ట్యాగులు

, , ,

తల్లి భూదేవి నవలలో తొల్గొనాయ్

‘జమీల్యా’ లాంటి పాత్రను సృష్టించిన రచయిత చింగీజ్ ఐత్ మాతొవ్ మరో అద్భుత సృష్టి ‘తొల్గనాయ్’ పాత్ర. అదే అందమైన కిర్గిజ్ దేశం. అవే పర్వతాలు, విశాలమైన స్టెప్ మైదానాలు. అవే సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు. కనుచూపు మేర విస్తరించిన గోధుమ పంటలు. అక్కడే పూలు పూచినంత సహజంగా ప్రేమలు పుడతాయి. శరీరాలను, మనసులనే కాకుండా శ్రమను మోహించే జంటలు ఉంటాయక్కడ. చెమట చిందించే పొలాల్లో సామూహిక జీవనం జరుగుతుంది. అదే యుద్ధకాలం. అవే కష్టాలు. కష్టాలను, సుఖాలను కడిగి ఇంటి ముందు ఆరబోసుకొనే కుటుంబాలు. మూకుమ్మడి వ్యధలు, ఐక్య పరిష్కారాలు. సమిష్టి సాంత్వనలు

యుద్ధమరణాలు అనంతమైన బాధను కలిగిస్తాయి. తల్లులకు తీవ్ర గర్భశోకాన్ని మిగులుస్తాయి. పైకి అలాంటి కథనంగానే అనిపించే ‘తల్లి భూదేవి’ నవల ఇతివృత్తం; అంతకంటే విస్తృతమైన ఆవరణలో నడుస్తుంది. కడుపు తీపికీ, ప్రేమోల్లాసాలకూ, ఆకలికీ, అవసరాలకూ కొత్త అర్థాలు చెబుతుంది ఈ నవల. తొల్గొనాయ్ లాంటి స్త్రీ పాత్ర ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా, అప్పటికీ ఇప్పటికీ, మళ్లీ పుట్టలేదు. ఆయా కాలాలలో, స్థలాలలో, పరిస్థితుల్లో జనించిన పాత్రలకు విశ్వజనీనతను ఆపాదించి చిరంజీవులుగా నిలపటంలోనే క్లాసిక్ రచయితల ప్రతిభ ఉంటుంది. అందుకారణంగానే కావచ్చు ‘తొల్గొనాయ్’ అనే మహిళ పాఠకుల లోలోపలి పొరల్లో దాగి ఉండి, అప్పుడప్పుడూ మొలకలెత్తుతూనే ఉంటుంది. ఆరు కాలాలతో, పంచ భూతాలతో మమేకం అయ్యి ఈ పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ‘తొల్గొనాయ్, తొల్గొనాయ్’ అని తలుచుకొంటే చాలు; అంతులేని దుఃఖాన్ని కనురెప్పల చాటున దాచేసి, బతుకు సముద్రాన్నిఎదురీదగలిగిన స్థైర్యం యిస్తుందీ పాత్ర.

