ట్యాగులు

, , , , ,

 

అమ్మ- నవమాసాలు బిడ్డను కడుపులో మోసి, ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కని, బిడ్డను దేశ పౌరుడిగా అంకింతం చేయాలనే ఆమె బాధ్యత గురించే మనకు తెలుసు. కుటుంబంలో బిడ్డలు అందరూ తిన్న తరువాత మాత్రమే ఆమె తింటుందనీ, వారికి సకల సౌకర్యాలు సేవల రూపంలో యిస్తుందనీ; సమాజగర్భంలో ఆదేశిక సూత్రంగా అమలు అవుతున్న ధర్మమే జీర్ణం అయి ఉంది. వర్తమాన పరిస్థితుల్లో కళ్లకు కనిపిస్తున్న వాస్తవికత, తల్లికి అంతకంటే ఎక్కువ కర్తవ్యాన్ని సూచిస్తోంది. బిడ్డలకు చాకిరీ చేయటమే కాదు, వారి పురోభివృద్ధికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చే కష్టాన్ని కూడా ఆమెకే అంటగట్టింది ఇప్పటి సమాజం. బాధ్యతారహితమైన తండ్రుల నుండి విడివడీ, లేక కలిసుండీ కూడా; అనేక మంది అమ్మలు అష్టకష్టాలూ పడి బిడ్డలను పెంచుకొంటున్నారు. కుటుంబ హింసలను అనుభవిస్తూ అహోరాత్రులు పిల్లల కోసం శ్రమిస్తున్నారు. అయితే సంక్షోభ సమయాల్లో తల్లుల కర్తవ్యం అంతకంటే ఉన్నతంగా ఉంటోంది.

najeeb-motherఅదిగో అక్కడ నజీబ్ తల్లి ఫాతిమా నఫీస్, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర కొడుకు ఆచూకీ చెప్పమని ఆందోళన చేస్తోంది. 27 ఏళ్ల నజీబ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ముస్లిం యువకుడు. జెఎన్ యూలో బయో టెక్నాలజీ విద్యార్థి. జెఎన్ యూలో కాషాయీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉమ్మడి కార్యాచరణలో క్రియాశీలక కార్యకర్త. ఏబీవీపీ విద్యార్థి నాయకులు నజీబ్ మీద కన్నెర్ర చేశారు. 2016, అక్టోబర్ 16న యూనివర్సిటీలోని అతని గదిలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కొట్టారు. ఊర్లో ఉన్న తల్లికి ఫోన్ చేసి; దెబ్బలు తగిలాయనీ, హాస్పటల్ కు వెళుతున్నానని చెప్పి బయలుదేరిన నజీబ్ తల్లి వచ్చేసరికి అదృశ్యం అయ్యాడు. ఆనాటి నుండి ఆ తల్లి, కొడుకు కోసం అన్వేషిస్తూనే ఉంది. అనేక విజ్ఞప్తులు, వినతులు అయిన తరువాత రోడ్డున పడింది. ఒక సామాజిక కారణం కోసం పోరాడుతున్న తన కొడుకు అదృశ్యానికి కారకులను ప్రశ్నించమని అడుగుతోంది. గొంతు పగిలేలా విలపిస్తోంది. ఢిల్లీ పోలీసులు ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీప్ ఎక్కించారు. ఇప్పటికీ నజీబ్ అడ్రెస్ తెలియలేదు. ఆ తల్లి శోకం తీరలేదు.

