ట్యాగులు

, , ,

a-propaganda-poster-during-the-cultural-revolution-in-china-g1yy1r

‘చైనా ప్రజలు అజేయులు. ఎన్ని తుఫానులు వచ్చినా మొక్కలు వంగుతాయే తప్ప విరగవు. వాళ్ళూ అంతే’ అన్నారు చైనా సమాజాన్ని అర్ధం చేసుకొన్న పెరల్. ఎస్. బక్. నిజమే. ఆ ప్రజలే ముప్ఫై సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలకోర్చి చైనా విప్లవంలో పాల్గొని విజయం సాధించారు. లాంగ్ మార్చ్ చేసి చైనా ప్రజల అసాధారణ శక్తి సామర్ధ్యాలను, త్యాగాలను ప్రపంచ ప్రజలకు తిరుగు లేకుండా చాటారు. లెక్కలేనన్ని ఆర్ధిక, రాజకీయ, ప్రాకృతిక, మానసిక కష్టాలను ఓర్చి లాంగ్ మార్చ్ లో విశాల చైనా భూభాగాలను విముక్తం చేశారు. 1966 -76 వరకూ జరిగిన సాంస్కృతిక విప్లవంలో ప్రజలంతా కండలు కరిగించి ఉత్పత్తిలో పాల్గొని ‘నవ జన’ చైనాను నిజ అర్ధంతో నిర్మించుకొన్నారు. అలాంటి సాంస్కృతిక విప్లవం మీద పెద్ద పెద్ద బండలు వేసింది సామ్రాజ్యవాద ప్రపంచం. వాళ్ళ ప్రచురణల నిండా ఈ విప్లవం మీద ద్వేషమే. సాంస్కృతిక విప్లవాన్ని ఎగతాళి, హేళన చేస్తూ రాసిన సాహిత్యం ప్రపంచ పశ్చిమ ప్రాంతాల్లో ‘బెస్ట్ సెల్లర్స్’ (అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాలు) అయ్యాయి. అలాంటి సాహిత్యమే భారతదేశంలోకి కూడా దిగుమతి అయ్యింది. అవాస్తవాలను ప్రచారం చేయటంలో పశ్చిమ దేశాల ప్రచార సాధానాలకు అపారమైన ప్రావీణ్యం ఉంది. సాంస్కృతిక విప్లవ కాలంలో వ్యక్తిగత హక్కులు హరించబడ్డాయనీ, విద్యా విధానం బీభత్సానికి గురి అయ్యిందనీ, ఆర్ధిక విపత్తు సంభవించిందనీ దుమ్మెత్తి పోశారు. మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్ జియో పింగ్ లాంటి పెట్టుబడీదారి మార్గీయులు కూడా సాంస్కృతిక విప్లవం గురించి విష ప్రచారం చేశారు.

సాంస్కృతిక విప్లవం అంటే ఏమిటి?

విప్లవకారులు పాత శిధిలాలమీద ‘విప్లవ చైనా’ అనే కొత్త యిల్లును నిర్మించారు కానీ, ఆ యింటిలో వీస్తున్న గాలి పూర్తిగా పాతకాలాల నాటిదే. పాత అలవాట్లు, ఆచారాలు, ఆలోచనలే – ప్రజలలో, పాలకులలో రాజ్యం ఏలుతుండేవి. విప్లవ విజయం సాధించే ముందు ప్రజలు ఎత్తిపట్టుకొన్న నైతికతనూ, సమగ్రతనూ తరువాత కూడా నిలిపి ఉండేటట్లు చేయటమే అసలైన విజయం. ఆ విజయం సాధించటం కోసమే మావో సాంస్కృతిక విప్లవాన్ని నిర్వహించాడు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయ్యింది కానీ యింకా చైనా సమాజంలో వర్గాలు ఉన్నాయి. పితృస్వామ్యం ఉంది. ప్రజల ఆలోచనలలో ఫ్యూడల్, పెట్టుబడిదారీ పోకడలు ఉన్నాయి. వీటిని అన్నింటిని ప్రోత్సహిస్తున్న మితవాదం మెజారిటీగానే నాయకత్వంలో ఉంది.

