ట్యాగులు

, , , , ,

sukshetram

ఓలాన్ విప్లవనారి కాదు. ఉద్యమకారిణి కూడా కాదు. స్త్రీ విముక్తినీ, స్వేచ్ఛనూ కోరుకొని దాని కోసం సమాజాన్ని ఎదురీదిన మహిళ కూడా కాదు. ఆమె ఒక సామాన్య మహిళ. వందేళ్ళ క్రితం చైనాలాంటి భూస్వామ్య, అర్ధ బానిస సమాజంలో పుట్టిన ఒక సాదా స్త్రీ. కుటుంబంతో, భర్తతో, సమాజంతో ఎప్పుడూ ఘర్షణ పడదు. తన కడుపున పుట్టిన బిడ్డల మీద తనకెలాంటి హక్కులు సమాజం యివ్వకపోయినా ఎదురు తిరిగి అడగదు. పోరాడి సాధించాలనే ఆలోచనే ఆమెకు ఎప్పుడూ రాదు. వచ్చే అవకాశం కూడా ఆమెకు ఆ కాలంలో లేదు.

కానీ ఓలాన్ భూమి పుట్టిన కాలంలో ఉద్భవించిన ఆడరేణువు. బిడ్డను నడుముకు కట్టుకొని వేటాడిన ఆది అవ్వ వారసురాలు. వ్యవసాయాన్ని కనిపెట్టిన తరువాత చిందిన స్వేదంలో సమవంతు కలిగినది. కండలు కరిగించి పండించిన గింజలకు సమ భాగస్తురాలు. నాగరికత ప్రస్థానంలో జరిగిన గృహ నిర్మాణంలో, కుండల తయారీలో, బట్టల నేతలో, వైద్యంలో ఆరితేరిన ఆడది. అధిక ఉత్పత్తి స్వంత ఆస్తివిధానానికి తీసిన దారిలో ఓడిపోయిన స్త్రీ. బానిస సమాజం నుండి అర్ధబానిస సమాజానికి మారి, భూస్వామ్యపు వేళ్ళు పాతుకొని పోయిన చైనా పాతసమాజంలో పుట్టి అన్ని హక్కులూ కోల్పోయినా తన స్వతః సిద్ధంగా వచ్చిన శ్రమించే స్వభావం, తెలివితేటలు కోల్పోని మహిళ. ఆమే ‘సుక్షేత్రం’ నవలలో ఓలాన్ గా దర్శనమిస్తుంది.

సుక్షేత్రం (ఆంగ్లంలో ‘గుడ్ ఎర్త్’) నవల రాసిన పెరల్ ఎస్ బక్ ఒక అమెరికా దేశస్తురాలు. చైనాలో స్థిరపడిన తల్లిదండ్రుల కారణంగా ఆమె జీవితం చైనీయులతో గాఢంగా ముడిపడింది. ఆనాటి చైనా సమాజపు చలన సూత్రాలు వంటబట్టించుకొని ఆమె చాలా నవలలు రాశారు. 1930 ప్రాంతంలో రాసిన ‘గుడ్ ఎర్త్’ అనే నవలలో అప్పటి చైనా వ్యావసాయిక సమాజపు భూసంబంధాలు, వాటితో ముడిపడి ఉన్న సామాజిక సంబంధాలు కధా వస్తువు. డబ్బున్న వాడి పంచలోకి భూమి పరుగులు పెట్టినట్లే, స్త్రీలకు కూడా సొంత హక్కులు లేక భూమి ఉన్నవాడి దగ్గరే పడి ఉండాల్సిన అగత్యాన్నిఈ నవలలో ఆమె అద్భుతంగా వర్ణించారు. 1932లో ఈ నవలకు అమెరికాలోని అత్యున్నత సాహితీ పురస్కారం ‘పులిట్టర్ ప్రైజ్’ వచ్చింది. పెరల్ బక్ తరవాత అమెరికా పౌరహక్కుల సంఘాల్లోనూ, స్త్రీల హక్కుల సంఘాల్లోనూ పని చేశారు.

good earth1

ఈ నవలను ‘సుక్షేత్రంగా పి.వి. రామారావు తెలుగులోకి అనువదించారు. అనువాదంలో వాడిన భాష వాడుక భాష కాక పోవటంతో అక్కడక్కడా కొద్దిగా ఇబ్బంది కలిగినా కధా విషయాన్ని ఆయన ప్రతిభావంతంగానే తీసుకొని రాగలిగారు. నిజానికి ఈ నవలను వాంగ్ (ఓలాన్ భర్త) దృష్టికోణం నుండి రాసినా ఎప్పుడూ మౌనంగా ఉండే ఓలాన్, కధ అణువణువునా ముందుకు తోసుకొనివస్తుంది.

