ట్యాగులు

, , , , , , , , , , , , ,

చుండూరు తీర్పు కోసం ఎదురు చూస్తున్న దళిత మహిళలు

చుండూరు తీర్పు కోసం ఎదురు చూస్తున్న దళిత మహిళలు

జులై నెల ప్రవేశం కాగానే తెలియకుండానే రక్తంతో తడిచిన బట్టల వాసన ముక్కు పుటాలను తాకుతుంది. వద్దు వద్దు అనుకొంటున్నా బతికున్న శరీరాలు కాలుతున్న వాసన గాలిలో తేలుతూ వస్తుంది. ఆ శరీరాలు దళితులవి. ఆ వాసనలు భారత సమాజంలో అనాదిగా సాంఘికంగా, సామాజికంగా, ఆర్ధికంగా అణగదొక్కబడుతున్న దేశ మూలవాసులవి. దళితులపై జరిగిన దాడులను గుర్తు చేసుకోవటానికి నెలలను ప్రాతిపాదికగా తీసుకోవటం తప్పు. ఎందుకంటే దళితులపై దాడులు జరగని నెలల పేర్లు మన క్యాలండర్‌లో ఉండవు. అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వున్న కారంచేడు ఘటనను ఈ వరుసక్రమానికి మొదుగా తీసుకోవటం, వాటి గురించి రాయడానికి ఒక సౌలభ్యం కోసమే.

1985, జులై 17 కారంచేడు మారణహోమం జరిగిన రోజు. 1986, జులై 16న నీరుకొండ ఘటన జరిగింది. 1996 జులై 11న బీహార్‌లోని ‘బత్తిన తోల’ గ్రామంలో 21మంది దళితులను చంపారు. అందులో పదకొండు మంది స్త్రీలు, ఆరుగురు పిల్లలు, ముగ్గురు పసికందులు ఉన్నారు. 1997లో ముంబాయిలోని రాంబాయి దళిత కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పడగొట్టినందుకు నిరసనగా జరిగిన ర్యాలీపై జరిపిన పోలీసు కాల్పులలో 11 మంది దళితులు మరణించారు. 1998 జులై 16, కర్నూల్‌ జిల్లా వేంపేటలో మాదిగవాడ మీద దాడి జరిగింది. 1978, జులై 24న తమిళనాడులోని విల్లుపురంలో పన్నెండు మంది దళితులు హత్యకు గురి అయ్యారు. 1999 జులై 23న అదే రాష్ట్రంలోని మంజలాయి టీ తోటల్లో పనిచేసే దళిత కార్మికులు తమ వేతన సమస్య మీద చేస్తున్న ప్రదర్శనపై పోలీసు జరిపిన కాల్పులలో 17 మంది చనిపోయారు. ఇక 1991 ఆగస్టు 6 చుండూరు మారణహోమం ఎవరూ మరవలేరు. ఇవన్నీ వార్తల్లో వచ్చిన ఘటనలు మాత్రమే.

దళితుల కేసులో ఇంతవరకు బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చిన దాఖలా ఒక్కటి కూడా లేదు. పైగా కేసు కొట్టి వేసేటపుడు జడ్జీలు చేస్తున్న వ్యాఖ్యానాలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఆ వ్యాఖ్యానాలకు ఎటువంటి తార్కికత ఉండదు. సొంత ఆలోచన నుండి పుట్టుకొచ్చే అసంబద్ధ వాక్యాలే అవి. కొట్టి వేయటానికి చెబుతున్న సాకులు దళితులను ఎగతాళి చేస్తున్నాయి. బాధితులనే బాధ్యులను చేసే ప్రక్రియ ఇండియన్‌ న్యాయ వ్యవస్థలో ఎప్పటి నుండో ఉన్నా కూడా దళితుల కేసు విషయంలో అది నగ్నంగా బయట పడింది. శిక్షంటే వెరుపు లేకుండా ఘోర ఘాతుకాలకి పాల్పడే ధైర్యాన్ని ఈ తీర్పులు యిస్తున్నాయి. కేసులు నమోదు చేయటంలోనూ, చార్జ్‌ షీట్‌ పెట్టటంలోనూ పోలీసుల వైపు నుండి జరుగుతున్న జాప్యం నిందితులు తప్పించుకొనే అవకాశాలను బంగారుపళ్ళెంలో పెట్టి ఇస్తోంది.

