ట్యాగులు

, , , , ,

china-cultural-revolution-communism

ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రమే పడవను నడపగలదు. జాతీయ విద్యావిధానం మీద పెట్టుబడి పెడితేనే ఏ దేశమైనా ముందుకు పోతుంది. ఆ పెట్టుబడి కూడా, కొంత మందికి పరిమితం కాకుండా, ప్రజా సందోహాలు ఎక్కడ సాంద్రతగా నివసిస్తున్నారో అక్కడే పెట్టాలి. అంటే భారతదేశంలాంటి విస్తృత గ్రామీణ ప్రాంతం కలిగిన దేశాలు, మెజారిటీగా ప్రజలు ఉంటున్న గ్రామీణ ప్రాంతాల్లో విద్య మీద పెట్టుబడి పెడితే ఫలితాలు వస్తాయి. పాల మీద కట్టిన మీగడకు ఇచ్చిన ప్రాముఖ్యత, మొత్తం పాలకు ఇవ్వక పోతే అవి నిరుపయోగమై పోతాయి. అదే భారతదేశంలో జరుగుతుంది ఇప్పుడు. విద్య ప్రైవైటైజేషన్ విషయం కాసేపు పక్కన పెట్టినా ఉన్న అరకొర నిధులు కూడా పట్టణాలలో ఉండే ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థలకు కేటాయిస్తున్నారు. గ్రామ గ్రామాన చాక్ పీసులూ, నల్ల బల్లలూ, ఉపాధ్యాయులూ లేని బళ్ళు కొల్లలుగా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి పేరు మీద కోట్లాది రూపాయలు ఐఐటీలు, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు తరలిస్తున్నారు. అక్కడ వరకు వెళ్ళగలిగిన విద్యార్ధులు పట్టణ ప్రాంత మేధావీ, ధనిక వర్గానికి చెందిన పిల్లలే. నీళ్ళ స్థాయిని పెంచటానికి డాములు కట్టి కొంత నీటిని నిలువ చేసినట్లే – పేద ధనిక వర్గాల మధ్య మరింతగా అంతరాలు పెంచి ఉన్నతాదాయ వర్గాలను లాలించి నేతి ముద్దలు తినిపిస్తుంది భారత దేశ విద్యా విధానం.

భారతదేశం ఇప్పుడు కావాలనీ, తెలిసీ అవలంబిస్తున్న తప్పుడు విద్యా విధానాలు – చైనా విప్లవానంతరం నిర్విఘ్నంగా కొంత కాలం అక్కడ కూడా అమలు అయ్యాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్యనున్న అంతరాలు, కార్మికులకూ రైతులకూ ఉన్న అంతరాలు, శారీరక శ్రమకూ మేధో శ్రమకూ మధ్యనున్న అంతరాలు సమసి పోవాలని ఆ నాటి మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ కలలు కన్నది. కానీ అప్పటికీ మెజారిటీగా ఉన్న పేద రైతుల శ్రమ ఫలితాలు అల్ప సంఖ్యలో ఉంటే పట్టణ వర్గాల పిల్లలకే అందేవి. విద్యావిధానంలో అనాదిగా వస్తున్న సామాజిక అసమానత విప్లవానంతరం కూడా కొంత కాలం కొనసాగింది. ‘కీ స్కూల్స్’ పేరు మీదా నడిచే బడులకు అత్యంత ప్రాముఖ్యత యిచ్చి గ్రామీణ విద్యను నిర్లక్ష్యం చేశారు. ఈ కీ స్కూళ్ళ ఉద్దేశం దేశ పునర్నిమాణానికి కావలసిన అవసరమైన నిపుణులను తయారు చేయడమే అని చెబుతుండేవాళ్లు. అంటే మన ఐఐటీలూ, ఐఐఎంల గురించి యిక్కడి వాళ్ళు చెబుతున్నట్లేనన్న మాట

