ట్యాగులు

, ,

blog1

ప్రతి స్వేచ్ఛ ఈ రోజు దాడికి గురి అవుతుంది. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఏ దేవుణ్ణి పూజించాలో నిర్ణయించుకొనే హక్కు, ఏ తిండి తినాలో నిర్ణయించుకొనే హక్కు, ఏ బట్టలు కట్టుకోవాలో, ఎలాంటి సహచరుడిని ఎన్నుకోవాలో… ఈ జాబితా పెరిగిపోతోంది. ఈ దాడులు మౌఖికంగా జరగవచ్చు, భౌతికంగా జరగవచ్చు, అత్యాచారం కావచ్చు, చివరకు హత్య కూడా కావచ్చు. ధబోల్కర్, పన్సారే ఆటవిక హత్యలు కానీ, మహమ్మద్ అక్ష్లాక్ వధకానీ, ప్రభుత్వానికీ సాంస్కృతిక సంస్థలకు వచ్చిన అభిప్రాయ బేధాలు కానీ .. ఇక మౌనంగా ఉండే పరిస్థితి లేదు.

నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరు నా స్నేహితులుగా ఉండాలి, నేను ఏ విషయంగా పని చేయాలి, నా పనిని ఏ దృక్కోణంనుండి నేను అర్ధం చేసుకోవాలి లాంటి స్వేచ్ఛకు సంబందించిన ప్రాధమిక విషయాలు ప్రమాదంలో ఉన్నాయి. ఒక వేళ నేను వినక పోతే నేను నా భద్రత గురించి నేను భయపడాలా? బ్రతుకు, సాంస్కృతిక వ్యక్తీకరణ రెండూ వేరు కాదు. సహనం దాడికి గురి అవుతున్నప్పుడు పైన చెప్పిన రెండూ అవిభక్తంగా ఉంటాయి. అవార్డును తిరిగి ఇచ్చి వేయటం కూడా ఒక వ్యక్తీకరణే. అది ఒక వైపుకు వెళ్లిపోవటం కాదు, అది కూడగట్టటం .. ఇంకా చెప్పాలంటే శాంతి కోసం పోరాడటం.

సంభాషణ మారిపోయింది

గత కొద్ది కాలం నుండి సంభాషణ ప్రాముఖ్యత తగ్గి పోయిందని గ్రహించిన వాళ్ళు కేవలం రచయితలు, సృజనకారులే కాదు. ఇది కేవలం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారం, హత్య లాంటి వ్యక్తిగత నేరాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక యంత్రాగం శాసిస్తున్నట్లుగా కనబడుతున్న మారి పోయిన వాతావరణానికి సంబంధించిన విషయం. హిందువులు ఒక వైపూ, ముస్లీములు క్రిష్టియన్ల ఇంకో వైపు, వీరి మధ్య అగ్నిని మండించే లక్షణం కలిగిన భయంకరమైన ప్రకటనలు, దుర్మార్గమైన దాడులు .. ఇవన్నీ నిత్యకృత్యాలు అయిపోతున్నాయి. దళితులు, ఆదివాసీలు, మహిళలు ముఖ్యంగా ఏకాకులు అవుతున్నారు. విశాలమైన హిందూ వాహిని నుండి వచ్చిన వారే ఈ దాడులలో నిమగ్నమై ఉన్నారు. ఎవరికైనా ఈ విషయం అర్ధం అవుతుంది. ఇంకా మధన పడాల్సిన విషయం ఏమిటంటే వారంతా అధికార పార్టీ ఎంపీలు, మంత్రులు.

ఇప్పటి ప్రభుత్వం నుండీ, ప్రభుత్వం కింద రక్షణ పొందుతున్నవారి నుండీ ఎవరు మంచి భారతీయులుగా మారుతారు అనే విషయం మీద భయపెట్టే కదలిక జరుగుతుంది. ఇప్పుడు భారతీయులుగా ఉండడటం మాత్రమే సరిపోదు. మహిళలు భారతీయ వస్త్ర నింబంధనావళిని పాటించక పోతే వారు భారతీయులే కాదు. మైనారిటీ కమ్యూనిటీలో పెరుగుతున్న సభ్యుల సంఖ్యకు సంబంధించిన ‘భయాందోళన’ను పరిష్కరించటానికి నలుగురు నుండి పది మంది వరకు పిల్లల్ని కనే స్త్రీలను స్తుతిస్తున్నారు. ఇంకో పక్క సాంస్కృతిక శాఖా మంత్రి గారు ప్రజా సంబంధమైన, పాశ్చాత్యీకరించబడిన, భారతీయ సంస్కృతీ నాగరికతలు పునరుద్ధరణకు గురి కావాల్సివుండిన ప్రతి శాఖనూ శుభ్రం చేస్తామనీ అంటున్నారు. అదీ చరిత్ర అయినా, సాంస్కృతిక వారసత్వం అయినా, సంస్థలయినా ఏళ్ళగా ‘భ్రష్టు’ పట్టినవేవీ వదలరట.