ఈ కథలో సోవియట్ విప్లవ పూర్వ పరిస్థితులూ, విప్లవానంతర స్థితీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలమూ, యుద్ధ తదనంతర శాంతీ…ఇవన్నీ పాత్రలుగా ఉంటాయి. కానీ అవి కథలో ఎక్కడా ప్రత్యక్షంగా కనబడవు. వాటి ప్రస్తావనే ఉండదు. వాటి ప్రతిధ్వనులు ప్రజల జీవితాల మీద వేసే ముద్రల ఆనవాళ్లే కథంతా పరుచుకొని ఉంటాయి. తొల్గొనాయ్, సువన్ కూల్ అనే యువకుడి ప్రేమలో పడిన కొత్తల్లో “మనం హాయిగా ఉంటాం కదూ?” అని ప్రశ్నిస్తుంది. దానికి జవాబుగా సువన్ కూల్ ‘భూమీ నీరూ మనుషులందరికీ ఎప్పుడైతే సమానంగా పంపిణీ అవుతాయో, మనకి కూడా మన సొంత చేను అంటూ ఉండి; మనం సాగుచేసుకుని, విత్తులు చల్లి, మన గింజలు మనం ఎప్పుడైతే నూర్చుకొంటామో – అప్పుడే మనం హాయిగా ఉంటాం.’ అని జవాబు చెబుతాడు. రైతు కూలీలుగా పని చేస్తున్న వారి ఆనాటి స్థితి, అందులో నుండి బయటపడాలనే బలమైన ఆకాంక్ష ఆ రకంగా వ్యక్తమవుతాయి. అప్పటికి సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఉనికిలో లేవు. ఆనాటి వారి కలలు సొంత భూమి కావాలనే వరకే పరిమితమై ఉంటాయి. దాన్ని అనుసరించే, సువన్ కూల్ కోరిక నుండే, తొల్గొనాయ్ వాళ్ల తొలిరాత్రి ఒక కల కంటుంది. ఆమెకు ఆకాశంలో ఒక గడ్డికోత కాని బాట కనిపిస్తుంది. “దయాళుడూ, శక్తివంతుడూ అయిన హాలికుడొకడు నిజంగానే ఈ రాత్రే గడ్డి మోపు మోసుకొని ఆకాశాన వెళ్తూ, తన వెంట జాడలో పొల్లూ, గింజలూ రాల్చాడా ఏమిటి చెప్మా?” అనుకొంటుంది. సువన్ కూల్ కూడా అలాంటి తమ సొంత గోధుమ మోపును మోయాలని నక్షత్రాల సమక్షంలో కల కంటుంది తొల్గొనాయ్. ఆడవాళ్లకు మించిన స్వాప్నికులు ఇంకెవరూ ఉండరు. ఆ స్వప్నాల సాకారానికి అంత పాటు పడేది కూడా వాళ్లే. అయితే తొల్గొనాయ్ కోర్కె, ముగ్గురు బిడ్డల తల్లి అయ్యాక తీరుతుంది. “ఇక కొత్త రోజులు వచ్చాయి- ఇల్లు కట్టుకొన్నాం. గొడ్డూ, గోదా సంపాదించుకొన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల్లా బతికాం.” అంటే అవి విప్లవానంతర రోజులు. “… ఆ నాడు మేం దేని గురించి అయితే పగటికలలు కన్నామో, అదంతా సర్వమూ నిజమైయ్యింది! అవును. భూమీ, నీరూ మా సొంతమే అయి, మా చేతిలోకి వచ్చేశాయి. భూమి దున్నాం, విత్తులు చల్లాం. మా గింజలు మేమే నూర్చుకొన్నాం. … ఐతే ఇహం గురించి సామాన్యపు మనిషి కన్న కలలూ, ఆ కాలం ఆశించిన ఆశలూ- మంచి కోసం, న్యాయం కోసం ఆశించిన ఆశలు- ఒకదానితో ఒకటి సరిగ్గా సరిపోయాయి,” అనుకొంటుంది.

సామూహిక శ్రామిక జీవనానందాన్ని సంపూర్ణంగా అనుభవించి పరవశిస్తుంది తొల్గొనాయ్. “నా మాతృత్వ జీవితంలోకెల్లా అతి అదృష్టవంతమైన రోజులు అవే. ఎంత పనైనా సరే నేను సునాయాసంగా చేసేదాన్ని. పని అంటే నాకెప్పుడూ సరదానే. మనిషి ఆరోగ్యంగా ఉండి, కాళ్లూ చేతులూ దృఢంగా ఉంటే- పని కంటే హాయి అయినది ఇంకేం ఉంటుంది గనుక?” అనుకొంటుంది. సువన్ కూల్ ఊరికి దళవాయి అవుతాడు. (దళవాయి అంటే సమిష్టి వ్యవసాయ క్షేత్రాల ఆజమాయిషీ చూసేవాడు) సొంత పిల్లల దగ్గరే చదువుకొని, పక్క ఊరిలో శిక్షణ పొంది ట్రాక్టర్ డ్రైవర్ అవుతాడు. మొదటిసారి ట్రాక్టర్ వాళ్ల ఊరికి వచ్చినపుడు వారికి అదో అద్భుతం. ఊరంతా దాని వెనుక పరిగెడుతుంది. కోతల రోజు తొల్గొనాయ్ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ రోజు “… మనుషుల లోలోపల నుండే; వారి నడక తీరు, వారి గొంతు, వారి కళ్లల్లో నుండే పుట్టుకొస్తుంది పండగ. కడుపు నిండుగా దాణా తిన్న గుర్రాలు గలగల ఆడించుతున్న జీను చప్పుడు లోనుండే, వాటి చకచక పరుగులో నుండే పుట్టుకొస్తుంది పండగ,” అని చెబుతుంది. ఇక తనకైతే “నేను చూసినది ప్రతిదీ, విన్నది ప్రతిదీ – సర్వమూ నా కోసమనే, నాకు ఆనందం కల్గించేందుకనే సృష్టించబడినట్లు, సర్వమూ ఎప్పుడూ లేని సౌందర్యంతోనూ, పరమానందంతోనూ నిండిపోయినట్లు అనిపించింది.” అని చెప్పుకొంటుంది.

