ట్యాగులు

248102-harassed-woman-rnaకొన్ని విషయాలు వింటుంటే పక పకా నవ్వాలని అనిపిస్తుంది. నలభై ఏళ్ళ క్రితం ఐక్యరాజ్య సమితికి స్త్రీల సమస్యల మీద శ్రద్ధ పుట్టింది. రాజు తలుచుకొంటే దెబ్బలకు కొరవా అన్నట్లు సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి తలుచుకొంటే జరగనిదేమిటి? లైంగిక సమానత్వం కొరకు, మహిళా సాధికారిత కోసం ఐక్యరాజ్య సమితీలో ఒక విభాగం ఏర్పడింది. దాని ఆధ్వర్యంలో కొన్ని అంతర్జాతీయ సదస్సులు జరగాలని నిర్ణయం జరిగింది. కోట్ల డబ్బు ఖర్చు అయ్యింది. 1975 లో మెక్సికోలోనూ, 80లో కోపెన్ హాగెన్ లోనూ, 85లో నైరోబిలోనూ తరువాత పదేళ్ళకు 1995 లో బీజింగ్ లోనూ సదస్సులు అట్టహాసంగా జరిగాయి. చివరిగా జరిగిన బీజింగ్ సదస్సులో 174 దేశాలు పాల్గొన్నాయి. మన ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా చాలా మంది మహిళలు అందులో పాల్గొన్నారు. బీజింగ్ డిక్లరేషన్ పేరు మీద 38 పాయింట్ల ప్రకటన విడుదల చేశారు. అందులో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన ఈ బీజింగ్ సదస్సు ఒక ప్రకటన చేసి దానికి సంబంధించిన ఆచరణ కార్యక్రమం ఇచ్చింది. స్త్రీలు – పేదరికం, స్త్రీలు – ఆరోగ్యం, స్త్రీలు- ఆర్ధికం, మహిళలు – సాధికారత, మహిళల మానవహక్కులు, మహిళలు – మీడియా, మహిళలు – పర్యావరణం, ఆడ పిల్ల … వీటన్నిటితో బాటు మహిళలపై జరుగుతున్నహింస, మహిళలు – సాయుధ ఘర్షణలు అనే కీలక అంశాల మీద కూడా చర్చచేసి ప్రకటన చేసింది. ఈ ప్రకటన మీద సంతకాలు చేసిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. అంటే ఆ డిక్లరేషన్ ను ఒప్పుకొని వారిచ్చిన కార్యక్రమాన్నిఆచరించాలని అర్ధం.

ఈ సదస్సు చర్చించిన విషయాలు కూడా ఆషామాషి సంగతులు కావు. ఉదాహరణకు మహిళపై జరుగుతున్న హింస అనే విషయం తీసుకొంటే కుటుంబంలోనూ సమాజంలోనూ స్త్రీల పై జరుగుతున్న రకరకాల హింసలను పేర్కొంది. బలవంతపు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు, బలవంతపు అబార్షన్లు, బలవంతపు కుటుంబనియంత్రణ పద్దతులు దగ్గర నుంచి భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు గురించి కూడా మాట్లాడింది. ఆదివాసీ స్త్రీలు, ఇతరదేశాలకు శరణు కోరిన స్త్రీలు, పని కోసం వలస వచ్చిన స్త్రీలు, మైనారిటీ మతాలకు చెందిన స్త్రీలు, గ్రామీణా మారుమూల ప్రాంతాలలోని నిరుపేద స్త్రీలు, ఆడ పిల్లలు, వృద్ధ స్త్రీలు … ఇలాంటి వారంతా హింసకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. స్త్రీ పురుష సమానత్వానికీ, స్త్రీల అభివృద్ధికి ఈ హింస ప్రతిబంధకంగా ఉంటుందని చెప్పింది. చారిత్రాత్మకంగా స్త్రీ పురుషుల మధ్య ఉండే అసమాన అధికార సంబంధాల వలన ఈ హింస జరుగుతుందనీ, అది స్త్రీల మీద ఆధిపత్యానికి తద్వారా వివక్షకు దారి తీస్తుందని కూడా చెప్పింది. స్త్రీల అక్రమ రవాణాలోనూ, వ్యభిచార వృత్తిలో ఉన్న వారిపై జరుగుతున్నహింసకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అలాగే అవసరమైన కొన్ని చట్టాలు చేసి స్త్రీలను ఈ హింస నుండి బయట వేయాలని కూడా చెప్పింది.

