ట్యాగులు

, , , , ,

376120-woman-naxal

వరంగల్ జిల్లా తాండ్వాయి గుట్టల్లో ఒక ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లు అవిభాజ్య రాష్ట్రానికి కొత్తవి కాకపోయినా రాష్ట్రం విడిపోయాక జరిగిన ఈ ఎన్ కౌంటర్ అన్ని వర్గాలను కలవర పరిచింది. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీయార్ కుటుంబ పరిపాలనలో జరిగిన మొదటి ఎన్ కౌంటర్ ఇది. చనిపోయినవారు పాతిక సంవత్సరాల విద్యాధికురాలైన యువతి, యవ్వనోత్సాహం పొంగి పొరలుతున్న యువకుడు. శృతి ఎం.టెక్ చదివింది. ఆమె చదువు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకంటే నేటి తరం యువతి యువకులను అమెరికా వ్యామోహం, కెరీరిజం జోడు గుర్రాలుగా స్వారీ చేస్తున్నప్పుడు అన్ని అవకాశాలు వున్నాశృతి అడవి మార్గాన్ని ఎన్నుకొన్నది. ఈ దేశంలో అత్యంత పీడించబడుతూ అన్ని అవకాశాలూ సుదూర మరీచికలుగా ఉన్నఆదివాసీలు, గిరిజనులు నివశిస్తున్న చోటుకి తన భద్ర జీవితాన్ని వదులుకొని ఇష్టంగా దారి పట్టింది. లొంగి పోయో, క్రియారాహిత్యంతోనో ఇంటికి తిరిగి రానని తల్లిదండ్రులకు చెప్పి మరీ వెళ్లింది. అణువణువున ఉద్యమ స్ఫూర్తిని రంగరించుకొని ‘శృతి’ అద్భుత విప్లవ క్రాంతి అయ్యింది.

శృతిలాంటి ఎందరో యువతులు, స్త్రీలు విప్లయోద్యమంలో తమ ప్రాణాలు తృణ ప్రాయంగా త్యజించారు. మహోత్తర శ్రీకాకుళ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు చాలా మంది మహిళలు ఎలాంటి సంశయాలు లేకుండా అందులో దూకారు. లౌకికమైన బంధాలను గడ్డి పోచల్లాగా తెంచేసుకొన్నారు. భర్త పంచాది కృష్ణమూర్తి చనిపోయిన తరువాత తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా యింటికి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నించినా కూడా ఒప్పుకోకుండా పంచాది నిర్మల పిల్లల్ని వదిలి పెట్టి మళ్ళీ విప్లవ దారి పట్టింది. అర్ధరాత్రి కొండపై నిద్ర పోతున్న వారిపై పోలీసులు చేసిన దాడిలో ఆమెతో బాటు అంకమ్మ, సరస్వతి కూడా అమరులయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో వరంగల్ జిల్లా మత్రాజ్ పల్లిలో జొన్నతోటలో నిద్రపోతున్న స్నేహలతను మరి ఇద్దరు యితర కామ్రేడ్లతో కలిపి చంపేశారు. ఆయుధాలు చేతిలో లేకున్నా విప్లవ ప్రచారంలో ఉన్న సుశేన, చింతాలక్ష్మిలను పట్టుకొని ఖమ్మంజిల్లా కాచనపల్లిలో కాల్చేశారు. కరీంనగర్ అడవుల్లో రంగవల్లి అరుణతార అయ్యింది. ఆమెతో బాటు అనిత అనే లంబాడీ స్త్రీని కూడా చంపేశారు. గోదావరీలోయా పోరాటంలో అసువులు బాసిన యోధలు ఎందరో. వందల కొద్ది మహిళలు ఒరిస్సా, చత్తీజ్ గఢ్, బెంగాల్, బీహార్ నక్సలైట్ ఉద్యమంలోఅసువులు బాసారు. దండకారణ్య ఉద్యమంలో ఆదివాసీ మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రాణాలు అర్పించారు.

మహిళలు విప్లవోద్యమంలోకి ఎందుకు వస్తారు? అదీ ప్రమాదకరమైన రహస్యోద్యమంలోకి? అణగారిన ప్రజాసమూహాలకు పోరాటం తప్ప యితర మార్గాలు ఉండవు. అందులో వాళ్ళు ప్రత్యేకంగా పోగొట్టుకొనేది ఏమీ ఉండదు. అలా పోరాడే సమూహాలలో కార్మికులు, కర్షకులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసులు … వీరితో బాటు మహిళలు కూడా ఉంటారు. వీళ్ళే విప్లవ శక్తులకు విశాలమైన పునాది. నివసించే హక్కు, వనరులు అనుభవించే హక్కు, జీవించే హక్కు, ఊపిరి పీల్చుకొనే హక్కు.. ఇలా అనేక హక్కులను కోల్పోయి ఉద్యమ జీవితంలోకి వస్తారు. ఇలాంటి బాధలతో బాటు పురుషసామ్య అణచివేత, పురుషాధిక్య పీడనలతో అనుసంధానం అయిన లైంగిక, వరకట్నపు వేధింపులు లాంటి అనేక వేదనలకు గురై స్త్రీలు ఉంటారు. స్నేహలత వరకట్నపు పెళ్లి యిష్టం లేక విప్లవ జీవితంలోకి వచ్చింది. ఈ బాధలు అన్నీ ఉన్నా లేకపోయినా స్త్రీ విముక్తి సమస్త పీడిత ప్రజల విముక్తితో ముడిపడి ఉందని నమ్మి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలా వచ్చిన అమ్మాయే శృతి. పిన్న వయసులో అత్యంత పరిణిత ఆలోచనలతో మరణానికి సిద్ధం అయి రహాస్యోద్యమంలోకి వెళ్లింది.

