ట్యాగులు

, , , , , , ,

johns

ఫిలిప్పీన్స్ మహిళా కూటమి ‘గాబ్రేల’ అంతర్జాతీయ సంబంధాల అధికారి జాన్స్ తో మాతృక ముఖాముఖీ

ఫిలిప్పీన్స్ ఆగ్నేయ ఆసియాలో తొమ్మిదన్నర కోట్ల జనాభాతో ఉన్న ఒక చిన్న దేశం. భారత దేశంలాగానే అది అర్ధ వలస అర్ధ భూస్వామ్య దేశం. చాలాకాలం స్పానిష్ వలసగా ఉన్న ఈ దేశాన్ని స్పానిష్ ప్రభుత్వం అమెరికాకు ఇరవై మిలియన్ డాలర్లకు అమ్మివేసింది. పేరుకు 1946లో స్వాతంత్ర్యం యిచ్చినట్లు చేసి తన సామ్రాజ్యవాద కబంధ హస్తాలలో ఈ దేశాన్ని ఇరికించింది. ఫిలిప్పీన్స్ దేశపు పాలకులను అమెరికా తన చెప్పు చేతల్లో ఉంచుకొన్నది. గవర్నర్లను తన వారిని నియమించుకొన్నది. పెద్ద పెద్ద మిలటరీ బేస్ లను ఫిలిప్పీన్స్ లో ఏర్పాటు చేసింది. కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఫిలిపినో 1968లో పునర్నిర్మాణమై ప్రజలను చేరుకొన్నది. అప్పటి నుండి ఈ రోజు వరకు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంధాను అనుసరించి పోరాడుతూనే ఉంది. నూతన ప్రజాసైన్యాన్ని(ఎన్ పి ఏ) ఏర్పాటు చేసింది. దాన్ని అభివృద్ధి చేస్తూ ఫిలిప్పీన్స్ జాతీయ ప్రజాస్వామిక వేదికను ( నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్) ఏర్పాటు చేసింది. అందులో విప్లవ, ప్రజాస్వామిక సంఘాలు ఉంటాయి. ఆ ప్రజాస్వామిక సంఘాలలో ‘గాబ్రేల’ (GABRIELA) ఒకటి. మహిళల సమస్యల మీద బహిరంగంగా పని చేసే సంస్థ యిది. ఆ సంస్థనుండి ‘పునాది వర్గాల రెండో ప్రపంచ మహాసభకు (ఖాట్మండు)’ ఎమిలీ, జాన్స్ హాజరు అయ్యారు. ఆమె గాబ్రేలలో అంతర్జాతీయ సంబంధాల అధికారి.

మాతృక: గాబ్రేల గురించి చెప్పండి

జాన్స్: గాబ్రేల పునాది వర్గాల మహిళల సంస్థ. ఇది ఫిలిప్పీన్స్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. పూర్తి పేరు ‘జనరల్ అసెంబ్లీ ఫర్ బైండింగ్ వెమెన్ ఫర్ రిఫార్మ్స్, ఇంటెగ్రెటి, ఈక్వాలిటీ, లీడర్ షిప్ అండ్ యాక్షన్’ (General Assembly Binding Women for Reforms, Integrity, Equality, Leadership, and Action). ఇది దాదాపు రెండు వందల సంస్థల, సంఘాల, కార్యక్రమాల కూటమి ఇది. ఈ కూటమికి అమెరికాలో, నెదర్లాండ్స్ లో, హాంకాంగ్ లో, జపాన్ లో విభాగాలు ఉన్నాయి. ఏఏ దేశాల్లో ఫిలిప్పీన్స్ శరణార్ధులు, కాంట్రాక్టు పనివారలు ఉంటారా అక్కడంతా గాబ్రేల ఉంది. ఆ ఫిలిప్పీన్స్ లో ఎక్కువ సభ్యత్వం వున్న సంస్థలు: అమిహాన్ రైతు మహిళల జాతీయ సమాఖ్య, పట్టణ ప్రాంత పేద మహిళల సంఘం( సమకన), కార్మిక మహిళల ఉద్యమం, ఆదిమ జాతి మహిళల కూటమి (ఇన్నాబూయోగ్), స్వయం నిర్ణయాధికారం మరియు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ముస్లిం మహిళల సంఘం. ఇప్పుడు గాబ్రేలలో రెండు లక్షల సభ్యులు వున్నారు. మా సంస్థ సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, అత్యాచార సంస్కృతి, మహిళల అక్రమ రవాణా, హింస, మిలటరీకరణలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

philippines 1

మాతృక: గాబ్రేల ఎప్పుడు ప్రారంభం అయ్యింది ?

