ట్యాగులు

, , ,

రక్తసిక్త వర్గ పోరాటానికి ఉయ్యాలలూపిన నక్సల్బరీ

బెంగాల్ రాష్ట్రానికి రైతాంగ పోరాటాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 18,19 శతాబ్దాలలో జరిగిన అనేక శాంతియుత నిరసనల, సాయుధ పోరాటాల వ్యక్తీకరణగా బెంగాల్ రాష్ట్రం దేశపటంలో కనిపిస్తుంది. వీరి పోరాటాలు విన్నూత పద్దతుల్లో సాగేవి. ఆకస్మిక సాయుధ దాడులు, ఆయుధాలు ధరించిన ప్రదర్శనలు జరిగేవి. 20వ శతాబ్దంలో కూడా ఈ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతం; అందులోనూ ముఖ్యంగా డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ, ఖారిబరి, ఫన్సీదేవ పోలీసు స్టేషన్ల పరిధిలో రైతుల అలజడులు నిత్యం జరుగుతుండేవి. ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధి 274 చదరపు మైళ్లు. జనాభా షుమారు ఒక లక్షా యాభై వేలు. అందులో యాభైవేల మంది, దగ్గరలో ఉన్న 32 టీ తోటల్లో కూలీలుగా పని చేసేవారు. ఈ ప్రాంతమంతా అడవులతోనూ, పొదలతోనూ, టీ తోటలతోనూ నిండిన స్థలం. వరి తక్కువ దిగుబడి వచ్చేది. ఈ ప్రాంతానికి నేపాల్, బంగ్లాదేశ్, బీహార్ లు సరిహద్దులుగా ఉంటాయి. ఇక్కడ రైతులు ప్రధానంగా ఆదివాసులు. సంతాలులు, ఒరాన్లు, రాజ్ బన్సీలు వీరిలో ముఖ్యమైన తెగలు. ‘అధియార్ వ్యవస్థ’ పేరుతో ఉండే జోతేదార్లు (భూస్వాములు) వీరిని పీడించేవారు. విత్తనాలు, నాగళ్లు, ఎద్దులను రైతులకు యిచ్చి, దానికి ప్రతిఫలంగా ఎక్కువ పంటను వారి నుండి లాక్కొనేవారు. లోపభూయిష్టమైన ఈ భూకౌలుదారి వ్యవస్థపై ఆదివాసీ రైతులు అసంతృప్తిగా ఉండేవారు.

ఆదివాసీ సమాజపు పాత వ్యవసాయిక క్రమానికి బ్రిటీష్ వలస ప్రభుత్వం సంపూర్ణంగా భంగం కలిగించటం వలన అది ఆదివాసీ తిరుగుబాట్లకు ఒక ఉమ్మడి అంశాన్ని అందించింది. అటవీ సంపదపై, భూమిపై వారికున్న హక్కులను బ్రిటిష్ ప్రభుత్వం క్రూరమైన పద్దతుల్లో లాగేసుకొన్నది. అయితే ఈ పోరాటాలు పూర్తిగా అసమానమైనవి. ఒక వైపు ఆధునిక ఆయుధాలతో కవాతు చేసే రెజిమెంట్లూ; మరో వైపు రాళ్లూ, కొడవళ్లూ, విల్లంబులు. జండామార్పిడి తరువాత కూడ భూచట్టాల విషయంలో పెద్ద మార్పులు రాలేదు. భారత్ కిసాన్ సభ ఆధ్వర్యంలో స్థిరమైన పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలన్నిటిలో మహిళలకు క్రియాశీలక పాత్ర ఉంది. ఎందుకంటే ఆదివాసీ ఉత్పత్తి విధానంలో మహిళలకు సమాన భాగస్వామ్యం ఉన్నది కాబట్టి.

