ట్యాగులు
ఉమ్మడి పౌరస్మృతి సంగతి మళ్ళీ రంగంలోకి వచ్చింది. ఇంతకు ముందు సాధారణ పౌరస్మృతిగా పిలిచిన ఈ రాజ్యాంగ స్మృతికి ‘సాధారణ (Common)’ అనే పదం సరైన అర్ధాన్ని యివ్వటం లేదని ‘ఉమ్మడి (Uniform)’ గా మార్చారు. ‘ఒక దేశం – ఒక చట్టం’ అనే బీజేపీ మొండి నినాదం మళ్ళీ ఈ స్మృతికి అంకురార్పణ చేసింది. కాంగ్రెస్స్ తన హయమంతా ఒక వైపు ముస్లిం ఓట్ల కోసం ఊగిసలాడుతూ, రెండో వైపు తన ఉదారవాద ముఖాన్ని ప్రదర్శించుకోవాలనే తాపత్రయ పడుతూ – కొంత కాలం నాటకాలు ఆడి ఈ విషయాన్ని ముగించింది. ఇప్పుడు బీజేపీ మళ్ళీ ఉమ్మడి పౌర స్మృతి, దాని ఆచరణ సంబందించి పరిశీలించమని లా కమీషన్ కు ఒక ఉత్తరం రాసి ఈ ప్రహసనానికి మళ్ళీ తెర ఎత్తింది.
రాజ్యాంగ రచన జరిగినపుడే అన్ని మతాలకు సంబంధించిన పర్సనల్ చట్టాలలో వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత అనే విషయాల వరకు ఉమ్మడి స్మృతి వుండాలని వాదించిన వాళ్ళు ఉన్నారు. జండా మార్పిడి తరువాత జరిగిన మారణహోమం దాన్ని ఆర్టికల్ 44లో కేవలం ఆదేశిక సూత్రంగానే కూర్చోబెట్టింది. పర్సనల్ చట్టాలలో వివాహ విషయాలు, విడాకుల సంగతులు, ఆస్తి హక్కులు, వారసత్వ వివరాలు పొందుపరిచి ఆయా మతాలలో వేరు వేరుగా ఆచరించాలని చెప్పటంలోనే మహిళలు వీటికి ముడిపడి ఉన్నారు. ఈ పర్సనల్ చట్టాలలోని మత ప్రార్ధనలు జరుపుకోవడం, మతాచారాలను పాటించడం, మత వివాహాలు జరుపుకోవడం లాంటి సంగతులను మినహాయించి మిగతా అన్ని విషయాలను ఉమ్మడి చట్టం కిందకు తీసుకొని రావాలన్నదే ఉమ్మడి పౌర స్మృతి అంతరార్ధం. ఆస్తి హక్కు, పునరుత్పత్తి హక్కు , విడిపోయే హక్కు, కోరిన వాడిని పెళ్లాడే హక్కుల నుండి వెలివేతకు గురి అయిన మహిళల కంటే ఇంక ఎవరికి ఎక్కువ ఈ పౌర స్మృతితో సంబంధం ఉంటుంది?
ఉమ్మడి పౌరస్మృతి ఇప్పుడు దేశం మొత్తం మీద గోవాలోనే అమలు అవుతున్నది. అందులో నేతిబీరకాయలో ఉన్న నెయ్యంత కూడా ఉమ్మడితనం, జండర్ న్యాయం లేవు. ఈ చట్టం ఎవరు విడాకులు కోరితే వారి వైపు నిలబడుతుంది. సహజంగా పురుషులే ఎక్కువగా భార్యను వదిలి వేయగలరు కాబట్టి వారి పక్షానే ఈ చట్టం నిలబడుతుంది. హిందువులలో ఉండే బహుభార్యత్వంతో సహా గోవాలో హిందువుల ఆచారాలు, అలవాట్లు అలాగే ఉంటాయి. గృహహింస విషయంలో ఈ పౌరస్మృతి ఎలాంటి ప్రభావం చూపించినట్లు ఆధారాలు లేవు. జండర్ న్యాయానికి ప్రాధాన్యత యివ్వక పోతే ఉమ్మడితనం, అది నీరు కారటం .. యివి రెండూ పితృస్వామ్యానికీ, మెజారిటీతత్వానికి బలాన్నియిస్తాయి.
