ట్యాగులు

, , ,

veluturu pittalu 4

ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు పుంఖానుపుంఖాలుగా అమ్మ మీద కవులు, రచయితలు రచనలు చేశారు. అమ్మకు మాతృత్వమనే కిరీటాన్ని పెట్టి ఆమెను పొగిడి ఆత్మలేని సాహిత్యాన్ని చాలానే సృష్టించారు. మహాశ్వేతాదేవి రాసిన ‘ఒక తల్లి’ అలాంటి కోవలోకి రాని విభిన్నమైన, వైవిధ్యమైన మాతృత్వానికి సంబంధించిన నవల. యాభై ఏళ్ల క్రితం ఆమె సృష్టించిన ‘సుజాత’ పాత్ర విప్లవ రాజకీయాలను పాఠకులకు సులభంగా అర్ధం చేయించటానికి ఎన్నుకొన్న పనిముట్టు. ఆ రాజకీయాల కోసం చనిపోయిన ఒక కొడుకుకు తల్లి అయినా, అసలు ఎలాంటి రాజకీయాలు తెలియని విద్యాధికురాలైన స్త్రీ దృష్టి కోణం నుండి రాసిన నవల. కొడుకు మరణానికి కారణం తెలుసుకొనే ప్రయత్నంలో సుజాత ఆమెకు ఆమే రాజకీయాలు తెలుసుకొంటుంది. సమాజంలో ఉండే వర్గాలు, వర్గ సంబంధాలు ఎరుక పర్చుకొంటుంది. రాజ్యమూ, దాని క్రూరత్వం గురించి తెలుసుకొని కర్తవ్య బోధ చేసి సహజ మరణం చెందుతుందా పాత్ర.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పిన సంవత్సరానికి మరుసటి సంవత్సరమే వ్రతీ జన్మిస్తాడు. ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో మసలుకొంటున్న నోరులేని తల్లి సుజాతకు ఐదో సంతానంగా అతడు పుడతాడు. 1947 తరువాతి ఇరవై సంవత్సరాలలో కలకత్తాలో హతమై పోయిన వారిలో వ్రతీ వెయ్యీ ఎనభై నాలుగోవాడు. ఈ నవలకు బెంగాలి మూలం ‘హజార్ చౌరాసీ కా మా (వెయ్యీ ఎనభై నాలుగోవాడి అమ్మ).’ పేరులోనే రాజకీయ చరిత్ర ఉన్న నవల యిది. గోవింద్ నిహలానీ దర్శకత్వంలో ఈ నవల సినిమాగా వచ్చి, ముగింపు గొప్ప నిరాశను కలిగించింది.

నక్సల్బరీ మేఘ గర్జనలు అలుముకొని ఉన్న కాలమది. కలకత్తాలోని దివ్యనాధ్ చటర్జీ యింట్లో అశాంతి నెలకొన్నది. కారణం ఈ యింటి చిన్న కొడుకు వ్రతీ ‘దేశభక్తులు’గా చలామణి అవుతున్న వారి చేతిలో హతుడయ్యాడు. వ్రతీ, వ్రతీతో బాటు జరిగిన నలుగురు యువకుల హత్యలకు పోలీసుల మద్దతు ఉంటుంది. సమాజ మార్పు కోసం జరిగే రహస్యోద్యమంలో పని చేసే ఆ బృందం, ఒక ద్రోహి సమాచారంతో ప్రమాదంలో పడుతుంది. వారిలో ఒకడైన సమూ యింటిలో వారు ఉండగా ఆ హత్యలు జరుగుతాయి. వ్రతీ మరణం కలిగించాల్సిన దుఃఖం కంటే అలాంటి చావు కలిగించిన అవమానమే వ్రతీ కుటుంబ సభ్యులను కలవర పెట్టింది. వ్రతీ పేరు దినపత్రికల్లో రాకుండా దివ్యనాధ్, అతని పెద్ద కొడుకు జ్యోతీ ప్రయత్నాలు చేస్తుండగా వ్రతి తల్లి సుజాత కొడుకు శవాన్ని చూడటానికి మార్చూరీకి వెళుతుంది. వ్రతి మరణ కారణం కోసం ఆనాడు ఆమె మొదలు పెట్టిన అన్వేషణ రెండు సంవత్సరాల తరువాత ఆమె మరణంతోనే ముగుస్తుంది.

