ట్యాగులు

, , , , , , , ,

Mahasweta Devi passes away

Kolkata: File Photo of noted author and social activist Mahasweta Devi who died at a Hospital in Kolkata on Thursday following prolonged illness. PTI Photo(PTI7_28_2016_000234B) *** Local Caption ***

‘చాలా కాలంగా జనజాతుల సమాజం గురించి నాలో రగుల్తున్న వేదనా జ్వాలలు బహుశా నా చితిమంటల్లో శాంతిస్తాయేమో..’ మరణానికి ముందు అన్నారు మహాశ్వేతా దేవి. ఆ జ్వాలలను ఎప్పటికీ ఆరిపోనీయకుండా ఆమె అక్షరాలతో అవిఘాతమైన ఇంధనాన్ని సరఫరా చేసి మరీ మరణించారు ఆమె. మానవ సమాజం అంచులకు నెట్టి వేయబడిన జాతులతో ఆమె యాభై ఏండ్ల సాహచర్యం – ఏ గొప్ప ప్రపంచ సాహిత్యానికి దీటువోని ప్రజా సాహిత్యాన్ని ప్రజలకు అందించింది. ప్రపంచానికి సంజాయిషీ చెప్పుకోనవసరం లేని భారతీయ రచయితల్లో ఆమెను మొదటిది కావచ్చు. పీడిత జనుల పక్కన నిలబడ్డ అంతస్సాక్షి కలిగిన రచయిత్రి ఆమె. డెబ్బై ఏళ్ల వయసు కలిగిన అధికార మార్పిడిలో అణగారిన ప్రజలను విముక్తం చెయ్యని వ్యవస్థ కుట్ర పై ఆమె ఆగ్రహం ఆమె రాసిన సాహిత్యంలోనూ ప్రతిబింబిస్తుంది. బహిష్కృతులు, నిరుపేదల పట్ల సమాజం ప్రదర్శించిన నిరాసక్తత, నిర్దయ మీద ఆమెకు కోపం. మితవాద, వామపక్ష రాజకీయాల దిగజారుడుతనంపై ఆమెకున్న ఏవగింపు ఆమె అనేక రచనలలో కనిపిస్తుంది. భారతదేశంలో సాహిత్యం అందుబాటులో ఉన్న మెజారిటీ పాఠకులకు, రచనల కోసం ఆమె ఎన్నుకొన్న ప్రజా సమూహాల పేర్లు కూడా తెలిసి ఉండవు. బాగ్ దీ, డోమ్, బోయ, ఓరాంవ్, గంజు, అగరియా, దుసాద్, మాల్, సంతాల్ లాంటి అటవిక తెగలు, జన జాతుల గురించి ఆమె రాసారు. బ్రిటిష్ ప్రభుత్వంచేత నేరస్త తెగలుగా అధికారిక ముద్ర వేయించుకొని (నోటిఫై అయ్యి) తర్వాత కాలంలో కూడా అదే బహిష్కారానికి గురవుతున్న వారి గురించి బయట ప్రపంచానికి ఆమె రచనల ద్వారా తెలియచేసారు.

