ట్యాగులు

, , , , ,

jisha

ఇది ఒక ఇంటి కధ. భారతదేశంలో అనేకానేక ఇళ్లలాంటిదే. ప్రభుత్వం యిచ్చిన పోరంబోకు స్థలంలో వేసుకొన్న చిన్న అడ్డా. సిమెంట్ చెయ్యని యిటుకలతో కట్టి, పైన పగిలిపోయిన రేకులతో కప్పి ఉంటుంది. ఆ ఇంటి తలుపులు బలంగా ఉండవు. ఆవులు, పాములు లోపలికి వస్తాయని ఆ ఇంటి పిల్ల త్వరత్వరగా ఆమె చదువుతున్న ‘లా’ కాలేజీ నుండి ఇంటికి చేరుతుంది. ఇంటికి వచ్చే దారిలో కాలువ ఉంటుంది. కాలువ మీద వేసిన కాంక్రీట్ శ్లాబ్ దాటుకొని వస్తే ఆ ఇంటికి సన్నటి దారి. దారి పొడువునా ఎవరూ పట్టించుకోక వాడిపోతున్న పూల మొక్కలు ఉంటాయి. ఇంటిలో ఉన్న ఒకే గదిని మూడు భాగాలుగా చేసి వాడుకొంటారు. ఇంటి వెనుక వైపు రెండు స్తంభాల చుట్టూ పగిలిపోయిన ప్లాస్టిక్ ముక్కలు నాటి ఉంటాయి. అది వాళ్ళ బాత్ రూమ్ అనుకొంటా. దానికి పైన కప్పు లేదు. ప్రకృతి అవసరాలు వాళ్ళు ఎలా తీర్చుకొంటారో ఆ ఇల్లు చెప్పలేదు.

ఇక ఆ ఇంట్లో వ్యక్తుల కధ. ఎన్నో ఇళ్ల లాగానే ఆ ఇంటికి మగ దిక్కు లేదు. ఇద్దరు ఆడపిల్లలను తల్లి రాజేశ్వరి కూలి పని చేస్తూ బతికించింది. పెద్ద పిల్ల ఎవరినో ప్రేమించి, పారిపోయి పెళ్లి చేసుకొని, మోసపోయి ఒక బిడ్డతో మిగిలింది. రెండవ అమ్మాయి జిషా మాత్రం అమ్మకు తోడుగా ఉండి పోయింది. భారతదేశంలో అందరు అమ్మాయిల లాగానే 30 ఏళ్ల జిషాకు కోరికలు ఉన్నాయి. లా చదివి స్వశక్తి మీద నిలబడాలనీ, అమ్మను బాగా చూసుకోవాలనీ, తర్వాతే పెళ్లి చేసుకోవాలనీ. తల్లి రాజేశ్వరి గయ్యాళి అంటారు. ఎవరినీ యింటి దగ్గరకు రానివ్వదని చెబుతారు. పిల్లలు ఆ యింటికి దగ్గరలో ఆటలాడుకొంటుంటే తరిమి కొడుతుందంటారు. ఆ ప్రాంతంలో అగ్రవర్ణాలవారికి బాల్కనీలు ఉన్న యిళ్ళు చాలా ఉన్నాయని, వారందరికీ పంపులు ఉన్నా రాజేశ్వరి కుటుంబం ఒకటే కిలో మీటర్ల దూరంలో ఉన్న బావినుండి నీళ్ళు తెచ్చుకొంటారని చెబుతారు. వాళ్ళు చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. టాపు లేని, తలుపులు లేని బాత్ రూమ్ లో వాళ్ళు స్నానం చేయాలంటే, ప్రకృతి అవసరాలు తీర్చుకోవాలంటే ఆమె అలా గయ్యాళిగా అరవక పోతే కుదరదని. పేదలు నివసించే చోటుల్లో ముప్పాతిక తగాదాలు ఆ ప్రైవసీ కాపాడుకోవటానికే వస్తాయని. నీళ్ళ కోసం ఆమె గతంలో ఆ పేటలోని వాళ్ళను బతిమలాడి, తగాదా పడిందనీ.

