ట్యాగులు

, , , ,

220px-engels_painting2

‘మానవ మైత్రిని గురించిన ప్రాచీన సాహిత్యంలోని అత్యంత ఉద్వేగజనిత గాధలను మించిన స్నేహబంధం గల ఇద్దరు పండితులూ, యోధులూ కలిసి తమ శాస్త్రాన్నీ సృష్టించారని యూరపియన్‌ ‌శ్రామికవర్గం సగర్వంగా చెప్పుకోవచ్చుʹ – లెనిన్

ఆ ఇద్దరు పడితులు ఎవరో కాదు. మార్క్స్, ఎంగెల్స్. మానవ మైత్రికి సంపూర్ణమైన అర్ధాన్ని ప్రపంచానికి బోధించినవాళ్ళు. కమ్యూనిస్టు మూల పురుషుల్లో తొలితరానికి చెందిన వారు. పీడిత ప్రజల విముక్తి కోసం తాత్విక ఆలోచన, సమిష్ఠి కార్యాచరణ చేసినవారు. మార్క్స్ ఆలోచనలలో ఖాళీని పూరించి, మార్పులు సూచించి, ఆ ఆలోచనలను యితర రంగాలకు విస్తరించగలిగిన అంకిత భావం కలిగిన మిత్రుడు ఎంగెల్స్. మార్క్సిజానికి గుండెకాయ వంటి గతితార్కిక భౌతికవాదాన్నిఅభివృద్ధి చేసి మార్క్సిజానికి బలాన్ని పోసినవాడు ఎంగెల్స్.

ఫ్రెడరిక్ ఎంగెల్స్ జయంతి నవంబర్ 28. 1820వ సంవత్సరం జర్మనీలోని బర్మెన్ (నేటి ఉప్పెర్ట్)లో పుట్టాడు ఎంగెల్స్. తన 22వ ఏట మార్క్స్ ను కలుసుకొన్నాడు. మార్క్స్, ఎంగెల్స్ యిద్దరు కలిసి రాసిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’కు ఇప్పటికి 168 సంవత్సరాలు నిండాయి. ‘పెట్టుబడి’ మహా గ్రంధాన్ని రాసి, ప్రపంచవ్యాప్తంగా అధోగతిలో కునారిల్లుతున్న కార్మిక వర్గానికి దారి చూపిన మార్క్స్ కు ఆత్మానుగత మిత్రుడు, సహధ్యాయి, సహచరుడు ఎంగెల్స్. మార్క్స్ మరణించిన తరువాత చిత్తు ప్రతిలో దొరికిన పెట్టుబడి రెండూ మూడు భాగాలను వెలుగులోకి తీసుకొని వచ్చాడు. మార్క్స్ తరువాత ఎంగెల్స్ తనకు మిగిలిన జీవిత భాగం పన్నెండు సంవత్సరాలను పెట్టుబడి పుస్తకంలో మిగిలిన సంపుటాలు పూర్తి చేయటానికి వినియోగించాడు. ఆ పని పూర్తి చేయటం ఒక అత్యున్నత సృజనాత్మక విజయం. స్నేహం పేరిట, విజ్ఞాన శాస్త్రం పేరిట .. ఇంకా ప్రపంచ కార్మికవర్గ ప్రయోజనాల సాధన కోసం ఆయన నిర్వహించిన గొప్ప కార్యం. ఇవి కాక ఆయన ‘ఇంగ్లాండ్‌లో కార్మిక వర్గపు పరిస్థితి’, ‘రేఖా ప్రాయంగా రాజకీయ అర్థశాస్త్ర విమర్శ’ మొదలైన పుస్తకాలను ఆయన సొంతంగా రాశాడు.

