ట్యాగులు

, , , , , ,

gorno-badahshanskaya-avtonomnaya-oblastకథాకాలం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న1940ల ప్రాంతం. కథాస్థలం మధ్య ఆసియాలోని కిర్గిజ్ స్థాన్. కధాస్థలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కథాప్రదేశం కూడా ఈ నవలలో ఒక ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. విశాలమైన సైప్ మైదానాలు, సగంకాలం మంచు కప్పుకొని బారులు తీరిన పర్వత శ్రేణులు, దేశమంతా ఉధృతంగా ప్రవహించే సెలయేళ్ళతో కిర్గిజ్ స్థాన్ ఒకప్పుడు అందమైన వెనుకబడిన దేశం. చైనాకు బార్డర్ గా ఉన్న ఈ చిన్నదేశంలో నివసించే ప్రజలు గతంలో గిరిజనులు, సంచారులు. రష్యా విప్లవం తరువాత కజఖ్ స్థాన్, ఉజ్ బెకిస్థాన్ తో బాటు ఈ ప్రాంతం రష్యా పరిపాలనలోని యుఎస్ ఎస్ ఆర్ లో రిపబ్లిక్ గా కలిసింది. స్టాలిన్ నాయకత్వంలో ఈ దేశంలో విశేషమైన అభివృద్ధి జరిగింది. తర్వాత కాలంలో పారిశ్రామీకరణ చెంది అనేక పట్టణాల నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ దేశం అంతర్జాతీయ టూరిస్టు కేంద్రంగా ఉంది.

ఈ నవలా రచయిత చింగీజ్ ఐత్ మాతొవ్ కిర్గిజ్ స్తాన్ లో పుట్టినవాడే. తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన తండ్రిని అరెష్టు చేసి అనేక మందితో కలిపి స్టాలినిస్టులు చంపివేస్తారు. సాంస్కృతిక విషయాలలో వచ్చిన బేధాభిప్రాయాలే ఈ హత్యలకు మూలం అంటారు. ఎక్కడో మారుమూల దేశమైన కిర్గిజ్ స్థాన్ ప్రజలను, ప్రపంచ ప్రజలకు చింగీజ్ తన రచనలద్వారా దగ్గర చేశాడు. ఏ దేశంలో, ఏ రచయితకు లేని ప్రాముఖ్యత చింగీజ్ కు కిర్గిజ్ స్థాన్ లో యిచ్చారు. ఆయన విగ్రహాలను అనేక పట్టణాల నడికూడళ్ళలో నిలబెట్టారు. ఆ దేశంలో చాలా మ్యూజియాలకు చింగీజ్ ఐత్ మాతొవ్ పేరే ఉంటుంది. ప్రపంచ రచయితలు టాల్ స్టాయ్, మాక్సిం గోర్కీలను కూడా మనం వారి రచనలలోనే తలుచుకొంటాము ఇప్పటికీ. బహుశ ఆయనకు యిచ్చిన ప్రాముఖ్యతకు కారణం తర్వాత కాలంలో ఆయన గోర్భచెవ్ అనుచరుడిగా మారి ‘పెరిస్ట్రోయికా’ను సమర్ధించటమే అయి ఉంటుంది. 1991లో యుఎస్ ఎస్ ఆర్ విచ్ఛిన్నమైన తరువాత ఆయన కిర్గిజ్ స్థాన్ కు ప్రతినిధిగా జర్మనీలో ఉన్నాడు. ఆయన యితర రచనలు ఇంకా రెండు ‘తల్లి భూదేవి’, ‘తొలి ఉపాధ్యాయుడు’ పేర్లతో తెలుగులోకి అనువాదం అయ్యాయి. జమీల్యా నవలను మొదట 1971లో ప్రగతి ప్రచురణాలయం వారు ప్రచురించారు. 2008లో హైదారాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. అనువాదం ఉప్పల లక్ష్మణరావు చేశారు.