ఆ గది గోడలు రాజేశ్వరి అనుభవించిన అభద్రత, భయం అకారణమైనవి కావనీ, అర్ధరాత్రి వారి యింటి తలుపు ఎవరో తోస్తూ ఉంటారనీ, యింటిపై నుండి కూడా ఎవరో ఎక్కిన శబ్ధం వినపడుతుందనీ చెబుతున్నాయి. జిషా పడుకొనే మంచం కూడా ఏదో విషయం చెబ్తోంది. జిషా పరుపు కింద ఎప్పుడు కొడవలిని ఉంచుకొని పడుకొంటుందట. ఎన్నో సార్లు రాజేశ్వరి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తమ యింటికి రక్షణ కల్పించమని మొత్తుకొన్నదనీ ఎవరూ పట్టించుకోలేదని చివరకు ఆమె భయపడినంతా జరిగిందని చెబుతోంది.

ఇంకా అందరికి తెలిసినా ఎవరికీ మాట్లాడటం యిష్టంలేని విషయం జిషా తండ్రి దళితుడనీ, ఆ కుటుంబం దళిత కుటుంబంగా వెలివేతకు గురయ్యిందని. జిషా పాశవిక అత్యాచారానికి, హత్యకు గురి అయి నగ్నంగా ఆ యింటిలోని మొదటి గదిలో పడి వుండటం కూలికి వెళ్ళి వచ్చిన తల్లి చూసి గుండెలు పగిలేటట్లు ఏడుస్తున్నా పోలీసు వాన్ వచ్చిన దాకా ఎవరూ పట్టించుకోకుండా, పట్టించుకొన్నా ఆ దరిదాపులకు రాక పోవటానికి కారణం వారి కులమేననీ ఎవరు అంగీకరించరు. చుట్టుపక్కల అన్ని యిల్లు ఉన్నా ఆ యింటిలోకి ఎవరు వచ్చారు అనే విషయం ఎవరు చెప్పరు. దళిత ప్రాణానికి, దళిత స్త్రీ లైంగిక గౌరవానికీ ఉండే విలువ చాలా క్షీణమైనదని రుజువు చేస్తారు.

రాజేశ్వరి ఇల్లులాంటి భద్రత ఇవ్వని ఇళ్ళు, రాజేశ్వరి కుటుంబంలాగా అండలేని ఒంటరి తల్లుల కుటుంబాలు కోకొల్లలు ఈ దేశంలో. బయటకురాని లైంగిక దాడులు వారి మీద ఎన్ని జరిగాయన్నది ఏ సేకరణ చెప్పదు. అయితే ఇక్కడ జరిగింది క్రూరాతి క్రూరమైన అత్యాచారం హత్య కాబట్టీ, లా కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు కాబట్టీ నాలుగు రోజుల తరువాత అయినా పోలీసులు కదలక తప్పలేదు. అయిష్టంగా అయినా మీడియా కదలక తప్పలేదు. ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులు ఆ యింటికి రాకా తప్పలేదు. ఫలితం ఏమీ లేదు. శుష్క వాగ్ధానాలు తప్ప. ఎర్నాకులంకు దగ్గరలో ఉన్న హబ్ లో వలస కూలీలుగా ఉంటున్న వారిని అరెస్టు చేసి ఏదో చేస్తున్నాము అని చెప్పక తప్పక లేదు. కేరళలో ఎక్కడ ఏ నేరం జరిగినా ఈ వలస కూలీల దగ్గరకే పోలీసులు వస్తారు.

