ట్యాగులు

, , ,

hh_dp21258921

ఏ మనిషైనా సంపూర్ణంగా పనిచేస్తున్నప్పుడే బతికి ఉన్నట్లు లెక్క. ఆ పని నూతన సమాజ నిర్మాణంలో భాగం అయితే దానికి మరింత సార్ధకత వుంటుంది. ఆ అవకాశం అందరికీ ఉంటుందా? ముఖ్యంగా మహిళలకు ఇంటి పని, పిల్లల పెంపకం కాకుండా తాను కోరుకొన్న పని చేయటానికి కావాల్సిన ప్రోత్సాహం వాళ్ళు నిర్మిచుకొంటున్న కొత్త సమాజంలో లేక పోతే ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? సమాజ చక్రం తన చుట్టూ తాను తిరుగుతున్నట్లు కనబడుతూ ముందుకు సాగుతున్నప్పుడు అందులోని స్త్రీల ఆలోచనా సరళీలో వచ్చిన మార్పులు, ఆచరణలో ఎదుర్కొనే సంక్లిష్టతను .. సమాజం, కుటుంబం ఎలా అర్ధం చేసుకోవాలి? భార్యాభర్తల మధ్య ప్రేమబంధం ఏ భౌతిక పరిస్థితుల తాకిడికి గురి కాకుండా స్వతంత్రంగా నిలిచి ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో చర్చించింది ‘ఆదర్శజీవులు’ నవల.

adarsajiivulu-page-001

 

స్త్రీలు వారి అస్తిత్వ నిరూపణ కోసం చేస్తున్న ప్రయత్నాలను సాంప్రదాయ రీతిలో కాకుండా కొత్త కళ్ళతో చూడాల్సిన అవసరాన్ని ఆ నాటి సోవియట్ సాహిత్యం గుర్తించింది. సమాజం పురోగమిస్తున్నప్పుడు దాని అంతః పొరల్లో దాగిన జీవితాల ప్రతిఫలనమే సాహిత్య సృష్టి అని నమ్మితే ఆ పనిని సోవియట్ సాహిత్యం బహు బాగా నిర్వర్తించింది. ‘కమ్యూనిజం స్త్రీ సమస్యకు పరిష్కారం చెప్పదు.’ అనే విమర్శకు సమాధానంగా ‘ఆదర్శజీవులు’ నవలను ముందు పెట్టవచ్చు. అలాగే సాంప్రదాయ కమ్యూనిష్టులు స్త్రీలు కోరుకొనే స్వేచ్ఛను యాంత్రికంగా అర్ధం చేసుకోవటంలో జరిగే పొరపాటును కూడా ఎత్తి చూపుతుంది ఈ నవల. 1948లో స్టాలిన్ అవార్డు పొందిన ఈ నవల రచయిత్రి ఆంతోనినా కొప్తాయెవా (రష్యన్ భాషలో ‘యెవా’ అంటే మహిళ. ‘యెవ్’ అంటే పురుషుడు) ‘ఇవాన్ ఇవనోవిచ్’ పేరుతో ఆంగ్లంలో వచ్చిన ఈ నవల తెలుగుసేత అట్లూరి పిచ్చేశ్వరరావు గారు. ఆదర్శ జీవులు పుస్తకం బయట ఇప్పుడు లభ్యం కావటం లేదు. పాత తరం వారి లైబ్రరీలలో బహుశా ఇది దొరక వచ్చు. షుమారు 800 పేజీలు ఉండే ఈ పుస్తకం చదువుతూ కొత్త లోకాలలోకి విహరించవచ్చు. ఈ పుస్తకం పునర్ముద్రణ జరుగుతుందని వినికిడి

 

41h-GUQJGkL._SY344_BO1,204,203,200_

 

