ట్యాగులు

, ,

ఉత్తరప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ అధికారంలోకి వస్తే ‘యాంటీ- రోమియో’ దళాలను ఏర్పాటు చేస్తుందని దాని చీఫ్ అమిత్ షా ఘనమైన వాగ్దానం చేశాడు. ‘మన ఆడపిల్లల భధ్రత కోసం’, ‘వేధింపుల నివారణ కోసం’ ఈ దళాలు కాలేజీల దగ్గరా, బహిరంగ స్థలాల్లో కాపలా కాస్తాయని చెప్పాడు. బీజేపీ ఎన్నికల్లో గెలిచి, పీఠం ఎక్కిన నెలలోపే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాద్ యోగి శ్రద్ధతో ఈ దళాల నియామకం జరిగిపోయింది. ఈ దళాల ఉనికీ, వీటికి ‘యాంటీ రోమియో స్క్వాడ్స్ (రోమియో వ్యతిరేక దళాలు)’ అని పేరు పెట్టటం వెనుక కారణాలను చర్చించాలి.

షేక్ స్పియర్ రాసిన ‘రోమియో- జూలియట్’ నాటికలో రోమియో ఒక మగ పాత్ర. తన ప్రియురాలు జూలియట్ చనిపోయిందని పొరబడి విషం తాగి మరణిస్తాడు. జూలియట్, రోమియో మరణాన్ని భరించలేక కత్తితో పొడుచుకొని జీవితాన్ని ముగిస్తుంది. రెండు మూడు దశాబ్దాల క్రితం వరకూ ఈ నాటకాన్ని కాలేజీ వార్షికోత్సవాల్లో విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించేవాళ్లు. ఇప్పుడు అవే కాలేజీల దగ్గర యాంటీ- రోమియో దళాలను, ఆడపిల్లల వేధింపులను నివారించటానికనే పేరుతో నియమించారు. రోమియో పేరును రౌడీయిజానికీ, దౌర్జన్యానికి అంటగట్టి మాట్లాడటమే ఇప్పటి విషాదం. నిజానికి రోమియో కానీ, ఆ మాటకొస్తే మజ్నూ కానీ, ఎప్పుడూ సెక్సువల్ నేరాలకు పాల్పడలేదు. రోమియో, షేక్ స్పియర్ తన సాహిత్యంలో సృష్టించిన అద్వితీయ ప్రేమికుడు. ఈ నాటకం రాసిన ఐదు శతాబ్దాల తరువాత, రోమియోకు ఈ గతి పడుతుందని బహుశా షేక్ స్పియర్ కూడా ఊహించి ఉండడు.

తరగతి గదుల్లో బోధించే రోమియో-జూలియట్, రుక్మిణీ–కృష్ణుడు వంటి వారి ప్రేమ కథలను కేవలం పాఠాలుగానే చూడాలి కాని, జీవితంలో ప్రేమ జోలికి వెళ్లకూడదని హెచ్చరించదలుచుకొన్నట్లు ఉన్నారు. ‘ప్రేమించుకోవటం’ అనే సున్నిత భావానికి వ్యతిరేకంగా ఈ దళాలు పని చేయబోతున్నాయా? అనే సందేహం కూడా సహజంగానే ఇప్పుడు వస్తోంది. అసలు ఎవరు ఎవరినైనా ప్రేమించటానికి వ్యతిరేకమా; లేక రెండు కులాలు, మతాల మధ్య ప్రేమ నిషిద్ధమని చెప్పబోతున్నారా; లేక ప్రత్యేకంగా ముస్లిం మతానికి చెందిన యువకులు, హిందూ యువతులను ప్రేమించటం తప్పని చెప్పటం వారి ఉద్దేశ్యమా అనే ప్రశ్నలకి సమాధానం వారి మాటల్లోనే దొరుకుతుంది. ఆడపిల్లల మీద జరిగే వేధింపులకు వ్యతిరేకంగా మాత్రమే ఈ దళాలు ఉనికిలోకి రాలేదన్నది కూడా స్పష్టంగా తెలుస్తోంది. రామ మందిరం, ట్రిపుల్ తలాక్, కైరానా నిర్వాసితులలాంటి విషయాలతోబాటు ఈ యాంటీ రోమియో దళాల విషయం కూడా అంతే ప్రాధాన్యతతో యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఆడపిల్లల వేధింపులులాంటి సామాజిక సమస్యను మతపరమైన అంశాలతో కలపటం యాదృచ్ఛికం కాదు.

