ట్యాగులు

, , ,

CHARCOAL_SOFT_G_HIJAB

(ఇరాన్ లో ఇస్లామిక్ దుస్తుల చట్టాలు మహిళలను రక్షించటంలో విఫలం అయ్యాయి. అధికారులు కూడా లైంగిక వేధింపులకు అనుమతి ఇస్తున్నారు. ఒక పేరు యివ్వని ‘టెహ్రాన్ బ్యూరో’ మహిళా కరస్పాండెంట్ రాసిన కధనం .. ద గార్డియన్ పత్రిక నుండి)

అనువాదం: రమాసుందరి

నేను సందడిగా ఉండే వనక్ స్క్వేర్ నుండి ట్రాఫిక్ తోనూ, పాదాచారులతోనూ కలిసి ప్రయాణిస్తూ టెహ్రాన్ ముఖ్య భాగమైన జోర్డాన్ వీధి వరకూ విహారం చేస్తున్నట్లు నడుస్తూ ఉద్యోగానికి వెళతాను. ఈ ప్రాంతం ఉత్తర టెహ్రాన్ కు గుండెకాయ వంటిది. జోర్డాన్ వీధిని ఆనుకొని గాంధీ వీధి ఉంది. అక్కడ పాశ్చాత్య కాఫీ షాపులు, పెద్ద పెద్ద మాల్సు ఉంటాయి. నేను ఒక ప్రశాంతమైన చిన్న వీధిని నడవటానికి ఎన్నుకొంటాను. ఆ వీధిలో భీమా ఆఫీసులు, డాక్టర్ల నివాసాలు వుంటాయి. అక్కడక్కడా ఉన్న పొడవాటి చెట్లు నన్నుఎండ నుండి కాపాడతాయి. ఆ గలభాకు కొద్ది దూరంలో సనై వీధి వెలిగిపోతూ ఉంటుంది. అక్కడే అతి క్రూరమైన లైంగిక వేధింపు మొదలవుతుంది.