ఈ నవలలో లేవనెత్తిన అంశాలు రష్యాలో ఆనాడు జరుగుతున్న పరిణామాల వెలుగులో కనబడతాయి. అది 1940వ సంవత్సరం. రష్యా విప్లవం వచ్చి అప్పటికి 23 సంవత్సరాలు. స్టాలిన్ జారు చక్రవర్తుల నుండి వెనుకబడిన జాతులకు విముక్తి కలిగించి పూర్తి స్వాతంత్యం యిస్తాడు. అనేక జాతులు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషల్ రిపబ్లిక్ లో చేరాయి. అప్పుడే నాజీ జర్మన్లు ప్రపంచాధిపత్యం కోసం రెండో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. రష్యాలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా దేశ పునర్నిర్మాణానికి కష్టిస్తున్నారు. అడవులు కొట్టి, కొండలు తొలిచి రోడ్లు వేశారు. పట్టణాలు కట్టారు. కనీవినీ యెరగని ధాన్యాన్ని పండించారు. బంగారం, ఉన్నీ, మత్య పరిశ్రమలు చలికి గడ్డకట్టుకుపోయే సైబీరియా ప్రాంతంలో కూడా స్థాపించారు. ఉజ్బెకిస్తాన్ లో పరంజాను (స్త్రీల ముసుగు) నిషేధించిన సంవత్సరం అది. స్త్రీలు పురుషులు సమానంగా పని చేయక పోతే అది సాధ్యం కాని విషయం. ఈ నవలలోని పాత్రలు ఉన్నత వర్గానికి చెందిన ఓల్గా, వెనుకబడిన జాతులకు చెందిన వార్యా, ఎలీనా, మార్ఫాలు కూడా ఈ అభివృద్ధి కృషిలో తమ వంతు పాలు కోసం తహతహలాడుతుంటారు.

కధ జరిగిన సైబీరియా అందాలు శాస్త్రీయ సంగీతంలాగా నవలంతా వినిపిస్తూ కనిపిస్తుంటాయి. మాస్కో నుండి ఓడలో బయలుదేరుతుంది ఓల్గా, ఉత్తరప్రాంతంలోని కామనూష్కా పట్టణంలో బంగారపు గనుల దగ్గర డాక్టరుగా పని చేస్తున్న భర్తను కలవటానికి. ఓడలో కలిసిన తామ్ రోవ్ తో పిచ్చాపాటి మాట్లాడుతూ తన కుటుంబంలో ఇంజనీరులు, శాస్త్ర వేత్తలు, డాక్టర్లు ఉన్నారని చెబుతుంది. “మరి మీరేమీ చేస్తారు?” అని ప్రశ్న వేస్తాడు తామ్ రోవ్. ఆ ప్రశ్న కలిగించిన సంచలనాన్ని మోసుకొని భర్త దగ్గరకు వెళుతుంది ఓల్గా.

భర్త ఇవాన్ ఇవనోవిచ్ ఒక ప్రజా వైద్యుడు. సర్జను. ప్రజలకు ఆపరేషన్లు చేయటం ఒకటే కాకుండా వారి పట్ల బాధ్యతగా వుంటాడు. కొన్ని సందర్భాలలో రోగులు కోలుకున్నాక వారికి ఉద్యోగ సిఫార్సులు కూడా చేస్తుంటాడు – వాళ్ళు త్వరగా మానసికంగా కోలుకోవాలని. వైద్యులు వైద్యం ఒక్కటే కాదు, మందులను కనిపెట్టి కొన్ని జబ్బుల శాశ్వత నివారణకు నిరంతరం కృషి చేయాలని నమ్మేవాడు. వైద్యం అభివృద్ధి ప్రజలతోనే జరుగుతుందని విశ్వసించేవాడు. కామనుష్కా బంగారు గనులున్న ప్రాంతం. అక్కడి ప్రజలు వెనుకబడిన జాతుల వాళ్ళు. వారికి అత్యవసర ఆపరేషన్లు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటాడు.