సుజాత మధ్య తరగతి మిధ్య విలువలకు అతీతమైన ఆలోచనా ధోరణి కలిగిన మహిళ. కొడుకుల మరణం అందరి తల్లులకు కలిగించే మామూలు శోకంతో పాటు ఆమెలో కొన్ని ప్రశ్నలు మొలకెత్తుతాయి. కాలంతో పాటు శోకం కనుమరుగవుతుందని అంటారు. కానీ ఆమె శోకం కాల ప్రవాహం గట్టున విత్తనంగా మొలిచి అంతకంతకు పెద్దదవుతుంది. వ్రతి మరణించిన కారణం ఆమెకు అర్ధం అయ్యే కొద్దీ ఆమె దుఃఖం పెరిగిపోతుంది. ఇక ఆ శోకం ఒక కన్నతల్లి వ్యక్తిగత శోకం స్థాయిని దాటి సామాజిక వ్యధగా పరిణామం చెందుతుంది. వ్రతీ బ్రతికి ఉన్న కాలంలో కొంతకాలమే అతడు తన మీద ఆధారపడ్డ పసిబిడ్డ అనీ, అతడి సామాజిక జీవనం ప్రారంభం అయ్యాక అతడు తనకు అపరిచితుడే అని అర్ధం చేసుకొంటుంది. సామాజిక పీడన రద్దుకోసం పని చేసిన కొడుకు – సమాజంలోనూ, కుటుంబంలోనూ ఎప్పుడూ అణచివేతకు గురి అయ్యే తల్లి .. వీరిద్దరి మధ్య అనుబంధాన్ని ‘న భూతో, న భవిష్యత్’ అన్నట్లు రాశారు మహాశ్వేతాదేవి.

veluturu pittalu 1

వ్రతీతో పాటు మరణించిన ఒక కుర్రాడు సమూ. అతగాడి తల్లి తనకంటే అదృష్టవంతురాలు అనుకొంటుంది సుజాత. ఆమెకు కనీసం తన కొడుకు ఏమి చేస్తున్నాడో తెలుసు. సమూ తండ్రి పేదవాడైనా, యింట్లో ఉన్న పిల్లలని బయటకు పిల్చి కొట్టి చంపుతున్నప్పుడు పోలీసు స్టేషన్ కు పరుగులు పెట్టి పిల్లల్ని రక్షించమని వేడుకొంటాడు. కింద పడి పొగిలి పొగిలి ఏడుస్తాడు. అదే సమయంలో సుజాత భర్తా, వ్రతి తండ్రీ అయిన దివ్యనాధ్ కొడుకు మరణం బయట ప్రపంచానికి తెలియకుండా దాచటానికి పరుగులు పెడతాడు. ఈ తేడా సుజాత మనసుకు అవగతం అవుతుంది. అప్పుడే సుజాత చైతన్యంలో భర్త అస్తిత్వం రద్దు అవుతుంది. తల్లకిందులుగా వేలాడే తమ కుటుంబ విలువలు కొడుకు కోసం తనను మనసారా ఏడవనియ్యవని స్థితిని ఆమె ఎవరికీ చెప్పుకోలేదు. వ్రతీ కోసం ఏడ్చి ఆ దుఃఖాన్ని బయటకు వేసుకోవటం అంటే వ్రతీని మర్చిపోవటమే అనుకొంటుంది.