మూడు వైరుధ్యాలు రూపు మాపాలనేది మావో ఆలోచనా విధానంలో భాగం. పట్టణాలకూ, పల్లెలకు మధ్య అంతరం – రైతులకూ, కార్మికులకు మధ్య అంతరం – శారీరక శ్రమకూ, మానసిక శ్రమకు మధ్య అంతరం. మేధావులు పల్లెలకు తరలకుండా, మంచి బడులకు కేంద్రాలుగా పట్టణాలకు బదులు పల్లెలను తయారు చేయకుండా, శారీరక శ్రమపట్ల గౌరవం పెంచకుండా ఈ అంతరాలను రూపుమాపటం సాధ్యం కాదు. అందుకే పట్టణాలలో ఉండే ‘కీ స్కూల్స్’ (ప్రాముఖ్యత కలిగిన బడులు) ప్రాబల్యాన్ని తగ్గించి పల్లెలలో విద్యను ప్రోత్సహించాడు. ఉత్పత్తిలో ప్రతి పౌరుడికి భాగస్వామ్యం ఉండాలని కోరుకొన్నాడు. విప్లవకాలంలో కమ్యూనిష్టులను వెన్ను కాచి కాపాడింది చైనా గ్రామీణం. చైనా గ్రామీణం లేకుండా కమ్యూనిష్టు పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పల్లెసీమల గురించి మావో ఎక్కువగా ఆలోచించాడు..

కమ్యూనిజం, నైపుణ్యం, రాజకీయాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిస్తే కానీ సమాజ అభివృద్ధి జరగదని మావో అభిప్రాయం. కమ్యూనిష్టు సమాజం రానంత కాలం వైరుధ్యం ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఉంటుందని మావో చెబుతుంటే వెనుకబడిన ఉత్పత్తి శక్తుల వలనే చైనా ముందుకు పోలేక పోతుందని మితవాదులు గొణిగేవాళ్లు. వాళ్ళ ఉద్దేశ్యం పెట్టుబడిదారీ విధానం దేశంలోకి రావాలని. (అభివృద్ధి అంటే పెట్టుబడీదారి పద్ధతులు వాళ్ళ దృష్టిలో) నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయ్యాక తరువాత దశ కమ్యూనిజం వైపు ప్రయాణమే అన్న సంగతిని అంగీకరించకుండా పెట్టుబడీదారి తిరోగమనం వైపు దేశాన్ని తోయటానికి ఈ శక్తులు ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలన్నింటికి చెక్ పెట్టటానికి ప్రజలే సరియైన సమూహాలని ఆయన భావించాడు.

రివిజనిజం

ఈ పదం అతి ప్రమాదకరమైనది. కమ్యూనిస్టు ఆలోచనా విధానాన్ని, ఆచరణను వెనుకపట్టు పట్టిస్తుంది. చాప కింద నీరులాగా ప్రవేశించి విప్లవ చేవను మొద్దుబారుస్తుంది. సామూహిక అభివృద్ధి వైపు కాకుండా వ్యక్తిగత లాభాల బాటలోకి ప్రలోభపరుస్తుంది. దేశభక్తి అంటే జాతీయ విజయాలు అని కాకుండా వ్యక్తుల పేరు ప్రతిష్టలుగా నిర్వచిస్తుంది. సమూల మార్పుకు ప్రేరేపించకుండా అతుకులు వేసుకుంటే సరిపోతుందని చెబుతుంది. అది కమ్యూనిజం ముసుగు వేసుకొని వుంటుంది. 1953, స్టాలిన్ మరణం తరువాత అంతర్జాతీయంగా విప్లవోద్యమాలకూ, కమ్యూనిస్టు ప్రభుత్వాలకు దన్నుగా ఉంటుందని అనుకొన్న రష్యాలో ఇలాంటి రివిజినిష్టులే పీఠం ఎక్కారు. రష్యా నాయకుడు కృశ్చేవ్ మార్గాన చైనాలో మితవాదులు పయనించారు. పెట్టుబడిదారీ విధానానికి దారులు వేసే ప్రక్రియలు చేబట్టారు.

రివిజనిజాన్ని ఎదుర్కోవటానికి ఎన్ని చేయాలో అన్ని పనులు చేశాడు మావో. అంతర్జాతీయంగా ‘గ్రేట్ డిబేట్’ పేరుతో రష్యా రివిజనిజాన్ని తూర్పార పట్టాడు. అయితే చైనా కమ్యూనిష్టు పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా మంది కమ్యూనిష్టులలో అలసత్వం, అధికార లాలస, లంచగొండితనం పెరిగిపోయాయి. విప్లవకారులు పరిపాలకులు అయ్యాక చాలామంది కమ్యూనిష్టులలో మార్పు వచ్చింది. పల్లెప్రాంత ప్రజలు వారికి మొరటుగా, వదిలించుకోవాల్సిన వారుగా కనిపించారు. సీనియర్ నాయకులు కొంతమంది గ్రామీణ ప్రాంతలనుండి వచ్చిన భార్యలను వదిలేసినట్లుగానే పల్లె ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