నక్సల్బరీకి ముందే వేల సంఖ్యలో ఆదివాసీ పోరాటాలు భూమి కోసం, భుక్తి కోసం జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పిన తరువాత బెంగాల్ లోనే జరిగిన తెభాగా (మూడింట రెండు వంతులు అని ఆ పదానికి అర్థం) పోరాటం అందులో ఒకటి (1946-47). పండిన పంటలో భూస్వాములకు సగం యిచ్చి, సగం మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి ఆదివాసీ రైతులకు ఉండేది. ఆనాటి అవిభక్త కమ్యూనిష్టు పార్టీ ఆధ్వర్యంలోగల కిసాన్ సభ నాయకత్వంలో రైతులు మూడింట రెండు వంతుల ధాన్యాన్ని తమ గాదెల్లో పోసుకొన్నారు. ఉత్తర బెంగాల్ లోని దినావూ రంగాపూర్ల నుండి మొదలైన ఈ ఉద్యమం, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వ్యాపించి దక్షిణాన ‘24 పరగణాల’ జిల్లా దాకా విస్తరించింది. భూస్వాములనూ, గూండాలనూ, పోలీసులనూ ఆదివాసీలు ఎదిరించారు. షుమారు 60 లక్షల మంది రైతులు ఇందులో పాల్గొన్నారు. (అందులో సగం మహిళలు ఉండి ఉంటారనే విషయం మర్చిపోకూడదు) తీవ్ర వర్గ ద్వేషాన్ని రగిల్చిన ఈ ఉద్యమం తక్కువ కాలంలోనే అణచివేతకు గురి అయ్యింది.

నక్సల్బరీ నేపథ్యం:

అధికార మార్పిడి తరువాత వచ్చిన భూస్వామ్య అనుకూల విధానాలు, భూమిని క్రమంగా దాని హక్కుదారులైన ఆదివాసీ చేతుల నుండి జోతేదార్లకు (భూస్వాములకు) చేర్చాయి. బ్రిటీష్ కాలం నాడు పోగొట్టుకొన్న హక్కులతో పాటు భారత ప్రభుత్వం చేపట్టిన ఈ నయా వలస విధానం ఆదివాసీల స్థితిని నానాటికీ దిగజార్చింది. దానికి సమాంతరంగా పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక సంక్షోభం, ఆహార కొరత, నిరుద్యోగం, పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ విధానాల పరాజయం తదితర విషయాలు దేశం మొత్తం మీద అసంతృప్తిని రగిల్చాయి. ఆనాటి సిపిఎం కూడా అధికార రాజకీయ పార్టీతో జత కూడి భూసంస్కరణలను అమలు పరచలేక పోయింది. శాంతియుత పరివర్తన అనే పేరుతో బూజు పట్టిన బ్రిటిష్ చట్టాలకు బద్ధులై ఉండాలని ఆదివాసీలకూ, ఆనాటి పోరాట నాయకులకూ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. వలసవాదం నుండి విముక్తి అయ్యి ఇరవై సంవత్సరాలు గడిచినా; లక్షల్లో పేద రైతులు, భూమిలేని కూలీలు, పట్టణ కార్మికులు, విద్యార్థులు, యువకులు అసంతృప్తితో రగిలిపోయి ఉన్నారు. వివిధ పొరల రాజకీయ సంక్షోభం చుట్టుముట్టిన కాలంలో; ప్రజల ఆగ్రహం, నిస్పృహ మిన్నంటి ఉన్నాయి. నక్సల్బరీ ఈ వత్తిడి నుండి బయటకు ఎగసిన విప్లవ కెరటం. భౌతిక పరిస్థితులు మాత్రమే ప్రజా సమూహాల కార్యాచరణను నిర్ణయిస్తాయి. ప్రజలు నక్సల్బరీ కార్యాచరణను అందుకోవాల్సి వచ్చింది. అందుకొన్నారు. అది విఫలమవడానికి వంద కారణాలు ఉండొచ్చు. ఎగిసి ఎగరటానికి మాత్రం ఆకలే కారణం.

