుగా మారిపోయింది.

“మా పాప బోర్డ్ పరీక్షలు రాయబోతుంది.” అని చెప్పింది.

“ఇప్పుడే మా కొలీగ్ నా మూడ్ ఆఫ్ చేసి వెళ్ళాడు. రాజీ పడమని చెబుతున్నాడు. మా ఇద్దరి సంగతి మీకు తెలిసే ఉంటుంది కదా?” అడిగింది. నేను తల ఆడించాను. నిన్న కరంజీత్ గదిలో నన్ను చూసి ఏదో గ్రహించినట్లుంది.

“మీ సర్ నా మీద కోర్ట్ లో కేసు ఫైల్ చేశాడు. నేను కూడా పోలీసు స్టేషనులో కేసు పెట్టాను.”

నేను కొద్దిగా ఇబ్బందిగా కదిలాను.

“మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను మిమ్మల్ని కలవటానికి వస్తాను.”

“రూమ్ నం 318. పీజీ హాస్టల్”

“ఒకే వస్తాను. రానా?” అడిగింది.

“తప్పకుండా రండి”

క్వశ్చన్ నంబరు వేయలేదని నన్ను పిలవటం ఒక వంకని అర్ధం అయ్యింది.

….

“వావ్. చాలా బాగుంది మీ రూమ్. చాలా టేస్టుంది మీకు. ఇంకో ఇల్లు లాగానే ఉంది. ఇంకా ఒక సంవత్సరమే కదా మీరు ఉండేది? తాత్కాలిక ఇల్లు మీకిది. అన్నట్లు మీకూ ఇంకో ఇల్లు కావాలని అనిపించిందా?” అడుగుతూ బాల్కానిలోకి వెళ్లింది.

ఆమె ప్రశ్నకు నిశ్చేష్ఠను అయ్యాను. ఒక్క క్షణం తరువాత తేరుకొని ఆమె కోసం చూశాను. కాంపసును ఆనుకొని ఉన్న తోటలో ఎర్ర కలువలు విరగబూసి ఉన్నాయి. పేరు తెలియని పక్షులు ఆ తోట నిండా పాటలు పాడే సమయం అది. ఎవరినైనా నిలవేస్తుంది ఆ దృశ్యం. కాని ఆమె ఒక క్షణం అలా నిల్చోని లోపలికి వచ్చేసింది.

బెడ్ మీద కూలబడి చెప్పటానికే వచ్చినట్లు మొదలు పెట్టింది. “పెళ్ళి అయిన ఆరు నెలల నుండే విడాకులు మాట ఆయన నోటి నుండి వచ్చేది. చిన్న పని నేను చేసింది నచ్చక పోయినా ‘విడాకులు’ అనేవాడు. నన్ను బెదిరించటానికి అనేవాడేమో, నాకు చాలా భయం వేసేది అప్పట్లో ఆ మాట వింటుంటే. మీకు తెలుసా? ఒక రోజు ‘స్వప్నా! ఒక సంతకం పెట్టి పో’ అని అరిచాడు. నేను తడి చేతులు కొంగుతో తుడుచుకొంటూ వచ్చి సంతకం చేయబోయి ఆగి చూశాను. నా పేరు మీద ఉన్న ఇల్లు అది. ‘ఇప్పుడీ బదిలి ఎందుకు?’ అని అడిగాను. ‘ఇద్దరం పొదుపు చేసి కొన్నదేగా? నా పేరు మీదనయితే ఏ అప్పు తీసుకోవటానికి అయినా సులభంగా ఉంటుంది.’ అన్నాడు. మారు మాట్లాడకుండా సంతకం పెట్టాను.”

ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతోంది ఆమె.

“ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదు. నిజానికి నాకూ ఉండేది కాదు. నేను పనుల్లో కొద్దిగా నెమ్మది. నా చిన్న చిన్న ఆలశ్యాలకు ఛీత్కారాలు, విసుగులు, కోప ప్రదర్శనలు, వస్తువులు విసిరి కొట్టటాలు … ఎప్పుడు నేను ఆధ్యాత్మికత వైపు మళ్ళానో నాకు గుర్తు లేదు. నా సహనాన్ని ఇంకా పెంచుతుందని అనుకొన్నానేమో. నా భక్తి నచ్చక పోవటం వేరు. ఆ విషయం నాతో తేల్చుకోకుండా నా కోసం వచ్చే మనిషిని అవమానం చేశాడు చాలా సార్లు. ఆ ఇల్లు నాది కాదని అనిపించేది. తన ప్రయోగాలతో, రీసర్చ్ స్కాలర్స్ తో చర్చలతో ఇల్లంతా హడావుడిగా ఉండేది. నేనేనాడు అడ్డం పెట్టలేదు. ఆదివారం సాయంకాలాలు చెదిరిపోయిన యింటిని సర్దుకొంటూ, చిమ్ముకొంటూ .. నిస్సారంగా అనిపించేది జీవితం …”

“నా కెరీర్ అంతా ఆయనే తీర్చి దిద్దానని అందరికీ చెబుతాడు. ఆర్యీసీ రూర్కెలాలో ఎంటెక్ చేశాను నేను. నా తల్లిదండ్రులు నన్ను విదేశాలకు పంపాలని అనుకొన్నారు. ఒరిస్సా పీపుల్ అంటే వాళ్ళకు సదభిప్రాయం లేదు. నేను పట్టుబట్టాను. ఈయన అప్పుడు అక్కడికి విజిటింగ్ ప్రొఫెసరుగా వచ్చేవాడు. పెళ్ళాయ్యాక ఇక్కడికి వచ్చి నేను పిహెచ్డీ మొదలుపెట్టి ఉద్యోగం చేస్తూనే మూడేళ్లలో పూర్తి చేశాను.“

“అన్నిటికంటే వింతగా నా కేరెక్టర్ గురించి చెడు ప్రచారం చేస్తున్నాడట. నిప్పులా పెరిగాను. పన్నెండేళ్ల వయసు నుండే చీరలు ఇష్టంగా కట్టుకొనే దాన్ని నేను. మా అమ్మ పెద్దదానిలాగా కనిపిస్తున్నానని వద్దనేది కానీ బలవంతం చేసేది కాదు. గొప్ప సంస్కారం గల కుటుంబం మాది. పిల్లల అభిప్రాయాలకు విలువ నిచ్చారు. తనవి తప్ప ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వని చోట నేను పదిహేను సంవత్సరాలు కాపురం చేశాను. ఇప్పుడికి చేయలేక విడిపోవాలనుకొంటున్నాను. ఈ కారణాలు సరిపోవా నేనా యిల్లు వదిలిపెట్టటానికి?” ప్రశ్నించింది.

నవీన్ ప్రశ్న గుర్తుకు వచ్చింది నాకు. వివేకవంతమైన సమాజం …!

“పిల్లలూ …?” మనసులో ప్రశ్న బయటకు రాలేదు. అది సందర్భం కాదని అనిపించిందేమో నాకు. లేక ఆమె చేతిలో ఉన్న నా మార్కుల గురించి ఆలోచించానేమో. మరెందుకో అడగలేకపోయాను.

కిచెన్ లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చాను. బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. రెప్పల మీద నుండి కనుపాపల అస్థిర కదలికలు కనిపిస్తున్నాయి. రంగు పోయిన పాత కాటను డ్రస్సు. ఒక్కోసారి ఒక్కో మూడ్ లో డ్రస్ అవుతుందనుకొంటాను. ఆమెను కదిలించాలని అనిపించలేదు. కొద్ది సేపటి తరువాత తనే లేచి వెళ్ళి పోయింది.

….