ప్రజలను మావో ఎంతో ప్రేమిస్తాడు. ఆ ప్రజల మీదే ఆయనకు అపారమైన నమ్మకం. ప్రజలే ఈ స్థితి తిప్పికొట్టాలని ఆయన భావించాడు. రివిజనిజానికి వ్యతిరేకంగా, బూర్జువా ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం, ప్రజా పోరాటం మాత్రమే సరైన మార్గాలని మావో ఆలోచన. ఆ ఆలోచన, ఆనాటి అవసరం చైనా సాంస్కృతిక విప్లవాన్ని నడిపింది. సాంస్కృతిక విప్లవం మావో ఆలోచన విధానంలో భాగం. అది తప్పనిసరిగా జరగవలసిన విప్లవం. అయితే చైనా ప్రజలు అమాయకులు. వారిలో కమ్యూనిస్టు పార్టీ పట్ల కృతజ్ఞతతో కూడిన విధేయత ఎక్కువ. అలాంటి ప్రజలను సాధికారులుగా చేస్తే తప్ప ఈ విపత్తు నుండి బయట పడలేమని మావో భావించాడు. అణిగిమణిగి పడి ఉండే రాజకీయ సంస్కృతి నుండి వారిని బయట పడవేయటానికి అక్షరాస్యతను, రాజకీయ అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని మావో గుర్తించాడు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగి అవినీతిపరులకు, మితవాదులను ఎదుర్కోవటం అప్పటి చారిత్రక కర్తవ్యం. మావో నాయకత్వాన ప్రజలు ఆ పని చేశారు.

సాంస్కృతిక విప్లవానికి భూమిక

సాంస్కృతిక విప్లవానికి భూమిక 1956లోనే ప్రారంభం అయ్యింది. మావో ఒక ఉపన్యాసంలో ‘వందపూలు వికసించనీయండి, వేయి భావాలు సంఘర్షణీయండి’ అనే నినాదం యిచ్చాడు. ఈ నినాదాన్ని మితవాదులు వారికి అనుకూలంగా, మావోకు వ్యతిరేకంగా వాడుకోవాలని ప్రయత్నించారు. అప్పటికి బూర్జువా భూస్వామ్య వర్గాలతో నిండి ఉన్న యూనివర్సిటీ విద్యార్ధులు ‘మంచి ఉద్యోగాలు దొరకటం లేదని’, ‘ఇంకా స్వేచ్ఛ కావాలని’ పోస్టర్లు వేశారు. కార్మికుల, రైతుల పిల్లలు వేసిన పోస్టర్లను చించి వేశారు. ఒక చోట ‘కమ్యూనిష్టులను చంపండి.’ అనే పోస్టర్ కూడా ప్రత్యక్షం అయ్యింది. అయితే ఈ విధానాన్ని ఎంతో కాలం కొనసాగించలేకపోయారు. పారిశ్రామిక రంగంలో మావో ప్రతిపాదించిన ‘కార్మికులకు ఫ్యాక్టరీ అన్ని నిర్ణయాలలోనూ పాత్ర ఉండాలనీ, టెక్నికల్ విభాగం వాళ్ళు కూడా రెండు రోజులు శారీరక శ్రమ చేయాలనీ’ అనే విషయాలు బహుళ ప్రజాదరణ పొందాయి. పార్టీకి ప్రజలకు మధ్య మంచి అవగాహన, సంబంధాలు ఏర్పడ్డాయి. విప్లవకారులు సమాజాన్ని మార్చే ముందు తమను తాము మార్చుకోవాలనే విషయం వెలుగులోకి వచ్చి ప్రచారం అయ్యింది.

1966, మే 16 సర్క్యులర్

1966 మే 16వ తేదీన చైనా కమ్యూనిష్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. సాంస్కృతిక విప్లవం జరపటం కోసం ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ యిచ్చిన రిపోర్ట్ ను తప్పు పడుతూ జారీ అయిన ఈ సర్క్యులర్ సాంస్కృతిక విప్లవం ఆవశ్యకతను ఎత్తి చూపించింది. కార్మికులను, రైతులను, సిపాయిలను సాంస్కృతిక విప్లవం వైపు మళ్లించకుండా ఆ కమిటీ మితవాద ప్రతిపాదనలు చేసిందని పార్టీ ఆరోపించింది. వర్గ పోరాటాలు అన్నీ రాజకీయ పోరాటాలే అని నొక్కి వక్కాణించింది. బూర్జువాలతోనూ, పెటీబూర్జువాలతోనూ ఘర్షణ కొనసాగించాల్సిందేనని ఈ సర్క్యులర్ నిర్ధారించింది. భావ పోరాటాలను నిలిపివేయటం సరికాదని అన్నది. ‘తప్పుడు భావాలను నిరోధించాలి. కలుపు మొక్కలను ఏరి పారెయ్యాలి. దెయ్యాలను, రాక్షసులను విమర్శించాలి. ఎట్టి పరిస్థితిలోను అలాంటి భావాలను పరిశీలించకుండా వ్యాప్తి చెందనీయకూడదు. ప్రజలకు మాట్లాడడానికి, విమర్శించడానికి, చర్చించడానికి పూర్తి అవకాశాలు యివ్వాలి.’ అని ఈ సర్క్యులర్ సారాంశం. కృశ్చెవ్ లాంటి రివిజనిష్టులు మన పక్కనే ఉన్నారని హెచ్చరించింది. ఈ సర్క్యులర్ విడుదలే సాంస్కృతిక విప్లవానికి అధికారిక ప్రారంభంగా భావించవచ్చు.