‘లవ్ జిహాద్’ అనే కొత్త పదం మొదట కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో 2009లో ప్రాముఖ్యత సంతరించుకొన్నది. ముస్లిం యువకులు ముస్లిమేతర అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచించి ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని ఆయా వర్గాలు ఆరోపించాయి. దానికే లవ్ జిహాద్ అని పేరు పెట్టారు. నిజానికి లవ్ జిహాద్ అనే పదం కృత్రిమంగా సృష్టించిందే కానీ అలాంటి కార్యాచరణ ఎక్కడా జరగటం లేదని అధికారిక విచారణలలో తేలిపోయింది. అందుకే ఆ పదం త్వరగానే నశించి పోయింది. అది మళ్లీ 2014లో యూపీ ఉప ఎన్నికల్లో; ఎక్కడైతే కులమూ, మతమూ ఎన్నికల విజయాలను నిర్ణయించే ప్రాధాన్యత అంశాలు అయ్యాయో, అక్కడ అది మళ్లీ పునర్జీవనం పొందింది. ముజఫర్ నగర్ మతఘర్షణలకు ఈ పేరు కారణం అయ్యింది. ముస్లిం యువకుడు, హిందూ యువతుల మధ్య ప్రేమా ఘర్షణలకు లవ్ జిహాద్ పేరు పెట్టి; 62 మంది మృతికి, 50000 మంది ముస్లిములు నిర్వాసితులు అవటానికి, ఎందరో స్త్రీలపై లైంగిక దాడులకు కారణం అయింది. ఆరెసెస్స్, ధర్మ జాగరణ్ మంచ్ లాంటి హిందుత్వ సంస్థలు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా పోరాడమని పిలుపునిచ్చాయి. ఆరెసెస్స్ పత్రిక పాంచజన్యలో లవ్ జిహాద్ ను కవర్ పేజీలో వాడి రెచ్చగొట్టారు. కేరళలోని కొజికొడెలోని ఒక హోటల్ లో అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా యువ మోర్చ కార్యకర్తలు దాన్ని ధ్వంసం చేశారు. ‘మహిళా శక్తి సామాజిక్ సమితి’ పేరుతో ఉన్న ఒక మహిళా గ్రూపు వాలైటైన్స్ డే నాడు ప్రేమికుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా వారిని అవమానిస్తే, యువత క్రమశిక్షణ నేర్చుకొంటారని వారి వాదన. అయితే ఇలాంటి దౌర్జన్యాలు ఒకవైపు పెరుగుతూ పోతుంటే, ఆ దౌర్జన్యాలు చేసిన వారి మీద తీసుకొనే చర్యలు మాత్రం విలోమానపాతంలో తగ్గిపోతున్నాయి. పోలీసులకు పై అధికారుల మీద ఉండే భక్తి, అవే ఆధిపత్య భావాలను మెదడుకు పట్టించుకోవటం దానికి కారణం.

ఇక ఈ యాంటీ రోమియో దళాలు అందరూ భయపడినట్లుగానే పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, కాలేజీల వద్ద నిలబడి ఉన్న యువతీ యువకుల్ని వేధింపులకు గురి చేస్తున్నాయి. లవ్ జిహాద్ ప్రమాదం నుండి ఆడపిల్లలని తప్పించటానికే ఈ చర్య ఆదిత్యనాధ్ ప్రభుత్వం తీసుకొంటుందనీ, ‘మన’ ఆడపిల్లలు; ‘దేశద్రోహుల’, ‘టెర్రరిస్టుల’ ప్రేమలో పడకుండా వారిని రక్షించాలనీ హిందూవాహినిలాంటి సంఘీ సంస్థలు సూటిగానే చెబుతున్నాయి. ‘అసలు ఏకాంతంగా మాట్లాడుకోవటం ఏ రకంగా నేరం అవుతుంది? ఇంకో వైపు పబ్బుల్లో విచ్చలవిడి ప్రవర్తనలకూ, తాగుళ్లకూ ప్రభుత్వమే అనుమతులు యిచ్చి ప్రోత్సహిస్తూ డబ్బులు లేని వాళ్లు ప్రేమించుకోవటానికి అనర్హులని వీళ్లు చెబుతున్నారా? ఈ యుద్ధపు రోజులు అంతరించి ‘అందమైన ఉద్యానవనాల్లో ప్రేమికులు తమ హృదయాలు విప్పి చెప్పుకొనే’ కాలాలు ఎప్పుడు వస్తాయో?’ ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రజాస్వామికవాదికి వస్తున్నాయి.