అంతా ఇప్పటి భారతదేశంలోలాగానే ఉండేది

ఆనాటి చైనా విద్యారంగ పరిస్థితులు ఇప్పటి భారతీయ పల్లెల విద్యారంగ పరిస్థితులతో పోలి వుంటాయి. చైనా గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు బడులకు వెళ్ళే వాళ్ళు కాదు. దానికి ఒక కారణం బడిలో ప్రవేశానికి కావాల్సిన ప్రవేశిక పరీక్షలో పాస్ కాలేక పోవటం. ఆ పరీక్షకు ఒకటి నుండి వంద వరకు అంకెలు లెక్క పెట్టాలి. చైనా భాషలో అక్షరాలను రాయగలిగి ఉండాలి. ఎన్నో ఏళ్ళుగా భూస్వాముల కబంధ హస్తాల్లో నలిగి, తరువాత కాలంలో విప్లవ పోరాటాల్లో మునిగి తేలిన చైనా ప్రజలు తమ పిల్లలకు ఆ మాత్రం అక్షరాలు నేర్పించే విద్యావేత్తలు కాదు. పై తరగతులకు పోవాలన్నాకింది తరగతుల పరీక్షల్లో పాస్ అవ్వాల్సిందే. అంటే ప్రాధమిక తరగతుల్లో కూడా డిటెన్షన్ ఉండేదన్నమాట. ఈ డిటెన్షన్ కి కారణం విద్యా ప్రమాణాలు పెంచటం కాదు. తరగతుల్లో అందరు పిల్లలకు చదువుకొనే సౌకర్యాలు, ఉపాద్యాయులు లేకనే. రెండో కారణం బడికి చెల్లించాల్సిన విద్యా రుసుం, అది చాలా తక్కువ అయినప్పటికీ, తల్లిదండ్రులు చెల్లించలేక పోవటం. మూడో కారణం – అతి ముఖ్యమైనది ఏమిటంటే తల్లిదండ్రులకు ఇంటి పనుల్లోనూ, పొలం పనుల్లోనూ పిల్లల అవసరం చాలా ఉండేది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ కారణంగా బడి మానేయాల్సి వచ్చేది. ఈ అవరోధాలు అన్నీ దాటుకొని ఉన్నత మాధ్యమిక పాఠశాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య అతి తక్కువగా ఉండేది. చదువంటే కుటుంబ గౌరవం పెంచటానికే అనే చైనా పురాతన భావన ఇంకా గ్రామీణ ప్రజల్లో నాటుకొని ఉండటం, చదువును ఒక లగ్జరీగానే చూడటం ఇంకో కారణం.

టీచర్లు పిల్లల చేత పాఠాలను కఠోరంగా వల్లె వేయించేవాళ్లు. ఒక్కో చైనా అక్షరాన్ని రోజుకు వందసార్లు రాయించేవాళ్లు. మన దేశంలోలాగానే చైనా చక్రవర్తుల వంశ వృక్షాలు వాళ్ళు బట్టీయం పట్టాల్సి వచ్చేది. పరీక్షలకు రాబోయే ప్రశ్నలను ఉపాధ్యాయులు ఊహించి పిల్లల చేత పదే పదే చదివించేవాళ్లు. ప్రశ్నాపత్రాలు తయారు చేసే వాళ్ళు వీళ్ళ ఊహలకు భిన్నంగా కొత్త కొత్త ప్రశ్నలతో, ఒక్కోసారి ఎలాంటి ప్రాముఖ్యత లేని ప్రశ్నలతో, ప్రశ్నాపత్రం యిచ్చేవాళ్లు. అలా పిల్లలతో చెలగాటం ఆడేవాళ్ళు విద్యాధికారులు. ఈ రకమైన చదువుల వల్ల పిల్లలకు గ్రహించే శక్తి, జ్ఞానం రెండూ ఉండేవి కావు. ఆ చదువుల ధ్యేయం కేవలం ఉద్యోగ సంపాదనే. గోడలో నిర్మించబడిన యిటుకలాగా కదలికలేని స్తబ్ధమైన అస్తిత్వంగా మిగిలి పోయేవారు చదువుకొన్నవాళ్ళు కూడా. గ్రామీణ జీవితాలకు కావాల్సిన నైపుణ్యాలు ఆ చదువుల్లో కొరవడేవి. ఆ రోజుల్లో మార్కులు తెచ్చుకోవటం విద్యార్ధుల ఏకైక జీవన ధ్యేయం. పరీక్షలు పెట్టటం ఉపాధ్యాయుల మంత్ర దండం.

