ట్యాగులు

,

 

Daughter-of-peace

జీవితం ముగిసిపోయినపుడు

ప్రాణహీనమైన నా శరీరాన్ని

దయచేసి మీరు ఎత్తి తీసుకుపోయి

ఫాదర్ కౌబ్రూ పరున్న నేల మీద ఉంచండి.

 

పైనున్న తొక్క ఎలాగూ ఎండిపోతుంది

దాన్ని నేలలోనే కుళ్ళనివ్వండి

ఏ గనిలోనో ఖనిజంగా మారి

భావితరాలకి ఉపయుక్తమవనీయండి

 

నా జన్మభూమి కాంగ్లీ నుండి నేను

శాంతి సుగంధాన్నై నలుదిక్కులా వ్యాపిస్తాను

సమీప భవిష్యత్తులో

అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది

– ఇరోమీ  షర్మిలా

అక్టోబర్ నెలాఖరులో మణిపురి రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లోని చీఫ్ జుడీషియల్ కోర్టు నుండి ఇరోమీ షర్మిల బయటకు వచ్చినపుడు ఆమెకు ఎప్పుడూ స్వాగతం చెప్పే ప్రజా సందోహం కనబడలేదు. ప్రజలకు ఆసక్తి కలిగించే విషయాలను మార్చే ప్రయత్నాన్ని వివిధ మాధ్యమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు అది అన్నా హజారేను హీరోను చేస్తాయి. అరవింద్ కేజ్రి వాల్ ను పత్రికల మొదటి పేజీ మనిషిగా చేస్తాయి. బహుశా కూతురిని చంపిన అభియోగం మీద విచారణకు గురి అవుతున్న ఇదే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అందమైన ఇంద్రాణి ముఖర్జీ కూడా వార్తల్లో వ్యక్తి కావచ్చు. అయితే ఏ ఫలితాన్నిఆశించి ఇరోమీ షర్మిల పదిహేనేళ్ళ క్రితం నిరాహారదీక్ష మొదలు పెట్టిందో అది సిద్దించకుండానే, ఆమె దీక్షకు ప్రేరేపించిన పరిస్థితులు ఈశాన్య రాష్ట్రాలలో అణుమాత్రం కూడా మారకుండానే ఆమె సుధీర్ఘ నిరసనోద్యమం ప్రాసంగీతను, ప్రాముఖ్యతను కోల్పోయే ప్రసక్తే లేదు.

ముక్కులలో ఆహార ట్యూబులనూ, మనసులో ఉక్కు సంకల్పాన్ని మోస్తున్న షర్మిలా దీక్ష మొదలు పెట్టే సమయానికి ఆమె వయసు కేవలం ఇరవై ఎనిమిది మాత్రమే. పెళ్లి చేసుకొని పిల్లలను కనవల్సిన వయసులో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నవంబరుకి పదిహేను ఏళ్ళు నిండబోతున్న షర్మిలా నిర్ణయం వెనుకాల ఒక ప్రగాఢమైన కాంక్ష ఉంది. ఒక పురాతనమైన నేపధ్యం ఉంది. నెత్తుటిమయమైన యుద్ధం ఉంది. ఆడవాళ్ళ ఆక్రందన, ప్రతిఘటన ఉన్నాయి. నవంబర్ 2, 2000 సంవత్సరం మణిపాల్ లోయలోని మలోం బస్టాండ్ లో అస్సాం రైఫిల్స్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. పదిమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కవయిత్రి, జర్నలిస్టు అయిన షర్మిల ఈ సంఘటనతో చలించి పోయింది. ‘సాయుధ భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ అని పిలిచే ఈ నల్ల చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల నుండి తొలగించాలనే డిమాండ్ తో ఒంటరిగానైనా ఉద్యమించాలని అనుకొన్నది. ఏ ఉద్యమానికైనా ఒక స్థావరం, ఒక ఆయుధం అవసరమౌతాయి. మొదట ఆమె తన యింటినే స్థావరంగా ఎంచుకొన్నది. ఇక ఆయుధంగా ఆమె శరీరాన్నే గురిపెట్టింది. భారత పాలకులు అనాదిగా జపం చేస్తున్న ‘సత్యాగ్రహాన్ని’ పునాదిగా తీసుకొని ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టినా గడిచిన పదిహేను ఏళ్లలో ఆమె ఐదు వందల సార్లకు పైగా కోర్టు, జైలు, ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. కేవలం 37 కేజీల బలహీన శరీరంతో ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది.