ఒక్కో సారి అవి కళ్ల అప్పగింతలే. నేను నడుస్తున్నప్పుడు అతను నాకు ఎదురు రావటం గమనిస్తాను. నా చూపులను కిందకు దించుకోవటమో లేక పక్క చూపులు చూడటమో చేస్తాను. అతను దగ్గరకు వచ్చే లోపు నా మంటాయ్ (కొంత మంది ఇరానీ మహిళలు ముసుగుకు బదులు ధరించే జాకెట్) సరి చేసుకోవటానికి ప్రశ్నిస్తాను. కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. నేను అతనిని దాటే సమయానికి అతని సూది కళ్ళు నా మందపాటి డ్రస్ వెనుక ఉన్న నా వక్షోజాలను, నా శరీర ఆకృతిని అత్యంత ఉత్సాహంతో చూడటం గమనిస్తాను. నా శరీరాన్ని అంటుకొని ఆ చూపులు నా వీపు భాగం కాలే వరకు నన్ను వెన్నాడతాయి. నటించే ప్రయత్నం కూడా చేయరు. నిశ్చింతగా, ధైర్యంగా ఉంటాయా చూపులు. చాలా సార్లు కొన్ని శబ్ధాలు కూడా ఉంటాయి. అతను నడుస్తూ నావైపు తిరిగి నాలుకను అంగిలిలోనికి మడుస్తాడు. లేకపోతే గాలిని బిగ్గరగా ముద్దు పెట్టుకొంటాడు. మనిషి నోరుకున్న శక్తుల గురించి ఆశ్చర్య పడేంతగా విజిల్ వేయటం, బుస కొట్టటం, ముద్దు వదలటం, నాకటం, నోటిని ఉబ్బించటం చేస్తాడు. ఒక్కోసారి ఆ బుస వెనుక నుండి నా చెవికి తాకేటట్లు నేరుగా వస్తుంది. ఒక్కోసారి అగస్మాత్తుగా పాము తన నాలుకను బయటకు పెట్టిన శబ్ధం వస్తుంది. చాలా సార్లు ఏమాత్రం తన కామాన్ని దాచుకోకుండా నా వెన్ను జలదరించేటట్లు నీచంగా వ్యక్తీకరిస్తాడు. చాలా తరుచుగా కొన్ని మాటలు కూడా. అదృష్టవశాత్తు అతడు నా ముఖాన వదిలే చెత్త గ్రహించేటంతగా నాకు పర్షియన్ భాష రాదు. ఆ వ్యక్తి ముఖంలో ఒక వింత వ్యక్తీకరణతో, కళ్ళనూ పై పెదవినీ కొద్దిగా పైకి తిప్పి ఒక సార్వజనీయమైన భాషలో ఆ చెత్తను నా మీదకు వదులుతాడు. నాకు ఒకటే తెలుస్తుంది. అతడు నా శరీరాన్నో, నా దుస్తులనో కామెంట్ చేస్తున్నాడు. అతని యింటికి నన్ను ఆహ్వానిస్తున్నాడు. లేక నన్ను వేశ్య అని పిలుస్తున్నాడు. అతని నీచపు మాటలకు అనువాదము అవసరం లేదు. పశుప్రాయమైన సంభాషణకు అది ఒక ప్రాధమిక రూపం మాత్రమే. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ జరుగుతుంది. మనషులు కార్లలో నన్ను వెంబడిస్తూ, నాతో మాట్లాడుతూ, కార్లోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్న సందర్భాలు నాకు చాలా తగులుతాయి. ఒక వ్యక్తి కారులో వెంబడిస్తున్నపుడు మేము నలుగురం మహిళలం ఉన్నాము. మేము అతనిని ఎంత పట్టించుకోక పోయినా, ఎంత తిట్టినా ఒక పది నిమిషాల పాటు అతడు మా మీద వాంఛను ప్రకటిస్తూనే ఉన్నాడు. అతడిని తప్పించుకోవటానికి మేము ఒక కేఫ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. కార్లే కాదు .. స్కూటర్లు, మోపెడ్లు, మోటార్ బైకులు వాళ్ళు వెంటబడటానికి అవకాశాలని ఇంకా సులభతరం చేస్తాయి.

ఇరాన్ లో బహిరంగ ప్రదేశాలలో లైంగిక వేధింపులు ఒక వాస్తవం. నేను మొదట నా పాశ్చాత్య రూపం, నా బట్టలు, కొంత నా స్టైలు (నేను వేసుకొనే రకరకాల రంగులు, తెరిచి ఉండే నా మంచాయ్, తల వెనుక కట్టుకొనే నా స్కార్ఫ్) వలన నేను గురి కాబడుతున్నానని అనుకొన్నాను. కానీ నేను నా స్నేహితురాళ్లతో మాట్లాడినపుడు ఈ బాధ సర్వవ్యాప్తమైనదనీ .. అన్ని రకాల నేపద్యాలు, జీవన శైలీ వున్నయవతులకు కూడా ఇది తప్పదని అర్ధం అయ్యింది.