బడుల్లో పరిస్థితులు కూడా అధ్వానంగా ఉండేవి. ఎక్కువ స్కూళ్ళు గుడుల్లో, డేరాల్లో నడుస్తుండేవి. చలికీ, వేడికీ పిల్లలు అంటకాగుతుండేవాళ్లు. విరిగి పోయిన కిటీకీలను చలికాలంలో ఇటుకలతో మూసి వేసేవాళ్ళు. బడిలో చలి మంటలు వేయటానికి పిల్లల్ని వంతులవారీగా కట్టెలు తీసుకొని రమ్మనమని టీచర్లు పురమాయించే వాళ్ళు. చలి బాగా చలిగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో పాఠాలు ఆపి, మోకాళ్ళ మీద కూర్చొని వేడి కోసం చేతులు మసాజ్ చేసుకోమని టీచర్లు పిల్లలకు చెప్పేవాళ్ళు. రాత కోసం పొడవైనా స్టూల్, కూర్చోవటానికి చిన్న స్టూల్ పిల్లలు ఎవరికి వారే యింటి నుండి తీసుకొచ్చుకొనేవాళ్ళు. ఇలా గ్రామీణ బడులు నిధుల, ఉపాధ్యాయుల కొరతతో విలవిలలాడుతుంటే పట్టణ ప్రాంతాల్లో ‘కీ స్కూల్స్’ కు ఆ సమస్యలు ఉండేవి కావు. గ్రామీణ రైతుల కష్టం వారి పిల్లలకు కాకుండా పట్టణాలలోని పిల్లలకు లబ్ధిని చేకూర్చింది.

సాంస్కృతిక విప్లవం – విద్యారంగంలో పెనుమార్పులు

చైనా రైతులు అమాయకులు కారు. గ్రామీణ ప్రాంతాల నిర్లక్ష్యం పట్ల వారు అసంతృప్తితో ఉన్నారు. అందుకే 1966 మేలో మావో యిచ్చిన సాంస్కృతిక విప్లవం పిలుపును వారు ముందుగా అందుకొన్నారు. సాంస్కృతిక విప్లవం వారి జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొని వచ్చింది. సమిష్టి వ్యవసాయ కేంద్రాలు అభివృద్ధి అయ్యాయి. సామాజిక భీమా అమలు అయ్యింది. ప్రశ్నించే సాధికారికత వారికి లభించింది. మావో పిలుపు యివ్వగానే గ్రామ అధికారులను, కమ్యూనిష్టు నాయకులను నిలదీసే పెద్ద పెద్ద పోస్టర్లు వేయగలిగారు. సాంస్కృతిక విప్లవ చట్టం వారికి పూర్తి అండగా నిలబడింది. మావో సూక్తులను అధికారులను కొలిచే కొలబద్దగా వారు ఉపయోగించుకొన్నారు. ‘ప్రజలు ఏమీ కోరుకొన్నారో అదే ఛైర్మన్ మావో చెప్పాడు.’ అని రైతులు అనుకొనేవాళ్ళు. జాతీయ విప్లవ నాయకులు కూడా సంవత్సరానికి 200 రోజులు పొలాల్లో పని చేసేవారు. చైనాలో రాజకీయ సంస్కృతి పూర్తిగా మారిపోయింది.