engles

ప్రపంచ కార్మిక వర్గ మహిళలందరూ ఆయనకు కృతజ్ఞతాబద్ధులై ఉండాల్సినంత అద్భుత పుస్తకం ‘కుటుంబం – స్వంత ఆస్తి, రాజ్యముల పుట్టుక’ ను ఎంగెల్స్ రాశాడు. 1884లో మొదట ముద్రణ అయిన ఈ పుస్తకం – మానవ పరిణామ క్రమం మీద మోర్గాన్ చేసిన పరిశోధనలపై ఆధారపడి రాసినది. ఎప్పుడూ స్థిరంగానే ఉందని చెబుతున్న స్త్రీల సామాజిక స్థితి, వివిధ సాంఘిక నిర్మాణాలలో మారుతూ వస్తుందనే ఒక గొప్ప ఆవిష్కరణను ఆయన చేశాడు. సమాజ నిర్మాణం ఈ నాటి రూపం తీసుకోవడానికి కలిగిన చారిత్రిక కారణాలపై వెలుగు ప్రసరించి, వివిధ సామాజిక వ్యవస్థలలో స్త్రీల ప్రాతినిధ్యానికి సంబంధించి ప్రపంచానికి ఒక ప్రగాఢమైన దృష్టిని కలగచేశాడు. కుటుంబం, స్వంత ఆస్తి, రాజ్యం – సంబంధం లేనట్లుగా కనిపించే ఈ మూడు పదాల మధ్య వున్న కలనేతను ఆయన రుజువు చేశాడు. స్త్రీలకు మాత్రమే ఆపాదించిన లైంగిక నీతికి గల కారణాలను చరిత్రనుండి పట్టి తెచ్చి చూపించాడు. ఉత్పత్తి, పంపిణీలలో వచ్చిన మార్పులు స్త్రీలను అధోగతి పాలు చేశాయనీ, గత మంచి కాలాల (స్త్రీలకు సంబంధించి) ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు అభివృద్ధి చెందిన రూపంలో తిరిగి వస్తేనే స్త్రీలకు సమోన్నత స్థానం లభించగలదని ఊహించాడు. ఎంగెల్స్ బతికున్న కాలంలో ఆ మంచి కాలాలను చూడలేకపోయినా తరువాత కాలాల్లో రష్యా, చైనా మహిళలు కొంత కాలమైనా ఆ మహోన్నతమైన జీవితాలను అనుభవించారు.

‘కుటుంబము – స్వంత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ పుస్తకంలో ఎంగెల్స్ మానవుడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన కాలాన్ని ఆటవిక యుగం, అనాగరిక యుగం, నాగరిక యుగం అనే మూడు భాగాలుగా విభజించాడు. ఒక కుటుంబం ఏర్పడటానికి ప్రాతిపదిక అయిన వివాహాలు ఆనాటి వ్యవస్థకు మూలస్తంభాలుగా ఎలా నిలిచాయో సకారణాలతో, చారిత్రిక రుజువులతో నిరూపించాడు. “కుటుంబం అనేది నిత్యం మారుతూ ఉంటుంది. అదెప్పుడూ స్థిరంగా ఉండదు. సమాజం దిగివ స్థాయి నుండి ఉచ్చస్థాయికి పురోగమిస్తున్న కొలది కుటుంబం కూడా దిగువ స్థాయి నుండి ఉన్నత స్థితికి అభివృద్ధి చెందుతుంది. కానీ రక్త సంబంధాల వ్యవస్థ అలా కాదు. అది కరుడు కట్టి పోతుంది. చాలా కాలానికో మారు కుటుంబంలో వచ్చిన ప్రధానమైన మార్పులను అది నమోదు చేస్తూ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ సమూలంగా మారినపుడు మాత్రమే అది కూడా మారుతుంది.” అని అన్నాడు. లైంగిక సంబంధాలు ప్రాతిపదికగా ఉన్న ప్రజాబృందాలతో కూడిన సామాజిక వ్యవస్థలు, కొత్తగా ఏర్పడిన వర్గాల మధ్య జరిగే ఘర్షణలో ఎలా విచ్ఛిన్నమయి పోయాయో వివరించాడు. అలా ఏర్పడిన నూతన సమాజంలో రాజ్యం ఆవిర్భావానికి స్వంత ఆస్తి ఎలా మూలాకారణం అయిందో తిరుగులేని విధంగా తెలియచేసాడు.

