ట్యాగులు

, , ,

 

11929928_10153378031884193_1191766798_o

నవ్యాంధ్ర రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలోనే ఇప్పటికీ 14 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొన్నారు. కొత్తగా చేరిన విద్యార్ధుల గురించి పాత విద్యార్ధులు తెలుసుకోవటానికి ఉద్దేశించిన ర్యాగింగు సాంస్కృతిక కాలుష్యంలో వికృత రూపం దాల్చింది. నిత్యం హింసాయుత ఆవరణలో గాలి పీలుస్తున్న యువత, విద్యార్ధినీ విద్యార్ధులను మానసిక బాధకు గురి చేసే విధంగా ఈ ర్యాగింగు రూపాంతరం చెందింది. ఇక ఎక్కడైతే విద్య సరుకుగా మారుతుందో అక్కడ వత్తిడి అన్ని వైపుల నుండి దాడి చేస్తుంది. యువకులు కుటుంబం ద్వారా, చదువుల ద్వారా, సమాజం ద్వారా వంట పట్టించుకొన్న పురుషాధిక్యతకు నీలికాలుష్యం తోడై ఆడపిల్లల మీద వేధింపులు పెరిగాయి. యువతలో ఈ ధోరణులను తప్పు పట్టే ముందు ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని విద్యార్ధి, మహిళా సంఘాలు చేస్తున్న డిమాండులో వాస్తవికత గురించి ఆలోచించాలి.

రిషితేశ్వరి విషయమే తీసుకొంటే ఆమె మరణంలో ర్యాగింగులతో పాటు లైంగిక వేధింపుల పాత్ర ఉంది. కులం ఉంది. యూనివర్సిటీ అధికారుల ఆకాశమంత నిర్లక్ష్యం ఉంది. నాగార్జున యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఒక కాంట్రాక్టు ఉద్యోగి ప్రిన్సిపాల్ గా ఉండటం ఒక విచిత్రమైతే, అతగాడు బాలికలతో హాయ్ లాండ్ లో వేసిన చిందులు ఇంకో వైపరీత్యం. సీనియర్ విద్యార్ధులు తనతో అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారని రిషితేశ్వరి పెట్టుకొన్న మొర పట్టించుకొనే తీరిక లేని బాబురావు తన కులస్తులను ఆర్గనైజ్ చేయటంలో మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. అందుకే రిషితేశ్వరి మరణం తరువాత తనకు వకల్తాగా కొంతమంది విద్యార్ధులను కూడగట్టగలిగాడు. ఎప్పటిలాగా ఆధిపత్యం ప్రదర్శించి బాబూరావును రక్షించాలనే ప్రయత్నం విద్యార్ధి సంఘాల తిరుగుబాటుతో వెనక్కి తగ్గింది.

అయితే ఇక్కడ ప్రభుత్వం బాధితురాలి పక్షాన లేదనే విషయం నిర్వివాదం. విచారణ పేరుతో వచ్చిన ఘంటా శ్రీనివాసరావు అన్నికుల విద్యార్ధి సంఘాలను నిషేదిస్తున్నామని ముందు ప్రకటించాడు. కుల సంఘాలకు కూడా వర్గ స్వభావం ఉంది. ఆధిపత్య సాధన కోసం ఏర్పడ్డ కులసంఘాలకీ వాటి నుండి ఆత్మ రక్షణ కోసం ఏర్పడ్డ కుల సంఘాలకు తేడా గ్రహించలేని అమాయకుడు కాదు మన మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి. జబ్బున్న దగ్గర వైద్యం చేయకుండా తనకు కక్ష ఉన్న శరీర భాగాన్ని తొలిగించింట్లుగా తరువాత విద్యార్ధి సంఘాలను కూడా నిషేదిస్తూ జీవో జారీ చేశాడు. ఏ విద్యార్ధి సంఘాలైతే రిషితేశ్వరి మరణాన్ని ప్రపంచానికి తెలియ చేసి ప్రజల అక్కరను కూడగట్టాయో వాటి ఉనికిని నిషేదించే ప్రయత్నం చేశాడు. అసలు విద్యార్ధి సంఘాలే రిషితేశ్వరి మరణానికి కారణం అయినట్లు సృష్టించగలిగాడు. అదే అధికార రాజకీయాల గొప్పతనం. రిషితేశ్వరి మరణాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలిగాయి. ఇక వేయి మంది రిషితేశ్వరులు చనిపోయినా బయటకు రావు. ర్యాగింగుకు వ్యతిరేకంగా కృషి చేస్తానని చెప్పిన రిషితేశ్వరి తండ్రి హనీష, శ్రీనివాసుల అరెస్టుతో సంతృప్తి పడినట్లు అనిపిస్తుంది. ఆయన తెలుసుకోవాల్సిన విషయం నేరస్త ఉద్వేగాలను ప్రేరేపించే శక్తులు, భావజాలం యూనివర్సిటీలోనే బలంగా వేళ్ళూనికొనే ఉన్నాయి. వాటికి ఊతం యిస్తూ ప్రభుత్వాలు ఉండనే ఉన్నాయి. అందుకే ఆధిపత్య కులానికి, అధికార పార్టీకి ప్రతినిధి అని భావించదగ్గ బాబూరావు బయటే ఉన్నాడు. ఉత్సవ విగ్రహాలు జైలులో ఉన్నాయి.