జాన్స్: ఫిలిప్పీన్స్ ఆ నాటి అధ్యక్షుడు మార్కొస్ తన పాలనలో ప్రజా నిరసన ప్రదర్శనలను నిషేదిస్తూ ఒక డిక్రీ చేశాడు. అప్పుడు మొదటి సారిగా పదివేల మంది మహిళలు దేశ రాజధాని మనీలలో ప్రదర్శన చేశారు (1984). అదే గాబ్రేల ప్రారంభం అని చెప్పవచ్చు. 18వ శతాభ్డంలో స్పైన్ పరిపాలనకు వ్యతిరేకంగా తిరగబడిన ‘గాబ్రేల సిలాంగ్’ ను గౌరవిస్తూ ఆమె పేరు పెట్టుకొన్నారు.

మాతృక: ఫిలిపినో మహిళా ఉద్యమం చరిత్ర కొద్దిగా చెప్పండి.

జాన్స్: సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఫిలిప్పీన్స్ ప్రజల ఆకాంక్షల నుండి ఫిలిపీనో సమాజంలో మహిళల పాత్ర రూపొందింది. మహిళా ఉద్యమాలకు స్పానిష్ కాలానికి ముందు నుండే వేళ్ళు ఉన్నాయి. అప్పట్లోనే మహిళలు సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాల్లో చేసే నిర్ణయాలలో కీలక పాత్ర వహించే వాళ్ళు. ఉద్యమాలలో కూడా అంతే క్రియాశీలకంగా ఉన్నారు. ఫిలిప్పీన్స్ ద్వీపాలు స్పానిష్ కాలనీలుగా మారాక స్పానిష్ సమాజంలో అప్పటికే ఉన్న పితృస్వామ్యం మహిళలను లోబరచుకొన్నది. స్పానిష్ కాలం తరువాత ‘గాబ్రేల సిలాంగ్’ లాంటి మహిళా విప్లవకారులు చేసిన ఉద్యమాలు స్వాతంత్ర్య పోరాటాలకు దారులు వేశాయి. స్పానిష్ కాలనీగా సేవలందించి, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆక్రమణకు గురి అయ్యి 1960 నాటికి అమెరికా స్వాధీనంలోకి వెళ్లిపోయింది ఫిలిప్పీన్స్. 1965లో మార్కొస్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అయ్యాక కమ్యూనిష్టులను నిర్మూలించటానికి మార్షల్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో ఉన్న ముఖ్యమైన విప్లవ మహిళా సంస్థ పేరు ‘మాకీబాకా’ (తిరిగి పోరాడు). మాకీబాకా అప్పట్లో ఏర్పడిన నూతన ప్రజా సైన్యాన్ని బలపరిచేది. దానితో బాటు ఫిలిపీనో సమాజంలో ఉన్న రాజకీయ, మత, వంశ, పురుషాధిక్య కోరల నుండి మహిళలు బయటపడటానికి కృషి చేసేది. పల్లెల్లో, పట్టణాలలో కూడా మహిళలను చైతన్యం చేయటానికి ప్రయత్నించింది. 1972లో వచ్చిన మార్షల్ లా వలన ‘మాకీబాకా’ అజ్ఞాతంలోనికి వెళ్లాల్సి వచ్చింది. ప్రెసిడెంట్ కాండిడేట్ బెనిగ్నో అక్వినోను (పీపుల్స్ పార్టీ) మార్కొస్ హత్య చేయించిన తరువాత మునుపెన్నడు లేని విధంగా ప్రజాఉద్యమాలు ముందుకు వచ్చాయి. ఆయన భార్య మరియా కారోజోన్ అక్వినో తరువాత ఆ పార్టీని లీడ్ చేసింది. ఆమె ఫిలిప్పీన్స్ మొదటి మహిళా ప్రెసిడెంట్ అయ్యింది. అయితే తరువాత ఆమె కూడా ప్రజా వ్యతిరేకంగా తయారయ్యి విప్లవోద్యమాన్ని అణచివేయటానికి చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకొని వచ్చింది.