ఆడదిక్కు లేని కుటుంబంలో తండ్రికి సేవ చేస్తూ, ఉన్న చారెడు చెలకను పండించుకొంటూ వాంగ్ లంగ్ కష్టపడుతుంటాడు. భార్య యింటికి వస్తే తనకు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటుందనీ, బానిస పిల్ల అయితే అందంగా లేకపోయినా బాగా పని చేస్తుందనీ, చౌకగా కూడా లభిస్తుందనీ హాంగ్యులనే భూస్వాముల కుటుంబంలోని బానిస పిల్లను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటాడు. ఓలాన్ అందంగా లేకపోవటం వలన యజమానులు ఆమెపై అప్పటివరకు లైంగిక చర్యకు పాల్పడరు. కరువు పరిస్థితుల్లో ఆడపిల్లలను అమ్ముకోవటం అప్పడు ఎంత సహజమో, ఆ పిల్లలు వయసుకు వచ్చాక యజమానులు వారిని వాడుకోవటం కూడా అంతే సహజం. అందమైన ఆడపిల్లలనయితే ఉంపుడుగత్తెలుగా స్థిరపరుచుకొంటారు.

ఓలాన్ వాంగుల యింటికి కోడలిగా నడిచి వస్తుంది. అత్తారింట్లో అడుగు పెట్టిన రెండో రోజు మామగారికి వేడినీళ్లు యివ్వటం దగ్గర మొదలైన ఆమె చాకిరీ ఆమె చనిపోయేవరకు అంతం కాదు. పొయ్యిలోకి కావాల్సిన వంట సరుకు ఏరుకొని రావటం, పేడను సేకరించి ఎరువుగా మార్చడం, వెదురు రాటం మీద ఏకులతో వడికిన దారంతో చలికాలపు దుస్తుల్లోని చిరుగులను కుట్టటం, పరుపులలోని దూదిని దులిపి మళ్ళీ వాటిని కుట్టటం … ఇవన్నీ ఆమెకు చాలా చిన్న చిన్న పనులు. ఏ వస్తువూ యింట్లో లేదనే ఫిర్యాదు ఆమె వైపు నుండి ఉండదు. చివరకు కుండకు చిల్లు పడ్డా మెత్తని మట్టితో దాన్ని మెత్తి వేడి చేసి కొత్త కుండలాగా చేయగలదు. బానిసగా విరామం లేకుండా తెల్లవారు ఝాము నుండి అర్ధరాత్రి వరకు యజమానుల యింట పని చేసిన ఓలాన్ కు ఈ యింటి పని లెక్కలోనిది కాదు. ఆమె స్వభావం కూడా యింటి పనికి పరిమితమై ఉండటం కాదు. ఒక ఉదయాన్నే పారపట్టుకొని పొలానికి వచ్చి ‘ఇంట్లో ఏమి తోచడం లే’దంటూ చాలా సహజంగా పనికి వంగుతుంది. ఆనాటి నుండి ఆమె ఆ భూమికి తన స్వేదాన్ని ఆరుతడిగా ధారపోస్తుంది. వాంగ్ కుటుంబానికి ఉన్న చేరెడు భూమిని పెంచి సుక్షేత్రానికి భర్తను యజమానిగా నిలబెట్టటానికి గొడ్డులాగా చాకిరీ చేస్తుంది.

ఓలాన్ మితభాషి. భర్తకు కూడా ఆమె ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనబడవు. ఆమెకు అసలు ఆలోచనలు ఉంటాయా అని సందేహం భర్తకు ఒకసారి వస్తుంది. కానీ ఆమెకు తన కుటుంబం పట్ల, భవిష్యత్తు పట్ల చాలా ఆశలు ఉన్నాయనే విషయాన్నిఅతడు త్వరలోనే పసిగడతాడు. ఆమె కాన్పు సమయంలో కూడా ఎవరిని అనుమతించకుండా తనకు తానే కాన్పు చేసుకొంటుంది. ప్రసవం అయిన మరునాడే యింటి పనిలోకి దిగుతుంది. అతి త్వరగానే పొలంలో బిడ్డనొక చోట పాత బొంతలో పడుకోబెట్టి పొలాల్లో పని చేసేది. బిడ్డ ఏడ్చినపుడు అక్కడే కూర్చొని పాలు తాపించేది. ఆ మట్టిలో మట్టిలాగా కలిసి పోయి అప్పుడు తల్లి బిడ్డలిద్దరూ మట్టి బొమ్మలయ్యేవారు. అందానికీ, సౌకుమార్యానికీ, సౌకర్యాలకూ ఆమె ఎప్పుడు దాసోహమనదు. ప్రశంసలకు లొంగదు. ఎలాంటి కృత్రిమత్వానికీ ఒదగని సహజ మానవ స్వభావం ఆమెది. ‘శ్రమ చేయటానికే మనిషి’ అన్నట్లుగా నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది.