మావో ప్రతిపాదించిన సాంస్కృతిక విప్లవ మార్గదర్శకాల్లో విద్యారంగానికి సంబంధించిన మార్గదర్శక సూత్రం చాలా విలువైనది. అది నిజానికి 1966 మే 7న ‘లిన్ బియావో’కు రాసిన ఉత్తరమే. సాంస్కృతిక విప్లవ తాత్వికతకు ఈ మార్గదర్శకత్వం ఊపిరి పోసింది. విద్యా బోధనా కాలాన్ని తగ్గించాలనీ, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేబట్టాలనీ ఆయన సూచిస్తూ, ఈ రంగంలో బూర్జువా మేధావుల ఆధిపత్యాన్ని కొనసాగించనీయ వద్దని చెప్పారు. ఈ మార్గదర్శకత్వం కార్మికులకూ, రైతులకూ, సిపాయిలకూ, విద్యార్ధులకూ, ఉపాధ్యాయులకూ ప్రేరణనిచ్చింది. ప్రాధమిక విద్యను ఆరేళ్ళ నుండి ఐదు సంవత్సరాలకూ- మాధ్యమిక, ఉన్నత విద్యను మూడు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకూ తగ్గించి వేసుకొన్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్లు పాఠ్య పుస్తకాలు, తరగతి గదిలో విద్యార్ధుల సాధికారతను పెంచే బోధనా పద్దతులూ అమలులోకి వచ్చాయి.

సాంస్కృతిక విప్లవ కాలంలో గ్రామీణ బడులు ఆయా ప్రాంతాలకు అనువైన కాలాల్లో నడిచాయి. కోతల కాలంలో ఉపాధ్యాయులు పిల్లల్ని పొలాలకు తీసుకొని వెళ్ళి రైతులకు పనిలో సహాయం చేసేవారు. పని విరామాల్లో పిల్లలు పాటలు పాడి రైతులకు వినోదం కలిగించే వాళ్ళు. పిల్లలు పొలాల్లో పనిచేసి సంపాదించిన డబ్బుతో వాళ్ళ బడులకు కావాల్సిన చిన్న చిన్న సౌకర్యాలు సమకూర్చుకొనేవాళ్లు. ఆర్ధిక స్తోమత లేక చదువు మానుకొన్న చాలా మంది పిల్లలు 1966 తరువాత బడుల్లో చేరారు. రెండు మూడు విద్యా సంవత్సరాలు కోల్పోయినా కూడా పెద్ద వయసు వలన వారు వెంట వెంటనే తరగతులు మారి పై క్లాసులకు వెళ్ళి పోయారు.

ఏ విద్యార్ధికీ సీటు దొరకదు అన్న మాట లేకుండా పెద్ద పెద్ద ప్రాధమిక స్కూళ్ళను గ్రామస్తులే ప్రతి ఊళ్ళో నిర్మాణం చేసుకొన్నారు. బడుల్లో ఫీజులు లేవు. ప్రతి గ్రామంలో బడి కట్టుకోవటం వలన విద్యార్ధులు బడుల కోసం వేరే ఊరికి పోనవసరం లేదు. స్కూళ్ళ వేళలు పిల్లలకు అనుకూలంగా ఉండేవి. తల్లి దండ్రులకు సహాయం చేసి ఆలస్యంగానైనా బడికి రావచ్చు. పొలం పనుల కాలంలో బడులు మూసేసే వాళ్ళు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహాయం చేయడానికి ఆ కాలంలో పూర్తిగా అవకాశం ఉండేది. పిల్లల్ని బడులకు పంపని తల్లిదండ్రుల్ని గ్రామస్తులు నిలవేసే వాళ్ళు. వాళ్ళను బడికి వద్దనటానికి తల్లిదండ్రుల వద్ద కారణాలు మిగలకుండా చేశారు. స్కూళ్ళల్లో విద్యార్ధుల సంఖ్య యించుమించు వంద శాతానికి పెరిగింది.