పరిపూర్ణ మాతృమూర్తి తొల్గొనాయ్. మాతృత్వానికి ఎన్నో అదృష్టాలు, పూజలు, కిరీటాలు, భావోద్వేగాలు, కర్తవ్యాలు, హక్కులు, ఆనందాలు అసహజంగా ఆపాదిస్తున్న సమయంలో అమ్మతనానికి ఉన్న వాస్తవికమైన అర్థం తొల్గొనాయ్ పలుకుల నుండి తీసుకోవచ్చు. అవి ఉమ్మడి కోతల రోజులు. సమిష్టి క్షేత్రాల సామూహిక సంపద గోధుమ పంట. ఆ కొత్త గోధుమలతో అక్కడే చేనిగట్టున రొట్టె చేసుకొని, కంబైన్ ఆపరేటర్ అయిన కొడుకు కాసిమ్ చేతి నుండి రొట్టెముక్కను తీసుకొని తిన్న జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొంటూ తొల్గొనాయ్ ‘… ఆ వాసన- కంబైన్ ఆపరేటర్ చేతుల వాసన, కొత్త పంటగింజలూ, కాలిన యినుమూ, కిరస నూనె వాసన. తర్వాత నోట్లో వేసుకొన్న రొట్టెముక్కలు కూడా అన్నీ కొద్దిగా కిరసనూనె వాసనే వేశాయి. ఐతేనేంగాక- ఇంత కమ్మటి రొట్టె నేనిదివరకెన్నడూ రుచి చూసి ఎరుగను, ఎందుకంటే ఈ రొట్టె నా కొడుకుది. తన చేతులతో పట్టుకొన్న రొట్టె. ఇది ప్రజల రొట్టె. ఆ సాయంకాలం నా కొడుకుతో కూడా మకాం చేసిన వాళ్ల రొట్టె ఇది. ఇది పవిత్రమైన రొట్టె!… తల్లి సౌఖ్యం ప్రజల సౌఖ్యంలోనుండే పుట్టుకొస్తుంది- చెట్టు వేరులో నుండే కాడ పుట్టుకొచ్చినట్లు. తన తోడి ప్రజల బతుకు వినా తల్లికి వేరే బతుకు లేదు. ఈ విశ్వాసాన్ని నేను ఎన్నటికీ వదులుకోను, ఇన్ని తిప్పలు భరించి కూడా, ఈ బతుకు నన్ను ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు అనుభవించి కూడా, ఈ నాటికీ వదులుకోను. నా తోడి ప్రజలు బతుకుతున్నారు. అంచేతే నేనూ బతుకుతున్నాను.” అని చెబుతుంది. అదే మాట మీద జీవితాంతం బతుకుతుంది తొల్గొనాయ్.

భర్తనూ, కొడుకులనూ యుద్ధానికి సాగనంపాక దళవాయి బాధ్యత చేపట్టిన తొల్గొనాయ్ ప్రజల గురించి నిత్యం పరితపిస్తుంది. తన దుఃఖాన్ని, పరాయి వాళ్ల దుఃఖాన్ని దిగమింగుతూ; కష్టాలు, ఆకలి పస్తులు, చలిబాదలు వారితో పంచుకొంటూ; ఆ కష్టకాలంలో గుర్రం ఎక్కి ఆమె దళవాయి పనిని నిర్వహిస్తుంది. యుద్ధం కోసం సర్వస్వం అర్పించి, చివరకు పసిపిల్లలు తాగే జావను కూడా యుద్ధ పిశాచానికి ధారబోసినపుడు పిల్లల కోసం ఆమె ఏమైనా చేయాలనుకొంటుంది. ఇక బతికి వస్తారో, రారో తెలియని తన సొంత పిల్లల గురించి దుఃఖపడుతూ ఉండక, తన చుట్టూ ఉన్న పిల్లల ఆకలి తీర్చాలనుకొంటుంది. ఖాళీగా పడి ఉన్న భూభాగాన్ని సాగు చేసి, కేవలం ప్రజల తిండి కోసం సాగు చేయాలని నిర్ణయం తీసుకొని జిల్లా కమిటీని ఒప్పిస్తుంది. భావి ఆహారం అయిన విత్తనాల కోసం ఇంటింటికి వెళ్లి అర్థిస్తుంది. తిండి గింజల్ని విత్తనాలకు యిస్తూ వాళ్లు పెట్టే శాపనార్థాలు భరిస్తుంది. ఆమె శ్రమ దొంగలపాలు అవుతుంది. ఆ దొంగలను వెంబడించి ప్రాణాపాయం తెచ్చుకొంటుంది. అయినా ప్రజలు ఆమెను ఒక్క మాట అనరు. ఆమె ఆరోగ్యం గురించే ఆందోళన పడతారు.

