ట్యాగులు

, , ,

1444320998-6823

88 ఏళ్ల వర్కింగ్ రచయిత్రి నయనతార, రాతలలో ప్రావీణ్యత అంటే సత్యం పట్ల బాధ్యత అని భారతదేశానికి గుర్తు చేస్తున్నారు. భిన్నాభిప్రాయ వ్యక్తీకరణ రచయిత జీవన విధానంలోనే ఉంటుంది. భిన్నాభిప్రాయ వ్యక్తీకరణకు కూడా రాజకీయాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అది ఒక సాహసోపేతమైన చర్య. అలలకు ఎదురీత. గద్దించేవాడికి ఎదురు సమాధానం చెప్పటం. ఒక్కోసారి అది ఏకాకితనం. ఒంటరి గొంతుతో మౌనాన్ని భగ్నం చేస్తూ సమూహాలను ఎదిరించటం కూడా.

విచిత్రంగా భిన్నాభిప్రాయ వ్యక్తీకరణ వలన భారతదేశంలో ప్రతి ఒక్కరికీ శత్రువు ఉన్నట్లు అనిపిస్తుంది. నయనతార ప్రతిఘటించగానే చాలా మంది దాన్ని ‘ధనిక స్త్రీ అసహనం’ గా భావించారు. కొంతమంది దాన్ని ‘కొన్ని విషయాలలోనే ప్రదర్శించే కోపం’ అని అన్నారు. ఇలా తీసి పారేయటం అంటే ప్రతిఘటన కూడా నైపుణ్యంతో ఎంచుకోవాలని వారి అర్ధం. చాలా మంది ఆమె నెహ్రూ కాలంలో ప్రయోజనం పొందారని భావించారు. నిజమే, కానీ నెహ్రూ కాలంలో ప్రయోజనం పొందిన చాలామంది లాగా కాకుండా ఆమెకు తనవైన విజయాలు వున్నాయి. ఆమె తన జీవితానికి సౌందర్య స్పృహ, ధైర్యం తెచ్చి పెట్టుకొన్నది. అలాంటి జీవితం నిస్సందేహంగా ఎన్నదగింది.

సహ్ గాల్ ప్రతిఘటన ఒక్కసారిగా వచ్చింది కాదు. అది సకారణమైన ఒక అసమ్మతి. ఆమె లోలోపలి అంతరంగంలో నిజమనుకొన్న విషయంలో బాధతో బయటకు వచ్చిన అరుపు. తన తోటి రచయితలు, విద్యావేత్తలు హత్యకు గురి కాకూడదని ఆమె గట్టిగా కోరుకొన్నది. భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో మౌనం రాజకీయ శుద్ధతకు ఏకైక అంగీకార రూపం అయినపుడు యిలాంటి ప్రతిఘటనలు వస్తాయి.

అయితే గతంలో కూడా సహ్ గల్ అనేక విషయాలలో మాట్లాడారు. ఎమర్జెన్సీ విషయంలో ఆమె చూపిన నిరసన ఆమెను ఒక ప్రతిష్టాత్మక వ్యక్తిగా మార్చింది. అరుణాశౌరీ, కులదీప్ నయ్యర్, జార్జ్ ఫెర్నాండెస్, రజనీ కొఠారీలతో బాటు నయనతార ప్రామాణిక నిరసన రూపాలను తయారు చేసారు. ఇప్పుడు ఆమె రాసిన నిరసన ఉత్తరాన్ని కూడా అదే స్పిరిట్ తో చూడాలి.

ఆమె తన ఉత్తరాన్ని రాజ్యాంగంలో ఇచ్చిన హామీల గురించి హమీద్ అన్సారీ రాసిన ఉత్తరాన్ని ప్రసావిస్తూ మొదలుపెట్టారు. రచయితకు నిరసన తెలిపే హక్కు బతికే హక్కులో భాగం. మేధావి జీవితం కేవలం ఆలోచనల పరంపర మాత్రమే కాదు. ఆ జీవితం యోగ్యమైన సమాజం గురించిన తలంపు, విలువలతో కూడిన ప్రామాణిక చట్రం కూడా. సహ్ గల్ చెప్పింది నిజం. భారతదేశం సంస్కృతిలోని భిన్నత్వం దాని గుణాన్ని కోల్పోయి చిన్నాభిన్నం అవుతుంది.

