ట్యాగులు

, , , , ,

udayagitika

విప్లవకాలంలో, అందులోనూ యుద్ధ కాలంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా దేశం పరాధీనమౌతున్న సందర్భంలో ఒక ఉద్రేక ఉపన్యాసం, చిన్న కరపత్రం, త్యాగమయుల చిరు స్నేహం, ఒక విలువైన సంభాషణ, నిజాయితీతో కూడిన ఆచరణ గమనింపు .. ఇవన్నీ మనుషులలో అప్పటికప్పుడు మార్పు తెస్తాయి. ఆ మనుషులు యువతీ యువకులు అయినపుడు అది మరింత వేగంగా జరుగుతుంది. కష్టభూయిష్టమైన సంఘర్షణలలో వారి యవ్వనోత్సాహానికి విప్లవభావాల పరిచయం ఏర్పడితే ఇక వారిని ఆపగల శక్తి ఏదీ ఉండదు. అలాంటి యువతీ యువకుల కథే ‘సాంగ్ ఆఫ్ యూత్’ పేరుతో ఆంగ్లంలో అనువదించబడిన చైనా నవల. తెలుగులో ‘ఉదయ గీతిక’గా వేలాది యువ హృదయాలను అలరించి విప్లవ కార్యోన్ముఖుల్ని చేసింది. ఈ నవల చదివి అందులోని పాత్రల ఆదర్శాల, ప్రేమల మోహంలో పడ్డ వాళ్ళు కోకొల్లలు. ఈ నవల ఎందరో విప్లవకారులను తయారు చేసిందంటే అతిశయోక్తి కాదేమో. అంతటి ఉత్తేజాన్ని నరనరాల్లో ప్రవహింపజేసి, రక్తాన్ని గోరు వెచ్చనజేసి, వళ్ళు పులకరింప చేస్తుంది ఈ నవల.

రష్యా, చైనా ఉద్యమాలలో పురుషుల వైపు నుండి రాసిన అనేక నవలలు వచ్చాయి. మహిళలు ప్రధాన పాత్రలుగా ఉన్న నవలలు కూడా అనేకం ఉన్నాయి. కానీ విప్లవ కార్యాచరణలో ఉన్న ఒక మహిళ ఎదుగుదలను క్రమానుగతంగా చిత్రీకరించే పాత్రలు అరుదుగా కనబడతాయి. ఈ నవల రచయిత్రి ‘యాంగ్ మో’ స్వీయ చరిత్రగా అనిపిస్తున్న ఈ నవలలో కధా నాయిక వైపు నుండి సాగే కధనం ఒక ప్రత్యేకతను సమకూర్చింది. విప్లవ రాజకీయాల్లోకి రావటానికి మహిళలకు ఉండే కారణాలను, ఆటంకాలను కూలంకుషంగా చర్చించింది ఈ నవల. ఎన్. వేణుగోపాల్ అనువాదం సరళంగా, మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. 1985లో రాడికల్ ప్రచురణగా వచ్చిన ఈ నవల మొదటి కూర్పును, 2003లో పర్ స్పెక్టివ్స్ వారు రెండో కూర్పుగా వేశారు. అయితే రెండో కూర్పులో కొన్ని భాగాలు సంక్షిప్తీకరించటం వలన మొదట కూర్పు చదివిన వాళ్ళకు కొంత అసంతృప్తి కలుగుతుంది.

