ట్యాగులు

,

45dbb-ramesh(ఈ కధ చదివాక రమేశుగారితో ఫోనులో నేను మాట్లాడిన పిచ్చాపాటి అప్పుడు ఇలా రాశాను).

“కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధ మనమందరం చిన్నప్పుడు అమ్మమ్మలనుండి, నాయనమ్మల నుండి విన్నదే. పిచుకమ్మ “ఆబగూబలు అణిగిపోయేదాక …. అక్కులు, చెక్కులు ఎండిపోయేదాక …. ఆయిలో ఊపిరి కోయిలోకి వచ్చే దాక” చాకిరి చేసిపండిస్తే; కాకి తనకు కడివడు, పిచుక్కి పిడికెడు పంచింది. “కయ్య నాది, పైరుమీద పెట్టుబడి నాది.” అంది. పిచుకమ్మకు జరిగిన ద్రోహం విని అందరం కళ్ళనీళ్ళు పెట్టుకొన్న వాళ్ళమే. అదే అఘాయిత్యం మన ఇంట్లోవాళ్ళు చేస్తే జరిగితే ఆ కళ్ళనీళ్ళు రాలుతాయా? స. వెం. రమేశు కి రాలాయి. కళ్ళనీళ్ళు రాలటమే కాదు …. కళ్ళు ఎరుపెక్కి కసిగా “కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధను తిరగరాసాడు.

తన కుటుంబంలో జరిగిన ఆర్ధిక,కుల దోపిడీ, అణచివేతలను తన భాషాసౌందర్యంతో, తన విశిష్ట కధా కౌశల్యంతో తూర్పార పట్టాడు. తన అవ్వలు, అమ్మలు చేసిన పాపాలను వీపు మీద మోస్తూ ఈ కధ రాసాడు. అంటరానితనాన్ని నిర్ధాక్షిణ్యంగా చీల్చి చెండాడిన కర్కశత్వం ఈ కధకుంది. ఆర్ధిక దోపిడి మూలాలు చూయించిన విస్తృతత్వం ఈ కధకుంది. తరాలు మారిన కులం పునాది కదలలేదనే చేదు నిజం ఈ కధ చెబుతుంది. దళితుజనుల స్వీకరణ తమ సౌకర్యానికే జరిగింది కాని, హృదయపరివర్తనతో జరగలేదన్న కఠిన వాస్తవం ఈ కధ చెబుతుంది. రూపం మార్చిన అణచివేత … భూతం లాగా దళితులను ఇంకా వేధిస్తుందని చెబుతుంది.

తన ఇంటి మాలితి (పాలేరుకి స్త్రీలింగం) మంగమ్మ జామపండ్లతో బాటు పంచిఇచ్చిన కమ్మని అమ్మతనాన్ని, నిజాయితీతో కూడిన సేవల సౌకర్యాన్ని బాల్యంలో అనుభవించిన రచయిత ప్రాణం, ఆమెకు జరిగిన అన్యాయాల పరంపరను కూడ గుర్తెరిగింది. “నిన్న నేనూ, మీ అవ్వ కొట్టిన దెబ్బలలకు దడుసుకొని జెరం వచ్చింది వాడికి. తగ్గినాక వస్తాడులే” అని కళ్ళు తుడుచుకొన్నమంగమ్మ గుండె కోతను తన గుండెలోతుల్లో గీసి దాచుకొన్నాడు. పిచుకమ్మ కధ చెబుతూ కొతుకు పడిన మంగమ్మగొంతులో దుఃఖజీరల వెనుక …. పిచుకమ్మలో తనను తాను చూసుకొన్న ఆమె అంతరంగాన్నిఆకళింపు చేసుకొన్నాడు. పెరిగి పెద్దై ఈ కధ రాసి మనల్ని కూడ ఆత్మావలోకనం, ఆత్మ విమర్శ చేసుకోమని చెబుతున్నాడు.
Q ప్రళయకావేరికధల్లో సామూహిక జీవనసౌందర్యం, పల్లెప్రజల జీవానానందాలు, మానవతావిలువలు కలగలిసి దృశ్యీకరించారు. కులాల ప్రసక్తి ఉండింది కాని, కులవివక్షత గురించి లేదు.ఈకధలో మీరు లేవనెత్తిన అంశాల వెనుక మీ మారిన దృక్కోణం ఏమైనా ఉందా?
ప్రళయ కావేరి కధలు నా బాల్యానికి చెందినివి. బాలుడిగా నాకా అనుబంధాలే గుర్తు ఉన్నాయి. కాని ఎదిగిన మనసుతో ఇప్పుడు పరికిస్తే మా కుటుంబం పాటించిన వివక్ష నా జ్ఞానానికి అందింది. సరిదిద్దలేని, క్షమించలేని అణచివేతకి, వివక్షకి కొన్ని తరాలుగా మన పెద్దవాళ్ళు పాల్పడ్డారు. ఈ మధ్య ఒకాయన ఏదో చర్చలో “మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్ని ఎందుకు భాధ్యుల్ని చేస్తారు? ” అని అడిగారు. తప్పక బాద్యత వహించాలి అంటాను నేను. అలా బాధ్యత వహించటానికి మనం సంసిద్ధంగా లేనట్లైతే మనం మారనట్లే. నేను ఎంత సంస్కర్తనైనా ‘బ్రాహ్మిణిజం’ అనే పలుకుకు ఉడుక్కొంటున్ననంటే నాలో ఆ బీజాలు మిగిలి ఉన్నట్లే. ఆధిపత్యానికి పర్యాయపదమే బ్రాహ్మనిజం.