‘మహిళలు – సాయుధ ఘర్షణలు’ అనే అంశం మీద కూడా ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. ఈ విశ్లేషణకు సంబంధించిన ముఖ్య అంశాలు.

1. శాంతి అనివార్యంగా స్త్రీపురుష సమానత్వంతో ముడి పడి ఉంటుంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాలలోనూ విదేశీ ఆక్రమణలు, స్వజాతుల మధ్య తగాదాలు లాంటివి స్త్రీ పురుషలను బాధిస్తున్నాయన్న విషయం ఒక వాస్తవం. అతిక్రమణ జరిగే సంగతులలో అమానవీయమైన శిక్షలు, అదృశ్యాలు, నిరంకుశంగా అదుపులో ఉంచడాలు, ఇంకా అన్ని రకాల జాత్యహంకారాలు, జాతి వివక్షలు, విదేశీ ఆక్రమణలు, విదేశీ భయం, పేదరికం, ఆకలి, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల నిరాకరణ, మత అసహనము, టెర్రరిజం, మహిళల పట్ల వివక్ష ఉన్నాయి. పౌర ప్రాంతాల మీద దాడులను నిరోధించి అంతర్జాతీయ చట్టం తరచుగా అతిక్రమించబడుతుంది. మానవ హక్కులు ఈ సాయుధ తగాదాల సందర్భంగా అతిక్రమణకు గురి అవుతాయి.

2. ఈ సందర్భంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల హక్కులు నిరాకరించబడతాయి. యుద్ద తంత్రాలలో భాగంగా చేసే స్త్రీలపై ఒక పద్దతిలో జరిగే రేపులను తప్పక ఖండించాలి. ఆ నేరస్తులను వెంటనే శిక్షించాలి. ఈ సాయుధ తగాదాలకు మూల కారణాలు వలస పాలనలోనూ రాజ్య, సైనిక అణచివేతలలో ఉంటాయి.

3. జెనీవా సదస్సు మహిళల గౌరవానికి భంగం కలిగించే విషయాలు – ముఖ్యంగా బలవంతపు వ్యభిచారం, రేపులు, అవమానాల నుండి వారిని రక్షించాలని తీర్మానించింది. వియన్నాడిక్లరేషన్ – సాయుధ తగాదాలప్పుడు మహిళల హక్కుల భంగం మానవ హక్కుల భంగం కిందకు వస్తుందని చెప్పింది; అది చివరకు అంతర్జాతీయ హక్కుల చట్టాన్ని అతిక్రమించడంగా అవుతుందని చెప్పింది.

4. స్త్రీలు రాజకీయ అధికారంలో ఉండటం, ఆర్ధిక స్వాలంభన కలిగి ఉండటం వలన శాంతిభద్రతల వచ్చే సమస్యలను పరిష్కరించడం సులభం అవుతుంది.

5. అన్ని సమూహాలు సాయుధ సమస్యల వలన, టెర్రరిజం వలన బాధ పడుతున్నప్పటికీ స్త్రీలు, ఆడపిల్లలు వాళ్ళ సామాజిక స్థానం వలన, సెక్సువాలిటీ వలన ఎక్కువగా బాధ పడతారు. ఘర్షణ పడే వర్గాలు స్త్రీల పై అత్యాచారాలను ఒక యుద్ధతంత్రంగా ఉపయోగిస్తారు.

6. సాయుధ ఘర్షణలను పరిష్కరించేటపుడు అన్ని నిర్ణయాల్లోనూ కార్యక్రమాల్లోనూ ఒక జెండర్ పరస్పెక్టివ్ ను తప్పక ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