“పట్నాయక్ గొప్ప సంస్కారి. తన తప్పును అంగీకరిస్తున్నాడు. ఆమె నడవడిక గురించి మాట్లాడటం తప్పేనని అంగీకరిస్తున్నాడు. ఆమె వెనక్కి రావాలని అడుగుతున్నాడు.“ వినయ్ వధేర సూప్ చప్పరిస్తూ అన్నాడు. ఆయన మా కాంపసులో ఒక సీనియర్ టెక్నీషియన్. కళాకారుడు. ఆ రాత్రి నేను ఆ కుటుంబానికి అతిధిని. ఉష కూరలు వేడి చేసుకొని వచ్చింది. కాశ్మీరు బార్డర్ నుండి ఈ వధేర్లు చాలా కాలం క్రితం చండీఘర్ వచ్చేశారు. దక్షిణ భారతదేశ సంస్కృతి పట్ల ఆ దంపతులకున్న మోజు వారిని నాకు దగ్గర చేసింది.

“మిసెస్ పట్నాయక్ చాలా ఆత్మాభిమానం కలది. ఆమె మీద వేసిన నిందను భరించలేక పోయి ఉంటుంది. ఏదో కోపంతో ఇల్లు వదిలిపెట్టిన మనిషిని మిస్టర్ పట్నాయక్ పూర్తిగా దూరం చేసుకొన్నాడు.” ఉష సూప్ కి తోడుగా తయారు చేసిన స్నాక్స్ నా ముందుకు జరిపింది.

“పట్నాయక్ కూడా చాలా నెమ్మదైన మనిషి. ఎదుటి మనుషులు ఎంత చిన్నవారైనా కూర్చోబెట్టి సాయం చేస్తారు” వినయ్ వధేరా చురుగ్గా చూస్తూ అన్నాడు. అంగీకరిస్తూ తల ఊపాను., వచ్చిన కొత్తల్లో ఆయన పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకొంటూ.

“అయితే కుటుంబంలో చాలా కఠినంగా ఉంటారు. ఆయన పెరిగిన వాతావరణం అది. కుటుంబం విచ్ఛిన్నమవటానికి ఆయన ఒక్కడే కారణం ఎలా అవుతాడు? స్వప్న కొద్దిగా సహనం చూపించవచ్చు కదా?” నన్ను ఉద్దేశించి అడుగుతున్నట్లే అడిగాడు. నా ‘వివేకవంతమైన సమాజం’ పాత్ర గుర్తుకు వచ్చింది.

గొంతు సవరించుకొని “పిల్లలు…?” అడిగాను.

“పట్నాయక్ ఇవ్వటానికి సిద్ధంగా లేడు. ఈ మానసిక పరిస్థితిలో స్వప్న స్వీకరించటానికి సిద్దంగా కూడా లేదు. మొన్న మనవాళ్ళు చొరవ చేసి ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరిని ఒక కామన్ ఫ్రెండ్ ఇంటికి పిలిచారు. స్వప్నను చూడగానే వాళ్ళ పాప ఏడుస్తూ వెళ్ళి ఆమెను చుట్టుకొంది. నేను స్వప్న వంకనే చూస్తున్నాను ఎలా స్పందిస్తుందోనని. ఆమె కళ్ళు ధారలు కట్టాయి. కూతురి తల నిమిరింది చాలా సేపు. కానీ కాసేపటికి తల నుండి మెల్లిగా చేతులు తీసేసింది” వినయ్ వధేర చేతుల వేళ్ళు తిప్పుతూ నటించి చూపించాడు. ‘ట్రైన్ టూ పాకిస్తాన్’ సినిమాలో నటించాడు అతను.