దేశంలోనే అత్యధిక మహిళా అక్షరాస్యతలోనూ, అతి తక్కువ శిశు మరణాలతోనూ, మెరుగైన స్త్రీపురుష నిష్పత్తిలోనూ, అభివృద్ధిలోనూ పేరెన్నికగన్న కేరళ రాష్ట్రంలో కూడా యిలా జరుగుతోందా అనే ప్రశ్న అమాయకమైనది. ఈ ప్రశ్నకు సమాధానం అభివృద్ధి అనే పదంలోనే ఉంది. ఆ అభివృద్ధి అందరికీ సమానంగా లేదు. ఈ అసమానత్వంలో కూడా కేరళ ప్రధమంలోనే ఉంది. ఆర్ధిక సామాజిక అసమానత్వానికి జిషా కేసు అతి ముఖ్యమైన ఉదాహరణ. అభివృద్ధి అని చెప్పబడుతున్న దానికి చాలా చెడు ఫలితాలు ఉంటాయి. ఒక ఫలితం ఏమిటంటే పక్కనున్న వారిని పట్టించుకోక పోవటం. డబ్బు, కులంలాంటి ఆర్ధిక సాంస్కృతిక పెట్టుబడిలేని వారిని అసలు పట్టించుకోక పోవడం. ‘అభివృద్ధి’ చెందిన పెద్ద పెద్ద లోగిళ్ళు ఉన్న కుటుంబాలు జిషా బతికి ఉండటంలోకానీ, మరణించటంలో కానీ, లైంగిక హింస అనుభవించటంలో కానీ లేక గౌరవంగా బతకటంలో కానీ ఏమీ తేడా చూడవు. అందుకే ఈ రోజుకీ ఆ చుట్టుపక్కల కుటుంబాలు ఆ కేసుకు ఏ మాత్రం సహకరించటం లేదు.

దళిత స్త్రీల మీదనే ఎక్కువ లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయనేది గణాంకాలు చెబుతున్న సత్యం. దళితుల మీద జరిగిన హత్యాచారాల మీద శిక్షలు పడవన్నవి న్యాయ చరిత్రలు చెబుతున్న నిజం. దళిత స్త్రీల ఆర్ధిక స్థితిగతులు, గత కోర్టుల్లో వచ్చిన తీర్పులు చాలు నిందితులను ప్రోత్సహించటానికి. పట్టపగలు జరిగిన ఈ దాడిలో పక్కవాళ్లు కూడా పట్టించుకోక పోవటానికి గల సామాజిక కారణాలు అర్ధం చేసుకోక పోవటం, అర్ధం చేసుకోవటానికి నిరాకరించటం ఈ నాటి సామాజిక చేదు నిజం.

జిషా కేసు తరువాత చాలా ప్రశ్నలు వస్తున్నాయి. హింస, అందులోనూ స్త్రీల మీద హింస ఎందుకు నిత్యకృత్యం అవుతుంది? ఈశాన్య రాష్ట్రాలలో, కాశ్మీర్ లో, మావోయిస్టు ప్రాంతంలో అమలవుతున్న హింసను కాసేపు పక్కన పెడదాం. ఒక ఆడపిల్ల తన యింట్లో తాను మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొనే వేళ జరిగిన హింస గురించి మాట్లాడుకొందాం. సొంత యిళ్ళు భద్రత ఇవ్వలేని స్థితిలో ఎందుకు ఉంటున్నాయి? రాజేశ్వరిలాంటి ఇంకా 2,32,000 మంది చేరెడు భూమి కోసం, యింటి నిర్మాణం కోసం కేరళ ఒక్క రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకొని వున్నారు. జండా మార్పిడి జరిగిన డెబ్బై సంవత్సరాల తరువాత రక్షణ యిచ్చే యిళ్ళు లేని కుటుంబాలు, ఆ మాట కొస్తే అసలు యిళ్ళేలేని కుటుంబాలు ఇంకా ఎందుకు వుంటున్నాయి? భారతదేశం మహిళలకు ‘తలుపులు సరిగ్గా లేని యిల్లు’ లాగానే ఇంకా ఎందుకు మిగిలిపోయింది?

