ట్యాగులు

, , , , ,

ఖాట్మండులో జరిగిన పునాది వర్గాల మహిళల రెండవ ప్రపంచ సదస్సు, 2016 కు హాజరైన మాతృక బృందం వివిధ దేశాల నుండి వచ్చిన మహిళలను కలిసి మాట్లాడింది. ప్రపంచ మహిళా ఉద్యమాల స్వభావాలు తెలుసుకోవటానికి ఈ మాటా మంతి ఎంతో ఉపయోగపడింది. రూట్స్ అనే సంస్థలో పని చేస్తున్న పాకిస్తాను మహిళా, మానవ హక్కుల యాక్టివిష్టు ‘అజ్ర’ పాకిస్తాన్ లో జరుగుతున్న అనేక ఉద్యమాలు, విషయాల పట్ల మార్క్సిస్టు దృక్పధంతో ఉన్నారు. ఆమెను ‘మాతృక’ చేసిన యింటర్వ్యూలో కొన్ని విశేషాలు.

azra1

మాతృక: పాకిస్తాన్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రజా పోరాటాలు ఏమిటి?

జ్ర: దాదాపు 20 సంవత్సరాలుగా, అంటే 1998 నుండి, పాకిస్తాన్ లో ఒక గొప్ప భూపోరాటం నడుస్తుంది. ప్రభుత్వమూ, మిలటరీ కలిసి రైతులను భూముల నుండి వెళ్లగొడుతున్నారు. ఆ భూమి వాస్తవంగా పంజాబు రాష్ట్రానిది. (పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం) అందులో మిలటరీ తన అవసరాలకు పంటలు పండించటం, గేదలను పెంచటంలాంటి పనులు చేయిస్తున్నది. ప్రజలు ఆ భూమి మిలటరీది కాదు ప్రభుత్వానిది అని గ్రహించారు. ప్రభుత్వానికి సంబంధించిన పడావు భూమిలు మాకే చెందుతాయని ఆ ప్రాంతపు రైతులు ఆ భూములు వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అంతకు ముందు రైతులు పండించినదానిలో 40 శాతం మిలటరీకి చెల్లించే వారు. ఆ భూమి మిలటరీకి సంబంధించినది కాదని తెలిసాక ఆ నలభై శాతం కూడా ఇవ్వటానికి వారు నిరాకరించారు. ప్రభుత్వం, మిలటరీ రైతులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు రైతులది గొప్ప పోరాటం అయితీరుతుంది. ఆ పోరాటంలో ఎందరో రైతులు చనిపోయారు. అది ఒక అద్భుతమైన కధ. గత ఇరవై సంవత్సరాల నుండి మిలటరీ ఎన్నో రూపాలతో వారి మీద దాడులు చేసింది. వారి అక్కడ నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది.

మాతృక: ఈ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం ఎంత?

జ్ర : అదే ఇక్కడ గొప్ప సంగతి. ఈ పోరాటంలో మహిళా భాగస్వామ్యం చాలా పెద్దది. పారా మిలటరీ దళాలు వస్తున్నప్పుడు మహిళలు ముందు ఒక కవచంలాగా నిలబడే వాళ్ళు. వాళ్ళను చూసి పారా మిలటరీ దళాలు వెనక్కు తగ్గుతాయి. ఒకవేళ ఆ దళాలు యింకా ముందుకు వస్తే స్త్రీలు వారి మగవాళ్ళకు వేలాడతారు. పారా మిలటరీ దళాలతో జరిగే ఈ పోరాటంలో మహిళలు క్రియాశీలకంగా పాల్గొంటారు. ఇరవై సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్లు లేవు. పారా మిలటరీ దళాలు ఒక గ్రామానికి వచ్చినపుడు ఆ గ్రామ మహిళలు వారి వంటగిన్నెలను గరిటలతో బాదేవారు. ఆ చప్పుళ్ళకు యితర గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యే వాళ్ళు. ఆ ప్రాంతం సూపర్ హైవేకి దగ్గరగా ఉండేది. అది దేశాన్ని అంతటినీ కలిపే హైవే. మిలటరీ వాళ్ళు వచ్చినపుడు ఆ రోడ్డును దిగ్భంధనం చేసేవాళ్ళు. అది ఒక జాతీయ విషయంగా తయారు అయ్యేది. దేశప్రజలకు అక్కడ ఏదో జరుగుతుందని తెలిసేది. ఇది ఒక సక్సెస్ ఫుల్ ఉద్యమం. ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతుంటాను. ఇన్ని సంవత్సరాలు వారు ఆ ఒత్తిడిని ఎలా ఉంచగలిగారు అని.