అందుకే మన ప్రధమ భారత పౌరుడు అయిన దివంగత అబ్దుల్ కలాంకు కూడా శర్మగారు మంచి దృవీకరణ పత్రం ఇచ్చారు. ఆయన ‘ముస్లిం’ అయినప్పటికీ మానవతావాదిగా, దేశభక్తి పరునిగా వర్ణించబడ్డాడు. ఇలాంటివాడే ఒక బీజేపీ మంత్రి ‘లౌకికవాదం’ అనే పదాన్ని భారతీయ రాజ్యాంగం నుండి తీసి వేయాలని ప్రతిపాదించాడు. గత కొన్ని నెలలుగా ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

గుడ్డి దృష్టి

మన ప్రధానమంత్రి గారి ప్రతి స్పందన మామూలుగా, కళ్ళు లేనట్లుగా ఉంటుంది. ఎక్కువ కాలం నిశ్శబ్ధంగా వుంటున్నారు. ప్రభుత్వంలోనూ బయటా వున్నఅసహన శక్తులను, హిందూత్వ పేరుతో అవమానాలూ అత్యాచారాలూ హత్యలు చేస్తున్న వారికి వ్యతిరేకంగా ఆయన దృఢంగా కళ్ళాలు లాగుతున్న రాజకీయాలను ‘సూడో సెక్యూలరిస్టులు’ ‘ఏకపక్షం’ చేస్తున్నారని దాడి చేయటం లాంటివి చేస్తుంటారు. పార్లమెంటులో 282 సీట్లను మోస్తున్న ప్రభుత్వం అంతకంటే పెద్ద బాధ్యతనూ, సహన పూరితమైన వాతావరణాన్నివాగ్ధానం చేసిన అధికారాన్ని, ప్రతి భారతీయుడికి భధ్రతనిచ్చే పరిస్థితినీ మోయాలి.

ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా కోపం రాకుండా ఎలా ఉంటుంది? వచ్చిన కోపాన్ని వ్యక్తీకరించకుండా ఎలా ఉంటారు? ప్రభుత్వం లేచి కూర్చొని చెప్పేది గమనంలోకి తీసుకోవాల్సిన స్థితిలో ఎవరైనా ఏమి చేయకుండా ఉండాలని ఎలా నిర్ణయించుకొంటారు?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవార్డులు తిరిగి యిచ్చిన వారెవరూ గుంపుగా కూర్చొని నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం ఒక విద్యుత్శక్తి లాగా వంకరటింకరగా దారి తీసుకొంటూ, పునర్ శక్తిని పొందుతూ భారతదేశం నలుమూలలా వ్యాపించింది.

భారతదేశ స్వాతంత్ర్యం రాక ముందూ, తరువాత రచయితలు, కళాకారులు వారి భావాల్ని వ్యక్తపరిచారు. మానవత్వానికి, మానవతావాదానికి బెదిరింపు వచ్చినప్పుడల్లా వారు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిల్చోన్న చాలా మంది రచయితలు అప్పుడు కూడా అలాగే ప్రవర్తించారు. నేను వ్యక్తిగతంగా అఫ్స్పాకి, బాబ్రీ దాడులకు, 2002 గుజరాత్ దాడులకు వ్యతిరేకంగా, కాంగ్రెస్స్ పాలసీలకు వ్యతిరేకంగా .. నృత్యం, డ్రామా, కామెడీ షోలు నిర్వహించాను. అప్పటి కాంగ్రెస్స్ ప్రభుత్వం డిశంబర్ 2012లో జరిగిన సామూహిక అత్యాచారం పట్ల యువత వేసిన ప్రశ్నలకు గొప్ప జఢత్వాన్ని ప్రదర్శించింది.

ఎం.ఎఫ్ హుస్సేన్ కు ఆయన దేశంలో గత ప్రభుత్వం భద్రత వాగ్ధానం చేయనపుడు మా కోపాన్ని వ్యక్తీకరించాము. అలాగే హిందూత్వ గుండాలు ఆయన మీద దాడి చేసి ఆయన బొమ్మలను ధ్వంసం చేసి ఆయన స్వయంగా దేశాంతరాలకు పోయే పరిస్థితి కల్పించినపుడు కూడా అలాగే కోపం ప్రదర్శించాము. ఇదంతా ఈ దేశంలోనే ఆయన 90 ఏళ్ళు జీవించిన తరువాత ఆర్టిస్టుగా ఎదిగిన తరువాత జరిగింది.