భార్యా భర్తలు కష్టపడి, కాలం కలిసి వచ్చి లభించిన మిగులుతో హ్యాంకుల (గతంలో ఓలాన్ యజమానులు) భూమిని కొంత కొంటారు. వారి స్థితి సుభిక్షంగా సాగుతున్న క్రమంలో చైనా ఉత్తరప్రాంతాన్ని కరువు చుట్టుముడుతుంది. అనావృష్టి పాలిట పడ్డ ప్రజలు సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తుంటారు. వాంగ్ కుటుంబం పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఇంట్లో ఎద్దుని చంపి తినక పోతే పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. బిడ్డలా పెంచిన ఎద్దును చంపలేనంటాడు వాంగ్. అప్పుడు ఓలాన్ పెద్ద కత్తి తీసుకొని ఎద్దును నరికి, చర్మాన్ని వలిచి, ముక్కలు కోసి పిల్లలకు వండి పెడుతుంది. దుఃఖిస్తున్న భర్తను ఓదార్చి తినిపిస్తుంది. పిల్లలని చంపుకు తినేంత కరువు అది. ఇంతలో వారి యింటికి మీద ప్రజలు ఆకలి దాడి చేస్తారు. ఆ కుటుంబంలో ఓలాన్ ఒక్కటే వారిని ఎదుర్కొంటుంది. ‘… మా దగ్గర ఉన్నదంతా దోచుకొన్నారు కాబట్టి మా కంటే మీరే యిప్పుడు నయం. అందరం గడ్డీ, గాదం, చెట్టూ, బెరడు తిని బతుకుదాం పదండి. మీరు మీ బిడ్డల కొరకు, మేం మా బిడ్డలకొరకు, యిట్టి కాలాల్లో పుట్టబోతున్న యీ నాల్గోవాని కొరకు …’ అంటూ కడుపు కొట్టుకొంటుంది. ప్రజలు సిగ్గుపడి వెళ్లిపోతారు. అంత దుఃఖంలోనూ వాంగ్ తన భూమిని వాళ్ళు లాక్కొలేనందుకు సంతోషిస్తాడు.

ఓలాన్ కుటుంబం దక్షిణ ప్రాంతానికి వలస పోతుంది. ఆమె నాల్గో గర్భంలో ఆడపిల్ల పుట్టి చచ్చిపోతుంది. బిడ్డ కోసం ఏడ్చే వెసులుబాటు వాళ్ళకు ఉండదు. అగ్గి బండెక్కి (రైలు) గమ్యస్థానం చేరతారు. దక్షిణాది ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే అక్కడ అష్టైశ్వర్యాలు, పేదరికం చెరి సమానంగా ఉంటాయి. వాంగ్ కొనుక్కొని తెచ్చిన చాపలతో ఓలాన్ రోడ్డుపక్కన చక్కటి గుండ్రటి గుడిసె వేస్తుంది. గంజికేంద్రాలలో క్యూలో నిలబడి గంజి పోయించుకొస్తుంది. పిల్లల్ని కొట్టి అడుక్కోవటం నేర్పిస్తుంది. వాంగ్ ఆత్మన్యూనతతో కుమిలిపోతున్న ప్రతిసారీ ఓలాన్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకొంటుంది. కరువు కాలాల్లో ఎలా బతకాలో ఎంతో అనుభవం ఉన్నదానిలాగా ప్రవర్తిస్తుంది. నిజానికి ఆమెను చిన్నతనంలో కరువుకాలంలోనే తల్లితండ్రులు అమ్మివేస్తారు. ఆడపిల్లను అమ్మటానికి కూడా సిద్ధపడుతుంది. తమ దగ్గర ఉండి ఆకలితో చనిపోవటం కంటే అమ్ముడుపోవటమే సరైనది అనుకొంటుంది.