నాలుగు దోసెళ్ళ ధాన్యం కూలి పెంపు కోసం ఆందోళన చేస్తున్న కిల్వన్మణి దళితులలో 44 మందిని సజీవదహనం చేసిన ఘటనలో(1968), పోలీసు చార్జ్ షీట్‌ పెట్టటానికి చాలా కాలం పట్టింది. ఆ కేసును కొట్టి వేయటానికి న్యాయ స్థానానికి పట్టిన కాలం మాత్రం బహు స్వల్పం. (ఒక సంవత్సర కాలం). 1990, 2000ల మధ్య రణవీర్‌ సేన బీహార్‌లో దళితులపై సాగించిన మారణ కాండలోనే దాదాపు 300 మంది హతులయ్యారు. ఒక్కరికీ కూడా శిక్ష పడలేదు. నిందితులకు రాజకీయ పరపతి ఉన్నప్పుడూ, కేసు స్థానికంగా నడుస్తున్నప్పుడూ బల ప్రయోగం కూడా పోలీసులను ప్రభావితం చేయవచ్చు. కానీ నిష్పక్షపాతీ అని ఆశిస్తున్న న్యాయవ్యవస్థను ఏ విషయం ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే ముందు న్యాయ వ్యవస్థ పట్ల భ్రమలను తొలిగించుకోవాలి. కనీసం ఇలాంటి అన్యాయపు తీర్పులు ఇచ్చినప్పుడైనా ప్రశ్నించడం నేర్చుకోవాలి.

కిల్వన్మణి ఘటన కాలం నాటికి ఆ విషయం తెలిసిన వాళ్ళు తక్కువ ఉండి ఉండవచ్చు. కానీ చుండూరు పుండును గుండెలలో మోస్తున్న లక్షలాది దళితవాడలలోని ఆ నాటి యువకులు ఇప్పడు మధ్య వయస్కులై ఉన్నారు. ఆ మారణహోమానికి సాక్షులుగా ఉన్నవాళ్ళు ఆ గ్రామ దళితులే కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న సమస్త ప్రజలు. ఊరి నడిబొడ్డున పాతిపెట్టిన హతుల శవాలు కూడా. ఘటన జరిగిన 23 సంవత్సరాల తరువాత సాక్ష్యం లేదని కేసు కొట్టి వేయటం, నిందితులను వదిలి వేయటం అంటే న్యాయ వ్యవస్థకు దళిత సమూహాల పట్ల చిన్న చూపు మాత్రమే కాదు .. ప్రజల వివేకం పట్ల నిర్లక్ష్యం.. తమ తీర్పుల పట్ల ఎవరికీ జవాబుదారీతనం లేని సౌకర్యం.