“హిజాబ్ (తలకు కట్టుకొనే గుడ్డ) తప్పనిసరి కానీ ముస్లిం దేశంలో పెరగటం వలన అది స్త్రీలను రక్షిస్తుందని ప్రజలు నాకు చెబుతూ ఉంటారు. స్త్రీల శరీరం పురుషులలో కోరికలు రేకెత్తిస్తుందని అంటారు. కానీ హిజాబ్ తప్పనిసరి అయిన ఇరాన్ దేశానికి వచ్చాక కూడా ఇంకా నేను వీధుల్లో వేధించబడుతున్నాను. పురుషులు నా వంక ఆత్రంగా చూస్తుంటారు. మాట్లాడతారు. నా పేరుతో పిలుస్తుంటారు. నేను విలువలేనిదానిగా, నగ్నంగా ఫీల్ అవుతూ ఉంటాను.” అని చెబుతుంది టెహ్రాన్ లో ఒక సంవత్సరంగా చదువుకొంటున్న 26 ఏళ్ల సహాన్ అనే నాన్ ఇరానియన్ మహిళ. “బుర్కా వేసుకోవటం వలన నేను రక్షించబడగలనని అనుకొనేదాన్ని. కానీ ఒక రోజు బుర్కా వేసుకొన్న మహిళలు కూడా వేధింపబడటం చూశాను. నేను ఏమి ధరించినా మగవాళ్ళు నన్ను వెంటాడుతారనీ, దానికి కారణం నేను స్త్రీని కావటమేనని నేను ఆలస్యంగా గ్రహించాను” అంటుందామె. ఆయేషా, 23 సంవత్సరాల కెమిస్ట్రీ స్టూడెంట్, ఇలా అంటుంది “ప్రాధమిక పాఠశాల అయిపోయాక అమ్మాయిలు, అబ్బాయిలు విడిపోతారు. వాళ్ళు మళ్ళీ కలుసుకొనే అవకాశమే ఉండదు. ఒక వేళ అగస్మాత్తుగా కలుసుకొన్నా వాళ్ళు మామూలుగా మాట్లాడుకోలేరు. లైంగిక పరిధుల్లో వాళ్ళ పరిచయం జరుగుతుంది.”

నాకు ఎప్పుడూ ఒక సందేహం వస్తూ ఉంటుంది. దీన్ని ఒక ఆటగానే పురుషులు భావిస్తారా? లేక నిజంగానే వాళ్ళు ఏదైనా ఆశించి ఇలా ప్రవర్తిస్తారా? నాకు చిన్నప్పుడు అబ్బాయిలు మమ్మల్ని వెంబడించే వాళ్ళు. స్త్రీలు, పురుషులు స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగిన సమాజం లేదు కాబట్టి వాళ్ళు వీధులు ఎన్నుకొనేవాళ్ళు. మొదట్లో ఆడపిల్లలు వారి వ్యాఖ్యానాలను ప్రశంసలుగా తీసుకొని ఆనందించే వాళ్ళు. కానీ తదనంతర కాలంలో పురుషులు వాళ్ళ లైంగిక కోరికలను వ్యక్తీకరించటం మహిళలను అభద్రతకు గురి చేస్తోంది. ఇక దీని నుండి తప్పించుకొనే అవకాశం లేదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటానికి అవకాశం లేని సమాజంలో వీధులు, పార్కులు, బస్సులు వాళ్ళ సరసాలకు బహిరంగ వేదికలు అవుతున్నాయి.