Jameelyaసంచారజీవులు వాళ్ళు. వెనుక బడిన దేశంలో నివశిస్తుంటారు. భర్త చనిపోతే కొడుకులున్న తల్లి వంశాన్ని వదిలి వెళ్లకూడదు. ఆమెకు దగ్గర బంధువునే పెళ్లి చేసుకోవాలి. ఆమె పిల్లలతో పాటు ఆమె కూడా పెళ్లి చేసుకున్నవ్యక్తికి సొంత ఆస్తి అవుతుంది. భూమండలం అంతా పురుషాధిక్యత ఆవహించి వున్నప్పుడు, పీడన రూపాలు మారవచ్చు కాని ప్రపంచంలో స్త్రీలందరి స్థితీ ఒకటే. అలాంటి కుటుంబంలోకి కోడలిగా వస్తుంది జమీల్యా. గుర్రపు పందెంలో ఆమె చేతిలో ఓడిపోయి, సాదిక్ ఆమెను రాక్షస వివాహం చేసుకొన్నాడని అనుకొంటారు. ఏమైనా జమీల్యా ఆ యింటికి వచ్చినందుకు పశ్చాత్తాపబడదు. కుటుంబం కోసం కష్టపడి పని చేస్తుంది. ఆమె పనిలో మొండితనం, దుడుకుతనం ఉండేవి.

కథా సమయానికి ఈ దేశంలోని యువకులంతా రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులుగా చేరి ఉంటే .. స్త్రీలూ, పిల్లలూ, వృద్ధులూ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో పనిచేస్తూ ఉంటారు. యుద్ధం నుండి ఏ రోజు ఏ వార్త తమ పిల్లల గురించి వినాల్సివస్తుందో అని ముసలి తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. యుద్ధ భీభత్సానికి అనుసంధానమైన దుఃఖం ఆ యిళ్ళలో ప్రవహిస్తూ ఉంటుంది. జమీల్యా భర్త యుద్ధానికి వెళతాడు. ఇద్దరు అత్తగార్లు, మామగారూ, మరుదులూ, మరదళ్ళతో జమీల్యా జీవిస్తుంటుంది. ఎలాంటి పనినైనా అవలీయగా చేయగల నైపుణ్యం, శారీరక బలిమి ఉన్న బాలిక జమీల్యా. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలెత్తుతూ, అప్రస్తుతంగా చిరునవ్వులు చిందిస్తూ, ఉన్నట్లుండి అత్తగార్లకు ముద్దులు పెడుతూ, పాటలు పాడుకొంటూ సంతోషంగా ఉండే పిల్ల. ఎర్రటి ఎండలో సమిష్టి వ్యవసాయ క్షేత్రంనుండి ధాన్యం మూటలు కట్టి కొన్ని మైళ్ళ దూరంలో ఉండే రైలు స్టేషనుకు గుర్రపుబండ్లలో తీసుకొని పోవాల్సిన బాధ్యత, సైనికుడి భార్యగా, ఆమె మీద పడినా వెరవదు. భర్తలు యుద్ధానికి తరలి పోయిన స్త్రీల వ్యధ సామూహికమైనది ఆ కాలంలో. అది ఆమెను అంత యిబ్బంది పెట్టదు. ఒంటరి భార్యగా ఆకతాయిల మాటలకు బాధపడినా ఆమె నిజంగా బాధపడే సందర్భం సాదిక్ నుండి ఉత్తరం వచ్చినపుడే. కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరించి, యుద్ధం విశేషాలు చెప్పి చివరకు నామకే వాస్తి ఆమెను అడిగినట్లు చెప్పమని రాస్తుంటాడు సాదిక్. అయితే ఎలాంటి దుఃఖాన్ని అయినా, ఎంతటి ఆగ్రహాన్నీ కష్టాన్నీ అయినా ప్రజ్వలమైన సూర్యాస్తమాలను చూసి ఆమె మర్చిపోగలదు.