ఓల్గా అప్పటికే రకరకాల చదువులు మొదలు పెట్టి మధ్యలో ఆపేసి ఉంటుంది. ఆమె తన ఖాళీతనం గురించి బాధపడుతుంటే ‘నువ్వు అన్నిటికి అతీతం’ అంటాడు ఇవాన్. ‘నాకలా అతీతంగా ఉండటం యిష్టం లేదని’ చెబుతుంది ఓల్గా. ‘విశ్రాంతి తీసుకోమని’ అంటాడు ఇవాన్. ‘ఇక్కడింత నిర్మాణం జరుగుతుంటే నేను ఏ పని చేశానని విశ్రాంతి తీసుకోవాలి? నా వంతు పని నేను చేయాలని ఉంది.” నొక్కి చెబుతుంది ఓల్గా. ‘నాకు రెండు చేతుల నిండా పని, నువ్వూ ఉన్నారు. ఇప్పుడు నేను ద్విగుణీకృత ఆనందంలో ఉన్నాను.’ అంటాడు ఇవాన్. ‘అందుకు నాకు సంతోషమే. మరి నా సంగతేంటి? నాకేం ఉంది భవిషత్తులో?’ ప్రశ్నిస్తుంది ఓల్గా. ఇవాన్ ఓల్గా సమస్యను అర్ధం చేసుకోలేక పోతాడు. హాస్పిటల్ లో తనకు నర్సుగా పని చేస్తున్న వార్యాని పనిలో ప్రోత్సహింస్తుంటాడు. మంత్రసాని అయిన ఎలీనా పని పట్ల గౌరవంతో ఉంటాడు. కానీ ఓల్గాను తనకిష్టమైన చదువో, ఉద్యోగమో చేయమని ఎప్పుడూ చెప్పడు. ఆమె అంతట ఆమె అడిగినా పట్టించుకోడు. ఈ విషయాన్నంతా సరిగ్గా అర్ధం చేసుకొన్నవాడు ఆ ప్రాంత పార్టీ కార్యదర్శి లొగునోవ్. ‘మగవాళ్ళమే అంతా. మా స్వార్ధ సుఖం కోసం మేము ప్రేమించిన స్త్రీలనే సర్వ నాశనం చేస్తాం.’ అనుకొంటాడు.

భర్త అంటే తనకు కలుగుతున్న వైముఖ్యాన్ని గుర్తిస్తుంది ఓల్గా. దాన్ని అధిగమించి ఆయన్ను ప్రేమించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పటికప్పుడు తనను తాను విమర్శించుకొంటుంది. ఆ ప్రయత్నం ఇవాన్ వైపు నుండి ఉండదు. తన శ్రమను భార్య గుర్తించటం లేదు అని బాధ పడుతుంటాడు. ఆ బాధలో ఆమెలో ఉన్న మంచిని కూడా గుర్తించటం మానేస్తాడు. ‘నువ్వు కూడా నేను పడుతున్నంత బాధ పడితే నా కష్టం తెలుస్తుంది’ అంటాడు. ‘నా జీవితం కూడా మీ అంత అభిరుచి ఉన్నదైతే, నా అనుభవాన్ని కూడా చెప్పి పంచుకొందును.’ అంటుంది ఓల్గా.