ఇంత హింస అమలు అవుతున్నా, సమాజం దాన్ని మామూలుగా తీసుకొంటున్నదంటే ఆ సమాజం మామూలుగా లేదనే కదా అర్ధం? ఈ ప్రశ్నకు సమాధానం మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి అతీతమైనది. ఈ దేశంలో మధ్య తరగతి ప్రజలు వాళ్ళ కలలను సాకారం చేసుకోవటానికి ప్రజాస్వామ్యాన్ని కోరుకోవచ్చు. కానీ ఇక్కడి సామాన్య మహిళలకు (ఇంకా దళితులకు, ఆదివాసులకు కూడా) ఈ ప్రజాస్వామ్యం బహు నిరంకుశంగా ఉంటుంది. దేశంలో మూలమూలనా ప్రజాస్వామ్యం పేరుతో అమలు అవుతున్న క్రూరత్వం నిరంకుశ ప్రభుత్వం అవసరం లేకుండా చేస్తుంది. అందుకే ప్రజాస్వామ్యం పేరుతో చలామణి అవుతున్న నిరంకుశత్వాన్ని విశ్లేషణ చేస్తే కొంత ఫలితం వుంటుందేమో.

రెండో ప్రశ్న. అత్యాచార బాధితులైన మహిళలు ఎందుకు హత్యకు గురి అవుతున్నారు? శిక్షలు కఠినతరం అవుతున్న కొద్దీ ఈ హత్యలు పెరుగుతున్నాయి. దీనికి యాంత్రిక సమాధానం సాక్ష్యాన్ని లేకుండా చేయటానికి అని చెబుతారు. ఇంత సరళమైన సమాధానం ఇంత సంక్లిష్టమైన విషయానికి సరిపోదు. ఇందులో ఎన్నో అంశాలు యిమిడి ఉన్నాయి. హత్య దురాశకు తిరుగులేని వ్యక్తీకరణ. అత్యాచారం హత్యలో పాదుకు పోయిన అంతర్గత మానసిక చర్య. వాటి రెండిటి మధ్య వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉంటుంది. అత్యాచారం గెలవటానికి సాధనం. ఆ గెలుపు దేశానిది కావచ్చు. వ్యక్తిది కావచ్చు. ప్రభుత్వం దేశంలో వనరులను వేరొకరికి దోచి ఇవ్వటానికి దేశ ప్రజలను అణచివేస్తే అది విజేతగా నిలుస్తుంది. దానికి అది అత్యాచారాలను సాధనంగా వాడుకొంటుంది. అవసరం అయిన దగ్గర హత్యను, అత్యాచారాన్ని రెంటినీ వాడుకొంటుంది. అదే ప్రభుత్వం కింద ఉన్న వ్యక్తి ఆకలి వేసి జేబుకొడితే నేరస్తుడు అవుతాడు. అత్యాచారం చేస్తే ఉరి తీయాలని డిమాండ్ పెరుగుతుంది. అత్యాచారం దానికి సంబంధించిన హత్యలకు మూలాలు రాజ్యప్రేరితంగా మన సమాజంలోనే ఉన్నాయని అంటే ఎవరు ఒప్పుకోరు. అత్యాచారాలకు కారణమైన క్రూరమైన దురాశ, హత్యాసదృశ్యమైన దురాక్రమణ మన సమాజపు బట్టలోనే నేయబడి ఉన్నాయని అంటే కళ్ళెర్ర చేస్తారు.

హత్యలు, అత్యాచారాలు రాజ్యం పెంచి పోషిస్తున్న సామాజిక హింసా రూపాలు అని అంగీకరించగలిగితేనే పరిష్కారం సమాజ ప్రక్షాళనతోనే వస్తుందని నమ్మగలం. ఆ ప్రక్షాళనకు అవసరమైన క్రియల వైపు వెళ్లగలం. అలా అంగీకరించక పోతే చట్టాల వైపు, న్యాయస్థానాల వైపు, పోలీసు వ్యవస్థ వైపూ ఇంకా ఆశగానే చూస్తూనే ఉంటాం.

(జూన్ 2016, మాతృక సంపాదకీయం)