ట్యాగులు

, , ,

poetry

ప్రియమైన ప్రధానమంత్రి గారికి

ఈ ఉత్తరం మీకు మాత్రమే. మీ సాంస్కృతిక మంత్రివర్యులు మహేశ్ శర్మగారికి మాత్రం కాదు. ఈ ఉత్తరం మన సాంస్కృతిక విషయాలకు సంబంధించి మీ దృష్టిని మరల్చటానికే. ఒక సాంస్కృతిక సంస్థ అలజడిలో ఉన్నప్పటికీ కేవలం అక్కడ జరుగుతున్న విషయాలు గురించి చెప్పటానికి మాత్రమే కాదు. సాహిత్య అకాడమీ గురించి నేను చెప్పబోతున్న విషయానికి మీరు మాత్రమే పరిష్కారం చూపగలరు. ఆ సంస్థ ఇప్పుడు దేశాన్ని కమ్మేసిన ఒక గందరగోళానికి చిహ్నంగా ఉంది.

సర్, మీకు తెలిసే వుంటుంది. సాహిత్య అకాడమీ 1952లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి తరువాత లాంఛనంగా 1954, మార్చి 12న ప్రారంభించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన మొదటి కమిటీలో గొప్ప మేధావులు, సాహిత్యవేత్తలు ఉన్నారు. వాళ్ళలో జవహర్ లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, సి. గోపాలాచారి, మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్, కె.ఎం. మున్షి, కె.ఎం. పణిక్కర్, డి.వి. గుండప్ప, హుమాయూన్ కబీర్, సునీతి కుమార్ చటర్జీ, వల్లతోల్ నారాయణ మీనన్, మస్తి వెంకటేశ్వర అయ్యంగార్, మహాదేవి వర్మ, జాకీర్ హుస్సేన్, రంధారి సింగ్ దినకర్, నీల్మని ఫుకన్, రాజ్ శేఖర్ బోస్ ఉన్నారు. ఏ కొలమానంతో చూసినా వీరంతా గొప్పమనుషులు.

సాహిత్య అకాడమీకి మొదటి ప్రెసిడెంటు ప్రధాన మంత్రి. ఆయన అకాడమీ స్వాలంబనను ఇలా చాటించారు. “అకాడమీ ప్రెసిడెంటుగా నా పనిలో ప్రధానమంత్రి కలగ చేసుకోవటం నాకు నిజంగా ఇష్టం ఉండదు.” అని. అదే స్వాతంత్ర్యం ఈ నాటికి అకాడమీకి ఉందని నేను ఇప్పటిదాకా అనుకొ. కానీ అదిన్నాయను. అది నిజం కాదని నాకు అర్ధం అయ్యింది.

గత కొద్ది వారాలుగా మీడియాలోనూ, ప్రెస్ లోనూ, సోషల్ మీడియాలోనూ .. రాస్తున్న, మాట్లాడుతున్న విషయాలను నేను కొనసాగించదలుచుకోలేదు. కానీ సాహిత్య అకాడమీ వెన్నెముకలేనితనాన్ని ప్రశ్నించిన వారు చెప్పుకోదగ్గ రచయితలు, మేధావులు. వారిలో నయనతార సెహ్ గల్, అశోక్ వాజ్ పాయ్, శశి దేశ్ పాండే, సారా జోసఫ్, ఉదయ్ ప్రకాష్ లాంటి వారు ఉన్నారు. వారిలో సాహిత్య అకాడెమీని చాలా సంవత్సరాలు సెక్రెటరీగా పాలించిన కె. సచ్చితానందన్ ఎన్నదగ్గవారు. అదే అకాడమీ ఈ రోజు గొంతుల నులిమి వేస్తుంటే నిరసించలేక పోతుంది. మన సంస్కృతిని పెడసరంగా చేయటాన్ని ప్రతిఘటిస్తున్న వారితో చేతులు కలపలేకపోతుంది.

