ట్యాగులు

, , , ,

ఉమ్మడి పౌర స్మృతి గురించిన చర్చ జండర్ న్యాయానికి సంబంధించినది కాదు. అది అంతా ముస్లిములను క్రమశిక్షణలో పెట్టటానికి హిందూ జాతీయవాదుల అజెండా

Lead_2932326f

ఎనిమిది దశాబ్ధాలుగా యూనిఫార్మ్ సివిల్ కోడ్ అవసరం గురించి, దాని సాధ్యాసాధ్యాల గురించి మహిళా ఉద్యమం చర్చిస్తూ ఉంది. చివరకు వచ్చే ఒకే ప్రశ్న ఉమ్మడితనంకు అసలు ఉన్న విలువ ఏమిటి? కొన్ని న్యాయ ప్రకటనలు సూచిస్తున్నట్లు చట్టాలలో ఉమ్మడితనం దేశ సమగ్రత కోసమా? అదే నిజమయితే దాని వలన లాభపడేదెవరు? భర్తలు భార్యలను యింట్లో నుండి తరిమేస్తున్నప్పుడు, ఆ విషయం తప్ప వారికి మైండ్ లో యింక దేనికీ ప్రాధాన్యత లేని సందర్భంలో ఏ సమూహాలు ఈ ఉమ్మడి స్మృతి వలన ఉపయోగపడతాయి?

ఈ ఉమ్మడి చట్టాలు మహిళలకు వివాహాలలోనూ, వారసత్వ హక్కులలోనూ న్యాయాన్ని గారంటీ చేస్తాయా? అలా చేయగలిగితే ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ జండర్ సమాన ఆచరణ విషయాలలో అన్ని పర్సనల్ చట్టాల కంటే ఎక్కువ మంచిదవుతుంది. కానీ దానికి విరుద్ధంగా అది పని చేస్తుంది. స్త్రీవాద న్యాయ కార్యకర్త ఫ్లావియా అజ్ఞీస్ చెప్పినట్లుగా ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ హిందూ అవిభక్త కుటుంబాన్ని కూలదోయాలని చెప్పాలి. ఎందుకంటే అవిభక్త హిందూ కుటుంబం పేరుతో హిందువులకు మాత్రమే పన్ను రాయితీలు లభిస్తున్నాయి. భారతీయ పౌరులందరినీ జండర్ సమాన భారతీయ వారసత్వ చట్టం, 1925 కింద పరిపాలించాలి. ప్రస్తుతానికి ఈ చట్టం కింద క్రిస్టియన్స్, పార్సీస్ మాత్రమే ఉన్నారు.

మహమ్మదీయులను బాదటానికి ఇది ఒక కర్ర మాత్రమే

ముస్లిం పర్సనల్ లా ఇప్పటికే ఆధునీకరణ చెందింది. హిందూ చట్టం లాగా కాకుండా 1930 నుండే వ్యక్తిగత హక్కులు యిచ్చింది. హిందూ చట్టంలో యింకా కుటుంబ సహజ స్థితిని ఉమ్మడి కుటుంబంగానే తీసుకొంటారు. ముస్లిం చట్టాల గురించి ప్రచారం జరుగుతున్నట్లు కాకుండా హిందూ చట్టాలే వెనుకబడి ఉన్నాయి. వాటినే సంస్కరించి వ్యక్తిగత ఆస్తి హక్కులు అనే అనే ఆధునిక ప్రపంచంలోనికి తీసుకొనిరావాల్సి ఉంటుంది.

హిందూ పెళ్లిలాగా ఒక మర్యాదగా కాకుండా, ముస్లిం పెళ్లి ఒక ఒప్పందం లాగా మహిళలను విడాకులపుడు రక్షిస్తుంది. అందుకే అన్ని పెళ్లిళ్లు పౌర ఒప్పందాలే అయితే బాగుంటుంది. ముస్లిం పర్సనల్ చట్టంలో ఉన్న ‘మెహర్’ ( పెళ్లప్పుడు భర్త కుటుంబం భార్యకు యిచ్చే ఆస్తి) ఆమెకే చెందుతుంది. విడాకులప్పుడు ఆమెకు భద్రత యిస్తుంది. ఆ అవకాశం హిందూ స్త్రీలకు లేదు. అందుకే యూనీఫార్మ్ సివిల్ కోడ్ ‘మెహర్’ను తప్పనిసరి చేసి, కట్నం ఆచారాన్ని నిర్మూలించాలి.

ఈ సూచనలలోని అసంబద్ధత ఆకాశం నుండి ఊడి పడలేదు. అందరూ గుర్తించిన వాస్తవాల ద్వారా తెలిసిందేమిటంటే ఉమ్మడి పౌర స్మృతిలో స్త్రీ పురుష సమానత్వానికి చెందిన అంశాలు ఏమీ లేవు. ఈ కోడ్ కి బీఫ్ బాన్, అయోధ్య లాంటి హిందూ జాతీయవాద అజెండా ఉంది. ముస్లిములను క్రమ శిక్షణలో పెట్టటానికి, వారు రెండో తరగతి పౌరులని బోధించటానికి, వారు హిందువుల దయతో బతుకుతున్నారని చెప్పటానికి ఉద్దేశించింది. ఈ బోధలన్నీ ఎంఎస్ గోవల్కర్ యిదివరకే చేశారు.

