ట్యాగులు

, , , ,

12047111_504278356401178_3877141754911660213_n

(హెచ్చార్కేగారు అమరవీరులను కీర్తించి, వారిని అడవులకు పంపటానికి ప్రోత్సహించవద్దు అని చేస్తున్న వాదనలకు కరుణాకర్ గారి అభిప్రాయాలు నాకు నచ్చాయి. అవిక్కడ పెడుతున్నాను)

ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లలో మరణించిన వివేక్, శృతి, సాగర్లపై వచ్చిన కొన్ని కవితలపై ఫేస్ బుక్ లోనూ, కవిత్వం గ్రూపులోను, సారంగలోనూ జరుగుతున్న  చర్చల్లో అమరత్వాన్ని కీర్తించవద్దనే వాదన ఒకటి జరుగుతుంది. ఇందులో చాలా మంది ఉన్నా, వారిలో హెచ్చార్కే బలమైన వాదన వినిపిస్తున్నారు. దీనికి జవాబు చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం.

హెచ్చార్కే బృందం వాదనలో ప్రధానంగా రెండు విషయాలున్నాయి.

1. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం అనుసరిస్తున్న సాయుధ పోరాట పంధా – గ్రామాలు జయించి నగరాలు చుట్టుముట్టడం- విజయవంతమయ్యేది కాదు.

2. విజయవంతం అయ్యే అవకాశం లేని పోరాటంలోకి పోవడం ఆత్మహత్యాసదృశ్యం. అలా వెళ్ళి మరణించిన వారి మరణాన్ని అమరత్వమనడమూ, దానిపై పాటలూ పద్యాలూ రాయడమంటే మరిన్ని ఆత్మహత్యలకు ప్రేరేపించడమే

మొదటిది పూర్తిగా రాజకీయమైనది. హెచ్చార్కే దృష్టిలో ఈ దేశంలో ప్రజాస్వామ్యముందో లేదో ఉంటే ఏ స్థాయిలో ఉందో మనకి స్పష్టం కాలేదుకాని సాయుధ పోరాట పంధా మాత్రం ఆయనకి ఆమోద యోగ్యం కాదని తెలుస్తూ ఉంది. దానికి ఆయన చెప్తున్న కారణం యాభై ఏళ్ళుగా జరుగుతున్న పోరాటం ఇప్పటికీ విజయవంతం కాకపోవటం. దానికోసం వేలాది మంది మరణించడం.

మొనార్కీ పోయి రిపబ్లిక్ కావడానికే ప్రాన్స్ కి వందేళ్ళకాలం (రెండు విప్లవాలు ఓడిపోయి అపార రక్తపాతం జరిగాక) పట్టిందనే విషయాన్ని ఇక్కడ హెచ్చర్కే కన్వీనియంట్ గా విస్మరించారు. పోనీ ఆయన దగ్గర ప్రత్యామ్నాయ పంధా ఉందా అంటే వీధులు చూపిస్తున్నారు. ఏ దేశంలో ప్రజలు ఏ వీధిపోరాటాలు చేసి ఏ మౌలిక మార్పు తెచ్చారో ఆయనే చెప్పాలి అంటే- ఇంకా చర్చించాలి, మార్క్స్, మావో, గ్రామ్స్కీ లను చదవాలి, కొత్త పోరాట పధ్ధతులు (అసలు ఎవరు చనిపోనవసరం లేనివి, గ్యారంటీగా గెలిచేవీ) కనిపెట్టాలి అంటున్నారు. ఎవరు కనిపెట్టాలి? పోనీ హెచ్చార్కే ఏమన్నా ఆ పనిలో ఉన్నారా? ఆయనే అనువదించిన ‘దలేల్ బెన్ బబాలి’ కవితలో చెప్పినట్టు ’యుధ్ధమేఘాలు కమ్ముకుంటున్న చోటికి/ అంతా నాశనమయి పోకముందే/ అధికార దాహంతో, అలివిగాని దురాశలతో /వాళ్ళు అన్నిటినీ మంటగలపక ముందే’ ఈ కనిపెట్టే పని పూర్తవుతుందా? అప్పటి వరకూ అనవసర ప్రాణ నష్టం వద్దంటున్నారు. మరి ఆలస్యమయితే జరిగే ప్రాణనష్టానికి హెచ్చార్కే బాధ్యత వహిస్తారా? వ్యవస్థీకృతంగా జరిగే ఈ హింస హెచ్చర్కేకు సహజంగా అనిపించవచ్చు. కానీ ఈ వినాశనాన్ని చూడలేని వాళ్ళుంటారు. వాళ్ళు హెచ్చర్కే లాంటి వాళ్ళ ఆమోదం కోసం ఆగరు. కార్యాచరణలోకి దిగుతారు. ఆయా స్థలకాలాల్లో నిలబడి విశ్లేషిస్తారు. యుధ్ధతంత్రాల్ని రచిస్తారు.

