ట్యాగులు

, , ,

anthen-sc-759

సినిమా హాళ్లలో జాతీయ గీతం వినిపించాలనీ, ఆ సమయంలో జాతీయ జండా తెరపై కనిపించాలనీ, ప్రేక్షకులంతా లేచి నిలబడాలనీ ఇటీవల సుప్రీం కోర్టు నిర్దేశం చేసింది. ‘ఈ కాలం ప్రజలకు జాతీయ గీతాన్ని ఎలా పాడాలో తెలియదు, వారికి నేర్పించాలి,’ అని వ్యాఖ్యానించింది. అత్యున్నత ధర్మాసనం చేస్తున్నఈ రకమైన వ్యాఖ్యానాలు ఎన్నో ప్రశ్నల్ని రేపుతున్నాయి. న్యాయస్థానాల పని చట్టాలను అన్వయించటమా, లేక చట్టాలను చెయ్యటమా అనే ప్రశ్న ఆ ప్రశ్నలలో ఒకటి. ప్రజాస్వామ్యంలో ఎవరి విధులు వారికి ఉంటాయని చెబుతారు కదా! ప్రజాప్రతినిధుల సభలు చేయాల్సిన చట్టాలని న్యాయస్థానాలు చేయటంలోని ఉచితానుచితాల ప్రశ్న తప్పని సరిగా వస్తుంది. అసలు ఈ కాలమే ఆదేశాల కాలం అనిపిస్తుంది. ఒక రాత్రి పూట నోట్ల రద్దు ప్రకటన వస్తుంది. ఇక దానికి కొనసాగింపుగా రోజుకో ఆదేశం జారీ అవుతూ ఉంటుంది. ఈ ఆదేశాలు యిచ్చే జాబితాలోకి ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా చేరింది.

ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఓ ఆసామి ఇలా అంటాడు. ‘దేశ స్వాతంత్ర్యానికి ప్రతీక జండా ఒక్కటే కాదు, ఆ జండాను ఒకానొక నిరసనతో తగలబెట్టటానికి ఆ దేశపౌరునికి ఉన్న స్వేచ్ఛ కూడా దేశ స్వాతంత్య్రానికి ప్రతీక,’ అని. ‘జాతీయ గీతం ట్రాఫిక్ సిగ్నల్ కాదు గౌరవించటానికి. అది శిస్తు కాదు తప్పనిసరిగా కట్టటానికి. అది పరీక్ష కాదు పాస్ అవటానికి. గౌరవానికీ, విధేయతకు తేడా ఉంది. భక్తికీ, పాటింపుకీ తేడా ఉంది. నిబద్ధతకూ, లొంగుబాటుకూ తేడా ఉంది. జాతీయ గీతం ఉమ్మడి గౌరవానికి కవితాత్మక వ్యక్తీకరణ. పురాతన యుగాల అనాగరికత నుండీ, మధ్య యుగాల మూఢవిశ్వాసాల నుండీ ఒక గౌరవప్రదమైన దేశపు నడకను అక్షరీకరించే గేయం,’ అని ఇంకో ప్రజాసామికవాది నమ్ముతాడు. కమ్యూనిస్టుల, విప్లవకారుల భాష్యాన్ని పట్టించుకోకపోయినా ఇలాంటి ప్రజాస్వామికవాదులు ఏమి ఆలోచిస్తున్నారో అనైనా కోర్టులు పట్టించుకోవాలి.