బొంబార్డ్ ద హెడ్ క్వార్టర్స్  (కేంద్రం పై దాడి చేయండి)

1966, మే 25న పెకింగ్ యూనివర్సిటీ లెక్చెరర్లు వైస్ ఛాన్సలర్ మీద పోస్టర్ వేశారు. మావో ఈ పోస్టరును మొదటి మార్స్కిష్టు, లెనినిస్టు పోస్టరుగా మెచ్చుకొన్నాడు. ఆగస్ట్ 5న మావో స్వయంగా ‘బొంబార్డ్ ద హెడ్ క్వార్టర్స్’ (కేంద్రం పై దాడి చేయండి) అనే పోష్టరు వేశాడు. దాని అర్ధం అధికారంలో ఉన్న మితవాదులను ప్రశ్నించండి అని. తర్వాత కాలంలో దేశమంతా పెద్ద అక్షరాల పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లను ప్రింట్ చేసే ప్రెస్సులు కిటకిటలాడాయి. చేత్తో రాసిన పోష్టర్లు కూడా లక్షల్లో వెలిశాయి. పోస్టర్ రాయడానికి కావాల్సినవి కొద్దిగా ఇంకు, చిన్న పేపర్ ముక్క, ఒక బ్రష్, విమర్శించగలిగి ఉండటం. విద్యార్ధులు, కార్మికులు, పేద రైతులు, సిపాయిలు, మహిళలు – పార్టీకమిటీల మీదా, అధికారుల మీదా, సైన్యం మీదా విమర్శలు గుప్పించారు. జిమో ప్రాంతానికి చెందిన ఒక మహిళకు చదువు రాకపోతే పక్క వారినడిగి పోస్టర్ రాయించుకొన్నది. ఆ పోస్టర్లో ఆమె ఆ గ్రామపెద్ద, క్రితం సంవత్సరం తన దగ్గర తీసుకొన్న డబ్బు ఏమి చేశాడని ప్రశ్నించింది.

మొదట్లో ప్రజలు సాంస్కృతిక విప్లవాన్ని ఇంకో భూ సంస్కరణగా పొరపాటు పడ్డారు. నాలుగు చెడులు – పాత ఆలోచనలు, పాత సంస్కృతి, పాత ఆచారాలు, పాత అలవాట్లు – పోగొట్టుకోవాలనే పిలుపును సరిగా అర్ధం చేసుకోలేక యిళ్లల్లో ఉన్న పాత పుస్తకాల్ని, పెయింటింగులను తగల పెట్టారు. పాత గుడులను ధ్వంసం చేశారు. అదే సంవత్సరం ఆగస్ట్ లో (1966) పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసిన పదహారు మార్గదర్శకాలు సాంస్కృతిక విప్లవం సరిగా నడవటానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడ్డాయి.