ప్రభుత్వాలను కార్పొరేట్ వ్యాపార సంస్థలు నడుపుతాయని తెలుసు. విద్య కార్పొరేటీకరణ చెంది విద్యా వ్యాపారులు ప్రభుత్వాన్ని నడపటం నవ్యాంధ్రలో ఒక కొత్త పరిణామం. ఎన్నికల్లో తనను గెలిపించిన వ్యక్తికి కొత్త రాజధాని ప్రాంతంలో భూములతో పాటు, ఇక్కడ పుట్టీ కాస్త ఆర్ధిక వనరులన్న అశేష బాలబాలికల మెదళ్లు కూడా కానుకగా సమర్పించబడ్డాయి. ఇప్పుడా మెదళ్లను వాళ్ళ కార్ఖానాలో గుత్త వ్యాపార సంస్థల లాభాల కోసం పోత పోస్తున్నారు. ఆ పోతా, ఆ పోటీ తట్టుకోలేని చిన్ని హృదయాలు ఆత్మ హననానికి పాల్పడుతున్నాయి. ఈ నేపధ్యంలో కడప నారాయణ కాలేజీలో జరిగిన విద్యార్ధునుల జంట మరణాల గురించి ప్రభుత్వం పట్టించుకొని తనుకు తానుగా చర్యలు తీసుకొంటుందని భావించటం అత్యాసే అవుతుంది.

నేడు ఆంధ్ర రాష్ట్రమంతా లేత నెత్తురు చిమ్మిన వాసన. పసరు కాయలు కాలుతున్న వాసన. విద్యాహక్కు ఆదేశిక సూత్రాలలో కుదించుకొని పోయింది. వికార సాంఘీక మాధ్యమాల మధ్య, నీలి చిత్రాల మధ్య యువతరం గిలగిలా కొట్టుకొంటుంది. అనేక దురవాట్లకు లోనై నిర్వీర్యం అవుతుంది. బాలలు జాతీయ సంపద కావాలనే ఉన్నత కర్తవ్యం తమ దళారీ విధానాల కింద పాలకులు కప్పి పెట్టేశారు. సామాజిక ప్రవర్తన నేర్పే సాంఘీక శాస్త్రాలు సిలబస్ లో కనుమరుగవుతున్నాయి. ఈ దేశంలో మెజారిటీగా పేద రైతుకూలీ జనం పట్ల తమ బాధ్యతను మర్చిపోయే విధంగా సాంస్కృతిక సామ్రాజ్యవాదం అడ్డుగోడ కట్టింది.

అయితే ఆ గోడను పగలుకొట్టే అపారమైన శక్తి యువతకు ఉంది. గోడకు ఇటువైపున వున్న మహిళలకూ ఆ శక్తి ఉంది. దేశీయ ఆదాయంలో వారి వంతు తిరస్కరింపబడిన బడుగు ప్రజలకూ ఉంది. వారు గమనిస్తున్నారు. గోడకు ఇరువైపుల వాళ్ళూ సాంస్కృతిక సంక్షోభానికి కారకులు అయిన పాలకుల బాధ్యతారాహిత్యాన్ని గమనిస్తున్నారు. వారి కుట్రపూరిత విధానాలను గమనిస్తున్నారు. వారంతా కలిసి ఆ గోడను తప్పక బద్దలు కొడతారు. ఇరువైపులవారూ ఆ గోడను ధ్వంసం చేసి ఆలింగనం చేసుకొన్న రోజు, మనుషుల మధ్య వైషమ్యాలు పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకొంటున్న పాలకులకు దుర్దినం అవుతుంది.

ఈ వ్యాసం సెప్టెంబర్ 2015 మాతృకలో సంపాదకీయంగా ప్రచురించబడింది.