ఎలాంటి ఉద్యమాలలోనైనా మహిళలు పాల్గొంటున్నప్పుడు వారిపై లైంగిక దాడులు చేస్తుంది రాజ్యం. ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాచటానికి ఆ సమూహపు స్త్రీల లైంగికత్వంపై దాడి మొదటిగా జరుగుతుంది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు, ఆదివాసీ ప్రాంతాలలో జరిగింది ఇదే. ఉద్యమ సానుభూతిపరులుగా అనుకొన్న సోనీ సోరి, కవాసి హిడ్మే లాంటి వారి మీద జరిగిన అమానుషాలకు మాటలు ఉండవు. స్త్రీలే స్వయంగా ఉద్యమిస్తున్నప్పుడు ఆ పని బహిరంగంగానే జరుగుతుంది. ఆమె లైంగికత్వాన్ని అవమానిస్తూ తిట్టటం, ఆమెను తాకరాని చోట తాకి అవమానించటం, వారి దుస్తులు చించివేయటం లాంటి లైంగిక దాడులు పోలీసులు చేస్తారు. ఇక ఆయుధాలు పట్టిన మహిళలు పోలీసులకు దొరికినపుడు రాజ్యం క్రూరత్వం వేయి తలలుగా విజృంభిస్తుంది. అదే గతంలో అనేక మంది మహిళలపై జరిగింది. ఇప్పుడు శృతి మీద కూడా అదే జరిగింది. ఒక మనిషిగా, స్త్రీగా ఎన్ని చిత్రహింసల పాలు చేయవచ్చో అన్ని చిత్రహింసలు చేశారు. హింసతో ఆమెను భౌతికంగా మరణింపచేశారు.

భారతదేశ వనరుల మీద విదేశీ రాబందుల కన్ను పడింది. ఇక్కడ పరిపాలిస్తున్న దళారీ పాలక వ్యవస్థ ఇదివరకటి కంటే దాని స్వభావాన్ని బహిర్గతం చేసుకొన్నది. రాబందులకు రెడ్ కార్పెట్టు పరవటానికి అడ్డు వచ్చిన శక్తులన్నింటినీ నిర్ధయగా తుదముట్టిస్తుంది. కేసీయార్ బంగారు తెలంగాణలో కూడా అదే జరిగింది. చంద్రబాబు స్వర్ణాంధ్రలో కూడా అదే జరుగుతుంది. వీరి దృష్టిలో సాయుధ పోరాటాలు చేస్తున్న వారు దేశద్రోహులు. వీధి పోరాటాలు చేస్తున్న వారు విచ్ఛిన్నకర శక్తులు. అసలు ఏ పోరాటాలు చేయకుండా పుస్తకాలు రాసుకొంటూ భావజాల యుద్ధాలు చేస్తున్న వారి మీద కూడా హత్యా దాడులు చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనేక దుర్మార్గ విధానాల వలన వేలాది మంది చనిపోతున్నారు. రైతులు ఆత్మ హత్యలు చేసుకొంటున్నారు. విద్యార్ధులు కార్పొరేటు చదువులలో ఆహుతి అవుతున్నారు. పసిపిల్లలు ప్రభుత్వ ఆసుపత్రులలలో మరణిస్తున్నారు. పదిహేడు శాతం బలవన్మరణాలు పెట్టుబడిదారుల కోసం వేసిన విశాలమైన రోడ్ల మీద జరుగుతున్నాయి. మొత్తం సమాజమంతా నేడు హింసావరణంలో వుంది. ఈ హింసలతో పోలిస్తే ప్రతిఘటనా హింస పేలవమైనదే.

శృతి ఇంకా అలాంటి అనేక మంది మహిళలు వాళ్ళ బతుకును పీడిత ప్రజల పరం చేశారు. తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, వేసే అడుగు సమస్తం తాము పని చేస్తున్న అట్టడుగు వర్గాల కోసమే. వాళ్ళ శరీరం, మేధస్సు ప్రజల పరం ఎప్పుడో అయిపోయాయి. అశేష ప్రజానీకంతో మమేకమైన తాత్వికత వాళ్ళు. చారెడు చెలక కోసం యుద్ధాలు చేస్తున్న ఆదివాసీల ఆకాంక్ష వాళ్ళు. కుల పీడన పోవాలని కళ్ళెర్ర చేస్తున్న దళితుడి పగ వాళ్ళు. స్త్రీలు కోరుకొనే సమానత్వం వాళ్ళు. బద్దలు కాబోతున్న అడవులు వాళ్ళు. అలాంటి వాళ్ళకు మరణమేమిటి? అలాంటి స్త్రీలకు లైంగిక అవమానం ఏమిటి? ఐదు శతాబ్ధాల విప్లవోద్యమం కన్న ముద్దు బిడ్డలు వీళ్ళు. భుజాన మోసుకొని పోవాల్సిన బృహత్తర కర్తవ్యాన్ని దృగ్గోచరం చేయించిన ధీరలు వీళ్ళు.

ఈ వ్యాసం అక్టోబర్ 2015 మాతృకలో సంపాదకీయంగా ప్రచురించబడింది.