మాతృక : ఇతర మహిళా ఉద్యమాల గురించి చెబుతారా? మహిళా ఉద్యమాలు అంటే మా అర్ధం, అన్ని రకాల ఉద్యమాలలో వారి ప్రాతినిధ్యం?

జ్ర: ఇంతకంటే చెప్పుకోదగ్గ మహిళా ఉద్యమాలు, మహిళలు నాయకత్వం వహిస్తున్నవి నా దృష్టికి రాలేదు.

మాతృక : పాకిస్తాన్ లో మత ఛాందసవాదం గురించి మీరు ఏమంటారు?

జ్ర: అది చాలా వరకు మీడియా సృష్టిస్తున్నదే. అంటే పాకిస్తానులో మత ఛాందసవాదం లేదని నేను అనను. ఒక గ్రామంలో ఒక స్త్రీని వాళ్ళు మతం పేరుతో శిక్షించి ఉండవచ్చు. కానీ మీడియా ఆ సంఘటనను ఆధారంగా చేసి పాకిస్తాను దేశమంతా మత ఛాందసంతో నిండి ఉందని ప్రచారం చేస్తున్నది. అదే దేశం అమెరికన్ సైనిక దాడులకు వల్నరబుల్ గా ఉంటుంది. నా దృష్టిలో వారు చెబుతున్నఉగ్రవాద మత ఛాందసవాదం ఒక సైనిక పరికరం. ఇంకా చెప్పాలంటే సామ్రాజ్యవాద పరికరం. ప్రతిసారి వాళ్ళు దేశంలో ఒక పరిస్థితిని సృష్టిస్తారు. మత ఛాందసవాదం గురించి మాట్లాడుతారు. ఈ పేరుతో అమెరికన్ సైన్యం దేశంలోకి వస్తే దేశంలోని మత ఛాందసవాదులకు అభ్యంతరం ఉండదు. టెర్రరిజం మీద యుద్ధం చేస్తున్నామనే వంకతో అమెరికన్ సైన్యం ఇక్కడ తిష్ట వేస్తారు. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఛాందసవాదం అన్ని మతాలలో ఉంది. హిందూ మతంలోనూ, క్రిష్టియానిటీలోనూ కూడా ఈ ఛాందశవాదం ఉంది. మా దేశంలో ఫండమంటలిజానికి అమెరికా లేక దాని బంటు అయిన సౌదీ అరేబియా ఆర్ధిక వనరులు అందచేస్తాయి. భారతప్రభుత్వ విషయం ఏమిటి? గుజరాత్ లో జరిగిన మారణహోమాన్ని కార్పెట్ కింద దాచేయాలనుకొంటారు. భారత భూభాగ కాశ్మీరు విషయం ఏమిటి? అక్కడ ప్రజలను చంపటానికి హిందూ మత ఛాందసవాదం పని చేయటం లేదా? పాకిస్తాన్నేమత ఛాందసవాదిగా టార్గెట్ చేయటానికి రాజకీయ కారణాలు ఉన్నాయని అనుకొంటాను నేను. మహిళలు ఎక్కువ ప్రాధమిక హక్కులు లేకపోవటం వలనా, పితృస్వామ్యం వలనా పీడించబడుతుంటారు. మత ఛాందసవాదం కంటే కూడా అవి ప్రమాదకరమైనవి అని నేను భావిస్తాను. మతఛాందసవాదులూ, ఉగ్రవాదులూ అని జపిస్తూ ఆ మనం సామ్రాజ్యవాద వలలో పడుతున్నాము. ఐసిస్ కు ఆర్ధిక వనరులు సమకూరుస్తున్నది ఎవరు? ఆయుధాలు అందచేస్తున్నది ఎవరు?

azra2

మాతృక: హిందూ మతఛాందసవాదం గురించి మీరు ఏమనుకొంటారు? అది యిస్లాం ఛాందసవాదం కంటే ప్రమాదకరమైనదా?