మాతృత్వానికి తొల్గొనాయ్ గ్రహించిన విశాలమైన అర్థం, ఆ గ్రహింపు నుండి ఆమె ఆచరణ- ఆమె అనుభవం నుండీ, ఆనాటి కష్టకాలాల నుండి వచ్చినవే. ఆ కొనసాగింపుగానే కోడలు అలిమాన్ విషయంలో ప్రవర్తిస్తుంది. అలిమాన్ ను తల్లిలాగా ప్రేమిస్తుంది తొల్గొనాయ్. ముగ్గురు కొడుకులూ, భర్తా; యుద్ధంలో చనిపోయారని తెలిసాక తన బాధను దిగమింగుకొని కోడల్ని ఓదారుస్తుంది. ఆమెను ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాలని ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోతుంది. కోడలు ఇంకో వ్యక్తితో ప్రేమలో పడ్డప్పుడు అతణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పాలనుకొంటుంది. చివరకు అతడి చేతిలో మోసపోయి గర్భవతి అయిన కోడలి గురించి తపన పడుతుంది. అలిమాన్ ఆ గర్భం వలన ఆత్మన్యూనతాభావానికి గురి అవుతూ ఉంటే ఆమెకు చెప్పాలనుకొన్న విషయాలు గొంతులోనే ఆగిపోతాయి. మాతృత్వానికి ఆమెకు సంపూర్ణమైన హక్కు ఉందనీ, కొత్తగా పుట్టిన పిల్లలు అందరూ ఒకలాగే ఉంటారనీ, కోడలికి పుట్టబోయే బిడ్డను తన బిడ్డగానే భావిస్తానని చెప్పాలనుకొని చెప్పలేకపోతుంది. చివరకు అలిమాన్ ప్రసవంలో చనిపోతే, కొత్తగా పుట్టిన శిశువు బాధ్యతను నెత్తిన వేసుకొని పెంచి పెద్ద చేస్తుంది.

అద్భుత ప్రేమికురాలు తొల్గొనాయ్. ప్రకృతిని ప్రేమించటంతో మొదలు పెట్టి, ఆమె తన ప్రేమతో సువనకూల్ లాంటి యువకుడితో తలమునకలయ్యేంత వరకు మునిగి తేలి; ముగ్గురు బిడ్డల తల్లిగా కాసీమ్, మసల్ బెక్, జైనాక్ లకూ; అత్తగా అలిమాన్ కూ, అంతిమ దశలో మనవడు కాని మనవడు జెన్ బోలెత్ కూ, చివరకు సమస్త ప్రపంచానికీ ఆ తరగని ప్రేమ గనిని పంచుతుంది. పెద్ద కొడుకు కాసీమ్ నోటి నుండి ‘యుద్ధం అమ్మ.’ అనే మాట మొదటసారిగా విని నిశ్చేష్టురాలు అవుతుంది. పండంటి కాపురాలు కూలిపోతాయి. ప్రతి రోజూ ఒక ఇంటికి చావు వార్త వస్తుంది. అలాంటి చావు వార్తలు నాలిగింటిని తొల్గొనాయ్, అలిమాన్ కలిసి వినాల్సి వస్తుంది. నోట్లో నాలికలాగా వ్యవహరించే పెద్ద కొడుకు కాసీమ్, ఉపాధ్యాయ వృత్తి కోసం చదువుకొనేందుకు వెళ్లిన మసల్ బేక్, వేడి రక్తంతో కమ్యూనిస్టు సంఘంలో పని చేస్తున్న చిన్న కొడుకు జైనాక్ ల యుద్ధ మరణవార్తలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. ఇక భర్త సువన్ కూల్ మరణ వార్త కాసీమ్ మరణవార్తతో పాటే ప్రయాణమై వస్తుంది.