జండర్ న్యాయానికి సంబంధించిన నిజమైన అంశం.

సరే. ప్రశ్నను యింకో లాగా వేద్దాము. యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేకపోవటం వలన ఎవరు బాధ పడుతున్నారు? బహుబార్యత్వం, మూడు సార్లు తలాక్ ల వలన బాధితులైన ముస్లిం మహిళలా? కానీ దశాబ్దాలుగా స్త్రీవాద న్యాయ ఆచరణ, గృహహింస చట్టాన్ని (ఇది అన్నిమతాలకు వర్తిస్తుంది), ముస్లిం మహిళా చట్టాన్ని(విడాకుల సమయంలో ముస్లిం మహిళల భద్రత కోసం ఉద్దేశించింది) ఉపయోగించుకొంటోంది. ఈ రెండు చట్టాలు అనేక మంది ముస్లిం మహిళలకు బహుభార్యత్వం, మూడు సార్లు తలాక్, స్త్రీలకు భరణం, పిల్లల రక్షణ బాధ్యత, అత్తవారింట్లో హక్కుల విషయాలు పట్టించుకోవటానికి ఉపయోగపడ్డాయి. ఇదే కాకుండా స్త్రీవాద న్యాయ కార్యకర్తలు ‘మూడు సార్లు తలాక్’ విషయం చెల్లదనే వారి డిమాండ్ ను నెరవేర్చుకోవటానికి షామిమ్ వర్సస్ యూపీ స్టేట్ తీర్పును (2002) వాడుకొన్నారు.

బహుభార్యత్వం ముస్లిం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు. హిందూ పురుషులు కూడా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటారు. అయితే హిందూ చట్టంలో బహుభార్యాత్వం నిషేదించారు కాబట్టి ఇక్కడ మిగతా భార్యలకు చట్టపరమైన హక్కులు ఉండవు. ముస్లిములలో షరియా చట్టం ప్రకారం మిగతా భార్యలకు కూడా హక్కులు ఉంటాయి. ముస్లిం పురుషులకు వారి పట్ల బాధ్యత కూడా ఉంటుంది. జండర్ న్యాయం మనం చేబడుతున్న కార్యక్రమం అయితే ‘ఒక స్త్రీ, ఒక పురుషుడు’ అనే వివాహం గురించి ఆలోచించకుండా మన వ్యవస్థ ఈ పితృస్వామ్య చట్టంలో ‘భార్యలను’ రక్షించుకొనే పని పెట్టుకొన్నది. బహుళ లైంగిక సంబంధాల వివాహ వ్యవస్థకు పుట్టినవారు ఈ ‘భార్యలు’. దీనికి పునాది లైంగిక శ్రమ విభజన. ఈ వ్యవస్థ ఉత్పత్తి, పునరుత్పత్తి చేసే శ్రామిక స్త్రీలతో నడుస్తోంది. ఇక్కడ అందరు స్త్రీలు ‘భార్యలు’ గా బతకడానికి మాత్రమే శిక్షణ పొందుతారు.

కాబట్టి, పెళ్లి అనే తంతు ఈ శ్రమకు ప్రతిఫలంగా భద్రత అనే తన పితృస్వామిక వాగ్ధానం నెరవేర్చలేకపోయినపుడు చాలా మంది మహిళలు నైపుణ్యం లేని శ్రామికులుగానే మిగిలి పోతారు. లేకపోతే పిల్లలతో సహా పెళ్లి అనే ఉచ్చులో బందీలవుతారు. పురుషులు మళ్ళీ చట్టపరంగానో, ఇంకో రకంగానో పెళ్లి చేసుకొంటారు. వాళ్ళ మీదా ఆధారపడిన దోపిడీకి గురి అయ్యే భార్యలను, పిల్లలను ఉత్పత్తి చేస్తుంటారు. వారి పట్ల పురుషులకు ఎలాంటి బాధ్యతా ఉండదు. జండర్ న్యాయమనేది ఈ చట్ట సంస్కరణల ఉద్దేశ్యమయితే ఈ బహుళ లైంగిక సంబంధాల పితృస్వామ్య వివాహాల కోరలు పీకేయాలి. అలా చేసినపుడే అన్ని సమూహాలలో ఎక్కువమంది భార్యలను కలిగి ఉండే వాస్తవాన్ని గుర్తించినవారమౌతాము. అలాంటి సంబంధాలలో ఉన్న స్త్రీల హక్కులను కాపాడగలుగుతాము. అలా చూస్తే ఈ మధ్యకాలంలో హిందూ పెళ్ళిళ్ళ విషయంలో రెండో భార్యలకు హక్కులు యిస్తున్న సుప్రీం కోర్టు తీర్పులు ‘ఏక పత్నీవ్యవస్థ’ అనే యిప్పుడున్న ఆధునిక న్యాయాన్ని నీరు కార్చినట్లే.

