ట్యాగులు

, ,

01182016093226r-DALIT-STUDENT-SUICIDE-huge

ఆడపిల్లకు పెళ్ళి చేసి అత్తగారి యింటికి పంపితే నాల్గో రోజే తిరిగి వస్తుంది. కట్నం కోసం వేధిస్తున్నారనో, భరించలేని హింస పెడుతున్నారనో, బతకనియనివ్వడం లేదనో చెబుతుంది. కానీ బ్రతిమలాడో బెదిరించో ఆమెను ఆ చావుగుండంలోకి తోస్తారు. నిజానికి తల్లిదండ్రులకు అంతకంటే మార్గాలు ఉండవు. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని పరిస్థితి కల్పిస్తారు. అవి వ్యవస్థీకృత హత్యలు. ఇప్పుడు ఉన్నత విద్యవిషయంలో అదే జరుగుతుంది. యూనివర్సిటీలు దళితులకు హత్యా మైదానాలు అని తెలిసినా గత్యంతరం లేక దళిత యువత ఆ మైదానాల్లోకే దూకుతున్నారు. నిలువెత్తు ధనం పోసి విద్యను కొనుక్కోగల వెసులుంబాటు లేని ఆర్ధిక స్థితి గలిగిన కుటుంబాల నుండి వచ్చి, ఉన్న అరకొర అవకాశాలు ఉపయోగించుకోక తప్పని అనివార్యత నుండి ఈ స్థితి దాపురిస్తుంది. నిలువెల్లా గాయాలతో, కొన వూపిరితో బయటపడ్డవాళ్ళు ఉంటారు. మరణించిన వాళ్ళూ ఉన్నారు.

మరణించి తప్ప మేలుకొల్పలేని సందర్భం విషాదకరమైనది. అంతకు ముందు ఎనిమిది మంది దళిత విద్యార్ధులు అదే యూనివర్సిటీ కొమ్మకు వేలాడినా చలించని పౌర సమాజం వళ్ళు విరుచుకొని హైదారాబాద్ యూనివర్సిటీ వైపు చూపు మరల్చింది. చనిపోయి మాత్రమే నిర్భయ మధ్య తరగతీ, మీడియా దృష్టి మరల్చగలిగింది. ఆమె బతికి బట్ట కట్టి ఉంటే ఆ సానుభూతి పొందగలిగేది కాదు. అప్పుడు ఆమె లైంగిక సచ్ఛీలతకు సంబంధించిన ప్రశ్నలు ముందుకు వచ్చేవి. ఆ ప్రశ్నల ముందు ఆమెపై జరిగిన లైంగిక దాడి తీవ్రత నీరుకారిపోయేది. రోహిత్ కూడా బతికి యూనివర్సిటీలో యుద్ధం చేస్తున్నప్పుడు అతడు దళితుడిగా పొందుతున్న సదుపాయాలే చర్చకు వచ్చాయి. మేధగా వర్ణించబడుతున్న బ్రహ్మపదార్ధంతో అతడ్ని కొలిచే ఉంటారు. ఆత్మహత్య వలన మాత్రమే అతడు లేవనెత్తిన ప్రశ్నలు దేశమంతా ఎంతో కొంత వ్యాపించాయి అంటే ఆత్మహత్యకు ఒక పరమార్ధం లభించిన విచారకర వాతావరణం ఇప్పటిది. ఆత్మహత్య వలన ఒక సామాజిక ప్రయోజనం నెరవేరిన బాధాకర వైచిత్రి ఇది. వైయుక్తిక కారణాలు అని చెప్పబడుతున్నవాటి వలన (లోతుగా చూస్తే అవి కూడా సామాజిక కారణాలే) జరిగే ఆత్మహత్యల కన్న ఈ ఆత్మహత్యకు గల కారణం సార్వజనీయమైనది. ఆ కారణమే కులం. ఆ కారణమే భారతదేశంలోని వ్యక్తులలో, సంస్థలలో, ప్రభుత్వ యంత్రాంగంలో, అణువణువునా వేళ్ళూనికొని ఉన్న బ్రాహ్మణీయ మనువాద భావజాలం.

ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు కలగటానికి కారణం ‘జీవితం విఫలమయ్యింది’ అనే భావన. ఆ భావన ఇక్కడ కుల అణచివేత కారణంగా వచ్చింది. వేషం, భాష, యాస, పదజాలం, వ్యక్తీకరణ, పేర్లు, యింటి పేర్లు, మేనరిజాలు, నివసించే ప్రాంతాలు … ఇవన్నీ కులానికి సూచికలుగా ఉంటాయి. ఈ సూచికలననుసరించి జరిగే అవమానం, వెలివేత, ఆత్మ న్యూనతా భావం, అస్తిత్వ సంఘర్షణ తక్కువవి కావు. అవి మెదడును మూసివేస్తాయి. దాని ఫలితమే ఆత్మహత్య. సాంస్కృతిక, సాంఘీక వనరులలో దళిత యువతకు భాగస్వామ్యం నిరాకరించటమే కాదు ఆ నిరాకారణను మౌనంగా అనుభవించమని కూడా శాసిస్తున్నారు. సామాజిక అభివృద్ధిలో హక్కులు, అవకాశాలు, పాత్రలు అగ్రవర్ణాలతో సమానంగా కాదు కదా దారిదాపులలో కూడా లేవు. వ్యవస్థాపరమైన ఈ అణచివేత ఒక్కోసారి హింస రూపం తీసుకొంటుంది. ఆ హింస తన మీద తాను ప్రయోగించుకోవటమే ఆత్మహత్య.

అలా మరణించిన వాళ్ళలో రోహిత్ ఒకడు. అతని మరణం ప్రత్యేకత సంతరించుకోవటానికి కారణం అతడు దళితుడు కావటం మాత్రమే కాదు. అత్యున్నత ప్రమాణాలు ఉన్నాయని చెబుతున్న హైదారాబాద్ యూనివర్సిటీలో స్టైఫండ్ సంపాదించుకొని స్కాలర్ గా చేరటం ఒకటే కాదు. జీవించటం పట్ల లాలస, జీవితం పట్ల దృక్పధం ఉన్నవాడు రోహిత్. రోహిత్ కేవలం అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో పని చేయడం వలన వేధింపబడలేదు. వాళ్ళు అంబేడ్కర్ ని ఎప్పుడో కలిపేసుకున్నారు. అందులో పని చేస్తూ స్కాలర్ షిప్ కోసమో, దళితులకు యితర సౌకర్యాల కోసమో పనిచేసినా చనిపోవాల్సి వచ్చేది కాదు. రోహిత్ అంతకు మించినవాడు. ముజఫర్ నగర్ గురించి ఆలోచించాడు. మెమన్ ఉరితీతను ప్రశ్నించాడు. కాషాయం ఎక్కడ ఉన్నా చింపేస్తానని అన్నాడు., అమ్మ చీరనైనా సరే. జవజీవాలు సజీవంగా, రక్తం ఎర్రగా లుకలుకలాడుతున్న వయసుకి, వర్గానికి, కులానికి చెందినవాడు. అందుకే అతడు ఉగ్రవాదిగా పరిగణించబడ్డాడు.

ఈ రకమైన సాంఘీక అణచివేత ఇప్పుడు కొత్తది కాదు. మూతికి ముంత, ముడ్డికి తాటాకు కట్టుకొని తిరిగిన నాటి నుంచి నేటి దళిత యువత మిగిలిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎక్కడికి వెళితే అక్కడికి ప్రయాణమై వచ్చింది. వేషం మార్చుకొన్నది. యూనివర్శిటీలను అగ్రహారాలుగా మార్చుకొన్నది. క్లాసు రూముల్లో, సహ విద్యార్ధులతో సంభాషణలలో తిష్ట వేసింది. స్కాలర్షిప్ కోసం క్యూలో నిలబడితే వెటకారంగా నవ్వింది. స్టైఫండ్ వచ్చిందని స్వీట్ తీసుకెళితే కనుబొమ్మలు ఎగరేసింది. రోహిత్ కి ఇది కొత్త కాదు. పుట్టినప్పటి నుండి అనుభవిస్తుందే. అయితే ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమిటంటే ఫ్యూడల్ కుల అహంకారం కరుడు కట్టి, మతతత్వంతో కలగలిసి రాజకీయ సింహాసనం ఎక్కింది. యువత పాత్రకూ, దేశభక్తికీ నమూనా గీసి అందులో వదగని వాళ్ళకు దేశద్రోహులుగా హుంకరించింది. సాక్ష్యాత్తు అమాత్యుల వారు అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ వారిని దేశద్రోహులుగా చిత్రిస్తూ ఉత్తరం రాయటమే ఇప్పటి కొత్త సందర్భం.