పదహారు మార్గదర్శకాలు

విప్లవమార్గం సాఫీగా ఉండదని, సాంస్కృతిక విప్లవం జరిగే క్రమం తలక్రిందులు అయినా, మళ్ళీ మళ్ళీ అవుతున్నా ప్రజలు – ముఖ్యంగా యువత దాన్ని కొనసాగించాలని ఈ మార్గదర్శకాలలో పొందుపరిచారు. ప్రజలు లేచి నిలబడి ప్రశ్నించే ధైర్యాన్ని పార్టీ కమిటీలు యివ్వాలని, తప్పు చేసిన వారిని సరిదిద్దుకొనే అవకాశం యివ్వాలనీ, పెట్టుబడీదారీ మార్గీయులను పార్టీ కమిటీల నుండి వెళ్లగొట్టమని పిలుపు యిచ్చాయి. ప్రశ్నించే క్రమంలో ప్రజలు చైతన్యవంతులు అవుతారనీ, ఆ క్రమంలోనే వారి రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుందనీ, ఈ పోరాటంలోనే వారి నైపుణ్యాలు మెరుగు అయ్యి మంచికీ చెడుకీ మద్య ఒక చక్కటి గీత గీసుకొంటారనీ, మనకీ శత్రువుకీ మధ్య తేడాను గ్రహిస్తారని చెప్పాయి. పార్టీ వ్యతిరేక శక్తులకు, సోషలిస్టు వ్యతిరేక మితవాదులకు, పార్టీని నమ్మికూడా తప్పులు చేస్తున్న వారికీ మధ్య తేడా చూడాలని చెప్పాయి. ప్రజల మధ్య వైరుధ్యాలను సరిగ్గా పరిష్కరించాలనీ, విభిన్న అభిప్రాయాలను గౌరవించాలనీ, మైనారిటీ అభిప్రాయాలను కూడా జాగ్రత్త చేయాలనీ, అవే రేపు సరైనవి కావచ్చుననీ కూడ హెచ్చరించాయి. సాంస్కృతిక విప్లవం నడిపించటానికి సమూహాలను, కమిటీలను, సభలనూ ఏర్పాటు చేయమని పిలుపు యిచ్చాయి. విద్యా సంస్థలకు సంబంధించి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను ప్రతిపాదించాయి ఈ మార్గదర్శకాలు. బూర్జువా మేధావులు కోరుతున్నట్లు కాకుండా విద్య ఉత్పత్తితో ముడిపడి ఉండాలనీ, విద్యా కాలాన్ని తగ్గించి వేయమని, విద్యార్ధులు చదువుతో బాటు వ్యవసాయం, పశుపోషణ, కర్మాగారాల్లో పని నేర్చుకోవాలని పిలుపు యిచ్చాయి. విద్యార్ధులు ముఖ్యంగా సాంస్కృతిక విప్లవంలో చురుకుగా పాల్గొని విమర్శలో పాలు పంచుకోవాలని నొక్కి వక్కాణించాయి. సాంస్కృతిక విప్లవం ముఖ్యోద్దేశం ప్రజల ఆలోచనలను విప్లవీకరించి, దాని వల్ల యింకా వేగంగా, గొప్పగా, మెరుగ్గా అన్ని రంగాల్లో ఆర్ధిక ఫలితాలను సాధించటమేనని చెప్పాయి. సామాజిక ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేయటానికి మహత్తర కార్మికవర్గ సాంస్కృతిక విప్లవం ఒక గొప్ప శక్తి అని సూచించాయి. సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకొని పోవటానికి మావో ఆలోచనా విధానం మార్గదర్శకంగా ఉండటం అతి ప్రాధాన్యత కలిగిన విషయంగా గుర్తించాలని చివరిగా నొక్కి చెప్పాయి.

ప్రజలు అందుకొన్నారు

పదహారు మార్గదర్శకాలను అందుకొని ప్రజలు సాంస్కృతిక విప్లవమార్గాన్ని పట్టారు. స్థానిక పార్టీ కమిటీలకు అతీతంగా ప్రజలతో సాంస్కృతిక విప్లవాన్ని నడిపించాలనే మావో నిర్ణయానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ నిర్ణయం రాజకీయ వనరుల మీద పార్టీ కమిటీ గట్టి నియంత్రణను ప్రశ్నించే అధికారం యిచ్చింది. విద్యార్ధులు ఫ్యాక్టరీలకు, గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్ళి ప్రశ్నించే వారిని కూడగట్టారు. రైతులు, కార్మికులు పార్టీని తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకొంటున్న స్థానిక నాయకులకు ఎదురు తిరిగారు. దేశమంతా ప్రజా సంఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రజా సంఘాలు గతంలో ఎర్ర సైన్యంతో ఏర్పడ్డ ప్రజాసంస్థలకు భిన్నమైనవి. చైనా రాజ్యాంగం ప్రజా సంఘాలు ఏర్పరుచుకొనే స్వేచ్ఛ ప్రజలకు యిచ్చినప్పటికీ ప్రజలు అప్పటివరకూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. గొప్ప స్వేచ్ఛ, గొప్ప చర్చ, అభిప్రాయాలను బయటకు చెప్పటం, పోస్టర్లు వేయటం – ఈ నాలుగు విషయాలు సాంస్కృతిక విప్లవానికి రాజకీయ పనిముట్లుగా ఉపయోగపడ్డాయి. బహిరంగంగా మాట్లాడగలగటమే సాధికారతను సాధించటంలో మొదటి మెట్టుగా చైనా ప్రజలు భావించారు. మావో సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మావో పుస్తకాలను వెంటబెట్టుకొని వెళ్ళేవారు. ప్రజలు ఏమి చెప్పదలుచుకొన్నారో అదే మావో చెప్పాడు. కాబట్టి మావో రచనలే వారికి ప్రత్యామ్యాయ రాజ్యాంగంగా, రాజకీయ అస్త్రాలుగా ఉపయోగపడ్డాయి. అవి గ్రామ నాయకులను కొలవడానికి కొలబద్దలుగా ఉపయోగపడ్డాయి. అవి ప్రజలకూ, నాయకులకూ మధ్య సమానత్వాన్ని సాధించటానికి ఉపయోగపడ్డాయి.