ఓల్గా తీవ్రంగా అంతర్మధనం చెందుతుంది. పని విషయం గుర్తుకు వచ్చినపుడు ఆమెకు వెంటనే తనను మొదట ప్రశ్నించిన తామ్ రోవ్ గుర్తుకు వస్తాడు. అనుకోకుండా తామ్ రోవ్ ఆ ప్రాంతానికి ఇంజనీరుగా వస్తాడు. పని పట్ల ఆమెకు ఉన్న యిష్టం తామ్ రోవ్ మీదకు మళ్ళుతుంది. ఆయన ప్రోత్సాహంతో పత్రికకు వ్యాసాలు రాయటం మొదలు పెడుతుంది ఓల్గా. ఆమె వ్యాసాలు రాయటం ‘పక్కపని’గా భావిస్తాడు ఇవాన్. తప్పులు చెప్పి ప్రోత్సహిస్తాడు తామ్ రోవ్. ఇక్కడ ఓల్గా తామ్ రోవ్ తో చేస్తున్న స్నేహం గురించి పార్టీలో చర్చ వస్తుంది. ‘తామ్ రోవ్ నా జీవితంలోని ప్రధాన సమస్యను పరిష్కరించటానికి సహాయం చేశాడు. నాకు తగిన పనిని ఎన్నుకోవటానికి సహాయం చేశాడు. అతని వలన నా జీవితానికి ఒక అర్ధమూ ఆశయం ఏర్పడ్డాయి’ అని ధైర్యంగా పార్టీ కార్యదర్శికి చెబుతుంది. పార్టీ కార్యదర్శి ఆ సందర్భంలో ‘కుటుంబం సంఘానికి పునాది కాబట్టి, కుటుంబ వ్యవహారాలు సంఘానికి సంబంధించినవే అనడంలో సందేహం లేదు. కానీ హృదయానికి సంబంధించిన అనుబంధాన్ని కాదనడానికి మనమెవరం?’ అని వ్యాఖ్యానిస్తాడు. అదే సమయంలో ‘సాంఘిక ప్రవర్తనకు అంటకుండా ఉన్నంత వరకే వ్యక్తిగతం. కానీ సరిహద్దులు దాటిందీ అంటే సంఘం జోక్యం తప్పదు’ అని కూడా అంటాడు.

తావ్ రోవ్ కి స్త్రీల పట్ల సరైన భావాలు ఉంటాయి. స్త్రీలలోని ఆలోచన స్వాతంత్ర్యానికి, భావనా స్వాతంత్ర్యానికి గౌరవం యిస్తాడు. ఆత్మ గౌరవం కలిగిన యే స్త్రీ యింటి పనితో సంతృప్తి చెందకూడదని అంటాడు. స్త్రీలలో ఆకర్షణ సమాజంలో వాళ్ళు ఏర్పరుచుకొన్న ప్రత్యేక స్థానం వలనే వస్తుందని చెప్తాడు. తమ పనుల్లోనే బలం ఉన్నదీ అని స్త్రీలు గుర్తించిన నాడు వయసులో ఉండే తారతమ్యాలు రూపుమాసి పోతాయి అని ఆయన అభిప్రాయం. తామ్ రోవ్ ఓల్గాను ఆరాధిస్తుంటాడు. ఓల్గా కూడా పూర్తిగా తామ్ రోవ్ ప్రేమలో పడి పోతుంది. భర్త గురించి ఆలోచిస్తూ ‘నేను స్వార్ధపరురాలినే అనుకొందాం. మనో నిబ్బరం లేనిదాన్నే అనుకొందాం. ఆయన కంటే అనేక విధాలా, అనేక రెట్లు చెడ్డదాన్నే అనుకొందాం, అలా అనుకొన్నా యింకా ఆయనతో కలిసి ఉండటం మరీ తప్పు కదా!’ అనుకొంటుంది. తామ్ రోవ్ పట్ల ఓల్గాకు వున్న కృతజ్నత స్నేహంగా మారి అది ప్రేమగా రూపొందింది. కానీ జీవితాన్ని జోడించటానికి భర్తతో తెగతెంపులు చేసుకోవాలి. కానీ తనను ప్రేమించే భర్తతో తెగతెంపులు చేసుకోలేక మథనపడుతుంది ఓల్గా. ఒక సందర్భంలో తామ్ రోవ్ కి భర్తను తాను విడిచిపెట్టలేనని కూడా చెప్పేస్తుంది. కానీ భర్తతో ఇదివరకటిలాగా ఉండలేకపోతుంది.