చైనాలో అర్ధ బానిస వ్యవస్థ ఇంకా కొనసాగుతున్నప్పుడు పుట్టిన యువతి లిన్ టావ్ చింగ్. ఆమె తల్లిని ఒక భూస్వామి చెరబట్టి టావ్ చింగ్ పుట్టిన తరువాత వెళ్ళకొడతాడు. పుట్టిన బిడ్డల మీద కూడా స్త్రీలకు హక్కులేని క్రూరపు రోజులవి. పాప కోసం ఏడుస్తూ టావ్ చింగ్ తల్లి ఆత్మహత్య చేసుకొంటుంది. కరుడు కట్టిన ఫ్యూడల్ సమాజ క్రూరత్వాన్ని టావ్ చింగ్ చిన్నతనం నుండి చవిచూస్తుంది. పీపింగ్ లో ఉన్నత పాఠశాల వరకు చదివే అవకాశం యిచ్చి, కాసుల కోసం ఆమె మారుటి తల్లి ఆమెను ఇంకో భూస్వామికి అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఆ భయానక పరిస్థితుల నుండి పారిపోయి ఉద్యోగ అన్వేషణలో సముద్రపు ఒడ్డు గ్రామం అయిన యాంగ్ చువాంగ్ కి వస్తుంది టావ్ చింగ్. ఒక గేయంలాగా ఉండే సముద్ర తీరంలో స్వాంతన పొందుతుంది. అయితే ఏ కలుషితం నుండి పారిపోవటానికి ఆమె కుటుంబం నుండి వచ్చేసిందో అదే కలుషితం, దుర్మార్గం అసహ్యం పుట్టేంతగా సమాజమంతా నిండుకొని ఉన్నదని గ్రహించటానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టదు. ఏటిలో కొట్టుకొని పోతున్నపుడు గడ్డి పోచ దొరికినట్లు ఆమెకు యుంగ్ సె అనే యువకుడి అండ లభిస్తుంది. అతని సహాయంతో ఆమె మళ్ళీ పీపింగ్ కు చేరుతుంది. స్నేహితురాలి వద్ద వుంటూ ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రం చేస్తుంది. విశ్వవిద్యాలయంలో చదువుతున్న యుంగ్ సె ఆమెను తనతో ఉండమని బలవంతం చేస్తుంటాడు. ‘ఇతరుల మీద పడి బతకటం ఎందుకు?’ అన్నఅతని ప్రశ్నకు ‘నీ దగ్గర ఉంటే నీ మీద పడి బతకటం కాదా? ఇంకా నువ్వు ఇట్లాగే (బలవంతం) చేసావంటే నా నిస్సహాయ స్థితిని వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నావనుకొంటాను’ అని అతని కోరికను తిరస్కరిస్తుంది. కానీ తొలిసారి ప్రేమలో పడిన అమ్మాయి చేసే తప్పే టావ్ చింగ్ కూడా చేస్తుంది. అతనికి ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆమె పడిన ఆందోళన యుంగ్ సెకు అనుకూలమైన నిర్ణయంగా రూపు దాలుస్తుంది. అతనితో సహజీవనం మొదలు పెడుతుంది.

udayageetika

అయితే త్వరలోనే టావ్ చింగ్ కు తను చేసిన పొరపాటు తెలుస్తుంది. యుంగ్ సెకు కుటుంబం, పిల్లల గురించి కాకుండా ఏ విషయం పట్ల ఆసక్తి ఉండదు. టావ్ చింగ్ ఉద్యోగం చేయటానికి ఇష్టపడడు. చైనా సమాజమంతా జపాను దురాక్రమణ గురించి ఆందోళన పడుతున్న సందర్భంలో యుంగ్ సె తన కెరీర్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటాడు. ఆమె విశ్వాసాలు గాయపడతాయి. ఆమె ప్రేమ అర్ధాన్ని కోల్పోతుంది. ఆ నిస్పృహ రోజుల్లో ఆమె సంవత్సరాది వేడుకల పార్టీకి హాజరు అవుతుంది. ఆ పార్టీలో పెకింగ్ విద్యార్ధులు పాల్గొంటారు. అక్కడే ఆమె సునింగ్, సియూయూ, పాయి లీపింగ్, లోతాపాంగ్ లను కలుస్తుంది. చైనా ఈశాన్య రాష్ట్రాలు అప్పటికే జపాన్ ఆధీనంలోకి వస్తాయి. సంవత్సరాది వేడుకల్లో ఆ విద్యార్ధులు దేశ రక్షణ కోసం ప్రతిజ్ఞ చేస్తారు. టావ్ చింగ్ తనకు అప్పటివరకూ పరిచయం కాని కొత్త ఉద్వేగాలలో కదిలి పోతుంది. వారితో తనను అనుసంధానించుకోవాలని అనుకొంటుంది. అక్కడ టావ్ చింగ్ కలిసిన మరో వ్యక్తి ‘లూచియాచువాన్’. నిజానికి ఆమె అతడిని అంతకు ముందు ఒక సారి యాంగ్ చువాంగ్ లో కల్సి ఉంటుంది. ‘సుందరమైన కళా ప్రక్రియల గురింఛీ, పులకరింపజేసే ప్రేమగాథల గురించీ తప్ప మరేమీ మాట్లాడని యుంగ్ సె కంటే ఈయన కచ్చితంగా భిన్నంగా ఉన్నాడు.’ అని అప్పుడే అనుకొంటుంది. ‘నువ్వు నీ అంతట నువ్వే ఒంటరిగా పోరాడితే దెబ్బలూ, ఎదురుదెబ్బలూ తాకుతాయి. నిజమే! కాని నువ్వొక సామూహిక పోరాటంలో భాగమయితే, నువ్వు నీ భవిష్యత్తును ప్రజలందరి భవిష్యత్తుతో ముడి వేసుకున్నట్టయితే నువు ఒక ఒంటరి, నిస్సహాయమైన చెట్టువు కావటం మానేస్తావు. నువు ఒక మహారణ్యంలో భాగమవుతావు. … ఇది విషాదం నిండిన ప్రపంచం నిజమే కానీ, అందమైన ప్రపంచం కూడా. నువు బయటకు రావాలి. నీ చుట్టూ పరికించి చూడాలి.’ అని ఆమెతో చెబుతాడు. అతడితో ఆమె ఆ వేడుకల రాత్రి జరిపిన సంభాషణ ఆమెను పూర్తిగా మార్చి వేస్తుంది.

