ట్యాగులు

,

pustaka-parichayam

అణచివేతకు గురి అయిన శ్రామిక కులాల స్త్రీలు కలం పట్టి రాయడం మొదలైన యుగంలో జూపాక సుభద్ర కధలు రాయటం మొదట ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పిన ఇరవై సంవత్సరాల తరువాత, కులపరంగా ఆత్యంత వివక్షతకు గురి అయిన మాదిగ కులంలో – అందునా వెనకబడిన ఉత్తర తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో స్త్రీగా పుట్టిన జూపాక సుభద్ర కుల వర్గ ప్రాంత జండర్ పరంగా కిందమెట్టున ఉన్న సామాజిక వర్గీయురాలు. మట్టితో సాన్నిహిత్యం ఉన్న రచయిత్రి, కవయిత్రి. ఈమె రాసిన సాహిత్యానికి ఆ మేరకు అద్భుతమైన వైవిధ్యం ఉంది. తెలుగుభాషలో మహిళా రచయిత్రులు పుంఖానుపుంఖాలుగా సృష్టించిన కథా నవలా సాహిత్యం ‘ ఆరడుగుల ఎత్తు హీరో , పడవలాంటి కారు’ స్థాయిని దాటి మధ్య తరగతి వాస్తవికతలోకి అడుగుపెట్టిన తరువాత జండర్ అసమానత్వాలను ప్రశ్నించటం మొదలై చాలా సంవత్సరాలు గడిచాక ఇప్పుడు ఎవరూ పట్టించుకొని దళిత మహిళలు కధా నాయికలుగా మొలకలు ఎత్తారు. జూపాక సుభద్ర రాసిన అచ్చమైన ఉత్తర తెలంగాణా మాండలికం ఈ కథలకు సహజత్వాన్ని అద్ది, కథాంశాల వాస్తవికతను పాఠకుల దగ్గరకు తీసుకొని వెళుతుంది. తెలంగాణాభాషలోని సామెతలను సందోర్భచితంగా వాడింది ఆమె. మాదిగ కులాలనికి చెందిన డక్కలి రాయక్కను సాహిత్య పేజీల్లో కూర్చోబెట్టిన ఘనత సుభద్రదే. రచయిత్రి ఒక గట్టు మీద నిలబడి లోకానికి తన అస్తిత్వ ప్రకటన చేస్తూనే , ఇంకో వైపు ఆమె కంటే కింద గట్టున ఉన్న మహిళల జీవితాలను ఆవిష్కరించటం ఈ కధలలోని గొప్పతనం. అన్ని కథల్లోనూ ముక్కుపుడకతో మనసారా నవ్వే సుభద్ర అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది.

jupakaజూపాక సుభద్ర రాసిన ‘రాయక్క మాన్యమ్’ కథలను మూడు తరగతులుగా విభజించవచ్చు. మారుమూల పల్లె నుండి వచ్చి దళిత ఉద్యోగస్తురాలిగా ఎదగడంలో పడిన సంఘర్షణ, తగిలిన ఎదురుదెబ్బలను ఆమె స్వానుభవంతో చిత్రీకరించినా కథలు కొన్నైతే, ఆమె పరిచయమైన లోకం నుండి ఎన్నుకొన్న వ్యక్తులను పాత్రలుగా చేసి రాసిన కథలు కొన్ని. ఆ పరిచయ లోకాలనుండి ఆమె విషయ గ్రహింపు పరిధిని పెంచి రాసిన కథలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉన్నాయి. ‘శుద్ధి చెయ్యాలే’ కథలో ఆమె తన స్వానుభవాన్ని సార్వజనీయం చేయటంలో కృతకృత్యురాలు అయ్యింది. పల్లెటూర్లు భాగ్య సీమలనీ, ఆదరణకూ ఆప్యాయతలకూ కొరత ఉండదని వున్న ఉద్యోగాన్ని వదులుకొని జూనియర్ లెక్చెరర్ గా పల్లెటూర్లో పని చేయటానికి సిద్దమైన మన దళిత కధానాయకురాలికి ఇల్లు దొరకని అనుభవం, అవమానం, దుఃఖం ఒంటరివేనా? ఎంతో మంది దళిత ఉద్యోగస్తులకు అవే అనుభవాలు. ‘ఫలానా కులానికే యిల్లు యివ్వబడును’ అనే బోర్డులు నగరాలలో కూడా నిర్భయంగా బహిరంగంగా దర్శనమిస్తున్న కాలంలో యిలాంటి అనుభవాలే పొందిన దళిత అక్క చెల్లెళ్ళు ఎందరో. దళిత పురుషుని స్వరం కంటే ఒంటరి దళిత మహిళ స్వరం ఈ కథలోయింకా పదునుగా పలుకుతుంది.