radhika647_100616104627

నలభై నాలుగేళ్ల వేముల రాధిక 2016 జనవరి 17న కొడుకును పోగొట్టుకొన్నది. హైదరాబాదు యూనివర్సిటీలో కులవివక్షతకు వ్యతిరేకంగా యూనివర్సీటీ అధికారులతోనూ, ఏబీవీపీ కార్యకర్తలతోనూ సంఘర్షిస్తున్న ఆమె కొడుకు రోహిత్; భారతీయ జనతా పార్టీకీ, దాని నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వానికీ శత్రువు అయ్యాడు. ఢిల్లీ యూనివర్సిటీలో ముజఫర్ నగర్ మతదాడులను చిత్రీకరించిన డాక్యుమెంటరీ ప్రదర్శనకారులపై ఏబీవీపీ దాడులను ఖండిస్తూ హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రదర్శన చేశాడనీ, యాకూబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకించాడనీ అతణ్ణి దేశద్రోహిగా చిత్రీకరిస్తూ యూనివర్సిటీ హాస్టల్ నుండి బహిష్కరించారు. ఒంటరితనానికీ, వెలివేతకూ గురి అయిన రోహిత్ ఆత్మహత్య చేసుకొన్నాడు. రాధిక రోహిత్ ను కష్టపడి పెంచింది. వైవాహిక జీవితంలో వచ్చిన ఒడిదుడుకులూ, కుటుంబ హింసనూ రెంటినీ జయించి పిల్లల్ని చదివించింది. కొడుకులు పెద్దవాళ్లు అయ్యాక వారితో బాటే తానూ చదువుకొన్నది. ఇరవై ఏడేళ్ల ఆమె పరిశ్రమను హిందూ మతోన్మాదం రెండేళ్లలోనే కాలరాచింది. కొడుకు మరణానికి కారకులైనవారిని శిక్షించాలని ఆమె ఇప్పుడు దేశంలోని గడప గడపకూ తిరుగుతోంది. తన కొడుకు మరణానికి కారణం వ్యక్తిగతం కాదనీ, భారతదేశంలోని దళిత విద్యార్ధులందరికీ ఎదురవుతున్న కారణాల వలనే తన కొడుకు మరణించాడనీ తెలుసుకొని తన పోరాటాన్ని వంటరిగా కాకుండా అణగారిన శ్రేణులతో రాధిక, దాన్ని మమేకం చేస్తోంది. దుఃఖంతో పూడుకొనిపోయిన గొంతును పెకిలించుకొని నినదిస్తోంది. ఆమె ముందు ఉన్న శత్రువు బలమైనది. అది రాజ్యం రూపంలో నాలుగు పడగలతో విషం కక్కుతోంది.

25vsp-padma

మల్కన్ గిరి ఎన్ కౌంటర్ లో అమరుడైన మున్నా తల్లి శిరీష ఇప్పుడు కొడుకు మరణకారకుల మీద ప్రకటిస్తున్న యుద్ధం పూర్తిగా రాజకీయమైనది. కొడుకుని అడవులకు పంపేటపుడే ఆమెకు తెలుసు, అతని మరణ వార్త వినాల్సి వస్తుందని. దేశంలో మూడొంతులుగా ఉన్న పీడితుల, శ్రామికుల పక్షాన ఆమె కొడుకు యుద్ధానికి వెళ్ళాడు. దేశవనరులను కొల్లగొడుతున్న గద్దలను తరమడానికి ఆయుధం చేబట్టాడు. పాతికేళ్లు నిండని నూనూగు ప్రాయాన్నీ, యవ్వనాన్నీ పీడితప్రజల కొరకు ధారబోశాడు. కొడుకు మరణ వార్త ఆమెను నిర్ఘాంతపరిచింది. నిరాశపరిచింది. అయినా కంటి తడిని ఒత్తుకొని కొడుకు స్వప్నాలను ఆమె, తన కళ్లల్లో మళ్లీ నింపుకొంది. గడ్డకట్టుకొని పోయిన దుఃఖాన్ని శిలువ వేసుకొని కొడుకు ఆశయాలను మోస్తూ తిరుగుతోంది. అదే బాటలో శృతి తల్లి రమ, శాంత – ఇంకా అనేక మంది దళిత, ఆదివాసీ, కాశ్మీరు తల్లులు ప్రయాణం చేస్తున్నారు.

ఇప్పుడు కడుపుకోతకు నిర్వచనం వేరైంది. దుఃఖానికి అర్థం మారింది. పెంచి పెద్ద చేసిన పిల్లల నుండి తల్లులు ఇప్పుడు నేర్చుకొంటున్నారు. అవసాన దశలో తమను చూసుకోవాలనే ఆశ పడటం కాకుండా, సమాజానికి తమ పిల్లలు పూచీదారులుగా ఉండాలని కోరుకొనే తల్లులు ఇప్పుడు కనిపిస్తున్నారు. అనాదిగా కీర్తించబడిన తల్లుల త్యాగాల పరిధి; ఈ కాషాయి, కసాయి, దళారీ, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షల కాలంలో విస్తరించబడింది. పిల్లలు తల్లిదండ్రులననుసరించాలనే ధర్మం, తల్లిదండ్రులు బిడ్డల బాట పట్టాల్సిన కర్తవ్యంగా మారిపోయింది. తల్లీ పిల్లల బంధం రక్త సంబంధాన్ని ఉన్నతీకరించే సామాజిక సంబంధంగా మారుతోంది. తల్లులు ఉద్యమకారులు అవుతున్నారు. బిడ్డల పోరుబాటలో తల్లులు సాగుతున్నారు.

(ఫిబ్రవరి 2017 మాతృక సంపాదకీయం)