ట్యాగులు

, , , ,

నలబై ఒకటవ వాడు

రచయిత: బోరిస్ లవ్రెన్యోవ్

images

‘మరియా బాసావా’ ముద్దు పేరు మర్యూత్కా … నోరు తిరగని పేరు. కానీ ‘నలభై ఒకటవ వాడు’ చదివిన తరువాత స్వచ్ఛమైన నీటిలో నుండి నేల అడుగు చూడగలిగినంత స్పష్టంగా ఆమె అంతరంగాన్ని పాఠకులు దర్శించగలరు. ఆమెను చదివి కొద్దిమందికి హృదయం ద్రవించవచ్చు. కొంత మంది కొన్ని రోజుల దాకా ఆమెను మర్చిపోలేక ఆమె గురించే మాట్లాడుతూ ఉండవచ్చు. చదివి వదిలేయగలిగింనంత తేలికగా ఉండదు విషయం. వర్ధమాన సమాజంలో మర్యూత్కాలాంటి స్త్రీలు అరుదుగా కనిపిస్తారు. క్లిష్టమైన, వైరుధ్యభరితమైన సామాజిక అల్లికలో మనిషి చిక్కుకొని ఉన్నప్పుడు అతడు లేక ఆమె మనోస్థితిని గ్రహించట అసాధ్యంగా అనిపిస్తుంది చాలా సార్లు. మనుషుల్లోని సహజంగా ఉండే సాహస స్వభావము, ఆదర్శాల స్థిరత్వం, నిస్వార్ధం అనే గుణాలు అనేక కృత్రిమ విలువల కింద తొక్కివేయబడతాయి. కానీ మర్యూత్కా బతికిననాటి కాలం వేరు. ప్రపంచమంతా యుద్ధం అలుముకొని వుంది అప్పుడు. ‘అటో ఇటో ఎటో’ నిలబడాల్సిన రోజులవి. ఆ రోజులు మాత్రమే మర్యూత్కా లాంటి పాత్రను కనగలవు.

‘రాయక తప్పలేదు కాబట్టే రాయబడింది.’ అని మొదలు పెడతాడు రచయిత బోరిస్ లవ్రెన్యోస్. నిజమే రచయితలు రాయక తప్పని పరిస్థితులు కొన్ని ఉంటాయి. బోరిస్ లవ్రెన్యోస్ లాంటి సైనిక రచయితలు అంతకుముందు ఎవ్వరూ చూడని జీవితాలను వ్యాఖ్యానించే సాహసం చేశారు. సైనిక రచయితని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ రష్యన్ రచయిత విప్లవంలో పాల్గొని బతికి బట్టకట్టాడు. రష్యన్ విప్లవ సాహిత్యపు నవీనత్వం ఆనాటి బతుకులు చేసిన డిమాండ్లతో వచ్చినది. ఆ కొత్త జీవితాలు సాహిత్యంలోకి ప్రవేశించటానికి చూపిన ఉత్సాహంతో వచ్చింది. విప్లవ వీరత్వంలోని సౌందర్యాన్ని మనుషుల మనసులలో నాటే పనికి పూనుకొన్నాడు బోరిస్ లవ్రెన్యోస్. అంతకు ముందు ఎవరూ విననీ, చూడనీ .. నిజమైన సామాజిక, ఆర్ధిక న్యాయానికి లభించిన విజయం వెనుక అంతులేని త్యాగాలు చేసిన మనుషుల కధలు చెప్పటానికి ముందుకు వచ్చాడు. అలా రాసిన పెద్ద కధే ‘నలభై ఒకటవవాడు.’ అలాంటి అందమైన పాత్రే మర్యూత్క.