ఐదు ఆరు ఊళ్ళకు కలిపి ఉమ్మడి మాధ్యమిక పాఠశాలలను కట్టుకొన్నారు. ఆయా గ్రామాల నుండి ప్రతినిధులుగా గ్రామస్తులు ఆ స్కూలు కమిటీలో ఉండేవాళ్లు. బడి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి గ్రామస్తులే సరఫరా చేసారు. క్వారీల నుండి రాళ్ళు కొట్టీ, బట్టీల నుండి యిటుకలు తయారు చేసీ , అడవిని కొట్టి కలపనూ తీసుకొచ్చారు. గ్రామాల్లో ఉండే తాపీ మేస్త్రీలు బడుల నిర్మాణం చేసారు. మాధ్యమిక స్కూలుకు ఏడు పెద్ద పెద్ద తరగతి గదులు కట్టారు. ఆ రోజుల్లో గ్రామాల్లోని బడులకు ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉండేది. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను వారి వారి స్వస్థలాలకు ఆహ్వానించే పిలుపులు దినపత్రికల నిండా అప్పట్లో కనిపించేవి. చాలా మంది ఉపాధ్యాయులు ఆ పిలుపునందుకొని గ్రామ ప్రాంతాలకు కుటుంబాలతో తరలి వెళ్లారు. టీచర్ల కొరత తీరటంతో ప్రాధమిక విద్య పూర్తి చేసుకొన్న ప్రతి విద్యార్ధీ మాధ్యమిక స్కూల్లో చేరాడు. అలాగే ఒక్కో కమ్యూన్ లో పదిహేడు దాకా హైస్కూళ్ళ నిర్మాణం జరిగింది. ఉపాధ్యాయులకు గ్రామ సమిష్టి క్షేత్రాల నుండే వేతనాలు అందేవి. వేతనాల కోసం ప్రభుత్వం మీద వాళ్ళు ఏ మాత్రం ఆధారపడలేదు. నిజానికి ప్రజల మీద ఎలాంటి పన్నులు వేయని ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? పన్నులు వసూలు చేసే యంత్రాంగమే ఆనాటి చైనాలో లేదు.

బడుల నిర్వహణలో కార్మిక, కర్షకుల పాత్ర

పాఠశాలల నిర్వహణకు కార్మిక కర్షకులు కదిలి రావాలని మావో 1968లో పిలుపునిచ్చారు. గనుల నుండీ, ఫ్యాక్టరీల నుండీ, పొలాల నుండి ప్రతినిధులు స్కూళ్ళ నిర్వహణలో పాలు పంచుకొన్నారు. చదువు రాని వాళ్ళు పాఠశాలలను నిర్వహించటం ఏమిటని సాంస్కృతిక విప్లవ వ్యతిరేకులు విమర్శ చేస్తారు. అమెరికాలో బెస్ట్ సెల్లర్ నవల ‘అడవి కాచిన వెన్నెల’ (ఆంగ్లంలో వైట్ స్వాన్స్) రచయిత్రి ‘సుంగ్ చాంగ్’ అలాంటి వ్యాఖ్యానాలే చేసింది. తక్కువ విద్యా అర్హతలు కలిగిన వాళ్ళు ఎక్కువ విద్యా అర్హత కలిగిన వాళ్ళను ఏ రకంగా మార్గదర్శకత్వం చేయగలరు అనే ప్రశ్న తాత్వికమైనదే. అయితే చదువురాని ఈ మట్టి మనుషులు పాఠశాలలను అద్భుతంగా నిర్వహించి చూపించారు. ఆచరణాత్మక జ్ఞానం, విద్య పట్ల విభిన్నమైన దృక్పధం మాత్రమే వారికి ఉన్నాయి. సాంప్రదాయబద్ధమైన ఆలోచనలను వాళ్ళు బద్దలు కొట్టారు. మొదట్లో జరిగిన విద్యా మీటింగులలో వీరి అజ్ఞానానికి విద్యార్ధులు, ఉపాధ్యాయులు నవ్వేవాళ్లు. అయినప్పటికి రైతులు వెనుకడుగు వేయలేదు. బడుల నిర్వహణ కోసం వారితో కలిసి పని చేశారు. క్రమేపీ విద్యార్ధులలో, ఉపాధ్యాయులలో వీరి పట్ల దృక్పధంలో మార్పు వచ్చింది. రైతులు బడుల ఆవరణాల్లో ఆలుగడ్డలు, గోధుమలు పండించి పిల్లలకు ఆహారం కొరత రాకుండా చూసేవాళ్ళు. తరగతి గదులు వేడిగా ఉండటానికి బొగ్గును గ్రామాల నుండి సరఫరా చేసేవాళ్ళు. దూర ప్రాంతాల విద్యార్ధులు సెలవుల్లో యింటి వెళ్లలేక పోవటంతో కార్మికులు వారికి తోడుగా స్కూళ్ళలోనే నిద్రించేవాళ్లు. క్రమేణ టీచర్లు వారి మధ్య వచ్చే సమస్యలను కూడా గ్రామస్తులతో చర్చించి, వారి అభిప్రాయాలకు గౌరవం యిచ్చేవాళ్లు. ఉపాధ్యాయుల మధ్య వచ్చే కలహాలను కూడా గ్రామస్తులు తమ అనుభవంతో పరిష్కారం చేసేవాళ్ళు. విద్యార్ధులు, రైతులు, కార్మికుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఒకరినొకరు అర్ధం చేసుకోవటానికి అవకాశం కలిగింది.