యుంగ్ సె ఇంటికి రాగానే పడక, పుస్తకాల అల్మరా, పూలు, అలంకారాలు, వంట సామాగ్రి అన్ని అలాగే ఉంటాయి. కానీ భార్య టావ్ చింగ్ మాత్రం మారి పోయి ఉంటుంది. ఆమె తనలో వెళ్లిపోతున్న యవ్వనోత్సాహాన్ని తిరిగి సాధిస్తుంది. యుంగ్ సె ఆమె ఎవరి ప్రేమలోనో పడిందని అనుమానిస్తూ ఆమెకు కాపలా కాస్తుంటాడు. ఎంత వెదికినా ఆమె కొత్త ప్రియుడు ఎవరో కనిపెట్టలేక పోతాడు.

తక్షణమే యుద్ధ రంగంలో దూకుతానని అడిగిన టావ్ చింగ్ ను ఉద్దేశించి లూచియాచువాన్ ‘వీరోచితమైన జీవితం గడిపి ప్రస్తుత నిస్సారపు జీవితం నుంచి తప్పించుకోవాలనే సొంత కోరికను తీర్చుకోవటానికి యుద్దరంగానికి వెళతానంటున్నావా?’ అని ప్రశ్నిస్తాడు. ‘విప్లవ కృషి ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇంటి పని, వంటపని కూడా ప్రజలకోసం, విప్లవం కోసం చేస్తే దాని ప్రాముఖ్యత పెరుగుతుంది.’ అని చెబుతాడు. ఆయన నిజాయితీతో, స్పష్టతతో యిచ్చిన సలహా ఆమెకు ఎంతో ఉపకరిస్తుంది. మార్చి 18 కవాతుకు వెళ్లడానికి సిద్దపడి యుంగ్ సెతో ఘర్షణ పడుతుంది. జపాన్ దురాక్రమణకూ, కొమిటాంగ్ ప్రభుత్వ లొంగుబాటుకు వ్యతిరేకంగా జరిగిన ఆ ప్రదర్శనలో ఆమె పాల్గొంటుంది. తరువాత మే డే ప్రదర్శనలో కూడా ఆమె పాల్గొంటుంది. ఆమె చదివిన సిద్ధాంతాలు క్రమంగా వాస్తవాలుగా వ్యక్తీకరణ చెందుతుంటాయి. టావ్ చింగ్ విప్లవమార్గం పడుతుంది. విప్లవం కోసం చదువునూ, ప్రేమనూ వదిలేసి వెళ్ళిన సియుయు ఆమెకు ఆదర్శం అవుతుంది. తన మార్గానికి అడ్డు పడుతున్న యుంగ్ సె నుండి శాశ్వతంగా దూరం అవుతుంది.