51PZSEGGH8L

ఈ పెద్ద కధ ‘ద ఫార్టీ ఫస్ట్’ అని పేరుతో మొదట ఇంగ్లీష్ లోకి అనువాదం అయ్యింది. తెలుగులో రెండు అనువాదాలు ఈ కధకు వచ్చాయి. ఒకటి ‘నలబై ఒకటవవాడు’. రెండు ‘నీలికళ్ళు’. నలబై ఒకటవవాడు అనువాదకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి. ప్రగతి ప్రచురణాలయం, మాస్కోవారు సోవియట్ యూనియన్ లో 1977లో ప్రచురించారు. అంతకుముందే 1974లో ఈ కధను ‘నీలికళ్ళు’ పేరుతో పురిపండ అప్పలస్వామి అనువాదంతో ‘ప్రగతి’ సచిత్ర వారపత్రికలో ప్రచురించారు. రష్యాలో 1927లోనూ, 1956లోనూ సినిమాగా వచ్చింది ఈ కధ. 1956 సినిమాలో హీరోగా వేసిన రష్యన్ నటుడు ఒలెగ్ స్ట్రిజ్ హెనోవ్ తరువాత ‘పరదేశి’ అనే ఇండో రష్యన్ సినిమాలో నర్గీస్ తో నటించాడు. ఈ కధకు అవసరం అయిన నీలికళ్ళు ఉండటం అతని ప్రత్యేకత. ఈ పుస్తకం ఇప్పుడు బయట ఎక్కడా దొరకటం లేదు.

మామూలు కధే. మన తెలుగు వాళ్ళు ఇదే కధాంశంతో సి గ్రేడ్ సినిమాలు చాలా తీశారు. అసలు రష్యన్ సినిమాలో కూడా కధ ఆత్మ, ముఖ్యంగా మర్యూత్కా ఆత్మ, పూర్తిగా ఉందా అంటే చెప్పలేము. ఎందుకంటే కధలో పాత్రలు మర్యూత్కా, లెఫ్టెనెంట్ గొనోరుహ ఓత్రోక్, కమిస్సార్ యవ్సుకొవ్ మాత్రమే కాదు. తుర్కెమినిస్తాన్ లోని భీకరమైన కారకుమ్ ఎడారి, అందమైన నీలిరంగు అరల్ సముద్రం, ఎర్రసైన్యానికి అన్నం పెట్టి నావల తెరచాపలు బాగు చేసి క్షేమంగా వారిని సాగనంపగలిగిన కిర్కిజ్ ప్రజలూ … అందరూ యిందులో మనోహరమైన పాత్రలే. అన్నింటినీ మించి ఆనాడు రష్యా, దాని పరిసర ప్రాంతాలలోని ప్రజలను ఆవహించి ఉన్నవిప్లవవీచిక ఇంకా అందాన్ని ఈ కధకు తెచ్చిపెట్టింది.

మర్యూత్కా ఒక అనాధ బెస్తపిల్ల. చేపలు పొట్టలు చీల్చుతూ పదిహేడవ సంవత్సరం వరకూ గడుపుతుంది. ఎర్రసైన్యంలో చేరమని పిలుపు రాగానే ఆ చేపల కత్తిని బెంచ్ మీద దిగ్గొట్టి కేంద్రకార్యాలయానికి పరిగెడుతుంది. ఆడపిల్ల అని సైన్యంలో చేర్చుకోవటానికి సంశయిస్తారు. మర్యూత్కా పోరు భరించలేక మగసైన్యంతో పనిచేసే ఒప్పందంతో చేర్చుకొంటారు. ఆ దళంలో ఉన్నవాళ్ళు ఆమెపై సరదాగా జోక్స్ వేస్తుంటారు. అదే సమయంలో ఆమె పట్ల చాలా బాధ్యతగానూ ఉంటారు. ‘వాళ్ళ రంగురంగుల తోలు జాకెట్ల కఠిన ఉపరితలం కింద, అజ్ఞాతంగా వాళ్ళ అంతరంతరాలలో దాగివున్న ఏదో మమకార వ్యక్తీకరణ ….’ ఆమె పట్ల చూపిస్తూ ఉంటారు. వాళ్ళ కమిస్సారు యెవ్సుకోవ్ కు మాత్రం ఆమె గురి మీద నమ్మకం. శత్రువును కాల్చాలంటే ఆమెనే పిలుస్తాడు. అలా ఆమె అప్పటికి నలభై మందిని గురి తప్పకుండా కాల్చింది. ‘నలబై ఒకటవవాడికి’ మాత్రం గురి తప్పింది. ఆ సమయంలో ఆ ఎర్రదళం కారకుమ్ ఎడారిలో తిండి లేక అలమటిస్తూ వుంటుంది. జారు సైన్యానికి చెందిన లెఫ్టెనెంట్ గొనోరుహ ఓత్రోక్ మర్యూత్కా గురి తప్పి ఎర్ర సైన్యానికి బందీగా చిక్కుతాడు. అతన్ని కేంద్ర కార్యాలయానికి అప్పగించేదాక అతని కాపలా బాధ్యత మర్యూత్కాకే అప్పగిస్తాడు కమిస్సారు. ఓత్రోక్ కూడా వారితో ఆ ఎడారిలో బందీగా ప్రయాణం చేస్తాడు. కష్టతరమైన ప్రయాణం తరువాత 12మంది ఎర్ర సైనికులను కోల్పోయి దళం అరల్ సముద్రపు ఒడ్డున ఉన్న ఒక కిర్కిజ్ పల్లెకు చేరుతుంది. ఆ ప్రజలు దళాన్ని ఆదరిస్తారు.

