ట్యాగులు

, , , , , ,

అంతర్జాతీయ మహిళా దినం

కార్మిక, రైతు కూలీ, పేద రైతు, పట్టణ పేద, బడుగు ఉద్యోగ, మైనారిటీ, దళిత, ఆదివాసీ మహిళలదే

2nd page (2)అంతర్జాతీయ మహిళా దినానికి నూట ఆరు ఏళ్ళు. వనరుల్లో వాటా కోసం, రాజకీయాలలో భాగస్వామ్యం కోసం, అన్నింటా సమాన హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకొన్న రోజు. మహిళా పోరాటాలకు అంతర్జాతీయ స్వభావాన్ని గుర్తించిన రోజు. మహిళల జీవితాలను చుట్టముట్టి ఉన్న శ్రమదోపిడీ, అసమానతలు, అవమానాల నుంచి విముక్తి కోసం, మహిళలు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవశ్యకతను అది చాటిన రోజు. 17 దేశాలనుండి 99 మహిళలు హాజరయిన కొపెన్ హేగెన్ సోషలిస్టు మహిళా సదస్సులో క్లారా జట్కిన్ మార్చి 8ని శ్రామిక మహిళా హక్కుల దినంగా ప్రతిపాదించిన రోజు. ఆ సోషలిస్టు సదస్సులో క్లారా జట్కిన్ యిలా అన్నారు. ”మొదటిగా మహిళా సమస్యను అంతర్జాతీయ విషయంగా గుర్తించాలి. ఈ హక్కుల ప్రస్తావన మహిళల విషయంలో సోషలిష్టిక్ అవగాహనకు అనుగుణంగా ఉండాలి. ఈ మహిళా దినం స్వభావంలో అంతర్జాతీయతను సంతరించుకుందో లేదో శ్రద్ధగా పరిశీలించాలి.”

మహిళా అణచివేత వర్గసమాజానికి అనివార్యంగా ముడిపడి ఉంది అనే వాస్తవాన్ని అంతర్జాతీయ మహిళా దినం ప్రారంభమయిన 106వ సంవత్సరంలో మరో సారి నొక్కి వక్కాణించుకోవాలి. అప్పుడే మహిళల అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం సమస్త శ్రామిక ప్రజల పోరాటంలో భాగంగా గుర్తించవచ్చు. ఏ జండర్ సమానత్వం కోసమైతే పోరాటాలు జరుగుతున్నాయో అక్కడ మహిళా విముక్తీ, వర్గపోరాటం పెనవేసుకొని పోయి ఉన్నాయి అనీ, సమస్త మానవాళీ విముక్తితో అది ముడి పడి ఉందనే స్పృహ అత్యవసరం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత విప్లవకారులకూ, సంస్కరణవాదులకు మధ్య వచ్చిన స్పష్టమైన గీత రష్యా విప్లవం తరువాత అంతర్జాతీయ మహిళా దినం జరపాల్సిన ప్రాముఖ్యతను పెంచింది. బూర్జువా మహిళా ఉద్యమాన్ని శ్రామిక మహిళా ఉద్యమం నుండి విడదీసిన చారిత్రాత్మక సందర్భం అది.

పెట్టి బూర్జువా మహిళలు మహిళా సమస్యలను వర్గం నుండి విడదీసి చూస్తారు. అన్ని వర్గాలలో స్త్రీలకు ఒకటే సమస్యలు ఉన్నాయని నమ్ముతారు. వారి డిమాండ్స్ చాలా పరిమైతమైనవి. ఇప్పుడున్న చట్టం దృష్టిలో స్త్రీ పురుషులు సమానులే ఐనా అణచివేత అదృశ్యం కాలేదు. వర్గ వైరాన్ని పరిగణలోకి తీసుకోకుండా, పెట్టుబడిని శత్రువుగా భావించకుండా బూర్జువా ఫెమినిజం ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేదు. అందుకే వారు జరిపే అంతర్జాతీయ మహిళా దినాలు దాని నిజమైన స్ఫూర్తిని అందుకోలేవు. స్త్రీలను వేరే సమూహంగా పరిగణించే దృక్పధం వీరికి ఉంటుంది.