ఆమెకు తోడు ఇద్దరిని బండ్లు తోలటానికి నియమిస్తారు. ఒకరు ఆమె చిట్టి మరిది సయ్యద్. ఇంకొకరు ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన గాయపడిన సైనికుడు దనియార్. దనియార్ అదే గ్రామానికే చెందిన అనాధ. కజఖ్ స్థాన్ లో బంధువుల దగ్గర పెరుగుతాడు. యుద్ధంలో గాయపడి వచ్చిన అతనిని గ్రామస్తులు ఆదరిస్తారు. ఊరు బయట ‘కుర్గురేవ్’ నది వడ్డున గడ్డి వాముల మీద ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. మితభాషి. ఎప్పుడూ ఏవో లోకాల్లో ఉన్నట్లు ఉంటాడు. జమీల్యాను ప్రతిసారీ కొత్తగా చూస్తుంటాడు. అతనొక అపూర్వ గాయకుడు. మాటలు లేని అతని పాట కిర్గిజ్ పర్వతాలలో, వాటిని ఆనుకొన్న ఉన్న కజఖ్ సైప్ మైదానాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.

ఆ కాలంలో పిల్లలకు బడులు బందు అవుతాయి. వారి బాల్యానందాలనూ, అభిరుచులను, కళాభివేశాలను ఆపుకొని కష్టించి పని చేయాల్సి వస్తుంది. రంగులు లేని బాల్యం వారిదప్పుడు. అయితే గుర్రాల స్వారీ, బండ్లను నడపటం చిన్నతనం నుండే అక్కడ పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య. సువిశాల ప్రకృతిలో శ్రమించటం, శ్రమ నుండే అభ్యసించటం వాళ్ళప్పుడు చేస్తారు. జమీల్యా, దనియార్ ల మధ్య ప్రేమ మొలకలెత్తటం దగ్గర నుండి అది గమ్యస్థానం చేరేవరకు జరిగిన ప్రస్థానానికి సయ్యద్ ప్రత్యక్ష సాక్షి. తనదైన పద్దతిలో దాన్ని అర్ధం చేసుకొంటాడు. సయ్యద్ లో మనకు రచయిత చింగీజ్ ఐత్ మాతొవ్ కనిపిస్తాడు.

Jamilyaఈ ముగ్గురు భావకుల మధ్య సాగే ప్రేమకు భౌతిక పునాదిని రచయిత అద్భుతంగా స్థాపిస్తాడు. జమీల్యా గురించిన వర్ణనను ఆమె రూపంలో కంటే ఆమె పనిలో ఎక్కువగా చేస్తాడు రచయిత. “అదిగో జమీల్యా – పరికిణీ అంచు మోకాళ్ళ మీదకు దోపుకొని నాకంటే ముందు నడుస్తూంది. కావిదేరి ఎంతో సొంపుగా ఉన్న ఆమె కాళ్ళ కండరాలు వాటి శక్తిని చివరికంటా వినియోగించి ఎంత వాలుగా బిర్రబిగుసుకొంటున్నాయో నాకు అగుపడుతూంది. బస్తా బరువు కింద విల్లులా వంగిపోయి, తన చిన్ని శరీరాన్ని యెంతటి యత్నంతో నిలకడగా వుంచగలుగుతూందో నాకు కనబడుతూనే ఉంది.” శ్రమైక సౌందర్యానికి నిర్వచనం యింతకంటే ఎవరు యివ్వగలరు? కొడవళ్ళు కాలే ఎండల్లో, ఎర్రటి దుమ్ములో, పెదాలు పగిలి, పాదాలు పుండ్లు పడగా వాళ్ళు పడిన పాటులోనే వారికి ఒకరిపై యిష్టం పెరుగుతుంది. వారి ముగ్గురి మధ్య వెల్లివిరిసిన అభిమానాలు, ఆరాధనలు, ప్రేమలు పరస్పర ప్రభావితం అయినవి. జమీల్యాను బాలుడు సయ్యద్ చూసిన చూపుతోనే దనియార్ కూడా చూస్తాడు. జమీల్యా దనియార్ పాటను విని పరవసమైనట్లే సయ్యద్ ఆ పాటలో లీనమౌతాడు. దనియార్, జమీల్యా సుఖంగా ఉండాలనే కోరిక సయ్యద్ కు సంతోషాన్ని యిస్తుంది. నవలంతా జమీల్యా అంతఃకరణాన్ని సయ్యద్ ద్వారా తెలియచేస్తాడు రచయిత.