తొల్గొనాయ్ తాత్వికురాలు కూడా. అది కొంత జీవితానుభవం నుండి వచ్చిన సరైన తాత్వికత. అదృష్టం గురించి చెబుతూ “… (అదృష్టం) వేసవి కాలపు జల్లులాగా ఎక్కడ నుండో ఆకాశం నుండి దిగి వచ్చి నెత్తి మీద పడదు. జీవితం పట్లా, తన చుట్టూ ఉన్న తోడి మనుషుల పట్లా తను అనుసరించే వైఖరిని బట్టి, చినుకు తర్వాత చినుకులా క్రమేణా అది మనిషికి కల్గుతుంది. ఒక్కొక్క రేణువే పెరిగి పెద్దదై ఒకదానితో ఒకటి కలిసి మనిషిలో పోగుపడితే, అప్పుడు మనం అంటాం దానిని – అదృష్టమని.” అంటూ విడమర్చి చెబుతుంది. అయితే ఆమె అసలు తాత్వికతను భర్తా, కొడుకుల నుండి పొందుతుంది. కాసీమ్ యుద్ధానికి వెళ్లే ముందు ఏడుస్తున్న తొల్గొనాయ్ ను ఉద్దేశించి సువన్ కూల్ ‘నిజంగా, నువ్వూ నేనూ, మనం ఎవరం, తొల్గొనాయ్? ఈ ప్రజతో ఉన్నాం. ఉండి మనం మనిషి బతుకు బతుకుతున్నాం. వీళ్లందరితోనూ మనమూ మంచీ, చెడుగూ ఒక్కలాగే పాలు పంచుకుందాం. రోజులు బాగా వున్నప్పుడు అందరూ తృప్తిపడ్డారు. మరి ఇప్పుడేమో, ఎవడి మట్టున వాడు తన గురించే ఘోష పడుతూ, తన కర్మ కాలిందని ఏడుస్తూ కూచోడమేనా?’ అని మందలిస్తాడు. రెండో కొడుకు మసల్ బెక్ యుద్ధరంగానికి వెళ్లబోయే ముందు రాసిన ఉత్తరంలో ‘ఇది మనం కోరి తెచ్చుకొన్న యుద్ధం కాదు. దీన్ని మనం మొదలెట్టలేదు, ఇది మనందరికీ, మన యావత్తు ప్రజకీ బ్రహ్మాండమైన విపత్తు తెచ్చిపెట్టింది. ఈ బ్రహ్మ రాక్షసిపై చావు దెబ్బ తీయాలంటే, దీన్ని నాశనం చేయాలంటే, ఇప్పుడు మనం నెత్తురు చిందించక తప్పదు. ఈ పని మనం చేయకపోతిమా, మనిషి అనే పేరు పెట్టుకొనేందుకు మనం తగం. ప్రజకోసమని, జయం కోసమని, మానవునిలో ఉన్న సకల సౌందర్యాన్ని కాపాడేందుకు నేనక్కడకు వెళ్తున్నాను. నా తోడి ప్రజల పట్ల నా సర్వోత్కృష్ట విధిని నెరవేరుస్తున్నాను కదా అని నేనెంతో గర్వపడుతున్నాను.’ అని రాస్తాడు. ఈ రాతలూ, మాటలు తొల్గొనాయ్ ను ప్రభావితం చేస్తాయి. అందుకే యుద్ధంలో అదృశ్యమైన చిన్న కొడుకు జైనాక్ ను తలుచుకొంటూ “… ప్రజలంటే నీకెంత ప్రేమ ఉండెనో ఆ సంగతి అందరికీ తెలియలేదు. మానవులు మానవుల్లాగా ఉండాలని నువ్వెంతో ఆశించావు. మనుషులలో సజీవంగా వున్న మానవతా భావాన్ని యుద్ధం ముక్కచెక్కలు చేయకుండా ఉండాలనీ; వాళ్లలో ఉన్న దయనీ, కారుణ్యాన్నీ అది నిర్మూలం చేయకుండా ఉండాలనీ నువ్వు ఆశించావు. ఇందుకోసం నువ్వు ఎంత చేయగలవో అంత చేశావు,” అనుకొంటుంది. జైనాక్ లో తోటి ప్రజల పట్ల ఉండే దయ ఎక్కడి నుండో ఊడి పడలేదనీ, తోటి మానవుడి నుండే అతను నేర్చుకొని ఉంటాడనీ తీర్మానిస్తుంది.