అక్వినో అధికారంలోకి వచ్చిన కొత్తలో, 1986-87 ప్రాంతంలో జాతీయ రాజ్యాంగాన్ని తయారు చేయటం కోసం వేసిన కమిటీలో 48 మంది గాబ్రేల సభ్యులను ఆహ్వానించింది. గాబ్రేల ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. అయితే దానికి బదులుగా పునాది వర్గాల ఫిలిప్పీన్స్ మహిళలు ఏమి కోరుకొంటున్నారో వాటిని బట్ట పీలికల మీద రాయమని తమ సభ్యులను కోరి ఆ పీలికలను జాతీయ రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీ సమావేశం జరుగుతున్న గోడలకు తగిలించింది. గాబ్రేల కూటమి ప్రధానంగా మూడు విషయాలను స్పష్టం చేసింది.

1. మహిళా హక్కులు మరియు సంక్షేమం

2. కుటుంబ సంక్షేమాన్ని, పిల్ల హక్కులను కాపాడటం

3. మహిళలు అర్ధవంతమైన జీవితం గడపటానికి అవసరమైన రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితులను ప్రోత్సహించటం.

ఇంకా పురుషులతో సహా స్త్రీలకు సమాన వేతనాలు కావాలని డిమాండ్ చేసింది. గాబ్రేల చేసిన ఈ కృషి వలన 2010 జండర్ తేడా సూచికలో ఫిలిప్పీన్స్ దేశం 9వ స్థానంలోకి వచ్చింది. మొదటి పది స్థానాలలోపు ఉన్న ఏకైక ఆసియాదేశం ఫిలిప్పీన్స్.

philippines map

మాతృక: మీ పని ఏ విధంగా ఉంటుంది?

జాన్స్: మేము ప్రధానంగా పునాది వర్గాల మహిళల మీద కేంద్రీకరించి పని చేస్తాము. కార్మికులు, రైతు కూలీలు, పట్టణ పేదలు, యువతులు మొదలైన వాళ్ళల్లో పని చేస్తాము. మేము చాలా రాజకీయ కార్యక్రమాలు చేస్తాము. ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను ప్రజా సమస్యల మీద నిలదీస్తాము. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మాస్ ఎడ్యుకేషన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాము. మహిళా విముక్తికి సిద్ధాంతపరమైన మార్గాలను వారికి నేర్పిస్తాము. మార్క్స్, లెనిన్, మావో రాతల వెలుగులో వారికి ఈ బోధన జరుగుతుంది. విప్లవోద్యమంలో మహిళల పాత్ర, ఉత్పత్తిలో స్త్రీల పాత్రల ప్రాముఖ్యతను వారు గుర్తెరిగేలా చేస్తాము. మహిళల మీద హింస జరిగినపుడు వారికి మొదట కౌన్సిలింగ్ చేస్తాము.

మాతృక: అయితే మీ సంస్థ మార్క్సిజాన్ని నమ్ముతుంది…?

జాన్స్: మేము మహిళా విముక్తికి మార్క్స్, లెనిన్, మావో దారులు వేశారని నమ్ముతాము. కానీ మమ్మల్ని మార్కిస్టులు అనలేము. జాతీయ ప్రజాసామికవాదులు అంటారు. గాబ్రేలలో కొంత మంది ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఫిలిప్పీన్స్’ లో సభ్యులుగా ఉన్నారు. కానీ మా కూటమి రకరకాల సంస్థల సమ్మేళనం.

మాతృక: గాబ్రేల’ సంస్థ ఆకాంక్షలు ఏమిటి?

జాన్స్: మేము విదేశీ పెత్తనం, జోక్యంలేని సర్వసత్తాక దేశంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. ప్రజల అవసరాలకు అనుగుణంగా మా ఆర్ధిక విధానాలు ఉండాలని కోరుకొంటున్నాము. ఉత్పత్తిలో మహిళలకు సమాన భాగస్వామ్యం ఉండాలని అంటున్నాము. దున్నేవాడికే భూమి ఇవ్వాలనీ, ఆ భూమిలో స్త్రీలకు కూడా హక్కులు ఉండాలని అంటున్నాము. ప్రజల హక్కులు, అందులో మహిళల హక్కులకు గౌరవం యిచ్చే ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కోరుకొంటున్నాము. పురుషాధిక్యత లేనీ, జండర్ అణచివేతా వివక్షా లేని, హింసలేని సామాజిక సాంస్కృతిక వ్యవస్థను కోరుకొంటున్నాము.