జీవ శాస్త్రానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం ఎంత ముఖ్యమో, ఆర్ధిక శాస్త్రానికి మార్క్స్ అదనపు విలువ సిద్దాంతం ఎంత ముఖ్యమో, నాగరిక సమాజంలో కనిపించే తండ్రి హక్కు గణాలకు పూర్వం తల్లి హక్కు గణాలు ఉండేవని మోర్గన్ కనిపెట్టిన విషయం అంతే ముఖ్యమని అన్నాడు. ఆటవిక కాలంలో రక్త సంబధీకుల మధ్య జరిగిన పెళ్ళిళ్ళు, తరువాత జరిగిన గుంపు పెళ్ళిళ్ళ ఉనికిని ఒప్పుకొని తీరాలని, వాటి నుండి మాత్రమే నేటి సమాజ విశ్లేషణ చేయగలమని చెప్పాడు. సామూహిక జీవన పద్దతి అంతరించాక, జనాభా పెరిగిపోయాక స్త్రీలకు వెనుకటి కాలపు దాంపత్య సంబంధాలు పీడాకారంగాను, అవమానకరంగానూ అనిపించి ఉంటాయనీ … శాశ్వతంగానో, తాత్కాలికంగానో ఏకపత్నీ హక్కును కొనుక్కోవటానికి వారు ఎంతో ఆదుర్ధా పడి ఉంటారని ఊహించాడు. ఈ ప్రతిపాదన మగవాళ్ళ వైపు నుండి ఖచ్చితంగా వచ్చి ఉండదు, ఎందుకంటే వారింకా గుంపు పెళ్ళిళ్ళ సౌలభ్యం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉన్నారని అన్నాడు. తరువాత కాలంలో వచ్చిన జంట పెళ్ళిళ్ళు, దంపతీ వివాహాలు దాని పర్యవసానమే అని వక్కాణించాడు. జంట పెళ్ళి కారణంగా గుంపు అనేది దాని చివరి కణానికి కుదించుకొని పోయిందనీ, ఆ కణంలో రెండు అణువులు స్త్రీ పురుషులని చెప్పాడు. ఇక ఈ జంట పెళ్ళి దంపతీ వివాహంగా మాత్రమే కాక, సుస్థిరమైన దంపతీ వివాహంగా పరిణితి చెందాలంటే కొత్త సాంఘీక క్రియాశీలక శక్తులు ఆచరణలోకి రావాలనీ, ఆ పని అప్పుడే మొదలైయ్యిందనీ చెప్పాడు.

మానవజాతి చూసిన మహత్తర విప్లవాలలో మాతృస్వామ్యం నుండి పితృస్వామ్యానికి మార్పు ఒకటి అనీ, తల్లి హక్కును కోల్పోవటం స్త్రీలకు సంబంధించి చారిత్రక పరాజయమని చెప్పాడు. అయితే ఈ విప్లవం ఒక్క రక్తపు బొట్టు చిందకుండా అతి సామాన్యంగా, నిశ్శబ్ధంగా జరిగిపోయిందని అన్నాడు ఎంగెల్స్. దంపతీ వివాహం మహత్తర చారిత్రక అభివృద్ధి అయినా అది బానిసత్వం, సొంత ఆస్తితో కలిసి పుట్టిందని అన్నాడు. వ్యక్తిగత సౌందర్యం, సన్నిహిత సాహచర్యం, అభిరుచులలో సారూప్యతవంటివి స్త్రీ పురుషుల మధ్య లైంగిక వాంఛను సహజంగా రేపుతాయనీ, అలాంటి ఆధునిక లైంగిక ప్రేమ అభివృద్ధి కావటానికి అవకాశమున్న ఏకైక కుటుంబ రూపం దంపతీ కుటుంబమేననీ అన్నారు. అయితే మగవాడికి సర్వాధికారాలు ఉండే నేటి దంపతీ వివాహపు స్వభావమే ప్రేమ పుట్టటానికి వ్యతిరేకమని కూడా అన్నారు. స్వంత ఆస్తి లేని కార్మిక వర్గంలో మాత్రమే భార్యా భర్తల మధ్య దాంపత్య ప్రేమ సర్వసాధారణం అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఆహార సంపాదన లాగానే గృహ నిర్వహణ కూడా ఒక సామాజిక కర్మ అనీ, వ్యష్ఠి కుటుంబాలలో అది సొంత పనిగా మారిందనీ, సాంఘిక స్వభావాన్ని మార్చుకొన్న ఆ పని భారం మొత్తం స్త్రీల మీద పడి అది గృహ దాస్యత్వానికి తావు యిచ్చిందనీ అన్నాడు. ఈ వ్యష్ఠి కుటుంబాల అణువులతో ఏర్పడిందే ఆధునిక సమాజమనీ – అందులో భర్త బూర్జువాగానూ, భార్య శ్రామికురాలుగాను ఉన్నారనీ అన్నాడు. ఉత్పత్తి సాధనాలు సామాజిక ఆస్తిగా మార్చివేస్తే వ్యష్ఠి కుటుంబం సమాజానికి ఆర్ధిక యూనిట్ గా ఉండటం నిలిచిపోతుందని చెప్పాడు. స్త్రీలు పెద్ద ఎత్తున సామాజిక ఉత్పత్తిలో పాలుపంచుకొనేటట్లు చేసి, గృహ శ్రమను సామాజిక కర్మగా మార్చివేస్తేనే స్త్రీల విముక్తి సాధ్యపడుతుందని చెప్పాడు. ఆర్ధిక కారణాల వలన పుట్టిన దంపతీ వివాహం, ఆర్ధిక కారణాలు పోగానే అంతరించిపోవటానికి బదులు అసలైన అర్ధంలో పూర్తిగా అమలు కావటం మొదలు పెడుతుందని అన్నారు.