ఇక ఆమె వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసిన ‘ఔట్ సైడర్’ రచయిత్రి అని మాత్రం ఎన్నటికీ అనలేము. గాఢమైన తాత్విక సంబంధాన్ని ఆమె వారితో ఏర్పరచుకొన్నది. వారి ఆలోచన, ఆకలి, వేదన, పోరాటం, తెగింపు, మరణం – వీటిలోని విషాదాన్ని, వీరోచితత్వాన్ని ఆమె స్వయంగా అనుభవించి రాసినట్లుగా తోస్తుంది. వారి జీవన సంఘర్షణలను సాహిత్యంలో దున్నిన హాలికురాలు ఆమె. చాలా మంది రచయితలు ప్రపంచాన్ని వారి స్వప్నాలకనుగుణంగా తమ రచనల ద్వారా మార్చాలనుకొంటారు. కానీ మహాశ్వేతాదేవి వాస్తవాలు పునాదిగా ప్రపంచాన్ని మార్చాలనుకొన్నారు. ఆమెలో దాగి ఉన్న కళాభివేశాన్ని, కాల్పనిక సృజనాత్మకతను అందుకోసం వెచ్చించారు. వాస్తవాధారమైన కాల్పనికతను ఆమె సృష్టించారు. మేధావిగా ఆమె మేధస్సును, పండితురాలిగా ఆమెలో నిబిఢీకృతమైన జ్ఞానాన్ని ఈ వాస్తవికతకు జోడించారు. అక్కడితో ఆగకుండా సాహసోపేతమైన కార్యాచరణలోకి ఆమె వెళ్లారు. ఆ కార్యాచరణ కోసం ఆమె అంతులేని ప్రయాణాలు చేశారు. వర్నలబుల్ సెక్షన్లతో కలిసి ప్రమాదకరమైన జీవితాన్ని జీవించారు. అణగారిన బ్రతుకుల స్పర్శతోనే ఆమె రచనా ప్రావిణ్యాన్ని పదును తేల్చుకొ న్నారు.

ప్రతీకాత్మక వాస్తవికత ఆమె కధనంలో …

ఆమె రచనలలోని పాత్రలు ప్రతీకాత్మక వాస్తవికను సంతరించుకొని ఉంటాయి. ‘బషాయి టుడు’ నవలలో కధా నాయకుడు బషాయి టుడు ఒక మనిషి కాదు, అది ఒక పోరాటమని నవల చివర వరకు చదివితే కానీ అర్ధం కాదు. ఈ కధలో బషాయి టుడు అయిదుసార్లు చనిపోతాడు. అతని ప్రతి మరణంతో ముడివేసి బీహార్, బెంగాల్ సరిహద్దులలోని ఆదివాసీ ప్రాంతంలో జరిగిన వాస్తవ పోరాటాల్ని ఆమె వర్ణించింది. ఒక పోరాటం ముగిసి చనిపోయాడనుకొన్న బషాయి టుడు ఇంకో పోరాటంలో ప్రత్యక్షమవుతాడు. ఆయా పోరాటాల సమాచారాన్ని పాఠకులకు అందించటానికి ఆమె ప్రతిభావంతమైన యిలాంటి కధా సంవిధానాన్ని ఎన్నుకొన్నారు. ‘ఒక వీరుడు మరణిస్తే వేయిమంది వీరులు పుడతారు’ అనే నినాదం, నినాదం స్థాయి నుండి ఎదిగి కథ రూపందాల్చి పాఠకుల ఒప్పుదలతో ముగుస్తుంది. ఈ కధను ఆమె ఒక నిజాయితీపరుడైన సిపియం కార్యకర్త ‘కాళీ సంత్రా’ గొంతుకతో రాశారు. వామపక్ష రాజకీయాల నుండి ఆదివాసీ, దళిత రాజకీయాలు విడిపోవటానికి గల కారణాలను సహేతుకంగా ఈ నవలలో ప్రతిష్టాపించారు.

రూపాయి నుండి రూపాయి పావలా కూలీ పెంపు కోసం అడవుల్లో ఎక్కడో మారుమూల ఆదివాసులు పోరాటాలు చేస్తుంటే, వాళ్ళను అణచటానికి సైన్యం కోట్ల ఖర్చుతో భూస్వాములకండగా తరలి రావటాన్ని కధలో భాగంగా ఆమె అతి సాధారణంగా రాస్తారు. సైన్యం, దాని వెనకాల ఉన్న రాజ్యం, రాజ్యం కొమ్ముకాస్తున్న భూస్వామి – వీరందరి సమస్య పావలా కూలి పెంపు కాదు. వేళ్ళూనికొని ఉన్న వర్గవ్యవస్థను రెండు చేతులతో, వేయి ఆయుధాలతో కాపాడటమే. ఎదురు తిరిగిన బలహీనులను క్రిములను తొలిగించినట్లు తొలిగించటమే ఆ కోట్లాది రూపాయల ఖర్చుకు పరమార్ధం. ఈ సత్యం ‘విత్తనాలు’ కథంతా పరుచుకొని ఆవిష్కారమౌతుంది.