మన దేశంలో ఐక్యత, సామరస్యాల అవసరం గురించి వ్యంగ్యంగా అయినప్పటికీ బీహార్ లో మీరు మాట్లాడిన మాటలకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను. మీరు మన దేశాధ్యక్షులు చెప్పిన మార్గదర్శక సూత్రాలను అనుసరించమని మీ శ్రోతలకు చెప్పారు. ఆయన అంతకు ముందు రోజు ఇచ్చిన ఉపన్యాసంలో మనలను కమ్ముకొంటున్న విచ్ఛిన్నత గురించి కోపాన్ని వ్యక్తం చేశారు. కానీ ఆయనకు యోగ్యమైన వేదిక మీద నుండి మాట్లాడిన మాటలు మేము విన్నామా? లేక ఓట్ల కోసం రాజకీయ రంగస్థలంలో కొట్లాడుకొనే రాజకీయ పార్టీ నాయకుడి మాటలు విన్నామా?

గత కొద్ది నెలలుగా కొన్ని సమూహాలు భారతదేశంలో సాంస్కృతిక బహుముఖత్వం గురించి రెచ్చగొట్టే క్రూరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. నేను సనాతన సంస్థ, దీననాథ్ బట్ర అభిప్రాయాల గురించి చెప్పటం లేదు. కానీ వారి వారి నియోజక వర్గాలలోని అన్ని విభాగాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన వారి గురించి అడుగుతున్నాను. పార్లమెంటు సభ్యుడైన స్వామీ ఆదిత్యనాధ్, సాక్షి మహరాజ్ లాంటి వారి గురించీ, గిరిరాజ్ సింఘ్ లాంటి మంత్రుల గురించి అడుగుతున్నాను. బహుశా వీరంతా వారి మాటలను చమత్కారంగా వాడుకోలేని పల్లెటూరి గుంపు అనుకొంటాను.

కానీ సాక్షాత్తు మన సాంస్కృతిక శాఖా మంత్రి రంగంలోకి దిగటం వలన మనం గీత గీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గత కొద్ది వారాలుగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తున్నాడు. అందులో ఒకటి : “మేము పాశ్చాత్యీకరణ చెందిన ప్రజా సంబంధమైన ప్రతి విభాగాన్ని శుభ్రం చేస్తాము. ఆయా విభాగాల్లో భారతీయ సంస్కృతీ, నాగరికత పునస్థాపించాల్సి ఉంటుంది. అవి మనం చదివే చరిత్ర కానివ్వండీ, మన సాంస్కృతిక వారసత్వం కానివ్వండీ, అనేక సంవత్సరాలుగా పాడైపోయిన మన సంస్థలు కానివ్వండీ.”

అయితే శర్మగారు ఏ సాంస్కృతిక వారసత్వం గురించి చెబుతున్నారు? మన మంత్రిగారి ఇటీవల వ్యాఖ్య ఏమిటంటే దాద్రి హత్య కేవలం ఒక అపార్ధమని. ఏ విషయంలో అపార్ధమని ఆయన అనుకొంటున్నారు? హిందూయిజం అర్ధం చేసుకోవటంలో అపార్ధమా? హిందూయిజంలో గొప్పతనం అది ఎలాంటి నిబంధనలకు తల ఒగ్గకపోవటంలోనే ఉంది. దేవుడు సరస్సులో నీటి వంటివాడని రామకృష్ణ పరమహంస చెప్పారు. రకరకాల వ్యక్తులు నీళ్ళు తోడుకొని రకరకాల పేర్లతో పిలుస్తారు. హిందూయిజం కర్మకాండలతో కూడిన మతం మాత్రమే కాదు. అది ఒక జీవన విధానం. ఏ యితర మతం దాని శక్తిని తీసుకొని పోలేదు. మన గొప్ప మతం అపాయంలో వుందని మనం ఎందుకు అనుకోవాలి? ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా హిందూయిజం ఎందుకు మనగలుగుతుంది? ఎందుకంటే అది ఆలోచనలలోనీ, వాదనలలోనీ, చర్చలలోనీ అనేకత్వాన్ని అనుమతించగలదు. మిళితం చేసుకోగలదు. ఇప్పుడు ఈ సమాహాలు మన మతం గురించి వాటి సంకుచిత మనస్తత్వాలతో రంగం మీదకు వచ్చాయి. వీళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకొన్నారు. ఆ విషయమే భయపెడుతుంది. బహుశ ఈ భయమే సాహిత్య అకాడెమీని మాట్లాడనీయకుండా చేస్తుంది. ప్రధాన మంత్రి గారు పదిహేను లక్షల ఖర్చు అవుతుంది కాబట్టి అకాడమీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించలేనని చెప్పారు. అకాడెమికి మద్దతు యివ్వటానికీ, మేధోపరమైన స్వేచ్ఛను కాపాడటానికి అది ఎక్కువ మొత్తమా? మొదటి అకాడెమీ ప్రెసిడెంట్ గా ఈ స్వేచ్ఛనేనా నెహ్రూగారు ఈ గొప్ప సంస్థ హక్కుగా ఎత్తి చెప్పింది?

