ట్యాగులు

, , ,

నక్సల్బరీ వసంతకాల మేఘ గర్జన.

ఆ గర్జన ఉధృత ధ్వని మా గొంతులదే

ఆ వెలుగు తీవ్రత మా కంటి ఎర్ర జీరలే

మండిన పొలాల్లో వేడి కొడవళ్లం

దోపీడీ దౌర్జన్యాలపై వాడి బాణాలం

అమరత్వంలో అర్ధ భాగం మాదయినపుడు

విప్లవ వారసత్వానికి హక్కుదార్లం మేం కూడా అవుతాం

నక్సల్బరీ సందర్భం స్త్రీ పురుష వివక్ష గురించి చెప్పే విడి సందర్భం కాక పోవచ్చు. ఎందుకంటే ఆ ఉద్యమం ఆనాటి స్త్రీ పురుషులకు ఇద్దరికీ అవసరమైనది. అయితే నక్సల్బరీనీ గుర్తుకు తెచ్చుకొనేటపుడు అందులో మహిళల పాత్రను విస్మరించటం మాత్రం తప్పక వివక్ష అవుతుంది. ఎందుకంటే నక్సల్బరీ పోరాటంలో పాల్గొన్న రైతాంగంలో నలభై శాతం మహిళలే. నక్సల్బరీ పోరాట ప్రారంభంలో ప్రాణత్యాగం చేసింది ఆరుగురు మహిళలే.

మహిళా ఉద్యమాలలో ఏవైనా రికార్డులలో ఎక్కినవి ఉన్నాయి అంటే అవి ఉన్నత కులాల, ధనిక వర్గ మహిళల విషయాలే. స్వాతంత్ర్య ఉద్యమంలో సరోజినీ నాయుడు వంటి మహిళల గురించి మాత్రమే పుస్తకాల్లో ఉంటాయి. కానీ సాధారణ దళిత, రైతాంగ, శ్రామిక వర్గ మహిళల గురించిన చరిత్ర, చరిత్ర పుటల్లో మరుగున పడిపోయి ఉంటుంది. వారు పోలీసుల అణచివేతను ఎదుర్కొన్న తీరు, సామాజికంగా వారు అనుభవించిన వివక్ష, ఉద్యమాలలో పాల్గొనటానికి వాళ్లు రెండింతల భారాన్ని మోయవలసి రావటం వంటి సంగతులు ఎక్కడా నమోదు కాలేదు. చరిత్రలో ఈ దాచేసిన కోణాలను వెలికి తీసి ఈ మహిళల ధైర్య సాహసాలను వెల్లడి చేయాల్సిన బాధ్యత మహిళా ఉద్యమకారులకే ఉంటుంది.

ప్రజా పోరాటాలు, ఉద్యమాలలో మహిళల భాగస్వామ్యం గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. రాస్తూనే ఉండాలి. మాట్లాడటం మానేస్తే మహిళల ఉద్యమ ఉనికి మరుగున పడుతుంది. రాయటం మానేస్తే చరిత్రలో వారి పాత్ర అదృశ్యమౌతుంది. లిఖిత చరితలు రాక ముందు ఏమి జరిగిందో ప్రపంచానికి తెలియదు. మౌఖిక ప్రచారంలో అక్కడక్కడ వారి ప్రస్తావన ఉన్నప్పటికీ అది కేవలం రాణుల, దేవతా మూర్తుల; వీర, భక్త స్తోత్రాలు మాత్రమే. చరిత్రను వర్గ పోరాటాల చరిత్రగా చూసినపుడు బానిస తిరుగుబాటు కాలం నుండి మహిళలు వర్గ పోరాటంలో భాగంగానే ఉన్నారు. అయితే ఈ ఉద్యమాల నుండి ఉద్భవించిన నాయకురాళ్ల పేర్లు ఎవరికీ తెలియవు. కారణం చరిత్రలు రాసింది పురుషులు కాబట్టి.

