ట్యాగులు

, , , , ,

Girl students varsities_0_0

హాస్టల్ జీవితం విద్యార్ధినీ విద్యార్ధులకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా బయట ప్రపంచంతో మెలగటం, డబ్బులు ఎలా ఖర్చుపెట్టుకోవాలోలాంటి సంగతులను ఇక్కడే నేర్చుకొంటారు. వీటికి మించి నగర ప్రాంతంలోని హాస్టళ్లలో వుండే పిల్లలకు ప్రపంచాన్ని చూసే అవకాశం, సాపేక్షికంగా విశాల దృష్టి పెరుగుతాయి. అయితే ఈ అవకాశం ఆడపిల్లలకు క్రమక్రమంగా దూరం అవబోతోంది. పాతిక ముప్ఫై సంవత్సరాల క్రితం హాస్టళ్లలో చదివిన ఆడపిల్లలకు లేని జైలు జీవితం బీజేపీ ప్రభుత్వం పుణ్యమా అని ఈ ఆధునిక యుగంలో సంప్రాప్తం కానున్నది. సూర్యుడు అస్తమించక ముందే ఆడపిల్లలు హాస్టలుకు రావాలన్నట్లు ఆడపిల్లల హాస్టళ్లలో నియమ నిబంధనలు పటిష్టం చేస్తున్నారు. అమ్మాయిలు లైబ్రరీకి వెళ్ళో, బస్సులు అందకనో లేక ఇతర కారణాల వలనో హాస్టలుకు వెళ్ళటం కొద్దిగా ఆలస్యం అయినా ఇప్పుడు ఎంతో ఆందోళనకు గురి అవుతున్నారు.

యుజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్) యిచ్చిన మార్గదర్శక సూత్రాలను సాకుగా చూపించి ఆడపిల్లలను మళ్ళీ మధ్య యుగాలలోకి తీసుకొని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మార్గదర్శక సూత్రాలు ఆచరణలోకి రాక మునుపే ఢిల్లీ నగరంలోని జామియా మిల్లా ఇస్లామిక్ యూనివర్సిటీ అనుబంధ హాస్టళ్లలో ఉంటున్న ఆడపిల్లలు హాస్టల్ సమయాలు జెండర్ పక్షపాతంతో ఉంటున్నాయని ఆరోపించి ఆందోళనలు కూడా చేశారు. వారి అసంతృప్తులు అలా కొనసాగుతుండగానే మొత్తం భారతదేశంలోని ఆడపిల్లల హాస్టళ్లలో ఈ దమన సూత్రాలు అధికారికంగా అమలు చేయబోతున్నారు.

2012లో ఆడపిల్లల భద్రత, జెండర్ స్పృహలను పెంచటానికి యూజీసీ చైర్ పర్సన్ వేద్ ప్రకాష్ ‘సాక్ష్యం’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఈ పత్రం ఆడపిల్లల స్వేచ్ఛ, నిర్ణయాధికారం, వారి ఏకాంతాలకు హామీ యిచ్చింది. యూనివర్సిటీ ప్రాంగణ భద్రతా ఆదేశాలు స్త్రీల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదనీ, మోరల్ పోలిసింగ్ జరగకూడదనీ కూడా చెప్పింది. వివక్షాపూరితమైన నిబంధనలతో కర్ఫూల ద్వారా వారిని పసిపిల్లలుగా చేసి వేధించకూడదని చెప్పింది. నిష్ణాతులైన పూర్తి కాలం కౌన్సిలర్స్ ద్వారా పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా చెప్పింది. యూనివర్సిటీ ప్రాంగణం అంతా లైట్లు వెలిగించాలనీ, మహిళలకు టాయ్లెట్స్ వసతి, మంచినీళ్ళ సదుపాయం ఉండాలని చెప్పింది. విద్యార్ధులు జరుపుకొనే పండగల్లో జెండర్ సమానత్వం ఉండేటట్లు ఖచ్చితంగా చూడాలని చెప్పింది.

girls

అయితే ఇప్పుడు ఈ సూత్రాలకు అర్ధాలు మార్చేశారు. ఈ మార్గదర్శక సూత్రాలు ఇప్పుడు యూనివర్సిటీ హాస్టళ్ల గోడల ఎత్తు పెంచాలనీ, ఇనుపతీగలతో కంచె వేయాలనీ, సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆడపిల్లల కదలికలను గమనించాలనీ, వాళ్ళను పంజరంలో బంధించాలనీ చెబుతున్నాయి. అమ్మాయిలు ఎనిమిది లోపు హాస్టళ్లకు చేరుకోవాలని, ఎవరైనా ఆలస్యంగా బయట ఉండాలనుకొంటే వాళ్ళకు పోలీసులు తోడు ఉండాలని చెబుతున్నారు. కౌన్సిలర్స్ గా బయట వ్యక్తులను కాకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ను నియమించారు. వారు కౌన్సిలర్స్ గా ప్రవర్తించకుండా విద్యార్ధినుల మీద పెత్తనం చేసే సంరక్షణ అధికారులుగా తయారయ్యారు. ఆడపిల్లలకు సంబంధించి ఈ యూజీసీ మార్గదర్శక సూత్రాలు ఆధిపత్య దృష్టితో ఉంటున్నాయి. విద్యార్ధునుల్లో విమర్శనాత్మక ఆలోచనను, స్వతంత్రతను, స్వేచ్ఛను, సృజనను పెంపొందించకుండా ఇవి వారిని ఫారాల్లో కోళ్ళ మాదిరి తయారు చేస్తాయి. పరిణితి చెందిన విద్యార్ధునులకు వాగ్ధానం చేయాల్సిన స్వేచ్ఛ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇది ఇలాగే కొనసాగితే మార్గదర్శక సూత్రాలు యివ్వటం మాత్రమే యూజీసీ చేయగలదు కానీ హాస్టళ్లు ఎలా ఉండాలో విద్యార్ధునులు వారే నిర్ణయించుకొని వారి స్పందనల ద్వారా తెలియచేస్తారు.