ఇప్పుడు ఈ ఉమ్మడి పౌరస్మృతి గురించి బీజేపీ పట్టించుకోవటంలో అనేక సందేహాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములను విలన్లలాగా చిత్రీకరిస్తున్న నేపధ్యం ఉంది. ఇంకో పక్క ముస్లిములను శత్రువులుగా పరిగణించి దేశం నుండి తరిమి వేయాలని బహిరంగ ప్రకటనలు యిస్తున్న సంఘ పరివార్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వం అందరికి సాధారణ చట్టాన్ని ప్రతిపాదిస్తుందా లేక మెజారిటీవాదాన్ని ఈ చట్టంలో ప్రతిపాదిస్తుందా అనే సందేహం వస్తుంది. బీఫ్ బాన్ విషయంలో, స్కూళ్ళనూ కాలేజీలనూ కాషాయీకరణ చేయటంలో, లవ్ జిహాద్ విషయంలో అత్యుత్సాహం చూపించిన ప్రభుత్వం ఈ సాధారణ చట్టం అని మతాలకు న్యాయం చేకూరుస్తుందనే నమ్మకాన్ని యివ్వలేక పోతోంది.
రెండోది ఉమ్మడి పౌర స్మృతి ఆయా మతాలలోని ఏ విషయాలను ఉమ్మడిగా తీసుకొంటుంది అనే విషయం. అన్ని మతాలలో ఉన్న మంచి విషయాలను ఉమ్మడిగా ప్రతిపాదిస్తుందా లేక మెజారిటీ మతమైన హిందూ మతంలోని అభ్యుదయేతర విషయాలను ప్రతిపాదిస్తుందా? హిందూ వివాహ చట్టంలో అనుమతించక పోయినా, హిందూ మతంలో ఆచరణలో ఉన్న బహుభార్యత్వం గురించి ఈ స్మృతి ఏమి చెప్పబోతుంది? హిందూ పర్సనల్ లా ప్రకారం హిందూ అవిభక్త కుటుంబాలలో ఉన్న పన్ను రాయితీల గురించి ఈ చట్టం ఏమి మాట్లాడబోతుంది? ఆ రాయితీలు అన్ని మతాలలో లేవు కాబట్టి తీసివేయబోతుందా? లేక అన్ని మతాలలోని ఉమ్మడి కుటుంబాలకు ఆ రాయితీలను ప్రసాదించబోతుందా? పోనీ ఈ చట్టం చాలా మంది ఆశించినట్లుగా అన్ని మతాలలోని స్త్రీలకు జండర్ న్యాయం చేయబోతుందని అనుకొంటే ఆస్తి మీద సమాన హక్కు స్త్రీ పురుషులకు యివ్వబోతుందా? విడాకుల సమయంలో స్త్రీల ఆస్తిని ఆమెకు అందచేసే సదుపాయం ఉంటుందా? ఇది మైనారిటీ మతాల్లో ఉన్న బహుభార్యత్వం లాంటి అనాగరిక ఆచారాలను పారదోలుతుందని అంటున్నారు. మరి మెజారిటీ మతమైన హిందూ మతంలో చట్టానికి అతీతంగా అమలు అవుతున్న బహుభార్యత్వాన్ని ఏమి చేస్తారు? ఇత్యాది ప్రశ్నలు వస్తున్నాయి.
హిందూ మతంలో రెండో భార్యలు ఉంపుడుగత్తెలుగానే పరిగణించబడతారు కానీ వారికి ఎలాంటి హక్కులు ఉండవు. ముస్లిం మతంలో భర్త వదిలేసిన భార్యలకు ‘మెహర్’ రూపంలో కొంతైనా ముడుతుంది. నిజానికి ముస్లిం పర్సనల్ లా స్వాతంత్య్రానంతర కాలంలో కొంత ఆధునీకరణ చెందింది. ఆ మతంలో వివాహం ఒక కాంట్రాక్టు పద్దతిలో కొనసాగుతుంది. వివాహం రద్దయిన తరువాత స్త్రీలకు కొన్ని హక్కులు ఉంటాయి. అలాగని ముస్లిం స్త్రీలు హిందూ స్త్రీల కంటే మెరుగ్గా ఉన్నారని కాదు. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ముస్లిం మహిళలు కునారిల్లుతుంటారు. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం ఈ మహిళలను కుంగదీస్తున్నాయి. సంచార్ కమిటీ నివేదిక ప్రకారం గత పది సంవత్సరాలలో ముస్లిం మహిళలు మరింత పేదరికంలోకి దిగజారారు.