దళిత బహుజనుల ఐక్యత గురించి ఎన్ని కలలు కంటున్నా కాళ్ళు నిలబడే చోట కత వేరుగానే ఉంటుంది. చిన్ననాటి స్నేహాలు కల్మషమెరుగవని అంటారు. కల్మషం స్నేహాల్లో కాదు, ఆ స్నేహాలు పరిఢవిల్లాల్సిన సమాజంలో ఉంటుంది. అది కుల దురహంకార రూపంతో చిన్నారి మనుసుల్ని ఎలా చిధ్రం చేస్తుందో ‘బల్లేనే దోస్తు వూల్లే కాదు’ కథలో సుభద్ర చాలా బాగా వ్యక్తీకరించింది. శ్రీలత, సువర్ణలను అరమరికలు లేని స్నేహంలో కులం కంచం పొత్తును, మంచం పొత్తును, గుడ్డల పొత్తును కూడా నిషేదించినపుడు ఇక ఆ స్నేహంలో మిగిలేది ఆత్మానుగతమైన అనుబంధం ఒకటే. కథను దళిత బాలిక శ్రీలత నుండి మొదలు పెట్టిన బహుజన కులస్తురాలు సువర్ణ వైపు నుండి ముగించటం కొత్త పద్ధతి.

చదువుకోవటం ఒక అరుదైన అవకాశంగా వచ్చిన యింకో దళిత బాలికకు అరకొర సౌకర్యాలతో ఉండే సంక్షేమ హాస్టలే ఆసరా. తిండి, బట్ట, వసతి సంక్షేమంలా కాకుండా దయాదాక్షిణ్యంగా మారినా ఓర్చుకొని చదువుకొనే బాలికలకు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా అగౌరవపరిచే హక్కును ఆయాచితంగా అందుకొని అవమాన పరిస్తే ఎదురు తిరిగటం తప్ప వేరే మార్గం లేదు. స్నానాల గదిలో రక్తం కనిపించిందని ఆడపిల్లల వర్జీనిటీని దావఖానాలో బహిరంగపరిచే అధికారిని నిలవరించటానికి తిరుగుబాటును మొదటి సారిగా నేర్చుకొంటుంది ఆ పాప. ఆమె చదువుల భవిష్యత్ ను తాకట్టు పెట్టటానికి సిద్ధపడైనా ప్రతిఘటించి తర్వాత పిల్లలకు దారి చూపుతుంది (షెవ్వా – నెత్తురు)