“మరి ఏమి చేస్తుంది? పిల్లల్ని అడ్డం పెట్టి ఆమెను లొంగతీయటానికి ప్రయత్నిస్తున్నాడు పట్నాయక్. ఆమె అడుగుతున్న డబ్బు ఇవ్వటం ఇష్టం లేక, ఆమె వెనక్కి రావాలనుకొంటున్నాడు కానీ ఆమె మీద ప్రేమతో కాదు” ఉష కోపంగా అన్నది. తొంబ్భై ఏళ్ళ మామగారు, ఎనభై ఐదు ఏళ్ళ అత్తగారికి సేవలు చేయటానికి ఉష తన ప్రైవేటు ఉద్యోగం ఇష్టంగానే వదిలేసింది.

“ఎంత అడుగుతున్నారు స్వప్న మేడమ్?” అడిగాను.

“కోటిన్నర” కూల్ గా చెప్పాడు వధేర.

“అవును తప్పేముంది. ఆమె ఆస్తులన్నీ ఆయన తీసేసుకొన్నాడు. విడాకులు యిచ్చి ఆమె ఇక్కడ పని చేయలేదు. ఆమె బతకాలి కదా? ఇక్కడ పట్నాయక్ గారు పెళ్ళికి రెడీ అవుతున్నారు” వ్యంగ్యంగా అంది ఉష.

“పిల్లలు …?” నేను గొణిగాను.

….

సామాను పేకింగ్ అయిపోయింది. కింద సైనీ పెద్ద ఆటోతో నన్నూ, సామాన్నూ రైల్వే స్టేషన్ కి తీసుకొని వెళ్ళటానికి ఎదురు చూస్తున్నాడు. న్యూ డిల్లీకి వెళ్ళే కాల్క ఎక్స్ ప్రెస్ కి నా టికెట్ బుక్ అయ్యింది. బయటికి వస్తూ ఒక్కసారి రూము వెనక్కి తిరిగి చూసుకొన్నాను. నేను తిరిగి చూడాల్సింది ఇంకొకటి మిగిలిపోయిందనిపించింది. చక చక మెట్లు దిగి సైనీని ఆగమని చెప్పి డిపార్ట్మెంటుకు వెళ్ళాను. నిర్మానుషమైన కారిడార్లో నడుస్తుంటే ఏదో సంశయం నన్ను వెనక్కి లాగుతోంది. స్వప్న మేడమ్ రూము నుండి భక్తి సంగీతం వినిపిస్తోంది. తలుపు తీయగానే అగరుబత్తి వాసనలు.

బిస్కెట్టు రంగు చీరలో, మెడలో రుద్రాక్షమాలతో, నుదుటి మీద తెల్లటి బొట్టుతో యోగినిలాగా సీటులో కూర్చొని ఉంది. ఆమె నా వైపు చూసిన చూపు నన్ను ఉలిక్కి పడేటట్లు చేసింది.

“మా ఆంధ్రకు వెళ్లిపోతున్నాను మేడమ్!” చెప్పాను.

“బెస్ట్ ఆఫ్ లక్” ఇక వెళ్ళవచ్చు అన్నట్లు చెప్పి కంప్యూటర్ మానిటర్ వైపు తల తిప్పేసింది. కాసేపు ఆమె మళ్ళీ నన్ను చూస్తుందేమో అని ఎదురు చూశాను. ఆమె కావాలనే తల తిప్పటం లేదని అర్ధం కావటానికి ఎక్కువ టైమ్ పట్టలేదు.

“మిమ్మల్ని ఒక్కసారి హత్తుకోవచ్చా?” (కెన్ ఐ హగ్ యూ?) అడిగాను.

“వద్దు” కఠినంగా అంది. “మేము దీక్షలో ఉన్నాము. ఎవరిని తాకము” అన్నది కొద్ది సేపటి తరువాత సర్దుకొని.

ఏమి చేయలేక వెనక్కి తిరిగాను. నేను తలుపు దగ్గరకు వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది.

“నువ్వు మనసులో నా గురించి ఏమనుకొంటున్నావో నాకు తెలుసు. పిల్లల గురించి ఆలోచించని స్వార్ధపరురాలిగా నన్ను భావిస్తున్నావు.”