తరువాత ఆమె జీవితం ప్రజలతో అనుసంధానించుకొంటుంది. పార్టీ చెప్పిన ప్రతి చోటుకు వెళుతుంది. ప్రతి పని చేస్తుంది. కొన్ని నెలలు ఒక అపరిచిత ప్రాంతంలో ఉపాధ్యాయినిగా పని చేసి విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను కొమిటాంగ్ కు వ్యతిరేకంగా సమీకరిస్తుంది. కొన్ని నెలలు ఒక భూస్వామి యింట్లో టీచరుగా చేరి రైతు కూలీలతో సమ్మె చేయించటంలో సహకరిస్తుంది. విశ్వవిద్యాలయంలో ట్రాట్య్కీయిష్టులు ఆమెను అందరి ముందే చెంప దెబ్బలు కొడుతుంటారు. అత్యంత ప్రమాదకరమైన పనులను ప్రాణాలకు తెగించి చేస్తుంది. ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని, దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దగ్గరగా చూసి ఆమె చేతులు కట్టుకొని ఉండలేక పోతుంది. సిద్ధాంత అధ్యయనం నుండి విప్లవ మార్గానికి రావటానికి చేయాల్సిన ప్రయాణం అంతా చేస్తుంది. ఆమె అరెస్టు అయ్యి కఠిన నిర్భంధానికి, చిత్రహింసలకు గురి అవుతుంది. అయినా నోరు విప్పి రహస్యాలు చెప్పదు. ‘మామూలు ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ఇలా ప్రవర్తించేటట్లు చేసే గొప్పతనం ఆ కమ్యూనిస్టు పార్టీలో ఏముంది? కమ్యూనిజం కోసం వీళ్ళు ప్రాణాలు వదిలేయటానికి సిద్ధంగా ఉంటారు. జీవితం కంటే విలువైనది ఏమైనా వుంటుందా చెప్పు.’ అనుకొంటారు ఆమెను చిత్రహింసలు పెట్టే పోలీసులు.

జైలు నుండి వచ్చాక ఆమెకు పార్టీ సభ్యత్వం యిస్తారు. ఆ క్షణాన ఆమె ఆనందం వర్ణనాతీతం. ‘తానిక ఎంత మాత్రం ఒంటరి వ్యక్తిని కానని ఆమెకు అర్ధం అయ్యింది. తన దేశాన్ని, తన ప్రజలను స్వేచ్ఛాపధంలోకి తీసుకెళ్ళేందుకు యుద్ధరంగం మీది నిర్భయమైన యోధురాలిగా, కమ్యూనిజం ఆశయాన్ని కరదీపికగా పట్టుకొని నడుస్తున్న వాళ్ళలో అగ్రగామిగా తాను మారానని ఆమెకు అర్ధం అయ్యింది. కొన్ని కోట్ల మందికి సుఖ సంతోషాలు సాధించి పెట్టటానికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అనేకవేల మంది సహచరులతో తన జీవితాన్ని అనుసంధానించుకొన్నానని ఆమెకు తెలిసి పోయింది.’

టావ్ చింగ్ ఈ ప్రయాణంలో మళ్ళీ ప్రేమలో పడుతుంది. తన తొలి విప్లవ గురువు లూచియాచువాన్ పట్ల ఆమెకు విపరీతమైన ఆరాధన, ప్రేమ ఉంటాయి. ‘ఆమె ప్రేమకు అర్హుడైన మనిషిని కలుసుకొనేసరికి, ఒకసారి ప్రేమలో విఫలమైన స్త్రీ మాత్రమే ప్రకటించగలిగిన హృదయపూర్వక ప్రేమను అతని ముందు వ్యక్తీకరించబోయేసరికి లూచియాచువాన్ అరెస్టు కావటం ఆమెకు ఎదురైన పెద్ద విషాదం.’ లూచియాచువాన్ కి కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం. అతని కోసం చాలా రోజులు ఎదురు చూస్తుంది టావ్ చింగ్. పెద్దక్క లియుయిఫెంగ్ ద్వారా అతన్ని జైల్లో చంపేశారనే విషయం తెలుసుకొంటుంది. లూచియాచువాన్ ఆమెకు రాసిన ప్రేమ లేఖలు పెద్దక్క నుండి అందుకొంటుంది. ‘మన కామ్రేడ్స్ శతకోటి సైన్యమని, మేము పడిపోగానే పోరాటాన్ని వారు కొనసాగిస్తారనీ, నువ్వు ఆ శ్రేణుల్లో కలిసి ఉంటావనీ, అంతిమ విజయం మనదే అవుతుందనీ తలుచుకొంటే నాకు అపూర్వమైన గర్వమూ, ఆనందమూ కలుగుతున్నాయి.’ అని రాస్తాడు. ఆ ఉత్తరం చదివిన ఆమెకు హృదయాన్ని కలిచి వేస్తున్న ఆందోళన నుండి ప్రగాఢమైన ఏకీభావం, ఆత్మవిశ్వాసం అనుభూతమవుతాయి. ఆయన అమర జ్ఞాపకం ఆమెలో నిక్షిప్తమయ్యి ఆమెను ముందుకు నడిపిస్తుంది. అమరత్వం పొందాకా ఆ ఒక్కరి వ్యక్తిగత జీవితం మొత్తం మానవ జాతి జీవితం కలిపినంత గొప్పదవుతుంది కదా. యుద్ధపు రోజులు అంతరించి ‘అందమైన ఉద్యానవనాల్లో ప్రేమికులు తమ హృదయాలు విప్పి చెప్పుకొనే’ కాలాలు ముందు ముందు ఉంటాయని ఆమె ఆశాజనకంగా ఉంటుంది.