ఉమ్మడి పౌర స్మృతి దేశ సమగ్రతను పెంచుతుందని మరో వాదన. ఇటీవల వెంకయ్య నాయుడు ఇదే విషయాన్నిఒక ఆంగ్ల పత్రికలోని పెద్ద పేజీ అంతా ప్రవచించాడు. దేశ సమగ్రత అంటే బీజేపీ అభిప్రాయం ఏమిటో సామాన్య పౌరులకు కూడా స్పష్టం అవుతున్నదిప్పుడు. దేశ సమగ్రత అంటే మైనారిటీ మతస్తులు, ముఖ్యంగా ముస్లిములు అణిగిమణిగి పడి ఉండటమే. ముస్లిములను ఉమ్మడి పౌరస్మృతి అనే పనిముట్టుతో బాదదలుచుకొన్నదా అనే సందేహం అతి సహజం. స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన అంశాలు ఏమీ లేకుండా బీఫ్ బాన్ లాగానో, అయోధ్యాలాగానో ఉమ్మడి పౌరస్మృతిని ఒక హిందుత్వ అజండాగా ముందు తీసుకొని వస్తుందన్న విషయం నిర్వివాదం. దేశ సమగ్రత నినాదం కింద ‘హిందూ రాష్ట్ర’ ‘లవ్ జిహాద్’ అమలు చేసే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ముస్లిం అధిక సంతానాన్ని పదే పదే అందుకు కారణం చూపెడుతూనే ఉంది. లవ్ జిహాద్ అమలు చేయాలని పట్టు పడుతున్న సంఘ పరివార్ శక్తుల కింద ఉన్న ప్రభుత్వం, అన్ని మతాలలో ఉన్న అసమానతలను ఉమ్మడి పౌర స్మృతి ద్వారా అయినా ఎలా రద్దు చేస్తుంది అనేది ఇంకో పెద్ద సందేహం. ఉమ్మడి పౌర స్మృతిలో ‘ఏ ముస్లిం కూడా హిందూ స్త్రీని వివాహమాడకూడదూ’ అని ఉండబోతుందా?
అసలు హిందూ సమాజంలో కులం పోకుండా ఉమ్మడి పౌరస్మృతి ఎలా అమలులోకి వస్తుంది అనేది ఒక ప్రశ్న. కులాంతరం చేసుకొంటున్నయువతీ యువకులను పరువు హత్యలు చేస్తున్న తరుణంలో ఈ ప్రశ్నసందర్భోచితమైనది. విలువైనదీ కూడా. ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి రావాలంటే హిందూమతంలో ఉన్న కులంలాంటి అవాంఛనీయ వ్యవస్థలు రద్దు కావాలి. హిందూ సమాజం అనుభవిస్తున్న అవిభక్త కుటుంబ పన్ను రాయితీలను అన్ని మతాలకు వర్తింపచేయాలి. క్రిస్టియన్స్ కూ పార్శీలకూ వారసత్వచట్టం, 1925లో ఉన్న సమానత్వం, జండర్ న్యాయం లాంటి సదుపాయాలు అన్ని మతాలకు వర్తింపచేయాలి. హిందూ వివాహాలలో అమలు అవుతున్న సప్తపది, కన్యాదానం లాంటి పురుషాధిక్య మతక్రతువులను రద్దు చేసి ముస్లిం వివాహ పద్దతుల్లోలాగా స్త్రీలను సురక్షిత స్థితిలో ఉంచే వివాహాలు రావాలి. కట్నం స్థానంలో ‘మెహర్’ రావాలి. ముస్లిం బహుభార్యత్వం లాగా కాకుండా, హిందూ బహుభార్యత్వంలో రెండో భార్యలకు ద్వితీయ స్థాయిని యిచ్చి వారి గౌరవాన్ని దిగజార్చే సాంఘిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. ముస్లిం బహుభార్యత్వం గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్లు ఇటీవల సుప్రీం కోర్టు రెండో భార్యలకు కూడా గృహహింస చట్టం కింద ఉపశమనం యివ్వాలనీ, వారికీ భరణం యివ్వాలనీ యిచ్చిన తీర్పులను మర్చి పోకూడదు. అంటే బహుభార్యత్వం హిందూ పర్సనల్ లా ప్రకారం చట్టవిరుద్దమైనా అది మన ఇక్కడ వేళ్ళూనికొని ఉన్నదని కోర్టులు అంగీకరిస్తున్నట్లే.
ట్రిపుల్ తలాక్ , బహు భార్యత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే ముస్లిం మహిళా సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా వాళ్ళు తమకు ఆర్ధిక, రాజకీయ హక్కులు కావాలని పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలను పట్టించుకొని ముస్లిం పర్సనల్ లా ను ఆధునీకరించాలి. యూనిఫార్మ్ సివిల్ కోడ్ ను ముస్లిమ్ మహిళలు కోరుకోవటం లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రతిపాదనలు ముస్లిములను ద్వేషించే వర్గాల వైపు నుండి వస్తున్నాయి. సమకాలీన భారత పరిస్థితులు వారికి రక్షణనూ భద్రతనూ యివ్వలేక పోతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతికీ, ముస్లిం మహిళల హక్కులకూ ముడి పెట్టి దేశ సమగ్రత పేరుతో తమ లక్ష్యం నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యాన్ని గమనించలేనత అమాయకులు కాదు ముస్లిం మహిళలు.