41st 1

మర్యూత్కా పెద్దగా చదువుకోలేదు. ఆమె ఎప్పుడూ కలలు కంటూ ఉంటుంది. నిద్రలో కూడా కలలాంటి నవ్వు ఆమె ముఖం మీద ఉంటుంది. ఆమెకు కవిత్వం రాయటమంటే చాలా ఇష్టం. ఆమె కవిత్వం చూసి పత్రికల వాళ్ళు పగలపడి నవ్వుకొంటుంటారు. ‘గుండెను గొడ్డలితో పెకిలించి’ రాయాలని ఉందని చెబుతూ ఉంటుంది. కవిత్వంలో మెళుకువల గురించి మొదటి చర్చ ఆమె తన బందీ అయిన ఓత్రోక్ తో చేస్తుంది. కవిత్వం రాయటానికిది సమయమా అన్న అతని ప్రశ్నకు ‘కవిత్వం రాయడానికి హంస తూలికా తల్పంలో పండుకోవాల్నా? యిదంతా నాలో కుములుతుండకూడదా? … మనం ఎడారి దాటిందీ, ఆ చలీ, ఆకలీ? అదంతా మనుషుల గుండెలకు తాకేటట్లు చెప్పగలిగితే! నేను రాసింది రక్తంతో, కానీ ఎవరికీ అచ్చువేయాలని లేదు. … ఇది నా గుండెలో నుండి వస్తున్నది. నా సాదాతనంలో నుండి వస్తున్నది…. జరిగింది చెప్పేటపుడు నా అణువణువూ ఏడుస్తుంది’ అంటుంది. ‘నీకిది అర్ధం కాదు. నీది ధనిక రక్తం. నాజూకు. మీరు రాయాలనుకొనేదల్లా పూలను గురించి. ప్రేమను గురించి. నేను పేదజనం గురించి రాస్తాను. విప్లవం గురించి రాస్తాను.’ అంటుంది.