విప్లవంలో విద్యార్థులు:

‘తుపాకి గొట్టంతోనే విప్లవం’ ‘నీ పేరూ, నా పేరూ వియత్నాం; నీ ఇల్లూ నా ఇల్లూ నక్సల్బరీ’ లాంటి నినాదాలు గోడల నిండా కనబడేవి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, హిందూ హాస్టల్; విప్లవ రాజకీయాలకు కేంద్రాలు అయ్యాయి. అందరికంటే ముందు ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు మెడికల్ కాలేజీ నుండి విద్యార్ధులు ‘నక్సల్బరీ సంఘీభావ కమిటీ’ గా ఏర్పడి నక్సల్బరీ సందర్శించారు. దేశవ్యావ్తంగా యువకులు నక్సల్బరీ దారి పట్టారు. పంజాబ్, బీహార్, యూపీ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ యూనివర్సిటీ కాంపస్ ల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులు అయ్యారు. అవినీతి, మోసం, ఆశబోతుతనం, ఏ సిద్ధాంతాలూ లేని అవకాశవాదం ఏలుతున్న పార్లమెంటరీ రాజకీయాల పట్ల అప్పటికే ఏవగింపుతో ఉన్న యువకులు; నక్సల్బరీ వారి జీవితాలకు అర్థం కల్పించినట్లు భావించారు. నక్సల్బరీ మార్గం వారికి న్యాయంతోనూ, నిజాయితీతోనూ, సమానత్వంతోనూ, మానవత్వంతోనూ, ఆత్మ గౌరవంతోనూ నిండిన భవిష్యత్తును వాగ్దానం చేసింది. గ్రామాలకు వెళ్లి రైతులను ఆర్గనైజ్ చేశారు. ‘ఎన్ కౌంటర్’ అనే పదం అప్పుడే పుట్టింది. 17-25 సంవత్సరాల మధ్య వయసు కలిగి, విప్లవ రాజకీయాలు ఉన్న యువతను ప్రభుత్వం టార్గెట్ చేసింది. వందలకొద్ది యువకులను కాల్చి చంపింది. కస్సిపోర్ – బరానగర్ మారణకాండలో కాంగ్రెస్ గూండాలు, సిపిఎం కార్యకర్తలతో కూడి ఇల్లిల్లూ వెదికి యువకులను హింసించారు. స్త్రీలపై లైంగిక దాడి చేశారు. ఇళ్లు తగలబెట్టారు. ఆ కాలంలో దాదాపు 10000 మంది యువకులు ప్రాణత్యాగం చేశారు. శ్రీకాకుళం చీకటి అడవుల్లో, కలకత్తా నిశీధి వీధుల్లో, వంటరి లాకప్పులలో వేలకొలది యువకులు చిత్రహింసల పాలు అయ్యారు. జైళ్లలో మగ్గారు. సరోజ్ దత్తా, అప్పూ లాంటి సెంట్రల్ కమిటీ నాయకులు అదృశ్యమయ్యారు. చారు మజుందార్ కలకత్తాలోని ఒక పోలీస్ స్టేషన్ లో లాకప్ మరణం పొందాడు. కానూ సన్యాల్, సంగల్ సంతాల్ అరెస్టు అయ్యి ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు.

ఆ రోజు ఏమి జరిగింది? మే 25, 1967

నక్సల్బరీ యాదృచ్ఛిక సంఘటన కాదు. అంతకు ముందు జరిగిన అనేక పోరాటాల కొనసాగింపు మాత్రమే. 1951 నుండీ రైతాంగ పోరాటాలు ఊపందుకొన్నాయి. 1955-56ల మధ్య టీ తోట కార్మికులు ఒక వైపు బోనస్ల కోసం ఉద్యమిస్తూ ఉండగా, ఇంకో వైపు రైతాంగం భూహక్కుల కోసం పోరాడుతూ ఉండింది. కిసాన్ సభ పిలుపు మేరకు నక్సల్బరీ శాఖ, బినామీ భూముల ఆక్రమణకు దిగింది (1958-62). సహజంగానే జోతేదార్లకూ, రైతులకు మధ్య ఘర్షణలు జరిగాయి. దాదాపు 2000 మంది రైతులు అరెస్టు అయ్యారు. 1966-67 మధ్య నక్సల్బరీ పతాక స్థాయికి చేరుకొనేదాకా; భారత దేశంలో పల్లెలు అన్యాయాన్నీ, పీడననూ భరిస్తూ నిద్రపోతూ ఉంటాయి అనే అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయాన్ని బద్దలు కొడుతూ నక్సల్బరీ ఉవ్వెత్తున లేచింది.