ఒక పక్క దళితులపై దాడి చేసిన వాళ్ళను దర్జాగా జడ్జీలు బయటకు పంపించి వేస్తుంటే, ఇంకో పక్క భారతదేశంలోని జైళ్లన్నీ దళితులతో నిండిపోతున్నాయి. జైళ్ళలో శిక్షలు అనుభవిస్తున్న వారిలోనూ, విచారణ పేరుతో జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళలో మెజారిటీగా దళితులు, ఆదివాసులు, ముస్లిమ్స్‌ ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీళ్ళకు తెలియవా నేరాలు చేసి తప్పించుకొనే మార్గాలు? వీళ్ళకు వుండవా శిక్ష రద్దు చేసుకొనే అవకాశాలు? నేరాలు చేసేవారంతా కింద వర్గాల వారేనా? ఈ ప్రశ్న దగ్గరే న్యాయానికీ కులముందని నిర్ధారణ అవుతుంది. డబ్బు, కుల అహంకారంతో బాటు ఆయా కాలాలలోని అధికార పార్టీ కు అండదండలతో (కారంచేడు కమ్మ పాలకులు, కమ్మ హంతకులు … చుండూరు రెడ్ల పాలకులు, రెడ్ల హంతకులు) ఈ మానవ సంహారాలు జరుగుతున్నప్పుడు, వాటికి అన్యాపదేశంగా న్యాయ వ్యవస్థ అంగీకారం యిస్తున్నప్పుడు ఇక దళితులపై దాడులు ఆగే అవకాశాలు ఉండవు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వర్ణ హిందూ భావజాలానికి ఆధిపత్యం పెరిగింది. హిందూమతంలో ఒక ముఖ్య అంశమైన కులానికి గట్టి ఊతం దొరికింది. కుల సంఘాలను ఆర్గనైజ్‌ చేయటం, కులాధిపత్యాన్ని ప్రోత్సహించటం, కుల అణచివేతకు పాల్పడటం, కుల దాడులు చేయటం పరిపాటి అయ్యింది. నిలువెల్లా కుల తత్వాన్ని పులుముకొన్న న్యాయవ్యవస్థ దానికి అతీతం కాదు. ఈ విషయానికి ఇటీవల హర్యానాలో జరిగిన సంఘటన తాజా రుజువు. ఈ రాష్ట్రంలోని సుపెన్ధ్‌ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పసిపిల్లలను రాజపుట్‌ కుటుంబం సజీవ దహనం చేసినపుడు వారికి న్యాయ సహాయం పూర్తిగా నిరాకరించారు. ఫరీదాబాద్‌ కోర్టులోని లాయర్లు ఎవరూ వీరి తరఫున ప్రైవేట్‌ కేసు వేయటానికి అంగీకరించలేదు. ఫరీదాబాద్‌ కోర్టులో ఉన్న లాయర్లలో ఎక్కువ భాగం రాజపుట్స్‌. లాయర్ల అసోసియేషన్‌ను కూడా వాళ్ళే ప్రభావితం చేశారు. బాధిత కుటుంబం న్యాయ సహాయం కోసం కేసును చండీఘర్‌కు మార్పించుకోవాల్సి వచ్చింది.

‘‘నేరానికి నేరస్థుడ్ని బాధ్యుణ్ణి చెయ్యడం, అన్ని వేళలా దళితులదే తప్పనడం, ఏదో కారణం చెప్పి సాక్షులు యిచ్చిన వాంగ్మూలాల్ని నిరాకరించడం, కేసు భవిష్యత్తు గురించి పట్టించుకోకపోవడం, హంతకులను పట్టుకునేందుకు ఏ రకమైనా తొందరా కనపరచకపోవడం, అందరూ సాక్షులు ప్రతికూలంగా మాట్లాడినా పట్టించుకోక పోవడం, సాక్షులకు భద్రత కల్పించడానికి ఏ చర్యలూ చేపట్టకపోవడం, ఈ హత్య వెనుక ఉన్న కుల సమస్యను గుర్తించకపోవడం, వెనుక ఉన్న వేతన వర్గ సమస్యల్నీ గుర్తించక పోవడం, వీటిని దళితుకి కేవం పరిహారం చెల్లించే ప్రక్రియగా దిగజార్చడం, దళితుల జీవితాలని కేవలం వాళ్ళ కూలితో వెలగట్టడం, ఏం జరిగిందో ఊహించటానికి ప్రయత్నం చేయడం, విపరీత వ్యాఖ్యానాలతో, వక్రీకరణలతో ఏది సహజమో నిర్ణయించడం, రాజ్య వ్యవస్థ కొనసాగించే అధర్మానికి బాధితుల్ని బలి పశువును చేయడం ….’’ ఇవన్నీ నేటి న్యాయవ్యవస్థ స్థూల లక్షణాలని మీనా కందస్వామి అంటారు. న్యాయ దేవతను నిష్పక్షపాతంగా కుల మత వర్గాలకు అతీతంగా ఉంటుందని భావించే సామాన్య జనానికి కూడా ఈ విషయాలు అనుభవం అవుతున్నాయి. న్యాయం, చట్టం, పోలీసు తదితర యంత్రాగాన్నింటినీ శ్రామిక ప్రజలే నిర్వహించుకొంటూ … ప్రజాస్వామీకరణ చేసుకొంటూ, కార్మికవర్గ నియంతృత్వం అమలులోనే కులాతీత, మతాతీత, వర్గాతీత న్యాయవ్యవస్థ దర్శనమౌతుంది. కార్మిక మహిళా ఉద్యమాల ప్రయాణం కచ్చితంగా ఆ దిశగానే ఉండాలి.

(ఈ వ్యాసం జులై 2016 మాతృకలో సంపాదకీయంగా వచ్చింది)