మాతృక: దాని కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?

జాన్స్: సెక్స్ ట్రాఫికింగ్ కి వ్యతిరేకంగా ‘ఊదా గులాబీ’ ప్రచారం, మహిళలపై హింసను ఎదిరిస్తూ ఐవో (iVow) ప్రచారం చేసున్నాము. ‘గాబ్రేల మహిళా పార్టీ’గా ఏర్పడి విధివిధానాలలో జోక్యం చేసుకొంటున్నాము. జాతీయ ఎన్నికల్లో ఆ పార్టీ నుండి రెండు సీట్లు గెలుచుకొన్నాము.

మాతృక: అమెరికన్ సామ్రాజ్యవాద ప్రభావం ఫిలిప్పీన్స్ పైనా ఎలా ఉంటుంది?

జాన్స్: మా ఆర్ధిక విధానాలు అన్నీఅమెరికా చెప్పు చేతల్లో ఉంటాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మా ఉత్పత్తిని అమెరికా నియంత్రించాలని అనుకొంటుంది. ఫిలిప్పీన్స్ లో జాతీయ పరిశ్రమలు ఏవీ లేవు. సామ్రాజ్యవాద ప్రత్యక్ష దోపిడీ వలన ఇక్కడి వ్యవస్థ అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థగానే గిడసబారి పోయింది. మా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులకు పనికి రావు. సామ్రాజ్యవాదుల నుండి దిగుమతి చేసుకొన్న ఉత్పత్తులతో మేము బతకాలి.

అమెరికా మిలటరీ బేస్ లో ఉండే సైనికులు మా స్త్రీల మీదా, పిల్లల మీదా నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తారు. ఈ మధ్య కాలంలోనే ఒక స్త్రీని అలా హత్య చేశారు. మా విద్యా విధానం పూర్తిగా వలసవాద అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్త్రీలు బలమైన వ్యక్తిత్వం కలవారు. పోరాటాలలో రాటు తేలినవారు. అయినా అమెరికా అణచివేత వలన మేము అణగారిపోతున్నాము.

మాతృక: ఫిలిపీన్స్ లో ఆదిమ జాతుల పరిస్థితి ఎలా ఉంటుంది?

జాన్స్: ఇక్కడ చాలా ఆదిమ జాతులు ఉన్నాయి. వారి వనరులు కొల్లగొట్టటానికి అమెరికన్ మైనింగ్ కంపెనీలు వారిని హతమారుస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం స్వయంగా మిలటరీని, పారా మిలటరీని ఆ ప్రాంతాలకు పంపుతోంది. దాదాపు 5000 మంది ఇలొకనాలను (ఒక ఆదివాసీ గ్రూపు) వారు నివసించే ప్రాంతం నుండి ఖాళీ చేయించారు.

philippines 3

మాతృక: సాంస్కృతిక సామ్రాజ్యవాదం మీ మీద ఎలా పని చేస్తుంది? మీ ఆహారపు అలవాట్లు, దుస్తుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకొంటున్నాయి?

జాన్స్: ఫిలిప్పీన్స్ కు చాలా గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. అదంతా మేమిప్పుడు కోల్పోయాము. మా ఆహారపు అలవాట్లు చాలా సరి అయినవి. ఇప్పుడు ఆ ఆహారాలు అదృశ్యమై పోతున్నాయి. మా ఆహారాన్ని పండించే రైతులను నిరుత్సాహ పరుస్తున్నారు. సామ్రాజ్యవాదాన్ని నిరసించటానికి ఇక్కడి మహిళా ఉద్యమకారులు కొంత కాలం ఇక్కడి సాంప్రదాయ దుస్తులైన ‘తెర్నో’, ‘పానులో’లను ధరించారు. వారిని ‘పానులో’ యాక్టివిస్టులు అని కూడా అన్నారు. అయితే ఇంకొక సంగతి కూడా ఇక్కడ జరిగింది. ఫిలిపీన్ క్రిస్టియన్ నన్స్ మార్కొస్ పాలనలో దాని మిలటరీ పవర్ ను ఎదిరించటానికి యూనిఫాం ధరించే వాళ్ళు. వారిని ‘మిలటరీ నన్స్’ అని పిలిచేవాళ్లు.