భిన్నజాతులకు, తెగలకు నిలయాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో ప్రజల సంస్కృతి భిన్నమైనది. ఆదిమ కమ్యూనిస్టు సమాజపు అవశేషాలు ఇంకా ఈ తెగలలో కనిపిస్తాయి. భారతదేశంలో ఇతర భూభాగాల కంటే స్త్రీలు ఇక్కడ సాపేక్షికంగా స్వతంత్రంగా, స్వాలంబనతో బతికారు. లైంగిక దాడుల వూసు తెలియని వారంటే కూడా అతిశయోక్తి కాదు. బ్రిటిష్ వాడికి ఎదురొడ్డి గెరిల్లా పోరాటాలు చేశారు. పదహారు సంవత్సరాల యవ్వన జీవితాన్ని బ్రిటీషు ప్రభుత్వ కఠిన కారాగారాలలో గడిపిన వీర వనిత గైడిన్ల్యూ నాగా జాతికి చెందిన మహిళే. స్వాత్రంత్యం వచ్చాక కాంగ్రెస్సు నేతలు బ్రిటీష్ రాజ్యాలకు మేమే వారసులమని ప్రకటించుకొని ఈ రాష్ట్రాలను ఆక్రమించుకొన్నారు. పెద్ద భూభాగానికి ప్రధాని కావటానికి నెహ్రూ చేసిన మొండి రాజకీయం ఇక్కడి కోట్ల ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాల రాసింది. ఆ నాటి నుండి ఈ జాతుల మధ్య వైరాలకు ఆజ్యం పోస్తూ, ఇక్కడి ప్రజలను అనైక్య పరుస్తూ భారత ప్రభుత్వం పబ్బం గడుపుకొంటోంది. సామ్రాజ్యవాద దేశాలకు అంతర్జాతీయ వ్యాపారానికి వ్యూహాత్మక దారులుగా ఉపయోగపడే ఈ రాష్ట్రాల ప్రజలను అదుపులో ఉంచటానికి అనేక నల్ల చట్టాలను తెస్తోంది. 1958 సెప్టెంబర్ నుండి ప్రత్యేక సాయుధ దళాల చట్టాన్ని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలలలో ప్రవేశ పెట్టింది. అప్పటి నుండి శాంతి భద్రతల పేరుతో నిర్భంధించటానికి, హింస పెట్టటానికి, చంపటానికి ఈ చట్టం తిరుగులేని అధికారాన్ని ప్రసాదించింది. న్యాయాతీతమైన హత్యలకు ఇది చట్టబద్దతను చేకూరుస్తుంది. అసంబద్ద సైన్య ప్రయోగానికి ఈ చట్టం ధర్మబద్ధతను యిస్తుంది. ప్రజల సంక్షేమం పేరుతో ఈ చట్టం చలామణిలో ఉన్నమామూలు చట్టాలను అధిగమిస్తుంది. రాజ్యాంగం పేర్కొన్న ఆర్టికల్స్ 21, 22 నుండి జీవన భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ, అక్రమ నిర్భంధాల నుండీ అరెస్టుల నుండీ భధ్రత ఈ ప్రత్యేక ఆయుధాల చట్టం అతిక్రమిస్తుంది.