ఎవరి ప్రపంచంలో వాళ్ళు విహరించటంలో సంతోషం ఉంటుంది. ఆ ప్రపంచాన్ని యితరులకు ఉత్తేజకరమైన పద్దతిలో పరిచయం చేయటంలో అవధులు లేని ఆనందం ఉంటుంది. దనియార్ దగ్గర సయ్యద్ అదే తెలుసుకొంటాడు. దనియార్ మౌనం వెనుకా జన్మభూమి మీదా, జీవితం మీదా అఖండమైన ప్రేమ దాగి ఉంటాయి. అవి ఆయన గానంలో ప్రస్ఫుటమౌతాయి. ఆ గానం ప్రగాఢమైన మానవాత్మను బహిర్గతం చేస్తుంది. దనియార్ గొంతులో ఉన్న మార్ధవం ఒక్కటే కాదు., ఆయనలో నిగూఢమైన అపారమైన ప్రేమ ఆ గానాన్ని అద్భుతం చేస్తుంది. ఆ పాటను విని సయ్యద్ భూమి మీద ప్రేమతో, కృతజ్ఞతతో దాన్ని కౌగలించుకోవాలనేంతగా భావావేశానికి గురి అవుతాడు. ఆ పాటలోని ఉద్రేకం సయ్యద్ ను ఆవహిస్తుంది. తనలో కూడా దాగిన భావాల స్వయం వ్యక్తీకరణ కోసం చిత్రకారుడు కావాలనే కోరిక అప్పుడే అతనిలో ఉదయిస్తుంది. రంగులు సంపాదించి వారిద్దరనీ మొదటి చిత్రంగా చిత్రీకరిస్తాడు.

ఇక జమీల్యా అర్ధం కాని అవస్థలో పడిపోతుంది. సయ్యద్ కు ఆమెలో తన ప్రతిబింబమే కనబడుతుంది. జమీల్యా, తనూ ఒకే ఆవేదనలో ఉన్నామని గ్రహిస్తాడు సయ్యద్. కళాకారులు, సాహిత్య వేత్తలు అనుభవించే సంఘర్షణ వంటిదే ప్రేమ. అయితే సయ్యద్ ఆవేదనకు పరిష్కారం చిత్రలేఖనంలో దొరికినట్లు జమీల్యాకు ఏ దారి దొరకదు. ఏమి చేయాలో, ఎలా ప్రవర్తించాలో తెలియక జమీల్య దనియార్ కున్న ఒకే ఒక ఆర్మీ చొక్కాను ఉతికి పెడుతుంది. “నువ్వు అర్ధం చేసుకోవేమీ? … లేకుంటే ఈ ప్రపంచంలో నీకు కావాల్సిన దాన్ని నేనొక్కర్తేనేనా?” అని అడుగుతుంది. ఆమెకు దనియార్ పట్ల కలిగిన ప్రేమతో చిత్రహింస అనుభవిస్తుంది. అతనితో సహచర్యం చేయటమే జమీల్యా సమస్యకు పరిష్కారం. దనియార్ తనలో దాగిన అనంతమైన ప్రేమను జమీల్యాకు ధారపోయటానికి సిద్ధంగా ఉంటాడు. ఆ ప్రేమను అందుకొని జమీల్యా అతనితో వెళ్ళి పోతుంది. వారిద్దరి పయనం అప్పుడే వేళ్లూనుకొంటున్న సోషలిస్టు నిర్మాణం వైపు సాగుతుంది. ఆ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అయి ఉంటారని సయ్యద్ ఊహిస్తాడు. జమీల్యా ఎప్పటికీ తన ఉత్సాహాన్ని కోల్పోకూడదనీ, దనియార్ పాట ఆమెకు జీవగర్ర కావాలనీ కోరుకొంటాడు.