గంజూ కులానికి చెందిన దూలన్ కు సర్వోదయ కార్యకర్తల పుణ్యమాని పంటకు పనికి రాని భూమి కొంత దొరుకుతుంది. ఆ పొలం మీద విత్తనాల కోసం అర్జీ పెట్టుకొని వడ్లు సంపాదించి తెస్తూ ఉంటాడు దూలన్. విత్తనాలను నాటకుండా వండుకు తింటుంటారు ఆ కుటుంబ సభ్యులు. ఆ భూమిని దానం చేసిన భూస్వామి లఛ్ మన్ సింగ్ కి కావాల్సింది కూడా అదే. అతని దృష్టిలో భూమి మీద కడజాతి వారికి హక్కులు నామకే వాస్తే ఉండాలి కానీ వ్యవసాయం చేసేంత ధైర్యం చేయకూడదు. కూలి పెంపు కోసం అడిగిన కూలీలను చంపి దూలన్ పొలంలో ఉన్న ఒక గుంటలో వేసి పూడ్చి, ఆ శవాలకు దూలన్ ను కాపలాగా ఉండమని శాసిస్తాడు. భయంతో అంగీకరిస్తాడు దూలన్. అదృశ్యమై పోతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. కూలీ కోసం పోరాటం ప్రారంభం అయిన ప్రతి సారి గుంటలోని శవాలు సర్దుకొని కొత్తవారికి చోటు ఇస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది దూలన్ కు. చివరకు ఆ శవాల్లో దూలన్ కొడుకు శవం కూడా చేరుతుంది. సొంత కొడుకు శవాన్ని పూడ్చిన దూలన్ ఆ సంవత్సరం తీసుకొచ్చిన విత్తనాలు వండుకోకుండా నాటుతాడు. రేయింబవళ్ళు కష్టపడి వరి పంటను పండిస్తాడు. పంట పక్వానికి వచ్చిన తరువాత తనను ప్రశ్నించటానికి వచ్చిన లఛ్ మన్ సింగ్ ను ఆ పొలంలోనే చంపేస్తాడు. పండిన వడ్లను తన తోటి ఆదివాసులకు విత్తనాలుగా పంచి నాటమని చెబుతాడు. దూలన్ భయంతో ఉన్నంత కాలం ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు మొలిసిన ఆ నేల ఆయనలోని తెగింపుతో మంచి వరి పంటను యిస్తుంది. గొప్ప పోరాట తాత్వికత గలిగిన కధ ఇది. ఆదివాసుల అణచివేతను ఒక పక్క కరుణాత్మకంగా వర్ణించటమే కాకుండా పోరాట స్ఫూర్తిని రగిలించే విధంగా మహత్తర ముగింపును ఈ కధకు యిచ్చారు మహాశ్వేతాదేవి.

రుడాలి వృత్తి రాజకీయీకరణ

కిరాయికి శవాల దగ్గర ఏడ్చే వృతికి ఉదరపోషణార్ధం వెళుతుంది శనిచరి ‘రుడాలి’ నవలలో. ఈ కధ ఆధారంగా తీసిన రుడాలి సినిమాలో – శవాల దగ్గర ఏడవటం అనే ఆచారానికి (రుడాలి ఆచారం) దుఃఖాన్ని జోడించి గొప్ప విషాదాత్మక సినిమాగా తీసి బాధను వ్యాపారీకరణ చేశారు. కానీ ఈ నవల రాయటం ద్వారా మహాశ్వేతాదేవికి అసలు ప్రయోజనం వేరే ఉంది. అది సామాజిక చైతన్యాన్ని కలిగించే రాజకీయ ప్రయోజనం. భర్త, కొడుకు చనిపోయినపుడు రుడాలికి ఏడ్చే అవకాశం యివ్వని ఆర్ధిక సామాజిక పరిస్థితులు కంటనీరు కలిగించేవి అయినా ఆ బాధల్లో ఆమె ఎదిగిన పరిణామ క్రమాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అతి దయనీయ పరిస్థితుల్లో జరిగిన కొడుకు మరణాన్ని మరిచిపోవటానికి మనవణ్ణి పెంచుతుంది. వాడూ దూరం అయ్యాక ఆ బాధలోనే ఆమె తన చిన్ననాటి స్నేహితురాలికి ఆశ్రయం యిస్తుంది. ఆకలి తీర్చుకోవటానికి రుడాలి వృత్తికి బదిలీ అవుతుంది. నిలువునా వేళ్ళతో సహా కూలిన చెట్టు నుండి కూడా చిగుళ్ళు మొలకెత్తినట్లు ఆమె తన జీవితాన్ని ఎప్పటికప్పుడు తనకు తానే పునర్నిర్మాణం చేసుకుంటుంది. మహాశ్వేతాదేవి సృష్టించిన ఆశావహ దృక్పధాన్ని రేకెత్తించే కధల్లో ఇది ఒకటి.