1966లో టీ తోట కార్మికులు 16 రోజులు సమ్మె చేశారు. 1967 ప్రారంభంలో సిల్ గురి సబ్ డివిజన్ రైతులు సమావేశమై గ్రామ గ్రామాన రైతు కమిటీలు వేయాలనీ, జోతేదార్ల దాష్టీకం ఎదుర్కోవటానికి ఆయుధాలు పట్టాలనీ, భూపంపకాలు చేసుకోవాలనీ తీర్మానాలు చేశారు. దాదాపు 20000 మంది రైతులు పూర్తికాలం కార్యకర్తలుగా నమోదు చేసుకొన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పడి గస్తీ దళాలను ఏర్పరుచుకొన్నాయి. భూ ఆక్రమణలు జరిగాయి. తప్పుడు రెవెన్యూ రికార్డులను ప్రజలు తగలబెట్టారు. పీడించే భూస్వాములకు మరణశిక్ష విధించారు. వారి నుండి తుపాకులు లాక్కొన్నారు. ఈ లోపల 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకొని యితర పార్టీలతో కలిసి (కాంగ్రెస్ తో సహా) ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. నక్సల్బరీ, ఖారీబరీ, ఫన్సీదేవ ప్రాంతాలలోని రైతులను అరెస్టులు చేయటానికి ఈ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదనపు పోలీసు బలగాలు, మిలటరీ పోరాట ప్రాంతానికి దిగాయి. ఇవే వామపక్షాల ఆధ్వర్యంలో అంతకు పదేళ్ల ముందు వరకు, తెలంగాణాలో వీరోచిత రైతాంగ పోరాటం నడిచింది. మారిన అంతర్జాతీయ కమ్యూనిస్టు పరిస్థితులూ, కమ్యూనిస్టు నాయకత్వంలో ఊడలు దిగిన రివిజినిజం ఈ విపత్కర మార్పుకు కారణాలు.

1967, మే 24న కొంతమంది రైతులను అరెస్టు చేసేందుకు పోలీసు పార్టీ ఒక గ్రామానికి వెళ్లింది. అక్కడ సాయుధులైన ఆదివాసీ తెగ ప్రజలతో జరిగిన ఘర్షణలో సోనాం వంగ్డే అనే పోలీసు చచ్చిపోయాడు. అందుకు ప్రతీకారంగా ఆ మరుసటి రోజు మే 25న నక్సల్బరీలోని ప్రసాదోటేకు ఒక దళంగా వెళ్లి గ్రామప్రజలపై కాల్పులు జరిపారు. తత్ఫలితంగా ఆరుగురు స్త్రీలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు మరణించారు. గాయపడిన వారిని అరెస్టు చేశారు. మిగిలిన నాయకులు ఎక్కడ ఉన్నారు అని ఎంత వేధించినా అరెస్టు అయిన వారు ఒకటే చెప్పారు. “వారు చల్లని గాలిని పీల్చుకోవటానికి వెళ్లారు” అని.