“అలా ఎందుకు అనుకొంటున్నారు మీరు?”

“పిల్లల గురించి నువ్వు ఒక్క ప్రశ్న కూడా నన్ను వేయలేదు. వేసి నా సమాధానం వినే ధైర్యం నీకు లేదు. అందుకే ఆ ప్రశ్నను స్కిప్ చేశావు. ఆ ప్రశ్నముందు వేయకుండా ఇంకే ప్రశ్నలు నువ్వు వెయ్యలేకపోయావు” ఆమె కళ్ళు ఒక్కసారిగా నీటితో నిండిపోయాయి.

“గుడ్ బై” చెప్పింది.

….

ఏడాదిన్నర తరువాత చండీఘర్ లో మళ్ళీ ప్రవేశం. “అప్పుడు మాయమయ్యావు కదా? మళ్ళీ ఎలా వచ్చావు?“ అన్నట్లు చూస్తున్నారు పరిచయస్తులు. డిపార్ట్మెంటులో పని ముగించుకొని బయట పడ్డాను. ఒక్కో రూము చూసుకొంటూ వస్తూ స్వప్న మేడమ్ రూము దగ్గర ఆగిపోయాను. ఆమె నేమ్ బోర్డ్ లేదక్కడ. “హాయ్ మేడమ్!” వినయ్ వధేర వెనక నుండి వచ్చి తట్టాడు. “మీరు రావటం పొద్దున్నే చూశాను. పని అయ్యాక పట్టుకొందామని ఆగాను. మీ రెండు రాష్ట్రాలు విడిపోయాయి కదా? ఇక్కడ కూడా సపరేషన్ జరిగిపోయింది” కనుబొమ్మలు స్వప్న రూము వైపు ఎగరేస్తూ అన్నాడు.

“కోటి రూపాయల డబ్బుతో బాటు తాను కొనుక్కొన్న వాటర్ ఫిల్టర్ కూడా వదలకుండా తీసుకొంది. ఆమె భక్తి అంతా వదిలేసి అమెరికాలో ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోయింది.”

“భక్తి ఆమె తాత్కాలిక ఆశ్రయమని నాకు తెలుసు” ఆయనతో అడుగులు వేస్తూ అన్నాను.

ఇద్దరం కాంటీన్ వైపు నడిచాము.

“పిల్లలూ …?” నేనిక అడగకుండా ఉండలేక పోయాను.

“పాప ప్లస్ టూ అయిపోగానే అమ్మ దగ్గరికి వెళ్లిపోతానని చెప్పింది. స్వప్న కొద్దిగా సెటిల్ అవగానే ఆ ఏర్పాట్లు చేస్తానంది. ఈ సారి పట్నాయక్ సర్ అభ్యంతరం చెప్పక పోవచ్చు. ఆయన పంజాబ్ మిలటరీ విడోని పెళ్లి చేసుకోబోతున్నాడు.”

నిట్టూర్చాను. నవీన్ కనబడితే యిలా చెప్పాలనుకొన్నాను. జడ్జిమెంటులు ఎప్పుడూ సమాజమే యివ్వనవసరం లేదు. మనుషులు కూడా ఒక్కోసారి దానికి నేర్పుతారు. నిజంగా నేనే ‘వివేకవంతమైన సమాజాన్ని’ అయి ఉంటే ఆమె ఘర్షణ పడిన కాలంలో ఆమె పిల్లల్ని నేనే సాకేదాన్ని.

బిల్డింగ్ బయటకు వచ్చి బయట మైదానం మధ్యలో నిలబడ్డాము. తలెత్తి మైన్ బిల్డింగ్ మీద ఏంటేనా కోసం చూశాను. అదక్కడ లేదు. “తీసేశారు. ఆ నాన్ కమర్షియల్ ఏంటేనా ఫైల్ అయ్యింది ….” చెబుతున్నాడు వినయ్.

123