పోరాటంలో పాల్గొని విప్లవాలను సృష్టించిన శ్రామిక మహిళల చరిత్రను అణగారిన ప్రజల చరిత్ర నుండి విడదీసి చూడలేం. చరిత్రలో పయనిస్తూ చూస్తే కేవలం పితృస్వామ్యంపై పోరాటాల ద్వారానో, లేక కేవలం ఆర్థిక వ్యవస్థపై పోరాటాల ద్వారానో మహిళా విముక్తి సాధ్యపడదని రుజువైయ్యింది. మహిళా విముక్తికి రెండు షరతులను అధిగమించాలి. ఒకటి: పితృస్వామ్యానికి వ్యతిరేకంగా చేసే మహిళల ఉద్యమం విప్లవోద్యమంలో భాగం తప్పక అయ్యి ఉండాలి. రెండు: విప్లవోద్యమం అన్ని రకాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక దోపిడీలను అణచివేతలను యిముడ్చుకోగలగాలి. ఈ రెండు షరతులను ప్రస్ఫుటంగా ముందుకు తీసుకొని వచ్చింది నక్సల్ బరీ పోరాటం. పితృసామ్య దోపిడీ సమాజంలో వ్యవస్థీకృతం అయినపుడు; సామ్రాజ్యవాదులకూ, కాంప్రడార్లకూ, భూస్వాములకూ పితృస్వామ్యం ఒక పనిముట్టుగా ఉపయోగపడుతున్నప్పుడు; దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం తప్పక ఆ శక్తులకు కూలవేసే నూతన ప్రజాస్వామిక విప్లవం అయి తీరాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం చేసే పోరాటాలు పితృస్వామ్యం నుండి మహిళా విముక్తికి కొత్త ద్వారాలు తెరుస్తాయి. అలాగే పితృస్వామ్యానికి వ్యతిరేకంగా చేసే పోరాటాలు నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని బలపరుస్తాయి. రెండు అనుభవాలను ఆనాటి పోరాటంలో పాల్గొన్న ఆదివాసీ మహిళలు పొంది ఉండాలి.

ఈ పోరాటంలో భాగంగానే అందులో అంతర్భాగంగా ఉన్న పితృస్వామ్యాన్ని వారు ఎదుర్కొన్నారు. సమాజంలోనూ, తమలో కూడా నిబిడీకృతమైన పితృస్వామ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు మహిళలు. మహిళలు సాయుధ చర్యల్లో భాగస్వాములు అవటానికి ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. పోరాటలలో మహిళలు పాల్గొనటానికి అంగీకరించినప్పటికీ నాయకత్వ బాధ్యతలు అంత తొందరగా ఏమీ రాలేదు. మహిళలను తీర్చిదిద్దిన వాళ్లతోనే, పితృ వాత్యల్యంతో చూపించే వారితోనే ఆ పోరాటం వారు చేయాల్సి వచ్చింది. ఈ పితృస్వామ్య ధోరణులను మహిళలు మొదట్లో సైద్ధాంతికంగా కంటే తమ ఆచరణ ద్వారానే ఎదుర్కొన్నారు. విప్లవ రంగంలో మహిళలు ప్రదర్శించిన స్థైర్యం, సాహసం, త్యాగం వారిని తిరస్కరించలేని స్థితిలో నిలబెట్టాయి.

నక్సల్బరీ పోరాటం ప్రారంభం కావటానికి ముందు అక్కడ స్త్రీలపై భూస్వాముల నుండి క్రూరమైన లైంగిక పీడన ఉండేది. భూస్వామి తన భార్యను చెరపట్టగా ఒక నిస్సహాయ, నిరాయుధ రైతు తనను ‘వాడి మీద చర్య తీసుకోరా?’ అని అభ్యర్థించినట్లు చారుమజుందార్ ఒక దగ్గర రాశారు. ఆదివాసీ గృహాల్లో ఉండే అసమాన పని పంపకం; పిల్లల, వృద్ధుల సంరక్షణ మహిళలను ఎప్పుడూ పని వత్తిడిలో ఉంచేది. నీళ్లు దూర ప్రాంతాల నుండి మోసుకొని రావటం, కట్టెలు కొట్టుకొని తెచ్చుకోవటం కూడా మహిళల పనిలో భాగంగానే ఉండేది. ఒళ్లు విరిచే గృహశ్రమలో పాలు పంచుకొంటూనే మహిళలు భూపోరాటాలలో పాల్గొన్నారు. ఆ పోరాట చైతన్యం, తరువాత కాలంలో వారిని తమ హక్కులను ప్రశ్నించేటట్లు చేసింది.