Q ప్రళయకావేరి కధఎంతో ప్రేమించి రాసిన అవ్వ పాత్రను, ఈకధలో తీవ్రంగా తులనాడారు. ప్రళయకావేరి వరదల్లో చనిపోయిన ఆమెచావును, ఆమె పాప ప్రతిఫలంగానే కసిగా తీర్మానించారు. ఇదెలాసాధ్యం?
నా దగ్గర మిత్రులు కూడా దాన్ని ఖండించారు. నేను దేవుడు, దెయ్యాన్నినమ్మను. అయితే సహజ ప్రాకృతిక న్యాయం ఒకటి ఉంటుందని నమ్ముతాను. ఈ కధ ప్రధాన ఉద్దేశం తరాలు మారినా కులవివక్ష రూపం మార్చుకొన్నదే కాని, నిర్మూలించబడలేదు అని చెప్పటమే. ఒక దళిత అధికారిని, ఒక పేద అగ్రకులస్థుడిని గ్రామాల్లో స్వీకరించే విధానాన్ని పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్ధం అవుతుంది. దళిత అధికారికి సపర్యలు చేయవచ్చు. భక్తి శ్రద్ధలు ప్రదర్శించవచ్చు. కాని అగ్రకులాల హృదయపూర్వక స్వీకరణ మాత్రం తమ కులానికిచెందిన పేదవాడికే ఉంటుంది. ఈ దుర్మార్గానికి మా కుటుంబం అతీతం కాదు.కాబట్టి ఈ ఇతివృత్తాన్ని మా కుటుంబం నుండే మొదలు పెట్టాను.

Q నన్ను, మీ పాఠకులందరినీ అబ్బురపరిచేది మీ విశేష భాషా పరిజ్ఞానం. మీరు ప్రళయకావేరీ సరస్సుప్రాంతాన్ని వదిలిపెట్టినా ఇప్పటికీ అక్కడి మాండలికం, వాడుకవస్తువులు …. అక్కడి శ్రమలు కంఠోపాఠంగా మీకధల్లో వినిపిస్తారు.ఇది మీ జ్ఞాపకశక్తికి సూచికగా అనుకోవాలా?
అది నాకు ఆ భాష మీద, ప్రాంతం మీద అభిమానం. అమ్మ ప్రేమలో తీపి, అమ్మభాషలో తీపి మరచిపోగలిగినవి కాదు. అయితే తెలుగు భాషకు సంబంధించి నాకు కొన్నిమనస్థాపాలు ఉన్నాయి. భాషల అభివృద్ధిలో ఆరు మెట్లు ఉన్నాయి. తమిళం ఆరు మెట్లూ ఎక్కేసింది. తెలుగు మూడో మెట్టు దగ్గర ఆగిపోయింది. శ్రీపాద, చలం మొదలైన వారి తరువాత తెలుగు వాక్యం ఆగిపోయింది.
ఇక్కడ భాషా సంసృతులని వెన్నంటి కాపాడుకోవాల్సిన కవులు, మేధావులు ఉదాసీనత వహిస్తున్నారు. మనది కాని దాన్ని మోస్తున్నారు. కవితల్లో కూడ యధేచ్చగా ఆంగ్లాన్ని వాడుతున్నారు. నాకో దళిత స్నేహితుడున్నాడు. అతను బాతిక్, జానపద కళాకారుడు. పేరు పుట్టా పెంచల దాసు. ఎక్కువ చదువుకోలేదు. సాహిత్యం మీద ప్రీతి ఉన్నవాడు. అతను ఈ కవుల కవిత్వాన్ని ఆస్వాదించే అర్హత లేనివాడా? కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు.
భాష స్థాయి పెరగాలంటే స్థానికీకరణకి ప్రాముఖ్యత పెరగాలి. తెలుగు నాట ఎన్నోమాండలికాలు ఉన్నాయి. ఈ మాండలికాలు అన్నిటినీ నిర్మూలించి ఒకమాండలికాన్నిమాత్రమే ‘ప్రామాణికం’ చేస్తున్నారు. ప్రపంచీకరణను ఎదిరించాలన్నా స్థానికీకరణ అవసరం ఉంది. ( ఆయా ప్రాంతాల వంటలను రక్షించుకోవటం … వగైరా). దళితులు మూలవాసులు కాబట్టి వారి మాండలికం, వారి జీవనవిధానం, వారి ఆహరపు అలవాట్లు సంరక్షిస్తూ, తెలుగు ప్రజలు దళితీకరణ చెందాలంటాను. ఈ కార్యం తమిళనాడులో చాలా వరకు జరిగింది. ద్రవిడ ఉద్యమంవారికి చాలా సహాయ పడింది.

Q ఈ కధలో కష్టపెట్టిన కాకి ఓడిపోయినట్లు, కష్టపడిన పిచ్చుక  గెలిచినట్లు రాసారు. అది మీ అభిలాషా? నిజంగా అలా జరిగిందా?
(నవ్వు) ఈ కధ నా జీవితంలో జరిగిందే. ఇక్కడ ఇంతే జరిగింది. కాని  కాకమ్మలందరూ ఓడి పోయి, పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు.

Q దళిత అణచివేత, వివక్షతలను మీరు పేర్కొన్నప్పుడు మీ కుటుంబంలో స్త్రీ పాత్రలకే దాన్ని మీరు పరిమితం చేసారు. పురుషులని అతీతంగా ఉంచారు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?
నాకు 14 మంది అమ్మమ్మలు. వాళ్ళ మధ్య పెరిగాను. స్త్రీల బలాలను, బలహీనతలను దగ్గరగా చూసిన వాడిని. కాబట్టే నా కధలన్నీ స్త్రీల చుట్టే ఎక్కువగా తిరుగుతాయి.

ఈ పరిచయం మరియు కధ ఇక్కడ సారంగ లో ఇక్కడ చదవచ్చు.