ఓల్గా ప్రవర్తనలో వచ్చిన తేడాను గుర్తిస్తాడు ఇవాన్. అదే సమయంలో వైద్య సహాయం అందించటానికి ఇవాన్ యాకుతియా (ఆర్కిటికా ప్రాంతం) వెళ్లాల్సి వస్తుంది. కొంతకాలం దూరంగా ఉంటే సమస్యలు తీరతాయేమోనని లొగునోవ్ సలహా యిస్తాడు. ‘ప్రతి వ్యక్తీ కావాలనుకునే స్వాతంత్ర్యాన్నే ఓల్గా కూడా కోరుకొంటుంది. మీరందుకు సాయం చెయ్యాలి. చేయూతనివ్వాలి. మీరు ప్రయత్నం చేశారా? ప్రయత్నించీ విఫలం అయ్యారా? … దూరంగా ఉంటే మీకు కూడా విషయాలన్నీ స్పష్టంగా ఆలోచించుకొనే సావకాశం చిక్కుతుంది.’ అంటాడు. లొగునోవ్ ఇవాన్ యింట్లో వున్న స్త్రీ (ఓల్గా) ఆ యింటికి చెందిన మనిషి కాదని గ్రహిస్తాడు. లొగునోవ్ తో ఓల్గా ‘అందరూ ఇవాన్ ని గురించే ఆలోచిస్తున్నారు. ఆయన చేసే పని చాలా గొప్పదని నేనూ ఒప్పుకొంటున్నాను. కానీ మా యిద్దరికీ ఎవరి బాధలు వారికి ఉన్నాయి. మేము ఎవరి దారిన వారు అభివృద్ధి అయ్యాము.’ అంటుంది. ‘నేనొక నూతిలో పడిపోయాననుకోండి. ఆయన చూసి కూడా నన్ను బయటికి లాగాలని ప్రయత్నించరనుకోండి. నా అంతట నేనే బయటికి ఎక్కి రాగల స్థోమత లేదనుకోండి. అప్పుడెలా ఉంటాయ్ నా భావాలు.. అలా ఉంది యిప్పుడు నా పరిస్థితి’ అని చెప్పుకొంటుంది.

ఇవాన్ వెళ్ళిపోతాడు. ఓల్గాకు పత్రికా ఆఫీసులో ఉద్యోగం వస్తుంది. అవే గనుల మధ్య, ఆ శ్రామికుల జీవితాల గురించే రాయాలని అనుకొంటుంది. తన అస్థిత్వం తన ప్రజల అస్తిత్వానికి ఎంతో కొంత ప్రయోజనం కలగచేయాలని అనుకొంటుంది. ఆమెకు ఒక గది కూడా ఏర్పాటు చేస్తారు పత్రికవాళ్ళు. ఆమె మనసు ‘మరింత పవిత్రంగా, మరింత నిర్మలంగా, మరింత లోతుబారింది.’ అచ్చైయిన అక్షరం కలకాలం నిలుస్తుంది’ అన్న పత్రిక సంపాదకుని మాటలు ఆమె మీద బాగా పని చేస్తాయి. పనిని ప్రేమించటం మొదలు పెట్టాక ఇవాన్ సర్జన్ గా చేసిన పనిని కూడా మూడో వ్యక్తిగా మెచ్చుకోగలుగుతుంది. కానీ తామ్ రోవ్ మీదనే ఆమెకెక్కువ ప్రేమ. ‘తామ్ రోవ్ ఇవాన్ అంత గొప్పవాడు కాకపోతే అలా గొప్పవాడయ్యేందుకు నే చేయగలిగిన సాయం అంతా చేస్తాను.’ అనుకొంటుంది. తామ్ రోవ్ తో కలిసి జీవించటానికి నిర్ణయం తీసుకొంటుంది.