శవం దగ్గర అవసరమైన దుఃఖాన్ని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులను మహాశ్వేతాదేవి ఈ నవలలో అత్యద్భుతంగా విశదీకరించారు. భూస్వాముల కుటుంబ సంబంధాలు ఆర్ధిక పునాది మీద ఏర్పడినవి. ఒకళ్ళకు మించి ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకొని, లెక్కలేనంతమంది ఉంపుడుగత్తెలను ఉంచుకొనే పురుషుడి మరణానికి ఏ స్త్రీ దుఃఖిస్తుంది? కాబట్టి ఏడుపును కొనుక్కోవాలి. దానికో వృత్తిని సృష్టించింది భూస్వామిక సమాజం. ఈ వృత్తి కోసం వేశ్యలను సమీకరించటంతో మొదలైన శనిచరి నాయకత్వం, ఆమె స్నేహితురాలు బిఖిని మరణం తరువాత, వారిని సంఘటిత పరచటం వరకు ప్రయాణం చేస్తుంది. ఏ సమాజమైతే రుడాలి వృత్తిని సృష్టించిందో ఆ సమాజం మీద కక్ష తీర్చుకోవటానికి అదే వృత్తిని సాధనంగా వాళ్ళు వాడుకొంటారు. కధ చివర్లో రుడాలి వృత్తి రాజకీయీకరణ చెందుతుంది.

వర్గ దృష్టి – స్త్రీ పక్షపాతం

మహాశ్వేతా దేవి రాసిన అనేక కధల్లో స్త్రీలు ప్రధాన పాత్రలుగా ఉంటారు. ఆదివాసులను పీడించే భూస్వామ్య కుటుంబాలలో స్త్రీల గురించి కూడా ఆమె ఎంతో దయగా రాశారు. స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్ర్యం లేనంత కాలం ఏ వర్గంలో ఉన్నా వారూ పీడితులే అనే నిజాన్ని ఆమె ఎక్కడికక్కడ సకారణంతో రుజువు చేస్తూ ఉంటారు. ఆమె ప్రజా ఉద్యమ కధలు రాసినపుడు ఆ ఉద్యమాలలో స్త్రీలు ఉంటారు. రాకాసి కోర, ద్రౌపతి కధల్లో స్త్రీలే ఉద్యమ సారధులు. స్త్రీలు దోపిడీకి గురి అవుతున్న పరిస్థితులను ఆమె ప్రతి కధలో స్పర్శిస్తారు. అయితే ఆమె తాను స్త్రీవాద దృష్టితో ఆ కధలు రాయలేదని అంటారు. వర్గదృష్టి కోణం వలన స్త్రీల సమస్యలు మరుగున పడతాయని అనడాన్ని మహాశ్వేతాదేవి అంగీకరించరు. రెండు ప్రజాస్వామిక ఆకాంక్షలు సంఘర్షించుకోనవసరం లేదని ఆమె అభిప్రాయం. వర్గ దృష్టితో రాసినా స్త్రీ పక్షపాతంతో రాయవచ్చునని ఆమె తన కధల ద్వారా నిరూపించారు.