లూచియాచువాన్ స్నేహితుడు చియాంగ్ హువా ఆమెలో ఉన్న లూచియాచువాన్ జ్ఞాపకంతో సహా ఆమెతో యిష్టంగా సహచరిస్తాడు. చియాంగ్ హువాతో ‘లూచియాచువాన్ వంటి మనిషి ఆలోచనే నాలో ఈ ప్రపంచం పట్ల ఎక్కువ ప్రేమ కలగటానికి దోహదం చేస్తుందని’ టావ్ చింగ్ నిర్భయంగా చెప్పగలుగుతుంది.

ఒంటరి యువతిగా సమాజం వేటాడిన టావ్ చింగ్ పరిణితి చెందిన కమ్యూనిష్టు నాయకురాలుగా, విద్యార్ధి సంఘ బాధ్యురాలుగా ఎదగటానికి ఆమెకు ఉపయోగపడినవి నాలుగు విషయాలు. ఒకటి నిరంతర అధ్యయనం. రెండు ఆత్మ విమర్శ, మూడు పార్టీ తోడ్పాటు. నాలుగు ప్రజా జీవితం. ఆమె తొలిదశలో లూచియాచువాన్ యిచ్చిన పుస్తకాలను ఏకాగ్రతతో చదివేది. అప్పుడామె మానసిక స్థితి విశాలమైన బయట ప్రపంచంలోకి ఎగిరి పోయేది. లెనిన్ రాసిన ‘రాజ్యమూ, విప్లవమూ’ చదివింది. గోర్కీ రాసిన ‘అమ్మ’ ఆమెను అపూర్వ భావావేశంలో ముంచి తేల్చింది. అధ్యయనం పట్ల టావ్ చింగ్ కి ఆసక్తిని రేకెత్తించింది విప్లవ కుతూహలం. పుస్తకాలు ఆమె అనుభూతుల మీద, ఉద్వేగాల మీద అంతులేని ప్రభావాన్ని కలగచేస్తాయి. పుస్తకాలు ఆమెకు మానవ సమాజ అభివృద్ధి ధోరణులను, దాని భవిష్యత్తును చూపిస్తాయి. ‘పుస్తకాలు ఆమెకు తన తల్లి ఎలా చచ్చిపోయిందో చెప్పాయి. ఆమెను ఎప్పుడూ ఆవహిస్తూ ఉండే నిరాశావాదాన్ని, నిస్పృహను తోసివేశాయి. అవి ఆమె గుండెల్లో పొంగి పొరలే విప్లవ చైతన్యాన్ని నింపాయి. ఆ చైతన్యమే ఆమెను ముందుకు నడపటానికి ఉపయోగపడింది.’ తరువాత కాలంలో ఆమె యూనివర్సిటీ విద్యార్ధుల పనిలో తలమునకలై ఉన్నప్పుడు కూడా రోజూ పొద్దున్నే ఒక రెండు గంటలు మార్క్సిస్టు ప్రామాణిక గ్రంధాలు చదువుకొనే అలవాటు మానలేదు.

