ట్యాగులు

, , , , , , ,

 

ఆలీఘర్ లో అమ్మ యవ్వనం, యోగీ ఆధిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ కు పూర్తిగా భిన్నం. -సమీరా బోస్ 

(ఆన్ లైన్ మాగజైన్ లేడీస్ ఫింగర్స్ నుండి స్వేచ్ఛానువాదం – రమాసుందరి)

మా కుటుంబం అంతా టీవి ముందు కూర్చొని యాంటీ రోమియో దళాల ప్రటనలను చూస్తూ హతాసులమై పోతుండగా, 48 ఏళ్ల మా అమ్మ, హాఠాత్తుగా అదృశ్యమై ఒక ఫోటోను వెలికి తీసి, మా వద్దకు తీసుకొని వచ్చింది. ఆమె ఆ ఫోటోను మా కళ్ల ముందు ఆడించింది. అందులో యితరులతో బాటు మా అమ్మ, తన 19 ఏళ్ల వయస్సులో, ఇద్దరి అబ్బాయిల మీద చేతుల వేసి కూర్చోన్న దృశ్యం కనబడింది. “దీన్ని గురించి ‘వాళ్లు’ ఇప్పుడు ఏమంటారో, మరీ ముఖ్యంగా నా నేపధ్యం తెలిస్తే…” అని వెక్కిరించింది

మా అమ్మకు పెళ్ళికి ముందు ‘చౌధురి’ అనే ఇంటి పేరు ఉండేది. ఆమె 1970-80ల మధ్య ఆలీఘర్ లో, పది మంది సభ్యులున్న తన కుటుంబంతో గడిపింది. లేడీ ఫాతిమా స్కూల్లో, ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఆమె చదువు సాగింది. అసలు ఆలీఘర్ పట్టణం ఆలీఘర్ యూనివర్సిటీ వలనే పేరు తెచ్చుకొన్నది. ఇంకా తాళాల పరిశ్రమల వలన కూడా ఆలీఘర్ కు ఆ పేరు వచ్చింది. దేశ విభజనకు ముందు నుండీ అక్కడ మెజారిటీగా ఉండే ముస్లిం జనాభా ఉనికి వలన ఆ పట్టణంలో ఒక సాంస్కృతిక కలనేత, పరస్పరాధార వాతావరణం ఉండేది. ఉదాహరణకు తాళాల పరిశ్రమ ఉత్పత్తిలోని వివిధ దశల్లో, రెండు మతాల వ్యక్తుల క్రియాశీలక పాత్ర అవసరం అయ్యేది. ఆర్ధిక చట్రంలో అలా కొనసాగుతుండగా – ఆలీఘర్ లో తన యింటి గురించీ, యవ్వనం గురించీ అమ్మ చెప్పే స్మృతులు, సాంస్కృతిక కలయికల చట్రంలోనికి వ్యాపించి సాక్షాత్కరించేవి.

యోగీ ఆదిత్యనాథ్ సిఎం కాగానే చేసిన మొదటి పని జంతు వధశాలల భరతం పట్టటం. ఆ పనికి ఉన్న రాజకీయ ఉద్దేశ్యాలను నిస్సంకోసంగా వెల్లడించటం. ఆహారం తీసుకోవడం ఇప్పుడు హిందూ పై కులాల నైతికనీతినీ, నిర్ధారిత ఉనికినీ ప్రదర్శించే రంగంగా మారింది. ఈ విషయం నాకు; మా అమ్మ ఎప్పుడూ ఆమె వంటగదీ, తన స్నేహితులు అందులో ఎలా వాళ్ల ఆహారాన్నిఒకరికొకరు ఎలా పంచుకొనే వారో చెప్పటాన్నీ గుర్తుకు తీసుకొస్తుంది. మా అమ్మమ్మ తన హిందూ స్నేహితుల కోసం పొద్దున్నే ఉల్లిపాయా, చిన్నుల్లీ లేని సాత్వికాహారాన్ని వండేదట. మిగతా వాళ్ల కోసం మాంసాన్ని సాయంకాలం వండేదట. అందరూ ఒక దగ్గర కూర్చొని తినేవాళ్లు. రొట్టెలు ఒక డజన్ మంది కలిసి చేసేవాళ్లు. తంబోల ఆటతో పాటు తినటానికి యువకులు టన్నులకొద్దీ కబాబులు తెచ్చుకొంటే, మా అమ్మమ్మ వాళ్ల సరదా తీరేవరకు ఓపిగ్గా వేచి ఉండి, ఆమె కాయగూరల వంటకాన్ని సంభ్రమాశ్చర్యాల మధ్య ప్రవేశపెట్టేది. పస్తులు ఉంటూ, తిండికి అల్లాడుతున్న హాస్టలర్స్ కు అమ్మమ్మ తన అద్భుతమైన వంటతో ఇఫ్తార్ వంటకత్తెగా అలరించేది. దుష్ట సైనికులుగా పిలవబడే ముస్లిం పిల్లలు ఆమె ఇంట్లోకి దూరి ఉపవాసాన్ని ముగించేవారు. వీళ్లే మళ్లీ అమ్మ ఆంగ్లో ఇండియన్ కాథలిక్ స్నేహితురాలి ఇంట్లో, ఆమె డైనింగ్ టేబుల్ దగ్గర కనబడేవారు. ఆమె మూర్ఖపు తండ్రి భోజనానికి ముందు ప్రార్ధన చేయాలంటే రహస్యంగా ఒకరినొకరు చూసుకొనే వాళ్లు. అయితే వాళ్లకు ఎప్పుడూ రుచికరమైన ప్లమ్ కేకు డిజర్ట్ గా దొరికేది.