జ్ర: రెండు సమానమే. అన్ని రకాల మతఛాందసవాదాలు క్రిష్టియానిటీతో సహా స్త్రీలకు ప్రమాదకరమైనవే. హాని చేసేవే.

మాతృక: ‘మలాల’ ఉదంతం గురించి మీరు ఏమనుకొంటున్నారు? అది నిజాయితీ కలిగిన విషయంగానే అనిపిస్తోందా?

జ్ర: నేను ఆమె గురించి ఎక్కువ గమనించలేదు. ఒక గ్రామం నుండి వచ్చిన చిన్నపిల్ల ఆడపిల్లల చదువు గురించి ఆలోచించటం, పని చేయటం గొప్పే. కానీ ఆమెను పాకిస్తాన్ నుండి బయటకు తీసుకొని వెళ్ళి పాకిస్తాన్ కు స్వరంగా మాట్లాడించటమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 16 ఏళ్ల పిల్ల పెద్ద పెద్ద పుస్తకాలు రాసిందని చెప్పటం కూడా అనేక సందేహాలకు తావు యిస్తుంది.

మాతృక: పాకిస్తాన్లో పితృస్వామ్యం ఎలా ఉంటుంది? అది మహిళల అభివృద్ధిని ఎలా ఆటంకపరుస్తుంది?

జ్ర: చాలా భయంకరంగా ఉంటుంది. పితృస్వామ్యం, పురుషాధిక్యత ఇక్కడ కలగలిసి ఉంటాయి. ఇస్లాం ఉండనే ఉంది. మహిళల కదలికలకు ఇస్లాం చాలా పరిమితులు విధిస్తుంది. నిజానికి ఇస్లాం చెప్పిన దాన్ని ముల్లాలు వక్రీకరించారు. నిజమైన ఇస్లాం ఇప్పుడు లేదు. ఇక వీరందరు చేసేదేమిటంటే ఆడపిల్లలని బడులకు వెళ్ళనీయరు. బుర్ఖా లేకుండా వెళ్ళలేరు. పోనీ బుర్ఖా ఉన్న ఫర్వాలేదు. సమస్య బుర్ఖాతో కాదు, సమస్య బడికెళ్ళటం గురించి. నేను గమనించిన ముఖ్యమైన సమస్య ఏమిటంటే గ్రామాలలో ఆడపిల్లలకు మహా ఉంటే ఐదో క్లాసు వరకు ఉంటుంది. తరువాత మిడిల్ స్కూల్ నాలుగైదు గ్రామాలకు కలిపి ఒకటి ఉంటుంది. అక్కడకు వాళ్ళు వెళ్ళటంలో భద్రత ఉండదు. అబ్బాయిలు వెళ్లగలుగుతారు. అమ్మాయిలు వెళ్లలేరు. నాలుగైదు గ్రామాలకు ఒక మిడిల్ స్కూల్ ఉన్నా ఆడపిల్లలను భద్రంగా అక్కడకు పంపించటం ప్రభుత్వ బాధ్యత. చిన్న పిల్లలకు అంత శిక్ష ఎందుకు? నేను చిన్నపిల్లను అయితే బడి కోసం అన్ని మైళ్ళు నడవటానికి నేను యిష్టపడను. తల్లిదండ్రులు ఆడపిల్లలను బడికి పంపాలని అనుకొన్నా చాలా అవరోధాలు ఇక్కడ ఉన్నాయి.

మాతృక: ముస్లిం మహిళలు ఎక్కువ మందికి జననం యివ్వటం వలన ముస్లిం జనాభా పెరిగిపోతుందనే వాదనకు మీరేమంటారు? పాకిస్తాన్ లో పేదరికానికి జనాభా పెరుగుదలే కారణం అంటున్నారు.