ఇక ఐక్యరాజ్య సమితి ఈ అంతర్జాతీయ మహిళా దినానికి అధికార ముద్ర వేసాక సామ్రాజ్యవాద, మూడోప్రపంచ దేశాల పాలకులు ఈ రోజును మహిళాదినంగా జరుపుకోవటానికి రంగం సిద్దం చేశారు. మూడో ప్రపంచ దేశాల వనరులు కొల్లగొట్టి అక్కడి కోట్లాది మహిళలను నిర్వాసితులను చేయబూనుతున్న సామ్రాజ్యవాద దేశాలూ అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుతున్నాయి. సామ్రాజ్యవాదులకు దళారులుగా వ్యవహరిస్తూ ప్రజల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్న భారత పాలకులూ ఈ రోజును జరుపుతున్నారు. అంగన్ వాడీ లాంటి చిరుద్యోగులు వేతనాల పెంపు అడిగితే గుర్రాలతో తొక్కించిన పాలకులూ ఇప్పుడు మహిళా దినాన్ని జరుపుతున్నారు. పనిలో పనిగా మార్కెట్ శక్తులు విజృంభించి అంతర్జాతీయ మహిళా దినాన్నిఉపయోగించుకొని తమ వస్తువులు అమ్ముకొంటున్నాయి. కొన్ని చోట్ల ఈ రోజున అందాల పోటీలు కూడా జరుగుతున్నాయి. ఏతా వాతా అంతర్జాతీయ మహిళా దినాన్ని తల్లుల, తడ్రుల దినం స్థాయికి మార్చేశారు.

ప్రపంచంలో 1.3 బిలియన్ల కోట్ల మంది పేదవారిలో డెబ్భై శాతం మంది స్త్రీలూ, ఆడపిల్లలే. 300 మంది ఆడపిల్లలు కేవలం ఐరన్ లేక పుట్టుకతోనే చనిపోతున్నారు. భారతదేశంలో అయితే స్త్రీ పురుష నిష్పత్తి ఆందోళనాకరంగా తగ్గిపోతుంది. జన్మించటానికి అనుమతి లభించని ఆడపిల్లల రక్తంతో తడిచిపోయి వుందీ సమాజం. మనం చూస్తున్న ప్రతి పది మంది యువకులలో మనలాంటి ఒక స్త్రీ ఎక్కడో చంపివేయబడింది. వరకట్నం హత్యలు, యాసిడ్ దాడులు, గృహహింస మరణాలు, వేధింపు చావులు, మూకుమ్మడి లైంగిక దాడులు లెక్కకు లేనన్ని. మహిళలపై జరుగుతున్న హింసలో కులం, మతం తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడున్న హిందూ ఫాసిస్టు ప్రభుత్వమే మహిళలపై హింసను ప్రోత్సహిస్తుంది. భూస్వామ్య, పితృస్వామిక భావజాలం స్త్రీలను నిత్య హింసాగ్నిలో కాల్చి వేస్తుంది. పెట్టుబడిదారీ విష సంస్కృతి అధః పాతాళానికి తోస్తుంది. నిప్పు గుండాలను దాటుతూ ఆడవాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు.

చట్టబద్ధంగా మహిళ పురుషుడి మీద ఆధారపడక పోయినప్పటికీ ఆమె భర్తకూ, కుటుంబానికీ, ఆమెకూ మధ్య వేలాది కట్లు కట్టి ఉంటాయి. అవి దాటుకొని ఆమె బయటకు రాలేని స్థితి. ఆర్ధిక సంక్షోబాల్లో ఉత్పన్నమయే నిరుద్యోగంలో స్త్రీలే ముందు నిరుద్యోగులవుతారు., పిల్లల పెంపకపు బాధ్యత వారి మీదేవుంది కాబట్టి. స్త్రీ పురుషుల వేతనాలలో తేడా కూడా మొదట యిలాగే వచ్చింది. ఇంటి పని కోసం, పిల్లల పెంపకం కోసం వెచ్చించాల్సిన సమయం పెరిగి ఆమె పని గంటలు తగ్గిపోయాయి. ఇప్పుడా తేడా వేతనాల సమస్యను మించి పోయి ఎవరు ఎక్కడ ఎంత పని చేయాలి అనే సిద్ధాంత, సాంస్కృతిక ప్రశ్నగా ముందుకు వచ్చింది. ప్రపంచల దేశాలలోని విభిన్న ఆర్దిక దశలు, విభిన్నసాంస్కృతిక అభివృద్ధుల కారణంగా మహిళా వివక్ష ప్రపంచవ్యాప్తంగా రకరకాల రూపాలు తీసుకొన్నది. రూపం ఏమైనప్పటికీ మహిళా అణచివేతకు భూమిక ఒకటే. పరిష్కారం కూడా ఒకటే.