యూనివర్సీటీలలో విద్యార్ధుల మధ్య సంఘర్షణలు చాలా సహజం. బహుముఖ సంస్కృతులు, భావాజాలాలు కలిగిన దేశం యిది. అవి తప్పకుండా విశ్వవిద్యాలయాల్లో ప్రతిఫలిస్తాయి. తెరాస అధికారంలోకి వచ్చాక యూనివర్శిటీలలో పోలీసుల జోక్యం పెరిగింది. ‘పోలీస్ గో బాక్’ నినాదం యూనివర్శిటీలలో ఇప్పుడు వినిపిస్తుంది. కానీ ‘సెంట్రల్ గవర్న్మెంట్ గో బాక్’ అనే నినాదం వినిపించాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంతగా కేంద్రప్రభుత్వ జోక్యం విద్యాలయాల్లో పెరిగింది. రాబోయే తరాన్ని హిందూరాజ్య స్థాపనకు యిటుకరాళ్ళగా ఉపయోగించుకొనే ఎజండా దానికి ఉంది. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చాకా ఆబాగా యూనివర్శిటీలను ‘ప్రక్షాళన’ చేసే పని పెట్టుకొన్నది. మొదట ఐఐటీలలో మాంసాహారాన్ని నిషేదించింది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్స్ లో దేశ చరిత్రకే కొత్త అర్ధాలు చెప్పింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్స్ లో పుష్పక విమానాన్ని ఉదహరిస్తూ భారతీయ ప్రాచీన సైన్స్ అంటూ హాస్య పూరితమైన ప్రతిపాదనలు చేసింది. ఎవరైనా నవ్వుతారనే సిగ్గు లేకుడా వినాయకుడ్ని పుట్టుకను జెనెటిక్ విజయంగా పేర్కొన్నది. జె.ఎన్.యూ, డిల్లీ ఐఐటీలలో హిందూ మత అనుకూల శక్తులను వీసీలుగా నియమించుకొన్నది.

విద్యార్ధులు చోదక శక్తులు. ప్రమాద ఘంటికలు మోగగానే స్పందించారు. ఎఫ్.టి.ఐ.ఐ ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్ ట్యూషన్ ఆఫ్ ఇండియా) విద్యార్ధులు ఆ సంస్థ చైర్ పర్సన్ గా గజేంద్ర చౌహాన్ నియామకానికి వ్యతిరేకంగా నూట పదహారు రోజులు బంద్ చేశారు. మద్రాసు ఐఐటీలో అంబేడ్కర్ అండ్ పెరియార్ అసోసియేషన్ ను నిషేదిస్తే ఉద్యమించి నిషేధాన్ని ఎత్తించి వేయించుకోగలిగారు. యుజీసీ నియమాలను మార్చేసి ఢిల్లీలో విద్యార్ధునుల హాస్టళ్ళ వేళలు జండర్ బైయాస్డ్ గా చేస్తే ఆందోళనలు చేశారు. ఇంకా హిందూ శక్తుల మోరల్ పోలిసింగ్ కి ధిక్కారంగా ‘కిస్ ఆఫ్ లవ్’ ను నిర్వహించారు. బీజేపీ ఆవు రాజకీయాలను హేళన చేస్తూ బీఫ్ పండగ జరుపుకొన్నారు. దబోల్కర్, పన్సారే, కల్బుర్గి, అఖ్లాడ్ ల మత హత్యలకూ, ముజఫర్ నగర్ మారణకాండకూ తీవ్రంగా ప్రతిస్పందించారు.