గ్రామ పెద్దలు, కమ్యూనిష్టు పార్టీ నాయకులు అందరూ సంవత్సరానికి వందా, రెండు వందల రోజులు ప్రజలతో కలిసి పని చేయాల్సిందే. పై స్థాయి నాయకులు కూడా సంచిలో మధ్యాహ్న భోజనాన్ని, మెడకు మంచినీళ్ళ సీసాను వేలాడదీసుకొని వచ్చి ప్రజలతో పని చేసేవారు. నవ చైనాలో ఉత్పత్తి శక్తులకూ, రాజకీయ సంస్కృతికీ ఉన్న వైరుధ్యం తగ్గిపోయింది. కమ్యూనిష్టు వేదికలకు ప్రజల ప్రయోజనాలు తప్ప వేరే ఎజండా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

విద్యా విధానంలో ఆరోగ్యకరమైన వ్యవస్థకు అవసరమైన మార్పులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలే బడులు నిర్మాణం చేసుకొన్నారు. ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలను ప్రజలు శ్రమదానం చేసి నిర్మించుకొన్నారు. బడికి కావాల్సిన రాళ్ళు క్వారీల నుండి ప్రజలే కొట్టి తెచ్చారు. కలపను అడవుల నుండి నరికి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద స్కూళ్ళ నిర్మాణం చేశారు. ఎవరికి బడిలో సీటు ఉండదు అనే అనుమానం ఉండదు. వ్యవసాయిక పనులు ముమ్మరంగా జరిగే సమయంలో పిల్లలు తల్లి దండ్రులకు సహాయం చేయడానికి బడులు మూసి వేసేవారు. బడుల్లో ప్రవేశిక పరీక్షలను రద్దు చేశారు. డిటెన్షన్ విధానం అసలే లేదు. సాంస్కృతిక విప్లవ కాలంలో 95 శాతానికి పైగా విద్యార్ధులు బడులకు వెళ్లారు. పిల్లలు వారానికి కొన్ని గంటలు పొలాల్లో పని చేసే వారు, ఉపాధ్యాయులతో సహా. అలాగే గ్రామస్తులు బడికి వచ్చి పిల్లల ఆహారానికి కావాల్సిన పంటలను స్కూల్లో పండించటానికి సహాయం చేసేవారు. పిల్లలతో బాటు పని చేసేవారు. స్కూళ్ళ నిర్వహణలో తల్లిదండ్రులు పాత్ర ఉండేది. విద్యను, శ్రమోత్పత్తిని మిళితం చేశారు. ప్రజలకు కావాల్సిన వస్తువులను, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లను తయారు చేసే సాంకేతిక విద్యను పిల్లలు అభ్యసించారు. ఈ విధానం చైనా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దీర్ఘకాలంలో చాలా ఉపకరించింది. గ్రామీణ ప్రాంత చారిత్రక అవసరాలను తీర్చింది. శారీరక శ్రమ పట్ల పిల్లల్లో, ఉపాధ్యాయులలో గౌరవాన్ని పెంచింది. చైనా కమ్యూనిష్టు పార్టీ ప్రజలకు వాగ్దానం చేసిన సార్వజనీయమైన విద్యను సాంస్కృతిక విప్లవ కాలంలో ప్రజలకు అందించింది.

‘చరిత్ర గమనంలో సామాన్య ప్రజలే చోదక శక్తులు’ అనే మావో ఆలోచన రుజువు అయిన కాలమది. సమిష్టి క్షేత్రాలలో ప్రజలు కష్టించి పని చేశారు. సమిష్టితత్వంలో ఉన్న మంచి గుణాన్ని వారు స్వయంగా అనుభవించారు. భూమి సారాన్ని పెంచుకొనే విధానాలు, నీటి పారుదల సౌకర్యాలు వాళ్ళే స్వయంగా ఏర్పాటు చేసుకొన్నారు. ఇలా చేయటం వలన వారి దృష్టి కోణం కూడా విశాలమయ్యింది. సామూహిక అవసరాలకు ప్రాధ్యాన్యత పెరిగింది. స్కూలుకి వెళ్ళే పిల్లలు కూడా పొద్దున్నే లేచి ఇంటికి కావాల్సిన నీళ్ళను మోసేవాళ్ళు. విద్యారంగంలో జరిగిన సంస్కరణల కారణంగా యువ రైతులకు ఉత్పత్తి విధానాన్ని ఆధునీకరించటానికి విధానపరమైన ఆలోచనలు ఉండేవి. సాంస్కృతిక విప్లవ కాలంలో వాడిన ట్రాక్టర్ల, నాటు యంత్రాల, మందుకొట్టే యంత్రాల, మిల్లుల తయారీ చైనా రైతాంగ యువకులు తమ గ్రామీణ విద్య నుండి నేర్చుకొన్నవే. చైనాకు సాంకేతిక సహాయం చేస్తానని పంపిన ఇంజనీర్లను వెనక్కు పిలిపించుకొన్నది రష్యా. కానీ సాంస్కృతిక విప్లవ కాలంలో ప్రతిపాదించిన విద్య పల్లెపట్టులను కాపాడింది.