సుజాత ఆ కుటుంబంలో తెర చాటున ఉన్నా ఆమె కూడా కొన్ని తిరుగుబాట్లు చేస్తుంది. ఆమె చేసిన మొదటి తిరుగుబాటు ఉద్యోగం మానమని భర్త అడిగినపుడు నిరాకరించటం. ఉద్యోగం చేస్తూ ఆమె ఆధునిక స్త్రీలాగా విలాసవంతంగా గడపాలని అనుకోదు. అతి నిరాడంబరమైన వేషధారణ ఆమెది. నగల పట్ల మోజు ఉండదు. ఇవన్నీ లేకుండా, ఆర్ధిక యిబ్బందులు లేని కుటుంబంలో ఉంటూ ఆమె ఎందుకు ఉద్యోగం చేయాలని అనుకొంటుందో ఆమె భర్త దివ్యనాధ్ కు అర్ధం కాని విషయం. ఇంట్లో ఉండే కృత్రిమ వాతావరణం నుండి తప్పించుకోవటానికే ఆమె ఉద్యోగం చేస్తుందన్న సంగతి అర్ధం చేసుకొనే తాహతు దివ్యనాధ్ కు లేదు. వ్రతి పుట్టిన తరువాత భర్తను శారీరకంగా దగ్గరకు రానివ్వక పోవటం ఆమె చేసిన రెండో తిరుగుబాటు. భర్త తిరుగుళ్ళ గురించి ఖచ్చితంగా తెలిసిన తక్షణమే ఆమె ఆ నిర్ణయం తీసుకొంటుంది. దివ్యనాధ్ ఆఫీసులో పని చేసే టైపిస్టుతో భర్తకు ఉన్న సంబంధం, చిన్న కూతురికి తెలిసీ ఆ రహస్యాన్ని కాపాడుతూ తండ్రికి సహకరించటం సుజాతకు తెలియకుండా పోలేదు. అయితే ఆ విషయం వ్రతీకి తెలియకూడదని మాత్రం ఆమె గట్టిగా కోరుకొంటుంది. వ్రతీకి ఆ విషయం తెలుసనీ, ఆ విషయంగా అతడు తండ్రితో గొడవ పడి, ఆ నాటి నుండి తన స్కాలర్షిప్ డబ్బులు ఇంట్లోనే ఇచ్చాడనీ వ్రతీ మరణం తరువాతనే సుజాత తెలుసుకొంటుంది.

veluturu pittalu 3

చిన్నప్పుడు సుజాత చేయి పట్టుకొని మాత్రమే నడవగలిగిన వ్రతి, పెద్దైయ్యాక ఒక తండ్రిలాగా ఆపేక్షగా ఆమెకన్నీ బోధపరచటానికి ప్రయత్నించేవాడు. భోగభాగ్యాల కుటుంబం ఉన్నావ్రతీ అధోహ్ జగతి జీవులతోనే సహవాసం చేసేవాడు. వ్రతీలో వస్తున్న మార్పులు సుజాతకు అర్ధం కాక సతమతమైపోతున్నప్పుడు పని మనిషి హేమ వ్రతీని చక్కగా అర్ధం చేసుకొంటుంది. సుజాత యితర పిల్లలు ఆమెను అర్ధం చేసుకోకపోయినా, వ్రతీ ఒక్కడే ఆమె గురించి పట్టించుకొంటూ ఉన్నా కూడా వ్రతీ అందరిలా లేడే అని ఆమె ఆందోళన పడేది. అతనితో ఎక్కువగా గడపటానికీ, అతడిని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించేది. తన ఉనికికి ప్రయోజనం కేవలం వ్రతీ వలనే ఒనకూడుతుందని భావించేది. ఎందుకంటే వ్రతీ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించటమే కాదు, కుటుంబంలో అణచివేతకు గురి అవుతున్న తల్లి పట్ల కూడా పట్టింపుతో వుండేవాడు. ఎలాంటి అధికారాలు లేకుండా ఒకప్పుడు అత్తగారు, తరువాత పిల్లలు, ఎప్పుడూ భర్త – వీళ్ళకు లోబడి ఒక నీడలా మాత్రమే ఉండే సుజాత పట్ల వ్రతీకి అమితమైన ప్రేమ, అనురాగం. ఒక వయసు వచ్చాక తర్కానికి తప్ప భయానికి లొంగని వ్రతి తరచుగా తల్లిని అడిగే ప్రశ్న ‘ఇతరుల కోసం నీకు యిష్టం లేని పనులు ఎందుకు చేస్తావమ్మ?’