స్త్రీల పై జరుగుతున్న రకరకాల హింసలను గుర్తించడంలో ఈ సదస్సు బాగానే వ్యవహరించిందని చెప్పవచ్చు. అలాగే సాయుధ ఘర్షణలు జరిగేటపుడు మహిళల పరిస్థితిని అంచనా వేయటంలోనూ సరైన పంధా తీసుకొన్నది. అయితే ఆ హింసలకు కారణాలు వెదకటంలో యధా ప్రకారం విఫలం అయింది. ఇచ్చిన కార్యక్రమం కూడా ఎంత వరకు దేశాలు అమలు జరిపాయో అజా పజా లేదు. ఇచ్చిన కార్యక్రమాన్ని వివిధ దేశాల్లో అమలు చేయటానికి అవసరమైన నమ్మకమైన యంత్రాంగం లేక పోవటం ఈ వేదికకు ఉన్న ప్రధానమైన ప్రతిబంధకం. ‘పూర్తి కావాల్సిన పని’ చాలా ఉందనీ, చేస్తామని ఒప్పుకోవటానికీ ఆచరించటానికీ మధ్య చాలా అగాధం ఉందనీ .. సాక్ష్యాత్తు ఈ వేదిక బాధ్యులే ఒప్పుకొన్నారు. అభివృద్ధి అంటే ఆర్ధిక అభివృద్ధి ఒక్కటే కాదనీ ఈ ఆర్ధిక అభివృద్ధి ప్రైవేటీకరణ పేరుతో తక్కువ జీతాలు యిచ్చి ప్రభుత్వాలు స్త్రీలను వంచించటానికి దోహదపడుతుందనీ బాగానే వీళ్ళు అన్నారు.

2015లో మళ్ళీ ఇలాంటి సదస్సును బాంకాక్ లో జరపదలిచి మొన్న నవంబర్ లో బీజింగ్ ప్లస్ అంటూ ఒక సన్నాహక సమావేశం జరిపింది. మిగిలిన పసిఫిక్ ఆసియా దేశాలతో బాటు భారతదేశం కూడా ఇందులో పాల్గొన్నది. ఈ సన్నాహాక సమావేశంలో గతంలో బీజింగ్ సదస్సు చేసిన ప్రకటనలు ఎంత వరకు దేశాలు అమలు పరిచాయో, లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకొన్నాయో సమీక్ష జరగాలి. ఇక్కడే ఒక విచిత్రం జరిగింది.

‘అభివృద్ధిలో ఉన్న లైంగిక సమానత్వం, మహిళా సాధికారికత’ అనే అంశం మీద సమీక్ష జరుతుంది. దానికి సంబంధించిన ముసాయిదా పన్నెండవ పేరాలో ఈ విధంగా ఉంది. ‘లైంగిక వివక్ష అనేదే ఒంటరిగానైనా ఉంటుంది. కానీ తరుచుగా ఇతర రూపాల వివక్షలతో కలిపి కూడా ఉంటుంది. వయసు, వంశము, జాతి, మతము లేక నమ్మకము, ఆరోగ్యము, అంగవైకల్యము, వర్గము, కులము, లైంగిక దృక్పధం మరియు సెక్సువల్ ఏకత్వం, హోదా .. ఇలాంటి చాలా అంశాలతో లైంగిక వివక్షత ముడి పడి ఉంటుందని గుర్తించాలి.’ ఈ వాక్యాలకు అర్ధం – పైన చెప్పిన అన్ని అంశాలలో సమానత్వం ఉండి ఉంటే లైంగిక వివక్షత దాని కదే ప్రత్యేకంగా ఉంటుంది. కానీ వివిధ దేశాల్లో వివిధ అంశాలలో ఉన్న రకరకాల అసమానతలు స్త్రీ పురుష అసమానతలతో పెనవేసుకొని ఉంటాయని. భారతదేశంలో ఈ సంగతిని బాగానే గుర్తించవచ్చు. దళితులు ఎదుర్కొంటున్నకుల అణిచివేతతో బాటు దళిత స్త్రీలు అగ్రవర్ణ పురుషుల నుండి వేధింపులను, సెక్సువల్ దాడులను, అవమానాలకు ఎదుర్కొంటున్నారు. ఇక తమ సొంత కులం లో ఉండే పురుషాధిక్యత సంగతి సరే సరి. వెరసి ఇక్కడ స్త్రీ పురుష అసమానత్వానికి ఇక్కడ కులం కూడా దోహదం చేస్తుంది. ఇది భారదేశానికి ఉన్న ప్రత్యేక పరిస్థితి.

ఈ విషయం సదస్సులో పాల్గొన్న భారతదేశానికి అభ్యంతరం అయింది. ఈ పేరాలోని ‘కులం’ అనే పదం తీసివేయాలని దాని స్థానంలో ‘సామాజిక మూలం’ అనే పదం చేర్చాలని ప్రతిపాదించింది.

పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరు చూడలేదనుకొంటుందంట. ఈ ఉపఖండంలో భారతదేశంలోనే ‘కులం’ అనాదిగా ఊడలు దిగి ఉందని తెలుసు. ఇక్కడ ఇప్పటికీ కులం పేరు మీద అణచివేతలు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నాయని తెలుసు. ఖాప్ పంచాయితీల పేరు మీద కులతీర్పులు దర్జాగా ఇస్తున్నారని తెలుసు. ఈ కుల తీర్పులు వారిని ఇళ్ళ నుండి, వాడల నుండి, పనుల నుండి అంతిమంగా ఈ లోకం నుండే వెళ్ళగొడుతున్నాయని ప్రపంచానికంతా తేటతెల్లంగా తెలుసు. ఈ కులం ముందు ఇక్కడి రాజ్యాంగ యంత్రాలన్నీ మోకరిల్లాయనీ అసలు రాజ్యాధికారం కూడా కులమే ప్రసాదిస్తుందనీ తెలుసు. భారతదేశ రాజ్యాంగంలో కులం ఉన్నదనీ, కులం పేరు మీద రిజర్వేషన్లు కొనసాగే పరిస్థితులు ఇంకా ఈ దేశంలో చెక్కు చెదర లేదనీ తెలుసు.

‘సామాజిక మూలం’ అనే పదానికి కులానికి సంబంధించిన ప్రత్యేక లక్షణాలు ఉండవు. ఒక్కో దేశం ప్రజలకు ఒక్కో సామాజిక మూలాలు ఉంటాయి. ఇది ఒక విశాలమైన అర్ధమున్న పదం. ఈ పదాన్ని కులం పదానికి ప్రత్యమ్యాయంగా వాడమని అడగటం అంటే ఇలాటి లక్షణాలు ‘మీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి. మనందరం ఒకటే. మాకేమీ ప్రత్యేకమైన కుల పీడన లేదు.’ అని ప్రపంచ దేశాలతో బుకాయించటమే. ఈ బుకాయింపు భారతదేశంలో ప్రజలు జీవిస్తున్న పరిస్థితుల తాలూకు అందవికార వాస్తవికతను కప్పెట్టటానికే. కులానికి సంబంధించిన పీడన విషయంలో బాధ్యత నుండి తప్పుకోవటానికే.

ఈ సదస్సులో భారరతదేశం చేసిన ఇంకో పెద్ద దబాయింపు ఇక్కడ సాయుధ ఘర్షణల గురించి చేసింది. ఈ దేశంలో సాయుధ ఘర్షణలు లేనే లేవనీ శాంతిభద్రతలతో విరాసిల్లుతుందని. ఆ రకంగా ఆ అంశానికి సంబంధించిన బాధ్యత నుండి కూడా వైదొలగటం.

ఈశాన్య రాష్ట్రాలలో సాయుధ దళాల ప్రత్యేక చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు పదిహేను ఏళ్ళ నుండి నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మిలా తరచుగా మీడియాలో కనిపిస్తుంది. వనరులు, ఆస్తులు, ఆదాయాల కోసం ఈశాన్య రాష్ట్రాలను అక్కడి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో కలుపుకొని ఆ ప్రాంతంలో తీవ్రమైన అశాంతికి గురి చేశారు భారత పాలకులు. ప్రజలలో విస్తృతమైన మద్దతుతో ఏర్పడిన మిలిటెంట్ సంస్థలను అణచటానికి ఈ సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మిలటరీ దళాలు చేసిన అఘాయిత్యాలు ఇన్నీ అన్నీ కావు. ఈ చట్టం వచ్చినప్పటి నుండి 1528 మందిని బూటకపు ఎంకౌంటర్స్ లో భారత భద్రతాదళాలు హత్య చేశాయి. అనేక మంది మహిళలను చెరిచారు. మణిపూర్ లో మనోరమ అనే మహిళను భద్రతా దళాలు చెరచి చంపివేయటంతో ఒక డజను మంది మహిళలు ‘మమ్మల్ని కూడా చెరచండి’ అని భారత సైనికుల స్థావరం ముందు నగ్న ప్రదర్శన చేశారు. బోడోలకు భద్రతా దళాలకూ జరుగుతున్న మారణకాండలో ఇటీవల 70 మంది స్త్రీలు, చిన్న పిల్లలు చనిపోయారు.

