ట్యాగులు

, , , , , , , , , , , ,

11888435-aisa-protest-2440699f

పెద్దగా జనసంచారం లేని ఎఫ్ టిఐఐ (ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కాంపస్ ప్రధాన దారి అది. అప్పుడప్పుడే విద్యార్ధులు గేటు నుండి లోపలికి వస్తున్నారు. ఒక పక్క పోలీసువ్యాను అటెన్షన్ పొజిషన్ లో నిల్చోని విద్యార్ధులను డేగ కళ్ళతో చూస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ, సంగీతం, ఆర్టూ సింబాలిక్ గా శిలువ వేసి ఉన్నాయి. గోడల నిండా నినాదాలు. ‘ప్రభుత్వమే తప్పు చేసినపుడు మనం ఒప్పు చేయటం కూడా ప్రమాదం అవుతుంది.’ ‘మాకు ఛైర్మన్ గా కార్యకర్త వద్దు. మాకు అంత కంటే మంచి మార్గాలు ఉన్నాయి.’ ‘పరిగణించాల్సిన విషయాల పట్ల మౌనం వహించిన రోజు మేము మరణించినట్లే’ ‘దబోల్కర్ మాలో ఇంకా జీవించి ఉన్న తలంపు. అది మమ్మల్ని ప్రశ్నించటానికి పురికొల్పుతుంది.’ ‘చౌహాన్ గో బాక్.’

చిన్నపాటి వాయిద్యాన్ని ఒక విద్యార్ధి వాయించటం మొదలు పెట్టాడు. క్రమంగా విద్యార్ధులు ఆ వాయిద్యం చుట్టూ చేరారు. ఎప్పుడు వచ్చిందో ఒక యువతి ఒక మోకాలు మడిచి నేలకు ఆనించి, ఇంకొకటి ఆసరాగా కూర్చొని గొంతు ఎత్తింది. ఆ పొజిషన్ చూస్తుంటే పాట పాడటానికా, యుద్ధం చేయటానికా అనే సందేహం వస్తుంది ఎవరికైనా. ‘ఏ బంద్ హై. బహుతీ పురంద్ హై. బహుతీ పురంద్ హై’ ఆమె గొంతు జీరగా లోలోపలి నుండీ తన్నుకొని ఎగసి వచ్చినట్లు వస్తున్నది. క్రమంగా వాయిద్యాల లయ, ధ్వని పెరిగాయి. ఆ దారమ్మట పోయే ఒక అవ్వ ఆ సంగీతానికి ఆగి విద్యార్ధులతో పాటు అడుగులు వేస్తూ చేతుల చప్పుడు చేస్తోంది. ఇది ఒక సినిమా. ఎఫ్ టిఐఐ విద్యార్ధులు తీసిన ఈ లైవ్ సినిమా పేరు ‘స్ట్రైక్: డే 70’. ఈ సినిమాను ఆ సంస్థను నిర్వహిస్తున్న ఫిల్మ్ డివిజన్ ప్రదర్శించటానికి నిరాకరించింది. దీనితో బాటు సంస్థలో గత 85 రోజులుగా జరుగుతున్న బంద్ ఉద్దేశ్యాన్ని చెబుతూ తీసిన ఇంకా మూడు డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శనకు పెట్టనివ్వలేదు. విద్యార్ధులు పంతంగా ఈ నాలుగు ఫిల్ములను బొంబాయిలోని కమ్యూనిష్టు పార్టీ ఆవరణలో అదే రోజు సాయంత్రం ప్రదర్శించారు.

