ట్యాగులు

, , ,

30946759

ఆమె మీద డజన్ల కొద్ది ఫోర్జరీ, నిధుల దుర్వినియోగంలాంటి కేసులు పెట్టారు. ఆరు ఎఫ్ఫైయ్యార్లు ఆమె మీద ఫైల్ చేసి ఎన్నో ఎంక్వైరీలకు ఆమెను గురిచేరారు. ఆమె పని చేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అక్కౌంట్లు, ఆమె వ్యక్తిగత అక్కౌంట్లు స్థంభింప చేశారు. ఆమె కదలికలను నిషేదించారు. విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని ఆమె అతిక్రమించిందని అభియోగిస్తున్నారు. సిబిఐ కూడా ఆమె మీద కేసు ఫైల్ చేసింది. ఆమె ఇంటి మీద, ఆఫీసు మీద దాడులు చేసింది. ఈ ప్రహసనం అంతటికి కారణం 2002 గుజరాత్ అల్లర్లలో హింసకు గురి అయినవారికి ఆమె న్యాయపరమైన సహాయం చేస్తున్నది. ఆ ఘటనలో 120 మంది గూండాలకు ఆమె శిక్ష పడేలా చేసింది. ఇంకా ఎంతో మంది స్త్రీలు ఆమెను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంతవరకు ఆమె మీద చార్జి షీట్ పెట్టక పోవటం విశేషం. వేధించటం, భయపెట్టటం, ప్రతిష్ట దెబ్బతీయటమే బిజెపి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. నిజానికి ఆమె పని చేస్తున్న ప్రాజెక్టు పేరు ‘మతోన్మాదం పై యుద్ధం’. సర్బంగ్ కమ్మునికషన్స్ అనే సంస్థ ఈ ‘మతోన్మాదం పై యుద్ధం’ అనే పత్రికను ప్రచురిస్తోంది. తీస్తా శతల్వాడ్ కు ఆమె భర్త జావీద్ ఆనంద్ కు సంపాదక బాధ్యతల కింద కొంత జీతం ఇస్తుంది. ఈ విషయం విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని ఏ విధంగానూ అతిక్రమించదు. ఈ సంగతి ఆమెను వేధిస్తున్న గుజరాత్ క్రిమినల్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కి బాగా తెలుసు. నిజానికి ఈ ప్రాజెక్టు గతంలో వాజ్ పాయ్ ప్రభుత్వంలోనూ, కాంగ్రెస్సు ప్రభుత్వంలోనూ అవార్డులు కూడా తీసుకొన్నది. 1984 ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన మారణ కాండలోనూ, 1991 బాబ్రీ అల్లర్లలోనూ ఈమె పని చేస్తున్న సంస్థ ముందు భాగాన ఉండింది.

ఇంత జరిగాక కూడా ఆమె భయపడకుండా ‘జాకియా జఫ్రీ’ కేసు చేయటానికి సిద్ద పడటం ఆమె నిజాయితీకి, సాహసానికి నిదర్శనం. 2002లో గోద్రా ఘటన జరిగినపుడు జాకీయ జఫ్రీ భర్త ఇషాన్ జఫ్రీ కాంగ్రెస్స్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘటన తరువాత జరిగిన అల్లర్లలో ఆయనను హత్య చేశారు. ఈ కేసు మీద అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడి, బిజెపి మంత్రులు, పై స్థాయి పోలీసు అధికారులు ఇంకా బిజెపి సభ్యులు … అందరూ కలిసి 62మంది మీద సుప్రీమ్ కోర్టులో జాకియా జఫ్రీ, తీస్తా శతల్వాడ్ కలిసి కేసు పెట్టి పోరాడుతున్నారు.

కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాక బిజెపి ప్రభుత్వం ఆమెపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందనేది వాస్తవం. ఇది ఆ పార్టీ ఫాసిస్టు పోకడలలో భాగమే. ప్రభుత్వమే ప్రతినాయక పాత్ర వహిస్తున్నప్పుడు ఆమెకు అన్ని ప్రజాస్వామిక వర్గాల నుండి మద్దతు పూర్తి స్థాయిలో అందాలి. సత్యాన్వేషులకూ, నిజాయితీపరులకు మన సమాజంలో ఇంకా గౌరవనీయమైన, భద్రమైన స్థానం ఉందని భరోసా ఇవ్వగలగాలి.