ఇంట్లో క్షమశిక్షణ పేరుతో డైనింగ్ టేబుల్ మీద భోజనం తీసి వేస్తే వంటగదిలో కింద కూర్చొని పని మనిషి హేమ చేత అన్నం పెట్టించుకొని తినేవాడు. హేమకు ఆరోగ్యం బాగా లేక పోతే రిక్షా తీసుకొని వచ్చి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళేవాడు. సుజాత కళ్ల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం గుర్తించి దగ్గర ఉండి చేయిస్తాడు. అదే సమయంలో యింట్లో జరిగే పార్టీలకు దూరంగా ఉండేవాడు. ఆడంబరాలకు, అట్టహాసాలకూ ఆమడ దూరం. సుజాత సహజ మృదు స్వభావానికి ప్రతిబింబం ఆమె కొడుకు వ్రతి. అయితే వ్రతీకి సుజాతలో లేని తిరుగుబాటు గుణం ఉంటుంది. సుజాతకు లేని సామాజిక జీవితం ఉంది. తిరుగుబోతు అయిన తండ్రినీ, దళారీ అయిన అన్ననూ, నింఫో అయిన పెద్ద అక్కనూ, కపట స్వభావి అయిన చిన్నక్కనూ ద్వేషిస్తాడు.

వ్రతీ చనిపోయిన రోజూనే, రెండు సంవత్సరాల తరువాత, చిన్న కూతురు వివాహ నిశ్చితార్ధం చేయాలని నిర్ణయిస్తుంది ఆమె కుటుంబం. ‘ఇనఫ్ ఈజ్ ఇనఫ్’ అంటుంది. మనశ్శాంతి కోసం ఆ రోజు సమూ తల్లిని కలవడానికి వెళుతుంది సుజాత. రెండున్నర సంవత్సరాల పాటు బెంగాల్ ను ఉర్రూతలూగించిన నక్సల్బరీ ఉద్యమం వెనకతట్టు పట్టి, గోడల మీదా నినాదాలు అదృశ్యం అయ్యి, రంగు రంగుల వ్యాపార ప్రకటనలు వాటి స్థానాన్ని ఆక్రమించిన కాలమది. తోటి కామ్రేడ్లను ప్రమాదం నుండి రక్షించటానికి కొడుకు ప్రమాదంలోకి నడిచి వెళ్లాడని సుజాత సమూ తల్లి ద్వారా తెలుసుకొంటుంది. తను ఎంతో యిష్టపడే వ్రతీ నవ్వు సమూ తల్లి గుండెల్లో కూడా నిలిచి వుందని గ్రహిస్తుంది. ఏమి చదువుకోక పోయినా ఆమె ఆలోచనా తీరు తన ఆలోచన తీరు లాగానే వుందని అనుకొంటుంది. నిరుద్యోగం, పేదరికం, పీడన – వ్యవస్థ పట్ల యువతకు నమ్మకం పోవటానికి కారణాలని ఆమెకు అర్ధం అవుతుంది. వ్యవస్థ మీద నమ్మకం పోయిన వాళ్ళను చంపేసినా వారి కుటుంబాలు యింకా మిగిలే ఉన్నాయనీ, వాటి పట్ల ఎవరూ జవాబుదారీతనం వహించటం లేదని తెలుసుకొంటుంది. వ్రతీ బృందాన్ని చంపి వేసినవాళ్లు యింకా బోరలు విరుచుకొని అక్కడక్కడే తిరుగుతున్నారని తెలుసుకొంటుంది. తన కొడుకు దీనుల బాధలను వంటబట్టించుకొని మారిపోయి, భద్ర జీవితాన్ని వదులుకొని వారితో పని చేస్తూ చనిపోయాడని గ్రహిస్తుంది. ఉమ్మడి శోకం వలన తనకూ, సమూ తల్లికీ మధ్య కలిగిన అనుబంధం కాలం గడిచే కొద్దీ మాసి పోయి మునపటి వర్గ అంతరం మళ్ళీ ఏర్పడే అవకాశం వుందని గ్రహిస్తుంది. అది జరగకూడదని గట్టిగా కోరుకొంటుంది.