ఈ యాంటీ రోమియో దళాలను దేశమంతా విస్తరింపచేస్తామని ప్రకటించటం ఇంకా భీతిని కలిగిస్తుంది. నిజంగా ఆడపిల్లల మీద జరిగే లైంగిక వేధింపుల పట్ల మాత్రం ఈ దళాలు దృష్టి పెట్టటం లేదు. ఎవరైనా ఒక ఆడపిల్ల, తన మీద లైంగిక వేధింపు జరిగిందని పోలీసు స్టేషన్ కు వెళితే ఆమెకు కలిగే అనుభవం ఏమిటో ఈ దేశంలో ఉండే ప్రతి అమ్మాయికీ తెలుసు. ఎప్పుడూ ఉండే రొటీన్ పోలీసులే ఆడవాళ్లను ‘రక్షించే’ పనినీ, నైతిక పహరానూ; బాధ్యతారాహిత్యంగాను, మొద్దుగానూ నిర్వహిస్తుండగా ఇంకా చట్టబద్ధత లేని ఈ న్యాయాతీత వ్యవస్థల అవసరం ఉందా? ఉంటే అవి ఆడపిల్లలకూ, యువతరానికీ చేయబోయే మేలు ఏమిటి, అది ఏ రకంగా చేయబోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. మోరల్ పోలిసింగ్ చేసి యువతను వేధించటమా లేక నిజంగా వేధింపులు జరిగినపుడు ఆడపిల్లల పక్షాన వహించటమా అనే సూక్ష్మ విచారణ ఈ దళాలకు లేకపోతే వాటి ఉనికి భయోత్పాతం కలిగించక మానదు.

ఆడపిల్లల మీద జరిగే లైంగిక వేధింపుల సమస్యకు మూలాలు లోలోన వేళ్లూనికొని ఉన్నాయి. వాటిని తొలగించటానికి వ్యవస్థాపరమైన మార్పులు జరగాలి కానీ; మోరల్ పోలీసింగ్ తో, వేయి కళ్ల కాపలాతో అది సాధ్యం కాదు. ‘భయం లేకుండా చదువుకోవడం’ అనే పేరుతో ఆడపిల్లల స్వేచ్ఛను కబ్జా చేయటంతోనూ ఆ సమస్య పరిష్కారం కాదు. ఇప్పటికే ‘ఆడపిల్లలకు మొగ స్నేహితులు ఉండటాన్ని భారతీయ సంస్కృతి ఒప్పుకోదు’ అని ఒక పక్క కాలేజీ ప్రిన్స్ పాల్స్ ఊదరకొడుతుంటే; పోలీసులు బహిరంగ నైతికతను కాపాడే బాధ్యతను నెత్తిన వేసుకొని అతి చేష్టలు చేస్తుంటే; ఇక ఈ దళాలు ఆడపిల్లలకు పీడగా మారబోతున్నాయంటే అతిశయోక్తి ఏముంటుంది?

ఈ సందర్భంగా జస్టిస్ వర్మ హెచ్చరిక గుర్తుకు వస్తుంది. ఈ హెచ్చరికను ఆయన నిర్భయ అత్యాచారం, హత్యానంతరం క్రిమినల్ చట్టానికి మార్పులు సూచించమని అడుగుతూ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహిస్తూ చేసినది. “… (ఆడపిల్లలు) సిగ్గుపడటం అనే విషయం పోలీసులను పై స్థాయిలో నిలబెడుతుంది. పోలీసులు ఆడపిల్లల గౌరవాన్ని కాపాడే న్యాయ నిర్ణేతలుగా తయారయ్యారు. ఒక్క ఎఫ్ఫైయ్యార్ కూడా నమోదు చేయకుండా వాళ్లు; తమకు రేపిస్టులలో, అత్యాచార బాధితులలో ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనే నిర్ణయాలు ప్రకటించే నైతిక శక్తి ఉందని అనుకొంటారు. ప్రజాస్వామిక, గణతంత్ర విలువలతో ఏలుబడి అవుతున్న వర్ధమాన సమాజంలో ఈ ధోరణి దయనీయమైనదీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదగ్గది కాదు.”

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమూ, దాని పోలీసు యంత్రాంగం జస్టిస్ వర్మ వ్యాఖ్యలను ఏ మాత్రం పట్టించుకొన్నట్లు లేదు.

(ఈ వ్యాసం ఏప్రిల్ 2017 మాతృకలో సంపాదకీయంగా ప్రచురితం అయ్యింది)