1999లో అనుకొంటాను. ఓల్గా గారి ‘కన్నీటి కెరటాల వెన్నెల’ నవలను పూనాలో ఉన్న ఈ అందమైన ఎఫ్ టిఐఐ పరిసరాలను కధా స్థలంగా తీసుకొని రాసారు. కమర్షియల్ సినిమాలూ, అప్పుడప్పుడు దూరదర్శన్ లో వచ్చే ఆర్ట్ సినిమాలు తప్ప ఇంకేమి తెలియని వయసులో ఈ సంస్థ గురించిన ఎరుక ఆనందపరిచింది. 1961లో ప్రభాత్ స్టూడియోలో 21 ఎకరాల సువిశాల ప్రాంగణంగా ఈ సంస్థ వెలిసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇలాంటి సంస్థ, ఒకప్పటి టెంపుల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎర్నెస్ట్ రోజ్ చెప్పినట్లు, చుట్టుపక్కల మూడు వేల మైళ్ళ వృత్తాంతంలో ఎక్కడా లేదు. భారతీయ సినిమాలో దేశీయ సంగీతం అంతర్భాగంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి అప్పట్లోనే ఒక పూర్తికాల రిసిడెంట్ సంగీత దర్శకుడ్ని నియమించుకొన్న విజన్ ఉన్న సంస్థ ఇది. భారతదేశ సాంస్కృతిక జీవితంలో ఈ ఎఫ్ టీఐఐ ఉదాత్తమైన పాత్ర పోషించింది. రిశ్విక్ ఘటక్, గోపాలకృష్ణ ఆదూర్, కుమార్ సహాని, డేవిడ్ ధావన్ లాంటి దర్శకులు ఇక్కడే పుట్టారు. షబ్నాఆద్మీ, ఓంపురి, నసీరుద్దీన్ షా, జయాబచ్చన్, జాన్ అబ్రహాంలాంటి నటులు ఇక్కడే తయారయ్యారు. చాలా ఏళ్ల తరువాత మళ్ళీ ఈ ఫిల్మ్ అండ్ టీవి ఇస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి వచ్చింది. కానీ పాట పాడిన యువతి అన్నట్లు ‘బాత్ బహుత్ పురంద్ హై’ (విషయం చాలా పాతది)

ఎల్లలు లేని చర్చ, కట్టలు లేని సృజన, స్వేచ్చాయుతమైన ఊహ .. వీటితో బాటు విద్యార్ధుల ఆందోళనలూ ఈ సంస్థలో అంతర్భాగంగా ఎప్పుడూ ఉండేవే. సృజనాత్మకతను మూసలో పోత పోయకుండా చలనశీలంగా మోసుకొని పోవటం ఈ సంస్థ ప్రత్యేకత. కాలదోషం పట్టిన సిలబస్ ను మార్చాలని ఈ సినిమా శిక్షణాసంస్థ విద్యార్ధులు గతంలో ఏడుసార్లు స్ట్రైక్ చేశారు. ప్రశ్న, ప్రతిఘటన ఈ విద్యార్ధుల అవిశ్రాంత మెదళ్ళకు అలవాటే. కమర్షియల్ సినిమాకు సమాంతరంగా, స్టార్ డమ్ కు వ్యతిరేకంగా ఆరోగ్యకరమైన సినిమా సంస్కృతి కోసం వీళ్ళు చాలా బందులే చేశారు. ఈ సంస్థకున్న సంస్థాగతమైన విలువలు గత నాలుగున్నర దశాబ్ధాలుగా కమర్షియల్ మీడియా మీద విమర్శనాత్మక దృష్టి పెట్టాయి. సమాజంలో నీతీ, న్యాయం అని చలామణి అవుతున్న చాలా విషయాలకు భిన్నంగా వీరు నాలుగడుగులు ఎప్పుడో ముందుకు వేశారు.