రైతు కూలీలూ, పేద రైతులూ; రెక్కల కష్టం మీద బతికే కార్మికులుగా మారబోతున్న ఆ మారుమూల ప్రపంచం పునరుజ్జీవనం పొందింది. ఎప్పటికీ అమలు కాని భూసంస్కరణల పవిత్ర రొంపినుండి రైతాంగం బయట పడింది. నక్సల్బరీ వెలుగు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలోనూ, బీహార్ లో ముషహరిలోనూ, ఉత్తరప్రదేశ్ లో లక్ష్మీ- ఖేరిలోనూ; ఇంకా పశ్చిమ బెంగాల్లో మిడ్నాపూర్, బంకురా, మాల్డా, కూచ్బిహార్, జల్పైగురి, బీర్భూమ్, నాడియా, హౌరా, పురిలియా, ఉత్తర దక్షిణ ’24 పరగణాలు’ మొదలైన ప్రదేశాలకు పాకింది. బీద రైతులనూ, భూమిలేని రైతులనూ; నక్సల్బరీ నుండి వచ్చిన సమాచారం వారిని తిరగబడేలా చేసింది. వారిలో నిద్రాణమై ఉన్న వీరత్వాన్ని పురిగొల్పింది. తిరుగుబాట్లు, ఆకలి దాడులు, దేశమంతా జరిగాయి. అటువంటి సంఘటనలు అస్సాంలో ఐదు; ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది; బీహారులో తొమ్మిది; కేరళలో ఏడు; మధ్యప్రదేశ్ లో ఏడు; మహారాష్ట్రలో ఐదు; పంజాబులో ఐదు; రాజస్తాన్ లో మూడు; తమిళనాడులో మూడు; ఉత్తరప్రదేశ్ లో ఐదు; మణిపూర్, త్రిపుర, గుజరాత్ లలో ఒక్కొక్కటీ జరిగాయి. నక్సల్బరీ ఒక ఘటనగానో, అణచివేయబడ్డ పోరాటంగానో మిగలకుండా భారతదేశపు జీవిత విధానం అయ్యింది. తిరగబడిన ప్రతివాడినీ నక్సల్ అన్నారు. వాళ్లనే ఒకప్పుడు దేశభక్తులు అని అన్నారు. ఎప్పుడూ దేశద్రోహులు అని కూడా అంటారు.

నక్సల్బరీ ని ఒక ఆర్థిక పోరాటంగానే పరిమితం చేసి మాట్లాడేవారు కూడా ఉన్నారు. నిజానికి పోరాట పతాక దశలో సిపిఎం పార్టీ నుండి భూసంస్కరణలను అమలు చేస్తామనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఆ ప్రతిపాదనలను నక్సల్బరీ రైతాంగం తిరస్కరించింది. భూస్వాముల నుండి అదనపు భూములను లాక్కోవటం, ప్రభుత్వానికైనా ఎంత సాధ్యమో రైతులు వాళ్ల అనుభవంతో తెలుసుకొన్నారు. వేళ్లూనుకొని పోయిన భూస్వామ్యవ్యవస్థను చట్ట పద్ధతుల్లో పెకలించలేమనీ తెలుసుకొన్నారు. అంతకంటే ప్రధానంగా వారి గురి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవటం మీదనే ఉండింది. నక్సల్బరీ అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం సంపాదించుకొనే లక్ష్యంగానే సాగింది. అదే నక్సల్బరీ ప్రత్యేకత. తెలంగాణ పోరాటకాలానికి ఉన్న అస్పష్టత ఇక్కడ తొలిగిపోయింది. అందుకే వ్యవసాయ రంగంలో ఈ ఉద్యమం శాశ్వతముద్ర వేసింది. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మైలు రాయిగా నిలిచింది.

నక్సల్బరీ అంటే హింస, ఉన్మాదం మాత్రమే అని గుర్తుకు వచ్చేటట్లు ప్రచారం చేయగలగటంలో రాజ్య వ్యవస్థ విజయం సాధించింది. నిజానికి నక్సల్బరీ ఒక అవాస్తవ భ్రాంతి నుండి మేల్కొలుపు. సాంప్రదాయాలను ప్రశ్నించకూడదనే ఆచారానికి ధిక్కారం. సాయుధ పోరాట ప్రయాణానికి ప్రారంభం. భారతదేశంలో మూడో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి మూలకారణం.