రెండవది. సాయుధ పోరాట మార్గంలో మరణించిన వారి గురించి రాయడం గురించి. సాయుధ పోరాట మార్గంపై విశ్వాసమున్న వాళ్ళందరూ విధిగా తుపాకులు పట్టుకొని యుధ్ధానికి వెళ్ళరు. నిజానికి ఈ అవగాహనతో దైనందిన జీవితంలో భావజాలరంగంలో చేసే యుధ్ధం తక్కువైందికాదు. ఎవరి సంసిధ్ధతను బట్టి వాళ్ళు ఆయా రంగాలు ఎంచుకుంటారు. కనుకనే యుధ్ధంరంగంలో మరణించిన వారితో ఐడెంటిఫై అవుతారు. స్పందిస్తారు. కధలూ కవిత్వాలూ రాస్తారు. ఆ రాసినవాళ్ళ జీవితాచరణ వాళ్ల రాతకు భిన్నంగా ఉంటే ఆ సంగతి ప్రాణాల్ను పణంగా పెట్టి పోరాడే వాళ్ళు చూసుకుంటారు. ప్రశ్నిస్తారు. అవసరమైతే నిలదీస్తారు.

విప్లవ సాహిత్యం పోరాట అవసరం కోసం పుడుతుందిగానీ రచయితల సౌలభ్యం కోసం కాదు. విప్లవ పోరాటాలపై రాజ్య నిర్భందం వచ్చినపుడు ఆ పోరాటాలకు పౌర సమాజం యొక్క మద్దతు కోరటం విప్లవ సాహిత్యం యొక్క అనేక కర్తవ్యాలలో ఒకటి. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చే రచయితకు ఉద్యమ లక్ష్యాల్తో సహనుభూతి ఉంటే చాలు. రచయిత కుండాల్సిన ప్రమాణాలను నిర్ణయించేది ఉద్యమస్థాయీ దాని అవసరాలు. అంతేకాని ఉద్యమలక్ష్యాలపై ఏకీభావంగానీ దాని విజయంపై నమ్మకంగానీ లేని వాళ్ళు కాదు.

అట్టడుగు ఆదివాసీలో, శ్రామికులో, కార్మికులో కాక – తమదైన మధ్య తరగతినుండి, చదువుకుని బ్రతకనేర్చగల అవకాశాలు ఉన్న అచ్చు తమ పిల్లల్లాంటి యువతీయువకులు చూపిన సాహసం కలిగించిన కలవరం కొన్నికలాల్ని కదులుతున్న కాళ్ళవెంట నడిపిస్తే .. కదల్లేని కొన్ని కాళ్ళు కదిలే కలాల్ని కట్టేస్తున్నాయి. విచక్షణను కోల్పోయాయి. సాయుధమార్గాన్ని ఎంచుకున్న యువతీ యువకుల్ని పిల్లలనడం, అమాయకులనడం, ఎవరో రెచ్చగొడితే ఉద్యమంలోకి వెళ్ళారనడం, సమకాలీన ప్రజాసమూహాలతో కలసి నడచి పోరాటమార్గాన్ని ఎంచుకున్నవారి వివేకాన్ని కించపరచడమే. వారి తల్లి తండ్రులు రచయితల ప్రజాసంఘాలలో ఉండటం నెగ్లిజబుల్ అంశం అనడం – ఇవన్నీ విచక్షణాశక్తిని కోల్పోవడం వల్ల ఏర్పడ్డ అప్రజాస్వామిక ధోరణులు.