మాతృక: ఫిలిపీన్స్ విప్లవ ఉద్యమంలో ముఖ్య పాత్ర ఎన్ డిఎఫ్ (జాతీయ ప్రజాస్వామ్య సమాఖ్య) వహించిందని చెబుతారు. మీరు ఎన్ డిఎఫ్ లో భాగం కదా. ఆ సమాఖ్య చేసిన కృషి గురించి చెబుతారా?

జాన్స్: ఎన్ డిఎఫ్ కు ఫిలిపీన్స్ కమ్యూనిష్టు పార్టీ మార్గదర్శకత్వం ఉంటుంది. ఈ కమ్యూనిష్టు పార్టీ ఇక్కడ చాలా బలమైనది. మార్కిస్టు, లెనినిస్టు, మావోయిస్టు సిద్దాంత పునాదితో ఈ పార్టీ పని చేస్తుంది. ఈ పార్టీ ఒక్కటే సామ్రాజ్యవాద చొరబాటును వ్యతిరేకిస్తుంది. మిగతా రాజకీయ పార్టీలు అన్నీ వారి సొంత ఆసక్తుల కోసం పని చేస్తున్నాయి. కొన్ని ప్రావినెన్స్ లలో ఈ పార్టీ తన ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. ఈపార్టీకి దేశంలో చాలా గౌరవం ఉంది. ముఖ్యంగా పునాది వర్గాల మహిళల నుండి.

గొప్ప జాతీయ, విప్లవకార ఉద్యమాలను అది ఎన్ డి ఎఫ్ సహాయంతో నిర్మించగలిగింది. ఎన్ డిఎఫ్ వివిధ విప్లవ ప్రజాస్వామిక ప్రజా సంఘాలను నిర్మించటంలో, సంఘటితం చేయటంలో కీలక పాత్ర వహించింది. అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించింది. ఎన్ డి ఎఫ్ లో ‘క్రిస్టియన్స్ ఫర్ నేషనల్ లిబరేషన్’ పాత్ర గొప్పది. విద్యార్ధి, కార్మిక, కర్షక ఉద్యమాలను సమన్వయం చేసింది.

మాతృక: ఫిలిప్పీన్స్ లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి?

జాన్స్: ప్రస్తుతం బెనిగ్నో సైమన్ అక్వినో పరిపాలనలో ఫిలిప్పీన్స్ నడుస్తుంది. ఇతగాడి తండ్రి బెనిగ్నో అక్వినోను మార్కొస్ చంపి వేసినపుడు గొప్ప ప్రజా ఉద్యమాలు నడిచాయి. గాబ్రేల ఆ నేపధ్యంలోనే ఏర్పాటు అయ్యింది. అయితే ఇప్పుడు అదే తండ్రికి కొడుకు అయిన సైమన్ అక్వినో ప్రజా ఉద్యమాల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడు. ఇతని పాలనలో చట్టాతీతమైన హత్యలు, అదృశ్యాలు, మిలటరీకరణ, రాజకీయ ప్రత్యర్ధుల విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ జైళ్ళలో మగ్గుతున్న మానవ, మహిళా హక్కుల కార్యకర్తల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది.

గాబ్రేలకు చెందిన రచయిత, కార్యకర్త ‘శారోన్ కబుసావ్’ అందులో ఒకరు. వారెంట్ లేకుండా ఆమెను అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టారు. ఆమెతో పాటు ఆమె భర్త ‘ఆడెల్ బెర్టో సిల్వా’ ను కూడా అరెస్టు చేశారు. ఆయన ఎన్. డి. ఎఫ్ లో ముఖ్యుడు. శారోన్ ఆరోగ్యం ఇప్పుడు అసలు బాగోలేదు. శారోన్ లాంటి మహిళా హక్కుల కార్యకర్తల ఆలోచనలను జైళ్ళు ఆపలేవు. శారోన్ మీద జరిగిన దాడి మహిళలు అందరి మీద జరిగిన దాడిగా మేము గుర్తిస్తున్నాము. ఆమె విడుదలకు మేము చేస్తున్న పోరాటం మా అందరి విముక్తి పోరాటంగా భావిస్తున్నాము.

(ఈ ఇంటర్వ్యూ జూన్ 2016 మాతృకలో ప్రచురణగా వచ్చింది).