సుబుహు అనుజాతో

అమ్మకు ప్రియ స్నేహితురాళ్లు సుబుహీ అన్సారీ, శుభీ ఉపాధ్యాయ, గ్రేట పెడ్రో. ఈ విభిన్నమతాల త్రయం వినడానికి ఒక ముడిలాగా అనిపించినా, వారి మధ్య ఒక అత్యంత బలమైన బంధం ఉండేది. సుబుహీ పిన్ని అమ్మకు చిన్న అమ్మవారు పోసినప్పటి సంగతి గురించి ఈ మధ్యే చెప్పింది. ఆమె పరీక్షకు కూర్చోలేక ఆ సెషన్ ఫైల్ అయ్యే పరిస్థితులు వచ్చినపుడు, మీర్జాపూర్ నుండి వచ్చీ హాస్టల్ లో ఉంటున్న, సున్నీ ముస్లిం స్నేహితురాలైన సుబుహీ పిన్ని తను కూడా పరీక్ష మానేసి అమ్మ గురించి శ్రద్ధ తీసుకొన్నది. అమ్మను ఒంటరిగా వదలటం ఇష్టం లేక ఆమె ఆ పని చేసింది. అప్పుడు పిన్నికి కూడా చికెన్ ఫాక్స్ వచ్చింది. “అప్పుడు అలాగే ఉండేది. అనుజ కోసం ఏమైనా చేసేదాన్ని” అంటుందావిడ. స్నేహం ద్వారా భిన్న సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ; సుభీ, సుబుహీ- ఇద్దరూ వాళ్ల కులాల్లోనే, మతాల్లోనే పెళ్లిళ్లు చేసుకొన్నారు. ఆడవాళ్లు ఆయా అస్తిత్వ రాజకీయాలనూ; వంశపారంపర్య బాధ్యతల బరువునూ ఎలా మోస్తారో అని ఆశ్చర్యంగా ఉంటుంది.

ముక్తీ హుస్సైన్

ఈ చట్రంలో తీవ్రమైన ఉల్లంఘన చౌధురీ కుటుంబం నుండే వచ్చింది. మా అమ్మ పెద్దక్క ‘ముక్తి’, ముస్లిం మతంలోకి మారటానికి నిర్ణయం తీసుకొన్నది. ఈ నిర్ణయం 1980లో, ఆమె ఖుర్జా నుండి వచ్చిన ఆలీఘర్ యూనివర్సిటీ విద్యార్ధి సాజిద్ హుస్సేన్ ను చేసుకోవాలనుకొన్నప్పుడు జరిగింది. తరువాత ఆమె ఎక్కువ కాలం నైజీరియాలోనూ, సౌదీ అరేబియాలోనూ గడిపినప్పటికీ; నేనెప్పుడూ ఆమె వివాహ కాలం నాటి స్పందనలు చెప్పమని పోరుపెట్టేదాన్ని. ఆమె తన తల్లిదండ్రులు తనకు మద్దతుగానే ఉండేవాళ్లనీ, ఆమె నాయనమ్మ మాత్రం ‘అటు ఇటు కాని’ స్థితిలో నెట్టబడతాననీ వార్నింగ్ ఇచ్చేదనీ చెప్పింది. “నిజానికి ఆ కాలంలో అదో పెద్ద విషయం కాదు” పెద్దమ్మ నొక్కి చెప్పింది. “ఇపుడవి పెద్ద విషయాలు ఎందుకు అయ్యాయంటే, అధికారంలో ఉన్నవాళ్లు అలా కావాలని కోరుకొంటున్నారు కాబట్టి” అని చెప్పింది. ఈ భూగోళ పర్యాటక పెద్దమ్మ వలన ఆ యిల్లు ఇరాక్, ఇరాన్, సూడాన్, పాలస్తీన్ విద్యార్ధులతో నిండిపోయేది. అందువలన ఆ కుటుంబం ప్రపంచ రాజకీయాలను నేర్చుకోవటానికీ, ఇస్లాం మతం ఇతర దేశాల్లో ఎలా పని చేస్తుందో తెలుసుకోవటానికీ వీలు అయ్యింది. నిజానికి పాలస్తీనా సంగతి ఇతర విద్యార్ధుల నుండి తెలుసుకొన్న తరువాతే మా పెద్దమ్మ అరాఫత్ ను కలిసింది. (అది వేరే కథ)