పెరిగిన నీటిపారుదల సౌకర్యాలు, యాంత్రీకరణ, సాంకేతిక ప్రయోగాలు, సేంద్రియ రసాయిన ఎరువుల సరైనా సమ్మేళనం, అన్నిటినీ మించి రైతులు పడ్డ కష్టం… ఇవన్నీ చైనా వ్యవసాయ రాబడిని విపరీతంగా పెంచాయి. గ్రామీణ పరిశ్రమలు, పశు సంరక్షణాలయాలు, చేపల పెంపకం, అడవుల పెంపకం చేపట్టారు గ్రామీణ ప్రజలు. గ్రామీణ ఆదాయం పెరిగింది. ‘ఒట్టి కాళ్ళ వైద్యులు’ (బేర్ ఫూట్ డాక్టర్స్) చైనాలో ఇంటింటికి తిరిగి వైద్యం చేసేవాళ్ళు. ప్రజల జీవిత కాలం పెరిగింది. అన్నింటిని మించి వ్యవసాయ భీమా రక్షణ అమలు అయ్యింది.

సాంస్కృతిక విప్లవ కాలంలో స్త్రీలు

చైనా పాత సమాజం స్త్రీలను అతి క్రూరంగా చూసింది. చైనా విప్లవం మొదలైన నాటికి అర్ధ బానిస విధానం అమలులో ఉండేది. పేదరికంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను అమ్ముకొనే వాళ్ళు. యజమానులు ఆ స్త్రీలను అన్ని పనులకు వాడుకొనే వారు. ఉన్నతవర్గాలకు చెందిన వారు కూడా తమ ఆడపిల్లలను ఉంపుడుగత్తెలుగా పంపేవాళ్లు. ఆడపిల్లల పాదాలు లిల్లీ పూల మాదిరి ఉండాలని గట్టిగా కట్టేసేవాళ్ళు. పాదాలు చిన్నవిగా అయిపోయి నడవలేక పోయేవాళ్లు.

చైనా విప్లవోద్యమంలో స్త్రీలు కమ్యూనిష్టు పార్టీకి పూర్తి అండదండలు యిచ్చారు. స్వయంగా యుద్ధాల్లో పాల్గొన్నారు. మహిళలతో హైనాన్ లో ఒక ప్రత్యేక దళం నడిచింది. జపాన్ సామ్రాజ్యవాదాన్ని ఓడించిన తరువాత 1946 నుండి దేశంలో జరిగిన అంతర్యుద్ధంలో స్థానిక భూస్వాముల చేతుల్లో హతమయ్యిన వాళ్ళలో స్త్రీలు కూడా ఉన్నారు. పద్దెనిమిది ఏండ్ల ‘ఎన్ హువా’ అప్పుడు గ్రామ మహిళా సంస్థకు అధ్యక్షురాలు. ఆమెను తీవ్రమైన హింస పాలు చేసి సజీవ దహనం చేశారు. ఆ సమయంలో గ్రామీణ పెద్దలుగా ఉన్న వారి భార్యలను, కూతుళ్ళను అత్యాచారాలు చేసి చంపేశారు. ఒక్క జిమో ప్రాంతం నుండే గ్రామీణ స్త్రీలు ఎర్ర సైన్యం కోసం 5000 జతల బూట్లు అల్లారు. 6,50,000 జిన్ల ధాన్యాన్ని నూరారు.

కమ్యూనిష్టు పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చాక మహిళల, పిల్లల, వృద్ధుల బాధ్యతను పూర్తిగా తీసుకొన్నది. స్త్రీల సమస్యను సామాజిక సమస్యగా గుర్తించింది. స్త్రీలకు విముక్తి లేకపోతే సామాజికాభివృద్ధి కుంటుపడుతుందని గ్రహించింది. చైనాలో విప్లవ అనంతర కాలంలో కూడా ప్రజల్లో కరుడు కట్టి ఉన్న పితృస్వామ్యం తొలిగిపోలేదు. సాంస్కృతిక విప్లవకాలంలో దాన్ని తొలగించటానికి పార్టీ చాలా కృషి చేసింది. 1950లో ప్రవేశపెట్టిన వివాహ చట్టం ప్రకారం వివాహంలో స్త్రీ పురుషులు యిద్దరికి సమానహక్కులు ఉంటాయి. ఉంపుడుగత్తెలు ఉంచుకోవటం ఈ చట్టం ప్రకారం నేరం. స్త్రీల సమస్యలను పరిష్కరించటానికి లెక్కలేనన్ని మహిళా సమాఖ్యలు పని చేసేవి.