జండర్ న్యాయమనేది ఈ చట్ట సంస్కరణల ఉద్దేశ్యమయితే ఈ బహుళ లైంగిక సంబంధాల పితృస్వామ్య వివాహాల కోరలు పీకేయాలి. అలా చేసినపుడే అన్ని సమూహాలలోనూ ఎక్కువమంది భార్యలను కలిగి ఉండే వాస్తవాన్ని గుర్తించినవారమౌతాము. అలాంటి సంబంధాలలో ఉన్న స్త్రీల హక్కులను కాపాడగలుగుతాము.
(ఈ వ్యాసం అక్టోబర్,2016 మాతృకలో సంపాదకీయంగా ప్రచురితం అయ్యింది)
“క్రిస్టియన్స్ కూ పార్శీలకూ వారసత్వచట్టం, 1925లో ఉన్న సమానత్వం, జండర్ న్యాయం లాంటి సదుపాయాలు అన్ని మతాలకు వర్తింపచేయాలి” – ‘1925 లో ఉన్న’ అంటే పూర్తిగా అర్ధం కాలేదు, తరువాత ఏమైనా అవాంచనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయా?
“జండర్ న్యాయమనేది ఈ చట్ట సంస్కరణల ఉద్దేశ్యమయితే ఈ బహుళ లైంగిక సంబంధాల పితృస్వామ్య వివాహాల కోరలు పీకేయాలి”- దీని కోసం ఏవైనా ప్రతిపాదనలు చర్చల్లో ఉన్నాయా? ఏవైనా చట్టాలూ, అమెండ్మెంట్ లూ … సూచించారా? .
మెచ్చుకోండిమెచ్చుకోండి
Secularism begins with uniform civil code: Romila Thapar
రోమిల్లా థాపర్ వ్యాఖ్య గురించి మీ అభిప్రాయమేమిటి రమాసుందరి గారూ!
http://www.thehindu.com/news/national/secularism-begins-with-uniform-civil-code-romila-thapar/article7806714.ece
మెచ్చుకోండిమెచ్చుకోండి
చదివాను. ఆమె “And its not just about the Muslim personal law like everybody thinks. I am talking about khap panchayats and all the socio-legal inequalities that every religion carries. Decide what are the kind civil laws you would like to see removed? Sit down with the Khap Panchayats in Haryana and say that your powers are to be cut. Start a discussion there.” ని కూడా అన్నారు. హిందూ మతంలో ఉన్న అవకతవకలు మొదట తొలిగించి జండర్ న్యాయం కలగ చేసే ఉమ్మడి పౌర స్మృతి మాత్రమే లౌకికత కు పర్యాయ పదం అవుతుంది కాని, ఇప్పుడు ఈ మతంలో ఉన్న కులం లాంటి వ్యవస్థలను అలాగే ఉంచి ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడటమే విడ్డూరం.
మెచ్చుకోండిమెచ్చుకోండి
చాలా మంచి వ్యాసం
మెచ్చుకోండిమెచ్చుకోండి
తలాక్ పేరుతో రచ్చ చెయ్యడం వల్ల భాజపాకి రూపాయి లాభం కూడా రాదు. ముస్లిం కుటుంబాలలో స్త్రీకి భర్త చనిపోతే మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. భర్త ఆమెకి తలాక్ ఇచ్చినా కూడా ఆమెకి రెండో పెళ్ళి చేస్తారు. హిందూ కుటుంబాల్లో మాత్రమే స్త్రీకి భర్త చనిపోతే లేదా ఆమె భర్త వదిలేస్తే ఆమె జీవితం నాశనమైపోయిందనుకుని ఆమె రెండో పెళ్ళి చెయ్యకుండా జీవితాంతం ఒంటరిగా ఉంచేస్తారు. ముస్లిం కుటుంబాలలో అలాంటిది ఉండదు కనుకనే తలాక్ పై ముస్లిం మహిళల్లో పెద్ద వ్యతిరేకత లేదు. భాజపా తలాక్ పేరుతో రచ్చ చెయ్యడం వల్ల ముస్లింల మీద పడి ఏడ్చే కొందరు హిందువులు భాజపాకి వోట్లు వేస్తారేమో కానీ ముస్లిం మహిళలు మాత్రం వెయ్యరు.6 November 2016 at 12:01 · Facebook
మెచ్చుకోండిమెచ్చుకోండి