ఆ రోజు సుజాత కలుసుకొన్న రెండో వ్యక్తి నందిని. వ్రతీ పెళ్లి చేసుకోవాలనుకొన్న అమ్మాయి. వారిద్దరి స్నేహం సుజాతకు తెలుసు. వ్రతీ చనిపోయిన రోజునే ఆమె అరెస్టు అయ్యి ఏకాంత కారాగారాన్ని అనుభవించి పెరోల్ మీద బయటకు వస్తుంది. ‘బిట్రేయల్’ (నమ్మక ద్రోహం) అనే పదాన్ని పదే పదే వాడుతుంది నందిని. ‘గులాబీలు గులాబీ రంగులో లేవు. రక్తంలో ఎర్రని ఎరుపు. దీపాల కాంతిలో మరింత యెర్రగా కాంతులీనుతున్నాయి. విశ్వాసాన్ని వమ్ము చేసి ద్రోహానికి దారి చూపిన యెరుపు – బిట్రేయల్! ఎర్రదనాన్ని నమ్ముకొన్న వాళ్ళను తోసి పుచ్చి, ఎర్రదనంతో కొత్తకాంతులు నింపి సొంతం చేసుకొన్నారు.’ అని రివిజినిస్టుల మీద మహాశ్వేతా దేవి ఈ సందర్భంగా విమర్శ చేశారు. కలకత్తాలో యింకా ఉద్యమాలు నడుస్తున్నాయనీ, అరెస్టులూ హత్యలూ జరుగుతున్నాయనీ నందినీ ద్వారా సుజాత తెలుసుకొంటుంది. వ్రతీ హత్య నందినికి కలిగించిన వ్యక్తిగత దుఃఖం స్థాయిని ఆమె దాటి ఆనాటి ఉద్యమంలో చనిపోయిన వేలాది యువకుల మరణాలకు ప్రతీకారం తీర్చుకొనే దిశగా ఆమె ప్రయాణం కొనసాగబోతుందని గ్రహిస్తుంది. వీధుల్లో వెలుగులు, ఆ వెలుగుల్లో తిరిగే జనం, రేగే దుమ్ము – వీటన్నిటినీ ఆపేక్షించిన నందిని ఇక మామూలు సహజ స్వభావంతో ఎప్పటికీ వాటిని ఆస్వాదించలేదని సుజాతకు అవగతం అవుతుంది.

వ్రతీ మరణం తరువాత సుజాత తాను తెలుసుకొన్న సత్యాలను అసహ్యించుకొంటుంది. జరిగిన మారణహోమం గురించి మాట్లాడకుండా ఏమీ జరగనట్లు కవితలు, కధలు రాస్తున్న రచయితలను అసహ్యించుకొంటుంది. ‘అంతా’ సమసిపోయి అంతటా శాంతిభద్రతలు విలసిల్లుతున్నట్లు నాటకం ఆడుతున్న చుట్టూ సమాజాన్ని అసహ్యించుకొంటుంది. సమాజంలో అక్రమార్జన చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు విచ్చలవిడిగా ప్రవర్తింస్తుంటే – ఆ సమాజం పట్ల విశ్వాసం కోల్పోయిన వాళ్ళను ఎవరైనా చంపి వేయగలిగిన అవకాశాన్ని యిచ్చిన వ్యవస్థను ఆమె అసహ్యించుకొంటుంది. యువతలో రేగే అశాంతినీ, మృత్వువుకు భయపడని ధైర్య సాహసాలనూ నిరసించి చూడ నిరాకరించిన దేశాన్ని అసహ్యించుకొంటుంది. వ్రతి లాంటి యువకుల చావు నిరర్ధకమైన పరిస్థితులను ఆమె అసహ్యించుకొంటుంది.

ఆ సాయంకాలం ఈ యింటి కృత్రిమ వాతావరణంలో, యింటి తల్లిగా, అణువణువు ఎదురు తిరుగుతున్నా సుజాత బలవంతపు కర్తవ్యపు నిర్వహణ చేయాల్సి వస్తుంది. ఆ రోజు జరిగిన పార్టీలో మాతృభక్తి పేరుతో చలామణి అవుతున్న పురుషహంకారాన్నీ, భక్తి పేరుతో పెట్రేగిపోతున్న ఉన్మాదాన్ని చూస్తుంది. వ్రతీ ప్రేమాభిమానాలు పంచాలనుకొన్న ప్రజలు మిగిలే ఉన్నారనీ, ఆ ప్రేమను వారికి పంచి వారి నుండి ప్రేమను పొందాలనుకొంటుంది. అలా అనుకొంటూనే ఆమెను ఎప్పటి నుండో బాధ పెడుతున్న అపెండిసైటీస్ పగిలి ఆమె మరణిస్తుంది.

‘వ్రతీ!’

సుజాత ఆఖరి పిలుపును ఇలా వర్ణిస్తారు మహాశ్వేతాదేవి.