అవును. గత ప్రభుత్వంలోకూడా ఈ రచయితలందరూ ఇలాంటి ఆగ్రహాన్నే మత అల్లర్లు జరిగినపుడు ప్రదర్శించారు. వారి రాతల ద్వారా కానీ, ప్రకటనల ద్వారా కానీ, వీధుల్లో ప్రదర్శనలు చేయటం ద్వారా కానీ వారు మాట్లాడారు. మాలాంటి చాలా మంది కొత్త కొత్త పద్దతుల ద్వారా ఇలాగే మా నిరసనను కొనసాగిస్తాము. ఏ రూపంలో చేస్తాము, ఎందుకు చేస్తాము అనే విషయాన్ని ఎవరూ నిర్దేశించలేరు. కానీ మేము చేసేదంతా ఎప్పుడూ మానవత్వాన్ని, మానవత్వపు రాజకీయాలను పునరుద్ధరించటానికే.

అత్యుత్సాహమైన ప్రజాస్పందన

అవార్డు నా చేతిలో ఉన్న ఒక ఆయుధం. నా మిగతా స్నేహితులతో బాటు అది తిరిగి యిచ్చేయటం వలన ఒక వైపు ప్రభుత్వాన్ని కుదిపినట్లు అవుతుంది. ఇంకో వైపు అసహనాన్ని భరించకూడదనీ, అది మనందరినీ ప్రభావితం చేస్తుందనీ నమ్మే వాళ్ళకు ధైర్యాన్ని యిస్తుంది. న్యాయస్థానాల్లో చాలా మంది మమ్మల్ని అదే కారణంతో బలపరుస్తారని నమ్ముతున్నాను. అవార్డులు తిరిగి యిచ్చేసి మేము మా పాఠకుల, శ్రోతల కోరికలకు అనుగుణంగా జీవించామని పొంగి పొరలుతున్న ప్రజా స్పందనతో (ముఖ్యంగా సోషల్ నెట్ వర్కుద్వారా) మాకు స్పష్టమయ్యింది.

ఇలాంటి సందర్భాలలో ఎందుకు మంత్రుల నుండీ, ప్రెస్ నుండీ, కాషాయ వస్త్రాలు చుట్టుకొన్న సాంస్కృతిక నాయకుల నుండీ, ఉదారవాద వ్యతిరేక సమూహాల నుండి ఎలాంటి ఉత్సాహం వ్యక్తం కావటం లేదు? ప్రతి రోజూ ఎంతో మంది రచయితలు, కళాకారులు కేవలం అవార్డు తిరిగి యిచ్చేయటమో లేకపోతే రాజ్యభోజ్యమైన సాంస్కృతిక సంస్థలకు రాజీనామా చేయటం వలనో ఇప్పుడింత అల్లకల్లోలము ఎందుకు జరుగుతుంది?

కారణం ఏమిటంటే వారు అశాంతిగా ఉన్నారు. రచయితలలో గొప్ప సమర్ధత కలవారూ, ప్రజామోదం కలవారూ, అన్నీ భాషల నుండీ వచ్చిన వారూ, దేశ మారుమూలల నుండి రాసిన వారూ, గొప్ప గౌరవాలు అందుకొని సాంస్కృతిక సంస్థల ద్వారా గుర్తింపు పొందిన వారూ .. అందరూ ఒకే గొంతుతో మాట్లాడుతున్నారు. వారి వారి అవార్డులు యిచ్చివేసి దేశంలో అపూర్వంగా మాట్లాడుతున్నారు. ప్రతి రోజూ వారి సంఖ్య పెరుతుతుంది. వారి పాఠకులు, అభిమానులు వారి సాహసమైన ముందడుగును అభినందిస్తున్నారు. ప్రతి రోజు వారు మొదటి పేజీ వార్త అవుతున్నారు. వార్తా ఛానళ్ళు ప్రైమ్ టైమ్ లో వారిని మాట్లాడటానికి పిలుస్తున్నాయి. ప్రభుత్వం నెర్వస్ కావాటానికి ఇది చాలు. ప్రత్యమ్నాయ, మానవతా గొంతు, రాజకీయాలు ఇవ్వటానికి ఇది చాలు. వేటు వేయటానికి చేతిలో ఉన్న ఆయుధం ‘అవార్డు.’

(మాయా కృష్ణారావు న్యూఢిల్లీకి చెందిన కళాకారిణి. ఆమె తన ‘సంగీత్, నాటక్ అకాడెమీ అవార్డు’ ను తిరిగి ఇచ్చేశారు)