సహ్ గల్ నిరసన వ్యక్తిగతమైన విషయం కాదన్న విషయం మనం మర్చిపోకూడదు. అది ఒక గొడుగు కింద ఉన్న సమూహాల ప్రణాళికాబద్ధమైన దౌర్జన్యానికి ప్రతిఫలంగా వచ్చింది. వారు మన సంస్కృతిని దిగజార్చి, మేధోపరమైన ప్రత్యేకతను ధ్వంసం చేయదలుచుకొన్నారు. ఆమె ఈ మొత్తం ధోరణిని ప్రశ్నిస్తుంది. అనేక సంఘటనల, చర్యల పరంపరను ప్రశ్నిస్తుంది. మణిపాల్ లో ఉన్న తక్కువ రకం రక్షణ వ్యవస్థను ప్రశ్నిస్తుంది. దేశీయ, రాష్ట్రీయ దొంతరలలోని సిలబస్ తిరగ రాసి విద్యాపరమైన కట్టడిని నైతిక రక్షణా కట్టడితో మిళితం చేయాటాన్ని ప్రశ్నిస్తుంది. దుర్మార్గంగా జరిగిన కల్బుర్గీ లాంటి హేతువాదుల హత్యల గురించి ఆమె ప్రశ్నిస్తుంది. ఒక్కొక్క సంఘటన దుర్మార్గమైనదే కానీ అనేక సంఘటనల కొనసాగింపు సమాజం గురించి వ్యధ చెందేటట్లు చేస్తుంది. ఈ పరంపరలో చిట్టచివరి సంగతి ఇంట్లో బీఫ్ ఉంచుకొన్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని వధించటం.

సాహిత్యం ఈ మొత్తం విషయంలో చెడును గ్రహించక పోతే ఇంకెవరు గ్రహిస్తారు? రచయిత సమాజాన్ని తన స్వంతంగా భావిస్తాడు. మేధోపరమైన సెన్సార్షిప్, సాంస్కృతిక సెన్సార్షిప్ తో కలగలిస్తే .. పుస్తకనిషేధాలూ, సినిమా నిషేధాలూ ఆహార నిషేదాలతో కలగలిస్తే .. బలవంతమైన కట్టడి, సమాజంపై దౌర్జన్యం ప్రారంభమయినాయని అర్ధం.

రచయిత సమాజంలో జరిగే అన్యాయాన్ని సంస్కరించాలని మాత్రమే అనుకోడు. అతడు లేక ఆమె నాగరికత ముఖ్య ఉద్దేశ్యాన్ని హెచ్చరించే ఒక సైగగానూ, ట్యూనింగ్ ఫోర్క్ గానూ ఉంటారు. ఆయా కాలాలకు ధర్మకర్తలుగా వ్యవహరిస్తారు. ఎనభై ఏళ్ళ వయసులో కోపం, స్పష్టత ఉండవని కొందరు భావిస్తున్నారు. ఆమె వయసు ముప్ఫై ఎనిమిదా, ఎనభై ఎనిమిదా అనే విషయం అప్రస్తుతం. వ్యవస్థకే వృద్ధాప్యం వచ్చేశాక అది ఇక అందరికి ఆల్జీమర్స్ అంటగట్టటం సహజం.

బీజేపీ పార్టీ రెండు రకాలుగా ఆమె గురించి గుర్తుపెట్టుకొన్నది. నయనతార ఎమర్జెన్సీని వ్యతిరేకించినపుడు ఆమెను ఒక హీరోయిన్ లాగా చూశారు. ఇప్పుడు మోడిని వ్యతిరేకిస్తుంటే ఆమెను ఒక దుష్టురాలుగా చూస్తూ ఆమె ఉద్దేశ్యాలను శంకిస్తున్నారు. ఆమె ఇప్పటికే తన పుస్తకం నుండి పిండుకోవాల్సింది పిండుకొన్నదని అకాడమీ చైర్మన్ ఒక చెడు మాటను వదిలాడు. ఆ మాట అతని స్వభావాన్ని బయట పెట్టింది. మొదటిగా అతనికి అవార్డ్ యొక్క ప్రతీకాత్మక విలువ తెలియదు. రెండు అతడు అవార్డును అద్దెకు ఇచ్చే ఒక రియల్ ఎస్టేట్ భూఖండం అనుకొంటున్నాడు. ఇదంతా బీజేపీ హయాంలో అతని మానసిక స్థితిని గురించి చెబుతుంది. ఇక్కడ ‘ఛైర్మన్’ పదాన్ని రష్యాలో వాడే ‘కమిస్సార్’ (ప్రభుత్వ శాఖాధిపతి) పదంగా మార్చుకొంటే పరిస్థితి స్పష్టంగా అర్ధం అవుతుంది.