“వివాహితులు ఒకరినొకరు ప్రేమించుకోవడం ధర్మం అయినపుడు, ప్రేమించుకొన్నవాళ్లే పెళ్లి చేసుకోవటం, ప్రేమ లేని చోట పెళ్లి చేసుకోకుండా ఉండటం మాత్రం ధర్మం కాదూ? తల్లిదండ్రుల, బంధువుల, సంధాన కర్తల హక్కులకన్నా ప్రేమించుకొన్నవారి హక్కు ఎక్కువది కదా?” అన్న ప్రశ్నను నూట నలభై ఏళ్ళకు ముందే ఎంగెల్స్ స్త్రీ జాతి తరఫున వేశాడు. ప్రేమ కలిగిన వివాహాలే నీతి అయితే ప్రేమ ఉన్నంత కాలమే వివాహ బంధం ఉండాలనటం నీతి అవుతుంది అన్నాడు. ఆప్యాయతలు నశించినా లేదా దాని స్థానంలో కొత్త వారి మీదా ప్రేమ, వ్యామోహం పెరిగినా వారిద్దరూ విడిపోవటం వారికీ, సమాజానికి క్షేమమని చెప్పాడు. పెట్టుబడీదారి సమాజం రద్దయినాక స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నకు “… ఒక తరం మగవాళ్ళు తమ జీవిత కాలంలో ధనంతో కానీ, సామాజిక అధికారంతో కానీ స్త్రీని లోబర్చుకొనే సందర్భం ఎదురు కానప్పుడు, అదే విధంగా నిజమైన ప్రేమతో తప్ప మరి ఏ కారణంతోనైనా స్త్రీ మగవాని చెంత చేరవలసిన అవసరం లేనప్పుడు, ఆర్ధికపరమైన ఫలితాల భయం చేత ప్రేమికులు కలియలేని పరిస్థితులు తొలిగినపుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ మాదిరి జనం పుట్టాక, వారి ప్రవర్తన గురించి ఈ నాడు మనం చెప్పే సలహాలకు వారు చిల్లిగవ్వ అంత కూడా విలువనివ్వరు. తమ అలవాట్లను తామే నిర్ణయించుకొంటారు. వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయాన్ని సృష్టించుకొంటారు.” అని కుండ బద్దలు కొట్టాడు.