కానీ ఈసారి విషయం అంత సుళువుగా లేదు. వీళ్ళు ఎదుర్కొంటున్న శక్తి కిందా పైనా అధికారంలో ఉన్నది. బహుళ సంస్కృతుల మిళితమైన ‘భారతీయాన్ని’ ఏక శిలా సదృశ్యంగా మార్చి దానికి ఏకైక వర్ణాన్ని పులుముతున్నది. భావం, హృదయం, సంగీతం, దృశ్యం, సిరా అన్నీ కాషాయంలో ఉన్నాయో లేదో అని డేగ నేత్రంతో పహరా కాస్తున్నది. ఈ పహరా కోసం అర్హతలు లేకున్నా అస్మదీయులను డైరక్టర్ గా, కౌన్సిల్ సభ్యులుగా అంటగట్టింది. గతంలో దబోల్కర్ చనిపోయినపుడు విద్యార్ధులు చేయబోయిన ప్రదర్శనకు ఎబివిపి కార్యకర్తలు అడ్డుపడి వారి మీద దాడి చేసి కొట్టారు. ఇక ఇప్పటి విద్యార్ధుల ప్రశ్నలు సముచితమైనవే. గతంలో ఈ సంస్థ బాధ్యతలు వహించిన శామ్ బెనగళ్, యూఆర్ అనంతమూర్తి, గిరీష్ కర్నాడ్ లాంటి వ్యక్తులకున్న విజన్ ఇప్పడు నియమించిన గజేంద్ర చౌహాన్ కి ఉందా? బిజేపి కార్యకర్త గా ఉండటమే అతని అర్హతా? అతని నియమకానికి సృజనాత్మక ప్రామాణికత ఏమిటి? అతనితో బాటు పోస్ట్ చేసిన నలుగురు కౌన్సిల్ సభ్యులు ఎవరు? నరేంద్ర మోడి మీద డాక్యుమెంటరీ తీయటమో, గతంలో మహారాష్ట్ర ఎబివిపి ప్రెసిడెంట్ గా వ్యవహరించటమో, ఒక ఆరెస్సెస్ అనుబంధ సంస్థలో ఆఫీసు బేరర్ గా ఉండటమో మాత్రమే వారి అర్హత అవుతుందా? ఈ ప్రశ్నలతో మొదలైన స్ట్రైక్ కు ఆగస్టు 18 అర్ధరాత్రి ఐదుగురు విద్యార్ధుల అరెస్టుతో డెడ్ లాక్ పడింది.

ఐఐటీల తరువాత అంత ప్రతిష్ట కలిగిన ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కనబడుతోంది. విద్యార్ధులు చేస్తున్న ఈ స్ట్రైకును అడ్డం పెట్టుకొని ఎఫ్ టీఐఐ ని బాలివుడ్ కి అప్పగించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి బడ్జెట్ లో ఒక ఐఐయమ్, ఒక ఐఐటీ ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇంకో పక్క మానవ సమాజ శాస్త్రాలకూ, కళలూ సంస్కృతులకూ కోతలు విధిస్తుంది. మనం మనుషులం కాబట్టి సహజ అవసరాలకంటే ఎక్కువ సంగతులు కావాల్సి ఉంటుంది. మానవ నాగరికత ప్రఢవిల్లిన రోజు నుండి మనిషి సత్యాన్వేషణలోనే ఉన్నాడు. పాట, నృత్యము, సాహిత్యం, తత్వం .. వీటన్నిటితో బాటు మంచి సినిమా కూడా మనిషిలోని అంతర్గతమైన, ఆత్మానుగతమైన తృష్ణను తీరుస్తుంది. ఎఫ్ టీఐఐలాంటి దేశీయ ప్రభుత్వ సంస్థలు మాత్రమే కుల మత వర్గ జాతి జండర్లకు అతీతంగా దేశంలో ఉన్న బహుళ సంస్కృతులను సినిమా రూపంలో ముందుకు తీసుకొని వెళతాయి. అవి మాత్రమే అన్ని రకాల దృక్పధాలకు తావు ఇవ్వగలుగుతాయి. ఖరీదైన ఫిల్మ్ బడులలో పైన చెప్పినవేమీ జరగవు.

తమ కళ్ల ముందు జరుగుతున్నఅనేక దుర్మార్గాల విషయంలో ప్రేక్షక పాత్ర వహించేటంతగా కెరీరిజం విద్యార్ధి మెదడులోకి ఎక్కి ఉన్న ఈ సామాజిక సందర్భంలో ఎఫ్ టీఐఐ విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలోని సహేతుకత చర్చించదగ్గది. విద్యార్ధులకి వారి చుట్టూ వున్న సమూహాలకు మధ్య ఎవరో కట్టిన గోడను ఇరు పక్షాల వాళ్ళు కలిపి తొలగించుకోవాలి. వారు తీసిన ‘స్ట్రైక్: డే 70’ సినిమాలో వారితో కలిసి అడుగులు వేసిన ముసలి అవ్వపాత్రను అయినా రెండో వైపు వారు పోషించాలి.

విద్యార్ధులు ప్రదర్శించిన సినిమాలలో ఇది ఒకటి

 

12006594_895194677184287_5846654344191104358_o

ఈ రోజు (13-09-2013) ఆంధ్రజ్యోతిలో ఈ వ్యాసం వచ్చింది.