అక్కడ యాకుతియాలో సున్నకు డెబ్బై డిగ్రీల తక్కువ ఉన్న ఉష్ణోగ్రతలో ఇవాన్ యాకుత్ లనే వెనకబడిన జాతులకు అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తాడు. వారి ప్రేమను చూరగొంటాడు. ఓల్గా నిర్ణయంతో వచ్చిన ఉత్తరం చూసి ఒక రోజంతా బాధ పడతాడు. కానీ కర్తవ్య నిర్వహణ ఆయన్నుఎక్కువ సేపు బాధపడనివ్వదు. ఆ ప్రాంతంలో కడుతున్నఆసుపత్రులు, నగరాలు చూసి అబ్బురం చెందుతాడు. అక్కడ జిల్లా కార్యదర్శి వెనకబడిన జాతులకు చెందిన మార్ఫా అనే మహిళా ద్వారా స్త్రీలు ఎంత ఎంత అభివృద్ధి చెందారో తెలుసుకొంటాడు. బోల్షివిక్కులు కడుతున్న నూతన జీవితసౌధం చూసి అచ్చరువు చెందుతాడు. గడువు ముగిశాక కామెనూష్కాకు తిరిగి వస్తాడు. తామ్ రోవ్, ఓల్గాలను తనను మోసం చేశారని దూషిస్తాడు. ఓల్గా తాను మోసం చేయలేదని ఉత్తరం పంపిస్తుంది. ఆ రాత్రి ఓల్గా అక్కడ కార్మికల గురించి రాసిన పుస్తకం చదువుతాడు. ‘ఓల్గా చాలా మంచిది. నేనావిడని ప్రేమించటంలో తప్పేమీ లేదు. నేనేమీ పొరపడలేదు.’ అనుకొంటాడు.

ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి లొగునేవ్ చెప్పిన మాటలు గొప్పవి. ‘వేలాది సంవత్సరాల నుండి మన బొమికల్ని తింటోంది ఆ ఆచారాల తుప్పు. భార్యకూ, భర్తకూ మధ్య ఉండవలసిన నూతన ఆదర్శ సంబంధాల్ని గురించి అందరమూ యిస్తాం మంచి మంచి ఉపన్యాసాలు. కానీ ప్రయోజనం? మన తాత ముత్తాతలేసిన బాటలోనే గడుపుతూ వుంటాం వైవాహిక జీవితాల్ని. సాంఘిక సమానత్వం, ఇద్దరికీ అభిరుచీ, ఆసక్తి ఉన్న విషయాలు, పరస్పర గౌరవాదరాలు లేకుండా సరియైన సోవియెట్ కుటుంబం ఎలా మనగలుగుతుంది? సామాన్యమైన ప్రేమ చిమ్ముడు గొట్టం లాంటిది. ఆ గొట్టం అందంగా వుంటుంది చూడ చక్కగా. కానీ ఆ నీరు పక్క నున్న యిసుక మీద పడగానే ఆరిపోతుంది. కానీ నిజమైన ప్రేమ సజీవమైన నదీ ప్రవాహం లాంటిది. పుట్టిన చోటు నుండి దూరం వెళ్ళేకొద్దీ ఆ నది విశాలమవుతుంది. లోతు హెచ్చుతుంది. నీరు కలకలుదేరుతుంది. ఎప్పుడూ అంత ఉదాసీనంగా ఉండకూడదు మనం స్త్రీలంటే. … వాళ్ళ కడుపుకింత అన్నం, వంటికింత గుడ్డ యిస్తే నీ బాధ్యతంతా తీరిపోయిందనుకోకు. పిల్లలు ఆదర్శవంత పౌరులుగా పెరిగి పెద్దవాళ్ళు కావాలి. నీ భార్య కోసం నువ్వెంత సమయం వెచ్చించావ్. ఆవిడకేమంటే అభిలాషో, ఆశక్తో తెలుసా నీకు? నూతన జీవితాన్ని నిర్మించడానికొక దళాన్ని పెంచుతుందే.. వాళ్ళంతా భావి పౌరులు. కమ్యూనిజంలో బ్రతకబోతున్నారు. నీ భార్యను నైతికంగానూ, మానసికంగాను, అభివృద్ధి చెయ్యవల్సిన బాధ్యతుంది నీ మీద. ఊరికే ఆవిణ్ణి యింటికంతటికి బానిసగా వుపయోగించుకోవడం అంత చెరుపింకొకటి లేదు.’