ఈ నవలలో ప్రకృతి వర్ణనలు, మనుషుల హావభావాలు, వారి ఉద్వేగాలు కళ్లకు కట్టినట్లు రాశారు రచయిత. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం దృశ్య రూపంలో మనసుకు హత్తుకొని హృదయపు కాన్వాసుపైన ముద్ర పడి మిగిలిపోతాయి. అందులో ఒకటి మసల్ బెక్ ను రైల్వే స్టేషన్ లో తొల్గొనాయ్, అలిమాన్ కలవటానికి వెళ్లిన దృశ్యం. యుద్ధంలో చేరాక మసల్ బెక్ ఒక రైల్వే స్టేషన్ ద్వారా వెళుతున్నాడనీ, అమ్మను చూడాలనుకొంటున్నాడనీ, స్టేషన్ కు రమ్మనమనీ వార్త వస్తుంది. అలిమాన్ తో ఒక రోజంతా బండి ప్రయాణం చేసి రైల్వే స్టేషన్ కు చేరుతుంది తొల్గొనాయ్. ఎన్నో రైళ్లు సిపాయిలను మోసుకొంటూ వెళుతుంటాయి. కొన్ని రైళ్లు బాంబుల దాడికి గురి అయ్యి, కాలిపోయి కనిపిస్తాయి. ఆ రైళ్లలో చనిపోయిన సిపాయిల తల్లుల గురించి ఆలోచిస్తుంది తొల్గొనాయ్. ఒక పగలు, రాత్రి వేచి ఉన్న తరువాత నిరాశగా వెనుతిరుగుదామనుకొంటుండగా ఒక రైలు ఆగకుండా ఆ స్టేషన్ నుండి వెళ్లిపోతుంది. వెళ్లిపోయే రైలులో ఒక పెట్టె నుండి శరీరమంతా బయటకు పెట్టి మసల్ బెక్ “అ-మ్మా-మ్మా! అలిమా-న్!” అని పిలుస్తాడు. ఆ పిలుపూ, మసల్ బెక్ ఆమె కోసం విసిరేసిన మిలటరీ టోపీ తొల్గొనాయ్ జీవితాంతం వెన్నాడుతాయి. అదే అతని చివరి పిలుపు ఆమెకు.

యుద్ధం ముగిసిపోతుంది. కొత్త జంటలు మొదలు పెట్టి కట్టుకొంటున్న ఇళ్లు శిథిలమయ్యాక యుద్ధం ముగిసిపోతుంది. ఆ జంటల భావి ఆశలనూ, వారి యవ్వనాలనూ ఒక్క గొడ్డలి వేటుతో ధ్వంసం చేసి ఆరు సంవత్సరాల తరువాత యుద్ధం ముగిసిపోతుంది. యుద్ధ సైనికులు తిరిగి వస్తున్నారనే వార్త ఊరికి చేరుతుంది. ఒకే ఒక సైనికుడు వారి ఊరి పొలిమేరలో దిగుతాడు. ఆ కుర్రాడు ఆషిరాలీ తాలూకూ కుటుంబం ఒక్కటే ఆనందంతో కేకలు పెడుతుంది. మిగతా ఊరంతా కదల్లేక నిలబడిపోయి ఉంటుంది. ఎందుకంటే వారు ఎదురుచూస్తున్నది ఒక్కడి కోసం కాదు. ఎంతో మంది కోసం కాచుక్కూర్చొని ఉంటారు వాళ్లు. అయితే వెంటనే తేరుకొని ఆ సైనికుని దగ్గరకు పరుగులు పెడతారు. “… మా జీవితాలూ, మేం పడిన బాధలూ, మేం పొందిన దుఃఖాలూ, చిత్రహింసలతో అనుభవించిన నిరీక్షణాలూ, నిద్ర ఎరుగని రాత్రులూ, నెరిసిన తలలూ, ముసలితనం వచ్చిన మా పడుచులూ, దిక్కులేని మా వితంతువులూ, అనాధలూ మా కన్నీటి బొట్లూ, మా మూల్గులూ, మా ధైర్య స్థైర్యాలూ అన్నిటినీ జయం మోసుకొని వచ్చిన ఆ సైనికుడి దగ్గరకు మేం మోసుకొని పోయాం.” అని చెప్తుంది తొల్గొనాయ్.