మహాశ్వేతాదేవి అన్ని కధల లాగానే ద్రౌపతీ కధకూ ఎంతో సమకాలీనత ఉంది. ద్రౌపతి ఒక ఆదివాసీ యువతి. పోరాట నాయకురాలిగా అరెస్టు అవుతుంది. అలా అరెస్టు అయిన వాళ్ళు స్రీలు ఐనపుడు వారిపై ప్రయోగించే హింస రూపం అత్యాచారం అవుతుంది. ‘చెయ్యాల్సిందేదో చెయ్యండి’ అని చెప్పి వెళతాడు పోలీస్ ఆఫీసర్ సేనానాయక్. ‘బలవంతంగా వెల్లకిలా పండబెట్టిన స్తబ్ధ శరీరం. మాంసపు ముసలకాలు (పిస్టన్లు) చురుగ్గా కదుల్తూ దాని మీద లేస్తూ పడుతున్నాయి.’ సామూహిక అత్యాచారం ఎంత హింసాకరమో పాఠకులకు అనుభూతమౌతుంది. లేచి నిలబడిన ద్రౌపతి బట్టలు వేసుకోవటానికి నిరాకరించి నగ్నంగా ఆఫీసర్ల ముందుకు వస్తుంది. ‘ఇంత కన్నా మీరు నన్ను ఏమి చేయగలరు?’ అని సవాల్ చేస్తుంది. ఈ కధ రాసిన ఇరవై ఏళ్ల తరువాత జరిగిన మణిపురీ మహిళల నగ్న ప్రదర్శన జ్ఞప్తికి వస్తుంది. సోనీ సోరి పోరాట ధైర్యం గుర్తుకు వస్తుంది.

‘రాకాసి కోర’ కధలో మంగలి కులానికి చెందిని లఛిమా రాజపుత్రుడైన మేదినీ సింగ్ కు ఉంపుడుగత్తెగా వస్తుంది. తల్లి చనిపోయిన అతడి కొడుకును తన సొంత బిడ్డ లాగా జాగ్రత్తగా పెంచుతుంది. మేదినీ సింగ్ తొలి భార్యలకు పుట్టిన ఆడపిల్లలకు, వారిని కన్నతల్లులకు వీసమంత విలువ కూడా ఉండదు ఇంట్లో. ఒక శుభ ముహూర్తాన మేదిని సింగ్ భార్యలనందరిని తన్ని తగలేస్తాడు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేసి చేతులు దులుపుకొంటాడు. కధ చదువుతున్నంత సేపు పితృస్వామ్యపు క్రూరత్వం గుండెలపై ఎగిసెగిసి తంతున్నట్లుగా తోస్తుంది. మేదిని సింగ్ కొడుకు గణేశ్ కు పెళ్లి అయ్యి భార్య కాపురానికి వచ్చేదాకా లఛిమాకు అతని కబంధ హస్తాల నుండి విముక్తి కలగదు. లఛిమా పెంచిన గణేశ్ తండ్రి తరువాత భూస్వామి అయ్యి లఛిమా భర్తను చంపేస్తాడు. చివరకు లఛిమా భూస్వామి మీద తిరుగుబాటు చేసే ప్రజా సమూహంలో కలిసి పోతుంది. భారతీయ సమాజంలో ఉండే కుల -వర్గాలు, వాటి మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు, మిత్ర శత్రు సంబంధాలను ఎలాంటి కష్టం లేకుండా అర్ధం చేయించి, మనసుకు పట్టించే కధ రాకాసి కోర. లఛిమా ఆ సమాజపు వంచితురాలు. అదే సమయంలో ఆమె ఆ సమాజంలోనే మొలిచిన పోరాట రేణువు.