ప్రస్తుతం జరుగుతున్నక్రూరమైన సంఘటనలు సహ్ గల్ దృష్టిలో చెదురుమదురు చిన్న విషయాలు కావు. అవి ఒక ధోరణిని చట్టబద్ధం చేశాయి. పరిస్థితిని దిగజార్చే విధంగా హింస మౌనంతో కలగలిసిపోవడాన్ని ఆమె గ్రహించారు. సృజనను, ఊహాను కాపాడాల్సిన అకాడమీలు మౌనంగా పనికిమాలినతనంతో ఉన్నాయి. ఆమె చివరి ప్రకటన కూడా స్పష్టంగా, గౌరవప్రదంగా ఉంది. “హత్య గావించబడిన భారతీయుల స్మృతిగా, నిరసన హక్కును ఎత్తి చూపిన భారతీయులకు మద్దతుగా, భయంతో అభద్రతతో జీవిస్తున్న అనేక మందికి సంఘీభావంగా నేను నా సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చి వేస్తున్నాను.”

సాహితీ సంస్థల పిరికితనం

సహ్ గల్ ను అనుసరించి అశోక్ వాజ్ పాయ్ ఈ చర్యకు సరైన అర్ధాన్ని ఇచ్చారు. అవార్డును తిరిగి యిచ్చివేయటం కేవలం కొంతమంది ఎంపిక ఐన ఆంగ్ల రచయితల మాత్రమే చేయగలిగిన పని కాదని ప్రజలకు ఆయన తెలియచేసారు. అది కేవలం అందరి దృష్టిని ఆకర్షించటానికి నిర్వహించే కర్మకాండ లాంటిది కూడా కాదని తెలియచేసారు. ఇలాంటి సంఘటనలను విస్తృతమైన పరిధిలో చూపాలనే ఒక ప్రయత్నం చేశారు. వీరిద్దరి కోపానికి రెండు ముఖాలు ఉన్నాయి. ఒక ముఖాన్ని హిందీలోనూ ఆంగ్లంలోనూ ఉన్న తమ స్వజాతి రచయితల మీద ఎక్కుబెట్టారు. రెండో ముఖాన్ని పిరికితనం, నేర భాగస్వామ్యం ఉన్న సాహితీ సంస్థల మీద ఎక్కు పెట్టారు. వారు కేవలం వారి అవార్డులను తిరిగి ఇచ్చేయటమే కాకుండా మౌన నేరానికి వ్యతిరేకంగా గౌరవప్రదమైన పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం మనోహారమైనది. అది మనల్ని కదిలించివేస్తుంది.

సహ్ గల్ ఉత్తరం ప్రధానమంత్రిని ఎదురించే చర్యలో భాగం కూడా. ఇక్కడ దేశంలో రచయితలు, సామాన్య పౌరులు హత్యలకు గురి అవుతుంటే ఆయన ప్రవాస భారతీయులతో గొప్పలు చెప్పుకొనే పనిలో ఉన్నారు. ఈ ఉత్తరం ఆయనను సమాధానం చెప్పమని అడుగుతుంది. ప్రధానమంత్రి నిర్లక్ష్యం చేస్తున్న రెండు సామాజిక వైరుధ్యాలను గుర్తు చేస్తుంది. మొదటి వైరుధ్యం బ్రతికే హక్కు విషయంలో రాజ్యానికి సామాన్య పౌరునికి సంబంధించినది. రెండో వైరుధ్యం ఒక రచయిత అవార్డు తీసుకొన్నప్పుడు అతని సృజనాత్మకతను, స్వేచ్ఛను రాజ్యం గుర్తించిందా లేదా అనే విషయం.

భిన్నాభిప్రాయం ఉన్న వాళ్ళు హత్యకు గురి అవుతూ, సామాన్య పౌరులు బీఫ్ తిన్నారనే అనుమానంతో చంపివేయబడుతున్నప్పుడు రాజ్యం నిరాసక్తతో ఉంది. ఈ దుర్మార్గమైన అశ్రద్ధ విషయంలో సహ్ గల్, వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి సందర్భంలో ప్రధానమంత్రి మౌనం సమస్యాత్మకంగా కూడా మారుతుంది. ఆ మౌనం అంగీకారానికి, నేరభాగస్వామ్యానికి, నిరాసక్తతకు, నిర్లక్ష్యానికి, ఉపేక్షకూ, కాలయాపనకూ చిహ్నామా? ప్రజాస్వామ్యం మీద ఒక మహత్తర సందేహానికి ఈ మౌనం కారణం అయ్యే అవకాశం ఉంది.