బహుముఖత్వపు తాత్వికత

సర్, సాహిత్య ఆకాడెమి నుండి ప్రయాణం సాగించిన కొంత మంది మేధావులు హిందూత్వంలో మన చరిత్ర, సంస్కృతులకు సంబంధించి గొప్ప విద్యావేత్తలు కూడా. నేనిక్కడ ఐదు మందిని మాత్రమే ప్రస్తావిస్తాను. డా. రాధాకృష్ణన్, రాజాజీ, కె.ఎం మున్షి, కె.ఎం పణిక్కర్, సునీతి చటర్జీ. ఎవరైతే చీలిక ఎజండాను ముందుకు తీసుకొని వస్తున్నారో వారు మన దేశపు బహుముఖత్వపు తాత్వికతను నేర్చుకోవాలంటే పైన చెప్పిన వారి రచనలను దయచేసి చదవమని చెప్పండి. వారి జ్ఞానం గౌరవప్రదమైనది. ఎగురుతున్న మన జండా కింద వారి జ్ఞానం గర్వకారణమైనది.

ఈ రోజు మన జాతీయజండా ఒకే రంగుతో ఉండాలనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఈ గొప్పవ్యక్తులు తప్పుగా చెబుతున్నట్లు మన జండా, దాని రంగుల ద్వారా, ఏ మతాన్ని ప్రతిబింబించదు. నేను ఇండియా.ఇన్ లో మన ప్రభుత్వం ఏమి చెబుతుందో ప్రసావిస్తాను. “పైన ఉన్న కాషాయ రంగు దేశపు ధీరత్వాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న తెలుపు ధర్మ చక్రంతో సహా శాంతినీ, సత్యాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చరంగు మన దేశపు సత్తువను, పవిత్రతను, అభివృద్ధిని సూచిస్తుంది. ”సుజలాం, సుఫలాం, మలయజ సీతాలాం, సస్యశ్యామలాం మాతరం …

నా హిందూత్వం అందర్నీ ప్రేమించమనీ, గౌరవించమనీ నాకు నేర్పింది. నా దేశం ఒకే వర్ణంతో ఉండలేనంత పెద్దది. ఇక్కడ ఉన్న బహళ సంస్కృతీనీ, బహుముఖత్వాన్ని మళ్ళీ మళ్ళీ బలపర్చాల్సిన అవసరం ఉంది. సర్వేభవంతు సుఖీనా – మానవులందరూ సంతోషంగా ఉండాలి. కేవలం అందులో ఒక భాగం కాదు. 2014లో మీరు గెలుచుకొన్న మూడోవంతు జనాభా మాత్రమే కాదు.

మీరు మన సమాజంలో ఎక్కువ భాగం ప్రతిధ్వనిస్తున్న గొంతులను వింటారని మీకు విన్నవించుకొంటున్నాను. మన నాయకులు ఓట్లకోసం గంభీరమైన ఉపన్యాసాలు యివ్వటం మాత్రమే చాలదు. వారి కార్యశీలతలోనే వారి తాత్పర్యాన్ని, ప్రయత్నాన్ని చూస్తాము. మన రాజ్యాంగమే చట్టాన్ని గౌరవించని గుంపుల చేత భయం లేకుండా అతిక్రమించబడుతుంది. వారి హిందుత్వపు అర్ధాన్ని మళ్ళీ పునరాలోచించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మాత్రమే నిజంగా స్పందించగలరు. ఇక అకాడెమీకి సంబంధించి దాని ప్రెసిడెంటు ఒక సమాధానాన్ని తయారు చేశారని విన్నాను. కానీ ఆ సంస్థకు జరగబోతున్న హాని మళ్ళీ పూడ్చుకోలేనిది.

(అభిజిత్ సేన్ గుప్త భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో మాజీ సెక్రెటరీ)