లైంగిక వేధింపు సరసం మాత్రమే కాదు. మొత్తం పట్టణాన్నిఒక పెద్ద వేట స్థలంగా స్వీకరించి జరిగే వేట అది. ఆడవాళ్ళకు వీధుల్లో నడవటం అంటే హింస, భయంతో కూడిన అనుభవం. ‘వంటరిగా నడవటం అనే నాకు ఇష్టమైన విషయాన్ని నేనిక్కడ పోగొట్టుకొన్నాను. అందుకోసమే కేవలం పదినిమిషాల ప్రయాణం కోసం కూడా నేను కాబ్ తీసుకోవాల్సి వస్తోంది’ అంటోంది సహర్. ఇక పార్కుల్లో ఒంటరిగా బెంచ్ మీద కూర్చోవటమంటే పురుషులను ఆహ్వానించటమే. “ఒక రోజు నేను పార్కులో చెట్ల నీడన కూర్చొని ఉన్నాను. ఒక మనిషి వచ్చి నా పక్కన కూర్చోవటానికి అనుమతి అడిగాడు. అతడు నిజంగా సంస్కారంతో అడుగుతున్నాడనుకొన్నాను. నేను పొరపడ్డానని వెంటనే తెలిసింది. నేను సరే అనగానే అతడు నన్ను వేలాది ప్రశ్నలతో వేధించాడు. నేనే అక్కడ నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.” 20 ఏళ్ల ఫ్రెంచ్ విద్యార్ధిని లూసీ చెబుతోంది. ఈ వేట పట్టపగలే, మహిళలను రక్షించే బాధ్యత కలవారి సమక్షంలోనే జరుగుతుంది. ఈ వేటలో వారికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వేధించేవాళ్లు స్వేచ్చగా ఆ పని చేస్తుంటే మోరల్ పోలీసులు హిజాబ్ సరిగ్గా లేదనీ, మంటోస్ సరిగ్గా ధరించలేదనీ, బిగుతుగా పాంటులు వేసుకొంటుంన్నారని స్త్రీలను అరెస్టు చేస్తున్నారు. మహిళల శరీరాలను రక్షిస్తామని చెబుతున్న సొసైటీలో ఇంత కన్నపెద్ద వ్యంగ్యం ఇంకోటి ఉండదు. నేను ఏ వనక్ స్క్వేర్ లో నయితే వేధింపులకు గురి అయ్యానో అక్కడే దుస్తులు సరిగ్గా ధరించలేదని మహిళలను పోలీసులు అడ్డగించారు. స్త్రీల లైంగిక రక్షణ పట్ల వారికి ఎలాంటి బాధ్యత లేనట్లు ఉంది.

అయితే మహిళలు వేధింపుల నుండి బయట పడటానికి ఒక మార్గం ఉంది. మీ బంధువైనా, బాయ్ ఫ్రెండ్ అయినా, కనీసం మీ పక్కింటి వాడైన, ఎవరైనా పురుషుడు పక్కన ఉంటే ఎవరూ నీ వంక చూడరు. స్త్రీ వంటరిగా నడుస్తుందంటేనే ఆమె సెక్స్ కోసం చూస్తున్నట్లే. అయితే ఈ విషయంలో పురుషులు ఏమనుకొంటున్నారు? చాలా మందికి వాళ్ళు చేస్తున్నవి లైంగిక వేధింపులు అనే విషయం కూడా తెలియవు. నాకు తెలిసిన మగ స్నేహితులను ఈ విషయమై అడిగినపుడు వాళ్ళ ప్రతి చర్యలు వింతగా ఉంటాయి. మాట మార్చడం, సమర్ధించుకోవటం, చాలా అరుదుగా అంగీకరించడం జరుగుతుంది. నేను పట్టుబట్టి అడిగి, ఇరానియన్ మహిళలు ఎదుర్కొంటున్న మానసిక బాధ గురించి వారితో గొడవ పడితే వాళ్ళు నిరాకరించడమో, శూన్యపు చూపులు చూడటమో చేస్తారు. ఇక్కడ మహిళలు కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంటారు. ఈ విషయాలు మాట్లాడటం ఇక్కడ నిషిద్దం. దగ్గర స్నేహితులతో కూడా చర్చించరు.

“స్త్రీలు అదృశ్యమై పోవాలా?” అని ప్రశ్నిస్తుంది సహార్. మగవాళ్ళ అమర్యాదకరమైన మాటలు, చూపులు, సైగలు, వేటల నుండి బయటపడాలంటే భౌతికంగా కనబడకుండా పోవటం తప్ప మార్గం లేదు.

ఇక్కడో ఆశ్చర్యకరమైన, విచారకరమైన వైరుధ్యం ఉంది. మేము మా శరీరంలో అత్యధిక భాగాన్ని కప్పుకొనే కొలది మా మీద లైంగిక వేధింపులు తగ్గటం లేదు. ఇంకా పెరుగుతున్నాయి. ఏడాది అంతా వేటకు అనువైన కాలమిక్కడ.