విద్యా, ఉత్పక్తి శక్తుల మేలు కలయిక

ఎక్కడో పట్టణాలలో ఉండే మేధావులు తయారు చేసే సిలబస్ లో గ్రామ ప్రజలకు కావాల్సిన అంశాలు ఉండేవి కావు. చైనా గ్రామీణం నిజ జీవితంతో సంబంధం లేనీ, ఉపాధ్యాయ కేంద్రకంగా ఉండే ఈ పాఠ్య ప్రణాళికలకు తిలోదకాలు యిచ్చింది. కార్మికులూ, విద్యార్ధులూ, ఉపాధ్యాయులూ, రైతులు కలిసి ఆయా ప్రాంతాలకు అవసరమైన సిలబస్ ను తయారు చేసుకొన్నారు. భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రాలను మూడింటినీ కలిపి ‘ప్రాధమిక పరిశ్రమల విజ్ఞానం’ ‘ప్రాధమిక వ్యవసాయ విజ్ఞానం’ అనే రెండు భాగాలుగా విభజించుకొన్నారు. పుస్తకాల నిర్వహణ, అక్కౌంట్స్, బడ్జెట్ లాంటి ఆచరణత్మక కారణాల కోసమే గణిత శాస్త్రాన్ని వాడుకొన్నారు.

విప్లవ విద్యా సంస్కరణలను కోరేవాళ్లు విద్యార్ధులకు అన్ని విధాలుగా ప్రయోజనం కలిగించే విద్యను అందించాలని అనుకొన్నారు. విద్యా సంబంధ విషయాలతో బాటు పరిశ్రమల, పశువుల నిర్వహణ నైపుణ్యాలు కూడా అవసరం అని భావించారు. విద్యార్ధులు విమర్శనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం వాళ్ళు గుర్తించారు. వారంలో కొన్ని గంటలు విద్యార్ధులు ఆయా బడుల్లోని తోటల్లో పని చేసేవాళ్ళు. బడికి సంబంధించిన పరిశ్రమలలో, ఇతర పరిశ్రమలలో పని చేసేవాళ్ళు. కార్మికుల యింజనీర్ల సహాయంతో విద్యార్ధులు పరిశ్రమలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను వాళ్ళే తయారు చేసుకొన్నారు. ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆక్సిజన్ తో మండే యింజన్లు పనిచేసే సూత్రాలు, బ్లూ ప్రింట్స్ గీయటం, వాటిని చదవగలగటం స్కూళ్ళలో నేర్చుకొన్నారు. పంటలు, రసాయినిక ఎరువులు, వ్యవసాయ యంత్రాల గురించి కూడా వాళ్ళే పాఠ్య పుస్తకాలు తయారు చేసుకొన్నారు. రైతులు పిలిచినపుడు వెళ్ళి పొలాల్లో వారికి సహాయం చేసి వచ్చేవారు. క్వారీల్లో రాళ్ళు కొట్టటంలోనూ, గోధుమా చిలకడ దుంపల పంటల సేకరణలోనూ పని చేసే వాళ్ళు. విద్యార్ధులు శారీరక శ్రమను గౌరవించటం, జీవితంలో ఆ శ్రమకు సమాన ప్రాతినిధ్యం యివ్వటం ఈ రకమైన విద్యావిధానంలోని ఉద్దేశ్యాలు. వైద్యశాలలకు వెళ్ళి ప్రాధమిక చికిత్స చేయటం, చెడిపోయిన వైద్య పరికరాలను బాగు చేయటం చేసేవాళ్ళు. విద్య సంస్థలు అన్నీ ఫాక్టరీలతోనూ, పల్లెలతోనూ అనుబంధంతో ఉండేవి. కార్మికులను, రైతులను తమ తమ బడులకు వచ్చి ఆప్పుడప్పుడూ బోధనలు చేయమని అడిగేవాళ్ళు. వారి స్కూళ్ళలో కూడా వ్యవసాయ క్షేత్రాలనూ, చిన్న చిన్న పరిశ్రమలనూ నిర్వహించుకొనేవాళ్ళు. వాటి మీద వచ్చే ఆదాయాన్ని బడుల నిర్వహణకు వినియోగించేవాళ్ళు.