మహిళా వివక్ష వర్గ సమాజంతో ప్రారంభం అయ్యింది. కాబట్టి మహిళా విముక్తి పోరాటాలు వర్గ రహిత సమాజం కోసం జరుగుతున్న పోరాటాల నుండి వేరు చేయలేము. మహిళలు చేసే పని ఉత్పత్తి స్వభావాన్ని కోల్పోయినపుడు స్త్రీల పరాజయం ప్రారంభం అయ్యింది అని ఎంగెల్స్ అన్నారు. పెట్టుబడీదారి విధానం మళ్ళీ స్త్రీని పనిలోకి లాగింది. దాని వల్ల ఆమెకు యింటి పనీ, బయటపనీ వత్తిడి పెరిగింది కాని ఈ దశ మహిళా విముక్తికి భూమికను యిస్తుంది. పని ద్వారా మహిళలు శ్రామిక వర్గంలో చేరి, తద్వారా వర్గ పోరాటంలో భాగం అయ్యారు.

భారతదేశంలాంటి అర్ధ భూస్వామ్య వ్యవస్థలో పిడికెడు భూమిలేని రైతు కూలీలుగా మహిళలు ఉన్నారు. ఇంకా కార్మిక, పేద రైతు, పట్టణ పేద, బడుగు ఉద్యోగ, మైనారిటీ, దళిత, ఆదివాసీ మహిళలు ఉన్నారు. చేరడు భూమి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. నివాస, ఉపాధి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు బజార్న పడ్డారు. మద్యపాననికి వ్యతిరేకంగా నిరంతరం మహిళలు గొంతు విప్పుతున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్నారు. కేరళ టీ తోట మహిళలు వేతనాల పెంపు కోసం చేసిన పోరాటం ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేసింది. బంగ్లాదేశ్ లో దుస్తుల పరిశ్రమలో పని చేసే మహిళలు, హర్యానాలో మోటార్ రంగంలో పని చేస్తున్న మహిళలు రోజుల తరబడి ఉద్యమాలలో తలమునకలు అవుతున్నారు. ప్రభుత్వ దివాళాకోరు విధానాలు వీరిని అనివార్యంగా ఉద్యమింపచేస్తున్నాయి.

వీరంతా వర్గ సమాజంలో విప్లవ కణికలు. వేతన వివక్ష, పనిలో వివక్ష, సామాజిక వివక్షలాంటి సమస్త కోటి వివక్షలకు వీరు గురి అవుతున్నారు. ఆ వివక్షతలకు కారణం వర్గ సమాజం తప్ప మరొకటి కాదు. ఆ వర్గ సమాజాన్ని బద్దలు కొట్టకుండా, అందులో నుండి నూతన సమాజం ఆవిర్భవించకూడా మహిళా విముక్తి సాధ్యం కాదు. ఆ దశగా పోరాటాలను, ఉద్యమాలను చెయ్యకుండా అది సంభవించదు.

ఈ సందర్భంగా అలెగ్జాండ్ర కొల్లెంట్రాయ్ యిచ్చిన నినాదాలు స్మరణీయం

బూర్జువా ప్రపంచ సాంప్రదాయాలైన అసమానతలు, హక్కుల లేమి తొలగిపోవాలి!!
ప్రపంచ శ్రామిక మహిళల్లారా ఏకం కండి!!!
శ్రామికవర్గ నియంతృత్వంలో శ్రేయోరాజ్య స్థాపనకు భుజం భుజం కలపండి!!!!