ఎక్కడ యుద్ధాలు నిత్య క్రతువులు అవుతాయో అక్కడ స్త్రీలు నెత్తుటి గాయాలు అవుతారు. అక్కడే వాళ్ళు రణగేయాలు ఆలపిస్తారు. స్త్రీల లైంగికత్వం మీద గురి పెట్టి ప్రజల ప్రజాస్వామిక కాంక్షలను అణచటానికి చేసే ప్రయత్నం సర్వత్రా ఉన్నదే అయినా ఈ ప్రాంతంలో ఆ చర్య నిరాటంకంగా, నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రతి చర్య కూడా అదే వుదృతితో ప్రతిఘటనల రూపంగా వస్తోంది. 2004లో ‘పీపీల్స్ లిబరేషన్ ఆర్మీ’ తో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అస్సామ్ రైఫిల్స్ మనోరమా అనే స్త్రీపై సామూహిక లైంగిక దాడి జరిపి చంపివేశారు. ఐదు రోజుల తరువాత ముప్ఫై మంది మధ్య వయసు మహిళలు ఇంఫాల్ వీధుల్లో నగ్న ప్రదర్శన చేస్తూ ‘మేమంతా మనోరమ తల్లులం. మమ్మల్ని కూడా అత్యాచారం చేయండి.” అంటూ అస్సాం రైఫిల్స్ కు సవాలు విసిరారు.

మనం అనుమతి ఇచ్చిన చట్టాలే మనల్ని పరిపాలించాలి. ఇది ఒక ప్రాధమిక హక్కు. స్వేచ్ఛకు రాజ్యాంగంలో కల్పించిన హక్కు అది. ఈ హక్కు ఉత్తర ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు నిద్వంద్వంగా తిరస్కరించారు. అసలు ఒకే రిపబ్లిక్ లో ఉన్న పౌరులు భిన్నమైన చట్టాలను, హక్కులను పొందుతుంటే ‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే మాటకు అర్ధం ఏమిటి? చరిత్ర అంటే ‘భూతకాల వర్ణన’ అని ఒప్పుకొంటే మన భారత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న 44 మిలియన్ల ప్రజల చరిత్రను చక్కగా మర్చిపోయింది. వారి రాజకీయ, చారిత్రిక, సాంస్కృతిక విషయాలను జ్ఞప్తి నుండి తొలగించింది. ప్రజల చరిత్రను తిరస్కరించటం కంటే వారిని అణగదొక్కటం ఇంకేమి ఉంటుంది?

ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పుడు దేశీయ, స్థానిక స్పృహ పెరిగింది. దానికి కొత్త చరిత్ర వచ్చింది. ఆ చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్న శౌర్య పరాక్రమాలకు సంబంధించినది కాదు. ఆదిమ కమ్యూనిష్టు సంస్కృతులు ఉన్న జాతుల గురించి కాదు. ఎప్పటికీ కల్లోలితంగా ఉన్న ప్రాంత చరిత్ర ఇది. దేశ పొలిమేరల్లో ఉన్న రాష్ట్ర చరిత్ర అది. తిరుగుబాట్లకు, హింసకు, బహిష్కరణకు, వెనుకబాటుతనానికి సంబంధించిన చరిత్ర ఇది. ఈ చరిత్రలో భారతదేశ ప్రభుత్వ పక్షపాత ధోరణి వలన ఈ ప్రాంత ప్రజలకు సంక్రమించిన దురవస్థ రాసి ఉంది. రాష్ట్రం దేశంలో అంతర్భాగం కావాలంటే కావాల్సినవి సైన్యాలు, దుర్మార్గ చట్టాలు కావు. మిగతా ప్రజలతో సమానంగా ఆ ప్రజలకు పౌరసత్వం, సౌహార్ధ్ర ఆలింగనం కావాలి.

ఇరోమీ షర్మిలా ఈ కొత్త చరిత్రలో మైలు రాయిగా మిగిలి పోతుంది. నిత్యం నిర్భంధంలో బతుకుతూ తుపాకి గొట్టాల విరగబాటును ప్రశ్నించిన ప్రజాస్వామిక గొంతు ఆమె. యుద్ధ క్షేత్రంగా మారిన మాతృభూమి గాయాలు మాన్పడానికి సంధించిన దీక్ష పేరు ఇరోమీ షర్మిలా. నలుగురి కోసం బతకడం, నలుగురి కోసం చావడానికి సిద్దపడటం ఈ భూమ్మీద అత్యంత గొప్పఆదర్శం. ఆ ఆదర్శాన్ని అంతటా ఆవిష్కరించిన షర్మిలాకి ఐదు వేళ్లూ ముడిచి, చెయ్యి కండరాలు బిగించి రెడ్ సెల్యూట్ చేద్దాము.