సాదిక్ పట్ల ఎవరికైనా సానుభూతి కలిగితే, జమీల్యా వెళ్ళిపోయిన తరువాత అతనన్న మాటలతో అది ఎగిరి పోతుంది. “… ఎక్కడో పడి చస్తుంది. బోలెడంత మంది ఆడాళ్ళు దొరుకుతారు మనకి. ఏ బంగారపు జుట్టున్న ఆడదైనా ఏ చచ్చు మగపురుగుపాటి చేయదనుకో” అంటాడు.

బలహీనుడు, ఒక విధంగా అవిటివాడు అయిన దనియార్ పట్ల జమీల్యాకు ఏర్పడ్డ నమ్మకం, తనను ఎప్పుడూ సొంత ఆస్తిలాగా భావించే సైనికుడూ వీరుడూ అయిన భర్త మీద ఉండదు. నిజానికి జమీల్యా ఎవరి మీదా భౌతికంగా ఆధారపడేంత బలహీనురాలు కాదు. దనియార్ నుండి ఆమెకు ఎలాంటి భరోస అవసరం లేదు. ఆమె తనకున్నఅనంతమైన శక్తుల్ని తన ప్రేమకర్హమైనా, సమస్త ప్రపంచం పట్ల వాత్సల్యం ఉన్నా దనియార్ కోసం వినియోగించటానికి సిద్దపడుతుంది. సంప్రదాయ ముస్లిం కిర్గీజ్ సమాజం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతుంది. అప్పుడే కిర్గీజ్ స్థాన్ లో, ఇంకా ప్రపంచంలో వస్తున్న సరికొత్త సామాజిక విలువల నేపధ్యంలో ఈ సంఘర్షణ అనివార్యం. ఆ ప్రత్యేకమైన సందర్భమే జమీల్యా పాత్రకు భూమికను యిచ్చింది. నిజానికి జమీల్యా ప్రేమ కేవలం దనియార్ కు పరిమితం కాదు. దనియార్ ప్రేమించిన సమస్త మానవ జాతినీ, జన్మభూమినీ జమీల్యా కూడా ప్రేమించింది. జమీల్యాలోని ప్రేమ విశ్వమంతటిలో ఉన్న స్త్రీలలో వ్యాపించి వుంది. ఆమె ప్రేమ అజరామరం. అందుకే ఈ కథ ‘ప్రపంచంలోనే బహుసుందరమైన ప్రేమ కధల్లో ఒకటి’ అని గణితికెక్కింది.

ఈ నవలలో జమీల్యా పాత్ర పుట్టి ఇప్పటికి అరవై ఐదు సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు భూమండలం నిండా జమీల్యాలే. సాంప్రదాయ పెళ్లిళ్ళ పేరుతో వేసిన సాంస్కృతిక శృంఖలాలు తెంచుకొని రావటానికి సిద్దంగా ఉన్నారు. తమలోని శక్తుల సామాజిక సార్ధకత కోసం యింకా నిరంతర పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ప్రేమను నిజాయితీ పరులైన దనియార్ల కోసమే కాదు, విశ్వ మానవాళికి అందించటానికి సిద్దంగా ఉన్నారు.

ఈ పరిచయం మార్చి,2016 మాతృకలో ‘వెలుతురు పిట్టలు’ శీర్షికన ప్రచురించాము.