‘సుజాత దీర్ఘ ఆర్తనాదం ఆమె గుండెల్ని చీల్చుకొని వచ్చిన ఆర్తనాదం. విస్ఫోటనం ఫెళ్ళున పగిలినట్లు, వాయువులో ఆకాశంలో లోకాన్ని ప్రశ్నిస్తున్నట్టు కలకత్తాలో వీధివీధినా, ఇంటింటా, హృదయాల్లో ప్రతిధ్వనించిన ఆర్తనాదం. ఆ ఆర్తనాదం మహానగరంలో ఆకాశం కంటా ఉవ్వెత్తున లేచి తరువాత కిందికి దిగి వచ్చి అంతటా వ్యాపించింది. గాలిలో కలిసి రాష్ట్రం అంతటా, రాజ్యం అంతటా వ్యాపించింది. ఇంటింటినీ చుట్టబెట్టి, దేవాలయాలు, గోపురాలు, స్తూపాలు, స్తంబాలు తాకి నలుదిక్కులా వ్యాపించి ఇతిహాసాల పురాణాల వ్యాఖ్యల్లో వాటి పునాదుల్లో కంటా వ్యాపించి కుదిపేసింది. ఆ ఆర్తిలో భూత భవిష్యద్వర్తమానాలు కంపించి పోయాయి. ఆ ఆర్తి సుఖాలనుభవించేవారి సుఖాలలోని అస్తిత్వాన్ని చీల్చి వేసింది. ఆ ఆర్తనాదంలో నెత్తురు వాసన, ప్రశ్న, నిష్టూరం, శోకం.’

ఇలాంటి శోకాలు, ప్రశ్నలు తరువాత కాలంలో ఈ దేశంలో, ఎన్ని లక్షల మంది తల్లులకు అనుభవం అయ్యాయో! ఎంతో మంది ‘ఒక తల్లులు’ ఆదివాసీ గిరిజన గూడేల నుండి, మధ్య తరగతి కుటుంబాల నుండి ఆక్రోశించారో! పదహారు ఏళ్ల బిడ్డను అడవుల్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేసి కర్రకు కట్టి పోలీసు స్టేషన్ కు తీసుకొని పోతున్నప్పడు, కొడుకు శవం కోసం వారిని రహస్యంగా వెంబడించిన ఆదివాసీ తల్లి వారిలో ఒకటి. కూతురు ఎంకౌంటర్ ను ఖండిస్తూ నడివీధిలో రాస్తారోకో చేసిన శృతి తల్లి వారిలో ఒకరు. అమరవీరుల బంధు కమిటీ నాయకురాలిగా తన కూతురు శవాన్నే గుర్తు పట్టాల్సి వచ్చిన శాంతక్క ఆ తల్లులలో ఒకరు. వ్రతీ లాంటి అమరవీరుని తల్లి సుజాతకు యాభై ఏళ్ల క్రితం తన నగలు కొన్ని దాచి మృత వీరుల కుటుంబాలకు సహాయపడాలన్న ఆలోచన బీజ రూపంలోనే ప్రారంభం అవుతుంది. నేటికీ ఆ చావులు 1084 నుండి కొన్ని లక్షల వరకు పెరిగి, చనిపోయిన వారి తల్లులు ఉద్యమిస్తున్నారు. పోరాటాలు లేని ప్రపంచ భాగం సూది మొనంతా కూడా లేదు. రాజ్య హతులు లేని భూమి ఈ భూగోళంలో వెదికినా కనబడదు. నేడు ప్రపంచమంతా అమరవీరుల పోరాట కమిటీలు, భారతదేశం నుండి టర్కీ, మొరాకో వరకూ వర్ధిల్లుతున్నాయి. బిడ్డల పోరాట వారసత్వాన్ని నేడు తల్లులూ, తండ్రులూ మోస్తున్నారు. ‘ఒక తల్లి’ సుజాత మరణానంతరం కూడా వేలాది తల్లుల గుండె జ్వాలలను రగిలిస్తుంది.

(ఈ వ్యాసం సెప్టెంబర్ 2016, మాతృక పత్రికలో వెలుతురు పిట్టలు శీర్షిక కింద ప్రచురితం అయ్యింది)