అన్నింటిని మించి స్త్రీలకు ఉత్పత్తిలో సమాన భాగస్వామ్యం యిచ్చింది. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి దగ్గర స్త్రీలకు ప్రత్యక్ష సంబంధం ఉండేది. రుతుక్రమంలో ఉన్న స్త్రీలు పనిని మార్చుకోవచ్చు. ప్రసూతి సెలవలు పెంచింది. సమానపనికి సమాన వేతనాలు దొరికాయి. ఇంటిపని నుండి విముక్తి స్త్రీలకు కలగచేయడం కోసం సామూహిక వంటశాలలు, సామూహిక పిల్లల సంరక్షణాలయాలు వెలిశాయి. పిల్లల, వృద్ధుల పాలన సమాజం బాధ్యత తీసుకొన్నది. సాంస్కృతిక విప్లవ కర్తవ్యాలను పూర్తి చేయటానికి మహిళలు పురుషులతో సమంగా పాటు పడ్డారు.

మావో వదిలి వెళ్ళిన మరో ముఖ్య కర్తవ్యం సాంస్కృతిక విప్లవం

కరిగి పోతున్న కలల జ్ఞాపకాలు

ఎన్నేళ్ళ నుండో ఉన్న బాధా

ముప్ఫై సంవత్సరాలనాటి తోటను గుర్తుకు తెస్తున్నాయి

నియంతల క్రూరమైన కొరడాలకు వ్యతిరేకంగా

ఇక్కడ ఎర్ర తోరణాలు రెపరెపలాడేయి

ఇక్కడే బానిసలు తమ బల్లాలను పదునెక్కించారు

త్యాగం నిర్ణయాలను స్థిరపరచి

సూర్యచంద్రులను కొత్త స్వర్గానికి మరలించింది

ఇప్పుడు భూమిని దున్ని

ధాన్యపు రాశులతో

సంజెకాంతులలో యిళ్ళు చేరుతున్న రైతువీరులను

నేను సంతోషంగా చూస్తున్నాను

మావో 1959లో రాసిన కవిత యిది. మరో పోరాటానికి సిద్ధం అయ్యి మావో గత కాలాన్ని ఒక సారి తలుచుకొన్నాడు. తన దేశాన్నీ, ప్రజలనూ రివిజనిజం నుండి రక్షించుకోవడానికి మావో సాంస్కృతిక విప్లవాన్ని నిర్వహించాడు. అది జరగక పోతే ఇంకో పదేళ్ళ క్రితమే చైనా రివిజనిష్టు దేశంగా మారిపోయేది. సాంస్కృతిక విప్లవంలో అమలు అయినా అనేక ఆర్ధిక, సామాజిక విధానాలను ఒకప్పుడు విమర్శించిన దేశాలే ఇప్పుడు అమలు చేయనవలంబిస్తున్నాయి. కాని వట్టికాలాల్లో పూలు పూయవు. కాయలు కాయవు. సమాజ సమూల మార్పును కోరుకోని ప్రపంచాలలో ఆ మార్పులు సాధ్యం కావు.

మార్కిజం ఆర్ధిక పునాదితో బాటు మనుషుల భావాలనూ, జీవిత విలువలనూ కూడా మార్చాలి. ఆర్ధిక పునాది మారగానే అంతా మారిపోదు. వాటిని మార్చటానికి ఇంకో విప్లవం అవసరం అవుతుంది. మొదటి విప్లవం ఎంత అవసరమో రెండో విప్లవం కూడా అంతే అవసరం. మధ్యయుగపు భావజాలాన్ని పునర్జీవింప పూనుతున్న ప్రస్తుత కాలంలో మహత్తర కార్మికవర్గ సాంస్కృతిక విప్లవంను స్మరించుకోవాలి. చైనాలో ఈ విప్లవ నిర్వహణలో జరిగిన కొన్ని పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని వాటిని మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి. భారతదేశ విప్లవకారులు ఇప్పటి నుండే సాంస్కృతిక విప్లవ ఉద్దేశ్యాలను, ఆ భావాలను ప్రజల్లో ప్రచారం చేయాలి. విప్లవ కార్యాచరణలో భాగంగా ఆ పని జరగాలి. మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావో ఆలోచనా విధానాన్ని వర్ధమాన పరిస్థితులకు అన్వయించి ఆచరించాలి. మహోపాధ్యాయుల తాత్విక ఆలోచన నుండి కమ్యూనిష్టు పార్టీలు నేర్చుకోవాల్సింది అదే.

(ఈ వ్యాసం ఆగస్టు నెల.2016 మాతృకలో వచ్చింది.)