ఇరవై బిగాల నేల కోసం

నక్సల్బరీకి ముందు జరిగిన భూపోరాటాల్లో కూడా మహిళలు కీలక పాత్ర పోషించారు. నక్సల్బరీ వెల్లువకు ముందు నుండే మహిళలు రైతాంగ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు. వారిలో గాలేశ్వరి దేవి ఒకరు. 1955 నుండి ఆమె కర్షక్ సమితిలో పని చేసేది. అప్పటి నుండి ఆమె జీవించి ఉన్నంత కాలం వరకూ; రౌడీలకూ, భూస్వాములకూ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండింది. ఆమెకు 20 బిగాల పొలం ఉండేది. ఆ భూమిని నిలుపుకోవటానికి ఆమె సిల్ గురిలోని ‘తింకడి కుండు’ అనే భూస్వామితో తలపడాల్సి వచ్చేది. పోలీసుల వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. హతిఘిసా కర్షక్ సమితి నాయకురాలిగా ఆమె ఎన్నో నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నది. ఆమె నాయకత్వం వహిస్తుందని తెలిసి ఒక రోజు పోలీసులు ఆమెను అరెస్టు చేయటానికి వచ్చారు. గాలేశ్వరి పొడుగ్గా, బక్కపలుచగా, పొట్టి జుట్టుతో ఉండేది. మహిళలంతా ఆమెకు ధోతి తొడిగించి మగ వేషం వేయించారు. ఆమె పోలీసుల ముందు నుండే నడుచుకొంటూ వెళ్లిపోయింది.

నక్సల్బరీలో ఎక్కువగా పాల్గొన్నవారు సంతాల్ మహిళలు. వారితో పాటు ఇతర తెగల, కులాల మహిళలు కూడా ఎంతో ఉత్తేజంతో పాల్గొన్నారు. ఒక రోజు జిల్లా కేంద్రమైన సిల్ గురిలో మహిళలు పెద్ద ప్రదర్శన చేశారు. నాబా బౌరి అనే మహిళను పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఆగ్రహోద్రిక్తులైన మహిళలు పోలీసులతో వాగ్వివాదానికి దిగి ఆమెను విడిపించుకొన్నారు. పోరాటప్రాంతాల్లో జరిగే రహస్య సమావేశాల్లోనూ, ప్రదర్శనల్లోనూ, పోలీసులు గాలింపు చర్యలను నిర్వహిస్తున్నప్పుడు వార్తలను ఒక దగ్గర నుండి వేరే చోటకు అందించటంలోనూ మహిళల పాత్ర గొప్పది. పోరాటకాలమంతటిలోనూ మహిళలు నిబద్ధతతో పాల్గొన్నారు. ఉత్తర బెంగాల్ ప్రాతంలో గెరిల్లా దళాల్లో పని చేసేవారు. బీర్భూమ్ జిల్లాల్లో సాయుధ దళాల ఊరేగింపులకు ఆర్గనైజర్స్ గా ఉన్నారు.

శాంతి ముండా, లీలా మజుందార్ (చారు మజుందార్ భార్య) లాంటి నాయకురాళ్లు అప్పట్లో యాక్టివ్ గా పని చేసేవారు. వీళ్లు మొదట సిపిఐలోని మహిళా విభాగంలో క్రియాశీలక కార్యకర్తలు. జంగల్ సంతాల్, బాబూలాల్ బిశ్వకర్మోకార్ ల తల్లులూ; ఇంకా బర్కీ దేవి, గాలేశ్వరీ తారు లాంటి వారు విప్లవ మహిళా సంఘంలో పని చేసేవారు. వీళ్లంతా ఊరేగింపుగా ఎర్ర జండాలు పట్టుకొని ప్రచారానికి తిరిగేవారు. భర్తలు రక్షణ కోసం అడవుల్లో దాక్కొని ఉంటే మహిళలు ఇళ్లల్లో, పొలాల్లో పని చేసుకొంటూ భర్తలకు సమాచారం యిచ్చేవారు. ఆహారాన్ని అందించేవారు. భూస్వాముల గుండాల దాడుల నుండి రక్షించుకోవటానికి యువతులు ఆయుధాలు పట్టుకొని తిరిగేవారు.

మండుతున్న నక్సల్బరీ పొలాలు తమ ఆరుగురు కూతుళ్లకోసం రోదించాయి (మే 25,1967)