దక్షిణాది ప్రాంతాల్లో వాంగ్ కు విప్లవానికి సంబంధించి కొంత జ్ఞానం లభిస్తుంది. కొందరు విప్లవకారుల ప్రసంగాలు వింటాడు. ఏసుక్రీస్తు గురించి కూడా అప్పుడే మొదటిసారి తెలుసుకొంటాడు. కానీ ఓలాన్ కు అలాంటి అవకాశమే లేకపోయినా ఆమెకు ఉన్న లోకజ్ఞానంతో చాలా విషయాలు గ్రహిస్తుంది. త్వరలో ఒక భూస్వామి యింటి మీద దాడి జరగబోతుందని తెలిసి భర్తను హెచ్చరిస్తుంది. ఆ యింటి మీద జరిగిన ఉమ్మడి దాడిలో భార్యా భర్తలు ఇద్దరూ ధనాన్ని సంపాదించినా, ఓలాన్ కు యజమానులు డబ్బు దాచిపెట్టే చోటు ఆనుపానులు తెలుసు కాబట్టి ఎక్కువ నగలతో బయట పడుతుంది. వాంగులు వారి ప్రాంతానికి తిరిగి వస్తారు. దోచుకొని వచ్చిన డబ్బుతో చితికి పోయిన హ్యాంగుల నుండి చాలా భూమిని కొంటారు. ఇప్పుడు వాంగ్ భూస్వామి. పంటలు పుష్కలంగా పండుతుంటాయి. వద్దన్నా ధనం. కొత్తగా వచ్చిపడిన సిరి సంపదలు వాంగ్ ను ప్రలోభాలకు గురి చేస్తే ఓలాన్ మునుపటిలాగే కష్టపడుతూనే ఉంటుంది. శ్రమ చేయటమే ఆమె ప్రవృత్తి.

చివరకు వాంగ్, యింట్లోకి ఒక ఉంపుడుగత్తెను తెచ్చిపెడతాడు. మౌనంగా భరిస్తుంది ఓలాన్. ఈ భరించటం అనేది ప్రశంసించే విషయం కాదు కానీ, ఆ నాటి సమాజంలో ఓలాన్ కు అంతకంటే గత్యంతరం ఉండదు. కష్టపడి సంపాదించినదంతా భర్త కొల్లగొడుతున్నా పెదవి విప్పదు. చివరకు ఆమె ఎంతో ఇష్టంగా దాచుకొన్న రెండు ముత్యాలను భర్త తన ఉంపుడుగత్తె కోసం లాక్కొని వెళతాడు. ఆమె బాధ ఆయనకు అర్ధం అవుతున్నా కూడా ‘లోకంలో అందరికి ఉన్నట్లే నాకూ ఉంపుడుగత్తె ఉన్నది. దానికి ఆమె ఎందుకింత బాధపడాలి’ అనుకొంటాడు. ‘నువ్వు భూస్వామి భార్యలాగా ఎందుకు ఉండవు? మంచి దుస్తులు, మంచి చెప్పులు ఎందుకు వేసుకోవు?’ అని భార్యను ప్రశ్నిస్తుంటాడు.

నిజానికి వాంగ్ సున్నిత మనస్కుడు. భార్య చురుకుదనాన్ని, నైపుణ్యాలను, శ్రమించేతత్వాన్ని ఆరాధించేవాడు. భార్య, కుటుంబం తప్ప ఇంకో ఆలోచన లేకుండా అంత కాలం గడుపుకొస్తాడు. ఒక సామాన్య రైతు స్థాయి నుండి భూస్వామిగా మారిన తరువాత అతగాడి ఆలోచనలు కూడా అలాగే మారతాయి. ఆర్ధిక సంబంధాలే భావజాలానికి పునాది అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్ధం అవుతుంది. అతడి ఆలోచనలను లోకరీతిలో కాకుండా యింకో రకంగా ప్రభావితం చేసే ప్రగతిశీలశక్తులు కానీ, భావాలు కానీ ఆనాటి సమాజంలో లేవు. నవలలో ఒక దగ్గర మాత్రం రెడ్ ఆర్మీ వారుంటున్న వూరికి వచ్చినట్లు రాస్తారు. ఓలాన్ చిన్న కొడుకు రెడ్ ఆర్మీలో కలుస్తాడు.