“ఓ విజయమా! నీ కోసం ఎన్నాళ్లు కాచుక్కూర్చోన్నాం! స్వాగతం నీకు ఓ విజయమా! స్వాగతం! మా కన్నీటిని మన్నించు! నా కోడలు అలిమాన్ ఆషిరాలీ గుండెలు మీద పడి తలకాయ మొత్తుకొంటూ, అతని భుజం పట్టుకొని, ‘ఏడీ నా కాసీమ్? ఎక్కడున్నాడు?’ అని అతడిని ఊదరగొడుతూ అడిగినందుకు క్షమించు. మమ్మలందరినీ క్షమించు, ఓ విజయమా! నీ కోసమని ఎంతో త్యాగం చేశాం. ‘కడమవాళ్లు ఏరి? ఏడీ మా అబ్బాయి? కడమవాళ్లందరూ ఎక్కడున్నారు? వాళ్లు ఇంటికెప్పుడు వస్తారు?’ అని మేం మొర పెట్టుకొన్నందుకు మమ్మల్ని మన్నించు. ‘వస్తారు తల్లీ, వస్తారు నాయనా, అందరూ వస్తారు, త్వరలోనే వస్తారు, రేపే వచ్చేస్తారు,’ అని ఆషిరాలీ జవాబు చెప్పినందుకు అతన్నీ మన్నించు. మమ్మలందరినీ మన్నించు. విజయమా! ఆషిరాలీని ముద్దుపెట్టుకొని కౌగలించుకొన్నప్పుడు; ఆ క్షణంలో జైనాక్, మసల్ బెక్, కాసీమ్, సువన్ కూల్ నీ తలుచుకొని, వీళ్లెవ్వరూ తిరిగిరారు కదా, అనుకొన్నాను. నన్ను క్షమించు. ఓ విజయమా!” రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ సాధించిన విజయం వెనుక ఉన్న దేశ ఉమ్మడి త్యాగం, దుఃఖాలకు వ్యంగ్య విషాద వ్యక్తీకరణ ఇది. ఆక్రమణ కాంక్షతో, వ్యాపారాభివృద్ధి కోసం చేసే యుద్ధాలకూ; స్వయంరక్షక, దేశభక్తియుత యుద్ధాలకూ ఉండే వ్యత్యాసాన్ని ఎక్కడికక్కడ నవలలో చెబుతూ వచ్చినప్పటికీ- యుద్ధ బీభత్సాన్ని, భౌతికంగా అనుభవించిన ప్రజల ఆక్రోశాన్ని కూడా అతి సాంద్రతతో వ్యక్తీకరించారు. ఆ ఆక్రోశ వ్యక్తీకరణకు రాజకీయ ఉద్దేశ్యం లేకపోతే తప్పు పట్టలేమనిపిస్తుంది. కథ అక్కడి దాకా వచ్చిన తరువాత ఆ వ్యంగ్యం అత్యంత సహజంగా అక్కడ యిమిడి పోయింది. ఎందుకంటే ఆ వ్యంగ్యం యుద్ధ విషాదాన్నిఅధికంగా మోసిన తొల్గొనాయ్ కంఠం నుండి వస్తుంది.

తొల్గొనాయ్ కూ, అలిమాన్ కు మధ్య; సాంగత్యం, స్నేహం, ప్రేమాభిమానాల్ని కూడా గొప్పగా చిత్రీకరించారు రచయిత చింగీజ్ ఐత్ మాతొవ్. అసలు తల్లీ కొడుకుల మధ్యా, తండ్రీ కొడుకుల మధ్యా, అత్తా కోడళ్ల మధ్యా, ఇరుగుపొరుగుల మధ్యా, ఒక అనాధకూ ఊరికీ మధ్యా, ఊరి పోస్ట్ మాన్ కూ ప్రజలకూ మధ్యా, వివిధ సమూహాల జనాల మధ్యా ఉండే సద్భావనలను సజీవంగా రాశారు రచయిత. అలిమాన్ తన కొడుకు కాసీమ్ ను ప్రేమించిన విధానం తొల్గొనాయ్ కు ఎంతో ఇష్టమౌతుంది. కలిసి పని చేయడంలో కూడా ప్రేమాభిమానాల్ని అనుభవించే కాలం అది. తొల్గొనాయ్ కోడలితో కలిసి పని చేసేది. ఒక రోజు కోడలు, అడవి పూబెండ పూలు గుత్తిగా చేసి కొడుకు కాసిమ్ కంబైన్ మెట్టు మీద ఉంచి రావటం చూసి; కొడుకు మీద ఆమె ప్రేమకు, ఆమెకు మనసులోనే ధన్యవాదాలు తెలుపుకొంటుంది. ‘అతని దాహం తీర్చి వస్తాను’ అని అలిమన్ ఒక కూజాతో శీతల పానీయాన్ని తీసుకొని కాసీమ్ దగ్గరకు వెళుతుంటే తను కూడా సువన్ కూల్ దాహం తీర్చాలని అతని కోసం చూస్తుంది తొల్గొనాయ్. “…మొగుణ్ణి ఇంతగా వలచిన పెళ్లాన్ని దీన్నే చూశాను,” అనుకొని మురిసిపోతుంది. కాసీమ్ యుద్ధానికి వెళ్లే సమయంలో అలిమాన్ పడే వేదనను సాటి స్త్రీగా పూర్తిగా అర్థం చేసుకొంటుంది. “కానీ యుద్ధంలాంటి కష్టకాలంలో తోడి మనిషితో నిలబడకుండా ఎవరు ఉండగలరు? అలిమాన్ ఆ విషయాన్ని అర్థం చేసుకొన్నది,” అని అనుకొంటుంది. ఇద్దరి భర్తల మరణ వార్త ఒకేసారి వస్తుంది. కష్టాలలో, సుఖాలలో ఇద్దరూ కలిసే వుంటారు. మసల్ బెక్ మరణం తొల్గొనాయ్ ను మరింత క్రుంగదీస్తే అలిమాన్ వలనే కోలుకోగలుగుతుంది. జైనాక్ చనిపోలేదనీ, తిరిగి వస్తాడనీ తొల్గొనాయ్ కు ఆశ కలిగిస్తుంది అలిమాన్. ఒక రకంగా అన్నీ కోల్పోయిన తొల్గొనాయ్ కు బతుకు ఇచ్ఛ కలిగించింది తోటి ప్రజలు, అలిమాన్ లే. యుద్ధం ఎంత క్రూరమైనదైనా మనుషుల మధ్య ఉండే సంబంధాలకు అది గండి కొట్టలేదు, ఇంకాస్త బలపరుస్తుంది అని చెప్పటానికి రుజువులు తొల్గొనాయ్, అలిమాన్ లు. అలిమాన్ మరణం, తొల్గొనాయ్ జీవితంలో భరించలేని దుఃఖాన్ని కలగచేస్తుంది. భౌతికంగా తన కడుపున పుట్టిన పిల్లల మరణం కంటే అలిమాన్ మరణం ఆమెను మరింతగా కుంగదీస్తుంది.