మండల ప్రెసిడెంటుగా ఎన్నికయిన దళిత మహిళ సాంబలక్ష్మికి ప్రమాణ స్వీకారం రోజు ‘గోసెట్టుకొని సీరె కట్టుకోవాలా? సింగులీరా బోసి కట్టుకోవాల్నా’ అనే సందేహం వస్తుంది. (షా నిలబడాలె కథ) ఆ ప్రశ్నతో మొదలయ్యే ‘సదువే రాని’ ఆమె ఆ పనులు చేయగలనా అనే అనుమానం వెన్నాడుతూ భర్తతో ప్రమాణ స్వీకారానికి వెళుతుంది. ‘కాల్లకు సెప్పుల్లేవు, సిగ, గోసీ అబ్బా! గీమె మా ప్రెసిడెంట్’ అని ఆఫీసుల పంచేసే అటెండర్ కాంచి విచిత్రంగా చూస్తే తల గొట్టేసినట్లయి ‘ఎవ్వరు సరిగ్గా కలుపుకుంట లేరంటే, నేను వాల్లండ్ల కలిసి లేను. ఇబ్బిర్కంగున్ననేమో. … బట్టలేనోల్ల రూపు బాంచె రూపు. అన్నం లేనోల్ల రూపు కోతి రూపు’ అనుకొంటూ మనేద పడుతుంది సాంబలక్ష్మి. ‘రానున్న కాలమ్మనదేనే, ఓపిక పట్టే’ అన్న భర్త మాటలతో కథ ముగుస్తుంది. సుభద్ర చెప్పిన దళిత మహిళల సాధికారితకు అడ్డు పడే, అణగతొక్కే సాంఘిక అంతరాలు ఈ పదేళ్ళలో అయినా మారాయా అంటే అనుమానమే.

‘దేవిపోతల కారటి’ ఈ కథా సంపుటిలో ఒక చెప్పుకోదగ్గ కథ. సుభద్ర ‘మతిల’ లో చెప్పిన ‘పాల బుగ్గలప్పుడే పనిమంతులై, బడి సూరంచుగ్గూడా పోకున్నా, అత్తగారిండ్లకు బోయి పసితనాన్నే పాలిచ్చే కూలి తల్లులైన అక్కల’లో ఒకరైన సమ్మక్క దేవిపోతల గ్రామం నుండి రాసిన కారటి (కార్డు) కథ అది. సమ్మక్క గురించి చెబుతూ రచయిత్రి ‘పిండారబోసిన ఎన్నలోలె నవ్వుతది. … గున్నమావిడున్నట్టుంటది. … నాటైనా, కలుపైనా మునుంబడితే అంచిన నడుమెత్తకుంట సాలెల్తది.’ అని రాస్తుంది. ఇలాంటి శ్రమ జీవిత వర్ణన, అదీ అచ్చమైన మాండలికంలో గొప్ప సౌందర్యాత్మకంగా అనిపిస్తుంది. “సమ్మక్క కాన్నుంచి కారటచ్చుడు మాటలు గాదు. వూరావల్నించి వూల్లున్న కోమటింటికి నడిసచ్చి కారటి గొని, యింటి దగ్గర ఎవలన్న సదువుకొన్న పోరాగాండ్లను ‘బాంచెన్ కాల్మొక్త’ అని బతిలాడి, ఆల్ల దగ్గర అదునుకు పెన్ను లేకుంటే దానికోసం దిరిగి తెచ్చిచ్చి, మనసులున్నది పత్తాయించుకొని యాది కొచ్చినయన్ని రాయించి, సూరుల సెక్కిన సంగతులు మల్లా సదివిచ్చుకొని బువ్వమెతుకుతోని కారటి సతుకబెట్టి, మల్ల వూల్లెకు మైలు దూరంబోయి నడూల్లె తలిగిచ్చిన సిన్న పోస్టు దబ్బలేత్తది’ అంటూ సమ్మక్క ఉత్తరానికి పడే కష్టాలను గురించి రాస్తుంది రచయిత్రి. ఇక ఉత్తరంలో సంగతులైతేనా, అవి ప్రపంచమంతా తిరిగి వస్తాయి. పుట్టింట తాగిన గంజి దగ్గర నుండి ‘డొక్కలు దొర్లాడ’ తిన్న గొడ్డు మాంసం వరకు .. గతంలో సెల్కలల్లపండే కంది, పెసరు, బెబ్బర్లు, బుడ్డసెనగ, ఎర్శెనగ, తెల్జొన్నలు, పజ్జొన్నలు, నువ్వులు, మక్కజొన్నల కాడ్నించి ఇప్పుడు యిత్తులు రాని పంట దాకా మాట్లాడతుంది. ‘దేశం దినుసంతా యాడబోయిందో’ అని యాష్టబోతుంది. ‘సెల్లే!’ అంటూ మనసారా పిలుస్తూ ‘గా పొద్దు నువ్వు తల్కాయ మెత్త దీసుకొనేదానికి (కండిషనర్ అని అర్ధం) రాగడి మన్ను పంపుమని మతులావు జేసినావుగాని, మీకు గీ మన్నెందుకు సెల్లె? … ఎద్దడుగు జాగ గూడ మందు దాకని మన్ను లేదాయె. గీ మందుల మన్నుతోని తల్కాయ గడుక్కుంటే తల్కాయుంటదా! అందికే పంపలేదు సెల్లె ..’ అని సుద్దులు చెబుతుంది. ‘కండల్లున్నట్టున్నవ్. పండుగత్తంది. నా కుండల గల్గింది తిందామ్ సెల్లే. మీ కన్నెక్కువా!’ – ఇంతకన్న మనఃపూర్వక ఆహ్వానం ఉంటుందా, వెళ్లకుండా మానయ్యడానికి. సమ్మక్క తనకు తెలిసిన ప్రపంచాన్నే, కాక తెలియని లోకాలను కూడా కాచి వడబోయగల మహిళా ప్రతినిధి. ప్రాకృతిక, సామాజిక , ఆర్ధిక విశ్లేషణ చేయగల మేధావి. మనసున్నదళిత తల్లి.