అతి సాధారణమైన యువతి మర్యూత్కా, విప్లవం పట్ల అచంచలమైన విశ్వాసం ఆమెకు. స్పటిక కంటే పారదర్శకమైన మనసు ఆమెది. అందుకు విరుద్ధంగా ఓత్రోక్ అరిస్ట్రోక్రాట్ కుటుంబం నుండి వస్తాడు. అతని తండ్రి మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొనమని కోరిందాకా అతను తన విశాలమైన యింట్లో పుస్తకాలు చదువుకొంటూ గడుపుతాడు. యుద్ధం అయ్యాక ఎర్ర సైన్యం మీద అకారణమైన ద్వేషంతో వైట్ గార్డుగా చేరతాడు. (వైటు గార్డులు అంటే జారు ప్రభుత్వ సైన్యం) ఎర్రసైన్యం మీద అతని ద్వేషానికీ, అతని వర్గానికి సంబంధం ఉంది. ఏ కష్టాలు లేని కుటుంబం నుండి వచ్చినవాడికి వ్యవస్థ మార్పు పట్ల ఏమి ఆసక్తి ఉంటుంది? పైగా వ్యవస్థను పడగొట్టాలనే ప్రయత్నం, ఆ కల్లోలం అతనికి చిరాకు తెప్పిస్తుంటాయి. ఎక్కడా విప్లవ సైన్యానికి అనుకూలంగా ఒక్క మాట కూడా అతడు మాట్లాడడు. అయితే విప్లవం తప్ప ఇంకొకటి తెలియని అపర విప్లవమూర్తి మర్యూత్కాకు, విప్లవ వ్యతిరేకి ఓత్రోక్ కు మధ్య ప్రేమ చివురించే భౌతిక పరిస్థితులు ఏర్పడతాయి. యెవ్సుకోవ్ బందీని కేంద్ర కార్యాలయానికి అప్పగించాలనే తొందరలో ఒక పడవలో వారిద్దరితో బాటు ఇంకొక యిద్దరు సైనికులను కలిపి అరల్ సముద్రం ద్వారా పంపిస్తాడు. వైట్ గార్డులకు దొరికితే మాత్రం అతనిని బతకనివ్వవద్దు అని ఆమెకు ఆదేశాలిచ్చి మరీ పంపుతాడు యెవ్సునోవ్. ప్రపంచంలో అన్నిటికంటే నీలమైన అరల్ సముద్రంలో ప్రయాణిస్తూ అంతకంటే నీలమైన అతని కళ్ల మొహంలో పడుతుంది మర్యూత్కా. యవ్వనంలో ఉండిన ఒక భావుకురాలు ఆమె. ఆ పరిణామం సహజమేనేమో. అయినా ఆమె తన మీద కంట్రోల్ ను కోల్పోదు. అతని పట్ల జాగ్రత్తగానే ఉంటుంది.

hqdefault

ఆ పడవ తుఫాను తాకిడికి గురై ఒక నిర్జన దీవికి చేరుతుంది. వారితో వచ్చిన యిద్దరు ఎర్ర సైనికులు మరణిస్తారు. వెక్కి వెక్కి ఏడుస్తుంది మర్యూత్కా. ఆమె వెంట ఉన్న బందీ జ్వరంతో కళ్ళు తెరవకుండా ఉంటాడు. ఆ దీవి నుండి ఎలా బయటపడాలో తెలియదు. ఆ ప్రతికూల పరిస్థితులలో ఓత్రోక్ కి సేవ చేస్తుంది మర్యూత్కా. బలహీనుడు, రోగి అయిన ఓత్రోక్ కు సేవ చేస్తూ అతని మీద మమకారాన్ని పెంచుకొంటుంది. అది తమ మీద పూర్తిగా ఆధారపడిన వారి పట్ల కలిగే బంధం. ఆమె రాసిన కవిత్వం గురించి మొదటి సారి మాట్లాడి మెలకువలు నేర్పించ ప్రయత్నించినవాడి పట్ల ఆమె హృదయాంతరాలలో ఎక్కడో సున్నిత ప్రేమ మొదలువుతోంది. ఏదీ దాచుకోవటం తెలియని మర్యూత్కా ఆ ప్రేమను కూడా బహిరంగపరుస్తుంది. ఇక ఓత్రోక్ విషయానికి వస్తే అతనికి తెలుసు, మర్యూత్కా లేకపోతే తను మరణించేవాడినని. ఆమె అమాయకత్వం, ప్రేమ, ఆమెలో బలమైన వ్యక్తిత్వం అతన్ని ఆకర్షిస్తాయి. తన జీవితంలో అత్యంత అర్ధవంతమైన కాలాన్ని అక్కడే గడుపుతున్నానని అంటాడు. వారిద్దరికి దొరికిన ఆ ఏకాంతం ఒకరి మీద ఒకరికి యిష్టం కలిగే అనివార్యతను సృష్టిస్తుంది. ఆ వయసువారికి అది చాల సహజం అని సమాధానం చెప్పుకొన్నా రెండు విరుద్ధ వర్గాలకు, భావాలకు ప్రతినిధులు అయిన వారికి ఆ రకమైన బంధం సాధ్యమా అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది చదువుతున్నంత సేపూ. వాళ్ళిద్దరిలో ఒకరు నూతన మానవ సంబంధాల కొరకు విప్లవకర ప్రజలు చేసే కృషికి ప్రాతినిధ్యం వహించగా, మరొకరు వ్యక్తిగత సౌఖ్యం అనే సంకుచిత భావంతో ఉంటారు. ‘ప్రేమిక శత్రువులు’ అనే కొత్త పదానికి నిర్వచనం ఈ కధలో దొరుకుతుంది.