కథ చివర్లో కంబైన్ మిషన్ ఆపరేటర్ గా చేరిన మనవడు జన్ బోలెత్ చేతితో పొలంలో మళ్లీ రొట్టె ముక్క తింటూ “రొట్టె అజరామరం, జీవితం కూడా అజరామరం, శ్రమ కూడా అజరామరం,” అనుకొంటుంది తొల్గొనాయ్. అవును శ్రమే వారిని బతికించింది. తిండిపెట్టటం వల్లనే కాదు శ్రమ వాళ్లను బతికించింది, అవిరామ శ్రమ చేయటం వలనే వాళ్లు యుద్ధ కష్టాలను అర్థం చేసుకొన్నారు. ఓర్చుకొన్నారు. యుద్ధానికి బయట ఇంకో భారీ యుద్ధం చేయగలిగారు. శ్రమ చేయటంలోనే ఆ నాటి ప్రజలు తమ బాధలను మర్చిపోగలిగారు. శ్రమే ఆయా దేశాలను శిథిలాల నుండి పునర్నిర్మించింది. ఆ నాటి సోవియట్ విప్లవం, యుద్ధం, పునర్నిర్మాణం – వీటన్నిటిలో మానవ శ్రమే విజయం పొందింది.

ఈ రోజు యుద్ధాల రూపం మారిపోయింది. యుద్ధాలిప్పుడు అంతర్యుద్ధాలుగా రూపం మార్చుకొన్నాయి. కొండా, కోన, చెట్టు, వాగు, భూమీ, భూమిలోని మట్టీ, వాటి పొరల్లో ఖనిజాల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలలో లక్షలాది తొల్గొనాయ్ లు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కడుపుకోతను కసిగా మార్చుకొంటున్నారు. ఈ యుద్ధాలు కూడా దేశభక్త యుద్ధాలే. సైనికులు దేశపు అంచులో నిలబడి చేసే యుద్ధాల కంటే, కాళ్ల కింద భూమిని రక్షించుకోవటానికి ఈ సైనికులు చేస్తున్న యుద్ధం ఉత్తమమైనది. బహుశా తొల్గొనాయ్ కొడుకులూ, భర్తలాంటి వాళ్లు ఆ ప్రపంచ యుద్ధంలో పోరాడకపోయి ఉన్నట్లైతే; వాళ్లూ, వాళ్ల తరువాత తరాల వాళ్లూ సోవియట్ లో నిత్యం యుద్ధాలు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. మనిషి జీవితంలో యుద్ధం అనివార్యం కాని రోజు కోసం యుద్ధం చేయమని తొల్గొనాయ్ ‘తల్లి భూదేవి’ నవల ద్వారా ప్రపంచానికి సందేశాన్ని పంపించింది.

(ఈ వ్యాసం ఏప్రిల్ 2017 మాతృకలో ‘వెలుతురు పిట్టలు’ శీర్షిక కింద ప్రచురితం అయ్యింది)