వివాహ పద్దతుల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సామాజిక ఉత్పత్తిలో వచ్చిన పెను మార్పులు, పురుషుడి చేతిలో ఉండే ఉత్పత్తి సాధనాలు విలువను సంతరించుకోవటం, మాతృస్వామ్యం నుండి పురుష స్వామ్యానికి పరావర్తనం, రక్త సంబంధ కుటుంబాలు ప్రాదేశిక కుటుంబాలకు మారిన వైనం … ఇవన్నీ స్వంత ఆస్తి విధానానికి దాని తీస్తే, దానిని కాపాడవలసిన వ్యవస్థగా రాజ్యం ఏర్పడింది. రాజ్యానికి, కుటుంబానికి ఉన్న సంబంధాన్ని ఎంగెల్స్ నైపుణ్యంగా ప్రతిస్థాపించాడు. రాజ్యం బీజ రూపంలో కుటుంబంలో ఉంటుంది. కుటుంబం రాజ్యానికి ఆర్ధిక యూనిట్ గా ఉంటుంది. సమాజంలో ఉండే వైరుధ్యాలు కుటుంబంలో కూడా తారాడుతుంటాయి. స్వంత ఆస్తి విధానం రద్దయి, స్త్రీలు కూడా పురుషులతో సమానంగా సామాజిక ఉత్పత్తిలో పాలుపంచుకొన్న రోజున రాజ్యం అంతర్ధానమవుతుంది. అసమానతలు రద్దవుతాయి.

మహిళల సమస్యల మూలాలలోకి పోకుండా, వ్యవస్థతోటి వాటికి సంబంధాన్ని గుర్తించకుండా పై పై పరిష్కారాలు ముందుకు వస్తున్నంత కాలం ఎంగెల్స్ రాసిన ఈ పుస్తకానికి సమకాలనీయత, ప్రాముఖ్యం ఉంటాయి. భార్యా భర్తల సంబంధాలు పూర్తి సహజంగా, సమానత్వంతోటీ, స్నేహ సౌరభాలతోటీ గుభాళించాలంటే ఆస్తుల, ఆర్ధిక వ్యవస్థల సంకెళ్ళ నుండి విడివడాల్సి ఉంటుంది. భార్యా భర్తలు పరిపూర్ణ వ్యక్తులుగా మారాలి. ఒకరిపట్ల మరొకరికి ప్రేమ, దాంతోపాటు గౌరవం ఉండాలి. ఉమ్మడి ఆసక్తులు పెంచుకోవాలి. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు స్నేహం కోసం, ప్రేమ కోసం, కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం ఆధారపడాలి తప్ప ఆర్ధికాంశాల కొరకు కాకూడదు. అప్పుడా దాంపత్యం, స్నేహం జీవితాంతం కొనసాగుతుంది. సమానత్వంతో ఉండే దాంపత్యంలో పురుషునికి గతం నుండీ వచ్చే అనేక సౌకర్యాలు రద్దయినా .. స్వతంత్ర వ్యక్తిత్వంతోనూ, సమాజంతో సజీవ సంబంధంతోనూ ఉండే స్త్రీ భార్యగా పురుషునికి సహచరిగా లభిస్తుంది.

ఎంగెల్స్ ప్రతిపాదించిన కుటుంబ జీవితం స్త్రీ పురుషులిద్దరికీ ఎంతో మేలైనది. ఇంత గొప్ప దారి చూపిన ఎంగెల్స్ కు స్త్రీ జాతి మొత్తం ఋణపడి ఉంటుంది. ఎక్కడో చదివినట్లు కృతజ్ఞత అనే పదం రాబోయే సమాజంలో విస్తృతార్ధం యివ్వబోతుంది. ఒక గొప్ప ఆవిష్కరణ చేసిన వారికి కృతజ్ఞత తెలుపటం అంటే అంతవరకు పరిమితమవకుండా ఆ ఆవిష్కరణతో పొందిన జ్ఞానం ‘స్నేహాన్ని పెంపొందించేందుకూ, అనురక్తిని అభివృద్ధి చేసేందుకూ, పరస్పర విశ్వాసాన్ని మరింత గట్టి పరచేందుకూ, పరస్పర ప్రేమాదరాలు మరింత విశాలమైన పునాది మీద బలవత్తర మయ్యేందుకూ’ వుపకరించాలి. తనకంటే బలహీనమైన వ్యక్తిని ఉత్సాహపరచి, అభివృద్ధి చేసేందుకు ఎవరికి తాహతున్నంతవరకు వారు కృషి చెయ్యాలి. ఎంగెల్స్ ‘కుటుంబం – స్వంత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ పుస్తకం ద్వారా పొందిన జ్ఞానం ఆయన స్త్రీ విముక్తికి సశాస్త్రీయంగా చూపిన మార్గంలో, కొత్త సమాజ నిర్మాణానికి మహిళలను ప్రయాణం చేయమని పురికొల్పుతుంది.