దేశమంతా హిందూ టెర్రరిజంతో గడగలాడుతుంటే రోహిత్ …. సాంఘీకంగా సమాజంలో అత్యంత వల్నరబుల్ సమూహాల నుండి వచ్చినవాడు, మిషన్ కుట్టి బతికిన ఒక పేద తల్లికి పుట్టిన పిల్లవాడు… భవిష్యత్ గురించి ఎన్నో కలలు ఉన్నవాడు వీటన్నింటికి స్పందించాడు. తన కెరీర్ గురించి ఆలోచించకుండా చిన్న తలతో కొండను ఢీకొన్నాడు. మరి అతడు సమాజం గురించి ఆలోచించినంతగా ఈ సమాజం అతని గురించి ఆలోచించిందా? రోహిత్, రోహిత్ తో బాటుగా నలుగురు విదార్ధులు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వెలివేతకు గురి అయితే, చలి రాత్రుల్లో ఆరుబయట నిద్రిస్తే .. తోటి విద్యార్ధుల అలక్షానికి, సానుభూతి చూపులకు బలి అవుతుంటే సోషల్ మీడియాలో తప్ప బయటకు వార్తలు రాలేదు. వారి వంటరితనానికీ కారణాలు చెప్పి, ధైర్యం నూరిపోసి, తల నిమిరే పెద్ద తలకాయలు వారికి కొరవైనాయి. వాళ్ళు నమ్ముకొన్నది అంబేడ్కర్ ని మాత్రమే.

రోషిత్ కు భారతదేశంలోని మార్స్కిష్టు పార్టీల పట్ల పేచీ ఉంది. కులాన్ని అర్ధం చేసుకోవటంలో ఈ పార్టీలకు ఉన్న వైఫల్యాలకు సంబందించిన పేచీ అది. అతనితో బాటు చాలా మంది దళిత యువకులు దేశ మూలవాసుల విముక్తి, యింకా అనేక యితర పీడిత సమూహాల విముక్తితో తో ముడిపడి ఉందని నమ్మక పోయి ఉండవచ్చు. ఆ విముక్తి కోసం ఆ సమూహాలతో చేతులు కలిపి నడవాలని అనుకోకపోయి ఉండవచ్చు. కులం పునాదులు, కుల నిర్మూలనకు సంబంధించిన విషయాలలో అభిప్రాయా బేధాలు వుండి ఉండవచ్చు. కానీ వాళ్ళు అన్ని పురోగమ ఉద్యమాలలో ముందు ఉంటున్నారు అనే విషయం మర్చిపోకూడదు. ఈ నాటి దుర్మార్గ రాజకీయవాతావరణంలో ముందు వారే శలభాలు అన్న సంగతి మరువకూడదు. కుల అణచివేతకు సంబంధించిన విశ్లేషణలో విప్లవ పార్టీలు గతం కంటే ఒక అడుగు ముందుకు వేశాయి. ఇప్పుడు ఈ రెండు సమూహాలు చెయ్యి చెయ్యి కలిపి ప్రయాణించాల్సిన చారిత్రక సందర్భం వచ్చింది.

ఈ రోజు హెచ్ ఓ యూ లో కనిపిస్తున్న సంఘీభావం ఎల్లెడలా వెల్లివిరియాలి. పౌర సమాజం వేయి కళ్ళతో దేశంలో ఎక్కడ సెగలు రగులుతున్నాయో కనిపెట్టి కమ్ముకొని ఆ సమస్యనూ, ఆ ఉద్యమకర్తలనూ ఆలింగనం చేసుకోవాలి. శత్రువు బలం గొప్పది. ఇప్పుడు పీలికలు సరిపోవు. పీలికల్ని పేనుకోవాల్సిన సమయం యిది.