అంతకు ముందు రోజు భూమి కోసం పోరాడుతున్న వందలాది రైతులు, టీ తోట కార్మికులు కలిసి ఒక వాంగ్డే అనే పోలీసును చంపేశారు. మరుసటి రోజు మహిళా సంఘం కార్యకర్తలు నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మేచి నది వద్ద సమావేశం పెట్టుకొన్నారు. ఇన్ ఫార్మర్స్ ద్వారా విషయం తెలుసుకొన్న పోలీసులు, మహిళలు తిరిగి ప్రసాదోజోటే గ్రామానికి చేరుకొనే సరికి వారి కోసం వేచి చూస్తున్నారు. మగవాళ్లు మహిళలను ముందుకు పెట్టి పోలీసుల మీదకు దాడి చేశారని పోలీసులు కథ చెబుతున్నా, కాను సన్యాల్ చెప్పిన దాని ప్రకారం ఆ కాల్పులు అంతకు ముందు రోజు ఘటనకు ప్రతీకారంగానే పోలీసులు చేశారు. చనిపోయిన వారిలో ఆరుగురు స్త్రీలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు. అమరులైన మహిళల్లో ధనేశ్వరి సింగ్, సానమతి సింగ్, ఫూల్ మతి సింగ్, సురబాల బర్మన్, నాగనేశ్వరి మల్లిక్, సన్ సాయి సాయ్ బని ఉన్నారు. నాగనేశ్వరి దేవిని నయన్ అని కూడా పిలుస్తారు. ఆమె తన బిడ్డను వెనుక కట్టుకొని పోలీసులతో తలపడగా తుపాకి గుండు ఆమె నుండి దూసుకొని వెళ్లి వెనుకనున్న బిడ్డను కూడా చంపేసింది. అలా నయన్ బిడ్డ, నక్సల్బరీ విప్లవంలో చనిపోయిన పిల్లల్లో మొదటిది అయ్యింది. నయన్ ధర్మాల్ కులంలో 1944లో పుట్టింది. తూర్పు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ఒక టీచర్ ను పెళ్లి చేసుకొన్నది. సన్ సాయి సాయ్ బని ఒక ధైర్యవంతురాలయిన ఆదివాసీ బాలిక. ఆ రోజు జరిగిన ప్రదర్శనకు ఆమె నాయకత్వం వహించింది.

ధనేశ్వరి సింగ్ రాజ్ బంసీ తెగకు చెందిన మహిళ. ఆమె కొద్దిగా చదువుకొని నాయకత్వ స్థాయికి ఎదిగింది. దూరపు గ్రామాలకు కూడా ప్రచారానికి ఒంటరిగానే వెళ్లేది. ధనేశ్వరి కొడుకు పబన్ తరువాత ఆ ఘటన గురించి చెబుతూ తుపాకి చప్పుళ్లు విని తాను విల్లు పట్టుకొని పరుగున సంఘటనా స్థలానికి వెళ్లాననీ, అప్పటికే అక్కడ నుండి పోలీసులు నిష్క్రమించారని చెప్పాడు. దారిలో గౌడ్రౌ సైబాని, ఇంకో పిల్లాడు దెబ్బలతో పడిపోయి ఉండటం చూసాడు. “సంఘటనా స్థలంలో ఈశ్వర బౌడి అనే మహిళ పడిపోయి కేకలు పెడుతూ ఉండింది. ఆమె కాలి కింద భాగంలో బుల్లెట్ తగిలి ఉంది. ఆ బుల్లెట్ బయటకు లాగటానికి ప్రయత్నించి విఫలం అయ్యాను. అప్పుడు నేను ఎవరెవరు బతికి ఉన్నారో, ఎవరు చనిపోయారో చూసుకోవాల్సి వచ్చింది. మా అమ్మ ధనేశ్వరి ఓక్ చెట్ల మధ్య చనిపోయి పడి ఉంది. నేను మళ్లీ గ్రామానికి వచ్చి ఒక గుడ్డ ముక్క సంపాదించి వెళ్లి ఆమె శవానికి చుట్టాను. అంతకంటే నేను ఆమెకు ఏమీ చేయలేక పోయాను. నా పేరు మీద కూడా అరెస్టు వారంట్ ఉండింది. నేను అక్కడ నుండి వెంటనే నేను నిష్క్రమించాల్సి వచ్చింది. మరుసటి రోజు పోలీసులు వచ్చారని తెలిసింది. గాయపడిన ప్రతి ఒక్కరినీ వారు అరెస్టు చేశారు. మా అమ్మ శవాన్ని ఏమి చేశారో నాకు తెలియదు. దాన్ని కాల్చివేశారో, లేక నదిలో వదిలి వేశారో కూడా తెలియదు,” అని చెప్పాడు. ఆ ప్రాంతంలో ఇప్పటికీ అమరులైన వారి పేర్లు పాలరాతి ఫలకం మీద చెక్కి ఉన్నాయి. అలా తొలి కమ్యూనిష్టు విప్లవ పోరాటంలో అమరులైన మహిళలు శిలా ఫలకం మీదనూ, విప్లవ స్వాప్నికుల హృదయాల్లోనూ మిగిలిపోయారు.