చైనాలో స్త్రీలకు పాదాలు కట్టి వేసి, చిన్నవిగా చేస్తారు. అందువలన వారు త్వరగా నడవలేరు. ఆ మందగమనాన్ని, ఆ చిన్ని పాదాలనే సౌందర్యంగా భావిస్తారు. ఓలాన్ లాంటి శ్రమించే స్త్రీలు అలా పాదాలను చిన్నవి చేసుకోలేరు. అయితే ఓలాన్ తన చిన్న కూతురికి పాదాలు కట్టివేస్తుంది. ఆ పాప నొప్పితో ఏడుస్తూ తండ్రితో ‘… (పాదాలు) కట్టి వేయకపోతే అమ్మను నువ్వు ప్రేమించనట్లే నా భర్త కూడా నన్ను ప్రేమించడని అమ్మ చెప్పింది.’ అంటుంది. వాంగ్ ను ఆ మాటలు ముల్లులాగా పొడుస్తాయి. ఈ నవల నిండా ఎలాంటి హక్కులూ లేని బానిస స్త్రీలు, ఉంపుడుగత్తెలు ఎందరో కనిపిస్తుంటారు. కేవలం కడుపు నింపుకోవటానికి వారు జీవితాంతం యజమానుల యిళ్ళల్లో అరవ చాకిరీ చేస్తుంటారు. తమ బిడ్డలకు పాలు ఆపి, పాల దాదిలుగా యజమానుల బిడ్డలకు పాలు తాపుతుంటారు. యజమానులు వారిని అవసరం అయినపుడు వేరేవారి దగ్గరకు పండుకోవటానికి పంపిస్తుంటారు. వాంగ్ చివర్లో తన కూతురు వయసున్న బానిస పిల్లను ఉంపుడుగత్తెగా చేసుకొంటాడు. నిజానికి ఆ పిల్లను చిన్న కొడుకు ప్రేమిస్తాడు.

ఓలాన్ కు పెద్ద జబ్బు చేస్తుంది. వైద్యం కోసం వైద్యుడు ఐదువందల బంగారు నాణేలు అడుగుతాడు. అది విని ఓలాన్ ‘… ఐదు వందల వెండి నాణ్యాలా? వద్దు వద్దు. నా ప్రాణం అంత విలువైనది కాదు. అంత డబ్బు ఉంటే ఒక మంచి భూమి కొనవచ్చు’ అంటుంది. ఉంపుడుగత్తెల కోసం ఎంతో డబ్బు కుమ్మరించిన వాంగ్ అంత డబ్బు భార్య కోసం ఖర్చు చేయటానికి వెనుకాడతాడు. ఓలాన్ మరణిస్తుంది.

భూమిని ఎంతో ప్రేమించిన వాంగ్ భూమిలాంటి తన భార్యను, తన బిడ్డల తల్లిని ప్రేమించలేకపోతాడు. కరడు కట్టిన పితృస్వామిక వ్యవస్థ వాంగ్ ను తన దుష్ట ధృతరాష్ట్ర కౌగిలిలో బిగించివేస్తుంది. భార్యా భార్తల మధ్య అది పిశాచిలాగా ప్రవేశిస్తుంది. ప్రేమికులైన ఆలూ మగలనూ, కష్టసుఖాలలో సరి భాగస్వామ్యం పంచుకొన్న అన్యోన్య దంపతులను విడదీస్తుంది. ప్రేమ రాహిత్యంతో, నైరాశ్యంతో ఓలాన్ పరాజయం పొందుతుంది. ఈ పరాజయం ఓలాన్ ది ఒక్కదానిదే కాదు. సమస్త మహిళల పరాజయం అది. మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థ మార్పుతోనే స్త్రీకి పరాజయం ప్రారంభం అయ్యింది అని ఎంగెల్స్ అంటారు.

ఒక సందర్భంలో ఓలాన్ దుఃఖపడుతూ ‘పోదామంటే పుట్టిల్లు కూడా లేదు’ అనుకొంటుంది. తనదని అనుకొని కుటుంబ వృద్ధికోసం శ్రమించిన ఓలాన్ కు అక్కడ ఆమెకు ఏమీ లేదనే ఎరుక ఆమెతో బాటు పాఠకులను కంట తడి పెట్టిస్తుంది. ఒక బానిసపిల్ల ఆ యింటికి కోడలిగా వచ్చి భర్త సుక్షేత్రం లాంటి పొలాన్ని అందించి చివరకు ఏమీ లేక ఒంటరిది అవుతుంది. ఇలాంటి స్త్రీలు ఎందరో భారతదేశంలో మన కళ్ల ఎదుట. వందేళ్ళ క్రితపు చైనా సమాజం కంటే నేటి భారత సమాజం పెద్దగా అభివృద్ధి చెంది ఏమీ లేదు. ఇప్పటికీ సొంత ఆస్తి హక్కులేని స్థితి భారత మహిళది. ఇప్పుడు భారతదేశంలో ఓలాన్లు స్వయం ప్రతిపత్తి కోసం, నిర్ణయాధికారం కోసం, సమస్త హక్కుల కోసం పోరాడుతున్నారు.

(ఈ వ్యాసం ఆగస్టు 2016 మాతృకలో ప్రచురణ అయ్యింది)