గోబెల్ దండం

ఈ దౌర్జన్యానికి, హత్యలకు ప్రధానమంత్రి అనుచరులు పాడుతున్న వంత ఆయన నిశ్శబ్ధానికి అశ్లీలతను చేకూరుస్తుంది. వినే వాళ్ళకు వీళ్ళు వీధి గుండాలా, బాధ్యత గలిగిన రాజకీయ నాయకులా అనే సందేహం వస్తుంది. వాజ్ పాయ్ ప్రశ్నిస్తున్నట్లు “ప్రధాన మంత్రి ఎందుకు వీళ్ళ నోరు మూయించటం లేదు”? బీజేపీ రాజకీయనాయకుల ఈ కోరస్ గోబెల్ దండం ఎత్తినట్లు కలత పెడుతోంది. గాయానికి అవమానం తోడవటం, హింసకు తదనంతర పరిణామాలు జరగటం .. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగినట్లు అనిపిస్తుంది.

ప్రధానమంత్రి మౌనం, ఆయన అనుచరుల వంతతో పాటు అకాడమీ ప్రవర్తన తోడైయ్యింది. అకాడమీ ఉష్ట్రపక్షిలాగా ఇసుకలో తలదాచుకొంటే, కొత్త సాంస్కృతిక కమిస్సార్లు ప్రభుత్వాన్ని ప్రతి అడుగులో నిర్దేశిస్తాయి. నిశ్శబ్ధం, నేరభాగస్వామ్యం, ఉపేక్ష తోడై అసహనపు వాతావరణానికి భయంతోనూ, అభద్రతోనూ కూడిన సందేహానికి తెర తీస్తాయి. వీళ్ళిద్దరు రచయిత సాంస్కృతిక బాధ్యతను, వారి సృజనాత్మకతలో ఉన్న స్వాలంబనను నొక్కి వక్కాణిస్తున్నారు. రచయిత రాజకీయాలలో ఉన్న నిబద్ధతను, సృజనను సహ్ గల్ అర్ధం చేసుకొన్నారు. అవార్డు ద్వారా ఆమెకి వచ్చిన ప్రాముఖ్యత ఆమెను పాడు చేయలేదని నిరూపించారు. అవార్డు అన్నది చాలా చిన్న విషయం. ప్రజాస్వామ్యం అమూల్యతను మేధావులు అర్ధం చేసుకొన్నట్లే సామాన్య పౌరులు కూడా అర్ధం చేసుకొంటారు. సహ్ గల్ తన ‘పోలిటికల్ ఇమాజినేషన్’ అనే వ్యాస సంపుటిలో రచయితలకు రాజకీయ దృక్పధం తప్పక ఉండాలని రాశారు. ఏకాంతాన్ని కోరుకొనే కళాకారుల జీవితంలో కూడా ఒక వైపు నిలబడాల్సిన సమయం తప్పక వస్తుంది. “సాహితీ స్వేచ్ఛను నిరోధించినపుడు జీవితపు, సాహిత్యపు నిర్భంధాలు ఒకేలాగా ఉంటాయి.” అని ఆమె అభిప్రాయపడ్డారు. నయనతార సహ్ గల్ ఆమె రచనా ప్రావీణ్యంలో భాగంగా ఈ సత్యాన్ని గ్రహించారు.

మోడీగారి అనుచరుడు గిరిరాజ్ సింఘ్, ఎవరైతే మోడి ఇండియాలో ఉండదలుచుకోలేదో వారు వెంటనే పాకిస్తాన్ ట్రైన్ ఎక్కాలని ప్రకటించేశాడు. ఈ మోటు అసహనం ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఈ రాజకీయ వాస్తవాన్ని సహ్ గల్ ప్రకటిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ తొలగించలేరు. దాని సాంస్కృతిక బహుముఖత్వం, లౌకికవాదం తేలిగ్గా తీసి వేసే పదాలు కాదు. భారతదేశం ఈ రోజు ఆ స్థాయికి చేరుకొన్నది. ఇలాంటి సందర్భంలో రచయిత మౌనం క్షమించరానిది.