ఈ నవలలలొ యింకో అద్భుత పాత్ర వార్య. యాకూత్ పిల్ల. జార్ ప్రభువుల నుండి విముక్తి చేసిన సోవియెట్ రష్యా అంటే ఎంతో కృతజ్నత. చెడుగంటే తెలియని మనిషి. సృజనాత్మక పనులంటే ఎంతో ఆసక్తి. యీ అడవుల్ని, పర్వతాన్ని అన్నిటినీ దాటి, దూరాన తెల్ల మబ్బులున్న చోటికి ఒక్క యెగురు యెగరాలని అనుకొంటుంది. మళ్ళీ నేలమీదికే, ప్రజల మధ్యకే రావాలని కూడా అనుకొంటుంది. ఈ నేల, యీ ప్రజలు, యీ వాతావరణం లేకుండా బతకలేననుకొంటుంది. పని లేకుండా ఉండటం అంటే మెడకు పలుపు వేసుకోవటమే ఆమె దృష్టిలో . ఇవెంక్ జాతి (యాకుత్ లలో ఒక తెగ) స్త్రీలలాగా డేరాలెయ్యటం, బల్లకి దుప్పుల్ని కట్టటం, మందలోకి తరమటం అన్నీ వచ్చు. తన పేదరికం నుండీ, వెనుకబాటుతనం నుండీ తాను బయట పడ్డట్టు తన జాతివారందరూ బయటపడాలని కోరుకుంటుంది. వార్య ఇవాన్ ను ప్రేమిస్తూ ఉంటుంది. సకల మానవుల పట్ల అతనికి ఉండే ప్రేమ మీదే ఆమె ప్రేమ. ఒక సందర్భంలో ఇవాన్ కూడా ఆ విషయం ఆలోచిస్తాడు. అతని శరీరంలోని ప్రతి అణువూ లేచి నిలబడి వ్యతిరేకిస్తుంది ఆ ఆలోచనను. ‘ఇక్కడున్నదంతా మాడి పోయింది’ అని హృదయాన్ని ఆమెకు చూపించి చెబుతాడు. యుద్ధానికి వెళుతున్నఅతనిని అనుసరించాలని అనుకొంటుంది వార్య.

ఇంకా ఈ నవలలో కాన్పులు చేస్తూ ఆ తల్లులను ప్రేమించే ఎలీనా, అత్యంత వెనుకబడిన జాతికి చెందినా జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదిగిన మార్ఫాలాంటి ప్రేమాస్పదులైన స్త్రీలు పాత్రలుగా వున్నారు. ఏ పని చేయకుండా ఫేషన్లు అంటూ, పార్టీలు అంటూ తిరిగే ‘పావా’ లాంటి పాత్ర కూడా ఒకటి యిందులో ఉంది.

నేడు సోవియెట్ రష్యా కూలిపోయి వుండవచ్చు. ఉత్పత్తిలో ప్రత్యక్షపాత్ర వహించి అభివృద్ధి వైపు దూసుకొని పోయిన అక్కడి స్త్రీల పరిస్థితి ఇప్పుడు తిరోగమన దిశలో ఉండవచ్చు. కానీ ఆనాటి బోల్షివిక్ నేపధ్యంలో పుట్టుకొచ్చిన స్త్రీ వ్యక్తిత్వభావన, స్త్రీ స్వాతంత్ర్య కాంక్ష నిజ అర్ధాలతో ఓల్గా, వార్య, ఎలీనా, మార్ఫా రూపంతో ప్రపంచమంతా ఎగిరాయి. స్త్రీ పురుష సమానత్వానికి ప్రచార దళాలుగా ఈ పాత్రలు పుస్తకాలలో దూరి కొన్ని తరాల పాఠకుల బుర్రలలో బూజులు దులిపాయి. సోవియెట్ సైబీరియా అందమైన కొండపైనుండి, పచ్చని మైదానాల మీద నుండి, మంచు గడ్డకట్టిన నదుల మీద నుండి ఎగిరి వచ్చిన ఆ వెలుతురు పిట్టలు ఇక్కడ మన యింటి కిటికీ పై వాలి యిప్పటికీ స్త్రీ స్వేచ్చా గీతికలు ఆలపిస్తున్నాయి.

ఈ పరిచయం జనవరి,2016 మాతృకలో ‘వెలుతురు పిట్టలు’ శీర్షికన ప్రచురించాము