టావ్ చింగ్ ఒక సందర్భంలో తన తండ్రి దగ్గర గతంలో పని చేసిన చెంగ్ తనను ఇంకా ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్ధం చేసుకోలేకపోతుంది. ఆమె ఎంత తన సొంత వర్గానికి తిరగబడ్డా, విప్లవాశయానికి ప్రాణాలు యివ్వటానికి సిద్దపడ్డా కూడా అణగారిని వాళ్ళు ఎప్పుడూ దోపిడీదార్లను, వాళ్ళ వర్గాన్ని ద్వేషించకుండా ఉండలేరు అన్న విషయం ఆమె ‘అత్త’ ద్వారా మాత్రమే తెలుసుకొని సిగ్గు పడుతుంది. ‘నేను కేవలం పెట్టి బూర్జువా ఆదర్శవాదినే. వర్గ పోరాటం ముదురు ఎరుపు రంగులో ఉంటే, నేను గులాబీ రంగులో ఉన్నాను. భూస్వామ్య దోపిడీ వర్గం నామీద తెల్లని ముద్ర వేసింది. ఆ ముద్ర నా మీద లోతుగా దిగబడి పోయింది. అందుకే నేను చెంగ్ కరకు చూపుల్ని, ద్వేషాన్ని భరింపలేకపోతున్నా.’ అనుకొంటుంది. తనది ఎంత మెత్తని గుండె అయినా, ఎంత మార్క్సిస్టు సిద్ధాంతం అధ్యయనం చేసినా, అణగారిన వర్గంలో నుండి వచ్చిన ‘అత్త’ మాత్రమే వర్గ పోరాటాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలదని తెలిసుకొంటుంది. మొదటి సారిగా తన తండ్రీ , మారుటి తల్లీ తనను పెట్టిన బాధల గురించి కాక యితరులను వాళ్ళు పెట్టిన బాధలకై వాళ్ళిద్దరిని ద్వేషిస్తుంది. భూసామ్య వర్గం తనపై వేసిన ముద్రను కూడా అసహ్యించుకోగలుగుతుంది. ఎంతో లోతైనా, పదునైన ఆత్మ విమర్శ చేసుకోగలిగితే తప్ప ఈ ఎరుక కలగదు.

‘టావ్ చింగ్’ పాత్ర అణగారిన సమూహాలు విప్లవం వైపు ఎందుకు ఆకర్షింపబడతారో అద్దంలో చూపిస్తుంది. వయసులో ఉన్న అమ్మాయిలు తమ వైయుక్తిక బాధల నుండి బయటపడే దారిని దాదాపు ఎనభై ఏళ్ల క్రితమే వేసింది టావ్ చింగ్. ఆత్మహత్యలకు ప్రేరేపించే పరిస్థితులు ఉన్నప్పుడు విప్లవ మార్గం ఎప్పుడూ ఉంటుంది. అక్కడ పోగొట్టుకొనేది ఏమీ ఉండదు, బానిస సంకెళ్లు తప్ప. టావ్ చింగ్ జీవించిన భూస్వామ్య, అర్ధ బానిస సమాజం కంటే ఇప్పటి మన సమాజం ఒక మెట్టు ఎక్కి ఉండొచ్చు. కానీ సామ్రాజ్యవాద దురాక్రమణదారులు మూడో ప్రపంచ దేశాలను అణచటానికి కొత్త కొత్త మార్గాలలో వస్తున్నారు. నేటి భారత నయా దళారీ పాలకులు నాటి కొమిటాంగ్ కంటే భిన్నంగా ఏ మాత్రం లేరు. ఈ దేశ ప్రజల విముక్తి కోసం డిశంబర్ 9, 1935 లాంటి విద్యార్ధి ఉద్యమాలు ఎన్నో పురుడు పోసుకోవాలి. త్యాగాలకు, చిత్ర హింసలకు వెరవని దేశభక్తయుత యువతరం ముందుకు రావాలి. ఆ శ్రేణులలో మహిళలు అగ్రభాగంలో ఉండాలి. బతికి వుంటే ఇప్పటికీ వందేళ్ల వయసు ఉండే టావ్ చింగ్ అదిగో అక్కడ ‘ఉదయగీతిక’లో నవ యవ్వన ఉత్సాహంతో ప్రేరణనిస్తుంది. విప్లవ కర్తవ్యం ఇంకా ముగిసి పోలేదని ప్రపంచ యువతరానికి చాటి చెబుతుంది.

ఈ పరిచయం ఫిభ్రవరి,2016 మాతృకలో .వెలుతురు పిట్టలు. శీర్షికన ప్రచురించాము