అయితే మర్యూత్కా తన భావాల పట్ల, కర్తవ్యం పట్లా ఎప్పుడూ ఏమార్చి ఉండదు. చివరి క్షణం వరకు రైఫిల్స్ ను అతని చేతికి యివ్వదు. ‘మీ నాన్న నీకు ఇరవైయేండ్లు వచ్చిన దాకా దాదిని పెట్టి ఉంటాడు, కానీ జన్మంతా నా పాటికి నేనే పెరిగినాను.’ అని వారిద్దరికి మధ్య వున్నా తేడాను స్పష్టం చేస్తుంది. అతను చెప్పే కధలు వింటూ ‘కతలన్నీ ధనవంతుల గురించీ, రాజకుమారులూ, రాజకుమార్తెల గురించి వుంటాయేం? బీదవాళ్ళ గురించి కతలెందుకు అల్లరు? …. ధనవంతులే కతలల్లడం వల్లననుకొంటాను.’ ముక్తాయిస్తుంది. ఓత్రోక్ ఆమెను మభ్యపెట్టాలని చూస్తాడు. ఆమెను అక్కడ నుండి తీసుకొని పోయి తన దగ్గర ఉంచుకొంటానని చెబుతాడు. ఆమెను కవిత్వం నేర్పించే పాఠశాలకు పంపుతానని అంటాడు. ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. అసలు ఆ దీవి నుండి బయట పడగలరో లేదో అనే సందిగ్ధావస్థలో కూడా ఆమె నిర్ణయాలు సడలవు. ‘ఇది పట్టు పరుపుల మీద పొర్లాడే సమయం కాదు. మన వాళ్ళక్కడ పోరాటం చేస్తున్నారు, రక్తం కారుస్తున్నారు. ప్రతి మనిషీ అవసరం. నేను సైనిక శపధం చేసింది యిందుకు కాదు.’ అంటుంది. ‘ప్రపంచం రెండుగా చీలిపోతున్నది, ప్రజలు న్యాయం కోసం పోరాడుతున్నారు. నీవేమో సోఫాలో ముడుక్కొని పుస్తకాలు చదవాలని వున్నావు.’ అని అతన్ని ఎగతాళి చేస్తుంది. ‘నేను నీ పక్కన హంసతూలికా తల్పంలో పండుకోవాలంటావు, అవతల ప్రజలు న్యాయం కోసం తమ జీవరక్తం ధారవోస్తుండగా? చాక్లెట్లతో నా కడుపు నింపుకోవాలంటావు. ప్రతి చాక్లెట్టు యితరుల రక్తంతో కొని, …’ అంటూ అతన్ని ఉతికి పారేస్తుంది. ‘యితరులు కొత్త ప్రపంచం సృష్టించటానికి వుత్త చేతులతో భూమి దున్నుతుంటే నీవూ….’ అంటూ తిట్లకు లంకించుకొంటుంది.

మర్యూత్కాకు ఐశ్వర్యం గురించి తెలియదు. అందులో ఆమె ఎప్పుడూ బతకలేదు. ప్రాణాలకు తెగించి కారకుమ్ ఎడారి ఈదింది. అరల్ సముద్రం తుఫానులో తన ప్రాణంతో బాటు ఓత్రోక్ ప్రాణాన్ని రక్షించింది. అయినా ఓత్రోక్ వాగ్ధానం చేస్తున్న భద్రతా జీవితం, ధనం ఆమెను మభ్యపెట్టలేక పోయాయి. ఓత్రోక్ కోరుకొంటున్నట్లు నాజూకుగా మాట్లాడటానికి, ఉండటానికి ఇష్టపడలేదు. ఆమెకు అతని మీద కలిగిన ప్రేమను ఎలా వ్యక్తీకరించిందో అలాగే ఆమెలో విప్లవం పట్ల ఉన్న నిబద్ధతను కూడా అలాగే బయటపెట్టింది. చివరకు ఓత్రోక్ ఆమె కోసం రాజీ పడుతున్నానని చెప్తాడు.