భారతీయ ముస్లిం ఆందోళన్ నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో ఉన్న 90శాతానికి పైగా ముస్లిం మహిళలు ముస్లిం చట్టంలో ఉన్న మూడు సార్లు తలాక్ పద్దతినీ, బహుభార్యత్వాన్ని నిషేదించాలని కోరుకొంటున్నారు. ముస్లిం పర్సనల్ లా ను సంస్కరించాలని వారు కోరుకొంటున్నారు కానీ యూనిఫార్మ్ సివిల్ కోడ్ ను వారు కోరుకోవటం లేదు. ఎందుకంటే వారు చెబుతున్న ఆ చట్టంలో స్పష్టత లేదు. అంతే కాకుండా ఆ డిమాండ్స్ స్త్రీల పట్ల, మైనారిటీల పట్ల ఎలాంటి శ్రద్దా లేని హిందుత్వవాద సెక్షన్ల నుండి వస్తున్నాయి.

గోవా అనుభవం నుండి పాఠాలు

ఉమ్మడి పౌర స్మృతికి యిప్పుడున్న ఒకే ఒక ఉదాహరణ గోవాలో ఉన్న పోర్టుగీస్ సివిల్ ప్రొసీజర్ కోడ్. అది ఉమ్మడిగానూ లేదు, జండర్ న్యాయంతోనూ లేదు. వివాహ చట్టాలు కాథలిక్కులకు, యితర నమ్మకాల ప్రజలకు వేరుగా ఉన్నాయి. చర్చిలో పెళ్లి జరిగితే చర్చి చట్టాలు వర్తిస్తాయి. ఈ చట్టాలు ఎవరు వివాహ రద్దు కోరితే వారి వైపు నిలబడతాయి. హిందువులలో తక్కువ బహుభార్యత్వంతో సహా గోవాలో హిందువుల ఆచారాలు, అలవాట్లు మనం గుర్తించవచ్చు.

గోవాలో ఉన్న పౌరస్మృతికి ఉన్న మంచి లక్షణం సమూహ ఆస్తి హక్కు. అది అప్పుడున్న ఆస్తిలో, పెళ్లి సమయంలో వచ్చే ఆస్తిలో యిద్దరికీ చెరి సమానంగా హక్కు యిస్తుంది. అయితే ఇప్పుడు ఈ అవకాశం ఆచరణలో పక్క దారి పట్టింది. పెళ్లిళ్లలో ఆధిపత్య సంబంధాలకు అవకాశం యిచ్చింది. గృహహింస విషయంలో ఈ పౌరస్మృతి ఎలాంటి ప్రభావం చూపించినట్లు ఆధారాలు లేవు. జండర్ న్యాయానికి ప్రాధాన్యత యివ్వక పోతే ఉమ్మడితనం, అది నీరు కారటం .. యివి రెండూ పితృస్వామ్యానికీ, మెజారిటీతత్వానికి బలాన్నియిస్తాయి.

ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఈ మధ్య జరుగుతున్న చర్చల్లో ఎక్కువ నలుగుతున్న పేరు షాయిరా బాను. ఆమెకు తలాక్ (విడాకులు) పోస్ట్ లో వచ్చింది. వాళ్ళ లాయరు పైన చెప్పిన మూడు చట్టాలను వాడకుండా సుప్రీం కోర్టులో ‘మూడు సార్లు తలాక్’ ను సవాలు చేస్తూ ప్రాధమిక హాక్కుల ఉల్లంఘన పేరుతో పబ్లిక్ లిటిగేషన్ వేశాడు. బానో యిప్పుడు ముస్లిం మతంలో ఉన్న పితృస్వామ్యాన్ని విమర్శిస్తూ మీడియా వెలుగులో ఉంది. ఈ మధ్య జాతీయ దినపత్రికల్లో వచ్చిన ఆమె ఇంటర్వ్యూలో చివరి ప్రశ్నగా ఆమెను “భారత్ మాతకీ జై నినాదపు గొడవ విషయమేమిటి?” అని అడిగినపుడు ఆమె ముస్లిములు అందరు భారత్ మాతకీ జై అనాలని అన్నది. ఇది అసందర్భంగా లేదూ? పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్త్రీకి ‘భారత్ మాతకీ జై’ అని ఉచ్చరించాల్సిన అవసరం ఏమిటి?

కానీ ఇది అసందర్భం కాదు. అదే ఈ ఇంటర్వ్యూలో ముఖ్యమైన విషయం. ఈ విషయమే ఉమ్మడి పౌర స్మృతి డిమాండ్ వెనుక ఉన్న కధ గురించి మనల్ని జాగురక పరుస్తుంది.

(నివేదితా మీనన్ ఒక స్త్రీవాద మేధావి. ఆమె జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ డిల్హీలో ప్రొఫెసర్. ఈ వ్యాసం 15-07-2016న ద హిందూ ఆంగ్ల పత్రిక ఎడిటోరియల్ పేజీలో వచ్చింది.)

clip_image001