బాబ్రీ మసీద్ కూల్చివేతను చూసినవాళ్లు, గుజరాత్ అల్లర్లకు సాక్షులైన వాళ్ళు… ముజఫర్ నగర్, కాశ్మీర్, ఖైర్లాంజీ బాధితులు, ‘మేరా భారత్ మహాన్’ అనుకోగలరా? అమాయక పిల్లల, మహిళల రక్తం ప్రవహించిన చోట ‘నేనిక నా జాతీయ గీతాన్ని ఆలపించలేను,’ అనే నిర్ణయం వారు తీసుకొంటే అది దేశద్రోహం అవుతుందా? తిరుగుబాటుదార్లు, ఆకలిగొన్నవాళ్లు, నేరస్తులు, సమస్త బాధలతో కునారిల్లుతున్నవాళ్లను దాచిపెట్టి దేశాన్ని పరిశుద్ధంగా చూపించాలనీ, ప్రస్తుతించాలనీ అనుకోవడం కంటే హిపోక్రసీ ఇంక ఏముంటుంది? అమెరికాలోని ఫుట్ బాల్ ఆడే నల్ల జాతి ఆటగాళ్లు, జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు నిల్చోవడానికి బదులుగా గత రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల మీద వంగి కూర్చొంటున్నారు. వారు ఎదుర్కొంటున్న వివక్షతకు నిరసనగా అలా చేస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ కూడా దానికి అంగీకరించాల్సి వచ్చింది. భారతదేశంలో సుప్రీం కోర్టు ఆదేశం రాక ముందే వికలాంగుడైన ఒక ఆర్టిస్టు జాతీయ గీతం ఆలపించేటపుడు నిలబడలేక పోతే అతనిపైన దాడి చేశారు. ఇక ఆదేశం వచ్చాక జరుగుతున్న దాడులు, జరగబోయే దాడులు తలుచుకొంటే అత్యున్నత న్యాయస్థానం ఈ దారుణాలకు అవకాశం యిచ్చిందని భావించాల్సి వస్తుంది. అన్యాయపు తీర్పులతో న్యాయస్థానాలు ప్రజల మధ్య ద్వేషానికి అంకురార్పణ చేస్తుంటే గతకాలపు మంచి న్యాయమూర్తులు గుర్తుకు రాక మానరు. 1987లో కేరళ స్కూలు పిల్లలు ముగ్గురు ‘జనగణమన’ పాడటానికి నిరాకరించినపుడు వారిని స్కూలు నుండి బహిష్కరించారు. జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి ఈ కేసులో తీర్పు యిస్తూ ఆ బహిష్కరణ చెల్లదని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) మరియు 25 ప్రకారం ఆ బహిష్కరణ ప్రజల హక్కులను హరిస్తుందని చెప్పారు.

ఇక ఈ జాతీయ గీతం పాడటం ఒక్క సినిమాహాళ్లకే పరిమితమా? సినిమా అనేది మనిషి వినోదం కోసం ఏర్పరచుకొన్న ఒక వ్యక్తిగత పార్శ్వం. అందులో ఎన్నో వ్యాపారాత్మకమైన అంశాలు చొరబడి ఉన్నాయి. వినోదం పేరుతో ప్రజలకు కీడు చేసే విషయాలు కూడా అందులో ఉంటాయి. కథా నాయకుడు తాగుతుంటాడు. కథానాయకి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉంటుంది. మానవ హృదయం భరించలేనంత హింస సినిమాల ద్వారా ప్రజలకు అలవాటు చేస్తుంటారు. ఇదంతా ప్రజలు కోరుకొన్నదో లేక రాజ్యం ప్రజలపై రుద్దుతున్నాదో అన్న విషయం పక్కన పెట్టినా ఆ వ్యక్తిగత పార్శ్వంలోకి వెళ్లి దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నం అంతటితో ఆగుతుందా? కోట్ల ఖర్చుతో వినోదాన్ని అమ్ముతున్న క్రికెట్ మాచ్ ల ప్రారంభానికి అది విస్తరించవద్దా మరి? ప్రభుత్వ ఆమోదంతో నడుస్తున్న పబ్ లలో, క్లబ్ లలో కూడా దేశభక్తి గీతాన్ని ప్రజలకు నేర్పించవద్దా?

బలాత్కారంగా నేర్పించే జాతీయవాదం విభిన్న అస్తిత్వాలనూ, ప్రవర్తనలనూ దున్ని చదును చేస్తుంది. జాతీయవాదం ఇంత ఆగ్రహంతోనూ, బలవంతంతోనూ, నిరంకుశంగానూ ఉండకూడదు. జాతీయభావం సౌందర్యాత్మకంగా ఉండాలి. సమర్థతతో ఉండాలి. నిజమైన దేశప్రేమతో ఉండాలి. దేశమంటే జాతీయ గీతాలు, జాతీయ పతాకాలు, సైనికులు మాత్రమే కావు. దేశమంటే ప్రజలు. కాల స్థలాదులను బట్టి వారి మనోభావాలకు విలువనివ్వాలి. ప్రజలను చీల్చి వారి మధ్య తగాదాలు పెట్టే పనిని న్యాయస్థానాలు మాత్రం చేయగూడదు.

(ఈ వ్యాసం జనవరీ, 2017 మాతృకలో సంపాదకీయంగా ప్రచురణ అయ్యింది)