ఇక ఇదే చట్టం కాశ్మీర్ లో కూడా అమలు అవుతుంది. కాశ్మీరు యువకులను అర్ధరాత్రి ఇళ్లనుండి పట్టుకెళ్ళి మాయం చేయడం భద్రతా బలగాలకు సాధారణ చర్య. వారి పైన మిలిటెంటు ముద్ర వేసి నానా అకృత్యాలకు పాల్పడడం భద్రతా దళాల హక్కుగా చెలామణి అవుతోంది. కాశ్మీరు ఆడపిల్లలపై అత్యాచారాలు జరిపి మిలిటెంట్లుగా ముద్రవేసి నేర విచారణ నుండి తప్పించుకుంటున్నారు. గత నవంబర్ లోనే కారు ఆపలేదని భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో చిన్న పిల్లలు చని పోయారు. సర్వీసులో ప్రమోషన్ కోసం అమాయక యువకులను పట్టుకెళ్ళి కాల్చి చంపి ఎన్ కౌంటర్ అని కట్టుకధ అల్లిన ఉదాహరణ గత సంవత్సరం వెలుగులోకి వచ్చింది. సోపోర్ అమ్మాయిల అత్యాచారం పైన భద్రతా దళాలు అత్యాచారం చేసి చంపేయడంతో ఆందోళన వెల్లువెత్తింది. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించి కాశ్మీరు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని కోరింది. ఆ కమిటీ కూడా AFSPA ను ఎత్తేయాలని సిఫారసు చేసింది. ఇటీవల ఢిల్లీ యువతి అత్యాచారం సందర్భంగా కూడా జస్టిస్ వర్మ కమిటీ AFSPA కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది.

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, చత్తీజ్ గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని దండకారణ్యంలో జరుగుతున్న యుద్ధం సంగతి చెప్పనక్కరలేదు. ఛత్తీస్ ఘడ్ లో సోనీ సోరి అనే టీచరును మావోయిస్ట్ గా ఆరోపిస్తూ అరెస్టు చేసి చెప్పలేని విధంగా చిత్రహింసలు చేశారు. ఇంకా అనేక మంది గిరిజన ఆదివాసీ మహిళలను నిర్భంధంలోకి తీసుకొని అఘాయిత్యాలు చేసి చంపేశారు. దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులకు, ఎస్‌ఈ‌జెడ్ లకు, ధర్మల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమాలలో అనేక మంది మహిళలు నిర్భంధం పాలు అవుతున్నారు.

“ఈ సందర్భంగా (సాయుధ దళాల ఘర్షణ సందర్భంగా) స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల హక్కులు నిరాకరించబడతాయి. యుద్ద తంత్రాలలో భాగంగా చేసే స్త్రీలపై ఒక పద్దతిలో జరిగే రేపులను తప్పక ఖండించాలి. ఆ నేరస్తులను వెంటనే శిక్షించాలి. ఈ సాయుధ తగాదాలకు మూల కారణాలు వలస పాలనలోనూ రాజ్య, సైనిక అణచివేతలలో ఉంటాయి.”

“అన్ని సమూహాలు సాయుధ సమస్యల వలన, టెర్రరిజం వలన బాధ పడుతున్నప్పటికీ స్త్రీలు, ఆడపిల్లలు వాళ్ళ సామాజిక స్థానం వలన, సెక్సువాలిటీ వలన ఎక్కువగా బాధ పడతారు. ఘర్షణ పడే వర్గాలు స్త్రీల పై అత్యాచారాలను ఒక యుద్ధతంత్రంగా ఉపయోగిస్తారు.”

బీజింగ్ ప్రకటనలో పేర్కొన్న పై విషయాలు భారతదేశానికి చక్కగా వర్తిస్తాయి. బారతదేశంలో సాయుధదళాల ప్రత్యేక చట్టం అమలులో ఉందంటేనే ఇక్కడ సాయుధ ఘర్షణలు జరుగుతున్నట్లు కాదా? లేక అవసరం లేకుండా ఆ చట్టాన్ని ఉపయోగిస్తున్నారంటే భారతీయులకు సరే ప్రపంచానికి సమాధానం చెప్పొద్దా? అంతర్జాతీయ వేదికల మీద కూడా నిర్భీతిగా, నిర్లజ్జగా అబద్ధాలు ధైర్యంగా ఆడేస్తున్న భారతప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలూ ముఖ్యంగా స్త్రీలు కాలరు పట్టుకొని కడిగేయాల్సిన సమయం వచ్చింది.