దళిత జీవితానికి యింకో ప్రతిరూపం ‘మా అయ్య’ కథ. దళితయ్యల కథలు అన్నీ ఒకేలా ఉన్నా వారి జీవిత సారం వడగట్టినట్లు రాసారు సుభద్ర. కారా గారి ‘చావు’ కథ గుర్తుకు వస్తుంది. అక్కడో దళిత తల్లి. ఇక్కడో దళిత తండ్రి. సమాజం పట్టించుకొని భుజాల కెక్కించుకోకపోయినా కనీసం వారి అస్తిత్వాన్ని గుర్తించని స్థితి. సుభద్ర లాంటి రచయిత్రులు వారిని వెలుగులోకి తీసుకొని వస్తున్నారు. ‘గద్దెత్కబోయిన బత్కమ్మ’ యింకో మంచి కథ. ఊరంతా చేసుకొనే బత్కమ్మ పడగలు దళితులకు ఎందుకు లేవు? పండగలను దూరం చేయటం ఒక వివక్ష అయితే అందుకు చెప్పే కారణాలు యింకో వివక్ష. దళితుల ఆహారపు అలవాట్లను గేలి చేస్తూ ‘మీ ఆహారపు అలవాట్లే మీకు బత్కమ్మను దూరం చేశాయి.’ అనటం అంటే వారి వేలుతో వారినే పొడవటం. ప్రధానస్రవంతి సాంస్కృతిక జీవితం నుండి వారిని దూరం పెట్టే ప్రయత్నమే.

పుస్తకం టైటిల్ తీసుకొన్న కధ ‘రాయక్క మాన్యమ్’ చాలా గొప్ప కధ. మాదిగ కులానికి ఉపకులమైన డక్కలి కులంలో మహిళగా పుట్టినా రాయక్క ఆమెకు తండ్రి యిచ్చిన మాన్యమ్ (హక్కుగా తిండి గింజలు యిచ్చే భూమి) మీద అధికారం కోసం నిరంతరం పోరాడుతుంది. మాదిగ కులంలో తగాదాలు తీర్చటానికీ, తీర్పులు చెప్పటానికీ, మాదిగల కుల పురాణమైన జాంబ పురాణాన్ని చెప్పటానికీ డక్కలి వాళ్ళకే హక్కులు ఉంటాయి. ఏ యితర కులాల దగ్గర వీళ్ళు చేయి చాపరు.

జీవమున్న రచయిత్రి సుభద్ర. ఆమె కలం నుండి యింకా ఎందరో చరిత్రకు తెలియని రాయక్కలూ, సమ్మక్కలూ, సాంబలక్ష్ములూ, సంతోషలూ వెలువడతారని ఆశ.