అలాగని మత నిబంధనలూ, మత అస్థిత్వాలు అప్పుడు లేవని కావు. మత పగ కాంపస్ లో వ్యాపించి ఉండేది. అయితే ఈ స్నేహ బృందం ఆ పగ సెగ తగలకుండా ఉండటానికి మార్గాలు సామూహికంగా వెతుక్కొనేవాళ్లు. తెల్లవారు ఝామున 1 గంటకు వాళ్లు ఆలీఘర్ గ్రౌండ్స్ లో వేగంగా నడిచేవాళ్లు. ఇస్మత్ “మేము అమాయకులం. మేము తిరుగుబాటుదారులం కాదు” అనే నాటిక ప్రదర్శించేటపుడు అమ్మ కుచ్చుల చొక్కా తొడుక్కోవాలని పట్టుబట్టేవాడు. నేను వారి యవ్వన ధిక్కారాన్ని పొగిడినప్పుడల్లా అమ్మ ఈ విషయం చెప్పేది.

మా అమ్మ, వారి కుటుంబం ఎప్పుడూ ప్రత్యక్షంగా మత కల్లోలాల హింసకు గురి కాలేదు. ఆ అదృష్టం వారికి కలిగింది. మత విలువలు నాకు నా కుటుంబ సభ్యుల నుండి అందలేదు. మతాతీత నమ్మకం కూడా ఒకటి ఉంటుంది. అందులో ఒక తర్కం పని చేస్తుందనుకొంటాను. వారసత్వంగా వచ్చిన ఆ నమ్మకంలోని సారాంశాన్ని వారు ఇప్పటికీ ఎత్తిపట్టే ఉన్నారు. కానీ వారు ఆ నమ్మకాన్ని పంచి యిచ్చిన ఆవరణాలు ఇప్పుడు వెనుకబడి ఉన్నాయి. వర్గ, కుల పరంగా ఆధిక్యత కలిగి ఉన్న ఆ ఆవరణాల నుండే యోగీ ఆధిత్యనాథ్ లాంటి వారు చేస్తున్న ద్వేషపూరిత చొరబాటులను సహనంతోనూ, సంభాషణతోనూ తిప్పిగొట్టవచ్చు. ఆలీఘర్ లో ఉండే సామాజిక కలనేత మత సహకారంతో నిలిస్తే, ద్వేషపూరిత ఆదేశాలు పైపైన తేలిపోతాయి.

మిస్గిల్ కాంపౌండ్ లో ఉన్న మా అమ్మమ్మ యిల్లు బలహీనపడుతోంది. ఆ అమ్మమ్మ స్నేహిత బృందం ఎవరికి వారు వెళ్లిపోయారు. అమ్మమ్మ ఒక్కతే అయిపోయింది. ఆలీఘర్ తో నా బంధం పలుచన అయిపోతుంది. అయినా, మా అమ్మ యవ్వనంలోని ఈ ముఖ్య సంగతులను తవ్వటం వలన, నన్ను నేను సంప్రదించుకొంటున్నాను. ఎక్కడైతే కలిసి జీవించటం మామూలుగా ఉంటుందో; ఎక్కడైతే ఒకే హాల్, లైట్లూ -ఈద్ కూ, క్రిస్టమస్ కూ, దీపావళికీ ఉమ్మడిగా వాడతారో, ఆ కమ్మటి ఊహాతో సంప్రదించుకొంటున్నాను. అమ్మమ్మ స్నేహితులతో బెద్మీ పూరీ, కకొరి కబాబ్ రెండూ తింటాను నేను. కాబట్టే అధికార చారిత్రిక కలహాల మధ్యనా, కావాలని చేస్తున్న ప్రచారాల మధ్యనా… మా అమ్మమ్మ స్నేహితుల నుండి వస్తున్నఈ నోటి సంగతులు చిన్న స్థాయిలోనైనా అధికారిక చరిత్ర పట్ల అసమ్మతిని మనకు తెలియచేస్తాయి.