సాంస్కృతిక విప్లవ సమయంలో తయారైన విద్యార్ధులు చైనా గ్రామీణ అభివృద్ధికి ఎంతో సహాయ పడ్డారు. గ్రామాల ఆర్ధిక స్థితి ఈ విద్యార్ధుల నైపుణ్యంతో మెరుగు పడింది. విద్యార్ధులలో, ఉపాధ్యాయులలో శారీరక శ్రమ పట్ల గౌరవం పెరిగి అటువైపు వెళ్ళటానికి ప్రోత్సాహం పెరిగింది. ఈ కాలంలో జరిగిన విద్యా సంస్కరణలు దీర్ఘ కాలంలో చైనా చారిత్రక అవసరాలను తీర్చాయి. ఆ కాలంలోనే చైనా తన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచుకొని ఉపగ్రహ ప్రయోగాలు చేసింది. బయటకు తెలిసిన ప్రయోజనాలు అంతవరకే తెలుస్తాయి కానీ ఆ కాలంలో చైనాలో జరిగిన అంతర్గత మార్పులు బయట ప్రపంచానికి ఎక్కువ తెలియవు. తెలిసినా వాటిని పట్టించుకొనట్లు నటించే పెట్టుబడిదారీ దేశాలతో చుట్టుముట్టబడి ఉండింది అప్పటి చైనా. 1976లో మావో మరణం తరువాత ఈ మార్పులు అన్నీ వెనుకబాట పట్టి చైనా అదే పెట్టుబడీదారివ్యవస్థతో ప్రయాణం చేసింది.

సాంస్కృతిక విప్లవకాలంలో విద్యారంగంలో అమలు అయ్యిన సంస్కరణల ప్రభావం మన దేశంలో కూడా కొంత వరకు పడింది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో వృత్తి విద్యను నామకే వాస్తే ప్రవేశ పెట్టారు. కానీ విప్లవ ఉద్దీపన లేని దేశాల్లో, కాలాల్లో అవి అమలు కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలైన విద్యా కమిటీలు కూడా చివరకు కుటిల రాజకీయ వేదికలుగా మారిపోయాయి. అయితే ఇప్పటికీ విప్లవ విద్యార్ధి సంఘాలు యిస్తున్న ’గ్రామాలకు తరలండి’ పిలుపు ఆనాటి చైనా సాంస్కృతిక విప్లవ ఆచరణ అవశేషమే. ఈ రోజు పీడీయస్సూలాంటి విప్లవ విద్యార్ధి సంఘం కోరుకొంటున్న ‘శాస్త్రీయ విద్య’ను చైనా విద్యార్ధులు ఆనాడే నేర్చుకొని చైనా దేశాన్ని ప్రపంచ అగ్ర రాజ్యాలకు దీటుగా నిలబెట్టారు. ఒకప్పటి చైనా లాంటి విప్లవ దేశ నిర్మాణమే విద్యార్ధి సంఘాల అంతిమ కర్తవ్యంగా వుంటుంది.