కానీ అబద్ధమని వెంటనే తెలిసిపోతుంది. ఆ మాట అతని హృదయంలో నుండి రాలేదు. ఆ క్షణంలో సముద్రంలో నుండి వస్తున్న ఓడను చూసి గెంతులు వేస్తాడు. మర్యూత్కా కూడా సంతోషపడుతుండగా తెలుస్తుంది., అది వైట్ గార్డుల నావ అని. యెవ్సుకోవ్ చెప్పింది ఆమెకు వెంటనే గుర్తుకు వస్తుంది. వైట్ గార్డుల చేతిలో అతన్ని పడనివ్వవద్దని. ఓత్రోక్ వారిని చేరితే ఎర్ర సైన్యం అంతటికీ ప్రమాదం. అతను ఎర్ర సైన్యంతో ఉండి చాలా రహస్యాలు వింటాడు. ఆ ఓడ వైపు పరుగులు పెడుతున్న ఓత్రోక్ ను కదలవద్దని హెచ్చరిస్తుంది. వినకుండా వెళుతున్న ఓత్రోక్ ను రైఫిల్ తో కాల్చి వేస్తుంది. ఆమె కూడా అతని మీద పడి మరణిస్తుంది.

ఎంతో ప్రేమించిన వాడిని, ఆమె ఆనంద పట్టికలో ఆనందమైనవాడిని మర్యూత్కాలోని విప్లవవేత్త చంపివేస్తుంది. ఈ సారి గురి తప్పదు. ‘నలబై ఒకటవవాడు’ ఆమె చేతిలో మరణిస్తాడు. రెండవ ప్రయత్నం ఫలిస్తుంది. అయితే మొదటి ప్రయత్నానికి రెండో ప్రయత్నానికి మధ్య ఆమెకు అతని ఏర్పడిన బంధం మాటేమిటి? దానికి మూల్యం ఆమె ప్రాణం. ప్రాణంలో ప్రాణమైన ప్రియుడిని చంపివేసి ఆమెలో మనిషి ఇంక బతకలేదు. ఈ లెక్క కూడా సరిగ్గానే ఉంది. కధ ముందు మాటలో రాసినట్లు ‘వాళ్ళ మరణం పాత ఆదర్శాలకు బదులు కొత్త నైతిక ఆదర్శాలను స్థాపించటానికి చెల్లించబడిన బరువైన అనివార్యమైన మూల్యం.’

ఒక విప్లవ ప్రతిఘాతుకుడికీ, నికార్సైన విప్లవవేత్తకు మధ్య ప్రేమ కలగటానికి కావాల్సిన ప్రేరణను రచయిత గట్టిగానే కధలో స్థాపించాడు. అయితే ఈ ముగింపు నేటి సందర్భానికి తగదు. మర్యూత్కా లాంటి యువతులు విప్లవానికి చాలా అవసరం. విప్లవంలో పని చేస్తున్న యువతులను ప్రేమిస్తున్నామని చెప్పి మోసం చేసేవాళ్ళపట్ల, పెళ్లి చేసుకొని అందులో నుండి బయటకు వచ్చేయమని బలవంతం చేసే వారి పట్ల ఏ మాత్రం ఉదారతనూ, బాంధవ్యాన్నీ ప్రదర్శించటం తగదు. అనర్హులకు హృదయాలను అర్పించి జీవితాలను దుఃఖమయం చేసుకోవటం తెలివితక్కువ పని. ఎదురు దెబ్బలు తిన్న బ్రతుకులే సవాళ్ళకు నిలుస్తాయి. నిజమైన విప్లవోద్యమం ఆ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తప్పక యిస్తుంది.

ఈ పరిచయం ఏప్రెల్, 2016 మాతృకలో వెలుతురు పిట్టలు శీర్షికన ప్రచురించాము. ఆ ఫైల్స్ కింద