జ్ర: అలా అనుకొంటున్నారా? రబ్బిష్ (నవ్వు). భారత దేశ జనాభా ఒకటి కంటే ఎక్కువ బిలియన్లు. చైనా జనాభా అంతకంటే ఎక్కువ. ఇవి రెండు ముస్లిం దేశాలు కావు. పేదరికాన్ని జనాభాతో ఎప్పుడు కొలవకూడదు. ప్రపంచ జనాభా మొత్తం ఏడు బిలియన్ల కంటే ఎక్కువ ఉంది. రెండొంతుల ప్రపంచ వనరులు ఒక వంతు ప్రపంచ జనాభా అనుభవిస్తున్నారు. ఆ అనుభవించే వాళ్ళు భూగోళంలో అగ్ర రాజ్యాలలో ఉన్నారు. మూడో ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లిములు అయినా, హిందువులు అయినా, క్రిష్టియన్లు అయినా ప్రపంచ వనరుల్లో కేవలం ఒక వంతు మాత్రమే అనుభవిస్తున్నారు. ముస్లిం జనాభా మీద ఈ అభియోగం అన్యాయమైనది. ఒక యాక్టివిష్టుగా నేను జనాభా గురించి మాట్లాడటానికి యిష్టపడను. మహిళా హక్కుల కార్యకర్తలుగా మనం ఆలోచించాల్సింది ఎక్కువ జననాలు యివ్వటం వలన ఎంత జనాభా పెరుగుతుందని అని కాదు. ఆ జననాల వలన ముస్లిం మహిళా ఆరోగ్యం ఎంత చెడిపోతుందనే విషయం ఆలోచించాలి. ఆమె ఎంత వరకు ఆ పిల్లలని ఆరోగ్యకమైన, ప్రేమాస్పదమైన పరిస్థితుల్లో పెంచగలదో ఆలోచించాలి.

మాతృక: బుర్ఖా గురించి మీరు ఏమి అనుకొంటున్నారు? అది మహిళల అభివృద్ధి ఆటంకం కాదా? కొంతమంది బురఖాను రక్షణగా భావిస్తున్నారు. కొంత మంది బురఖా ధరించటం అస్తిత్వ విషయంగా భావిస్తున్నారు.

జ్ర: నేను వ్యక్తిగతంగా బురఖాను వ్యతిరేకిస్తాను. ఒక మహిళ డిగ్నిటీని అది హరిస్తుందని భావిస్తాను. ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్యంలో కూడా మహిళలు వారి అస్తిత్వ నిరూపణ కోసం బురఖాలు ధరిస్తున్నారంటే కూడా నేను దాన్ని నెగటివ్ గానే చూస్తాను. మహిళలకు స్వేచ్ఛ లేని ముస్లిం దేశాల్లో వారు ధరిస్తున్నారంటే అది వేరే విషయం. కానీ ఈ క్రిష్టియన్ నన్స్ ఎందుకు బురఖాలాంటిది ధరిస్తారు? ఎవరు దాని గురించి మాట్లాడరు ఎందుకు? ఇస్లాంను విమర్శించాలంటే సౌదీ అరేబియాను ఎందుకు విమర్శించరు? సౌదీ అరేబియా పూర్తిగా పురుషాధిక్య, మహిళా వ్యతిరేక దేశం. దాని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? మార్క్సిస్టులుగా ఈ వైరుధ్యాలను, అందులోని పన్నాగాలను మనం గ్రహించాలి.

మాతృక: పాకిస్తాన్లో మానవ హక్కుల భంగం గురించి మీరేమంటారు?

జ్ర: అసలు మాకు మానవ హక్కులు లేవు. రైతుల భూములు ఏ క్షణంలోనైనా లాక్కొని బయటకు పంపవచ్చు. కార్మికులకు ఏ నిమిషంలోనైనా పని పోవచ్చు. ఫ్యూడలిజం, పితృస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం ఉన్న ఏ దేశంలోనైనా హక్కులు ఎక్కడ ఉంటాయి? ఉంటాయని నేను అనుకోను.

మాతృక: మీ దేశంలో ఫెమినిస్టిక్ ఉద్యమాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎం. ఎల్ పార్టీలు ఉన్నాయా?