అగారియాలు నేరస్త తెగలుగా ముద్ర వేయించుకొని, ఎక్కడా తిండి దొరకక మరుగుజ్జులుగా మారతారు. ఆహారం దొంగతనం చేస్తూ అడవుల్లో రహస్యంగా జీవిస్తూ ఉంటారు. నాగరీకులు అనుకొంటున్న వారికి వీరి అస్తిత్వం ఒక సవాలుగా మారుతుంది. జీవించటానికి అర్హులు కారని అధికార ముద్ర వేయించుకొన్న ఈ అగారియాల గురించి మహాశ్వేతాదేవి పట్టించుకొన్నారు. మనిషి పుట్టుకతో పొట్టిగానో, పొడవుగానో, లావుగానో, సన్నంగానో ఉండటానికి ఆహారమే కారణమనే మానవ పరిణామ శాస్త్ర సత్యాన్ని ‘చిన్నోళ్ళు’ కధలో ప్రతిభావంతంగా ఆవిష్కరించగలిగారు.

బలహీనుల మీద బలవంతులు కక్ష తీర్చుకోవటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. వెట్టి చాకిరీ రద్దు సాధించుకొన్నందుకు కసిగా ఆసామి ఓరాన్, కోల్ తెగల వారికి ‘ఉప్పు’ అమ్మటం మానేస్తాడు. వాళ్ళు తాగే గంజికి రుచి ఇచ్చేదీ ఉప్పు ఒక్కటే. తక్కువ పిండిపదార్ధాలు తీసుకొనేవారికి ఉప్పు లేకపోతే శ్వాస ఆడదు. విపరీతమైన నిస్సత్తువ ఆవహిస్తుంది. ఉప్పుకోసం అన్వేషణలో వాళ్ళు ఏనుగులకు పెట్టే ఉప్పును అటవీ ప్రాంతాల నుండి తస్కరిస్తుంటారు. ఆ కారణంగా ఏనుగులకు శత్రువులు అయ్యి వాటిచే దాడికి గురి అవుతారు. ఫారెస్టు అధికారులు బయలుదేరి మనుషులను చంపిన ఎతోవా (ఒంటరి ఏనుగు)ను సంహరిస్తారు. ఇంత విధ్వంసానికి కారణం ఏనుగా? ఉప్పా? బలహీనుల మీదా కక్ష సాధించే వ్యవస్థా? అనే ప్రశ్నలను ‘ఉప్పు’ కధ సంధించి వదులుతుంది.

మధ్య తరగతి మిధ్య విలువల పట్ల మహాశ్వేతాదేవికి ఉన్న ఏవగింపు ఆమె సాహిత్యంలో గోచరమౌతుంది. బషాయి టుడు నవలలో కాళీ సంత్రా గురించి చెబుతూ ‘తన లెనిన్ తో పాటు, భార్య పూజించే సాయిబాబా, కొడుకు ఆరాధించే ధర్మేంద్ర, రాజేష్, హేమమాలినీలతో కూడా సర్దుకుపోగల సహజ శక్తి’- అతనికి మధ్యతరగతి నుండే వచ్చిందని అంటారు. ఇక ‘ఒక తల్లి’ నవల ఉన్నత మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఒక అపొలిటికల్ తల్లి కధ అయినా మహాశ్వేతాదేవి ఆత్మ లాగానే ఆ కధ అణగారిన ప్రజల చుట్టూ తిరుగుతుంది. అదే కోవలోకి ‘చోళీ కె పీచే’ కధ కూడా చేరుతుంది.

‘నేను ఎలాంటి రాజకీయశాస్త్రాలు చదవలేదు. నేను నేర్చుకొన్నదంతా ప్రజల దగ్గరే’ అంటారు గొప్ప రాజకీయ సాహిత్యాన్ని సృష్టించిన మహాశ్వేతాదేవి. ఆదివాసీ కలం, ఆదివాసీ ఆత్మ, ఆదివాసీ వ్యక్తీకరణ మహాశ్వేతా దేవి. ఇప్పపూల చెట్టు ఎప్పుడూ బతకటానికి పోరాడుతూ ఉంటుందని, ఆ చెట్టును తన సమాధి మీద నాటమని కోరిన మహాతల్లి మహాశ్వేతాదేవికి యిప్పపూల వందనాలు.