జ్ర: చాలా కమ్యూనిష్టు పార్టీలు ఉన్నాయి. వారి వెనుక ఎంత మంది జనం ఉన్నారనేది ముఖ్యం. ఫెమినిస్టిక్ ఉద్యమాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ అమెరికా ఆర్ధిక వనరులతో నడుస్తున్నాయి. ఆ ఫెమినిస్టులు పాశ్చాత్య దేశాల్లో జీవిస్తున్నట్లే పాకిస్తాన్ లో జీవిస్తూ ఉంటారు. వర్గ దృక్పధం లేని ఉదారవాద స్త్రీవాదులు వాళ్ళు.

మాతృక: పాకిస్తాన్ లో ఉన్న ఆదిమజాతుల పోరాటాలు గురించి చెప్పండి.

జ్ర: చాలా జరుగుతున్నాయి. మీకు ఈశాన్య భారతంలో జరుగుతున్నట్లే ఇక్కడా జరుగుతున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్స్ లో జరుగుతున్న ఉద్యమాలను అమెరికా ఆర్ధిక వనరులు సమకూరుస్తుంది. అయినా నేను వారి డిమాండ్లను అంగీకరిస్తాను. వారి హక్కులను గుర్తిస్తాను. సమస్య లేకుండా ఉద్యమాలు రావు. పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ ఉద్యమాలకు బాధ్యత వహించాలి. వాళ్ళకివ్వాల్సిన హక్కులు వారికి యిచ్చి ఉంటే వారు పోరాడాల్సిన అవసరం ఉండేది కాదు. వారి కోర్కెలను వ్యతిరేకించవద్దు. ఆ ఉద్యమాలు ఏ దిశగా పోతున్నాయో, ఎవరు నాయకత్వం వహిస్తున్నారో గమనింపు ముఖ్యం. మార్కిస్టులుగా సామ్రాజ్యవాద వ్యతిరేక చూపు మనకు అవసరం.

మాతృక: ఈ పోరాటాలు చేస్తున్న వారు వాళ్ళ గొంతులను అణచివేతకు వ్యతిరేకంగా ఎత్తుతున్నారా? లేక అస్తిత్వం కోసం చేస్తున్నారా?

జ్ర: సింధూ ఉద్యమం అస్తిత్వ ఉద్యమంలాగా కనబడుతుంది. బలూచియాన్ (బలోచిస్తాన్ లో ఆదిమ తెగలు చేస్తున్నది) ఉద్యమం హక్కుల కోసం జరుగుతున్నది. ఇంకా కొన్ని ఉద్యమాలు జరుగుతున్నవి కానీ చెప్పుకోదగ్గవి కాదు. వలసవాద ప్రభుత్వాలు పుట్టించిన అసంతృప్తి వలన జరుగుతున్నాయి. దేశాన్ని విడదీయటానికి వలసవాదులు ఆ విత్తనాలను చల్లి వెళ్లారు.

మాతృక: పాకిస్తాన్ లో ఉన్న హిందూ మైనారిటీల గురించి మీరు ఏమి అనుకొంటున్నారు?

జ్ర: చాలా కష్టమైన ప్రశ్న. హిందువులు చాలా చిన్న మైనారిటీ ఇక్కడ. వారి గురించి ఎవరైనా మాట్లాడితే భారతదేశ ఏజెంట్ అంటారు. క్రిష్టియన్ల గురించి మాట్లాడితే మళ్ళీ ఏమనరు. ఇక్కడ హిందువులు ఎప్పటి నుండో జీవిస్తున్నారు. మమ్మల్ని పాకిస్తాన్ వాసులు కాదని అనవచ్చు., ఇండియా నుండి వచ్చాము కాబట్టి. కానీ వారిని అలా అనలేము. వారిని దళితులని అంటున్నారు. షెడ్యూల్డ్ కాస్ట్ కిందకు వారిని చేర్చారు. పాకిస్తాన్ లో కులం లేదు. మరి వారిని ఎందుకు షెడ్యూల్డ్ కాస్ట్ గా చేశారో అర్ధం కానీ రాజకీయ విషయం.

(వచ్చే నెల కుర్ధిస్తాన్ లో ని ‘రొజావా’ భూభాగంలో పని చేస్తున్న గాలియా ఇంటర్వ్యూ)

ఈ ఇంటర్య్వూ ఏప్రెల్, 2016 మాతృకలో ప్రచురించాము. ఆ ఫైల్స్ ఇక్కడ

azra-page-001

azra-page-002

azra-page-003